April 25, 2024

హిందోళరాగం

రచన :  భారతీ ప్రకాష్



జన్యరాగం.

20 వ మేళకర్త నఠభైరవి నుండి జన్మించినది.

ఆరోహణ: స మ గ మ ద ని స

అవరోహణ: స ని ద మ గ స

షడ్జమంతోబాటు సాధారణగాంధారం, శుధ్ధమధ్యమం, శుధ్ధదైవతం మరియు కైశికినిషాదాలు ఈ రాగంలోని స్వరాలు.

ఔడవ-ఔడవ రాగం.

ఆరోహణలో వక్రం. ’మ’ వక్రస్వరం- మరియు ’గ’ వక్రాంత్యస్వరం.

ఆరోహణ ’స గ మ ద ని స’ గా కూడా కావచ్చు.

మోహనరాగం లోని గాంధారాన్ని షడ్జమం చేస్తే హిందోళంగా మారుతుంది. దీని ప్రకారం చూస్తే “స గ మ ద ని స “నే ఈ రాగం యొక్క ఆరోహణగా తీసికోవచ్చు. రాగాల్లో ఒక సూత్రముంది. అదేమిటంటే అరోహణలో కనుక ’స మ గ మ ’ వుంటే ’స గ మ’ తప్పకుండా అవుతుంది. ఉదాహరణకు కొన్నిరాగాలు చెప్తాను. అవి ఫరజు, వసంత, కమాస్, కేదార మొదలైనవి.

హిందోళం ఉపాంగరాగం.

’ప, రి’ వర్జ స్వరాలు.

’మ’ అంశ స్వరం.

’ద, ని’ జీవస్వరాలు మరియు న్యాసస్వరాలు.

’మ ని ద ని స ’ అనేది రంజిక ప్రయోగం.

త్రిస్థాయిరాగం.

గానరస ప్రధానరాగం. హిందుస్థానీ సంగీతంలో ’మాల్ కోస్ “రాగంతో ఈ రాగం కలుస్తుంది. అన్నివేళలూ పాడదగిన రాగం.

’స, మ, ని’ స్వరాలతో ఈ రాగంలోని రచనలు ప్రారంభమవుతాయి.

సర్వ స్వర మూర్చన కారక జన్యరాగం.

రాగాలాపనకు అంత ఎక్కువ అవకాశం లేని రాగం.

ఈ రాగం మన ఎన్నో పురాతన గ్రంథాలలో చెప్పబడింది.

 

ఉదాహరణ:

1. రాగతంగిణి—-లోచనకవి

2. రాగతాళ చింతామణి—గోవిందామాత్య

3. రాగతత్వ విబోధ—శ్రీనివాస

4. స్వరమేళ కళానిధి—రామామాత్య

5. శద్రగ చంద్రోదయ—పుండరీక విఠల

6. అన్నమాచార్య కీర్తనలలో కూడా కనపడుతుంది.

 

సంచారము.                                                           రూపకతాళం.

 

మాగసా| మగసనిదని| సా, నిదని|సా, మగమ|

మా, మగమ| గమదనిగమ| గమదనిసనిసా;;|

సా, మగస| సా, నిదని|సా, నిదమ| గా, మదని|

సమగసా,| సనిదమా,|

గమదనిసని| దమగసా,|

(ఈ సంచారంలో ఎరుపురంగులో వున్న స్వరాలు తారస్థాయి స్వరాలనీ, నీలపురంగులోవున్న స్వరాలు మంద్రస్థాయి స్వరాలనీ గ్రహించ ప్రార్ధన.)

 

కొన్నిముఖ్యరచనలు.

కృతి: సామజవరగమనా–ఆదితాళం–శ్రీత్యాగరాజు

కృతి: నీరజాక్షి కామాక్షి—రూపకతాళం—శ్రీ ముత్తుస్వామి దీక్షితార్.

 

సామజవరగమన

సామజవరగమన సాధుహృత్సార

సాబ్జపాల కాలాతీత విఖ్యాత ||సా||

 

సామని గమజ సుధామయగాన విచక్షణ

గుణశీల దయాలవాల మాంపాలయ ||సా||

 

వేదశిరోమాతృజ సప్తస్వర

నాదాచలదీప స్వీకృత

యాదవకులమురళీవాదన వి

నోద మోహనకర త్యాగరాజ వందనీయ ||సా||

 

ఇందుశ్రీరాముని మనోహరముగా వర్ణించినారు.

రాముడు గజగమనమువలె గంభీరమైన నడక గలవాదనియు, సాధువుల హృదయములను ప్రకాశింపజేయువాడనియు, కాలధర్మముల కతీతుడనియు కీర్తించినారు.

తర్వాత  సామవేదము నుండి పుట్టిన అమృతమయమైన సంగీతమందు పండితుడు, దాని సారము నెరిగినవాడు. దయాసముద్రుడు.

వేదములకు శిఖరమైనది ఓంకారము.

ఈ ఓంకారము మాతృకగానుండి సప్తస్వరనాదములను కలిగించును. అట్టి నాదమునకు దీపము వంటివాడు రాముడని చెప్పుటచే వేదములకు, వేదసారమైన ప్రణవమునకు, దానినుండి పుట్టిన సప్తస్వర నాదములకు శ్రీరాముడే ఆశ్రయమనియు, లక్ష్యమనియు నిరూపించి, ప్రపంచమందలి విద్యలు, సంగీతము, పరమాత్మయొక్క లక్ష్యమును నిరూపించుట కొరకే ఏర్పడినవని తెలియజెప్పినారు.

 

పైజెప్పిన సామాది వేదములను వాటికి సారమైన సంగీతముచే, పరమాత్మ యాదవకులందు కృష్ణుడుగా అవతరించి, తన మురళీవాదన రూపమున లోకమునకు మోహమును కల్గించి సకల చరాచర భూతములను తనవంక కాకర్షించెననియు వర్ణించినారు.

 

ఈ రాగంలో ఎన్నో సినిమాపాటలున్నానా కిష్టమైన పాట.

మనసే అందాల బృందావనం

వేణుమాధవుని పేరే మధురామృతం….

“మంచికుటుంబం” అనే సినిమా నుండి శ్రీమతి సుశీల పాడిన పాట ఇది.

 

5 thoughts on “హిందోళరాగం

  1. గిరిగారూ,
    రాగాలు రెండురకాలు.
    1. రాగాలాపనకి అవకాశమున్నరాగాలు.
    ఉదా: తోడి, సావేరి, భైరవి, మోహన, కాంభోజి, కల్యాణి మొదలైనవి.
    2. రాగాలాపనకి అంతగా అవకాశము లేని రాగాలు.
    ఉదా: పూర్ణచంద్రిక, కన్నడగౌళ, హుస్సేని మొదలైనవి.
    సాధారణంగా సంపూర్ణ రాగాలు ఆలాపనకి బాగా అవకాశమున్న రాగాలు.
    స్వరాలు తక్కువగా ఉన్న రాగాలు అంటే ఆలాపనకి అంతగా అవకాశముండదు.
    అలాగే సాధారణంగా వక్రరాగాలకి కూడా ఆలాపనకి అంతగా అవకాశముండదు.
    అలాగే వివాదిమేళరాగాలు, వాటి జన్యరాగాలు (నాట, వరాళి తప్ప) ఆలాపనకి అవకాశం ఉండదు.
    పంచమ వర్జ్య రాగాలు కూడా ఆలాపనకి అవకాశముండదు.
    ఇలా ఎన్నో ఉన్నాయి.
    ఆవిధంగా చుస్తే మీరన్నట్లుగా ఔడవ-ఔడవ రాగము, పంచమ వర్జ్యరాగము ఐన “హిందోళ” కి ఆలాపనకి అంతగా అవకాశము లేదు.

  2. శారదగారూ,
    మీ మొదటి సందేహానికి వివరణ..
    హిందోళరాగం మోహనరాగ గాంధార మూర్చనరాగం. మోహనరాగం యొక్క గాంధారాన్ని షడ్జమం చేసి పాడితే హిందోళరాగమవుతుంది.
    1. దీన్ని బట్టి హిందోళ ఆరోహణ “స గ మ ద ని స “అవుతుంది.
    2. ఎక్కడైనా ఆరోహణలో “స మ గ మ ” అని ఉంటే “స గ మ ” కూడా అవుతుంది.
    అందుకని వక్రం మారడానికి అవకాశమయింది.
    మరింక మీ రెండో సందేహానికి వివరణ..
    భాగ్యశ్రీ అంటే “భాగీశ్వరి” రాగం.
    నాకు తెలిసున్నంతమటుకు హిందోళంలా ఈ రాగాన్ని పాడటం అనేది లేదు. సినిమాపాటలనే తీసుకుంటె ఈ రాగంలో ఎన్నో ఉన్నాయి. “అలిగితివా సఖీ ప్రియా కలత మానవా”
    “రారా కనరారా కరుణ మాలినారా ప్రియతమలారా”
    “నీ కోసమె నే జీవించునది” మొదలైనవి.
    1952-53 లో వచ్చిన “మాయాబజార్” సినిమా లోనే ఈ రాగాన్ని చక్కగా వాడుకున్నారు. ఎక్కడా శుధ్ధదైవతాన్ని వాడలేదు.

  3. రాగాలగురించి నాకు తెలియదు కాబట్టి నాకు ఇక్కడ కామెంటే అర్హత లేదు అనుకోండి..కానీ ఎక్కువగా వినడం వల్ల తెలుసుకున్నయీ రాగం, ఇంకా మోహన రాగం నాకు ఇష్టమైనవి అని చెప్పకుండా ఉండలేక పోతున్నా …వ్యాసం చాలా బాగుంది…

  4. ౧. చిన్న అనుమానమండీ. రాగాలాపనికి ఎక్కువ అవకాశం లేని రాగమని అన్నారు, ఇది ఔడవ-ఔడవ రాగమవడం వల్ల అలా అన్నారా, లేక మఱేమయినా కారణమున్నదా.

    ౨. సంచారములో ఎరుపు, నీలము వర్ణాలలో స్వరాలు కనబడడంలేదు. అచ్చువేసినప్పుడు మరచినట్లున్నారు.

    ౩. సామనిగమజ లో సామని ప్రక్కన ఖాళీ అచ్చు పడింది

  5. చాలా ఆసక్తికరంగా రాశారండీ! అయితే నాదొక సందేహం.

    ఆరోహణలో “స-మ-గ-మ-” వున్నప్పుడు దాన్ని సాధారణంగా “స-గ-మ” అనే పాడతారు. నేను ఆ విషయం వసంత లోనూ, పరసు లోనూ గమనించాను. హిందోళం కూడా అదే రకమని ఇంతవరకూ తెలియదు నాకు. దానికి స-గ-మ-ద-ని-స అనే అనుకున్నానిన్నాళ్ళూ. ఎలాగూ స-గ-మ-ద-ని-స అని పాడేటప్పుడు మరి ఆరోహణ అలా వక్రంగా ఎందుకుంటుందండీ? కొంచెం వివరించగలరు, వీలైతే.

    ఇంకొక విషయం ఎవరో చెప్తూంటే విన్నాను, ఎంత వరకూ నిజమో నాకు తెలియదు మరి. మొదట్లో భాగేశ్రీని కూడా చతుశృతి దైవతం తో (ఖారహర ప్రియ జన్యంలా) కాకుండా శుధ్ధ దైవతం (నట భైరవి జన్యంలా) పాడే వారట. అంటే బాగేశ్రీ అచ్చం హిందోళం లా వినిపించేదన్నమాట. తర్వాత చాలా యేళ్ళకి ధైవతాన్ని షార్ప్ గా చేసి పాడటం మొదలైందిట. నేనైతే అలాటి ప్రయోగం ఎప్పుడూ వినలేదనుకోండి. ఇందులో నిజముందంటారా?
    శారద

Comments are closed.