భాషను కేవలం కొన్ని కులాల వాళ్ళే పుట్టించారు. వివిధ కులాల వాళ్ళు వాళ్ల వృత్తుల్ని బట్టి, అవసరాలను బట్టి పదాలను పుట్టిస్తూ, వాడుతూ ఉండటం వల్ల ఆ భాష అభివృద్ధి చెందుతుంది. అన్ని పదాలూ మా గ్రంథాల్లోనే ఉన్నాయనే అహంకారం పనికిరాదు. అన్ని కులాల వాళ్ల భాషనూ, వాళ్ళు వాడే పదాల్నీ నిజాయితీగల భాషా శాస్త్రజ్ఞుడు గుర్తిస్తాడు, గౌరవిస్తాడు, గ్రంథస్తం చేస్తాడు. కొన్ని కులాల వాళ్ళ భాషనూ, వాళ్ళువాడే పదాలను అపహాస్యం చేస్తూ, నీచంగా భావిస్తూ, అసలు గ్రంథాల్లోకి ఎక్కతగని భాషగా చిత్రీకరిస్తూ, భాష సంపన్నం కాకుండా గతంలో అడ్డుతగిలారు. అలా అడ్డుతగిలే పని ఈనాటికీ చేస్తూనే ఉన్నారు.

మన పల్లె భాషను గౌరవించుదాం. మన పక్కెలు, జెల్లలు, గెడ్డలు, మదుములు, పరసలు, పరజలు,… ఇంకా నీచమని భావించి మన సంస్కృతాభిమాన పండితులు వదిలేసిన తెలుగు పదాలన్నీ తెలుగు నిఘంటువుల్లోకి ఎక్కిద్దాం.

కొల్లేరు ప్రక్షాళన కార్యక్రమం ఎలా జరుగుతుందో చూద్దామని వెళ్ళిన విలేఖరులకు అక్కడి ప్రజలు ఎన్ని రకాల చేపలు, పక్షుల పేర్లు చెప్పారో చూడండిః మట్టగిడస, కర్రమోను, బొమ్మిడాయి, శీలావతి, గొరక, ఇంగిలాయి, జెల్ల, బొచ్చె, జడ్డువాయి, చేదు పరిగె, కొరమీను, వాలుగ, పండుకప్ప, గండి బొగడ, కొయ్యంగ, మునుగపాము, గడ్డు గాయి, చామరాయి, పొట్టిదిలాసు, కట్టినెరసు, బుడపార, చాకరొయ్య, గడ్డికొయ్య, మాల తప్పడాలు, ఏటిజెల్ల, మార్పులు, పల్లెంకాయ, పాలజెల్ల, పారాటాయి….

పరజ, గూడ, ఆసాబాతు, కళాయి, చేతన బాతు, నల్లముక్కులు, సముద్రపు చిలుక, నత్తకొట్టుడు….

“భాషాసమృద్ధే స్వతంత్రతా భీజం” అన్నారెవరో. పై పదాలన్నీ తెలుగు పదాలు కావా? వృత్తి పదకోశాల్లోకి ఎక్కించడానికి గతంలో కొంత ప్రయత్నం చేశారు. ఏడాదికి సగటున 5 కొత్త యూనివర్శిటీలు ఏర్పడుతున్నా భారతదేశంలో 7 శాతం మించి పి.జి స్థాయికి చేరటం లేదు. దానికి కారణం పేదరికం కాదు, ఇంగ్లీషు భాషపై పట్టులేకపోవటమేనని రాష్ట్ర ఉన్నత విద్యాచైర్మన్ కె.సి రెడ్డి అన్నారు. (ఆంధ్రజ్యోతి 18-10-2005)

అంటే ఇంగ్లీషు భాష మీద పట్లులేకపోతే మన దేశంలో ఏ వ్యక్తీ, అతనికి ఎంత జ్ఞానం, విజ్ఞానం ఉన్నప్పటికీ ఉన్న విద్యలోకి ప్రవేశించలేడన్నమాట. ఇంగ్లీషొస్తేనే జ్ఞాని, విద్యావంతుడు. ఇంగ్లీషు రాకపోతే అజ్ఞాని, అనాగరికుడు అని మనమే నిర్ధారించుకుంటున్నాం. ఇంగ్లీషే అన్నింటికీ మూలం అన్నట్లుగా మారింది పరిస్థితి.

తెలుగును ప్రాచీన భాషగా ప్రకటించాలని అన్ని పార్టీలవాళ్లూ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించారు. కేంద్రానికి పంపారు. కోర్టుకు గూడా వెళ్ళారు. కొద్ది రోజులకే జార్జిబుష్ హైదరాబాద్ రావటం, సిలికాన్ వ్యాలీలో ఉన్న ప్రతి ముగ్గురు భారతీయ ఉద్యోగుల్లో ఒకరు ఆంగ్లప్రదేశ్‍కు చెందిన వారేనని తేల్చటం, దిల్‍కుష్ అతిథి భవనంలో అమెరికా వెళ్ళటానికి వీసాలిచ్చే కేంద్రం పెడతామనటం, మన మధ్యతరగతి కుటుంబాలన్నిటికీ ఇంగ్లీషు ఉచ్చు బిగించిపోవటం చకచకా జరిగి పోయాయి. మరోసారి తాజాగా తెలుగుతల్లి సాక్షిగా ఉద్యోగాల కోసం మన పెద్దలు మోకరిల్లారు; ఇలా ఆంగ్లాన్ని స్తుతించారుః

ఆంగ్లమేరా జీవితం – ఆంగ్లమేరా శాశ్వతం

ఆంగ్లమే మనకున్నది – ఆంగ్లమేరా పెన్నిధీ

ఆంగ్లమును ప్రేమించు భాయీ – లేదు అంతకు మించి హాయీ   ॥ఆంగ్ల॥

తెలుగును విడిచీ – ఆంగ్లము నేర్చీ

అమెరికా పోదామూ – బానిసలౌదామూ

డాలర్లు తెద్దామూ      ॥తెలుగు॥

అంటూ పాటలు కూడా పాడుతున్నారు. తెలుగుకంటే ఇంగ్లీషెందుకు ముద్దో కారణాలతో సహా వివరిస్తున్నారుః

 1. తెలుగులో పెద్దగా విజ్ఞాన సాహిత్యం లేదు. తెలుగు భాషా దురభిమానం ప్రదర్శించటం తప్ప మన పాలకులు, పండితులు మన భాషలో పాలనకు పెద్దగా ప్రోత్సహించటం లేదు. తెలుగులో చదివితే ఉద్యోగాలూలేవు.
 2. పెద్ద కులాల వాళ్ళు, ఆస్థిపరులు ఇంగ్లీషులో చదువుకుంటూ, పేదకులాల వాళ్ళకు ఇంగ్లీషు చదువులు దక్కకుండా చేయటానికి తెలుగు భాషా ఉద్యమాలు చేయిస్తున్నారు.
 3. నిర్భంద చట్టాలతో తెలుగుభాషను తేవాలని చూసినా, పారిభాషిక పదజాలం యావత్తూ సంస్కృతమయం చేస్తూ, పండితులు తెలుగుభాషను తెలుగువాళ్ళకు రాకుండా చేస్తున్నారు. తెలుగు చదువు కృత్రిమమై ఇంగ్లీషు చదువే సులువుగా ఉంటోంది.
 4. దేశం మొత్తానికీ కలిపి ఒకే లిపిలేదు. మరో రాష్ట్రం వెలితే దుకాణాల బోర్డుల పేర్లు చదవాలన్నా ఇంగ్లీషు రావాల్సిందే. హిందీ కూడా అందరికీ రాదు. ఆంగ్ల లిపి పిల్లలకు సులభంగా వస్తుంది.
 5. యవ్వనం వచ్చాక బాల్యావస్థకు తిరిగి వెళ్ళగలమా? ఇంగ్లీషొచ్చాక తెలుగెందుకు? ఆధునిక ప్రామాణిక తెలుగు భాష వచ్చాక ఎవరైనా ఇంటి భాషను కోరుకుంటారా? ఆంగ్ల పాలనలో ఎంతో ప్రావీణ్యం సంపాదించిన మన తెలుగుజాతి మళ్ళీ తిరిగి తెలుగుకు పరిమితమై కుంచించుకుపోవాలా? పడ్డచన్నులెత్త బ్రహ్మవశమే?
 6. కంప్యూటర్‍కు ఆంగ్లం అవసరం. ఇంగ్లీషు రానివాళ్ళు ఎందుకూ పనికిరాని వాళ్ళవుతారు. మనం విశ్వమానవులం. అధునాతన విశ్వ చైతన్యాన్ని అందిపుచ్చుకోవాలంటే తెలుగును బలిచేసైనా ఇంగ్లీష్ నేర్వాలి.
 7. అప్పడగా బోయిందీ అదీ ఒక తప్పా? ఇప్పుడు తెలుక్కొచ్చిన ముప్పేమీలేదు. మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుళ్ళతో తెలుగు సంస్కృతికొచ్చే నష్టం ఏంటట? భాషోద్యమాలతో ఎందుకీ గోల? ఇదంతా ప్రాంతీయ దురభిమానంతో చేస్తున్న వేర్పాటువాదం. ఆంగ్లం వల్ల అధికారం, అధికారం వల్ల భాగ్యం కలుగుతాయి.

ఇక “మనం తెలుగువాళ్ళం” అనీ, “మన తెలుగును రక్షించుకుందాం” అనీ పోరాడే తెలుగు వీరులు చెప్పే సమాధానాలు ఏమిటి?:

 1. మాతృభాషను కాపాడుకోవటం భాషా దురభిమానం ఎలా అవుతుంది? అలాగయితే ఇంగ్లీషువాళ్ళది భాషా సామ్రాజ్యవాదం కాదా? సొంతభాష కంటే మనకు ఇంగ్లీషే గొప్పగా కనబడటం బానిస మనస్తత్వం కాదా?
 2. మన పాలకులు, అధికారులు డబ్బు సంపాదించటానికి మాత్రమే ఆంగ్ల విద్యను ప్రోత్సహించటం పడుపు కూడు తినటంతో సమానం. అత్యధిక జనాభా మాట్లాడేభాషను నాశనం చేస్తూ పరాయిభాషకు పట్టం గట్టడం అంటే పరస్త్రీ ముందు భార్యను అగౌరవ పరచటం లాంటిది. ఇది భాషా వ్యభిచారం, అనైతికం, అసహజం, తెలుగు జాతి ప్రజల హక్కుల ఉల్లంఘన.
 3. మన భాషను రక్షించుకోవాలంటే నిర్భంద చట్టాలు ఉండాల్సిందే. ఇంటి భాషకు సైతం చోటు కల్పిస్తూ పారిభాషక పదజాలం మనం సమకూర్చుకోవాలి. ఇంగ్లీషుకంటే తెలుగే సులువుగా వస్తుంది. మన లిపిని కంప్యూటర్‍కు అనుకూలంగా మార్చుకోవాలి. అవసరమైతే ఆంగ్లలిపినే తెలుగుభాషకు వాడుకుందాం.
 4. ప్రపంచవ్యాప్తంగా 15 కోట్లమంది తెలుగు వాళ్ళున్నారు. 110 దేశాలకంటే మన తెలుగు నేల పెద్దది. ఎన్నో యూరోపియన్ దేశాల భాషలు తెలుగుకంటే చిన్నవే. వాటికున్న గౌరవం మర్యాదకూడా తెలుగుకు రాదా? మనల్ని మనమే కించపరచుకోవటం ఏమిటి?
 5. తెలుగు పనికిమాలిన భాషా? దెబ్బ తగిలితే మమ్మీ అని కాకుండా అమ్మా అని ఎందుకరుస్తారు? వచ్చీరాని ఇంగ్లీషు నడమంత్రపు సిరిలాంటిది. బాల్యంలో తీరని కోరికల్ని యవ్వనంలోనైనా తీర్చుకోవాలి గానీ ఆంగ్ల ప్రావీణ్యం అనే యవ్వన గర్వంతో బాల్యాన్ని మరిచి, తల్లిభాషను అధోగతికి దిగజార్చటం ఏరుదాటాక తెప్ప తగలేసే లక్షణం.
 6. మన సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం, విద్య, పరిపాలన మన భాషలోనే ఉండాలి. కంప్యూటర్ కోసం తెలుగును బలి పెట్టటం ఎలుకలున్నాయని ఇంటికి తగులబెట్టడంతో సమానం. కంప్యూటర్‍నే తెలుగులోకి వంచుతాం. ఎన్నో భాషల గ్రంథాలు ఇంగ్లీషులోకి అనువదించుకున్నారు. అవసరం అటువంటిది.
 7. ఇక్కడ చదివి ఎక్కడికో వెళ్ళి సేవలు చేసే మనస్తత్వం స్వజాతికి ద్రోహం. తెలుగులోనే ఇంజినీరింగు, వైద్యశాస్త్రాలు చదివి తెలుగు ప్రజలకే సేవచేయగలిగితే మన భాషతో పాటు మన జాతి వికసిస్తుంది గదా? మీ భోగ భాగ్యాల కోసం తెలుగు ప్రజలందర్నీ ఇబ్బందులకు గురి చేస్తారా? వారి మీద మోయలేని భారం మోపుతారా? వారి భాషను నాశనం చేసి వాళ్ళను మూగవాళ్ళుగా చేస్తారా? మాతృభాషకు ప్రాథమిక విద్యలోకూడా స్థానం లేకుండా చేసే వాళ్ళది ఇంటి కూడా తిని ఎవరి వెంటో పడే తత్వం కాదా? ఇది ప్రజాద్రోహం కాదా?

“మాతృభాషాతృణీకారం మాతృదేవీ తిరస్కారం” అన్నారు మహాత్మాగాంధీ. “మాతృభాష సరిగా నేర్చుకోని వాళ్ళకు ఇతర భాషలు కూడా సరిగా రావు” అన్నారు జార్జి బెర్నార్డ్‍షా.

మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంఘ్వీ ఇలా అన్నారుః “మాతృమూర్తికి ఎంతటి గౌరవం ఇస్తామో మాతృభాషకు అంతటి సమున్నత స్థానం దక్కాలి. నేను తల్లితో సమానంగా తల్లిభాషనూ గౌరవిస్తాను. అందరూ మాతృభాషలో మాట్లాడండి. న్యాయస్థానాల్లో వాదనలు కార్యకలాపాలు ఆంగ్లంలో కొనసాగడమేంటి? ఇంకా ఎంతకాలం ఈ దారుణం? న్యాయస్థానాల్లో వ్యవహారాలు సామాన్యుడి భాషలో కొనసాగినప్పుడే సామాన్యుడికి న్యాయం అందివ్వగలం.” (“అమ్మనే మరుస్తారా!” ఈనాడు 27-2-2006)

అమ్మభాషను మనవాళ్ళు మరచిపోతుంటే ఫ్రాన్సు నుండి పెద్దాపురం వచ్చి బుర్రకథ మీద, తెలుగుభాష మీద పరిశోధన చేస్తున్న డాక్టర్ డానియల్ నెగర్స్ ఇలా అంటున్నారుః “తెలుగునేల మీద విదేశీ భాషలు నేర్చుకోవడానికి సీఫెల్ వంటి సంస్థలు పనిచేస్తున్నాయి గానీ, తెలుగుపై మక్కువతో వచ్చే విదేశీయులకు తెలుగు నేర్పే సంస్థ ఏదీ ఇక్కడ కనిపించలేదు. అమెరికా పలుకుబడి, ఆంగ్లభాష ప్రపంచంలోని అన్ని భాషా సంస్కృతులకు నష్టం కలిగిస్తోంది. ప్రపంచీకరణ పేరుతో ప్రతి ప్రాంతానికీ ఈ ప్రమాదం విస్తరిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో రెండువేల భాషలున్నాయి. మరో వందేళ్ళు ప్రపంచీకరణ దాడి ఇలాగే కొనసాగితే 200 భాషలే మిగులుతాయి.  భాషల సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవ అవసరం. ఫ్రెంచి, తెలుగు భాషలు దాదాపు ఒకే సమయంలో సాహిత్య భాషలుగా పరణతి చెందాయి. అయితే ఫ్రెంచి భాషను ప్రపంచంలో ఎక్కడయినా నేర్చుకునే వీలుందికానీ తెలుగును తెలుగు నేలపై నేర్చుకోవడమే కష్టంగా ఉంది. ఎంతో ప్రాచీనమైన తెలుగుభాష ఉనికిని కాపాడుకోవాలి. ఆంగ్లభాషను రుద్దడం వల్ల భాషల మధ్య ఘర్షణ తప్పదు.” (ఆంధ్రజ్యోతి 22-2-2006)

ప్రపంచంలోని అన్ని భాషల కంటే ఎక్కువగా ఆంగ్లభాషలో 7,90,000 పదాలున్నాయట. వాటిలో 3 లక్షల పదాలు సాంకేతికమైతే, 4,90,000 పదాలు వాడుకలో ఉన్నాయట. అయితే భాషా శాస్త్రజ్ఞుల లెక్క ప్రకారం ఏ ఒక్కరూ తమ జీవితకాలంలో 60 వేలకు మించి రాయడంలోకానీ, చదవడంలో కానీ ఉపయోగించలేరట. అంటే అరవై వేల అవసరమైన పదాలను రాయడంలో, చదవడంలో ఉపయోగిస్తూ ఉంటే భాషను సజీవంగా కాపాడుకోవచ్చు.

మెదక్ జిల్లా రాయికోడు మండలం షంషుద్దీన్ పూర్ గ్రామనివాసి ఏర్పుల కమలమ్మ 50 రకాల విత్తనాలు సాగుచేసి సరఫరా చేస్తోందట. విత్తనాల పేర్లు చూడండిః “తైదలు, ఉలవలు, సజ్జలు, పచ్చజొన్నలు, తోక జొన్నలు, తెల్లమల్లెజొన్న, ఎర్రజొన్న, బుడ్డజొన్న, అత్తకోడళ్ళ జొన్న, నల్లతొగరి, ఎర్రతొగరి, తెల్లతొగరి, అనుములు, కొర్రలు, బొబ్బర్లు, పెసర్లు, వడ్లు, తెల్లనువ్వులు, ఎర్రనువ్వులు, గడ్డినువ్వులు, పుంట్లు, శనగలు, ఆవాలు, తెల్లకుసుమ, ధనియాలు, వాము, బటాని, సిరిశనగ, మిరప, కోడిసామలు, పల్లీలు, గోధుమ, సాయిజొన్న, నల్లకుసుమ, అవశలు, లంకలు, సిరిశనగ.” (వార్త 6-3-2006)

ఈ తెలంగాణా తల్లికి ఏమి ఇంగ్లీషొచ్చు? అయినా ఈ తెలుగు నేల తల్లులు ఎన్నో వందల ఏళ్ళనుండి మొక్కల పేర్లు, విత్తనాల పేర్లు మక్కువగా గుర్తు పెట్టుకొని వ్యవసాయం నడపలేదా? ఇంగ్లీషు, లాటిన్ పదాలకిచ్చిన ప్రాముఖ్యత, ప్రాధాన్యత మన తెలుగు పదాలకు కూడా ఇవ్వలేకపోవటానికి కారణం ఏమిటి? మనం మనకి అర్థం కాకపోయినా, ఇంగ్లీషు వాళ్ళకు అర్థం కావాలి. ఈ బాబులు దేశంలో భారతీయులంతా ఒకరికొకరు అర్థం కావాలంటే ఇంగ్లీషే మంచిదనే నిర్ణయానికొచ్చారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలన్నీ ప్రత్యేక దేశాలుగా అంటే మొగలులు, బ్రిటీష్ వాళ్ళు రాకముందున్నట్లుగా ఉంటే ఎవరిభాషకు వాళ్ళు పట్టం గట్టేవాళ్ళే. ఇప్పుడది సాధ్యం కాదు కాబట్టే మన భాషలకు ఇంగ్లీషు సారథ్యం వహిస్తోంది.

తెలుగు భాషకు మూలపురుషులు ఎవరు? యానాదులు. తెలుగుభాషను నిత్యమూ వాడుతూ బ్రతికిస్తున్నది ఎవరూ? వివిధ కులవృత్తుల్లో ఉన్న శ్రామికులు, గ్రామీణులు. అరవైవేలు కాదు దాదాపు 3 లక్షల పదాలు వీళ్ళంతా కలిసి వాడుతున్నారు. వీళ్ళందరూ వాడుతున్న పదాలలో చాలా వరకూ వివిధ పదకోశాల్లోకి ఎక్కాయి. ఇంకా రక్షించుకోవాల్సిన పదజాలం ఎంతో ఉంది. మాటకు ప్రాణము వాడుక. వాడుక ఎప్పుడు జరుగుతుంది? మన పంచాయితీలు, న్యాయ స్థానాలు, అసెంబ్లీ అన్నీ తెలుగులో నడిచినపుడు. కనీసం మన పిల్లలకు ప్రాథమిక విద్య అయినా తెలుగులో అందించినప్పుడు.

ప్రైవేట్ స్కూళ్ళు తెలుగు నేర్పవు. మార్కుల కోసం కళాశాల విద్యార్థులు సంస్కృతం రెండోభాషగా తీసుకుంటున్నారు. సంస్కృత పరీక్షలో జవాబులు తెలుగు, ఇంగ్లీషు లిపుల్లో దేంట్లోనైనా రాయొచ్చట. మార్కులు బాగా వేస్తారట. హిందీ పరీక్షకైతే 20 మార్కులు తెచ్చుకున్నా పాస్ చేస్తున్నారు. మరి ఈ రకం రాయితీలు, ప్రోత్సాహకాలు మన తెలుగు భాషకే ఇవ్వవచ్చుగదా? కర్నాటకలో కన్నడ మాతృభాషకాని వాళ్ళైనా సరే కన్నడాన్ని మూడో భాషగానైనా చదవాల్సిందేనట. మరి మన రాష్ట్రంలో?

కర్నాటకలో కన్నడం లేకుండా హైస్కూలు విద్య పూర్తికాదు. పైగా 15 శాతం మార్కులు కన్నడానికి ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. తమిళనాడులో ఎనిమిదవ తరగతిదాకా తమిళాన్ని ఒక భాషగా నిర్భందం చేశారు. కోయ, గోండు, కొలామి, ఆదివాసి, ఒరియా, సవర, బంజారా, కొండ, కువి మొదలైన గిరిజనులకు వారి మాతృభాషల్లోనే మన రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ముద్రించి బోధిస్తోంది. ఇదే పని తెలుగు పిల్లలకు కనీసం అయిదో తరగతి వరకు నిర్భందం చేస్తే బాగుంటుంది. ప్రైవేట్ స్కూళ్ళ మీద కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తున్నాయో మన ప్రభుత్వం కూడా అలానే వ్యవహరించాలి.

“భాషను సాహిత్యానికీ కవిత్వానికీ పరిమితం చేస్తే భాషతోపాటు దాన్ని మాతృభాషగా కలిగిన వారు కూడా వెనుకబడిపోతారు. భాషను ఉపాధితో ముడిపెట్టండి” అన్నారు మౌలానా అబుల్ కలాం ఆజాద్

గిడుగురామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం” గానూ, కాళోజీ జయంతి సెప్టెంబరు 9 ని “తెలుగు మాండలిక భాషా దినోత్సవం” గానూ జరుపుకుంటున్నాము. ఇంటిభాస ఎసుంటిదైనా మందే కదా? ఆదరిచ్చుదాం. ఇంపుగా నేరుద్దాం. ఇంగిలీసు నేర్చుకోటల్లా? అట్టా.

 

By

17 thoughts on “ఇంటి భాషంటే ఎంత చులకనో!”
 1. వీవెన్ గారూ మీరు చెప్పింది నిజమే.మాలిక వాళ్ళే దీనిని సరిచెయ్యాలి.గిడుగురామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం” గానూ,కాళోజీ జయంతి సెప్టెంబర్ 9 ని “తెలుగు మాండలిక భాషా దినోత్సవం” గానూ, తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం” గానూ జరుపుకోవాలి.మూడు తొమ్ముదులు గుర్తు పెట్టుకుందాము.సురవరం ప్రతాపరెడ్డి జయంతిని కూడా తెలుగు దినోత్సవాలలో ఒకటి చేసే అవకాశం ఉంది.

 2. నేను మీ వ్యాసాన్ని నా మిత్రులందరితో పంచుకున్నానండీ.. అందరూ ఇంకా ఇట్లాంటివి కావాలి అంటూన్నారు..జనాలకి మాతృభాష పై మక్కువ లేక కాదు , అవసరం లేక నిర్లక్ష్యం చేస్తున్నారు.
  ..తెలుగు ఎంత బాగా వస్తే ఇతర భాషలు అంత బాగా వస్తాయి… అందులో సందేహం లేదు… నిరక్షరాస్యులు విద్యా మంత్రులు గా ఉంటే , ఇంకే ముంది , అంతా బూడిద. ఇదంతా నిజంగానే రాజకీయం తప్ప మరేమీ కాదు… వెన్నుపూస లేనివాడికి అధికారమొస్తే , తల్లి భాషనేమిటి , తల్లినే అమ్మేస్తాడు…మీరు బాణాలని ఇంఅా సంధిస్తూ ఉండండి…. ఏదో రోజు లక్ష్యానికి తగలక మానదు…

  మేమంతా మీ వెంటే…

 3. చాల బాగుందండి.. ఇందులో తమ అభిప్రాయాలు, చాల మంది వ్రాసారు.. ఆంగ్లంలో కంటే , తెలుగు లో వ్రాస్తే బాగుంటుంది. కదండీ.

 4. రహ్మతుల్లా గారు, మీరు చెప్పిన దాంట్లొ నిజం ఉంది. కాని ముంది ఈ మార్పు తల్లితండ్రులలో రావాలి. తల్లితండ్రులు తమ పిల్లలు మమ్మి, డాడ్డి అని పిలిస్తేనే ఇస్టపడుతున్నారు. వేరే వాల్ల ముందు అమ్మ, నాన్న అని పిలిస్తె నామోషి. టి వి చానల్స్ లో ఆంకర్స్ ఆంగ్లము వదిలి తెలుగు లొ మట్లడితే బాగుంటుంది. కన్నడ టి వి చానల్స్ నుంచి కొంచం నేర్చుకోవాలి.

 5. రహమతుల్లాగారు,

  ముందుగా మీరు ఇలాంటి వ్యాసాలను మరింతగా వ్రాయాలని వేడుకుంటున్నాను. “మనం మనకి అర్థం కాకపోయినా, ఇంగ్లీషు వాళ్ళకు అర్థం కావాలి”, అంటూ బ్రతికేస్తున్న ఈ నాటి తెలుగు వాళ్ళకి మనం తెలుగులో ఎంత చెప్పినా చెవిటి వాని ముందు శంఖం ఊదినట్టే అయినా, ఎప్పటికో ఒక్కసారైనా నిద్రిస్తున్నట్లు నటించడం లోంచి నిజంలోకి వస్తాడు అని నమ్ముతాను. అంత వరకూ మీలాంటి వారు ఇలా వ్రాయాల్సిందే, నాలాంటి వాడికి రక్తం ఉడకాలసిందే. కానీ తప్పదు, మీలాంటి వారు మా లాగా భాషపై పట్టులేని వారి శ్రమ కూడా తీసుకుని ముందు సాగండి, ఏమీ చెయ్యలేక పోయినా, మీవెనకాల నైనా ఉంటాను.

  మరో శీర్షికకై ఎదుఱు చూస్తున్న,
  భవదీయుడు

 6. we, telugus should be ashamed of, a well written article. ap govt should think as they are telugus and not anglisized animals.
  thank you sir for your fine analysis.

 7. rahamtullah gaaroo–mee vyaasam naaku pampinanduku kruthagnathalu.
  Bhooswaamya yugapu dandayaathralu raajya vistharanakoraku.netidi alaamtidi kaadu.Imperialism being the highest stage of capitalism,it suppresses all the backward counttries,economies,cultures,languages and also other religions.You are quite right in thinking about our mother tongue Telugus development is intertwined with the struggle against imperialism.—DIVIKUMAR

 8. రెహంతుల్ల సాబ్ లాంటి వారు వుండటం మన తెలుగు భాష చేసుకున్న అదృష్టం.ఇప్పుడే చూసాను ఈ వ్యాసాన్ని…రాత్రికి తీరికగా చదివి స్పందిస్తాను.
  ఇది మాలిక అంతర్జాల పత్రిక రెండో సంచికా! ఎంత పరిణితి తో కూడుకొని వుంది!
  నిర్వాహకులకు నిండు మనసు అభినందనలు.

 9. well said ,, this should be carried to most of telugu people and also need carry the content to all telugu people’s heart . its all our responsibility.then only people like Mr.Rahamtulla ji will bring more knowlegde about our culture and language

 10. చాలా విపులంగా వివరించారు.

Comments are closed.


Notice: Trying to get property of non-object in /var/www/html/maalika/magazine/wp-content/plugins/jetpack/modules/gravatar-hovercards.php on line 238