April 16, 2024

కృష్ణం వందే జగద్గురుం

करारविंदॆन पदारविंदं मुखारविंदॆ विनिवॆशयंतं
वटस्य पत्रस्य पुटॆ शयानं बालं मुकुंदं मनसा स्मरामि.

శ్రీ కృష్ణా! కమనీయ చంద్ర ముఖుఁడా! చిద్రూప! సద్వేద్యుఁడా!
శోకాదుల్ మము నాశ్రయించి, మది నిన్ జూడంగ రానీక, పల్
చీకాకుల్ కలిగించు చుండె. కనితే? శ్రేయస్కరా! మమ్ము నీ
వే కాకున్నను కాచు వారెవరొకో! విశ్వంభరా! తెల్పుమా!

భావము:-
కమనీయమైన ఓ చంద్ర బింబము వంటి ముఖము కలిగిన వాడా! చిత్స్వరూపుడా! సత్స్వరూపుడుగా తెలియబడువాడా! ఓ శ్రీ కృష్ణా!దుఃఖము మొదలగునవి మమ్ములను క్రమ్ముకొని, మా మది నిన్ను చూచుటకు వీలు కలుగనీయకుండా, బాధలను కలిగించు చుండెను. క్షేమమును కూర్చువాడా! ఓ శ్రీకృష్ణా! చూచితివా? ఓ విశ్వంభరా! మమ్ములను నీవుకాకపోతే మరి కాపాడువారెవరున్నారు? తెలియ జేయుము.

సదయుండా! దరహాస చంద్ర ముఖుఁడా!సాక్షాత్తు నీరూపమున్
ముదమారం గనఁ జేసి, నా మదిని నీ పూ పాన్పుగా చేసి, యిం
పొదవంగా పవళింపుమయ్య, సుఖివై! ఉన్నంతలో నిన్ను నే
నెదలోనన్ గని సంస్మరింతు. నను నీ వెల్లప్పుడున్ గావుమా!

భావము:-
ఓ దయామయుడా! చిఱునగవు లొలుకు చంద్రముఖుడా! ప్రత్యక్షముగా నీ పూర్ణ స్వరూపమును సంతృప్తిగాచూచునట్లు చేసి, నా హృదయమునే నీ పూల పాన్పుగా చేసి,సుఖించుచు ఇంపుగా అందు పరుండుము. నాకు జ్ఞానమున్నంతలో నా హృదయములో నిన్ను చూసి,స్మరింతును.నన్ను నీవన్ని సమయములందునూ కాపాడుము.

సుజన మనోహరా! కరుణ చూపర! సద్గుణ సంపదీర! యీ
ప్రజల మనంబులున్ కలుష భావ విదూర సదాశ్రయస్థితిన్
నిజ వర తేజసంబుఁ గని నిశ్చల భక్తిని కొల్చు నట్లుగా
సుజన ప్రశంసనీయమయి శోభిలునట్లు ననుగ్రహింపరా!

భావము:-
సుజనులకు మనోహరమైనవాడా! కరుణను చూపుము. మంచి గుణ మనెడి సంపద ననుగ్రహింపుము. ఈ ప్రజానీకము యొక్క మనస్సులు దుర్మార్గపుటాలోచనలకు దూరమగు సత్తును ఆశ్రయించే స్థితిని, నీయొక్క శ్రేష్టమైన కాంతిమయ రూపమును చూచి, నిశ్చల భక్తితో నిన్ను కొలిచే విధముగా మంచి వారిప్రశంసల నందుకొను విధముగా శోభిల్లే విధముగా అనుగ్రహింపుమా!

అంతర్జ్యోతి వెలుంగులం గనుచు, తా నాత్మాశ్రయంబై నినున్
సాంతంబున్ గ్రహియించి,కొల్చు నటులన్,సద్వర్తనంబొప్పగా
భ్రాంతుల్ వీడి సమత్వ దృష్టియుతుఁడై ప్రఖ్యాత సంసేవలన్
చింతం గూరిన వారిఁ దేల్చు నటులన్ జేయన్ నినున్ వేడెదన్.

భావము:-
తమలో వెలిగే జ్యోతి యొక్క వెలుగులను చూచుచు, మానవుడు తాను ఆత్మాశ్రయుడై నిన్ను పరిపూర్ణముగా తెలుసుకొని నిన్ను సేవించు విధముగా, మంచి ప్రవర్తన ప్రకాశించు నట్లుగా, ఐహికమైన బ్రాంతులను వదలిపెట్టిఅన్ని జీవులయెడ సమాన తత్వము పొందినవాడై, సుప్రశస్తమైన తమ సేవలతో బాధలలో నున్న వారిని కాపాడునట్లు చేయు విధముగా చేయుట కొఱకు నిన్ను ప్రార్థింతును.

మహనీయా! పఠియించు వారలిది సన్మాంగళ్య సౌభాగ్యముల్
మహిమోపేత సువాక్కు గల్గునటులం భక్తిం గల్గి వర్తింపగా,
కుహనావర్తుల నుండి గాచుచును, సంకోచంబులన్ వీడి నీ
స్పృహ గల్గం బొనరింపుమయ్య శుభదా! చిద్రూపుఁడా! మంగళం.

భావము:-
మహనీయుడవైన ఓ శ్రీకృష్ణా! ఈ నా విన్నపమును చదివెడివారలు మంచి మంగళములు, సౌభాగ్యములు, మహితో కూడుకొనిన మంచి మాటకారితనము కలుగునట్లును, భక్తితో ప్రవర్తించునట్లుగను, మోసప్రవర్తులనుండి కాపాడుచూ, అనుమానములు విడనాడి నిన్ను గూర్చిన స్పృహను పెంపొందునట్లుగను చేయుము. శుభములను చేకూర్చువాడా! ఓ చిత్స్వరూపుడా! నీకు మంగళమగుగాక.