March 29, 2024

కృష్ణ మృగం

రచన : శ్రీధర అయల

 

నీళ్లు నిండిన బిందె అరుగు మీదికి దించి, నెరసిన కబరీ భరం  జారిన  ముడి వేస్తూ, ‘అమ్మయ్య’ అంటూ నిట్టూర్చింది వరలక్ష్మమ్మ..

‘ ఇక లాభం లేదు, ఈ ౫౨ పావంచాలూ గడచి నాగావళి ఏట్లో  బిందె ముంచి, ఇంటికి తెచ్చే  ఓపిక తనలో  క్షీణించి పోయింది. నిన్న మొన్నటి వరకూ, కొంగు వెనకాలే తిరుగుతూ నోటికీ, చేతికీ ఆసరాగా నిల్చిన ‘విశాలి’ కూడా వెళ్లిపోయింది. అయినా పెళ్లి అయిన ఆడపిల్ల పుట్టింట్లో ఎంత కాలం  ఉంటుంది ! ఆ అత్తగారికి  మాత్రం తనలాగ  సుఖ పడాలని ఉండదూ !’ చిన్నగా తనలో తనే నవ్వుకొంది ఆమె. ‘ఏది ఏమైనా సరే, ఈ మాఘం లోనే, ‘రామానికి’ పెళ్లి చేసేసి, లక్ష్మిలాంటి  కోడలు  పిల్లను  తెచ్చుకొంటూనే గాని, తనకి  విశ్రాంతి అనేది  ఉండదు.’.

ధృడమైన నిశ్చయానికి వచ్చినట్లుగా, ముడి బిగించి కట్టి, బిందెని చంక నేసుకొని, గదిలోకి అడుగు పెడుతూనే వరండా లోని కవాచీ బల్ల వైపు దృష్టి సారించింది.

ఆరున్నర అడుగుల పోడవు, కవాచీ బల్ల మీద మూలగా, సగం టేకు చెక్కతో  చేసిన  వ్యాస పీఠం,అందులో శ్రీనాధుని కాశీఖండం , దానిమీద పొందికగా  అమర్చిన  సులోచనాల జత మాత్రమే కన్పించాయి  ఆమెకి !

‘  ఈ వేళప్పుడు ఈ పెద్దమనిషి  ఎక్కడికి  వెళ్లేరు చెప్మా ! పొలానికి గాని పోలేదు కద !’ రోజూ అలవాటుగా తంపి నుండి తీసిచ్చే మీగడ పాలు త్రాగకుండానే, వెళ్లిపోయారేమోనన్న ఆందోళన  వెన్ను తడుతూంటే, బిందె క్రిందకి దించి, వెండి పంచ పాత్రతో నీళ్లు తీసి, తులశమ్మ మొదట్లో  పోసిందామె, అన్యమనస్కం గానే. తులశి  చెట్టుకి నీళ్లు పోసి, వెనుకకు తిరగగానే, పెరటి వైపు నుంది వస్తున్న,‘ పెద్దమనిషి ’ కనిపించే సరికి, మనసు చల్లబడింది. “ ఎక్కడికిపోయారండీ ?” ఆందోళనా భరితమైన ప్రశ్న.

“ దొండపాదు కొనలు పందిరి కెక్కించడానికి పెరట్లోకి వెళ్లాను. అయినా మంచి నీళ్ల బిందె దించకుండానే, ఘడియ  సేపు కనిపించక పోయే సరికి ఎందుకూ ఇంత  ఆత్రం ! ఎవరైనా అమాంతంగా  ఎత్తుకు పోయారనుకొన్నావా  ఏం ?” నిండుగా నవ్వుతూ అన్నారు రామనాథం గారు.

“ పొండి !” అంటూ, చాటు చేసుకొన్న ముఖంలో గతించిన  పడుచుతనం, తులశమ్మ  ముందు వెలిగించిన  హారతి కర్పూరంలో భగ్గుమని  వెలిగి పోయింది.

అంతా ఓరగా  గమనించిన రామనాధం గారిలో కూడ ఙ్ఞాపకాల పట్టుతెరలు సున్నితంగా కదులుతూంటే,

గబగబా, కవాచీ బల్ల దగ్గరికి వెల్లి, సులోచనాలు సరి చేసుకొని, కాశీఖండం తిరగేసారాయన.

రామనాధం గారిది  ఆరువేల  నియోగి బ్రాహ్మణ కుటుంబం. ఒక్క సెంటు భూమి కూడ ఇటూ అటూ కానీయకుండా, అనాదిగా  వస్తున్న సాంప్రదాయాలు ఆనవాయితీగా  పాటిస్తూ, తన  ముందు తరం  వేసిన బాటలోనే ఆయన  జీవన  స్రవంతి కూడ నడిచింది. ఏ మాత్రం ఒడుకు దుడుకులు లేకుండా, వంశ పారంపర్యంగా సంక్రమించిన ఇరవై ఎకరాల పల్లపు మాగాణీ  సొంతంగా, సేద్యం చేసుకొంటూ.

వరలక్ష్మమ్మ  ఆయనకి తగిన ఇల్లాలు, ఇంటి పనుల లోనూ, భర్త శుశ్రూష లోనూ, నిముషం విశ్రాంతి ఎరుగదామె. ఎప్పుడూ  ఫాలభాగాన  కనిపించే కుంకుమ బొట్టులో, హృదయం నిండిన అమయకత్వమూ, నైర్మల్యమూ సూక్ష్మ రూపంలో కన్పిస్తాయి, ఆమెని జాగ్రత్తగా  చూసిన  వాళ్లకి. ఆమె దాన ధర్మాలకీ, పుజా పునస్కారాలకీ, ముచ్చట్లకీ, రామనాధం గారు  ఏ నాడూ అడ్డుపెట్టలేదు. అందుకే  ఆమె దృష్టిలో  అతను ఉత్త సాధు పురుషుడు, గంగి గోవులాంటి మనిషిన్నూ.!

పోతే ఆ దంపతు లిద్దరికీ సంతానం కూడ  సరి సంఖ్యలోనే ఉంది. పెద్దకూతురు విశాలకి క్రిందటేడే పెల్లి చేసి, ఏవో ముచ్చట్లు పేరు చెప్పి. నాలుగు నెలలు ఉంచుకొని, అత్తింటికి పంపించిందామె. అయినా  పెళ్లయిన  ఆడపిల్లని  ఎన్నాళ్లని ఇంట్లో  ఉంచుకోగలదు కనుక ! అప్పటినుంచి  లంకంత  కొంపలోనూ, ఫక్తు ఒంటరిగా నిలిచి పోయింది ఆమె.సంవత్సరానికోసారి వచ్చే వేసవి సెలవుల్లో, కనొపించే  చిన్న  కొడుకు రామం  తప్ప ఆ ఇంట్లో అలికిడి  చేసే వాళ్లెవరూ ఉండరు.

ఇకపోతే  రామనాధం గారు ! బయటికి వెళ్తే  పొలం పనుల్తోను, ఇంట్లో ఉంటే దేవతార్చన, కాశీఖండం, అప్పుడప్పుడు కబుర్లు చెప్పడాని కొచ్చే, ఊరి పెద్దలతోనే  సరి పోతుంది. అయినా  ఆయనకేం, మగ మహారాజు ! ఊపిరి  తీసుకోలేని పనుల్తో తోచకేం చేస్తుంది !

‘ రామానికి త్వరలోనే  పెల్లి చేసేయాలి ’ ఆ వేళకి నూట పదో మాటు, నిశ్చయం చేసుకొందా  ఇల్లాలు ! మేనరికం కూడ సిధ్ధంగానే  ఉంది. రామం కూడ అక్కడే  కదా  చదువుతూంట ! రోజూ పిల్లా, పిల్లాడు అన్యోన్యం చూసుకొంటూనే ఉన్నారు.రామం కూడా తన  మాట కాదనడు.అయినా ‘లక్ష్మి’ కేం కొదవ ! ఎప్పుడో చూసిన అయిదారేళ్ల లక్ష్మిని ఙ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ అనుకొందామె.

‘ మే,! మే !’ ఆమె  ఆలోచనకి అంతరాయం కలిగిస్తూ, పెరట్లోంచి ‘కృష్ణమృగం’ అరుపు వినిపించింది.

‘ ఈ వేళప్పుడు దీనికేం జరిగింది. అలా అరుస్తుందేం ! ఆతృతగా  పెరట్లోకి పరుగెట్టిన వరలక్ష్మమ్మ , తన  కంటె ముందుగా అక్కడికి చేరుకొని ఆప్యాయంగా, ఆకులు తినిపిస్తున్న రామనాధం గారిని చూసి నిండుగా నవ్వుకొంది.

‘ అయినా  ఆ నల్లమేక  అంటే ఆయనకి పంచ  ప్రాణాలు ! కొడుకు, కూతురూ చెయ్యి  దాటినప్పటి  నుంచి, ఆ మేకనే  ఆప్యాయంగా  చూసుకొంటున్నారాయన ! వచ్చి పోయే వాళ్లు, నల్లమేక  అని ఎక్కడ అని పోతారేమోనని, ముందుగా ‘కృష్ణమృగం’ అనె పేరుతో  పరిచయం చెయ్యడం అతనికో  విచిత్రమైన అలవాటు ! వరలక్ష్మమ్మ పాదాలు అలవాటుగా వంటింటి  వైపు  దారి తీసాయి.

**************

గొల్లకావిడి పడమర వాలి పోయింది. సప్తర్షి మండలం ఇంచు మించు ఆకాశానికి మధ్య భాగంలో వచ్చి నిలిచింది. నిండు చంద్రుడు జేగీయమానంగా  వెన్నెల కురిపిస్తున్నాడు. ప్రకృతి ప్రశాంత రమణీయంగా ఉంది.

రాత్రి రెండు ఝాములు దాటింది. వరండాలో పట్టి మంచం మీద దొర్లుతూ విసుక్కొన్నాడు రామనాధం. ‘ఈ పాడు.నిద్ర ఎంతకీ రాదేం !’ అంటూ.

పడక గదిలో మంచి నిద్రలో ఉన్న భార్య ఉఛ్వాస నిశ్వాసాల చప్పుడు మందంగా వినిపిస్తోంది.

‘దినమంతా  రెక్కలు ముక్కలు చేసుకొని పని చేస్తుంది. నిద్ర దానికి రాకపోతే నాకెందుకు వస్తుంది ? నిద్రా దేవి కాస్త ఆలస్యంగానే  వరించినా, ఏ నాడూ ఇంతగా విసిగించ లేదు !’ దుప్పటి సర్ది , తలగడ దిళ్లు స్థలం మార్చి తిరిగి మేను వాల్చారాయన.,

అప్పటికీ ఏమంతగా ప్రయత్నం ఫలించ లేదు. కళ్లు మూసుకొని , తనను తాను మరచి పోయే ఆలోచనా స్రవంతిలో మునిగి పోతే, ‘నిద్ర దానంతటదే వస్తుంది’ అనుకొంటూ ఆలోచనలని ఒక కొలిక్కి తీసుకు రావడానికి ప్రయత్నిస్తూ కళ్లు మూసుకొన్నారాయన !

సరిగా అదే సమయంలో పెరట్లోంచి, చిర పరిచితమైన  ధ్వని వినిపించింది ఆయనకి. దిగ్గున లేచి మంచం మీద కూర్చొని ప్రక్కనే ఉన్న నిడుపాటి  చేతికర్రని  బలంగా పట్టుకొని పెరటి తలుపు సగం తెరచి, చుట్టూ చూసారాయన.

తాటి మట్టలతో అల్లిన గొడ్లశాల, దానికి ప్రక్కగా ఎండిన జొన్న కర్రల కట్ట ( కటిక పుల్లల కట్ట ) ఆ ప్రక్కనే నుయ్యి, దాని మీద గిలక, ఆ పైన రెండున్నర అడుగుల ఇటిక గోడ వెనుక ‘నరసింహావధాని గారి పెరడు.

ఆ నుయ్యి ఇద్దరికీ ఉమ్మడి సొత్తు ! అందుకే  గోడకి సగం ఇవతల, సగం అవతల ఉందది. వెన్నెలలో ఎంతో మనోహరంగా ఉందా దృశ్యం !

అయినా  రామనాధం గారికి తృప్తి కలగలా ! ఈ మాటు పెరటి తలుపు పూర్తిగా తెరచి గొడ్లశాల లోకి వెళ్లారాయన. ఉన్న రెండు గొడ్లూ గేదెలు, దూడలతో  సహా పడుకొని నెమరు వేసుకొంటున్నాయి. రామనాధం గారిని చూసి గుర్తించినట్లుగా తల  విదిలించి ఎప్పటిలాగే  నెమరు వేసుకొంటున్నాయి అవి.

ఈ సారి అతని దృష్టి కృష్ణ మృగం మీద పడింది. గొడ్లపాకలో, బర్రెలకి దూరంగా, రాటకి కట్టబడి  ఉందది. దగ్గరగా వెళ్లి ఆప్యాయంగా  దాని మేని నిమిరారాయన. అది నిశ్శబ్దంగా  దిడ్డి ద్వారం  వంక చూపులు  మరలించింది.

ఆ దిడ్డి తలుపు  తరువాత, సన్నని కాలిబాట  తప్ప మరేమీ లేదు. పాలేర్లు వగైరా  గొడ్లని మేతకి తోలుకొని పోవడానికి సాధారణంగా  ఆ దారంటే  రాకపోకలు సాగిస్తారు. రామనాధం గారు వెనక వైపు ఉండే ఇళ్లకి వెళ్లడానికి అదొక్కటే దారి ! ఆ పైన అంతా  బయలు, అడదిడ్డంగా పెరిగిన అడవి చెట్లూ, ఆ పైన నిండుగా, నిశ్శబ్దంగా ప్రవహించే  ‘నాగావళి’ తప్ప మరేం లేవు.

కృష్ణమృగం చూపుల ననుసరించి దిడ్డి తలుపు వైపు చూసాడు రామనాధం.

అది తెరచే ఉంది ! అయినా వార్థక్యం ,రాత్రి పడుకోబోయే ముందు దానిని వెయ్యడం మరచిపోయాడు కాబోలు !

దిడ్డి తలుపు మూయడానికి ముందడుగు వెయ్యబోయిన రామనాధం , ఆశ్చర్యంతొ ,సంభ్రమంతో  నిశ్చేష్టుడే అయ్యాడు.దిడ్డి తలుపు దగ్గర గాజుల చప్పుడు, ఆకు పచ్చని పువ్వుల పరికిణీ మీద  తెల్లని వల్లెవాటు , ఎవరో స్త్రీ ఆకారం  అక్కడ నిల్చి ఉంది !

“ ఎవరది ?” రామనాధం నోటంట , కొంత సేపటికి ధ్వని పెగిలింది.

ఈ మాటు ఆ ఆకారం గుమ్మం నుండి లోపలికి తొంగి చూసింది. ఎత్తుగా పెరిగిన ,వేప కొమ్మల నీడ, కుడి చెంప మీద నల్లగా పడి, మబ్బు తునక క్రమ్మిన చంద్ర బింబాన్ని తలపించింది ఆమె ముఖం !

సంభ్రమం కంగారు హారతి కర్పూరం లాగ , హరించి పోయాయి రామనాధం గారిలో. “ నువ్వటే మల్లీ ! ఇంత  రాత్రి పూట ఎందుకిలా వచ్చావ్ ?” అడిగాడు రామనాధం నవ్వుతూ.

“ గొల్లవీధిలో తోలుబొమ్మలాట చూడడానికి వెళ్లినాను బాబూ ! తిరిగి ఇంటికి వస్తూ, దిడ్డి తలుపు తెరచి

ఉండడం చూసి, ఈరిగాడున్నాడేమో నని  చూసి పోదామనుకొన్నా ! ఆ మాత్రం అలికిడికే , ఆ నల్ల మేక , ‘బేపిలా’ అరిచి గోలెట్టింది !”

వెన్నెల చల్లదనంతో పాటు, నాగావళీ  తరంగాల  చలిని కూడ  సంతరించుకొని, నరాలు జివ్వుమనేలాగ, తెరచి ఉన్న దిడ్డి తలుపు గుండా  గాలి తెరలు తెరలుగా వీచింది.

“ రాత్రంతా  ఈ చలి ఇలాగే ఉంటుంది గాబోలు , రెండు జొన్నకట్టలు పట్టుకు పోవే ! మంత వేసుకోవచ్చు.” అన్నాడు రామనాధం, చలితో మల్లెమొగ్గే  అయిన ‘ మల్లి’ వంక కుతూహలంతో చూస్తూ.

మల్లి అందుకే వచ్చిందన్న నిజం అతని మెదడు క్షణంలో పసిగట్టింది., తెరచి ఉన్న దిడ్డి తలుపు గుండా కనిపించిన జొన్న కట్టల మీద కన్ను పడి, తీసుకెళ్లడానికి సంశయిస్తూ, నిలబడి పోయిందని గ్రహించడానికి  అతనికి అట్టే సేపు పట్టలేదు. అతని మనసులో మంచి చెడులు, దొంగ పనులు పసిగట్ట గల తన, కృష్ణమృగం పైన కించిత్తు గర్వం కూడా కలిగింది !

“ అలాగే బాబూ ! ” కళ్లతోనే  కృతఙ్ఞతలు చెప్పుకొని, కుప్పగా పడి ఉన్న జొన్నకట్టల వైపు మళ్లింది మల్లి.

క్షణంలో రామనాధం మదిలో ఏం మెదిలిందో ఏమో, అతని అడుగులు దిడ్డి తలుపు వైపు సాగాయి !

అంత వరకు జరిగినదంతా, తన విశాలమైన నల్లని కండ్లతో చూస్తున్న కృష్ణమృగం , ఏదో తెలియని భయంతో వెర్రికేక పెట్టింది !!

*****************

ప్రపంచ వ్యాపారాలతో ఏ మాత్రమూ  నిమిత్తం లేని, ప్రభాకరుడు, తూర్పున లేచి, కళ్లు నులుముకొనే సరికి, ‘అగ్రహారం ’ అంతా లేచి, తెల్లగా తెల్లవారి పోయింది.

“ ఏమోయ్ ! రోజూ  బ్రహ్మ ముహూర్తానికల్లా నిద్ర లేపే, కృష్ణమృగానికి సుస్తీ గాని చేసిందా, ఏం ? అనుష్టానాలన్నీ చాల చాల ఆలస్యంగా,అవుతున్నాయి ?”

వీధి అరుగు మీద  కూర్చొని, దంత ధావనం చేస్తున్న, రామనాధాన్ని విస్మయంతో చూస్తూ, ప్రశ్నింఛాడు నరసింహావధాన్లు.

రామనాధం నిర్లిప్తతతో నవ్వి ఊరుకొన్నాడు .

భర్త కోసం ఒక చేతితో, నీళ్లు నిండిన మరచెంబూ, రెండవ చేతితో ఖాళీ బిందె  పట్టుకొని, ఏటికి నీటికోసం  వెళ్తున్నవరలక్ష్మమ్మ మాత్రం  ఆ ప్రశ్నకి జవాబిచ్చింది.. “ నిజమే అన్నయ్యా ! దానికేం తెగులు చేసిందో ఏమో, రాత్రంతా ఒకటే గోల పెట్టింది ! ఇప్పుడు చూస్తే, చలనం లేదు. ఎటో చూస్తూ యోగిలాగ మౌనంగా కూర్చొంది” అని.

“ అందుకే కాబోలు బావగారు కూడా మూగనోము పట్టారు ! అయినా  ఆ నల్ల మేకకీ, ఆయనకీ ఏ జన్మ ఋణాను బంధమో ఏమో ?” అంటూ సమాధానాన్ని ఆశింఛకుండానే, కండువా గట్టిగా దులిపి ఏటివైపు సాగి పోయాడు అవధానులు.

వరలక్ష్మమ్మ  ఆశ్చర్యంతో స్థాణువై  పోయింది , భర్త నిర్లిప్తత చూసి ! మరో రోజు అయితే,  ఈ నరసింహావధాన్లే  కాదు, బ్రహ్మ రుద్రులైనా  సరే, దానిని ‘ నల్లమేక  అంటే  ఒప్పుకొనే తత్వం కాదు అతనిది. ఇవాళ ఎందుకో  ఈ తారుమారు ! అనుకొంటూ సడి చేయకుండా, బిందె పుచ్చుకొని  బయలు దేరింది.

వాళ్లిద్దరూ మిగిల్చి పోయిన నిశ్శబ్దంలో మునిగి పోయిన రామనాధం తిరిగి  పాలేరు వేంకటేశు మాటలతో గాని, తెప్పరిల్ల లేదు ! కృష్ణమృగం కోసం తెచ్చిన రావి ఆకుల కట్ట , ప్రక్కన పెడుతూ, యజమని వినడంతో  సంబంధం లేకుండా, చెప్పుకు పోయాడు వెంకటేశు.

“ ఏం చెప్పమంటారు బాబూ ! మన ఈరిగాడు మనువాడిన మల్లి లేదూ, అది ఏట్లో‘  ఏనుగుల  రాయి ’ కాడ మునిగి తేల్తా ఉంది బాబూ ! కుండ ఒడ్డున పెట్టి, స్నానానికని దిగిందో ఏమో, ఏనుగు రాయి  కాడ, మూడు నిలువుల లోతు నీళ్లలో చిక్కుపడి ఫోనాది ! పానాలు లేవు బాబూ ! ఈరిగాడిని ఆప శక్యం కాకుండా ఉంది ! ఒకటే ఏడుపు,” అంటూ.

వెంకటేశు మాటలు మరి మనసుకెక్కలా  రామనాధానికి. ‘శివ, శివ’ అంటూ ఆకుల కట్ట తీసుకొని, పెరట్లోకి వెళ్లిపోయాడు. గుండెల అలికిడిని గొంతులోంచి బయటికి రానీయకుండా అదిమి పెట్టుకొంటూ.

ఆకులు పట్టుకొని, తనవైపే వస్తున్న రామనాధాన్ని చూసింది  కృష్ణమృగం . చూడనట్లుగా ముఖం చాటు చేసుకొంది. రామనాధం మనస్సు చివుక్కుమంది  ! రోజూ ఈ వేళకి, ఆకులు తేగానే, ఎగిరి పడి అందుకొనే కృష్ణమృగమేనా ఇది ! బాధతో ఆకుల కట్ట దాని ముందు పడేసి, వెళ్లిపోయాడు రామనాధం.

అంతే ! ఒకరి బాధలతోనూ, బరువులతోనూ, నిమిత్తం లేని, కాలచక్రం , ఒక మలుపు తిరిగే సరికి, కృష్ణమృగం  ముందర  ఎండిన  ఆకు  కట్టలు పోగు పడ్డాయి !

రామనాధమే కాని, వరలక్ష్మమ్మే గాని, స్వయంగా తినిపించాలని చూసినా, పచ్చిగడ్డి కూడా ముట్టలేదు అది !

అలా ఎంతకాలమో నిలువలేని, కృష్ణమృగం వెన్నెల  రాత్రులు తరిగి, చీకటి రాత్రులు రాకుండానే, ఒక రోజు హఠాత్తుగా ప్రాణం విడిచింది !

యజమాని హృదయం లోని, ఆప్యాయతని, అనురాగాన్నీ, తెల్లదనాన్నీ మాత్రమే  చూసిన కృష్ణమృగం—

ఆ నాటి తెల్లని వెన్నెల రాత్రి —

హఠాత్తుగా అతని హృదయం లోని, నల్లటి ఛాయల్ని గుర్తెరిగి, ఆ నల్లదనాన్ని భరించ లేక, ప్రకృతిలో లీనమయిందని , ఒక్క సర్వాంతర్యామికే  తప్ప, ఎవరికి తెలుస్తుంది !!!

*****************

8 thoughts on “కృష్ణ మృగం

  1. కృష్ణమృగం…చదవడం నే మొదలెట్టా…నాకు తెలియకుండా అలా
    చదివేసా….కథనం చాలా బాగుంది…కథకి పెట్టిన పేరు వాహ్!
    పూర్తి అయ్యాక మనసుబరువెక్కింది…కొంతకాలం గుర్తుండిపోయే
    కథ…అభినందనలు

  2. గుండు సూదికి తృప్పు పట్టింది అని చెప్పడానికి, గుండు సూది, కత్తి, గొడ్డలి, వాటిని తయారు చేసే ఇనుము, దానిని ఉత్పత్తి చేసే ఖనిజమూ, ఇంకా తృప్పు, నీరు , ఆక్సిజన్, రసాయన చర్యా గురించి చెప్పాలా !
    నా చిన్నప్పుడు ఒక కథ చదివాను. ఒక ఆకు మరొక మట్టిబెడ్డ స్నేహం చేసాయి. గాలి వచ్చినప్పుడు మట్టిబెడ్డ , ఆకు మీద నిల్చొంటుంది, అది ఎగిరి పోకుండా. వాన వచ్చినప్పుడు ఆకు మట్టిబెడ్డ మీద వ్రాలుతుంది, అది తడిసి కరిగి పోకుండా. గాలి వాన రెండూ వస్తే అన్న ప్రశ్నకి ఆ కథ నిలబడదు !
    హరికృష్ణ గారు సృష్టించిన ప్రభంజనంలో ప్రస్తుత కథే కాదు, ఎన్నో కథలు,టి.వి సీరియల్లూ ఎగిరి పోయాయి. వీటినన్నింటినీ ఎవరు రక్షించ గలరు ? మీ ప్రతిభకి జోహార్లు.
    నా క్షీర గంగకి విచ్చేయండి. మీ గాలివానకి తట్టుకొని నిలబడ గలిగే కథలు, అంగులో ఎన్నో ఉన్నాయి,

  3. అనేక విధాలుగా సంసారపక్షంగానూ, సంప్రదాయికంగానూ, నైష్టికంగానూ బతికే వారికి ఏదో వొక నైతిక వైకల్యాన్ని ఆపాదించే సాహిత్యం చాలా ఎక్కువగానే వండబడింది. ఒక్కొక్కరిదొక్కో దృక్పథం. ఒక్కోవాదం. సంసారజీవితం స్త్రీలని కట్టేసింది కనక కట్టలు తెంచండని చలం గారు హోరెత్తించాడు ఒక కాలంలో. అది ప్రేమ అనే పవిత్రభావజాలంలో మూటకట్టి జాగ్రత్తగా కిందికి దించాడు ఆయన. అనేకరకాల వివాహేతర సంబంధాలని – తెగనాడుతూ కొన్ని, సమర్ధిస్తూ కొన్ని, అనివార్యమంటూ కొన్ని, కథలు, నవలలు పుంఖానుపుంఖాలుగా వచ్చాయి. బుచ్చిబాబు (చివరకి మిగిలేది, “నన్ను గురించి కథ రాయవూ”), పాలగుమ్మీ (గాలివాన), వాడ్రేవు భరద్వాజ (గాడి తప్పిన జీవితం), ?? (చంద్రేణైక పుత్ర:), కొడవటిగంటీ, చాసో, నార్ల, ఇటీవలికాలంలో, MBSప్రసాద్, … అనేకులు వివాహేతర సంబంధాలని “explore” చేస్తూనే వచ్చారు. ఈ తరహా కథలన్నిటికీ కూడా మూలసూత్రాలు కొన్నేను. రచయితకున్న ఆదర్శవాదదిక్సూచికలు ఎటు చూపిస్తున్నాయో తెలుసుకుంటే కథాగమనాన్ని అర్ధం చేసుకోవడం పెద్దకష్టం కాదు. ఇదే కథలో మూడు స్త్రీ పాత్రలూ, మూడు పురుషపత్రలూ వున్నాయి – ఇందులో మూడే సంప్రదాయ వివాహపు గిరిలో కట్టబడి వున్నయి. కనక కనీసం ఒక 4 లేదా 5 అయినా వివాహబాహ్యమైన సంబంధాలు నెరపే కథ రాసుకోవచ్చును. అంటే సుమారు అయిదో అరో విభిన్న గమనాలు గమ్యాలు వున్న కథలు రాయొచ్చును. కానీ వీటన్నింటిలోకీ రెండే ఎక్కువ ప్రాచుర్యాన్ని పొంది వున్నాయి. ఒక పాఠాంతరం (version)లో సమాజపరంగా బలవంతుడూ, స్థితిమంతుడూ అయిన మగవాడు అందుకు విభిన్నధృవంలో వున్నా ఆడదానితో సంబంధం జరుపుతూ వుంటాడు. ఇది అన్యాయం. అక్రమం. దౌర్జన్యం. గర్హ్యం. వాడు ఇద్దరు స్త్రీలని ఒకే సారిగా బాధపెడుతున్నాడు. ఇంకో బహుళప్రచారంలో వున్న పాఠాంతరం: అదే విధంగా స్థితిమంతురాలైన స్త్రీ, వర్గపరంగా విలోమంలో వున్న పురుషుడితో సంబంధం జరుపుతూ వుంటుంది. ఇది ప్రేమమూ, జీవసహజమూ, “సంఘం” విధించిన కట్టుబాట్ల నుండీ విముక్తి పొందడమూ. “సంఘం” యొక్క కౌటిల్యాన్నీ, నైతిక వైకల్యాన్నీ చూపించడానికి ఆ సంఘాచారాల పొలిమేరల్లో సంచరించే వంకర టింకర సోమయ్యలే ఈ కధల్లో నాయకాగ్రేసరులు. ఈ పాఠాంతరాలకి ideological బలం చేకూర్చేందుకు పాత్రలు అనువుగా మలచబడతాయి. ముసలి భర్త తాగొచ్చి పెళ్ళాన్ని చావబాదుతూ వుంటాడు. లేదా వ్యాపారం కోసం డబ్బుకోసం వూళ్ళు పట్టి తిరుగుతూ వుంటాడు. ఒకే వర్గంలో వున్న స్త్రీ పురుషులు వివాహబాహ్యమైన సంబంధాలు నెరపడం లోకసామాన్యం. This is the stuff sitcoms serials are made of. కానీ సాహిత్యవిలువ సంతరించుకోడానికి కొన్నే ముడిసరుకులున్నాయి. వాటిల్లో పాత్ర చిత్రణలకి నలుపూ తెలుపూ రంగులు తప్ప మరో రంగులుండవు. పాతాళ భైరవిలో తోటరాముడూ, రాజకుమారీ, మాంత్రికుడూ అలనాటి సాహిత్యస్వరూపానికి మచ్చుతునకలు. అలాగే సమాజాన్ని ప్రతిబింబించే ఆధునిక సాహిత్యంలో కూడా ఎంతసేపూ కొన్నే బింబాలు స్థిరంగా ప్రతిష్టించబడ్డాయి. ఈ అర్ధంలో చెప్పాలంటే వాటిని బింబప్రతిబింబాలనడం కన్నా తైలవర్ణ చిత్రాలనడం ఎక్కువ సబబు.

    ఈ కధ అనేక కోణాల్లో పైచెప్పిన సాహిత్య లక్షణాల సామాన్య సూత్రాల్లో (Formula) ఒదిగిపోతుంది. “బాల్ వధూ” అనే పేరు పెట్టి మనమీకాలంలో ఎక్కడా కనీ వినీ ఎరగని మహళ్ళలో బతికే మునుపటి శతాబ్దపు కుటుంబాన్నీ, అందులో కిలోల బరువుండే డ్రామా డ్రస్సులు వేసుకుండే పాత్రధారులనీ చూపిస్తూ వుంటారు. అలాగే కొన్ని హింది సినిమాల్లో అపారమైన డబ్బులో మునిగి ముప్పొద్దులా గానాబజానాలు వినా మరో వ్యాసంగం లేని ఉమ్మడి కుటుంబాలని చూపిస్తూ వుంటారు. ఇవి వాస్తవ విదూరాలా అనే సంగతి – ఏదో వొక పసరు లేపనంతో వాస్తవాలకి దూరంగా పోయి వద్దామనే మనస్సులకి – పట్టదు. ఈ అర్ధంలో చూస్తే ఈ కధలు తోటరాముడు-రాజకుమారీ-మాంత్రికులకి ఆట్టే దూరంలో లేవు.

    – తాడేపల్లి హరికృష్ణ

Comments are closed.


Notice: Trying to get property of non-object in /var/www/html/maalika/magazine/wp-content/plugins/jetpack/modules/gravatar-hovercards.php on line 238