March 29, 2024

ప్రపంచీకరణ & సంక్షోభం

గత రెండు దశాబ్దాలనుండీ దేసంలో ప్రతీమూలా మార్మ్రోగుతున్న పదాలు “ప్రపంచీకరణ, పరిశ్రామీకరణ”. ఆ పదాలు వినగానే మనకి స్ఫురించేవి – కష్టాలు లేని ప్రజలూ, ఇబ్బడి ముబ్బడిగా ఉద్యోగాలూ, సుఖశాంతులు గట్రా. అయితే వాటితోపాటుగా వచ్చే అనర్ధాల గురించి ఎక్కువగా ఎవరూ ఆలోచించలేదు. ఆ దృక్కోణంలో ఆలోచించిన కేక్యూబ్ వర్మ గారు మనకందిస్తున్న వ్యాసం ఇది

నేను మీముందుంచుతున్న ఈ అంశాలన్నీ మనందరికీ ఎరుకలో వున్నవే. గణాంకాల పట్టికల ద్వారా మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేయడానికి నేను ఆర్థిక వేత్తను కాదు కాబట్టి మీకా భయం అక్కర్లేదు. ఏదో మనసుకు నచ్చినది లేదా నచ్చని అంశాలపై నాలుగు వాక్యాలు రాసుకునే నాకు ఈ బాధ్యతను భరద్వాజ్ గారు అప్పగించడం, నాకున్న వ్యాసరచనంటే భయం చేత ఈరోజు వరకు ఇది మొదలు కాలేదు. అయినా నామీద అభిమానంతో మరల ఆయన గుర్తుచేయడంతో నాకున్న సామాజిక అనుభవం మేరకు మీతో ఇలా మాటాడే ప్రయత్నం చేయ సాహసిస్తున్నా. గత రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వుండి ఆ తరువాత ప్రధాన మంత్రిగా అయిన పి. వి. గారి పాలనా కాలంలో ఆర్థిక మంత్రిగా చేసి ఆ తరువాత గత ఏడేళ్ళుగా ప్రధానిగా పాలన చేపట్టిన మన్మోహంసింగ్ గారు ప్రధానంగా ప్రపంచీకరణ, గ్లోబలైజే్షంపదాలను మనకు బాగా దగ్గర చేసిన వారు. వీరంతా సంస్కరణలను అమలుచేయ కంకణం కట్టుకొని భారత దేశ రూపు రేఖలను పూర్తిగా మార్చేస్తామన్న హామీతో పనిచేసిన వారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ విషయాలకు వస్తే చంద్రబాబు నాయుడుగారు మన రాష్ట్రంలోను, అలాగే దిగ్విజయ్సింగ్ మధ్యప్రదేశ్ లో, ఒరిస్సాలో నవీం పట్నాయక్, నరేంద్రమోడీ దేశ వ్యాపార రంగ ఆయువు పట్టైన గుజరాత్ లలో నమూనా రాష్ట్రాలుగా సంస్కరణలను త్వరితగతిన అమలు చేయడానికి ప్రయత్నించిన ముఖ్యమంత్రులు. వీరిలో బాబు, సింగ్ లు తప్ప మిగిలిన ఇద్దరు అధికారంలో వున్నవారే. అలాగే ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం పూర్తి విరుద్ధమైనది ఎర్రజెండా నీడలో పాతికేళ్ళుగా బెంగాల్ ను ఏలుతున్న మాజీ మరియు ప్రస్తుత ముఖ్య మంత్రులు అత్యంత నియంతృత్వధో్రణిలో అమలు చేయడానికి తీవ్రంగా ప్రయత్నించడం. వీరి విషయంపై రాస్తే అది మరో పెద్ద వ్యాసం అవుతుంది. కాబట్టి అసలు విషయానికే వస్తా.

మన సమాజాన్ని ఇంతవరకు అధ్యయనం చేసిన పెద్దలంతా వ్యవసాయాధారిత ఆర్థిక రంగంతో ముడిపడి వున్నది గానే గుర్తించారు. అలాగే నెహౄ గారు కూడా స్వాతంత్ర్యం వచ్చిన తదుపరి పాలనా పగ్గాలు చేపట్టగానే సోవియట్ సమాజంలోని ప్రణాళికలను ఆదర్శంగా మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయరంగానికే అధిక ప్రాధాన్యతనిచ్చారన్నది ఇప్పటికీ మననకు పాఠ్యాంశంగా వుంది. ఆ తరువాత నుండి జరిగిన పరిణామాలు, అమలు కాని భూసంస్కరణల వలన, మార్కెట్ సదుపాయం లేకపోవడం వలన పెరిగిన డిమాండ్ కు తగ్గ లాభాలార్జించే అవకాశాలు లేక రైతు తీవ్రమైనన సంక్షోభాన్ని మొదటినుండి ఎదు్క్కొంటూనే వున్నాడు. దీనికి కునికే నక్కపై తాటిపండు పడినట్లుగా సంస్కరణల పేరుతో దేశాన్ని ఇరవైఒకటో శతాభ్దానికి తీసుకు పోతామన్న పాలకులు ఈ రంగాన్ని పూర్తిగా విస్మరించారు. తద్వారా నలుగురికీ అన్నం పెట్టే రైతే ఆత్మహత్త్య చేసుకోవడం సమాజం సిగ్గుపడాల్సిన విషయం. మహారాష్ట్రలోని విదర్భ మొదలు మన రాష్ట్రం వరకు చూస్తే గత పదిహేనేళ్ళలో సుమారు లక్షమందికి పైగా ఆత్మ హత్య లకు పాల్పడ్డారు. దీనికి కారణం ప్రపంచీకరణ మోజులో వ్యవసాయ రంగమెదుర్కొంటున్న సంక్షోభం పట్ల పాలకుల నిర్లక్ష్యమే. కారణమేమంటే ప్రైవేటు పెట్టుబడిదారులకు, విదేశీ కంపెనీలకు అప్పనంగా భూములను అప్పగించడంతో పాటు దేశీయ ఎరువుల ఉత్పత్తి రంగాన్ని దివాళా తీయించి తమ పెట్టుబడులతో విదేశాలలో ఎరువుల ఉత్పత్తి చేయడం వాటిని దిగుమతిచేసుకొని అత్యధిక లాభాలకు అమ్ముకోవడం ద్వారా వ్యవసాయ పెట్టుబడులు పెరిగి బ్యాంకులు బడా పారిశ్రామిక వేత్తలకు, భూస్వాములకు అప్పులిస్తూ సామాన్య రైతును పట్టించుకోక పోవడం ద్వారా వడ్డీ వ్యాపారుల కోరలకు చిక్కి, పండిన పంటకు మార్కెట్ సదుపాయం లేకపోవడం, తరువాత నీటిపారుదల సౌకర్యం సరిగా లేక వర్షాధార మైన వ్యవసాయం కారణం కావడం, విద్యుత్ బిల్లుల మోత, భూగర్భ జలాలు అండుబాటులో లేకపోవడం వంటి మౌలిక సదుపాయాల కొరత కారణంగా వ్యవసాయం కడుభారమై ఆత్మాభిమానం కల రైతుకు చావు తప్ప మరో మార్గం లేకుండా పోయింది. దీనికంతటికీ కారణం భూసంస్కరణలు అమలు కాకపోవడం, కొద్దిమంది భూస్వాముల చేతిలో భూమి హక్కు కేంద్రం కావడం కారణం. వ్యవసాయం తప్ప మరో పని చేతకాని జనం అధికంగా వున్నందున, అత్యల్ప కమతాదారులు, కౌలు రైతులు కావడంతో ఇప్పటికే సగానికి పైగా భూమి సేద్యానికి దూరమై కొద్ది కాలంలోనే తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కోబోతునాం.

ఈ మధ్య కాలంలో ప్రవేశ పెట్టిన జాతీయ ఉపాధి హామీ పధకం ద్వారా కూలీ రేట్లు పెరగడం దేశంలో ధన ప్రవాహం అధికంగా జరిగింది. ఇది కూడా సామాన్య రైతుకు కూలీ రేట్లు పెరగడం భారమైంది. వలసల నివారణ పేరుతో పెట్టిన పధకం అవినీతి చెదపట్టి చేరాల్సిన చోటికి చేరక వలసలు తగ్గలేదు సరికదా ఇది వేరే సంక్షోభాలకు ఆలవాలమైంది.

ప్రపంచీకరణ, సరళీకరణల పుణ్యమా అని దేశమంతా పెరిగిన ఎలక్ట్రానిక్ వాడకం, వస్తు వ్యామోహం, టీవీ చానళ్ళ ప్రచార ప్రభావం వలన ప్రతి ఒక్కరు విలాస వస్తువులవైపు మొగ్గు చూపడం ద్వారా తమకున్న పరిధి దాటి పెరిగిన ఖర్చులతో అప్పుల పాలై కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మామూలు కంటితోచూస్తే అంతా సుఖంగా బతుకుతున్నట్లే అగుపిస్తారు. మధ్య తరగతి జీవులు పెరిగిన ధరల ప్రభావంతో ఎటూ పాలుపోని స్థితికి లోనై మునుపటికంటే సంక్షోభజీవితాన్ని అనుభవిస్తున్నారు. టూరిజమొక్కటే నేటి అభివృద్ధి నమూనాగా తీసుకున్న పాలకులు తద్వారా వచ్చిన సామాజిక మార్పులను సరిగా గుర్తించక వ్యక్తిగత నైతిక పతనానికి దారితీసిన పరిస్థితులతో ఓ పెద్ద అగాధాన్ని సృష్టించారు. డబ్బు సంపాదించే మార్గాన్వేషణలో పడిన వారు ఎంతటి నీచానికైనా ఒడిగట్టే విధంగాను, దానికి సమాజం మౌనంగా భరించే స్థితికి నెట్టబడ్డారు. ప్రైవేటు బ్యాంకుల కుంభకోణాలు, టెలికాం కుంభకోణాలు, మొన్నటి 2ఘ్ స్పెక్ట్రం కుంభకోణందాకా, చివరకు దేశ రక్షణ వ్యవస్థలో బోఫోర్స్ దగ్గరనుండి, శవపేటికలు దాకా, ముంబయిలో హౌసింగ్ కుంభకోణం వరకు ఎంత పెద్దయెత్తున అవినీతి జరిగినా కిమ్మనకుండా దాచిపెట్టే పాలకులు, ప్రశ్నించే తీరికలేని జనంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతున్నదన్నది వాస్తవం.

అలాగే ఈ దేశంలో మొదటినుండి మనుషులుగా, వారూ సమాజంలో భాగస్వాములుగా గుర్తించబడని వారు ఆదివాసీ జనం. దేశ ప్రగతికి మూలాలైన ఖనిజ సంపద, జలవనరులు కలిగిన ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడమే కాకుండా వారికి అనాదిగా వున్న భూమి హక్కులను కాలరాస్తూ తీసుకు వచ్చిన సెజ్ చట్టం ద్వారా ఆయా ప్రాంతాలను ప్రైవేటు పెట్టుబడిదారులకు, విదేశీ కంపెనీలకు ధారాదత్తం చేస్తూ వారి ఉనికిని ప్రశ్నార్థకం చేస్తు్న్నారు. దేశీయ వనరులను ఇక్కడి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉపయోగించే అవకాశాలను అణ్వేషించకుండా అత్యల్ప ధరలకు ఖనిజ వనరులను అమ్ముకోజూస్తూ తద్వారా పాలకుల స్వీయ సంపదలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని వ్యతిరేకించే వారిని తీవ్రంగా అణచివేయ పయత్నాలు ముమ్మరం జేస్తున్నారు. దీని వలన అడవిపై గిరిజనుల హక్కులను హరించడంతో పాటు పర్యావరణ పరంగా దేశం సంక్షోభంలో పడుతోంది.

రోడ్ల నిర్మాణమొక్కటే అభివృద్ధి నమూనాగా చూపిన పాలకులున్న దేశం మనది. అలాగే చేపట్టిన అభివృద్ది నమూనాలన్నీ ప్రపంచబ్యాంకు ఆర్థిక వేత్తల కనుసన్నలలో చేపట్టడం వలన దేశీయ పరిస్థితులకనుగుణంగా జరగకపోవడం ప్రధాన కారణం. కొత్తగా చేపట్టిన భారీ పరిశ్రమలంటూ ఏమీ లేవు గత రెండు దశాబ్ధాలుగా. వున్నవన్నీ ఎం. ఎం. సీ. ల చేతిలోకి వెళ్ళిపోయాయి. దాంతో దేశీయ పెట్టుబడి దారులు తీవ్రమైన నష్టాలలోకి నెట్టివేయబడ్డారు. ఓ పది మంది చేతులలోకి మొత్తం పారిశ్రామిక రంగం కేంద్రీకృతమైపోయింది.

అలాగే విద్యారంగం ప్రభుత్వం చేతులలో నుండి కార్పొరేట్ వర్గం చేతుల్లోకి పోయి విద్య సామాన్యునికి అందని ద్రాక్షయింది. అలాగే దేశీయంగా పెరిగిన ఇంజినీరింగ్ విద్యకు సరైన అవకాశాలు లేకపోవడంతో యువత తీవ్ర నిరాశా నిస్ఫృహలకు లోనవుతోంది. కంప్యూటర్, సాఫ్ట వేర్ రంగాలలో వెల్లువలా వచ్చి పడిన అవకాశాలు ఓ దశాబ్ధం కూడా గడవకముందే అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాల కారణంగా కలలన్నీ కల్లలైపోయాయి. విద్యారంగంలో చేపట్టాల్సిన సంస్కరణలను పాలక వర్గం కార్పొరేట్ వర్గానికి లాభాలు తెచ్చేందుకే సాయపడేట్టు చేయడంతో ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థ కుప్పకూలి అట్టడుగు ప్రజానీకానికి ఉన్నత విద్య దూరమైంది.

అదేవిధంగా ఆరోగ్యరంగం కూడా కార్పొరేటీకరించబడి ప్రజారోగ్య వ్యవస్థ క్షీణదశకు చేరుకుంది. వేలాదిమంది ప్రజలు అంటురోగాల బారిన, మలేరియా వంటి వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారు. కార్పొరేట్ రంగానికి వత్తాసుగా ఆరోగ్యశ్రీ వంటి పధకాలుపయోగపడ్డాయి. ఇప్పటికీ శిశుమరణాలలో మనం రికార్డులకు దగ్గరగానే వున్నామన్నది సిగ్గుపడకుండా ఒప్పుకోక తప్పదు. ఇదంతా సంక్షేమ రాజ్యం భావన నుండి పాలక వర్గం దూరం కావడమే కారణం. చేనేత రంగంలోని ఆర్థిక సంక్షోభం మూలంగా ఆత్మహత్యలకు కొదవలేకుండా పోయింది. ప్రపంచీకరణ వలన విదేశీ వస్త్రాల దిగుమతులు పెరిగి వీరి ఉత్పత్తి వ్యయంకూడా రాని విధంగా మారిన పరిస్థితులలో ఎగుమతులు లేక దేశీయ మార్కెట్ లో సరైన ప్రోత్సాహం లేక తీవ్ర సంక్షోభంలో పడిపోయింది. అదేవిధంగా చేతి వృత్తుల పరిశ్రమలన్నీ దెబ్బతిని కూలీలుగా మారిపోవడంతో శ్రమ అత్యంత చౌకైన సరుకుగా మారి జీవన భద్రత లేక జనం అల్లాడుతున్నారు.

ఇలా అన్ని రంగాలను సంక్షోభంలోకి నెట్టిన ప్రపంచీకరణ వలన సమాజం ఆర్థికంగా, సామాజికంగా, నైతికంగా పతనానికి దారితీసిందని నా అభిప్రాయం. మార్పు అన్నది సమాజ అభివృద్దికి దోహద పడే విధంగా వుండాలని ఓ సామాన్య పౌరునిగా ఆశిస్తూ…

1 thought on “ప్రపంచీకరణ & సంక్షోభం

  1. ప్రపంచీకరణద్వార ా లాభాలకంటే నష్టాలే ఎక్కువని రచయిత సున్నితంగా, సునిశితంగా వ్యక్తపరిచారు. చేనేత రంగంలో ఆత్మహత్యలు ఈ ప్రపంచీకరణ పాపఫలితమేనని చెప్పడం బాగా ఆకట్టుకున్నది. ఈ వ్యాసం ఎంత ఎక్కువమందికి చేరగలిగితే అంత మంచి జరుగుతుందని నా అభిప్రాయం. వర్మగారికి అభినందనలు.

Comments are closed.