March 29, 2024

జెర్సీసిటీలో దసరా, దీపావళి

దసరా సమయం వచ్చిందంటే చాలు – జెర్సీ సిటీలోని జర్న స్క్వేర్ ప్రాంతంలో కోలాహలం మొదలవుతుంది. ఇండియన్ స్త్రీట్ గా వ్యవహరింపడే న్యూఆర్క్ ఏవెన్యూ భారతీయులతో కిటకిటలాడుతుంది. అలా మొదలయ్యే హడావిడి దీపావళిదాకా సంబరాలతో, గర్బా డాండియా నృత్యాలతో, వివిధ కళాకారుల ప్రదర్శనలతో కొనసాగుతుంది. వేలకొద్దీ ప్రవాస భారతీయులు పాల్గొనే ఈ దసరా దీపావళి ఉత్సవాలు చూపరులకు నిజంగానే కన్నులపండువుగా ఉంటాయి. 2010 లో జరిగిన ఉత్సవాల టూకీ నివేదికే ఈ వ్యాసం.

దసరా దీపావళి రోజుల్లో రహదారులు మూసివేసి సంబరాలు జరుపుకోవటం భారత దేశంలో సర్వసధారణం. కానీ అదే న్యూ జెర్సీలో జరిగితే? వింతే కదా? ఆ వింతలో పాలుపంచుకునేవారి అనుభూతి మామూలు మాటలలో వర్ణించలేనిది.

న్యూయోర్క్ నగరానికి అతి చేరువలోనున్న న్యూజెర్సీ రాష్ట్రంలోని జెర్సీ సిటీ భారతీయులకి, ముఖ్యంగా గుజరాతీ సంతతికి పెట్టింది పేరు. ఆ ఊరిలోగల న్యూఆర్క్ ఏవెన్యూలోని కొంతభాగం, అంటే జే ఎఫ్ కే బులవర్డ్, టొనెల్ ఎవెన్యూల మధ్యభాగం 100 సాతం భారతీయ దుకాణాలతో నిండి ఉంటుంది. ఎటు చూసినా భారతీయులతో కిటకిటలాడుతూ మన దేశాన్ని మరిపిస్తుంది. ఇక పండగలొస్తే ఒకటే కోలాహలం. రంగురంగుల, రకరకాల దుస్తుల్లో ముస్తాబయ్యే ముద్దుగుమ్మలు, అందగాళ్ళతో ఆ ప్రాంతం మెరిసిపోతూ ఉంటుంది. ఇక్కడ అత్యధికులు గుజరాతీలవ్వటం మూలాన కేవలం గర్బా డాండియాలు మాత్రమే జరుగుతాయి (అదే ఏ ఏడిసన్ లాంటి పట్టంలోనో అయితే తెలుగు కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి).

ఎప్పటిలాగే 2010 ఉత్సవాలు కూడా పండుగ శుక్రవారం రోజు పూజలతో మొదలయ్యాయి. పైన చెప్పిన రెండు రోడ్ల మధ్యా న్యూఆర్క్ ఎవెన్యూని పూజకి రెండుగంటల ముందే మూసివేశారు, అంటే సుమారు ఏడున్నరకి. రోడ్డు మధ్యలో ఒక వేదిక వేసి భారత్ నుండి ప్రత్యేకంగా పిలిపించిన వాద్య బృందంతో సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించటానికి రంగం సిధ్ధమయ్యింది. జనాలు ఒకొక్కరే రాసాగారు. తొమ్మిదయ్యేసరికీ దాదాపు ఆరేడువేలమంది పోగయ్యారు. ఇకనేం గర్బా మొదలయ్యింది. వేలాదిమంది నృత్యకలాపాలు మొదలయ్యాయి. అర్థరాత్రికల్లా గర్బా నుండి కార్యక్రమం డాండియాకు మారింది. జనాలు రెట్టించిన ఉత్సాహంతో డాండియా ఆడటం మొదలుపెట్టారు. నిరాటంకంగా సాగిన ఈ కార్యక్రమం రాత్రి రెండు గంటలకు ముగిసింది.తరువాతి వారాంతం కూడ ఇదే తంతు, అంటే విజయదశమి దాకా.

దసరా తరవాత దీపావళి హడావిడి మొదలయ్యిది. మళ్ళీ ఒక వారాంతం రోడ్డు మూసివేసి పూజా, సాంస్కృతిక కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఈ సారి కళాకరుడు ప్రక్యాత కామెడీ పేరడీ గాయకుడు దేవాంగ్ పటేల్. ముఖ్య అథిధులుగా పిలిచిన వారిలో సిటీ మేయర్, పోలీస్ అధికారి, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. మూడు నాలుగు గంటలపాటు సగిన ఈ కార్యక్రమంలో కూడా వేలాదిమంది పాలుపంచుకున్నారు. ఇక దేవంగ్ పటేల్ సంగతి చెప్పేదేముంది? తన పేరడీలతో నవ్వుల జల్లు కురిపించారు. ఆ చిత్తరువులు కొన్ని మీకోసం.

ఆ కార్యక్రమం పూర్తయ్యిందో లేదో, జనాలందరూ 2011 కార్యక్రమాలకోసం ఎదురుచూడటం మొదలుపెట్టారు.

1 thought on “జెర్సీసిటీలో దసరా, దీపావళి

Comments are closed.