March 29, 2024

మహారాజ్ఞి మండోదరి

శ్రీరామ చంద్రుడు సద్ధర్మ ప్రతిష్ఠ చేసి శిష్ట రక్షణ చేయడానికి దుష్టశిక్షణ చేయడానికి పుట్టినాడని, మానవ మాత్రుడు గాడని గోపీనాథ రామాయణంలో అటనట చెప్పబడిన విషయమే. శ్రీరాముని ఔన్నత్యాన్ని, ధర్మ స్వరూపాన్ని కూడ చాల సందర్భాలలో పాత్రల ముఖతః వినిపింపచేసాడు కవి. అలాంటి కొన్ని పాత్రలలో రాక్షస స్త్రీలూ వున్నారు. ప్రతినాయకుడైన రావణాసురుని పట్టమహిషి మండోదరి కూడ ప్రథమంగా చెప్పదగినది. ఎందరో రఘురామచరిత్ర కల్లగాదు, కల్పితం కాదు అని అంగీకరించారు.

“మానవులకు గల దురంత చింతనాల వల్ల కలిగె అనుకోని సంఘటనలకు అనాలోచింతంగా, అత్యాశాపరంగా ప్రకటించే భావనా జగత్తు వల్ల ఎదురయ్యే విపత్తులకు సాక్ష్యాధారమైన చక్కని కావ్యం రామాయణం. అయితే మహర్షుల ఆశీర్వాద బలంతో, వాళ్లు అందించిన విద్యా వివేక సంపదలతో కూడిన దివ్య శక్తులు కూడ పాత్రల పరంగా అటనట ప్రదర్శింపచేసాడు వాల్మీకి ఋషి. సీతారాములన యెవ్వరో కాదు జగస్థితికి మూలాధారులైన లక్ష్మీనారాయణులేయని, ఆయన లోక కల్యాణార్ధమై ప్రభవించిన వీరుడని, ఆమె సాక్షత్తు ఆ స్వామిని నిరంతరం సేవించుకునే అనపాయునియైన ఆ మహాలక్ష్మియని” నిరూపింపబడినది అని శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి అంటారు. దశరథుని కుటుంబమనే సుక్షేత్రంలో విషబీజాలు నాటిన మంథర, కైక వంటి మానవ కాంతలు కొందరుంటే శ్రీరమభద్రుణ్ణి ఆయన కుటుంబ సభ్యులను అవగాహన చేసుకుని శరణాగతిగ జీవింపదలచిన రాక్షస వనితలు కొందరు. మండోదరి తన ఉత్తమ భావ ప్రకటనలతో జీవించినా, ధూర్తుడైన భర్తకు యిల్లలు అయినందున అవేదనలపాలుగాక తప్పలేదని ఆమె చరిత్ర చాటుతున్నది.
గోపీనాథ వేంకటకవి రచనలోనేగాక ఈమె అందరినోట మండోదరిగ పలుకబడుచున్నది. మండూక శబ్దాల పేరిట నాట్యాభినయాలు చేయిస్తున్నారు నాట్యాచారులు. ఈమె మండూక ఉదరం గలదని మండోదరి అని కొందరన్నా సుందరమైన ఉదరం కలదై అనడం సమంజసంగా వుంటుంది. సీతాదేవితో తుల్యమైన సౌందర్యంగలదని శ్రీమద్రామాయణమే చాటుచున్నది. సౌందర్యవతి అయిన ఈ స్త్రీ మూర్తిని మంద+ఉదరి అని పిలుచుటయే తగిన విధంగా ఉంటుందని తెలియవచ్చు. ప్రజల వాడుకలో మండోదరి అనియే రూఢియైయుండవచ్చు.

ఈమె దేవకన్యయైన హేమకు మయునికి గలిగిన స్త్రీమూర్తి గదా! దైవాంశయైన మండోదరి మయుని పుత్రిక. తల్లి హేమ అనబడే దేవకన్య. ఈమె తన తండ్రితో కలిసి వనంలో సంచరించే వేళ వేటకై రావణుడు వెళ్లినప్పుడు ఈమెను చూస్తాడు. తాను అవివాహితుణ్ణి కాబట్టి తనకు మండోదరిని ఇచ్చి వివాహం జరిపించమని రావణుడు కోరుకుంటాడు. కాబట్టి తండ్రియైన మయుడు మండోదరిని రావణునికిచ్చి వివాహం జరిపించాడు. అందుచే ఈమె రావణాసురుని పట్టమహిషి. మిక్కిలి సౌందర్యం గలది. కేవలం బాహ్య సౌందర్యరాశి మాత్రమే గాదు మండోదరి అంతస్సౌందర్యం మిక్కిలి కొనియాడదగినది. రావణునిచే వరింపబడినది. నీతిని, ధర్మాన్ని కర్తవ్యాన్ని ప్రభోధం చేయగల మనస్తత్వం గలది. ఆమె వ్యక్తిత్వం మిక్కిలి ప్రశంసాపాత్రం. శ్రీమద్రామయణంలో కొన్ని పాత్రలు మానవత్వాన్ని మరచిపోయి ప్రవర్తిస్తే మరికొన్ని పాత్రలు దానవకులానికి చెందినప్పటికి మనవత్వానికి ప్రతీకలైనాయి. లంకాధినేత రావణుని పట్టమహిషి అయిన ఈ మహారజ్ఞి అలాంటి తత్వంగల స్త్రీమూర్తి. పురాణాలలో తమ పాత్ర ఔన్నత్యాన్ని పరిపోషించిన స్త్రీమూరులెందరో వున్నారు.

సహృదయం, ఔన్నత్యం, నేర్పు ఉన్నట్టి కులాంగన మండోదరి. ఉత్తమ సౌశీల్య సంపదగలది. ఈమె సీతవలె అయోనిజ. అందుకే ఆమె కూడ పంచకన్య్లలో చేర్చబడినది. అయా సందర్భోచింతంగా తన భూమికను నిర్వర్తించిన ప్రశంసాపాత్ర అయినది. కన్నతల్లిగా తన బిడ్డకు సుశిక్షణనిచ్చి ప్రథమోపాధ్యాయిని అయినది. “షట్కర్మయుక్తా కులధర్మపత్నీ” అన్నట్లు ఆయా సమయాల్లో తన భర్తకు సహచరిణియై ఏయే వేళలలో తను ఎలాంటి తీర్పు అవసరమో దానిని తన మగనికి అందించగలిగినది. క్రూర రాక్షస కుటుంబంలో సభ్యత్వం ఉన్నా ఆమె హృదయం నిర్మలం, కోమలం. విపులైశ్వర్య, త్రిలోక విజేత అయిన భర్త సుందరాంగి, అయిన నిరహంకారం గానే (ఆయా సందర్భాలలో అహాంకారిగా దోచినా పరిస్థితుల ప్రభావమని తెలిస్తే చాలు) జీవించినది. ఈ పత్రచేత యెన్నో లోక ధర్మాలు ప్రవచించబడినాయి. ఈమెలోని భగవద్భక్తి, పతిభక్తి కొనయాడదగినవి. “కార్యేషు దాసీ …” అనే మాటలు ఈమె అక్షరాల ఆచరణలో చూపిన వనితామణి. ధూర్త లక్షణాలు కలిగిన తన భర్తను సన్మార్గగామిగ చూడడానికి ఎంతో ప్రయత్నించినది. సమయం దొరికినదే తడువుగా తన పతికి హితోపదేశం చేయగలిగిన ఉపదేష్ట. ఈ విషయంలో ఆమె అడుగడుగున అతనికి నచ్చచెప్పే ప్రయత్నం చూస్తే ఆమె అకుంఠిత దీక్షాపరురాలని భావించకతప్పదు.

ఇంద్రజిత్తుని తల్లిగా, రావణుని భార్యగా తన పాత్రను నిర్వహించిన తీరు మిక్కిలి ప్రశంసాపాత్రం. ఎన్నెన్నో ఎనలేని వైభవాలున్నా కట్టుకున్న వాడి గుణశీలాల వలన నిరంతరం ఈమెవలె క్షోభపడే స్త్రీలెందరో వున్నారు. నేటికి స్త్రీల చరిత్రలో యివే బాధలు అనుభవిస్తూ చావలేక బ్రతుకుతూ నిట్టూర్పులతో జీవితాలను ఈడ్చుకుంటూ బ్రతికే మహిళలు నేటి సమాజంలో లెక్కకు మిక్కిలి. నాటికి నేటికి సృష్టిలో బతికేతీరె అది. ఆ బుద్ధులలో మార్పెన్నటికో మరి! అలాంటి మహానుభావులకు భార్యలై జీవితాంతం కుమిలిపోయే స్త్రీలు ఎందరో ఉన్నారు నేటి సమాజంలో కూడ. తరాలు మారినా ఈ వ్యవస్థ స్త్రీలపట్ల మార్పులేనిది అంటే విడ్డూరంగాదు. ధూర్తుడైన భర్తకు భార్యయై జీవితాంతం మానసికంగ కుములుతూ, ఆనందానికి నోచుకోని వారు వ్యధలను అనుభవించే స్త్రీలు మూగజీవాలుగా వేదన భరించే స్త్రీమూర్తులు భరిస్తున్న స్త్రీలు ఉత్తమ ఇల్లాళ్లెందరో ఈ ఉర్విలో.

సౌందర్యాతిశయరేఖతో ఒప్పుచూగూడ కట్టుకున్న వాడికి గల దౌర్భాగ్యపు లక్షణాలను, స్త్రీ లోలతను తొలగింప ప్రయత్నించి విఫలులై ఆసాంతం కుమిలి కృశించి చివరకు భర్త చేష్టలకు బలి అవుతున్న వాళ్లెందరో నేటికి మౌనంగా విలపిస్తూనే ఉన్నరు. ఆస్తులు, అంతస్థులు భోగభాగ్యాలెన్నివున్నా స్త్రీ జీవితానికి నిజమైన ఆభరణం ఉత్తమ గుణసంపదలు గల భర్త లభించడం. మగువ సౌభాగ్యానికి ప్రథమ కారణం అతని మానసిక సౌందర్యమేగాని ఐశ్వర్య గరిమ తెలియచెప్పే ఆటోపంగాదు. అలాగాక ఎంత గొప్పవాడైనా గుణహీనుడైన భర్త లభించిన కాంతలకు మిగిలే చింతలు రగిలే వంతలు తప్ప ఇసుమంతమైన సుఖం దక్కదు మరి. సందర్భం దొరికినప్పుడు ఎంతోకొంత ఉపదేశం చేసినా కాంతుని వల్ల చివరకు మిగిలే వేదనాగ్నిలో నిలువునా దహించే పతివ్రతలందరకు మండోదరియే ప్రతీక అనవచ్చును. అందగత్తెను చూచి రావణుడు వరించడంలో విశేషమేమున్నది. అతగాడిని ఆమెకూడ వరించే విధంగా తండ్రి భావించి లాంచనప్రాయంగా వివాహం చేస్తాడు. బుద్ధిలోపాలన్నీ నిదానంగా తెలిసి కుమిలి కుమిలి ఏడ్చిన సాధ్వీమణి మండోదరి. ఇంద్రజిత్తు వంటి వీరునకు తల్లియై కొంత ఊరట చెందుతుంది. ఇలా పెండ్లిండ్ల తర్వాత దుఃఖభాజనమైన జీవితంలో సంతానం పొందిన తర్వాత స్త్రీ కొంత ఊరటపడుతుంది. తన బిడ్డల లాలనతో జీవితాన్ని ముందుకు సాగించుతుంది. ఇది చాల నిసర్గమైన విషయం. అలాగే ఈమెకూడ, చివరకు ఆమెకు ఆ తృప్తికూడ మిగుల లేదు. వీరపత్ని, వీరమాత అయిన మండోదరి మహారాజ్ఞి, మహాజ్ఞాని, ధీశాలిని, భక్తి ప్రపత్తులు గల పూతచరిత.

మొట్టమొదటసారిగ మండోదరి మనకు సుందరకాండలో పరిచయం అవుతుంది. రామాజ్ఞావర్తనుడైన హనుమ సీతాన్వేషణ సాగించాడు. లంకను చేరిన హనుమ సీతకై అంతఃపురాన్ని పట్టణ మారుమూల ప్రాంతాలన్నీ గాలించడం ప్రారంభించాడు. ఆ సందర్భంలో అంతఃపురాన్ని పరిశీలించినప్పుడు అక్కడ సురుచిర సుందరమూర్తిని చూచి సీతగా భావిస్తాడు. తర్వాత పునఃపరశీలించుకుని నాతల్లి సీతమ్మగాదు ఈమె రావణుని యిల్లాలు మండోదరి అయివుంటుందని, తన భావన తప్పని నిర్ధారించుకుంటాడు. ఇక్కడ కవి అలా పలికించడంలో విశేషమున్నది. అచ్చు సీతమ్మ వంటి అందగత్తె అయిన రావణుని భార్య మండోదరియని తెలియచెప్పడమే కావచ్చు. ఇద్దరికి అందంలో అంత అభేదకత్వం ఉన్నదన్నమాట మహాకవుల కావ్య విన్యాసాలు ఇలాంటి అభేదకత్వాన్ని భాసింపచేసినా వైవిధ్యంతో కూడిన విలక్షణత ఆయాపాత్రల సృష్టిలో నిరూపించుకున్నారు. మయుని పుత్రియై మహేంద్రాదుల జయించిన రావణుని సతియైన మండోదరి జీవితంలో ఐశ్వర్య సుఖాలతో తలతూగినదని ఈ క్రింది మాటలు వివరిస్తున్నాయి.

“సురుచిర రత్నహార పరిశొభితయై ఘన హేమ వర్ణమై

……. ………. …………. ………. ……..

.. రావణుని పత్నిని గౌరినిగాంచె నత్తరిన్” (గో.రా.సుం.296 ప)

ఆకస్మికంగా తన అన్వేషణలో ఆమె సీతలా భాసించినది. ఎంత అందగత్తె అయిన భార్య లభించినా దురంత చింతనాలు గలవాడి బుద్ధి పరభామాన్వేషణలోనే ఉంటుందనడనికి రావణుడే నిదర్శనం. యుగాంతం వరకు ఇలాంటి హీనపురుషులుంటూనే వుంటారు. హేమ భూషణాలన్నీ స్వర్ణకాంతులీనే ఆమె శరీర సౌందర్యాన్ని ఇనుమడింపచేసినవట.

“చలువలుగట్టి హారములు చక్కగ దాల్చి సుగంధి చందనం
బలిది ప్రసూనముల్కబరి యందు ఘటించి మదంబు గ్రోలి, త
మ్ముల మొనరించి కన్నుగవమోద్చి …”

అనే మాటలు ఆమె నిత్య నైమిత్తిక విషయాలు, ఇష్టార్ధాలు, అలవాట్లు తెలియ చేస్తున్నాయి. ఐశ్వర్యోపేత అయిన ఆమె సహజాలంకరణ, కోరికలతో కూడిన చిత్తవృత్తి చక్కగా పరిచయమవుతుంది. స్త్రీల స్వభావ సిద్ధమైన ఆలోచనలకు తార్కాణం. తర్వాత మరల యుద్ధకాండలోనే మండోదరి కావ్యప్రవేశం జరిగినది. అంటే పాఠకులకు ఆమె స్వభావచిత్రణ పరిచయం అవుతుంది.

రావణుడు యుద్ధ భూమిలో రాముని చేతిలో దెబ్బలు తినివచ్చి తన భార్య మండోదరి దగ్గర విలపించిన ఘట్టమది. సీతా స్వయంవరవేళ తేలిక భావంతో శ్రీరాముణ్ణి శివధనుర్భంగాన్ని ఈసడించిన రావణుడు నేడు భార్యదగ్గరచేరి యుద్ధ రంగాన్ని వర్ణిస్తూ శ్రీరాముని శౌర్య ప్రతాపాలన్నీ విన్నవించడం నిసర్గ సుందరంగా వున్నది. భార్యతో చర్చించి తాను శివుని గూర్చి హోమం చేయడానికి శివాలయానికి వెళ్లి మంత్రవిదులగు బ్రహ్మ రాక్షసులను కాపుంచి హోమం చేస్తుంటాడు. పాతాళ హోమంగా ఇక్కడ చెప్పలేదు. అప్పుడు అక్కడకు మండోదరి వచ్చి అనేక నీతులు భర్తకు ఉపదేశం చేస్తుంది. ఆయన చేస్తున్న హోమం ఆ సమయానికి తగినది కాదని ఖండించినది.

“ధనుజేంద్ర యుట్లేల మునివృత్తి దాల్చెదు
నేతబౌరుష భంగంబు సేయదగునే ….”

ఇక్కడ కరణేషు మంత్రి”యైనది ఆ యిల్లాలు. తన భర్త సమరాంగణంనుంచి వచ్చి పిరికిదనంతో దైవబలాన్ని అర్థిస్తున్నడని తెలుసుకున్నది. ఆ సమయంలో రావణుని ప్రోత్సహిస్తూ పలికిన పలుకులు ఆ సతీమతల్లి హృదయంలోని భావాలకు రూపందాల్చినవి. తనభర్తకు కర్తవ్యోపదేశాన్ని చేసిన వీరనారీమణి. రణ భీరువుగా కనిపించే రావణునితో అతని శౌర్య ప్రతాపాలన్నింటిని వివరించినది. చతురంగ బలాన్ని గూర్చి సూచించినది. పూర్వం యుద్ధరంగంలో తన భర్త ఆర్జించుక్కున్న విజయాన్ని గమనింపచేసినది. శత్రుభంజనం చేయవలసిన నీవిట్లేల పౌరుష భంగానికి పూనుకొన్నావని అతని కర్తవ్యాన్ని గుర్తుచేసినది. మన ఖడ్గతిక్కన భార్యకు తల్లికి మార్గదర్శినియా మండోదరి అని తలంచక తప్పదు. ఇంత పిరికితనం గల వాడివి మైథిలిని కొనిరావడం దేనికి? శ్రీరామునితో అకారణంగా వైరం దేనికి? ఇంతగా పీకల మీదకు తెచ్చుకోవడం దేనికి? నిష్ఠూరాలాడుతూ పతికి ధైర్యాన్ని అందించిన ఉత్తమ యిల్లాలు. పతిశౌర్య ప్రతాపాలను ప్రశంసించినా వ్యాజస్తుతిగానే చిన్న చిన్న చురకలనంటించినది.కర్తవ్య ప్రభోధంగదా! ఆనాడే ఈ బుద్ధి నీకుంటే బాగుండేదని ఆమె లాలన. అకారణంగ వైరం దేనికి? అనడం వల్ల రాజనీతి మర్యాదలు కూడ బాగుగ తెలిసినదిగా చెప్పవచ్చును, తన భర్త అప్రతిష్ఠపాలు కాకూడదనే తపన కులాంగనకు ఉండడం సహజం. అందుకే ఈ ధీర గంభీర వాక్కులు.

శ్రీరాముడు మానవ మాత్రుడు మాత్రంగాదని తెలిసిన మహా విజ్ఞానఖని. ఖరదూషణాదులను పద్నాలుగువేల రాక్షగణాన్ని సంహారం చేసిన రాముని దోర్బల శక్తిని తెలియలేవా? జగత్రయాన్ని ఒక్కకోలనె భస్మం చేస్తాడు అని భర్తకు సూచించినా తన భర్త ప్రతాపోన్నతుల మీద అపారమైన విశ్వాసం కలిగిన స్వాభిమాని. వెంటనే రావణుడు తాను పూనుకొనిన పనికి సిగ్గుపడి హోమం చాలించి ఆమెతో కలసి అంతఃపురానికి చేరాడు. ఆమెలోని మృదుభాషిత్వం, సమయ స్ఫూర్తి, మాటనేర్పు పై విషయాల వలన తెలియవస్తున్నవి. తన భర్త అవమానం పాలు కాకుండ జాగ్రత్తపడి రక్షించుకున్నది. రాక్షసేంద్రుని బింకం సడలకుండా చూచినది. యుద్ధోన్ముఖుని చేసి విజయమో! వీర స్వర్గమో! వీరుని లక్షణమని హెచ్చరించిన సులక్షణ సంపన్న. ఈ సతి మాంచాలకు మార్గదర్శిని.అనవచ్చు.

ఆ తర్వాత తమ కులగురువు శుక్రాచార్యుని ఆదేశం ప్రకారం రావణుడు పాతాళ హోమం ప్రారంభించాడు. ఆ సమయంలో మండోదరిని అంగదుడు జుట్టుపట్టి ఈడ్చుకుని రావణుని దగ్గరకు తీసుకువెళతాడు. అలా చేయడానికి ప్రధాన కారణం రావణుని దీక్షను భంగపరచడం. ఆ హోమం పూర్తిచేస్తే అతడు అమేయ పరాక్రమశాలి అవుతాడు. అందుకు నిరపరాధియైన మండోదరిని పాచికగా వాడుకున్నారు శత్రువులు. తన భర్త చేసిన అపరాధానికి నిరపరాధియైన మండోదరి అవమానంపాలైనది. ఈ సన్నివేశాన్ని గోపీనాథ వేంకటకవి కన్నుల కట్టించినాడు. వేడి నిట్టూర్పులతో “రాకాబ్జ నిర్గళత్ర్పాలేయ కణాల వంటి అశ్రుకణాలు జాలువార్చినది”. లలితమైన అధరోష్ఠపల్లవం కందిపోయి భానుకాంతిచేత కబళితమైన శశిమండలంవోలె వివర్ణమైన ముఖం గలదట కరపల్లవోష్ణతకే కమలిన కపోలం గలదియైన మండోదరిని కవి వర్ణించాడు. సడలిన జడలతో తూలుతూ పెనుగాలి వేగానికి కంపనమొందే తీగవలెనున్నదట. ఇచ్చట కవి రావణపత్ని యొక్క సౌకుమార్యమైన సౌందర్యాన్ని చక్కగా నిరూపించాడు. ఈ స్థితిని బట్టి ధూర్తుడైన భర్తను పొందిన భార్యకు ఎదురయ్యే అవమాన భారం ఎలాంటిదో చెప్పకనే చెప్పాడు కవి. ఇప్పుడు కులీన అయిన ఆమె అభిజాత్యం దెబ్బతిన్నది. ఇక సైరించలేకపోయినది. క్రోధోన్మత్తయైనది. రాజసం ఉట్టిపడినది. రావణుడు చేసిన పాప ఫలితాలు తనకు అనుభవానికి రావడం తను చేసుకున్న కర్మ ఫలంగాయెంచి దుఃఖించినది. రోషాయితమూర్తియై మరల ఆమె భర్తతో ఇలా అంటున్నది. సీతను రావణుడు, ద్రౌపదిని దుశ్శాసనుడు అలాగే అంగదుడు మండోదరిని పట్టినప్పుడు సడలిన కురులు గల ఈ స్త్రీలు ముగ్గురు ప్రతీకారవాంఛాబద్ధులైన వీరవనితలు.

“అలఘ చరిత్ర నంచితగుణాఢ్యను సాధ్విని రాజ పుత్రి ..
కలన వధంబు గల్గునని కాంతలతో ననుదాని వెండియలణ్” (గో.రా.యు.కాం.2561 ప)

తన భర్త శ్రేయస్సు కాంక్షించి ముందే హితముపదేశించిన మహాయిల్లాలు చతురూపాయ శాలిని అయినందుననే శ్రుతిమించిన ఆగడానికి తగిన శిక్ష అనుభవించాలనే న్యాయ నిర్ణేత, పాపభీతి గలది. ప్రతిఫలాన్ని కర్త అనుభవింపక తప్పదను నీతిని వివరించిన సుచరిత. దోషకారికి శిక్ష తప్పదనే భావం తెలిసిన మేధావి. యుద్ధంలో కుంభకర్ణుడు, ప్రహస్తుడు మరణించినా శ్రీరాముని శక్తిని గమనించని పరమమూర్ఖుడు తన భర్త. అందరిని చంపుకుని అటుపై రాజ్యం ప్రాప్తించినా ఫలితం ఏమున్నదని విలపించినది. తన దురవస్థకు మిక్కిలి చింతపడినది. సీతామహాసాధ్వివలె మండోదరి కూడ పరులను నిందించదు. తన దురవస్థకు దైవవైపరీత్యమనే భావించినది. కర్మ సిద్ధాంతం తలిసిన ఇంగిత జ్ఞాని. అప్పటిదాక యుద్ధభూమిలో రామునిచేత చంపబడిన దానవవీరులను, రామలక్ష్మణుల శక్తియుక్తులను, కపిసేనల సహకారాలను తెలిసికొనిన మండోదరి తన భర్తకు పరాభవం తప్పదని భావించి విలపించినది. “రామభద్రుని నెదిరించి రణంలోన జయముచేకొన రాక్షససత్తమునకు వశమె” అని ముందే పసిగట్టిన దూరదృష్టి గలది.

అంగదునిచే గ్రహింపబడిన కబరీభరం గల మండోదరి ఔన్నత్యాన్ని ఈ క్రింది మాటలలో దీవింపజేశాడు వేంకటకవి. తారను చేరిన మహోపగ్రహంలా వున్నాడట అంగదుడు. నూతన లతను సమీపించిన మహావాతంబు మాదిరి, గజాంగనను పొదపు సింహకిశోరం మాదిరి, మృగాంగను కవియు శార్దూలపోతం వలె మత్తశుండాలం తుండంతో పట్టిన శైవాల పుంజంవలె ఉన్నదట మండోదరి (గో.రా.యు.కాం.వ. 2565). ఆమె అభిజాత్యాన్ని సుకుమారం అయిన అందాన్ని వర్ణించిన తీరు, ఉపమించిన వస్తువులు సందర్భోచింగా ఉన్నాయి. ధర్మయుతంగా మాట్లాడవలసినప్పుడు ఆమె తన భర్తయని జాలిగాని మరే విధమైన అభిమానంగాని చూపదు. ఆమెకు తన తప్పులను పరిశీలించుకునే గుణం చాలా ఉన్నది. లోకంలో అందరు ఎదుటి వాళ్ళ గుణగణాలనే పరిశీలిస్తుంటారు కాని మంచితనానికి మారుపేరులైన వ్యక్తులు ముందుగా తమనే పరిశీలించుకుంటారు.

అంగదుడు తనను పరాభవించి తెచ్చినది గాక, పరుషాలాడినా, భర్త చలించని తీరుని చూడగానే ఆమెలోని కోపాగ్ని రగుల్కొన్నది. కఠిన చిత్తయై కఱకు మాటలాడుతుంది. పతిని మ్రుచ్చలించి జానకిని తెచ్చావు. ఇంతమంది వనజుల యెదుట చివరకు నీ యెదుటనే నన్ను పరాభవిస్తూ అంగదుడు పలికిన మాటలు వినలేదా? సిగ్గు, వివేకం, కోపం నీకు పుట్టవెందుకో ? అని భర్తను గర్హించినది రోషాయుత్త చిత్తయైన మండోదరి. స్త్రీ సహజచిత్త వృత్తిని నిసర్గ రమణీయంగా వర్ణించాడీకవి సాధారణంగా పుత్రవంతులైన తర్వాత స్త్రీలు తమకు కలిగిన కష్టాలు, కన్నీళ్లు పుత్రుని ద్వారా తీరిపోతాయని ఆశతో ఉంటారు. కాని ఇక్కడ మండోదరికి ఆయాశకూడ నెరవేర లేదు. నీకుమారుడు ఇంద్రజిత్తు జీవించి వుంటే ఈనాడు ఈ వానరుడునన్నిట్లు సాహసంతో పరాభవించగలడా? యని వితర్కించినది. మాతృహృదయంలోని మధుర భావాలిలావుంటాయి. నేటి కాలంలో అలా తలపోయడానికి కూడ చాలని సంతానం ఎందరోవున్నారు. స్త్రీలు తమ భర్తవలన కలిగిన బాధల్లన్నిటిని సహనంతో భరించడానికి కారణం తమ సంతానం మీదగల అభిమానమే. తమ సంతానం వలన తాము ఆశించినంత ఆనందం పొందినా, పొందకున్నా సహజంగా స్త్రీ మాతృహృదయం అలానే భావిస్తుంది. ఒక్క సీతమ్మ తల్లి మాత్రం భర్తవలన కలిగే సుఖసౌఖ్యాలు మరింకెవరి వలన పొందలేరు స్త్రీలని భావించినది. మండోదరి, ఒక సాధారణ స్త్రీ చిత్తవృత్తి ఎలాంటిదో తన మాటలద్వారా నిరూపించినది. అగ్రసుతుని మరణానికి కారకుడై పుత్రశోకాన్ని అందించినది చాలక ఒక వానరుడు చేతిలో పరాభవం పొందడానికి కూడ తన భర్త కారకుడైనాడని అందుకే ఆమె హృదయం ఆక్రోశించినది.

మూర్ఖత్వంతో అహంతో ప్రవర్తించే తన పతికి దండోపాయంతోనైనా బుద్ధి గరపాలని చివరిసారిగా ప్రయత్నించిందా యిల్లాలు. వాసవతుల్యుడైన రాఘవుని భార్యను మిక్కిలి ఆనందంగా దొంగిలించి తెచ్చావు. లంకకే చేటు మూడుతుందనే ఆలోచన లేనివాడవు. పాపకృత్యం ఫలితం ఈయకుంటుందే. స్వయం కృతాపరాధం నిన్ను అధోగతిపాలు చేసి తీరుతుంది. వినాశకాలం విపరీత బుద్ధికి దారి చూపినట్లు కార్యాకార్యవిచక్షణ లేనివారై హితవాక్యం వినక స్వేచ్చావృత్తితో ప్రవర్తించే వాళ్ళ కెవరికైనా చేటు తప్పదని పలికినది. రావణా! సీత నీపాలిట కాళరాత్రి అని తెలుసుకో అని భర్తను హెచ్చరించినది. వేంకటకవి ఈమెచేత లోకధర్మాలను చెప్పించాడు. సమయస్ఫూర్తి, సందర్భశుద్ధి కలిగిన ఈమె పలికిన ప్రతి పలుకు ఆమెను విజ్ఞాన మూర్తిగా నిరూపించాయి. పరాక్రమాధికులైన దానవవీరులు అనేకులు చచ్చిరి. ఇప్పుడు నువ్వొక్కడివి చిక్కి రాముని జయింపగలననుట నీ వెర్రితనం. సీతను గొనివచ్చి కాలపాశాన్ని కంఠానికి తగిలించుకున్నావు. నిన్నెవ్వరూ రక్షించలేరనుచు సామ వచనాలతో హెచ్చరించినది. కాని ఆమె అంతరాంతరాళాలో తొలినాటి నుంచి నేటివరకు తన భర్తవలన కలిగిన అనర్ధాలన్నీ ఒక్కసారి ఆమెను అవహేళన చేసినవో అన్నట్లు క్రోధోన్నతయై గర్హించినది. ఒక్కొక్క మాట వజ్రాయుధపు దెబ్బలా రావణుని శరీరాన్ని ఖండఖండాలుగ చేయగలిగినంత వాడియైనది. మొండితనంతో కూడిన మూర్ఖునిగా తోచిన భర్తను చివరకు శిక్షార్హుణ్ణి చేయడానికే ఆ ఉత్తమ యిల్లాలు అరాటపడినది, లోకకంటకుడైనా భరించినది. కుల స్త్రీలను భంగపరచడానికి యత్నించిన వాడై హితవాక్కులు వినని జడుడై, కామాంధకారంతో కళ్లుమూసుకుని ప్రవర్తించిన తన భర్తకు ప్రతీకార ఫలితం అంది నశించాల్సినదేననే తుది నిర్ణయానికి వచ్చినదామె ఆలోచన.

భర్మపరాయణైక బుద్ధిగల మండోదరి తన భర్తలోని అధర్మాన్నంతా ఈసడించినది. వీరుడై రణరంగంలో పోరుసల్పి చివరకు వీరస్వర్గాన్ని అలంకరించినా తనకు కొంత తృప్తి కలుగుతుందని భావించినది. అదీగాక శౌర్యధనుడైన తన భర్త నికృష్టంగా చావడం, అవమానం పాలుకావడం ఊహించలేకపోతుంది. వీరస్వర్గాన్ని అందుకుంటాడనే ఆశతోనే రాముణ్ణి ఎదిరించి జయించు లేదా అతని చేతిలో నువ్వు మరణించు అని రావణునితో సూటిగా పలికినదా వీరపత్ని. చిచ్చు ఒడికట్టుకున్న వాడికి మేలు కలుగుతుందా ? సీతను తెచ్చిననాడే నీకు చేటు మూడినదని భావించితిని. రాముణ్ణి జయించడమో రణరంగంలో చావడమో తప్ప నీకు వేరు మార్గం లేదన్నది. నీ మంత్ర తంత్ర విద్యలపై ఆశవిడిచి నిజస్థితికిరా, నీ అహాన్ని విడిచిపెట్టుమని ఆ సాధ్వీమణి చెవినిల్లుపెట్టి పోరినది. తన భర్తకు జ్ఞానోపదేశం చేస్తున్న పరేంగితజ్ఞాని, కరణేషుమంత్రి. ఈమె పవిత్ర భావాలు గలది. ఈటెలవంటి మాటల పోటులతో ఆ మత్తగజాన్ని అదలించి, కదన రంగానికి కదిలించి అతనిలోని వీరత్వాన్ని ప్రదీప్తం చేయదలచినది. అందుకే నిరుత్సాహంతో పిరికితనంతో దైవప్రార్ధనలు చేసే సమయం కాదని మందలించినది.

ఆమెలోని అభిజాత్యం చాల గొప్పది. తన భర్తలోని శౌరగ్నిని రగుల్కొల్పడమే పరస్తుతకర్తవ్యంగా భావించినది, కర్తవ్య కఠినగా ప్రవర్తించినది. ఉత్త్మౌరాలైన యిల్లాలి కృషి యిలావుంటుంది. సామదానభేద దండోపాయాలతో బుద్ధి గరపాలని చూచి చివరకు దండోపాయానికే మొగ్గుచూపుతుంది. త్రిలోకాలను జయించిన అతని దోర్బల శక్తిని ఒకసారి గమనింపజేసినది. ముఖ్యంగా ఆక్షణంలో మరొక కాంక్షకొడ ఉన్నది. రాక్షసేంద్రుని ఎదుట తననలా కొప్పుపట్టి ఈడ్చిన వానరుడిపై పొగసాధింపదలచినది. స్త్రీని అవమానించినవాడిని క్షమించరాదనే తీవ్రబుద్ధి ఆమెకు గలదు. ప్రతీకార వాంచాలంపటమైన మనసులో కోపంతో కూడిన అగ్ని రగుల్కొన్నది. మునిఋత్తితో హోమాదులు చేసి రాముని జయించదలచుట నీవల్లగాదు. మంత్ర తంత్రాలు మాయలు మానుకుని కార్యోన్మఖుడువు కావలసినదని తీవ్రబుద్ధితో మేల్కొలిపినది.

“రణమున కీవు పోయి రఘురాముని ముంగలగొంతసేపుమా

….. ….. …….. …… …… …… ….

గుణమది గల్గి రామునకు గొబ్బున జానకి నిమ్మధీశరా …” (గో.రా.యు.కాం.ప 2582)

అని పలికి జానకినిచ్చి ప్రాణాలు దక్కించుకోమంటుంది. రాక్షసేంద్రుని ***** ప్రకటించి తప్పులు అంగీకరించి క్షమాభిక్ష వేదికొని శరణాగతి పొందేటట్లు చేయాలనే తపన కనబరిచినది. తన మాంగల్యాన్ని కాపాడుకోవాలని ఏ సతికి ఉండదు? అలాంటి ప్రయత్నం మయుని పుత్రిక చేస్తున్నది. పతినెదిరించినట్లు పాఠకులకు తోచినా అవి ఉపదేశాత్మకమైన పవిత్ర భావాలు. రాక్షసేంద్రుని తూలనాడడం గాదది భర్తతో గక చనువుతో అతని మార్గాన్ని మరలించి మరణహేతువు కాకుండ చేయాలనే సదుద్దేశం. ధీరగా పతినెదిర్చి మాట్లాడినది. శ్రుతిమించిన తన దౌర్భాగ్యానికి తల్లడమందిన స్త్రీ సహజ చిత్తవృత్తిని చక్కగా సృష్టించాడీ కవివరేణ్యుడు. ఆమె ఎందుకలా ప్రవర్తించినదో ఒక్క మాటలో నిరూపించాడు. “శొక, రోష, భయ, లజ్జా, పరాభవ కలిత”యైన మండోదరి మనస్తత్వ నిరూపణ చేసాడు. ఆమె ఉద్దేశ్యం భర్తను ధిక్కరించడం గాదు, యుద్ధోన్ముఖుణ్ణి చేసి తత్ఫలితాన్ని అందజేయడం. అందుకే అంత కాఠిన్యం ఆ మాటలకు. భర్యగా ఆమె కర్తవ్యం. మహర్షి వాల్మీకి పురుషుడేగదా! స్త్రీ పాత్రలతో చాలమంది చేత పురుషధిక్కారం చేయించాడు? ఎందుకు? అంటే అధర్మం ఎక్కడ తలయెత్తితే అక్కడక్కడంతా ఈ ధిక్కారాన్ని అందించాడు. ఆ మహర్షి దృష్టిలో స్త్రీలు, పురుషులు, బాలలు, వృద్ధులు తరతమ అనే భేదాలకు తావులేదు. ఏది దురాచారమో, నీతిబాహ్యమో, ధర్మవిదూరమో అక్కడే దానిని త్రుంచి వేయించడం ఆయన ప్రధమకర్తవ్యంగా రామకథా ప్రవచనం సాగించాడు అనడం విడ్డూరంగాదేమో! వాల్మీకిని అనుసరించిన గాథలే గదా ఇవన్నీ!

వాల్మీకి ఋషి స్త్రీ పురుషుల మధ్య న్యూనాధిక్యతలు ఏర్పాటు చేయలేదు. ఆయన దృష్టి ఇద్దరికి సమానత్వం చాటిచెప్పడమే, ధర్మనీతి వర్తనాలలో ఆయనకిద్దరూ సమానులే. ఒకరివలన మరొకరు జీవితసౌధ నిర్మాణంలో సహకరించాలనందే దాంపత్యం యొక్క రహస్యం అని తన కావ్యపాత్రల ద్వారా నిరూపించాడు. మండోదరి మాటలకెంత పదునో చూడండి. యోగివలె హోమం చేసే రావణుడు ఒక్కసారి విజృంభించాడు. అంగదాది వీరులతో రోష భీషణ కసాయీధిదీతులతో అగ్నికణాలవలె జ్వలిస్తున్న చూపులు కలవాడై సమరం సాగించాడు.

అంతఃపురం చేరి మండోదరితో రావణుడు పలికిన పలుకులు అప్పటి ఆమె వాజ్ఞైపుణ్యం ఎంత నిశితమైనదో చాటుతున్నాయి. రావణునిలో తిష్టవేసిన ఆనాటి పిరికితనం లేదిప్పుడు. తాను వెంటనే వెళ్లి శ్రీరామునెదిరిస్తానంటాడు. ఎప్పటికైన జీవులు మరణించక తప్పదు, కాబట్టి ఇప్పుడే రణభూమికి వెళ్లి శ్రీరాముణ్ణి ఎదిరిస్తానంటాడు. వానరులను వధిస్తానని ధీరంగా నిలచి మండోదరి దుఃఖాన్ని ఉపశమింపచేస్తాడు. రాముణ్ణి చంపడమో లేక అలఘ చరిత్రుడైన రాముని బాణతతిచే చచ్చుటయో వేరొండు చేయనని ప్రియభార్యను బుజ్జగిస్తాడు. కాని ఆమె ధిక్కరించినదనే ఆగ్రహమే చేయలేదు పల్లెత్తుమాట అనలేదు. తనలోని ధీరత్వాన్ని మేల్కొలిపిన భార్యను మన్నించాడు. అయితే రావణుని అభిజాత్యానికి సీతను తిరిగి ఈయడమా? ఇది తగునా? ఇంకా ఆ సతిపై గల ఆశలేక, కక్షకొద్దీ తాను యూద్ధంలో మరణిస్తే సీతను చంపి మండోదరిని అగ్నిప్రవేశం చేయమని ఆజ్ఞాపించాడు. తన మగనికి సీతపై ద్వేషం తీరనిదని అతని వీరాలాపాలు విన్నది. మరొక్కసారి శ్రీరముని గుణగణాలను వర్ణనం చేయించాడు కవి. (గో.రా.యు.కాం.2583, 84 పద్యాలు).

తన భర్తలోని తీవ్రబుద్ధికి, భవిష్యం తెలిసి మిక్కిలి దుఃఖించినది. వీరోత్తమా! నువ్వు శ్రీరాముణ్ణి సమరంలో జయింపజాలవు. దిగంత వ్యాప్త తేజోమూర్తియైన శ్రీరాముని ప్రచండ స్ఫారవీర్యోన్నతిని నీకెన్ని సామర్ధ్యాలున్నా ఎదిరించలేవని సూచించినది. రాముని దివ్య తేజాన్ని తెలియజెప్పి మానవమాత్రుడుగాదని తెలుసుకోమన్నది. నీదుండగాలకు భీతిల్లిన సురముని గణార్ధితుడైన మాధవుడు దుష్టరాక్షస సంహారార్ధం మర్త్యుడై జన్మించాడు. వాలిని తుంచుట, వారధి కట్టుట, మానవ మాత్రునికి చేతగానిది. తాటకిని చంపడం, కౌశికయాగ సంరక్షణ చేయడం, శివధనుర్భంగం చేయడం, భార్గవ రాముణ్ణి ఎదిరించడం చూచినచో శ్రీరాముడు మానవుడని భావించడం నీ అవివేకం అని సూటిగ చెప్పినది. జగదేకవీరుడు, అహీనసత్తుడు, అమిత తేజోబల సంపన్నుడైన శ్రీరాముణ్ణి జయింప శక్యంగాదు. మత్స్యవతారది వివిధరూపాల్లో లోక కంటకుల వధార్ధమై భువిలో పుట్టిన నారాయణుడు దేవతాతతికి మేలు చేయడానికి, నిన్ను సంహరించడానికి రాముడై పుట్టిన పరంధాముడితడు. సంగ్రామంలో నీకు రాముని చేతిలో మరణం తప్పదని రావణునికి వివరించిన పుణ్యసాధ్వి, జ్ఞాని. భగవంతుని భక్తాగ్రగణ్య సాధుస్వభావ శ్రీరాముని అవతారతత్వాన్ని గుర్తెరిగిన మండోదరి సామాన్యగాదు. మాన్య రాముని పరమార్ధాన్ని వివరించిన ధీర. కవి ఈ కాండలో రామావతార తత్వ రహస్యాన్ని ఈ సాధ్విచేత వెల్లడి చేయించాడు. శ్రీమద్రామాయణంలో (వాల్మీకి) రాముణ్ణి ప్రారంభం నుంచి మానవ మాత్రుడిగానే వర్ణించడం జరిగినది. ఈ సన్నివేశంలో మాత్రం సాక్షాతు శ్రీమన్నారాయణుడేనని నిరూపణ చేయించాడు. అయోనిజయైన మండోదరి ధర్మాధర్మాలను వాటి ఫలితాలను వివరించి ఎంతవారలకైనా అందుబాటులోకి వస్తాయని తేల్చి చెప్పినది.(యు.కా.ప్.2586 – 2592).

తన మరణానంతరం సహగమనం చేయమని రావణుడు మండోదరిని కోరాడు. అందుకు ఆమె చింతించి తనకాభాగ్యం, అవకాశం లేదని విలపించినది. చిన్ననాడు తన తండ్రి తనకు జరామరణాలు లేని వరమిచ్చాడని పలికినది. భర్తకు దూరమై జ్ఞాతులకు దాస్యంచేసే కర్మ పట్టినదని, ఎంతవారికైన పూర్వకర్మం అనుభవింపక తప్పదని పలికి బాధపడినది. మండోదరి శమదమాలకు ప్రతీక. పతివియోగాన్ని తలచి భరింపరాని దుఃఖపీడితురాలై దీనాతిదీనంగా విలపించినది. శోకోద్విగ్నమానసయై పతిని కౌగలించి అశ్రుకణాలతో అతనిని అభిషిక్తుని చేసిన సాధ్వీలలామ. పతిపరాయణయై దూరంగా జీవించిన మధురహృదయ మండోదరి పత్నిగ తన కర్తవ్యలోపం లేకుండ ప్రతికి తననాథుని ఔన్నత్యానికి సహకరించిన సుగుణాలరాశి. రాజనీతి మర్యాదలు తెలిసి యుక్తాయుక్త ధర్మవిచారణ చేయగల స్ఫురద్రూపి.(గో.రా.యు.కాం.వ-2596)

తన భర్త రావణుని శౌర్యధనాన్ని భద్రంగా కాపాడేయత్నం చేసినదే గాని, అతని ధూర్త లక్షణాలను నిరుపించడానికి కాదు. కులస్త్రీల చెఱపట్టి చావుకొనితెచ్చుకున్నాడని భర్తను అనునయింపచూచిన పుణ్యమూర్తి. రావణుడు మండోదరితో సంభాషించే సమయంలో శ్రీమద్రామయణ పరమార్ధాన్ని ఇమిడ్చాడు కవి. భార్యకు తనలోని గొప్పదన్నాని చాటిచెప్పుకుంటాడు రామాయణ పరమార్ధాన్ని మరొక్కసారి రావణునిచే పలికించాడు కవి. భార్యకు తనలోని లోపాలన్నీ చెప్పుకుంటాడు. అంత గొప్పవాడైన రాక్షసేంద్రుడు కూడ. తాను సర్వస్వాన్ని యుద్ధభూమిలో కోల్పోయానని అంతా పోయిన తర్వాత రజ్యసుఖాలు ఎవ్వరికోసం? జ్యేష్ఠపుత్రుణ్ణికూడ పోగొట్టుకుని బ్రతుకుట దేనికని యుద్ధభూమిలో మరణమో, విజయమో అదే తుది నిర్ణయమని పలికాడు. తన దుశ్చరితలన్ని వర్ణించి పశ్చాతాప్తుడౌతాడు. ఇలా ఆత్మ పరిశీలనం కవి రామాయణంలోని ప్రతిపాత్ర చేత చేయించాడు. తన లోపాలను తెలుసుకుని తనను తాను సరిదిద్దుకునే గుణశీలాలు పరిపోషింపబడినాయి. చివరకు అంతటి అసురుడు కూడ ఇంతగా తపించడం ఆశ్చర్యకరం. సత్యగ్రహణ పారీణతకు నిదర్శనం, రామాయణ కావ్యం. రావణునిలో ఆత్మపరిశీలనంతో కూడిన ఊహలు జనించినా అతను భీరువుగ నిలిచాడు. తనయంతటివాడు ఒక మానవమాత్రుడికి సీతను తిరిగి యిచ్చి శరణాగతి పొందడమా అనే బింకం మాత్రం సడల లేదు. ఏమైంతేనేం మండోదరి చేసిన హితోపదేశం, దీనాలాపం రావణుణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేసినదనక తప్పదు. లేనిచో అంత బ్రతుకు బ్రతికి అతినీచంగా వధింపబడి వీరస్వర్గానికి కూడ నోచుకునేవాడు కాదు. రావణుని చేత కవి మరొక రహస్యం వెల్లడి చేయించాడు. దేవ మునీంద్రుల ప్రార్ధంపై నారాయణుడే తనను చంపడానికి దశరథ కుమారుడై పుట్టినట్లు తనకు తెలియునని పలికాడు. ఇక సీతమ్మ సచ్చరితను గూర్చి కూడ రావణుని పలుకులు పరమ ప్రమాణాలు, విస్మరింపరానివి.

“రాగమెలర్ప ఘోర సమరంబున రామశరంబులందను

ద్యోగమెలర్చ నవ్విభునకుద్ధతి నాపయి గిన్‌కపుట్టగన్” (గో.రా.యు.కాం.వ-2604)

అని మండోదరితో ఆనాటితో తనకు బంధం తీరినదని పలికి వీరుడై రణరంగానికి బయలుదేరాడు. తనభర్తకు చేజేతుల చంపుకోవడానికి కులీనయైన ఏ స్త్రీ ఆశించదు. మరణమెప్పటికి తప్పదు కాబట్టి ఉత్తమలోకాలు చేరి సద్గతిని పొంది సుఖించాలని ఆమె కోరుకోవడంలో ఉపకారమే ఉన్నది. భారతీయ సతీధర్మాలను ఇలా ఆయా పాత్రల ముఖతః నిరూపించాడు కవి. పరోపకార శీలం, స్వార్ధరహిత్యం, ఆత్మ పరిశీలనం, సత్యస్ఫ్రకంగా పాత్రల మనోభావాలను చిత్రించుట అంత తేలికయైన పనికాదు. పాత్రలలోని త్యాగైక గుణసంపదకు వన్నెలు దిద్దడం మహా ప్రజ్ఞాశీలియైన కవికి మాత్రమే గలదనుట నిర్వివాదాంశం.

అలా రావణుడు రణభూమి చేరి ఆ దాశరథి చేత విహుతుడైనాడు. అది తెలిసి రావణాంతఃపుర స్త్రీలంతా విలపించారు. కులస్త్రీలను చెరపట్టిన పాపమేనని భావించారేగాని శ్రీరామాదులను దూషించినవారు లేరు. రావణుని స్వ్యం కృతాపరాధానికి నొచ్చుకుంటూ మండొదరి చేసిన విలాపాలు ధర్మ ప్రతిపాదికమైనవి. మరొక్కసారి వేంకటకవి ఆమెచేత దీర్ఘోపన్యాసం చేయించాడు. శ్రీరాముని దైవత్వాన్ని రావణునిలోని ఆసురీప్రవర్తనను మరల మరల చాటి చెప్పించాడు. పౌరుష ప్రత్తపోన్నతుడై సిద్ధ గంధర్వాది దేవతా గణాన్ని గడగడ వణికించిన తనభర్త శ్రీరాముని చేతిలో నిర్జింపబడుట సిగ్గుపడవలసిన విషయమని, అంతా దైవయోగమని విలపించినది. శ్రీమన్నారాయణుడే శ్రీరాముడని ఆ దంపతులు యుద్ధానికి ముందే తెలిసికున్నారు. అయినా తన భర్త ఔన్నత్యం మీద ఆమెకంత విశ్వాసం. తన భర్త గొప్పదనాన్ని శ్రీరముని దైవత్వాన్ని పదిమందిలో తెలియజెప్పడానికే కవి మండోదరికి ఆ అవకాశం కల్పించి ఉంటాడు. అన్నింటికంటే ముఖ్యంగా మండోదరిచేత సీతా శీలవృత్తాన్ని మరల ప్రకటింపచేస్తాడు.

“స్వాభావిక జ్ఞాన శక్తి యుక్తుడు ……….

……… ……. ……….. ………

నిన్ను వధియించునేడిది నిక్కువంబు” (గో.రా.యు.కాం.వ-2835)

మండోదరి మరల అంటున్నది. ఒక వ్యక్తి వినాశానికి ఆ వ్యక్తిలోని దోషాలేనని పలికినది. తన భర్త ముందు ఇంద్రియాలను గెలిచి తర్వాత ముజ్జగాలను గెలిచాడట. అంతా తపోబల సంపదగలవాడు తన భర్త అని ఆమె ఉద్దేశం. ఇంద్రియ విజయం వల్ల అతనికి అతని యింద్రియాలే చివరకు శత్రువులైనాయట. అంత మనో నిగ్రహ శక్తులున్న్వాడైనా చివరకు ఇంద్రియ లోలత్వం వల్లనే వినాశాన్ని కొనితెచ్చుకున్నాడత. చపలాత్ములైన పురుషులందరికి ఈమె ఎంతో చక్కటి సందేశాని అందించినది. రామునితో వైరం మాని సీతని ఇమ్మని పలికిన హిరం నీకు రుచించలేదు. ఇది విధిచోదితమని పలికిన మండోదరి సౌమ్యగుణ్శీల సంపద కొనియాడదగియున్నది. ఇంద్రియలోలురైన ప్రతివారికి రావణుడే ఉదాహరణ.

తన భర్త చేపట్టిన అకార్యాలపట్ల ఆమె యెంతగా కుమిలిపోయినదో ఆమె చేసిన హెచ్చరికల ద్వారా తెలుస్తున్నది. సమయం దొరికినప్పుడంత తన భర్తలోని దురాగతాలను అనుభావానికి వచ్చిన తత్ఫలితాలను ఆమె వివరణగా చెప్పడం భార్యమాటలలోని పరమార్ధాలు తెలిసికూడ, అహాన్ని విడిచి ప్రవర్తించకపోవడమే లంకకు చేటు తెచ్చినది. రావణాసురుడు సామాన్యుడు కాదుగదా! పోగాలం దాపురించిన వాళ్లు “కనరు, వినరు, మూర్కొనరని” సూరిగారన్నట్లు ఏ రకమైన వ్యసనపరుడైనా పడే కష్టాలు తెలిసి కూడ తాము చేపట్టిన మార్గాన్ని విడిచిపెట్టరు. వాళ్లలోని అహంకారం అలాంటిది. స్త్రీల మాటను మగవాళ్లు అసలు ఖాతరుచేయరు. చివరికి అందుకోవలసిన ఫలితాన్ని అందుకుని అలమటించడం అతి సామాన్య ధోరణి మగవాళ్లకు. సామాన్యులే అలాంటి బుద్ధితో ప్రవర్తిస్తే పదితలలవాడికి ఇంకెంత బింకం ఉండాలి మరి. ఏది ఏమైనా మండోదరి మాత్రం కడవరకు తనభర్తను బ్రతికించుకోవాలనే విశ్వప్రయత్నం చేసి ఎన్నో విషయాలు గుర్తింపచేస్తుంది. రావణుడు ఇంతవరకు చేసిన పనులకంటే సీతను కొనిరావడమే లంకకు చేటు కలిగించిన విషయమని హెచ్చరించినది.

ఇంకా ఇలా అంటుంది పుణ్యవతి అయిన మహారాజ్ఞిపై నీకు పుట్టిన మోహమే నీ పాలిట అగ్నిశిఖ. అంతేగాదు “నిన్ను, నన్ను, గులమును, నిఖిల సుతుల హితుల మంత్రుల నెల్ల” దహించినదనుటలో ఆ సాధ్వికి భర్త చేష్టలు ఎంత అనర్ధదాయక మైనవో వివరించింది. “అరుంధతి, రోహిణి కంటె విశిష్టమైనది, క్షమాగుణం గలది, సౌభాగ్యవతులకు నిదర్శనమైనది. వారాశి సుతకు దృష్టాంతభూమియై తేజరిల్లుచున్నది. పతిభక్తిగలది, పరమసాధ్వి, నబల, సర్వానవద్యాంగి, మహితశీల, మాన్యయైన సీతను మ్రుచ్చిలి దెచ్చి ఏం సుఖపడినావు బృహత్ఫలితాన్ని పొందావు. కులం నశించినది అని రావణుని బలహీనబుద్ధిని ఏకరువుపెట్టినది. స్వయకృత అపరాధిగ నిర్ణయించినది. ఆ సతిని చెరపట్టిననాడే దహించిపోవలసిన వాడివి కాని కాలకర్మాలు కూడిన నాడే పరిపక్వమైన ఫలితం అని సూచించినది. ఉత్తమసతుల చెఱబడితే కలిగే అనర్ధాన్ని కన్నుల గట్టించినది. ఆమె హృదయ ఔన్నత్యాన్ని కవి చక్కగ రూపించాడు. మండోదరి ఒకసారి సీతను గూర్చి నాకంటే ఆమె అంత అందగత్తియా? అని వితర్కించింది. ఆ మండోదరియే సీతాదేవి సౌశీల్యాన్ని ఎంతగా కొనియాడినదో చూశారుగా. అలాంటి బంగారు శలాక సీతమ్మ. అంటే అగ్నిశిఖవంటిదని గూడ నర్మగర్భంగా తెలియచేసింది. నువ్వు చేపట్టిననాడే నిన్ను దహించివుండేది కాని పతిపరాయణ సీత నీ కాలకర్మాలకై ఎదురుచూచింది అనడంలో శత్రు వర్గపు స్త్రీ అయివుండి గూడ అమలినమైన భావాలతో సీతను కొనియాడిన మండోదరి ప్రశంసనీయ. ఈ ధర్మాధర్మ ప్రకటనకు మండోదరియే దగినపాత్ర అని వేంకట కవి భావించడం ఎంతో సముచితంగా వున్నది. పుణ్య పాపాలను పరిశీలించి ఆయా కర్మలు ఫలితాలు ఎలావుంటాయో విభీషణుణ్ణి, రావణుణ్ణి ఉదాహరణగా నిరూపించిన నేర్పరి. శ్రీమద్రామాయణంలో పరనింద చేసిన పాత్ర సృష్టి మృగ్యం. ఒక సామాన్య స్త్రీ అయినచో జ్ఞాతుల, సహచరుల చేష్టలను దుయ్యబట్టి నిందోక్తులతో బాధపెట్టడం లోకసహజం. ఉత్తములెప్పుడు తమను తామే పరిశీలించుకుని పశ్చాత్తాపులౌతారు. వేరొకరైనచో తన మరది విభీషణుడు, అతని భార్య యింటి గుట్టునంతా రామునికి చెప్పి తన భర్త మరణానికి కారకులైనందుకు తీవ్రంగా నిరసించి, నిందించి, కఠినోక్తులతో హింసించేవారు. కాని అయోనిజయైన మండోదరి మనస్తత్వమే వేరు. ఆమె తన యింటిని, పరిసరాలను, తన కుటుంబసభ్యులనే గాక, భర్త రావణుని గూడ చక్కగా అవగాహన చేసుకున్న కుశాగ్రబుద్ధిగలది. అందుకే తన బంగారమే మంచిదైతే అన్న సామెతగా తప్పులన్ని తన భర్తలోనే చూడగలిగిన ఉదార స్వభావం గలది.

అంతే కాదు విభీషణుడు చేసిన హెచ్చరికలు, హితోక్తులు లెక్కచేయక చేటు తెచ్చుకున్నావని తన భర్తనే అంటుంది కాని విభీషణుని ఆమె ఏమీ అనలేదు. శుభాశుభకర్మలకు ఫలితం సుఖదుఃఖాలని అనుభవానికి రాగలవని తీర్మానించినది. మరది విభీషణుని మన్నించినది. ఉత్తమ సతీధర్మాలు తెలిసిన మగువ మండోదరి. వాల్మీకి వ్యాసాదులేగాక ఎందరో గొప్ప కవులు మాత్రమే స్త్రీల ఔన్నత్యానికి పెద్దపీట వేసారు. మగువని ఆదరించి గౌరవించిన వాడే సుఖశాంతులని మన దివ్యగ్రంధాల సూచనగా నిర్ధారించారు.

మండోదరి తాను ఐశ్వర్యోపేతను, అందగత్తెను అను సాభిప్రాయ వ్యక్తీకరణ కూడ చేసుకున్నది. లోకంలో ఇది కొందరిపట్ల సహజమేననవచ్చును. రూపవతులైన యువతులు రావణుని కెందరో ఇంటగలరనీ, మోహవివశుడై వాళ్ల అందాల్ని చూడక సీతను పెద్ద అందగత్తెగా భావించాడని తలంచినది. ఇది కూడ పరస్త్రీ వ్యామోహ బద్ధులైన పురుషులకొక చిన్న చురకవంటిది. పైన మాటల వలన మండోదరి తన ఆధిక్యతను చాటుకుంటుంది. ఇంతంటి అందగత్తె తన ఇంట్లోవున్నప్పటికీ రావణుని వక్రబుద్ధి ఏపాటిదో చూడండి అంటున్నాయేమో మాటలు. ఏది ఏమైనా వ్యసనం వినాశహేతువు అని హెచ్చరిస్తోంది.

“ఉరుమోహంబున మదిఓ … …

… … … ….

సరివచ్చునె యొక్కడగునె చర్చింపంగన్” (గో.రా.యు.కాం.వ-2843)

అని పలికిన పలుకులలో ధర్మపత్నితో పరస్త్రీ తుల్యమైనది కాదనే బుద్ధి గరపడమే గాక సీతకంటె తానేమి తక్కువైనదిగాదని పరస్త్రీలోలుడైన పురుషునికి తన భార్య సౌందర్యం తెలుసుకునే శక్తి చాలదని అలాంటి బుద్ధిలోపమే తన భర్తకు గలదని తత్ఫలితాన్ని అందుకున్నాడని నిరూపించిన ఉత్తమ యిల్లాలు. ఆమెలోని అభిజాత్యం అలాంటిది. జానకి ఆనందంగ భర్తతో సుఖం అనుభవిస్తుంటే చెఱగొన్న ఫలితంగా తనకీ వైధవ్యం అని రోదించిందా సతి, భార్యాభర్తలకు ఎడబాటుచేసిన కర్మఫలమేనని ఆమె విశ్వాసం. “నారీ చౌర్యమిదంక్షుద్రం కృతం శౌటిర్యమానినా” అన్నట్లు అతని నీచ బుద్ధిని గర్హించినది. పతివ్రతాపహరణమే అతని పాలిట కాలసర్పమై విషజ్వాలలచే దహించినదని పలుమార్లు మండోదరి వాకొన్నది. ఉత్తమ సతీధర్మాలకు నిలయం ఆమె హృదయం. ఆమెచేత కవి మరొక సత్యాన్ని లోకాలకు చాటిచెప్పించాడు. గొప్ప ఐశ్వర్యంతో తలతూగి భర్తతో కలిసి, అనుపమ భోగసంపదలు అనుభవించి ఉద్యానవనాది వివిధ దేశాలు సందర్శించిన తాను నేడు భోగ సంత్యక్తయై కాంతి హీనమైన జీవితం గడపవలసి వచ్చినందుకు చింతించినది. “భూవిభుల భోగ భాగ్యములు నమ్మదగవు చపలము లరయ ..” అని రాజ భోగాలన్ని అశాశ్వతాలని గర్హించినది. ఆమెలోని సత్యసంధత అనుపమానమైనది. అందుకే రాక్షసేంద్రా! అకారణ మృత్యువు కలుగదు. నీకు కూడ మైథిలిని అపహరించిన కారణంగానే మరణం సంభవించినదని కార్యకారణ హేతువుతో తర్కించినది. రావణుని ప్రేరణచేసిన తన ఆడపడుచు శూర్పణఖను గాని, రావణ వధకు కారకుడైన విభీషణునిగాని ఒక్కమాట అని కష్టపెట్టలేదు. ఎంతకూ అతడి కర్మ ఫలమేనని పలుమార్లు నొక్కి చెప్పడంలో కవి ఉద్దేశం ఎంతటివాడికైన కర్మఫలం అనుభవించక తప్పదనే సత్యాన్ని మండోదరి ముఖతః పాఠకలోకానికి అందించాడు.

మండోదరి తన భర్త ఔన్నత్యాన్ని, ఐశ్వర్యాన్ని, అందాన్ని చూచి మిక్కిలి గర్వించినది. అతని ఠీవిని పదే పదే స్మరించుకున్నది. స్త్రీల మానసిక భావాలను నిసర్గ రమణీయంగా వర్ణించాడు.

తే.గీ.అఖిల రాక్షసవరుడు మాయయ్యయనియు
దానవకులేశ్వరుండు మద్భర్తయనియు
దండితపురందరుండు నాతనయుండనియు
విఱ్ఱవీ(హల్ఫ్ చిర్చ్లె)గుచునెపుడు గర్వించి యుందు” (గో.రా.యు.కాం.వ-2849)

అని తన గర్వానికి కారణం వివరించినది. విక్రమాధికుడు, అహవశూరుడు, ధీరుడు, శౌర్యగుణోన్నతుడు అయిన భర్తగల తనకు ఎలాంటి ఆపద రాబోదని విశ్వసించినందున, మానవుని చేతిలో మరణిస్తాడని ఊహించలేదని దుఃఖించినది. అయితే పాఠకులు ఒక్క విషయాని గుర్తుంచుకోవాలి. మండోదరి రావణుడు ఇద్దరు రామావతార రహస్యం తెలిసినవాళ్లుగ, రాముడు దైవస్వరూపుడే అని మనకి చెప్పిన వాళ్లు గదా! మరల రాముడనే మానవుడి చేతిలో మరణం అనడానికి కారణం, రామావతార రహస్యాని పాఠకులకు ఒక్కమారైనా తెలియ చెప్పాలనే కవి మదిలోని ఆరాటాన్ని అలా ప్రదర్శింపచేసి వుంటాడు. అంతే వైభవోపేతంగా అలరారే రావణుని శరీరం రాముని కార్ముక విముక్తమైన వాడియైన శరజాలంతో క్షతమై నెత్తుటిదోగి విఖండితమై కొండవలె పడి ఉన్నదని దుఃఖితయైన సుశీల ఈమె. మృత్యువుకే మృత్యువైన నీవెట్లు మృతుడవైనావని భర్త ప్రతాపాన్ని ప్రకటించింది.

శభ్దవైచిత్రితో, దత్తపదుల విన్యాసంతో రావణాసురుని దర్పాన్ని వర్ణించిన వేంకటకవి రచన పోతనామాత్యుని పద్యరచనా కౌశలానికి ధీటైనది. రావణాసురుని మదరూప, ఐశ్వర్యటోపాలన్నిటిని ఏకరువు పెట్టి భోరున విలపించిన పతిపరాయణ రావణుని గుణశీల వర్ణనం, పతి స్వరూప స్వభావాలను, పరాక్రమోన్నతులను లోకాలకు పదే పదే చాటినదీ మయుని పుత్రి. పతి యందలి ప్రగాఢ అనురాగమే ఆమెనట్లు పలికించినది. తన భర్తకు గల భక్తియుక్తులు, శక్తిసామర్ధ్యాలు, దయాదాక్షిణ్యాలు ప్రవచించిన మండోదరి ప్రేమమూర్తి, భర్తవియోగ దుఃఖితయైన మండోదరి స్త్రీ జనోచిత భావాలకి తార్కాణం.

తే,,గీ,,”పాయకనివాత కవచులఁ బాఱద్రోలి
నట్టి శూరుండ వఖిలమాయా మహత్త్వ
కోవిదుండవు సకలవిద్యా విదుండ
వఖిల ధర్మ వ్యవస్థాభి హంతవీవు” (గో.రా.యు.కాం.వ-2860)

ఇలాంటి ఉన్నతుడైన భర్తను పోగొట్టుకొని కఠినాత్మనై జీవించియున్నానని శోకించినది. ఒకపరి పుత్ర శోకంతో, మరల పతి మరణంతో తీరని వ్యధతో హతనైతినని, సమస్త బాంధవ విరహితనై దుఃఖించవలసిన దౌర్భాగ్యానికి పెద్దప్రొద్దు విలపించినది. తర్క వితర్కాలతో కూడిన పలుకులెన్నో వినిపించినా సీతాసతివంటి పరస్త్రీ అపహరణమే రావణుడు అంతం కావడానికి ప్రధానకారణమని పదే పదే నినదించినది ఆమె కంఠం. దునుజేంద్రా! ధర్మం తప్పి పతిశెవా పరాయణులైన, ధర్మనిరతులైన పుణ్యమూర్తులైన కులస్త్రీలను, సువ్రతల్ను చెరబట్టి వాళ్ల భర్తలను వధించావు. ఆ సతీమతల్లుల హృదయ ఘోష నీ పాలిట శాపమైనది. కలకంఠికంట ఒలికిన కన్నీళ్ళకు కారణమైన వాడు ఎంతటి మహోన్నతుడైన నశిస్తాడను సత్యం నీ పట్ల ఋజువైనది. లోకత్రయాన్ని యేలగలిగిన ప్రతాపశాలివైన నీకు పరదారాభిలాష పతనానికి కారణమని తోచకుండుట తాను చేసుకున్న దౌర్భాగ్యమేనని విచారించినది. భీరువుగా సీతను అపహరించిననాడే నీ సౌర్యం నశించినది అంటూ రావణ దురాగతాలను వినయంతో చాటిన బుద్ధిశాలిని సాధుశీల. రావణుని మూర్ఖత్వానికి నొచ్చుకున్నది. పరదారాభిలాషనే పురస్కరించుకుని విలపించినది. అంటే స్త్రీలోలుడైన వాని వంశానికి చీడ తప్పదని పదే పదే నినదించినది. ఆమె విలపించిన తీరు చిత్రంగా వుంటుంది. కదనరంగంలోని శరీరాన్ని చూచి మండోదరి “అసుర పుంగవ ప్రియురాలినట్లు నేడు కదనమేదిని గౌగిట గదియబట్టి నాదువదనంబు చూడవు, మోదమిడవు. నన్ను గడదానిగ జూడ న్యాయమగునె” అని పలవించినది. వీర స్వర్గమలంకరించిన భర్తను చూచి పరిపరివిధాలుగా దుఃఖించినది. అప్పుడు కూడ భార్యభర్తకు దూరంగా జీవించుట తగనిపని యని ఆమె ఉద్దేశం. ఆ మహాసాధ్విని చూచి సపత్నులు ఓదార్చుచు విభీషణుడు మండోదరి దుఃఖాన్ని ఉపశమింపచేసి నాడు ఊరట కలిగించాడు.

వేంకటకవి యిలా యుద్ధకాండలో మండోదరి పాత్రచిత్రణచేసి జీవం పోశాడు. విద్యావినయ సంపదలు, సంస్కృతీ సంప్రదాయాలు, వినయాహంకారాలు అన్నింటిలో పరిపుష్టంగా తీర్చిదిద్ది ఆమెనొక మహోన్నత మహిళామణిగ సృజించిన కవి ప్రతిభ ప్రశంసావహమైనది. ఉజ్వలమణిదీపం, లోకధర్మప్రతిష్ఠాపనకే కవి మండోదరిని సృష్టించి ఉంటాడనే వ్యక్తిత్వం గలది. ఆమెను గూర్చి అప్పజోడు వేంకట సుబ్బయ్య పలికిన ఈ క్రింది మాటలు ఇక్కడ ప్రస్తావించదగినివిగా భావిస్తాను.

“ఎంతో సారవంతమైన పాదులో పుట్టి అందంగా, ఏపుగా ఎదిగే తీవతోనల్లు కోటానికి మహోన్నతమూ, శఖోపశఖా విలసితము అయిన పెద్ద వృక్షము కొఱకు వెదకటం, అలాంటి వృక్షానికి అల్లుకొని ఎంతో ఎత్తు పెరగాలని, ఎన్నో పూలు పూయాలని, కాయలు కాయాలని కలలు కనడము, ఆ కొరిక నెరవేరగా నిలువెల్ల పులకరించి తన అదృష్టానికి తానే ఆశ్చర్యపడుటము, అపరిమిత ఆనందాన్ని అనుభవించడము లోక సహజం. కాని ఆ చెట్టుకొక వేరు పురుగుపుట్టి, చీడతగిలి, బలహీనమై, గాలిదెబ్బకు కొమ్మలు విరిగి, కూకటి వ్రేళ్లతో పెళ్లగిలిపోతే ఆతీవ కుప్పకూలి ప్రక్కన బడి ఎంత దుఃఖాన్ని అనుభవిస్తుందో ఎవరికి తెలుసు?” అనే మాటల వల్ల ఆమె ఆవేదన ఒకరికి చెప్పినా అర్ధంకాని అనంతమైనది. అనుభవించిన వాళ్ళకే తెలిసినది. అలాంటి బాధాపరితప్త మానసయైన మండోదరి పట్ల వేంకట సుబ్బయ్య గారు చెప్పిన మాటలు సముచితంగా వున్నాయి.

(డా.సీతాలక్ష్మి, డా.రాఘవమ్మ, డా.విజయలక్ష్మి – “నవపారిజాతాలు” పుస్తకము నుండి)