April 18, 2024

ఆంధ్ర భారత భారతి – కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతంలోని హృద్య పద్యాలకు వ్యాఖ్యానం

రాజకులైక భూషణుడు, రాజమనోహరు, డన్య రాజ తే
జో జయ శాలి శౌర్యుడు, విశుద్ధ యశశ్శరదిందు చంద్రికా
రాజిత సర్వ లోకు, డపరాజిత భూరి భుజా కృపాణ ధా
రాజల శాంత శాత్రవ పరాగుడు, రాజ మహేంద్రు డున్నతిన్!

సుందరానుప్రాసతో, సుమధుర సంస్కృత సమాసాలతో శోభిల్లిన ఈ పద్యం ఆదికవి నన్నయ భట్టారక ప్రణీతమైన శ్రీమదాంధ్రమహాభారత మహాకావ్యంలో ప్రథమాశ్వాసంలోని అవతారికలోనిది. తనకు ఆశ్రయమిచ్చి మహా భారత మహేతిహాస నిర్మాణానికి ప్రేరేపించిన మహనీయుడు, మహారాజు రాజరాజ నరేంద్రుని ప్రస్తుతించడం ఈ పద్య లక్ష్యం.

రాజుల (క్షత్రియ) కులానికి భూషణమైన వాడు, చంద్రుని వలె మనోహరుడు, ఇతర రాజుల తేజస్సును హరించే శౌర్యము గల వాడు, నిర్మల కీర్తి అనే శరత్కాల చంద్రుని వెన్నెలతో లోకాలను ప్రకాశింప జేసే వాడు, పరాజయ మెరుగని గొప్ప ఖడ్గ ధారా జలంతో శత్రువులనే రేణువులను అణగ ద్రొక్కేవాడు, రాజులలో మహారాజు అయిన వాడు ( రాజరాజ నరేంద్రుడు ) ఔన్నత్యంతో నుండెనని ఈ పద్య భావం. తొలి తెలుగు కృతి ఆంధ్ర మహాభారతం సంస్కృత శ్లోకంతో ప్రారంభమవడం వైచిత్రి. ఆ పిమ్మట ఒక వచనం ఉంటుంది. ఆ పైన వచ్చే తొలి తెలుగు పద్యం ఇదే!

వ్యాస ప్రోక్త సంస్కృత భారతంతోబాటు, పంప మహాకవి కృత ” విక్రమార్జున విజయ ” అన్న కన్నడ మహాభారతం, ఆంధ్ర మహాభారత నిర్మాణంలో నన్నయ భట్టుకు మార్గ దర్శకమై నిలిచాయని పరిశీలకుల ఆభిప్రాయం. అయితే సంస్కృతంలో అంతగా వినియోగింపబడని ఉత్పలమాలాది ఛందస్సులకు మన ఆదికవి ఈ ఆదికావ్యంలో పెద్ద పీట వేసాడు. సంస్కృతంలో లేని ప్రాసను, కన్నడంలో లేని యతిని నన్నయ తెలుగు పద్యంలో జొప్పించి మెప్పించాడు. అంతే కాదు. సంస్కృతంలోని యతి కన్న తెలుగు యతి విభిన్నమైంది. సంస్కృత యతి కేవలం విరతి. తెలుగు యతి అక్షర నియతి. కమనీయ ధార, రమణీయ శబ్ద సంయోజనం ఈ పద్యాన్ని పరుగులు పెట్టిస్తాయి. పద్య నిర్మాణానికి నన్నయ భట్టారకుడు ఏర్పర్చిన ఈ మార్గం, వేయేండ్ల తరువాత ఈనాటి కవులకు కూడా శిరోధార్యం.

కొస మెరుపుగా చెప్పవలసిన విషయమేమిటంటే – కన్నడ భారతాన్ని రచించిన పంపడు కరీంనగర్ లో వేములవాడకు చెందిన తెలుగువాడని; తెలుగు భారతాన్ని రచించిన నన్నయ భట్టు, అతని మిత్రుడు నారాయణ భట్టు కన్నడిగులని కొందరు చరిత్రకారులు నిర్ధారించారు.

1 thought on “ఆంధ్ర భారత భారతి – కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతంలోని హృద్య పద్యాలకు వ్యాఖ్యానం

  1. మంచి శీర్షికని ప్రారంభించిన ఫణీంద్రగారికి ధన్యవాదాలు.

    “రాజకులైక భూషణుడు” అంటే చంద్రవంశానికి భూషణమైనవాడు అని కూడా అర్థం తీసుకోవచ్చు, రాజరాజ నరేంద్రుడు చంద్రవంశపు రాజు కాబట్టి. చంద్రవంశానికి చెందిన భారతరాజుల గాథని ప్రారంభిస్తూ మొదటి తెలుగు పద్యమంతా “రాజ” శబ్దంతో (“రాజ” శబ్దానికి చంద్రుడనే అర్థం కూడా ఉంది) రాజితమయేట్టు రచించడం నన్నయ్య చూపించిన ఔచిత్యం. అది ఉత్పలమాల (కలువపూల మాల) ఛందస్సులో కూర్చడం మరింత ఔచితీమంతం.
    విచిత్రమైన మరో విషయం ఏమిటంటే, ఈ మొదటి తెలుగు పద్యంలోనూ నన్నయ్య చివరి పద్యంగా చెప్పబడే “శారద రాత్రులు” పద్యంలోనూ శరదిందు చంద్రికలు దర్శనమిస్తాయి.

Comments are closed.