April 25, 2024

స్ఫూర్తి

మేము ఈ పత్రిక ప్రారంభించటానికి స్ఫూర్తినిచ్చినవి మా సభ్యుల ఉత్సాహం, శ్రేయోభిలాషుల ఆలోచనలతోపాటు కొన్ని ప్రముఖ వెబ్ పత్రికలు, వెబ్ సైటులూ కూడా.ఆంగ్ల అక్షరక్రమాన్ననుసరించి వాటి పేర్లని క్రింద ఇస్తున్నాం:

* ఆవకాయ
* ఈమాట
* పొద్దు
* ప్రాణహిత
* పుస్తకం
* తెలుగుపీపుల్

ఆ పత్రికల గురించి ఆయా సంపాదక బృందాల మాటల్లోనే విందామా?

ఆవకాయ

ఉద్దేశాలు & లక్ష్యాలు:
ఒక చిన్ని చినుకు, నీటిపాయగా, వాగుగా, నదిగా మారి పారినట్టు-ఒక ఆలోచన రూపుదిద్దుకుంది. అదే ఆవకాయ.కామ్. “ఒక్కొక్క వ్యక్తి సమస్త శక్తి ధారవోసి కృషి చెయ్యాలి” అన్నట్టే రచయితలు, పాఠకులు, అభిమానులు….ప్రతి ఒక్కరూ ఆశీఃపూర్వకమైన తోడ్పాటుతో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వస్తోంది. వ్యక్తిగత ప్రతిభకు పెద్దపీట వేయడం ఆవకాయ.కామ్ ముఖ్యోద్దేశం. ప్రతిభను హర్షించే పాఠకులకు సరైన వేదికను సమకూర్చడమే లక్ష్యం.

చరిత్ర:
21 అక్టోబర్ 2007 (విజయదశమి) నాడు ప్రారంభమై, 2000 పైగా రచనలతో, 9,000 పైగా పుటల సమాచారంతో, సంవత్సరానికి 1.3 లక్షల పాఠకులకు చేరుతోంది.

మైలురాళ్ళు:
* అంతర్జాలంలో “రియల్ టైం” ఇంటర్వ్యూలు ప్రారంభించింది, నిర్వహిస్తున్నది ఆవకాయ.కామ్. ఇప్పటిదాకా నలుగురు కవులు, రచయితలతో నిజ సమయ ముఖాముఖిని నిర్వహించడం జరిగింది. మరో ఇద్దరు కవులు/రచయితలతో ఆడియో ఇంటర్వ్యూలను నిర్వహించడం జరిగింది.

* కాల్పనిక సాహిత్యమే కాకుండా చరిత్రలో జరిగిన నిజ ఘటనల ఆధారంగా వచ్చిన ద మార్చ్ ఆఫ్ టెం థౌసెండ్, పల్నాటి వీరభారతం లాంటి సాప్తాహిక ధారావాహికల ప్రచురణ.

* పిల్లల కోసం 200 పైగా బాల సాహిత్య రచనల ప్రచురణ.

* “తెలుసా!”, “ప్రముఖ్యల హాస్యం” శీర్షికల్లో విజ్ఞాన, వినోదాల సమాచారం. * రేడియోచిల్లీ ద్వారా శబ్దపుస్తకాలను (ఆడియో బుక్స్) అందించే ప్రయత్నం.

ఈమాట

ఈమాట పుట్టుక 1998 నవంబరులో. కే. వీ. ఎస్. రామారావు ముఖ్య సంపాదకుడిగా, సురేశ్ కొలిచాల సాహిత్య సాంకేతిక దిశానిర్దేశంలో, కొంపెల్ల భాస్కర్, విష్ణుభొట్ల లక్ష్మన్న ఉపసంపాదకులుగా తొలిసంచిక వెలువడింది. ఈమాట ప్రతిపాదన వెనుక రెండు కారణాలున్నాయి. ఒకటి, అమెరికాలో తెలుగు రచయితలకు ఒక వేదికను అందించటం, రెండు, ఆ పత్రికను ఈ-పత్రికగా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు లేకుండా కొత్త టెక్నాలజీని వినియోగించుకుంటూ అభివృద్ధి చేయగలగడం. 1998 దీపావళికి డైనమిక్ ఫాంట్ టెక్నాలజీతో వెలువడ్డ మొదటి తెలుగు ఈ-పత్రికగా ఈమాట ఇంటర్నెట్లో తెలుగు పత్రికలకు ఒక ముందడుగు వేసి చూపించింది. లాభాపేక్ష లేకుండా, రాజకీయ వాదాలకూ వర్గాలకూ అతీతంగా, రచయితలకూ పాఠకులకూ స్నేహపూరితమైన వాతావరణంలో ఒక ఉమ్మడి వేదికగా మనగలగడమే ఈమాట మొదటి లక్ష్యం. కాలం గడుస్తున్న కొద్దీ, కొత్తగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా ఎందరో పాఠకులను, రచయితలను, అభిమానులను కూడగట్టుకుంటూ ఈమాట నిరంతరమూ ఎదుగుతూనే వుంది. తెలుగు సాహిత్యంలో పీర్ రివ్యూ పద్ధతి ప్రవేశపెట్టడం, యూనికోడ్, వర్డ్‌ప్రెస్ వాడకం, ఇతర ఈ-పత్రికలకు తాము అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సాదరంగా అందివ్వడం – ఇలా ఈమాట ఈ పన్నెండేళ్ళలో ఒక కొత్త సంస్కృతికి నాంది పలికింది. ఈమాటకి ఈ ఎదుగుదల సమయంలో మార్గదర్శకత్వం చేసిన ఇంద్రగంటి పద్మ ఈమాట మూలస్థంభాల్లో ఒకరు. ఈమాటకు కొత్త రూపు రేఖలనివ్వడంలోనూ, ఈమాట సంపాదకురాలిగా సంచిక బాధ్యతలు నిర్వహించడంలోనూ పద్మ చేసిన కృషి అనితరసాధ్యం.

జూలై 2004లో వేలూరి వేంకటేశ్వర రావు ముఖ్య సంపాదకుడిగా బాధ్యతను తీసుకున్నారు. వారి నాయకత్వంలో ప్రస్తుతం శంఖవరం పాణిని, మాచవరం మాధవ్, ఇంద్రగంటి పద్మ సంపాదకులుగా ఈమాటకు సారథ్యం వహిస్తున్నారు. కేవలం కొత్త సాహిత్యాన్ని ప్రోత్సహించడమే కాకుండా, మనకున్న అపూర్వమైన సాహిత్యాన్ని పునఃపరిచయం చేయడం, తద్వారా సాహిత్య పునర్మూల్యాంకనానికి తోడ్పడగలగడం ప్రస్తుతం ఈమాట తలకెత్తుకున్న లక్ష్యాల్లో ఒకటి.

మనం ప్రస్తుతం ఒక ఎల్లలు లేని ప్రపంచంలో ఉన్నాం. మన అనుభవాలు, ఆలోచనలూ పెనువేగంతో మనచుట్టూ ఉన్న ప్రపంచంతో పాటూ మారిపోతున్నాయి. ఈ మార్పులన్నిటినీ ప్రతిఫలించగలిగే సాధనాల్లో సాహిత్యం ముఖ్యమైనది. ఒక జాతి సాహిత్య సృష్ఠికి తోడ్పడగల్గటం, సాహిత్యాన్ని ఆదరించడం ఏ ఒక్క పత్రికో చేయగలిగే పని కాదు. ఇందుకు మరిన్ని పత్రికలు అవసరం. గత కొన్నేళ్ళలో వచ్చిన పొద్దు, నవతరంగం, ప్రాణహిత తదితర పత్రికలు, పుస్తకం, పద్యం వంటి బ్లాగులు తమకంటూ కొన్ని సాహితీ లక్ష్యాలు ఏర్పరుచుకొని పరిశ్రమిస్తున్నాయి. ఇప్పుడు మాలిక టీం వారు ఒక కొత్త పత్రికను ప్రారంభిద్దామని ఉత్సాహంతో ముందుకు రావడం, అదీ కూడా తమకంటూ ఒక ప్రత్యేక దృక్పథంతో రావడం, సాహితీ ప్రియులకు ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం. మాలిక టీం ఏ రాజకీయ వాదాలకూ, వర్గ పోరాటాలకూ లొంగకుండా తమ పత్రికను నిష్పక్షపాతమైన ఒక చక్కటి సాహిత్య సామాజిక వేదికగా నెలకొల్పుతారని ఆశిస్తూ వారికి మా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాం. వారికి మా సహాయసహకారాలు ఎన్నడూ ఉంటాయి.

పొద్దు

తెలుగు బ్లాగుల్లో రకరకాల విషయాలపై మంచి రచనలు వస్తూ ఉన్నాయి. చక్కటి సాహిత్య చర్చలు, సామాజిక విషయాలపై చర్చలు మొదలైనవెన్నో జరుగుతున్నాయి. “ఇలాంటి ఆసక్తి కరమైన విషయాలను ఒకే చోట సంఘటితం చేస్తే ఎలా ఉంటుంది?” అని ఇద్దరు బ్లాగరులకు వచ్చిన ఆలోచన ఒక అంతర్జాల పత్రిక ఏర్పాటుకు దారితీసింది, పొద్దుకు బీజం వేసింది. 2006 డిసెంబరు 4 న అంతర్జాలాకాశాన మొదటిసారి పొద్దు పొడిచింది.

మిగతా పత్రికలు నెలకో రెణ్ణెల్లకో ఒకసారి వస్తూ ఉంటాయి. పొద్దు అలాకాక, తాజా రచనలతో ఎప్పటికప్పుడు తాజాగా ఉంటుంది. అది పొద్దు ప్రత్యేకత. పాఠకులకు ఎప్పుడూ నూతనంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టే, పొద్దు పదహారణాల అంతర్జాల పత్రిక, రియల్ టైమ్ పత్రిక. పొద్దులో మరొక ప్రత్యేకత, గడి! తెలుగులో మొట్టమొదటి ఆన్ లైను గళ్ళ నుడికట్టు, గడి ! ఆన్ లైనులోనే నింపి పంపగల గడి ఇప్పటికీ ఇదొక్కటే! సమర్ధులైన కూర్పరులు క్రమం తప్పకుండా, నాణ్యత తగ్గకుండా గడిని కూర్చుతూ పరిష్కర్తలను అలరిస్తూ వస్తున్నారు. పొద్దును నడిపినన్నాళ్ళూ గడిని వెలువరించడమే కాదు, గడిని చెయ్యగలిగినంతకాలం పొద్దును వెలువరిస్తూనే ఉండాలనేది పొద్దు ఆశయాల్లో ఒకటి.

ఇతర పత్రికల్లాగానే, పొద్దు కూడా మొదటి నుంచీ వర్డుప్రెస్సుపైనే నడుస్తూ వచ్చింది. అయితే, పాత రచనలను వెలికితీయడం వంటి కొన్ని ఇబ్బందుల కారణంగా, మరింత మెరుగైన సాఫ్టువేరు ఉండాలని అర్థమైంది. వర్డుప్రెస్సుపై నాలుగేళ్ళ స్వారీ తరవాత, ద్రూపాల్ సాఫ్టువేరును ఎంచుకుని, దానికి అనేక మార్పుచేర్పులు చేసి, ఒకరూపానికి తీసుకువచ్చాం. త్వరలో మరిన్ని కొత్త అంశాలు పొద్దులో చోటుచేసుకోబోతున్నాయి.

పూర్తికాలం పత్రికకే అంకితమైన వ్యక్తులు కాకుండా, పార్టుటైము నిర్వాహకులు, సంపాదకులూ మాత్రమే ఒక పత్రికను నిర్వహించాలంటే అంత తేలిక కాదు. అయితే పత్రిక నిర్వాహకులకు కావలసింది సమయం మాత్రమే కాదు, అంతకంటే కూడా అవసరమైనవి ఉన్నాయి -ఆసక్తి, ఉత్సాహం. ఈ ఆసక్తి, ఉత్సాహాలే ప్రస్తుతం పొద్దును నడిపిస్తున్న ధనమూ ఇంధనమూను.

పొద్దు నిర్వహిస్తున్న మరో పత్రిక, పుస్తకం.నెట్. పుస్తకం నిర్వాహకులు ఆ పత్రికను ప్రారంభించే తలపును పొద్దుకు చెప్పినపుడు, పొద్దు సంతోషంగా వారితో భాగస్వామ్యం స్వీకరించింది. సాంకేతిక బాధ్యతతో పాటు, పుస్తకం.నెట్ డొమెయిన్ పేరు, హోస్టింగులను కూడా పొద్దు నిర్వహిస్తోంది. పొద్దు-పుస్తకం సైట్లు తెలుగులో నాణ్యమైన, వైవిధ్యభరితమైన కంటెంటును సృష్టిస్తూ తెలుగు జాలపత్రికల్లో ముందంజలో ఉన్నాయి.

పుస్తకం

పుస్తకం.నెట్ అనేది పుస్తకాల గురించి, పుస్తక ప్రేమికుల వ్యాసాలతో నడుస్తున్న వెబ్సైటు. ఇది జనవరి 2009 లో మొదలైంది.ఇప్పటి వరకు వివిధ భాషా పుస్తకాలపై, రచయితలపై వ్యాసాలూ, పుస్తక ప్రదర్శనలు, ఆవిష్కరణల గురించిన వార్తా విశేషాలు, రచయితలతో – ప్రచురణకర్తలతో – పుస్తక విక్రేతలతో – మాటా మంతీ : ఇతరత్రా పుస్తక సంబంధిత అంశాలపై దాదాపు ఐదొందల వ్యాసాలూ వచ్చాయి. గొప్ప రచయితలైనా, మామూలు పాఠకులైనా – అందరూ ఒకే వేదికపై తాము చదివిన పుస్తకాలపై తమ అభిప్రాయాలు పంచుకోగలగడం పుస్తకం.నెట్ ప్రత్యేకత అని చెప్పవచ్చేమో. ఈ రెండేళ్లలో ఇది జరగడమే పుస్తకం ఇప్పటివరకు సాధించిన విజయంగా చెప్పవచ్చేమో.

2 thoughts on “స్ఫూర్తి

  1. ముందుగా మాలిక బృందానికి హార్ధిక శుభాకాంక్షలు.

    చదువరుల మనసులు పుష్పకవిమానాల్ల ాంటివి. ఒకరు కూర్చుంటే మరొకరికి చోటునిస్తూ.

    ఎన్ని వెబ్ పత్రికలు వచ్చినా అన్నింటినీ చదివే పాఠకులు ఉన్నారు. అవ్వారి సంఖ్య కూడా ప్రతి సంవత్సరం పెరుగుతోంది.

    మీ స్ఫూర్తి కి మూల కారణాలైన వారిని పేరుపేరునా పరిచయం చేయడం మీ సుహృద్భావానికి నిదర్శనం. దీనికి నా అభినందనలు మరియు ఆవకాయ తరఫున ధన్యవాదాలు!

    మీ
    రఘోత్తమరావు

Comments are closed.