మానవుడితోపాటు ప్రతీ జీవి సుఖాన్ని, భోగాన్ని కోరుకుంటుంది. సుఖసంతోషాలతో ఉండాలని,  ఇహంతోపాటు పరాన్ని కూడా సాధించాలని అనుకుంటాడు ప్రతి మనిషీ. కాని మనం అనుభవించే సుఖం శాశ్వతం కాదనీ, చివరికి మిగిలేది దుఖఃమేననీ  తేల్చేస్తారు వేదాంతులు. చరిత్రకారులు స్వర్ణయుగమని చెప్పుకునే విజయనగర చక్రవర్తుల తుది దిశలో సామాన్యుల బ్రతుకు కడగండ్ల పాలైంది. మండలాధీశుల భోగలాలసత్వం, అధికారుల దౌర్జన్యం, దోపిడీలు .. దానికితోడు జనులలో పేరుకుపోయిన అమాయకత్వం, అజ్ఞానం వారి జీవితాలను మరింత దుర్భరంగా చేసాయి. అర్ధం లేని ఆచారాలు, దురాచారాలు, అధికారబలం, దబాయింపులతో ప్రజలను మోసం చేసి అణచిపెట్టేవారు. భయపడి నీళ్లు నమిలేవాళ్లేగాని నిలదీసి అడిగే ధైర్యం , తాహత్తు కాని ఎవరికీ లేవు. చెదురుమదురుగా ఎదుర్కొన్నా చివరివరకూ ఎవరూ నిబ్బరంగా నిలబడలేదు.

అటువంటి చిమ్మ చీకటి  తెరలను చీల్చుకుని వెలిగిన వేగు చుక్కలు యోగి వేమన, పోతులూరి వీరబ్రహ్మము.  (1608 – 1693). ఇద్దరూ సమకాలీకులైనా, ఒకరికొకరు ముఖపరిచయం లేకున్నా ఒకే ఆశయంతో తమ ఉద్యమాలను నడిపించి సంచలనం సృష్టించారు. ఇరువురూ సంస్కర్తలే, సత్కవులే. తమ అనుభవాలను తత్వదృష్టితో ,  కవితారూపంగా,    పద్యాలు, పాటలు పాడి  సామాన్యజనాన్ని మేల్కొలిపారు. ఇక్కడ మరో విషయం గమనించదగ్గది. ఈ విశాల ప్రపంచంలోకి ఎందరో మత ప్రవక్తలు, సంస్కర్తలు పశుపాలకవర్గం నుండి వచ్చినట్టుగా తెలుస్తుంది. శ్రీకృష్ణుడు గోపాలకుడు,  ఏసుక్రీస్తు గొడ్లచావిడిలో పుట్టాడు. ఇస్లాం మతప్రవక్త మొహమ్మద్ ఒంటెల వ్యాపారి కాగా  వేమన, వీరబ్రహ్మం కూడా గొర్రెకాపరులే.

 

ఈ సృష్టికి మూలమైన శక్తి ఒకటి ఉందని వేమన, వీరబ్రహ్మం ఇద్దరూ అంగీకరించారు. అతి సామాన్యమైన తెలుగు పలుకులతో సూటిగా, సులభంగా అర్ధమయ్యే విధంగా , అందరికి సన్నిహితమైన ఉపమానాలతో తమ వాణిని వినిపించారు. “పెక్కు చదువులేల? చిక్కు వివాదములేల? అని ప్రశ్నించి, “వేనవేలు చేరి వెర్రి కుక్కలవలె అర్ధహీన వేదమరచుచుంద్రు, కంఠశోషకంటె కలిగెడి ఫలమేమి? అని పండితులను నిగ్గదీసి “చావు తెలియలేని చదువేటి చదువురా?” అని చదువు పేర, శాస్త్రాల పేరిట గొప్పలు చెప్పుకునే పుస్తకాల పురుగులపై అక్షింటలు చల్లాడు వేమన. పుస్తకాలు వల్లించినంత మాత్రాన పుణ్యం దొరకదని, అత్తెసరు చదువుల అయ్యల ఆర్భాటాలు అద్రాటపు నీటిమూటలని బ్రహ్మం చెప్పాడు ..

ఒక మతం మీదకాని, శాఖ మీద కాని, తెగమీద కాని వీరిద్దరికీ ప్రత్యేకాభిమానం అంటూ లేదు. తప్పు ఎక్కడున్నా తప్పే అంటారు. ఏ మతములోనున్న తప్పులనైనా నిష్కర్షగా, నిర్భయంగా ఎత్తి చూపారు. జాతి, వర్ణ, ఆశ్రమ, కుల, గోత్ర రూపాలన్నవి వట్టి భ్రమలు. కాని లోకంలో వాటికి చాలా బలం ఉంది. అందుకే “కులము గోరువాడు గుణహీనుడగును” అని నిరూపించి, “ఎరుక గలవాడె ఎచ్చైన కులజుడు.” అని ఎలుగెత్తి చాటాడు. “కులము గలుగువారు, గోత్రంబు గలవారు, విద్యచేత విఱ్ఱవీగువారు పసిడికలుగువాని బానిస కొడుకులు” అని కులగోత్రాల గురించి స్పష్టం చేసాడు వేమన.”కులము గోత్రమనుచు కూసేటి మలపల” దగుల్బాజీ తనాన్ని తూర్పారబట్టాడు వీరబ్రహ్మం. “కులము కులమటంచు గొణిగెడి పెద్దలు చూడరైరి తొల్లి జాడలెల్ల, మునుల పుట్టువులకు మూలంబు లేదండ్రు” అని నిక్కచ్చిగా చెప్పాడు బ్రహ్మం. కులము కంటే గుణము గొప్పదని నమ్మారు వీరిద్దరూ. “ఉర్వివారికెలనొక్క కంచము బెట్టి పొత్తు గుడిపి కులము పొలియజేసి తలను చెయిబెట్టి తగనమ్మ జెప్పరా” అన్నాడు వేమన. అంతేగాక “అంద రొకట గలియ అన్నదమ్ములె కదా” అన్న సమైక్యభావన వేమన చూపగా, ” ఏ జాతియైన సద్గురుసేవన్ , బ్రతికిన బ్రాహ్మణ వరుడగు” అనీ, ” అన్ని కులములు ఏకమయ్యీనయా” అని బ్రహ్మం మాటలలో కనిపిస్తుంది.

చిత్తశుద్ధిలేని భక్తిని, చిత్తములేని విగ్రహపూజను కూడా వీరు తీవ్రంగా నిరసించారు. “శిలను ప్రతిమను చేసి చీకటిలో బెట్టి మ్రొక్కవలవ దికను మూఢులార” అని కోప్పడి, “నిగిడి శిలను మ్రొక్క నిర్జీవులగుదురు” అని భయపెట్టాడు వేమన. “నల్లఱాళ్లు దెచ్చి గుళ్లు కట్టి మ్రొక్కులిడిన బ్రతుకు చక్కపడగబోదు”, “చెట్టుపుట్టలకును చేయెత్తి మ్రొక్కుచు వట్టి మూటలిట్లు వదరనేల” అని ప్రశ్నిస్తూ, “చిలిపిరాళ్ల పూజ చేయబోక” అని చిత్తశుద్ధిలేని పూజలను బ్రహ్మం ఎన్నో మార్లు ఈసడించుకున్నారు. చిల్లర ఱాళ్లకు మొక్కుచునుంటే చిత్తము చెడునుర ఒరే ఒరే.. చిత్తము నందలి చిన్మయజ్యోతిని చూచుచునుండుట సరే సరే.. అని చిత్తములేని విగ్రహారాధనను వీరబ్రహ్మం ఆక్షేపించాడు.

నిరర్ధకమైన కర్మకాండను ఈ ఇద్దరూ నిరసించారు. ఆత్మజ్ఞానం లేకుండా చేసే స్నానాలు ఉపవాసాలు నిరర్ధకమని హేళన చేశారిద్దరూ. “నీళ్ల మునుగనేల నిధుల మెట్టగనేల.. కపట కల్మషములు కడుపులో నుండగా” అని వేమన నిలదీస్తే “నీటను మునిగి గొణుగుచునుంటే నిలకడ చెడునుర ఒరే ఒరే” అని బ్రహ్మం కూడా ఆ మాటనే చెప్పారు. “కూడు పెట్టకున్న కుక్షిలో జఠరాగ్ని భక్షణంబు సేయు కుక్షిమలము, కూడు విడిచి మలము గుడుచురా యుపవాసి ” అని వేమన ఉపవాసవ్రతాన్ని ఆక్షేపించాడు. ఒకసారి ఒళ్లు మండి ” ఒక్కపొద్దులున్న ఊరబందై పుట్టు” అని కసితీరా తిట్టాడు. “ఒక్కప్రొద్దులని ఎండుచునుంటే ఒనరగ చెడుదువు ఒరే ఒరే! అని బ్రహ్మం కూడా బూటకపు ఉపవాస వ్రతాలవల్ల లాభంలేదని స్పష్టం చేశాడు. నియమనిష్ట లేని తీర్థయాత్రలు, క్షేత్ర నివాసాలు దండగమారి పనులని, ముక్తి సాధనాలు కావని “ఆసనాది విధుల నధమ యోగంబురా” అని వేమన చాలా చోట్ల ప్రకటించాడు. “ఆఁకులెల్ల దిని మేఁకపోఁతుల కేల కాకపోయెనయ్య కాయసిద్ధి” అని గాలి, ఆకులు తినే యోగులను వేమన సవాలు చేస్తే ” ఆకులు తిన్నందుచేత నడవిని తిరిగే మేఁకలకెల్లను మోక్షము రాకేలను పోయెనయ్య” అని వీరబ్రహ్మం కూడా ప్రశ్నించాడు.

అదే విధంగా బారెడేసి జడలూ, బుజాల ముద్రలూ, బూడిదపూతలూ, బోడితలలూ వగైరా బాహ్య చిహ్నాలు మోక్షసాధనాలు కావని, ఆత్మశుద్ధిలేని వేషధారిని విశ్వసించగూడదని ఇద్దరూ హెచ్చరించారు. “పొడుగు గలుగు జడలు పులితోలు భూతియు కక్షపాలలు పదిలక్షలైన మోత చేటెకాని మోక్షంబు లేదయా” అని మాయవేషాలు వేసుకుని ప్రజలను మోసగించేవారిని వెక్కిరించారు. “కొండగుహలనున్నా, కోవెలలందున్నా మెండుగాను బూది మెత్తియున్నా దుష్టబుద్ధులకును దుర్భుద్ధి మానునా” అని అమాయకులను పీడించి, తమ స్వలాభము చూసుకునే తాంత్రిక, మాంత్రికులనూ తూర్పారబట్టారు.

“నాస్తి తత్వం గురోః పరం” అని పూర్వులు భావించినట్టుగానే గురువులేనిదే సాధకునకు దీక్ష కుదరదని , ముక్తి లభించదని ఇద్దరూ స్పష్టం చేశారు. “గొప్పగురుని వలన కోవిదుడగు”, “గురువు లేక విద్య గుఱుతుగా దొరకదు”, గురువుదెలియనట్టి గుఱుతేమి గుఱుతయా”, గురుని గూడ ముక్తి కరతలామలకమౌ” అన్న వేమన పలుకులు ప్రతి ఒక్కరికి శిరోధార్యము. ఆచరణీయము. ” గురుమూర్తియే సమర్ధుడనీ, గురుడే తల్లియు తండ్రియు గురుడే బ్రహ్మంబు” అని , పరమార్ధ నిరూపణకు గురువచనమూ, స్వానుభవమూ తప్పనిసరి అని బ్రహ్మం కూడా నిరూపించాడు. సాధకుడు తన అస్థిరమైన శరీరాన్నే ఆధారంగా చేసుకొని, చెట్టుకొమ్మలు ఆధారంగా వేలాడుతూ కోతి కొండకోనల్లో తిరిగినట్లు తమ అంతశ్శక్తిని, జ్ఞానజ్యోతిని వీక్షించాలి అని ఇద్దరూ ప్రకటించారు. బ్రహ్మజ్ఞానం కంటె మిన్నయైనది వేరొకటి లేదని వేమన , వీరబ్రహ్మం ఇద్దరూ ఎలుగెత్తి చాటారు.

By

7 thoughts on “వేగుచుక్కలు వేమన వీరబ్రహ్మాలు”
 1. This is article has been also published in Sunday Andhra Bhoomi dated 30-10-2011with same title. – KVRM

 2. చరిత్రప్రసిద్ధిగల ఇద్దరు మహనీయులను తులనాత్మకంగా పరిశీలించి వ్రాసిన
  మీ వ్యాసం చాలా బాగుంది…సమాజంలోని చెడును చూసి, స్పందించి తమదైన
  శైలిలో యెండగట్టిన మహాత్ములు వారు..వారి గురించి వివరించిన మీరు
  అభినందనీయులు.

 3. బాగా చెప్పారు. “ఆత్మజ్ఞాన పూర్వక కర్మానుష్టానము” చేయమంటాడు గీతాకారుడు. ఈ రోజుల్లోనూ సీమ పల్లెల్లో అగ్రవర్ణాల వాళ్ళు ఆచారాలకు ఇచ్చిన ప్రాముఖ్యం ఆత్మశుద్ధికి, అంతరార్థాలకు ఇవ్వకపోవడం చాలా ఇళ్ళల్లో గమనించవచ్చు. ఇక వేమన, బ్రహ్మం గారి కాలాల్లో విషయం చెప్పనవసరం లేదు.

  అలతి అలతి పదాలతో జీవిత అంతరార్థాన్ని పిల్లలకు కూడా అర్థమయే విధంగా బోధించిన కవులు, జ్ఞానులు వేమన, వీర బ్రహ్మంగార్లు.

 4. wonderful comparison between vemana and veerabrahmendra swamy.

  these two people were ahead of their times and are pioneers in advocating social reform through literature.
  very good essay

  bolloju baba

Comments are closed.


Notice: Trying to get property of non-object in /var/www/html/maalika/magazine/wp-content/plugins/jetpack/modules/gravatar-hovercards.php on line 238