April 20, 2024

సహ ధర్మపత్ని సప్తమ “కర్మ…”

ఈ మధ్యన ఒక బ్లాగ్ లో హృదయాన్ని పట్టివేసిన “షట్కర్మయుక్త” అనే కథనాన్ని చదివాక నాకు అత్యంత ఆప్తురాలైన ఒక వ్యక్తి కళ్ళల్లో కొచ్చింది. ఈ షట్కర్మలన్నీ గడిచి చాలాదూరం నడిచొచ్చిన వ్యక్తి.. షష్టిపూర్తి అయి కూడా కొంతకాలమైన వ్యక్తి. ఇప్పుడు ఈ కథనం చదివాక నేను నా మితృరాలిని గురించి తప్పకుండా చెప్పాలనిపించింది. చదువుకుంది . ఉద్యోగం చేసింది. పిల్లల్ని పెంచింది. రెక్కలొచ్చి ఎగిరిపోయినా అప్పుడప్పుడూ వచ్చి అజా పజా అడిగి పోతూనే వున్నారు. నెత్తిమీద గూడుంది.. ఆదాయం వుంది.. సౌకర్యాలున్నాయి. ఈ పవిత్ర భూమిలో చాలామందికి లేని భౌతిక సౌకర్యాలున్నాయి . మరేమిటీవిడ బాధంటే ???..

ఆవిడ ఉద్యోగం చేసినప్పడు చాలామంది కొలీగ్స్ తో స్నేహంగా..చెప్పాలంటే తలలో నాలుక అంటారే అలాగ..వుండేది . విద్యార్థులు అప్పుడప్పుడూ సందేహ నివృత్తికోసం ఇంటికొచ్చేవాళ్ళు. తన తోబుట్టువులు, వదినెలు, పినతండ్రి, పినతల్లి పిల్లలు చూడ్డానికొచ్చేవాళ్ళు. ఈవిడ పిల్లలను చూపించే డాక్టర్ దగ్గర కొచ్చే తల్లులతో స్నేహం. పుస్తకాలు ఇచ్చిపుచ్చుకునే స్నేహం. తను స్కూల్ కి వెళ్ళేటప్పుడు అదే బస్ ఎక్కే కొంతమందితో స్నేహం. పిల్లల స్నేహితుల తల్లితండ్రులతో స్నేహం. ఇలా ఆవిడకు పరిచయాలు స్నేహాలు ఎక్కువ. ఇంటిపనీ స్కూలు పనీ అలుపు అనుకోకుండా చేసేది. ఏ కాస్త విశ్రాంతి దొరికినా పుస్తకాలు చదివేది. ఫొన్లో చాలా సేపు కబుర్లు చెప్పేది. వంట చేస్తూ, స్నానంచేస్తూ కూనిరాగాలు తీసేది. నవ్వకుండా మాట్లాడేదే కాదు. తనకి కూడా ఇంట్లో చికాకులు, వత్తిళ్ళున్నాయి. అయినా ఇవ్వన్నీ చాలామందికి ఉండేవే అన్నట్టుండేది. ఆమె భర్త తనకన్న మూడేళ్ళు ముందు రిటైరయినా మరేదో సర్వీస్ లో చేరి ఈ మూడేళ్ళూ కాలక్షేపం చేశాడు. ఎప్పుడూ ఆయన ఉద్యోగానికే ప్రాధాన్యమిచ్చుకునే వాడు. ఆయన “టైం” లు మెయింటెయిన్ చేసుకునేవాడు. ఈ వత్తిళ్ళన్నీ ఉన్నాకూడా తనదైన జీవనోత్సాహంతో తట్టుకున్నది. ఆయన రిటైరైనాక ఆమె జీవితం ఒక్కసారిగా ఒక కుదుపుకి లోనైంది. ఆమె అనే బదులు తన పేరు వసుంధర అని పిలుచుకుందాం సౌలభ్యం కోసం.. వసుంధర రిటైరైనా ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నంగా వుండేది. ఉద్యోగం, గృహనిర్వహణ పిల్లల పెంపకం, వాళ్ళ చదువులూ ఇవన్నీ సమర్థవంతంగా చేసుకొచ్చిన ఆమెని రిటరై ఇంట్లో వున్న ఆమె భర్త “నీకసలు ఏమీ తెలీదు..శుభ్రం లేదు..పొదుపు లేదు..పెద్దరికం లేదు .. చిన్నపిల్లలా అంత గట్టిగా నవ్వేమిటి? ఆ తొందర నడకేమిటి? ఆ కూనిరాగాలేమిటి? చిన్న వాళ్ళతో జోకులేమిటి?.. ఫోన్ లో అంతంత సేపు మాటలేమిటి? ఎప్పుడంటే

అప్పుడు, ఎవరు పడితే వాళ్ళు ఇంటికి రావడమేమిటి? నీ వయసుకు తగ్గట్టు ఉండవెందుకు? అనేవాడు .. అస్తమానం అలా అనడమే కాదు ఆమె అన్ని సంవత్సరాలు చేసిన వంట ఇప్పుడు రుచీ, పచీ లేకుండా పోయిందాయనకి. తనకి ముందుతరం వాళ్లలా భార్య మీద గట్టిగా అరవలేడు, తిట్టలేడు. అవన్నీ చెయ్యలేని వెదవ మధ్య తరగతి సంస్కారం ఈ అసంతృప్తినంతా సణుగుడు కింద మార్చేసింది. ఇది మొదట్లో తనకి వింతగానూ, రాను రాను విసుగ్గానూ, తరువాత పరమ చిరాకుగానూ అనిపిస్తోంది. వివాహమైన ఏ కొద్దిరోజులో వాళ్ళమధ్య కమ్యూనికేషన్ వుండేది. తరువాత ఎవరి ప్రపంచాలు వాళ్ళవైపోయాయి. తమాషాగా అన్ని సంవత్సరాల సామాజిక జీవితంలో ఆయనకి దగ్గర మిత్రులంటూ ఎవరూ లేరు. వ్యాపకాలు లేవు. అభిరుచులు లేవు. ఒక్కసారిగా ఆయన ప్రపంచమంతా ఇల్లే అయిపోయింది. ఇంట్లో వున్న ఒకే ఒక్క మనిషిని రంధ్రాన్వేషణ దృష్టితో మాత్రమే చూస్తున్నాడు. ఆమె ప్రపంచాన్ని కూడా ఇంటికి పరిమితం చేసే పద్ధతిలో వున్నాడు. ఇంక వసుంధర కూతురుంది. ”మీ నాన్నని పదిరోజులు నీదగ్గరకు రమ్మని పిలువు. నేను కొంచెం ఊపిరిపీల్చుకుంటాను..” అని ఈమె సిగ్గు విడిచి అడిగితే “అదేమిటమ్మా!! ఇద్దరూ రండి . నువ్వు లేకపోతే ఆయనకెలా?” అంటుంది. కొడుకూ అంతే. వాళ్ళ ఉద్దేశంలో ఆ యిద్దరూ ఒకే చోట వుండాలి. ఆమే ఆయన అవసరాలు చూడాలి. పోనీ “మీ పిల్లలకు సెలవులిచ్చినప్పుడొచ్చి ఇక్కడ పదిరోజులుండు..నేను కొంచెం అలా తిరిగొస్తాను” అంటే “ నువ్వు లేనిదే ఎలా వుండమంటావమ్మా? సెలవలకొస్తే నువ్వు చేసిపెడ్తావనికదా? అయినా నువ్వొక్కదానివే తిరిగిరావడం ఏమిటి? చక్కగా ఇద్దరూ కలిసి వెళ్ళండి” అని సలహా ఇస్తారు. సరే పిల్లల ఇళ్లకి వెళ్ళారనుకోండి. అక్కడ అమ్మా నాన్న,అత్తా మామల మూసల్లో ఇమడాలి. పొద్దున్నే లేచి పేపర్ పట్టుకుని కాఫీ తాగుతూ నీరెండలో వాలుకుర్చీలో కూచున్న అత్తగార్ని చూసి అల్లుడే కాదు కూతురూ కొడుకూ కూడా మొహం చిట్లిస్తారు. ఏది మాట్లాడినా “పెద్దవాళ్ళ”లా మాట్లాడాలి. వయస్సుకి తగ్గట్లు వుండాలి. అరవైల్లో తొంభైల్లాగ. వీళ్ళకి జోహ్రా సెహ్గాల్ కళ్ళల్లో మెరుపు, మొహంలో చిలిపితనం చూపించినా అర్థం చేసుకోలేరు అంటుంది వసుంధర. ఒక్కోసారి ఆమెకి ఈ వ్యక్తితోనేనా ఇన్నాళ్ళు కలిసి ఉన్నానా? ,ఈ పిల్లల్ని నేనే పెంచానా? అనీ సందేహం వస్తుందట.. అసలు వయస్సుకి తగ్గట్టు వుండడమనేది ఎవరు నిర్ణయిస్తారు? ఇదికూడా ఒక నియంత్రణ కాదా? జీవనోత్సాహాన్ని నిలిపి వుంచుకునే క్రమంలో ఇన్ని ప్రతిబంధకాలెందుకు? ఎన్నేళ్ళు గడిచినా, ఎంత విద్యావంతులైనా ఎంత ఎక్స్పోజర్ వున్నా ఈ మూస ఆలోచన్లు పోవెందుకని? అంటుంది వసుంధర.

ఒకరకంగా ఆమెది కూడా మూస ఆలోచనేనేమో? ఇన్నాళ్ళుగా వాళ్ల అవసరాలన్నీ ఒక మూస తల్లిలాగానే చూసింది ఆయనకి ఒక మంచి భార్యలాగానే వుంది. అయితే తన వృత్తి వ్యాపకాలలో, స్నేహాలలో, ఉత్సాహంలో అవన్నీ అప్పుడు భారమనిపించలేదు. వాళ్లకి కూడా అట్లా చెయ్యడం ఆమె కర్తవ్యం అనే భావమే నిలిచిపోయింది. తల్లికి, భార్యకి ఒక స్వతంత్ర వ్యక్తిత్వం వుంటుందనే ఆలోచన ఈమే రానివ్వలేదేమో!!. ఇప్పుడు వృత్తి వ్యాపకాలు లేకపోయాక వెలితి అర్థమౌతోందేమో!! ఇప్పుడైనా వాళ్ళు చెప్పేదంతా ఎందుకు వినాలి? తనని తను నిలబెట్టుకోడం నేర్చుకోకపోతే ఎలా? అనిపిస్తుంది

1 thought on “సహ ధర్మపత్ని సప్తమ “కర్మ…”

  1. Interesting read.
    oka vayasu vachchaaka pakkavaaLLa aalOchanalanu (as far as our lives are concerned and as long as one is not behaving irresponsibly) paTTinchukOkooD adEmO. manaku tOchinaTTu, ishTamainaTTu unDaTamE mElu kadaa.

Comments are closed.