April 25, 2024

చిన్నక్క & పీతాంబరం

ఏంటో ఈ పీతాంబరం ఇంకా రాలేదు ఎప్పుడనగా చెప్పాను “ఎక్కడ హత్యలు, దొంగతనాలు, రక్తపాతాలు జరిగినా కాస్త సృజనాత్మకత జోడించి ఆ వార్తలని తీసుకుని రమ్మన్నా . 24 గంటలు న్యూస్ చూసి , చూసి … రక్తపాతం, నేరాలు , ఘోరాలు లాంటి భయాంక భీభత్స వార్తలు కావాలి .. మరీ చప్పగా ఏంటి అంటున్నాడు బాస్. ప్చ్! జనాలు మోటువారిపోయారు. తలకాయల్ని కూరగాయల్లా నరికేసుకుంటున్నారు, జనాలు వాటికే అలవాటు పడిపోయారు.

ఏంటి చిన్నక్కా! అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?

“వచ్చావా పీతాంబరం? ఇక్కడ వార్తల గురించి నేను తంటాలు పడ్తుంటే తీరికగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోందా నీకు? ఇంతకీ వార్తలు తెచ్చావా? ”

“ఆ! తెచ్చాను అక్కా! మన దివంగత ముఖ్యమంత్రి కుమారుడు అకుంఠిత ధీక్షతో జల దీక్ష చేస్తున్నారు. పేద ప్రజలకోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారట అక్కా..

“హ.. హు.. ఇదో వార్తా? పీతాంబరం? ఇందులో హింస లేదే.. ప్రాణాలు అర్పించిన తరువాత ఏమన్నా రక్తపాతం జరిగితే చెప్పు, అప్పుడూ చెప్దాము ఇది ప్రముఖ వార్తగా…

“అయితే అక్కాయ్! నీకు హింసాత్మక వార్తలు కావాలా చూసుకో మరిక నా తఢాకా..

నిన్న పొద్దున్నే ఉల్లిపాయలు కొనడానికి లోన్ కోసం బ్యాంక్ కి వెళితే బ్యాంక్ వాళ్ళు లోన్ గురించి ష్యూరిటీ కావాలని అడిగారు. మా పెద్దక్క ప్రభుత్వ ఉద్యోగి కదా అని ష్యూరిటీ కొసమ అటు పరిగెత్తాను. గుమ్మం లోకి అడుగు పెడుతూనే…..

“రా.. రా.. తమ్ముడూ.. సాంబారన్నం ఎప్పుడు పెడ్తున్నావు” అని అడిగింది అక్కాయ్.

“అదేంటి సాంబారు చేయడం రాదా మీ అక్కకి?”

“ఎందుకు రాదు బేషుగ్గా వచ్చు కాని ఉల్లి ధర పెరిగింది కదా! అందుకని మా మేనకోడలికి కట్నం డబ్బులు కూడబెట్టారు కాని, ఉల్లిపాయలు కొనలేక, పెళ్ళి పీటలదాక వచ్చి ఆగిపోయింది. అందుకే పప్పన్నం పోయి సాంబారన్నం అయింది. ”

“ఒహో ఇందులో హింస లేదే”

“అంత తొందరెందుకు అక్కా ! ఇంకా అవలేదు కదా..”

అలా అడిగిన అక్కాయి కి….

“సమయానికి తగు మాటలు భలె చెప్తావక్కా ! ఉల్లిపాయలు కొనడానికి బ్యాంక్ లో లోన్ పెడ్తున్నాను లోన్ డబ్బులు రాగానే తప్పక సాంబారన్నము పెడ్తానని వాగ్ధానం చేసేసాను . నెమ్మదిగా ష్యూరిటీ గురించి అడుగుతూ..

“ఉల్లిపాయల లోన్కి నేను ష్యురిటీ నా… అంటూ అక్క వాపోతూ ఉండగా జరిగిందా ఘోరం… పచ్చిమెరపకాయ నిలువునా చీరబోయి వేలుని చూసుకోకుండా……”

పాతం! రక్తపాతం! .. పీతాంబరం…. ఎంత ఘోరం జరిగిపోయింది. ఈరోజంతా ఇదే వార్త మన ఛానెల్ లో. ఆవిడ వేలు మీదే మన కెమెరా దృష్టి . చూసేవాళ్ళకి వేలు ఉంటుందా, ఊడుతుందా అని సస్పెన్సె కలగజేయాలి. ఎంత ఘోరం.. ఇంతకీ ఆ చాకు ఎక్కడకొన్నారు? ఎంతకి కొన్నారు? ఎలా కొన్నారు అసలు ఆ చాకుకి లైసెన్స్ ఉందా? ఎంత రక్తం పోతొంది, అదే గ్రూప్, ఏ హాస్పిటల్ కి తీసుకెళ్ళారు? ఎన్ని రోజులు ఉండాలి .. పద పద కమాన్, ఎంటి ఇంకా ఆలస్యం .” ఎంత మంచి న్యూస్ ఇది.. ఎంత ఘోరం, ఎంత నేరం.

చాకుకి లైసెన్సా? ఏ హాస్పిటలా? ఎన్నిరోజులా? ఇప్పుడవన్ని అవసరమా? మా అక్క ఎప్పుడో వేలుకో బాండ్ ఎయిడ్ చుట్టేసుకు టి.వి సీరియల్స్ చూసుకొంటూ కన్నీటి భాస్పాలు రాలుస్తోంది.

హు! పీతాంబరం.. నువ్వేమి తమ్ముడివి? అవి రక్తపాతం జరగడంవల్ల బాధతో వచ్చే కన్నీటి భాష్పాలు, పద మనం ఆమెని హాస్పిటల్ లో చేర్చి, అన్నిరకాల వైద్య సేవలందిస్తూ ప్రతి నిముషానికి ఆవిడని మన వార్తల్లో చూపిస్తూ ప్రజల సానుభూతి కోరుదాము. అవసరమైతే ఆవిడ ఎన్నాళ్ళు బతుకుంతుందో ఒక ఎస్ ఎం ఎస్ పోల్ పెడదాము.

ఆ ….ఆ ఆవిడ ఎన్నాళ్ళు బతుకుతుందోనా?.. ఎస్ ఎం ఎస్ పోలా? చిన్నక్కాయ్ రేడియో నుంచి టి వి దాకా ఎంత ఎదిగిపోయావు. నేను ఉల్లి కొనడమెప్పుడో .. నా పెళ్ళి ఎప్పుడో…

కొత్త సామెత: ఉల్లి కొని చూడు .. పెళ్ళి చేసి చూడు.