April 24, 2024

ఆంధ్రపద్యకవితాసదస్సు-డా.అచార్య ఫణీంద్రగారికి సత్కారం

ఆంధ్ర పద్యకవితా సదస్సు విశాఖజిల్లా అష్టాదశ వార్షికోత్సవం డిసెంబరు 26, 2010 నడు అనకాపల్లి పట్తణంలో జరిగింది. శ్రీ కే. కోటారావుగారు అధ్యక్షునిగా, డా.మెఱుగుమిల్లి వేంకటేశ్వరరావుగారు ప్రధాన కార్యదర్శిగా, సదస్సు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పద్యభాస్కర శ్రీ శ్లిష్ట్లా వేంకటరావుగారు పాల్గొన్న ఈ సభా చలా అహ్లాదంగా, విజ్ఞానదాయకంగా సాగింది.

పద్యకళాప్రవీణ డా.ఆచార్య ఫణింద్రగారు (ఉపాధ్యక్షులు, ఆంధ్ర పద్యకవితాసదస్సు) ఆనాటి ప్రధాన వక్తగా “19వ శతాబ్ది పద్యకవిత్వం” అనే అంశం మీద అద్భుతమైన ప్రసంగం చేశారు. దేనినైతే కొంతమంది ఆంధ్రసాహిత్యంలో క్షీణయుగమని నేటి వఱకూ చీకటిలో ఉంచే ప్రయత్నం చేస్తూ వచ్చారో, ఆ యుగానికి ఆయన “ఉషోదయ యుగం” అనే నామధేయాన్ని శ్రూజించటం ముదావహం. దానిని ఉషోదయయుగమనటానికి సహేతుకమైన కారణాలను విశదీకరిస్తూ, విశ్లేషిస్తూ ఆధునిక కావ్యాలలోని అనేక పద్యాలను, కథాంశాలను, కావ్య వస్తు నిర్వహణను ఉట్టంకిస్తూ, ప్రస్తావిస్తూ తమ ప్రసంగంతో ఆయన శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు.

వృత్తిరీత్యా భారత ప్రభుత్వ సంస్థ అయిన న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ లో శాస్త్రవేత్త అయినా ఆయన ప్రవృత్తిరీత్యా కవి, సహృదయులు. “పద్యకళాప్రవీణు”నిగా ప్రసిధ్ధులు. “,ఉకుంద శతకం”, “కవితారస గుళికలు”, “పద్య ప్రసూనాలు”, “విజయ విక్రాంతి”, “ముద్దుగుమ్మ”, “మాస్కో స్మృతులు”, “వాక్యం రసాత్మకం” వంటి భిన్న సాహిత్య ప్రక్రియల నిర్వహణతో సాహితీ రంగానికి సుపరిచితులు. ఆయన తాజాగా రచించిన అధిక్షేప, హాస్య, వ్యంగ్యకృతి “వరాహ శతకం” ఈ సభలో ఆవిష్కరింపబడటం మరో విశేషం.

శ్రీ వేంకటరావుగారు పుస్తకాన్ని ఆవిష్కరించగా విశాఖజిల్లా పద్యకవితా సదస్స్య్ ఉపాధ్యక్షురాలైన డా.వీ.సీతాలక్ష్మి శతకాన్ని సమీక్షించారు.

తదనంతరం “రైతులు – వఱదలు” అనే అంశం మీద డా.వేంకటేశ్వరరావుగారు కవిసమ్మేళనం నిర్వహించారు. తమ గళంతో స్వీయకవితలను వినిపించిన కవులను జ్ఞాపికలతో సత్కరించారు. అనంతరం కీ.శే. వేలూరి సత్యనారాయణ, కీ.శే. ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం గార్ల స్మృత్యర్ధం పాఠశాల స్థాయిలో నిర్వహించిన పద్యపఠనపోటీలలో విజేతలకు బహుమతిప్రదానం జరిగింది. ఈ సందర్భంగా ఆచార్య ఫణీంద్రగారిని సాహిత్యాభిమాని అయిన శ్రీ ఫణిరాజ భరద్వాజగారు సత్కరించారు.