April 20, 2024

అంచేత నేను చెప్పొచ్చేదేమిటంటే

రచన: బులుసు సుబ్రహ్మణ్యం

              

9-30  గంటలకి  ఆఫీసు చేరుకొని, లాబ్ లోకి వెళ్ళి శ్రద్ధగా, కష్టపడి  పనిచేస్తున్న వాళ్లని ఇంకా కష్టపడి పని చేయాలని, ఈ దేశ సౌభాగ్యం, పురోగతి మనమీదే, మన ఒక్కరిమీదే  ఆధార పడి ఉందని మీకింకా తెలియక పోవడం దురదృష్టకరమని ఉద్భోదించి, తిట్టి, కేకలేసి, ధూమ్ ధాం చేసి,  పనిచేయని వాళ్ళ దగ్గరికెళ్లి,   బాబ్బాబు,  పెద్ద బాసు ఒచ్చినప్పుడైనా ఆ తెల్ల కోటు తగిలించుకొని ఈ రూమ్ నించి ఆ రూమ్ కైనా పరిగెట్టండని బతిమాలి, బామాలి, “ఆ సరే ఏడ్వకు పెద్దాయన వచ్చినప్పుడు ఆలోచిస్తాము లే, ఇప్పుడు డిస్టర్బ్ చేయకు” అని అనిపించుకొని వచ్చి సీటు లో కూర్చున్నాను. కూర్చుని సిగరెట్టు వెలిగించుకొని   కిం కర్తవ్యం అని ఆలోచించాను. కర్తవ్యాలు చాలా నే ఉన్నాయి. కానీ ఎందుకో ఈ వేళ చిరాకు గా ఉంది. పని మీద కి దృష్టి పోవటం లేదు. లేచి కిటికీ దగ్గరి కెళ్ళి నుంచున్నాను. కిటికీ దగ్గరికెళ్ళితే ఏమౌతుంది అంటే,  పచ్చని పూలమొక్కలు, విరబూసిన పువ్వులు, వాటిమీద వ్రాలే  రంగు రంగుల సీతాకోక చిలుకలు, అప్పుడప్పుడు రోడ్ మీద నడిచే భామలు, వారి వెనక్కాల నడిచే,  పనిపాడు లేని వాళ్ళు,  అంతా  చూస్తుంటే అప్పుడప్పుడు చిరాకు తగ్గుతుంది.

 

ఈ చిరాకు తగ్గించుకొనే ప్రక్రియ లో నేనుండగా వెనక్కాల దగ్గు వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే అలకమ్మ గారు ఓ రెండు ఫైల్స్ పట్టుకొని నుంచొంది. హేమిటి అన్నట్టు కళ్లు ఎగరేశాను. పది  ఉత్తరాలకి జవాబు వ్రాయాలి, రెండు రిపోర్టుల మీద అభిప్రాయాలు వ్రాసి పెద్దాయనికి పంపాలి,  12-15  కి కెమికల్ ఇంజినీరింగ్ డివిజన్ లో మీటింగ్ ఉంది అని ఇంకా ఏదో చెప్పబోయింది.  నాకు నషాలానికి అంటింది. అసలు మీ ఉద్దేశ్యం ఏమిటి? నేను గొడ్డులా    చాకిరీ చెయ్యాలా? మీరందరూ టీ లు తాగుతూ కబుర్లు చెప్పుకుంటారా? ఉత్తరాలు ఒకటి రెండు రోజులు ఆగలేవా, ఎవడో ఏదో పంపితే నాకు సంబంధం లేకపోయినా అది చూసి నేను వ్యాఖ్యానించాలా , దీని కోసం నేను లైబ్రరీ కెళ్ళి ఒక రెండు మూడు గంటలు అంత లావు పుస్తకాలు వెతకాలా,  నేను మీటింగ్ కి వెళ్ళితే వాళ్ళు తీసుకొనే అరాచక నిర్ణయాలు ఆగిపోతాయా,   ఆయ్ ఆయ్ అని అరిచాను.  ఆ ఫైల్స్ రెండూ నా టేబులు మీద పెట్టి బెల్ నొక్కింది. పక్కనే నుంచుని  శ్రద్ధగా వింటున్న బోరా వచ్చేశాడు లోపలికి. రెండు సమోసాలు, టీ తీసుకురా అర్జెంట్  గా అని,  సాబ్ గుస్సా మే హై అని ముక్తాయించింది.  మళ్ళీ ఇంకో సిగరెట్టు వెలిగించాను. ఈ మాటు పొగ నోట్లోంచి, ముక్కు లొంఛేగాక చెవుల్లోంచి, కళ్ళల్లోంచి కూడా బయిటికి వచ్చేస్తోంది. రెండు మూడు సిగరెట్లు అయి, నోట్లోంచి, ముక్కులోంచి మాత్రమే పొగ వచ్చే సమయానికి సమోసాలు, టీ వచ్చేశాయి. తిని, తాగుతుండగా ఫోన్ రింగ్ అయింది. ఎత్తితే,  అర్జెంట్ గా వచ్చేయి, బాసు కోపంగా ఉన్నాడు అని పెద్దబాసు గారి PA తొందర పెట్టేశాడు.  కిసుక్కున నవ్వింది అలకమ్మ. మళ్ళీ,  నా కోపం అభోమండలము న కంతై  పోయింది. నువ్వెందుకు విన్నావు అని గయ్ మన్నాను. నా హక్కులు మీరు హరిస్తున్నారు బాస్ అంది.  WHAT అన్నాను. మీరు కేపిటల్స్ లో కోప్పడినా సరే, టెలిఫోన్ ఎత్తడం నా ప్రధమ డ్యూటి. నేను మాట్లాడి సంగతి కనుక్కొన్న తరువాతే  మీకు ఇస్తాను, అది  మీ PA గా  నా ఉద్యోగ హక్కు,  ప్రభావతీ దీదీ టెలిఫోన్ చేసినా అంతే  అని నొక్కి వక్కాణించింది. మళ్ళీ చెవి లోంచి, కళ్ల లోంచి  కూడా పొగ వదులుతూ బాసు గారి దగ్గరికి బయల్దేరాను.

 

బాసు గారి రూమ్ లోకి వెళ్ళేటప్పటికి అక్కడ PA టెక్,  PA అడ్మిన్,  ఇద్దరితోటి గయ్ గయ్ మని చర్చించేస్తున్నాడు బాసు. నేను వెళ్ళి ఆయన ఎదురుగా కూర్చున్నాను. ఆయన ఒక ఉత్తరం నా ముందుకు తోసి వాట్ ఈస్ దిస్ ప్రద్యుమ్నా  అన్నాడు.  దిస్ ఈస్ ఏ లెటర్ అన్నాను.  READ   IT అని గయ్ మన్నాడు. రీడేను. ఆయనెవరో తెలుసా నీకు,  ప్రొఫెసర్ సుబ్రతో బందోపాధ్యాయ్, ఆయన కనీసం 4,5, కమిటీ ల ఛైర్మన్, బయో కెమిస్ట్రీ లో ఫండ్స్ రావాలంటే ఆయన సహాయం మనకి కావాలి. ఆయనకి  ఏదో సమాచారం కావాలని వ్రాస్తే, నువ్వు   with reference to your above,  see my below  టైప్ లో  ఒక నాలుగు  రిఫెరెన్స్ లు  ఇచ్చి,   చూడుడు అంటూ,  ఉత్తరాలు వ్రాయవచ్చా,  ధూమ్ ధాం,  ABCGF అని కోప్పడ్డాడు. అసలే కళ్ళల్లోంచి పొగలు వస్తున్నాయి నాకు. “నాకు తెలియక అడుగుతాను, మాలిక్యులర్ బయాలజీ లో ఆయన ఉద్దండ పిండమే కావచ్చు.  ఆయనకి  పెట్రోలియం  కి  ఏమిటి సంబంధం?  బారెల్ క్రూడ్ ఆయిల్  $40 అయితే ప్రతివాడూ ఒక సెమినారు పెట్టేయడమేనా, పెట్టాడు ఫో బయాలజీ వాడు దాన్ని ప్రారంభించాలా, మీకూ  ఆయనికి బంధుత్వాలున్నాయని ఆయన నాకు ఉత్తరం వ్రాస్తాడా ? నేను ఆయనికి ప్రారంభోపన్యాసం తయారు చేసి పంపాలా? అదికూడా  రెండు రోజుల టైమ్ లో” . పోనీ ఆయన  నన్ను సెమినార్ కి  పిలిచి,   “నేను రిబ్బను కత్తిరించినా,  ప్రద్యుమ్నుడు ప్రారంభోపన్యాసం చేస్తాడు”  అని అనవచ్చు గదా అని ఆక్రోశించాను. మా బాసు గారు విన్నదంతా విని,  ఇంత ఉపన్యాసం ఇచ్చే బదులు  ఆ లైబ్రరీ లో రెండు గంటలు కూర్చుని ఆయన అడిగింది వ్రాసి పంపించవచ్చు గదా అన్నాడు.

 

నేను లైబ్రరీ కి వెళితే జరిగేది నాకు తెలుసు. మీకేం తెలుస్తుంది అన్నాను. ఏం జరుగుతుంది అన్నాడు PA టెక్కు. సరే నేను లైబ్రరీ కి వెళతాను. ఒక అరగంట వెతికి అంత లావు పుస్తకాలు  మూడు నాలుగు తెచ్చి టేబులు మీద పెట్టి కూర్చుంటాను. ఇంతలో మినూ వస్తుంది. గురువుగారూ బాగున్నారా అని పలకరిస్తుంది. బాగానే ఉన్నానమ్మా నువ్వెలా ఉన్నావూ అంటాను. ఏమిటో గురూ గారూ ఆడపుట్టుక పుట్టిన తరువాత అన్నీ కష్టాలే. ఇన్ని కష్టాలు ఉంటాయని ముందే తెలుస్తే మగవాడిగానే పుట్టేదాన్ని అంటుంది. నాకు గుండె చెరువైపోతుంది. ఏమిటి తల్లీ ఆ కష్టాలు అంటాను. మొన్న హోటల్ లో కాఫీ తాగుతుంటే ధనరాజ్ కనిపించాడు. వావ్ ఈ చీరలో ఎంత బాగున్నావ్ అని ఆశ్చర్య పడిపోయాడు. నువ్వు కట్టుకున్నందువల్ల ఈ చీరకి అందమొచ్చింది అన్నాడు. సాయంకాలం సినిమాకి వస్తావా అన్నాడు. కానీ సాయంకాలం సినిమాకి ప్రణవ్ తో వెళ్ళాలి. ప్రణవ్ కూడా ఇంతే గురూ గారూ,   నీ కళ్ళు ఎంత బాగుంటాయో అంటాడు. నీ జడలో నాగుపాములు నర్తిస్తున్నాయి అంటాడు. ఇంకా ఏమో అంటూనే ఉంటాడు. సినిమా చూడ్డమే కానీ వినడం ఉండదు. వీళ్ళిద్దరూ ఇల్లా  నన్ను ప్రేమిస్తుంటే,  ఈ మధ్యే అరుణ్  కి కూడా నా మొహంలో చంద్రుడు కనిపిస్తున్నాడట. ఏ పారిజాతమ్ము లీయగలనో సఖీ,  పక్కింటి వాళ్ళ మందారాలు తక్క అని పాడుతున్నాడు. ఏమి చెయ్యాలో,  ఎవరిని ప్రేమించాలో తెలియడం లేదు. అందుకనే మగవాడిగా పుట్టి ఉంటే ఈ బాధలు ఉండవు కదా అని దీర్ఘంగా నిట్టూరుస్తుంది. ఏం చెప్పాలి నేను, ఎలా ఓదార్చాలి. నా కళ్ళమ్మట దుఃఖాశ్రువులు రాలిపోతాయి.  మగవాడు ఆడదానిని ప్రేమించి ఎంత కష్ట పెడుతున్నాడు అని విచారిస్తాను. ఆవిడ కూడా ముక్కు చీదుకొని  వెళ్ళుతుంది.

 

మినూ  దుఃఖమును నేను దిగమింగి మరలా కార్యోన్ముఖుడ నగుచుండగా అర్చన వస్తుంది హాయ్ అంకుల్ అంటూ. పెద్దబాసిణి గారి మేనకోడలు కాబట్టి అంకుల్ అన్నా వినాలి, పెద్దబాసు గారి కొడుకు పెళ్ళాం కాబట్టి తాత గారూ అన్నా పడాలి. తప్పుతుందా .  వచ్చి కూర్చుంటుంది. బాగున్నావా అర్చనా అంటాను. ఏం బాగో అంకుల్, బాగున్నానో లేదో కూడా అర్ధం కావటం లేదు. ఆఫీసు, ఇల్లూ , మొగుడు , పిల్లాడు కష్టం గానే ఉంది. ఈ మధ్యన నిశాంత్ కి కేలరీల మోహం పెరిగి పోతోంది. కాఫీలో 2.64 శాతం కన్నా పంచదార ఎక్కువ ఉండకూడదుట, పాలు 15.87 శాతం కన్నా తక్కువే ఉండాలిట. కాఫీ డికాషన్ సాంద్రత 1.052 గ్రాములు  పర్ సి.సి. కన్నా ఎక్కువ కాకూడదట. పొద్దున్నే ఆయనకి మూడు మాట్లు కాఫీ ఇవ్వాలి. మధ్యలో పిల్లాడు, స్కూల్, వాడికి కావాల్సినవన్నీ నేనే అమర్చాలి. ఆయన పేపరు చదువుతూనో, లేక ఏ మెడికల్ జర్నల్ చదువుతూనో కూర్చుంటాడు తప్ప, పెళ్ళానికి ఇంత సహాయం చేయాలని తోచదు. వంట 8-30 కల్లా  అవ్వాలి.  ఆయనకి టిఫిను, పిల్లాడికి వేరే అమర్చాలి. ఈ అష్టావధాన ప్రక్రియ లో మా మామ గారి ఫోన్.  వాళ్ళ పిల్లాడు ఎల్లా ఉన్నాడు, వాళ్ళ మనమడు  ఎల్లా ఉన్నాడు,  ఇద్దరూ రాత్రి సుఖం గా నిద్రపోయారా లేదా, వాడేం చేస్తున్నాడు, వీడిని స్కూలు కి తయారు చేశావా, మనమడు అల్లరి చేసినా ఏమి అనకు, భరించు. వాడు అంటే వాళ్ళ పిల్లాడు,   మొన్న సాయంకాలం ఆకలి లేదన్నాడు. నిన్న ఏమైనా తిన్నాడా. ఆకలి లేదన్నాడు కదా అని వదిలి వేయకు, ఏదో ఒకటి తినిపించు.  అంటూ అరగంట నా బుఱ్ఱ  తినేస్తాడు కానీ,  పోనీ కోడలా ఎలా ఉన్నావూ అనికూడా అడగడండి,  ఆశ్చర్యం అని వాపోతుంది. మళ్ళీ యధావిధిగా నేను కూడా విచారించి, రెండు ఓదార్పు మాటలు చెప్పుతాను. కష్టే దుఖిః సుఖే సుఖిః (కష్టపడ్డ వాళ్ళు దుఖిఃస్తూనే ఉంటారు,  సుఖపడే వాళ్ళు సుఖపడుతూనే ఉంటారు ) .  పోనేలేమ్మా ఆదివారం రెస్ట్ తీసుకోవచ్చు గదా అంటాను,  ఇంకేమీ అనాలో తోచక.  ఆ,  సంబడం,  ఆదివారం 8 గంటలకల్లా మామగారు,  అత్తగారు వచ్చేస్తారు, వాళ్ళ మనమడి తో ఆడుకోడానికి. రెండు మూళ్ళు ఆరు గళాసులు కేలరీల కాఫీలు, నాకేం రాయిలా ఉన్నా అనే అత్తగారికి డబుల్ డోసు పంచదారతో కాఫీలు ఇవ్వాలి. ఆడి ఆడి అలసిపోయినందుకు మధ్యలో మళ్ళీ,  మళ్ళీ పళ్ల రసాలు, ఆదివారం కాబట్టి స్పెషల్ వంటకాలు, లాన్ లో కూర్చుని వాళ్ళు కబుర్లు చెబుతూ ఆడుకుంటుంటే,   నేను వంటింట్లో  పొగ పీలుస్తూ , కూరలు తరుగుతూ, మిక్సీ తిప్పుతూ , చెమటలు కక్కుతూ ఉండాలి. మళ్ళీ వీళ్ళని ఏమి అనకూడదు. మేనత్త తో వ్యవహారం అని కళ్ల నీళ్ళు పెట్టుకుంటుంది.  నేనేం చేయగలను అని ప్రశ్నిస్తున్నాను.   కలసి  ఏడ్చి ఆమె దుఃఖము పంచుకోవడం తప్ప. అని సుదీర్ఘంగా నిట్టూర్చాను.

 

పోనీ నీ డిపార్ట్మెంట్ లో ఖాళీ గా ఉన్నవాళ్ల  నెవరినైనా లైబ్రరీకి పంపవచ్చు గదా అని అన్నాడు PA అడ్మిన్.  ఆ, అదీ ప్రయత్నించాను. తరుణ్ సైకియా కి చెప్పేను. కానీ జరిగేది  ఏమిటో నాకు తెలుసు కదా. వీడు వెళతాడు.  మూడు ఏళ్లగా పని చేస్తున్నా వీడికి ఏ పుస్తకం ఎక్కడ ఉంటుందో తెలియదు. లైబ్రరీ అసిస్టెంటు మృణాళిని దగ్గరికి వెళతాడు. ఆవిడ ఆ ఇండెక్స్ లు, అవీ ఇవి వెతుకుతుంది. ఏదో తీసి,  5 నంబరు రాక్ లో ఉంటుంది అంటుంది.    అక్కడ చూసాను కనిపించలేదు అంటాడు. ఆవిడ వెతకటానికి బయల్దేరుతుంది. ఆవిడ వెనక్కాల వీడు బయల్దేరుతాడు. ఎవరూ తియ్యని, ఉపయోగపడని పుస్తకాల రాక్ లు మధ్య కెళతారు. ఒకరిని చూసి ఒకరు నవ్వుతారు. ఎలా వున్నావు అంటాడు. ఓ బెమ్మాండము గా ఉన్నాను అంటుంది. వీడు కిటికీ లోంచి బయటకు చూసి ఆకాశము గుండ్రముగా ఉన్నది అంటాడు. అవును చంద్రుడు కూడా గుండ్రముగానే ఉన్నాడు అంటుంది. మిట్ట మధ్యాహ్నం చంద్రుడు, ఏమిటంటే ఏమి చేస్తాం. దొందుకు దొందే. రికమెండేషను తో ఉద్యోగం సంపాయించిన ఇద్దరి ప్రేమ డైలాగులు ఒకేలా ఉంటాయి. మక్కీకి మక్కీ కాపీ కొట్టడమే. ఆ మధ్యాహ్నము అదే విధం గా ఇంకొన్ని గంటలు ఆ రేక్ ల మధ్య ప్రేమ కబుర్లు చెప్పుకొని తిరిగి వచ్చేస్తారు.  రెండేళ్లగా ఇంత గంభీరం గా  ప్రేమించుకుంటున్న వీళ్ళు  ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో,  వీళ్ళ ఇంట్లో ఎప్పుడు మహాభారత యుద్ధం మొదలవుతుందో నని  ఆత్రం గా ఎదురు చూస్తున్నాను.  అని ఈ మారు కూడా  దీర్ఘం గా నిశ్వసించితిని.

 

నోట్లో జేబురుమాలు కుక్కుకొని PA లు ఇద్దరూ వెళ్ళిపోయారు.  బాసుగారు “నీ  మూడు ఇల్లా ఉన్నప్పుడు నిన్ను పిలవడం నా పొరపాటు.  వెళ్ళు ఇంటికి వెళ్ళి భోజనం చేసి రా” అంటూ లేచాడు. టైమ్ చూశాను. 1 గంట దాటి 20 నిముషాలు అయింది. ఇప్పుడు జరిగేది ఏమిటో కూడా నాకు తెలుసు. ఈ వేళ పొద్దున్నే మా ఇంట్లో రామరావణ యుద్ధం జరిగింది. రామ రావణ యుద్దానికి పోలిక లేదు అని వాల్మీకి గారన్నారుట. ఆకాశం ఆకాశం లాగానే ఉంటుందిట. సాగరాన్ని మరేదానితోనూ పోల్చలేమట , రామ రావణ యుద్ధం అల్లాగే ట. మరే యుద్ధము తోటి పోల్చలేము ట. ఆయన ప్రభావతీ ప్రద్యుమ్నుల యుద్ధం చూస్తే ఏమనే వాడో . మీది మిరియాల వంశము అంటే, నీదే ధనియాల వంశము అనుకున్నాము. మీ తాత ముక్కు పొడుగంటే, మీ అమ్మమ్మ కన్ను మెల్ల అని ఆడిపోసుకున్నాము. మీకు సభ్యత లేదంటే, మీకు సంస్కారం లేదనుకున్నాము. త్వం శుంఠహా అంటే, తమరు పరమ మూర్ఖాః అని సంస్కృతం లో కూడా  అనుకున్నాము. ఇంకా చాలా అనుకున్నాము. ఇంటికి వెళ్ళేటప్పటికి 1-30 దాటుతుంది. అయితే ఏమిటంటారా. ట్రింగ్ ట్రింగ్ మీ కళ్ళముందు రింగులు. మా ఇంటికి 1-31 కి వెళ్ళిపోయారు.

 

ప్రద్యుమ్నుడు  బెల్ మోగించాడు. మోగించిన 4-5 నిముషాలకి ప్రభావతి తలుపు తీసింది. వచ్చారా అంది. రాకేం చేస్తాను అన్నాడు.  మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు రండి. ఒక టైమ్, పద్ధతి, పాడు ఏమి అక్కరలేదు. 1 – 1.30 దాకా లంచ్ టైమ్. అందరూ 12.45 కి ఇంటికి వచ్చేస్తారు.  మీరు కనీసం 1.10 లోపుల వచ్చేస్తారని 12.30 కి కుక్కరు వేస్తాను, మొగుడికి వేడి అన్నం పెడదామని. 12.45 కి కుక్కరు దింపుతాను. ఒంటి  గంటకి ప్లేటు లో అన్నం పెడుతాను. 90  డిగ్రీల టెంపరేచర్ ఉన్న అన్నం,   మీరు టేబల్ దగ్గరికి వచ్చేటప్పటికి 45-50 డిగ్రీ లకి వస్తుందని. మీరు అరగంట ఆలస్యం గా వస్తే అన్నం 28 డిగ్రీలకి అంటే రూమ్ టెంపరేచర్ కి వచ్చేస్తుంది. అన్నం చల్లగా ఉందేమిటి అని ఆశ్చర్యపోతారు మీరు.  కట్టుకున్నందుకు నాకు తప్పుతుందా. ఆ అన్నం పక్కన పెట్టి, కుక్కరులో మిగిలిన అన్నం 35-45 డిగ్రీ ల వేడి ఉన్నది మీకు పెడతాను. మీరు వంకాయ కూర పప్పన్నం లో నంచుకొని లొట్టలు వేస్తూ తినేస్తారు.  ఆఖరికి  చల్లటి అప్పుడే ఫ్రిజ్ లోంచి తీసిన పెరుగు  లో కూడా  వేడి అన్నం  కలుపుకొని తినేసి, బ్రేవ్ మంటూ మళ్ళీ ఆఫీసు కి పరిగెట్టుకొని వెళ్లిపోతారు.  మీరు వెళ్ళిన తరువాత ఏడుస్తూ,  రూమ్ టెంపరేచర్ కన్నా తగ్గిపోయిన చల్లని అన్నం నేను తినాలి. మిమ్మలని ఏమి అనడానికి లేదు. అంటే నేను గయ్యాళి సూర్యాకాంతాన్ని.

 

విన్నారా అదీ సంగతి. అంచేత నేను చెప్పోచ్చేదేమిటంటే  ఆఫీసు కెళ్ళేముందు భార్య తో దెబ్బలాడకండి. ఈ కధలో నీతి  ఏమిటంటే అసలు పెళ్లి చేసుకోకండి మాష్టారూ.

26 thoughts on “అంచేత నేను చెప్పొచ్చేదేమిటంటే

  1. సుజాత గార్కి,

    మీ కామెంటు నాకు నచ్చింది కానీ ,
    >>> ఎప్పుడూ అలా ప్రేమిస్తూ ఉండిపోవాలంతే !
    అంటే, అప్పుడు అమావాస్య చంద్రుడే మిగులుతాడు.
    ధన్యవాదాలు.

    పద్మవల్లి గార్కి,

    ధన్యవాదాలు.

  2. మీ పేరు చూసి మెంటల్ గా ప్రిపేర్ అయ్యే చదివాను! అయినా నాకు కళ్ళలోంచీ, ముక్కులోంచీ, నోట్లోంచీ నవ్వులొచ్చేస్తున్నాయి. అవునండీ అసలు పెళ్ళి చేసుకోకూడదు. మీ నీతి నాకు బాగా నచ్చింది. ఎప్పుడూ అలా ప్రేమిస్తూ ఉండిపోవాలంతే !

  3. కొత్తావకాయ గార్కి,
    ధన్యవాదాలు. అదేమిటో నండి, ఆడంగ్స్ అయినా మగంగ్స్ అయినా కష్టంస్ అన్నీ నాతోనే చెప్పుకొనేవారు. ఓపిగ్గా విని పెడతానని కాబోలు. …. దహా.

    ఆ. సౌమ్య గార్కి,
    ధన్యవాదాలు. ముడి పెట్టలేదండీ. విప్పుదామనే ప్రయత్నం. …. అహా.

    హనుమంత రావు గార్కి,
    ధన్యవాదాలు. అనుభవం వచ్చి తల పండిన తరువాత కదా (పండడానికి ఏమైనా ఉందా అని అడగకండి) నీతి వాక్యాలు చెప్పడం. అయినా నీతి వాక్యాలు వినే వాళ్ళే కానీ ఆచరించే వారెవరు మాష్టారు. .. దహా.

  4. లక్ష్మి రాధిక గార్కి,
    మీ వ్యాఖ్య బాగుంది. ఇంకా బాగా వ్రాయడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.

    తృష్ణ గార్కి,
    నిజమే మీరన్న మాట. కష్టసుఖాలు అన్ని చోట్లా ఉంటాయి. కష్టాలు ఒకరికి సుఖాలు మరొకరికి. కోప్పడడ మా ఎంత మాట. అంతా సరదానే నాతోటి. ధన్యవాదాలు.
    (నా మీద కోపం తో మీరు ఎన్నెల గారి టపాలో పెట్టేశారుట ఈ కామెంటు. ఆవిడ ఆ కామెంటు పార్సిల్ చేసి పంపారు నాకు. …. దహా)

    చాతకం గార్కి,
    ధన్యవాదాలు. ఇంతకీ మీరు గట్టునే ఉన్నారా లేక ఈదడం మొదలు పెట్టేశారా?ఎందుకంటే సూత్రాలన్నీ కంఠతా పట్టేసినట్టున్నారు. … దహా.

  5. హరే కృష్ణ గార్కి,
    మునిగే వాళ్ళు మునుగుతూనే ఉంటారు. దూకే వాళ్ళు దూకుతూనే ఉంటారు. ఇదంతా మాయ శిష్యా. ధన్యవాదాలు.

    మురళిధర్ NN గార్కి,
    నిజం నిజంగా నిజం. ధన్యవాదాలు.

    రాజ్ కుమార్ గార్కి,
    ధన్యవాదాలు. ప్రేమించినంత కాలం ఫరవాలేదు. మ్యూజిక్ ఆ తరువాతే అని తెలుసుకుంటే చాలు. …. దహా.

    హర్ష గార్కి,
    ధన్యవాదాలు.

  6. శ్రావ్య గార్కి,
    ధన్యవాదాలు. ఎక్కడైనా, ఏ ఫీల్డ్ లో నైనా, పై వాడు మొట్టినా కింద వాడు తిట్టినా , మానేజర్నే. … దహా

    శ్రీనివాస్ పప్పు గార్కి,
    ధన్యవాదాలు.

    ఎన్నెల గార్కి,
    ఆ కాలం లో మైక్రో ఓవెన్ లు లేవండి. ఉన్నా కొనేంత జీతాలు లేవు. ధన్యవాదాలు.

  7. అసలు పెళ్ళి చేసుకోకండి.. నీతి బాగానే చెప్పారు అది కాదు పోయింట్. ఎప్పుడు చెప్పారు అన్నది కొచ్చెను..
    పెళ్ళి చేసేసుకున్నాక, కాపురాలు చేసేసాక, కష్టాలు బాగా తెలుసొచ్చాక…లైఫ్ బాగా ఎంజోయ్ చేసేసి…
    మీరెవ్వరూ పెళ్ళిచేసుకోకండహో అంటూ ఇప్పుడు నీతివాక్యాలా?
    మీ నీతులు విని పాపం కుర్రకారు ఏమైపోతారు…ఏమైపోతారు…మైపోతారు…పోతారు…తారు…రు….
    (తర్వాత దగ్గు తరువాత నో మాట్స్.)

  8. >>> ఆఫీసు కెళ్ళేముందు భార్య తో దెబ్బలాడకండి.

    లెస్స పలికితిరి. కథ మీ శైలిలో సహజమైన మెరుపులతో అద్భుతంగా కుదిరింది.

    హ్హహ్హహ్హా.. ఆడంగులంతా కష్టాలు మీదగ్గరే వెళ్ళబోసుకుంటారేంటో!! విష్ణుమాయ.

  9. చాలా బాగుంది మీ ఈ టపా గురువు గారు. మాబోటి వాళ్ళు నేర్చుకోవలసినవి సానా ఇసేషాలు వ్రాసారు. నా మటుక్కి ఈ కధలో నీతులు ఏమిటంటే
    1. అన్నం తినేటప్పుడు ధర్మామీటరు దగ్గర వుంచుకోకూడదు.
    2. భార్య చూస్తుండగా వెడి అన్నంలొ ఫ్రిజ్ లోనించి తీసిన పెరుగుతో తినరాదు.
    3. పొద్దున్నే ఇంట్లొ గొడవ పడే ముందు మనుషులన్నాక రోజూ మధ్యాహ్నం ఆకలి వేస్తుందినే చిన్న విషయం మర్చిపొకూడదు.
    4. వంకాయ కూర పప్పన్నంలో నంచుకొని లొట్టలు వెయ్యకుండానే తినాలి.
    5. మధ్యాహ్నం లెటుగా వచ్చేటట్లుంటే గోడ గడియారం ముల్లు అరగంట ముందుకి తిప్పటం మర్చిపొవద్దు.
    6. రికమెండేషను తో ఉద్యోగం సంపాయించిన ఇద్దరి ప్రేమ డైలాగులు ఒకేలా ఉంటాయి.
    7. మగవాడు ఆడదానిని ప్రేమించి ఎంత కష్ట పెడుతున్నాడు.
    8. బారెల్ క్రూడ్ ఆయిల్ $40 అయితే ప్రతివెధవ సెమినార్ పెట్టేసి బకరాలని వ్రాయమని గోకుతారు.
    9. ఎవరికయినా కోపం వస్తే ముందు నొట్లోంచి పొగ వస్తుంది. కొపం ఎక్కువ అయ్యే కొలది, ఆ పొగ ముక్కులోంచి, కళ్ళలోంచి, చెవిలోంచి కూడా వస్తుంది.
    10. ఎందుకో ఈ వేళ చిరాకు గా ఉంది అని అనిపిస్తుందంటే పొద్దున్నే భార్యామణి గారి అమ్మమ్మ మెల్లకన్ను ఆమెకి గుర్తు చేసారని అర్ధం.

  10. అయ్యో ఇందాకా వ్యాఖ్య రాసాను..ఇక్కద రాలేదు..:((

    అయ్యయ్యో..ఇంతకీ మీరు చెప్పొచ్చిన నీతి పెళ్ళి వద్దనా మాష్టారూ..? అన్యాయం కదూ…
    పెళ్ళికాని అబ్బాయిలూ.. మాష్టారి బెదిరింపులకు భయపడి ఇంకాస్త ఆలస్యం చేసుకునేరు… కష్టసుఖాలు లేనిదెక్కడ?
    ఒంటరితనంలో ఉన్నది శూన్యం..
    పక్కన తోడుంటేనే బ్రతుకు సుఖం..
    ఇదియే తృష్ణ మాట..:))

  11. ఎప్పటి లాగానే బావుందీ గురూజీ.. .
    . ఏ పారిజాతమ్ము లీయగలనో సఖీ, పక్కింటి వాళ్ళ మందారాలు తక్క
    ధూమ్ ధాం, ABCGF అని కోప్పడ్డాడు
    ఈ మాటు పొగ నోట్లోంచి, ముక్కు లొంఛేగాక చెవుల్లోంచి, కళ్ళల్లోంచి కూడా బయిటికి వచ్చేస్తోంది.
    కష్టే దుఖిః సుఖే సుఖిః
    త్వం శుంఠహా అంటే, తమరు పరమ మూర్ఖాః

    ఇలా రాస్తూ పోతే చాలా ఉన్నాయ్.. సూపరో..సూపరు… 😉

  12. కధలో నీతి ఏమిటంటే అసలు పెళ్లి చేసుకోకండి మాష్టారూ.

    నిజమే నిజమే

  13. . అవును చంద్రుడు కూడా గుండ్రముగానే ఉన్నాడు అంటుంది. మిట్ట మధ్యాహ్నం చంద్రుడు, ఏమిటంటే ఏమి చేస్తాం. దొందుకు దొందే. రికమెండేషను తో ఉద్యోగం సంపాయించిన ఇద్దరి ప్రేమ డైలాగులు ఒకేలా ఉంటాయి. మక్కీకి మక్కీ కాపీ కొట్టడమే.

    విన్నారా అదీ సంగతి. అంచేత నేను చెప్పోచ్చేదేమిటంటే ఆఫీసు కెళ్ళేముందు భార్య తో దెబ్బలాడకండి. ఈ కధలో నీతి ఏమిటంటే అసలు పెళ్లి చేసుకోకండి మాష్టారూ.

    కెవ్వ్ కెవ్వ్ :))))))
    సూపరంతే !

  14. ప్రభావతి గారికి మైక్రొ వొవెన్ కొనుక్కోమని చెప్పాలనుంది..ఫోన్ నంబర్ ప్లీస్

  15. గురూజీ కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వంతే మాటల్లేవ్

  16. సూపర్ మాస్టారు :))))

    కష్టపడి పనిచేస్తున్న వాళ్లని ఇంకా కష్టపడి పని చేయాలని, ఈ దేశ సౌభాగ్యం, పురోగతి మనమీదే, మన ఒక్కరిమీదే ఆధార పడి ఉందని మీకింకా తెలియక పోవడం దురదృష్టకరమని ఉద్భోదించి, తిట్టి, కేకలేసి, ధూమ్ ధాం చేసి, పనిచేయని వాళ్ళ దగ్గరికెళ్లి, బాబ్బాబు,

    —————-

    మానేజర్ల పని ఎంత చక్కగా రెండు ముక్కల్లో చెప్పాసారో :)))))))

Comments are closed.