April 24, 2024

పంచామృతాలు-2

ఆచార్య అనుమాండ్ల భూమయ్య ( వైస్ ఛాన్సలర్, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం)

 

దేవి! నీ పాదరజమింత తీసి, నా

నుదుట తిలకముగ దిద్దగా తోచె కవిత

యను మరాళమొకటి ..న్ ఈ వదన విశాల

గగన మందున తెల్ల రెక్కలను విప్పి

 

దేవి! నేడు నీదు దివ్యమౌశ్రీపాద

ములను నాయెడందమోపినంత

కవిత  జాలువారి కడిగె నీ పాదాలు

నిట్లు కుదిరె బంధమిద్దరికిని

 

దేవి! నీ దరహాస చంద్రికలు కురిసి

తడిసి ఎంత మెత్తగ నయ్యె ధరణి యెల్ల

పుణికి లేగ చేపిన ఆవు పొదుగువోలె

పూవులెన్నైన కురియు నీపూజకొరకు

 

దేవకార్య మదెట్టిదో తీర్చుకొరకు

అవతరించితి వీవు చిదగ్నికుండ

మందుదేవి! ఆసత్కార్యమందు నన్నొ

కందుకైనను వాడుకొందువటవె!

 

సున్నితపు పద్య మెదలోన సుళ్లు తిరిగి

తడిసి ముద్దనై రాగాల తమలపాకు

తీగనైతి, మొదటి ఆకు దేవి! ఇదియె

నీకు నైవేద్యమైనది నేటి కిట్లు..

 

 

( ‘వేయినదుల వెలుగు’ – కావ్యం నుండి)