April 19, 2024

ఓ పాలబుగ్గల జీతగాడా…..


  రచన : ఎన్నెల

ఏందో నాకు ఏడుద్దామంటె ఏడ్పొస్తల్లేదు…యెందుకిట్లనో సమజైతల్లేదు. ఆకలయితాందా అయితలేదా తెసుస్తల్లేదు..బాధయితాందా లేదా అస్సలుకె తెల్వదు. మొన్ననంగ తిన్నదే, నోరంత గడ్డి వెట్టుకున్నట్టు కొడతాంది. నాలుగు దినాల్సంది పానం ఒక్క కాడ నిలుస్తల్లేదు…బుడ్డొడిని సూసి రెండెండ్లాయె. ఎట్లున్నడొ ఏమొ! తల్సుకుంటె ఖుష్ అయితాందో దుఖమయితాందో ఏందో…ఎవలన్న మాట్లాదితె బాగుండు. ఎవరున్నరీడ? ఉన్న గుడంగ వాల్ల బాస నాకర్థం గాదు…మంచిగ మన బాసల మాట్లాడెటోల్లు కాన్రాక ఎన్ని దినాలయ్యె. నోరెండుకపోతున్నట్టుంది ఇంటికాడ ఎట్లుందో అందరు ఏంజేస్తున్రో! దేవుడా నా అసొంటి బతుకు పగోల్లకి గుడ ఇయ్యకు..తాసిలి బతుకు.. ఎందుకొచ్చిందో.

మా యమ్మ ఎంత ఎదురు చూస్తుందో . బుడ్డోనికి ఏమైన తిననీకి పెట్టిన్రో లేదో..పెట్టే ఉంటరు తియ్యి..ఒక బొమ్మ కొందునా ? మీ నాయిన అని చూయిస్తె దగ్గరికొస్తడో రాడో…వాడు పుట్టిన కొన్ని నెలలకే ఇంట్లకెంచి బయటవడ్డ , వానికెట్ల ఎర్కయితది నాయినెవరో! బూలచిమి యేంజెస్తుందో పాపం నన్ను గట్టుకోని ఎంత బాద బడుతుందో ఏమో! పిలగానికి ఒక బొమ్మ కొందునా? బొమ్మ నోట్ల మన్ను వొయ్య, ఏమాలోచన జేస్తున్ననో సమజైతల్లే. గిసొంటి టయిము దేవుడెందుకిస్తడో?

నాయిన చిన్నప్పుడే చెప్పిండు..రాజాలూ నిన్ను నా లెక్క చెయ్య బిడ్డా గీ కూలి నాలి పనులు నీకొద్దు మంచిగ ఇస్కూల్కి బొయ్యి రాజా లెక్క బత్కాలె నువ్వు గందుకె పంతులు నీకు ఆ పేరు ట్టిండని ఎన్నిసార్లు చెప్పిండు..పేరెవ్వరు పెడితె ఏంది రాత రాసినోడు సక్కంగ రాయకుంటె. నన్ను ఇస్కూల్కి బొమ్మంటనే నాయిన మీదికెల్లిపోయిండు. నాకు ఆ నాటికి మీదికెల్లిపోవుడేందో గుడ్క తెల్వదు. గుండు కొట్టించి , సల్ల నీల్లల్ల ముంచి, మెడల దండేసిన నన్నెత్తుకోని కుండవట్టుకోని నాయినను మీదికి తోలిన్రు..జెర్రంత యాదికొస్తాంది. అమ్మ పానమంత నాయినతోనె బొంగ నేనున్ననని జెరంత పానం నిలుపుకున్నట్టుంటుండె.

మూన్నెల్లు మామయ్యోల్ల ఇంటికాడుండి మల్లొచ్చినము. అమ్మ ఊకె ఏడుస్తుండె. మేస్తిరి మామ ఒచ్చి.’ఊకో కమలమ్మా పిలగాన్ని సూసైన నువ్వు లెవ్వాలె..కూలికి టయిమైతాంది నడువు అని గదిరిచ్చి తోలకబోతుండె. జెర్ర పెద్దగైతుంటె తెలిస్తుండె నాకు అమ్మ పానం జెరంత నా కోసరం ఇడ్సవెట్టి జెరంత నాయిన కొంచవొయ్యినట్టున్నడు. గా కొద్ది పానం కూలిపనులల్ల తగ్గుకుంట ఒచ్చింది. పది యేండ్లు రాంగనె మేస్తిరి మామ రమ్మని చెప్పంపిండు. గోటీలాడుతున్నోడిని ఉర్కి బొయ్యిన. ఏందిరా రాజాలు ఇంక గోటీలాడితె ఎట్ల అమ్మకు పానం మంచిగుంటల్లే. ఇగ అమ్మను ఇంటికాడుంచి నువ్వు కూలికి రా పని నేర్పిస్త అన్నడు..అమ్మ చాన ఏడ్చింది. మేస్తిరి మామ, వనజత్త ఒచ్చిన్రు….పర్వలే ఒదినే మేము లేమ పోరగాన్ని జూడనీకి, పరాయోల్లమా అన్నది వనజత్త. దైర్నం జేసుకో కమలమ్మ నీ పానం పురాగ ఖరాబయెదాంక ఊకుంటవా పొరగాడు ఆగం గాడా, నువ్వు గాజుబొమ్మ లెక్క పానం నిలుపుకోవాలె ఆని మొకం జూసి.ఊకో ఊకో…పిలగాన్ని జెల్దిన తోలియ్యి అన్నడు మామ. నీ కాల్మొక్కుతన్న పోరగానికి ఎక్కువ పని చెప్పొద్దని అమ్మ ఒక్క తీరుగ బత్మిలాడింది. అట్లనే నువ్వు పికర్ జెయ్యకు అంజెప్పి మామ నన్ను ఎంట తోలకబొయ్యిండు…అమ్మ ఆ దినం సూసిన సూపు ఎప్పటికి మర్వలేనట్టుండె.

మొగోల్లకి వంద ఆడొల్లకి ఎంబై ..పిల్లోల్లకి యాభై ఇస్తుండ్రి..పైసల్ సరిపోతలెవ్వని అమ్మ రెండు ఇండ్లల్ల బాసన్లు తోమి అడుగు బొడుగు ఇచ్చింది తీస్కస్తుండె. నాకు పదిగేనేండ్లు రాంగనె అమ్మ పానం పురాగ ఖరాబయ్యింది. కొన్ని దినాలు మామ ఉష్కె మోపిచ్చిండు..కంకర బెందెడు మొయ్యనీయలే…రాంగ రాంగ మాల్ కలుపుడు..ఇట్కె పేర్వుడు, అస్తర్ కొట్టుడు నేర్చిన..అమ్మ నువ్వొండి పెడితే సాలు..పనికి బోకుమని చెప్పిన. ఇంకొక్క యాడాది గాంగనె, అమ్మకు వండ చాత గుడ అయితల్లే. నేను జెర్రంత వొండి పనిలకి పోబట్టిన…

ఒక దినం పక్క ఊరి కెంచి గంగయ్య మామ ఒచ్చిండని అమ్మ పిలగాల్లని తోలిచ్చింది. మా బూ లచిమిని మీ రాజాలు కి అడగనీకొచ్చిన యేమంటవు చెల్లే అన్నడు. అమ్మ నా దిక్కు చూసింది. గా పొల్ల ఎవలో, ఎట్లుంటదో నాకు తెల్వది. నాయిన పోయిన సంది యాడికి పొయ్యింది లేదు, ఎవలని చూసింది లేదు. ఇల్లేందో, అమ్మేందో, నా పనేందో. కట్నమియ్యనీకి నా కాడ యేం లేదు కమలమ్మా. బూ లచిమి కూలికి పోతది, నీకు జెర వండిపెడతది..ఏమంటవు” అన్నడు గంగయ్య మామ. అమ్మ కండ్లు మెరవంగ జూసి ఎంత కాలమాయే! అమ్మకి జెర పానం మంచిగయిందో, బల్మీకి తెచ్చుకుంటుందో గాని అమ్మ లేచి తిఉగవట్టింది.

బూలచిమి పేరుకి తగ్గట్టు బూ లచిమే. నా ఎంట కూలికొస్తుండె. ఇంటి పనంత చూస్తుండె. అమ్మ మెల్లగ అన్నం కూర ఒండుడు షురూ జేసింది. ఇంటికి బోంగనే అమ్మ ఇద్దరికి ఉడుకుడుకు బువ్వ పెడుతుండె. ఇద్దరి మీద జెరన్ని పైసలు మిలుగుతున్నయి. బూ లచిమి ఏడో నెల వచ్చేదాంక పనికి ఒచ్చింది.. గంగయ్య మామొచ్చి కానుపుకి తీస్కబొయ్యిండు. దేవుడా నా బిడ్డని సల్లంగ సూడుమని అమ్మ ఒకటే మొక్కింది. అమ్మ ఎదురు సూపుకు గంగయ్య మామొచ్చి పిల్లా నీలాడింది..పిలగాడు పుట్టిండని చెప్పోయిండు. ఆదర బాదర పోదామని మనసుకి అనిపిచ్చింది..కానీ పనులతోని కాలే. అమ్మ గుడంగ మనుమని ఎప్పుడు సూస్తనా అని కాసుకుంది. రెండు నెలలు నిండంగనె బూ లచిమిని , పిలగాన్ని తోలిచ్చి పొయ్యిన్రు. అమ్మ బుడ్డోడ్ని చూస్తుంటె, బూ లచ్మి పనులు చేస్తుండె.

మల్ల జెర పైసలకి కట కట. పచ్చి బాలెంతను పనికెట్ల తోలిస్తం బిడ్డా ఉన్నంతల తిందాం తియ్యి అని అమ్మ అంటుండె. మా ఊరి పంతులయ్య బిడ్డ గీతక్క మగని తోని కిరి కిరి వడి ఇంటికొచ్చింది. ఆ అక్కకు బుడ్డోడు మస్తు నచ్చిండు. ” బాపనోల్ల పిలగాడు నీకెట్ల పుట్టిండురా రాజయ్యా..నాకిచ్చెయ్యిరా వీన్ని పెంచుకుంటా” అని అక్క అంటుండె. నీ కన్న ఎక్కువనా అక్కా అట్లనే తీస్కో అంటుంటి. బూ లచిమి నవ్వుతుండె. అమ్మ కండ్లు మల్ల మల్ల మెరుస్తున్నయి. పైసలకి కట కట బోంగ అంత మంచిదే. బూ లచిమిని పనికి రమ్మందునా? అమ్మ బుడ్డొడిని చూడ చాతనైతదా? గీతక్కకి బుడ్డోడిని సాకనీకి ఇచ్చేద్దునా? అమ్మో అమ్మ కండ్ల మిల మిల ని ఏడికి తోలియ్య..ఇట్ల సోంచయిస్తుంటె, మస్త్ బుగులయితాంది. రాత్రి నిద్ర పడతల్లేదు.

పొదుగాల గొల్లోల్ల పద్మి ఒచ్చిండు. రాజాలు నేను దేసం పోతున్న నువ్వొస్తవా అన్నడు. నాకేం దేసమ్రా పద్మీ, నేనేందో నా లోకమేందో అన్న. డెబ్బై వెయిలు కడితె మాల్దీవులకి తోలిస్తరంట నెలకు ఏడు వెయిలు జీతమంట. ఒక యాడాదిల అప్పు తేరిపోతది. మూడు నాలుగు ఏండ్లుంటె రెండు మూడు లచ్చలు జేస్కొని మర్లి రావొచ్చు. గీ కట కట ఉండదు గదరా అన్నడు. అంత మంచిదే గాని డెబ్బై వెయిలు యాడకెంచొస్తయి రా అన్న. నేనయితె ఇల్లు గిర్వి పెడుతున్న, నువ్వేమైన ఆలోచన చెయ్యి అన్నడు. నేను ఊగులాడుతున్న. అమ్మకు బూ లచిమి తోడు, అమ్మ కండ్లకు బుడ్డోడు తోడు, పోదమా అనుకున్న. బుడ్డోడు అదురుష్టం తెస్తుండురా పోదాంపా అన్నడు పద్మి. ఎవలి తోనన్న మాటాడి జెల్దిన జెప్పు అన్నడు పద్మి. నాకు పదారేండ్లు. ఇంటికి నేనే పెద్దోడ్ని. అడగనీకి ఎవరున్నరు? నా గుడిసె మీన ఎంతిస్తడొ అడుగుదాం పా అని పద్మిని తోల్కోని సేటు కాడికి బొయ్యిన. ఇంటికి పొయ్యిన గానీ ఏం జెప్పలె.

తెచ్చిన పైసలల్ల కొన్ని నాకాడ బెట్టుకున్న. పనికి పోవుడు తక్వ జేసిన. సారు జెప్పిన లెక్క రెండేండ్లు ఎక్కువేసి పద్దెనిమిదేండ్లు అని రాపిచ్చినం పైసలిచ్చి. ఏందో పోలీస్ తేషన్ల కాగిదాలు చేపిచ్చినం. పోలీసోడు ఇంటికస్తె పైసలిచ్చినం. పాస్పోరటు కాగిదాలు గిట్ల సారు దగ్గరుండి చేపిచ్చిండు.. గిసొంటి కతలన్ని బానే తెలుస్తున్నయ్. పోయే రోజొచ్చింది. బూ లచిమికి చెప్పిన అమ్మ, బుడ్డోడు నా రెండు కండ్లు, వాల్లని పైలంగ చూసుకో..నీ చేతుల పెడుతున్న పొయ్యొస్త మల్ల అన్న. అమ్మ కండ్లల్ల లీల్లు కారుతున్నయ్. నాకు అమ్మ సరింగ కానొస్తల్లేదు. కండ్లు తుడుసుకోని మల్ల మల్ల సూసిన. అమ్మ మొకం చేతుల దాచుకొని యేడుస్తాంది. అమ్మ మొకమొక్క పారి కనిపిస్తే  బాగుండు.

సారు, పద్మి వొచ్చిన్రు. ఎయిరుపోట్ల   ఎవలైన అడిగితె, ఆ దేసం ల మా యక్క ఉన్నది సూడబోతున్న అని చెప్పుమన్నడు. ఆ సారేం మాట్లాడుతుండో నాకైతె సమజ్ గాలే. పద్మి ఉన్నడన్న దైర్నానికి పోతున్న. కేరల బొయినం. ఆడికెంచి ప్లేను (గాలిమోటరనొద్దు గిట్లనాలని సారు చెప్పిండు)ఎక్కబోయినం. మాకు అంగ్రెజి రాదు అని చెప్పినం. ఇందీ ఆయనని తోల్కొచ్చిన్రు.మా నసీబ్ బాగున్నట్టుంది. ఎవ్వలు ఎక్కువ ఏం అడగలే.సారు చెప్పిన తీరుగ మా యక్క ఉన్నది సూడబోతున్నమని చెప్పినం. చిన్న బుక్క అన్నం బెట్టిన్రు…నాకు జెర బుగులయ్యింది..ప్లేన్ ల కెంచి కిందికి జూస్తే అన్ని లీల్లు జెర్రైనాంక దూది ఉప్పు లెక్క కాన్రావట్టె..గదేందిరా పద్మీ అన్న..నాకు గూడ తెల్వదురా అన్నడు. ఒక గంట కాంగనె  మాలే ల ఉన్నం. ఇషార జేస్కుంట ఏటూ బోవాలె అని తెలుసుకుంటున్నం..తెలుగా మీది అని ఒక సారు మందలిచ్చిండు..మాకు మస్త్ ఖుష్ అయ్యింది. పేర్లేంది అన్నడు? రాజాలు, పద్మి అయ్యా అన్నం. అగో ఆడ నిలబడ్డోల్లు మీ కోసరం ఒచ్చిన్రు పోండ్రి అన్నడు..అయ్య నీ కాల్మొక్కుత బాంచన్ అని చెప్పి వాల్ల కాడికి పొయ్యినం..రాజ్, పాద్ అని మాకు కొత్త పేర్ల తోని పిలిచి షేకాండు జేసిన్రు. మాకు జెర చెక్కరొచ్చినట్టయితాంది. మా పెట్టెలు వాల్లే తీస్కున్నరు..చిన్న పడవ్లకి ఎక్కిచ్చి పది నిమిషాలల్ల మాలే కి కొంచవోయిన్రు.

పెద్ద పెద్ద బవంతులు కడుతుండ్రీడ. మమ్ములను పనిల వెట్టిన్రు. వండుకునుడు గిట్ల ఏంలెవ్వు. షాపలు లీలల్ల ఉప్పేసి ఉడకవెట్టి..ఆ షారు దొడ్డు బియ్యం బువ్వ తెస్తుండ్రి.అన్నంల షారు కల్పుకోని షాప ముక్క అంచుకి వెట్టుకోని తినాల్నంట .మా పెద్ద మేస్తిరి అరవోడు. కారం లేదా అని ఎట్ల అడగాల్నో తెల్వకపాయె. పొదుగాల చాయ్ డబల్ రొట్టె ఇస్తరు. వెన్న జాం అంట. మాకెర్కలెవ్వు. మెల్లగ తెలుస్తున్నయి. ఎనమిది నెలలు కాంగనే యీడ పని అయిపోయింది..ఇంకో దీవికి పోవాలె అని చెప్పిన్రు..జెర ఇక్కడోల్లు మాట్లాడింది ఎర్కయితాంది…అందరు మందలిస్తరు నవ్వుకుంట..మంచిగ్గొట్టింది.

ఈడ మాకేమి కర్సులేవు. ఒక పెద్ద రూముల నలుగురం ఉంటుంటిమి. మా ఎంట బాలాజి ఉంటుండు..యీడు నెల్లూరు పిలగాడంట కొంచెం తెలుగు, కొంచెం అరవం మాట్లాడతడు..పెద్ద మేస్తిరి మాటలన్ని యీ పిలగాడే మాకు తెలుగుల చెప్తడు..మల్ల మేము అడీన దానికి మేస్తిరికి చెప్తడు. పద్మి నేను ఒక తాన్నే పని చేస్తున్నం మా తానున్న నలుగురం ఒకొక్క నెల ఒక్కొక్కరింటికి పైసలు పంపినం మూడు నెలల జీతం జెరన్ని కర్సులకి పట్టుకోని ఇర్వై వెయిలు పంపినం. మల్ల మల్ల  పంపనీకి గాదు. ఎంభై వెయిలల్ల మిత్తి వట్టుకోని ఇచ్చిండు సేటు. గంగయ్య మామ చిట్టి పాడి పదివెయిలిచ్చిండు. సత్తెమ్మ పెండ్లివరకిస్తె సాలు బిడ్డా అన్నడు…మూదు షాతం లెక్క తీసుకుంటుండు సేటు. ఐదారు నెలల మిత్తి గట్టి పైలంగ ఇంటి కర్సులకి వాడుకోమని బూ లచిమికి చెప్పుమని సారు ఫోన్ జేసినప్పుడు చెప్పిన. బూ లచిమిని పనిలకు పోవొద్దని చెప్పుమన్న.మేము ఫోన్ చెయ్యనీకి ఎర్కలే మమ్ములని పంపిన సారు యీడి మా మేస్తిరికి చేసిండు రెండు పార్లు. …

జర తెల్సుకున్నంకా గీతక్కకి ఫోన్ చేసి నేను పద్మి మాట్లాడినం…బూలచిమి ఊకె ఉండె పిల్ల గాదు..మనెమ్మ పెద్దమ్మ కాడ గుత్తకు జెరన్ని ఆకు కూరలు, కూర గాయలు దెచ్చి ఇంటి కాడ అమ్ముతుందంట. చుట్టు ముట్టోల్లు కొనుక్కోంగ ఇంట్లకి ఎల్తున్నయంట..రోజుకు ఇర్వై ముప్పై మిలుగుతున్నై పికరు చెయ్యొద్దని చెప్పుమన్నదంట..పోనితియ్, కూలి కస్టం కన్న ఇది మేలని ఖుష్ అయిన. గీ పది నెలల్ల రెండు పార్లు పంపినం , జెర మనుసుకు మంచిగ్గొడతాంది. మిత్తికి పోంగ ఇంటి కాడ గడుస్తుంది. అమ్మ మంచిగనే ఉందంట. అప్పు దేర్పాలె. ఒక్క యాడాదిల తేర్పుతమనుకున్న..ఇంకొక యాడాదే పడతదో తెల్వది. సత్తెమ్మ పండ్లికి లగ్గాలు పెట్టుకుండ్రంట. గీతక్క నన్ను పరేషాన్ గాకుమని చెప్పింది. బూ లచిమి చిన్న చిన్నగ మిగిలిచ్చిన పైసలతోని 20 నెలల చిట్టి ఏస్తుందంట. అది ఎత్తుకుని ఇస్తా తియ్ అని చెప్పిందంట. పది నెలలు కాంగనె..ఈడ పని అయిపొయ్యింది ఇంకొక దీవికి పోవాల్నని చెప్పిండు మేస్తిరి..పద్మీ నేను ఒక్క తాన్నేనా అని బాలాజీ ని అడుగుమన్న…నవ్వుకుంట జెప్పిండు మిమ్ములను ఇడగొట్టడంటలే..అని…సోపత్తిల పోయినం.

యీ దీవిల అందరు మందలిస్తరు…ఇషార జేస్కుంట నవ్వుతరు..మాకు భీ జెరంత సమజ్ అయితాంది. ఉన్నవా తిన్నవా అని అడగ నేర్సినము. పురాగ మాట్లాడనీకి రాదు .ఇంటోల్లు అప్పుడప్పుడు షాపల తోని కవాబులు చేసిస్తరు. యీ దీవి మాలే లెక్క లేదు..సల్లగ మంచిగుంది..పని కాంగనె పొద్దుమీకి జెర సల్లగ తిరుగుతుంటిమి. ఒక నర్సమ్మ కానొచ్చింది ఎవరో చెప్పిన్రంట ఇండియ కెంచి యెవలొ వొచ్చిన్రని. తెలుగోల్లేనంట . మమ్ములను తిన్నరా అని అరుసుకుంటుండె. గనేస్ పండుగ నాడు మమ్ములను పిలిచి అన్నం బెట్టింది…ఎన్ని దిన్నలయ్యెనో గిసొంటి బువ్వ దినక! అమ్మ కాకరకాయ తోని తొక్కు లెక్క చేస్తుండె అని చెప్పిన. అమ్మ మస్త్ యాద్కొస్తుందని చెప్పిన. పద్మి కండ్లల్ల లీలు తెచ్చుకుండు. అమ్మ ముచ్చట్లు, బుడ్డోని ముచ్చట్లు విన్నది…మాకు మస్త్ ఖుష్ అయ్యింది..చాలమ్మ ఇన్ని దినలకు నువ్వు మాట్లాడినవు నీ కడుపు సల్లగుండ అని అన్నం. మల్ల రండ్రి ఎప్పుడైన అన్నది. ఒక నెల కాంగనే ఇంకో ఊరు పంపిన్రు.

ఆడ ఉండంగ మూడొ అంతరం ల సజ్జ మీద నిలబడి అస్తరి కొడుతుండంగ చేతిల మాల్ గంప జారిందని జెర్రంత ఒంగిన దేవుడా….అట్లనె కింద వడ్డా!నడ్డి బొక్క ఇరిగిందని డాక్టరమ్మ చెప్పింది. పురాగ లేవ చాతనైతల్లేదు..ఇక్కడోల్లు మంచోల్లే. పాపం లెవ్వనియ్యకుంట సేవ చేస్తున్రు. యీ నెల పైసలు రాలే. ఇంటికాడ ఎట్ల అనుకున్న .ఒక నెలకైతే ఇంటి కాడ పర్వలేగద .నా దాంట్ల చెరిన్ని తీసుకోమందాం, మల్ల నువ్వు పంపినప్పుడు మల్ల సగం సగం చేసుకోమందారి అన్నడు..దేవుడా..మా పద్మి గాన్ని సల్లగ సూడుమని మొక్కిన. పద్మీ ఇంటి కాడ తెల్వనియ్యకురా..అమ్మకు దెలుస్తె పానం కల కల అన్న. అట్లనే తియ్రా..చెప్పను తియ్ అన్నడు. కానీ అమ్మ బూలచిమి బుడ్డోడు ఊకె యాదికొస్తాన్రు. జెర మంచిగ కాంగనే పనికి పోదారని  అనుకున్న. యేడ!  నిల్వనీకి రాకపాయె. ఇంటికి పోదమా అని ఎన్నిపార్లు అనుకున్ననో నాకే తెల్వది. ఇంక పది నెలలన్న గాక పాయె. యీడోల్లు ఏమనుకున్నరో పనికి బోకున్న జెరన్ని పైసలు ఇయ్యవట్టిన్రు . ఇంటికి బొయ్యి కుద్త యేం జెయ్యొస్తది..యీడనన్న మందు మాకు పుకట్కే ఇస్తాన్రు..యీల్ల కడుపు సల్లగుండ. జెర్ర ఓపిక పడితె పనికి పోవొచ్చని సైసిన. మల్లొక్క పారి ఇంటికి ఇర్వై వెయిలు పంపినం.నా గురించి పద్మి గాని ఇంటికి పైసల్ తక్వ వోతున్నై . పద్మి ఇంటికి సగం , మా ఇంటికి సగం పొయ్యింది. మిత్తి మందం అయితాంది. అమ్మ గిట్ల మంచిగనే అని చెప్పింది. సత్తెమ్మ పెండ్లికి పొయ్యొచ్చిన్రంట. అప్పుడప్పుడు ఇంటికి మాట్లాడుతున్నం. ఎప్పుడొస్తున్నరని అందరు అడుగుతున్రంట…ఇంకా తెల్వదు అని చెప్పినం.

ఎనమిది నెలలు కాంగనె జెర లేసి నడవ వట్టిన. నడుము నొస్తుంది మందులు తింటున్న. చిన్న చిన్న పనులు చెయ్యబోతున్న. ఊకె పైసల్ దీస్కోనీకి సిగ్గయితాంది. ఉష్కె పడుతున్న. అదైన మంచిదే అన్నడు మేస్తిరి. జెర్రంత వీల్లు మాట్లాడేది అర్థం అయితాంది. మేస్తిరి బార్యకు సుస్తీ అయింది. జెర్రంత అన్నం వొండి షాపల పులుసు చేస్తున్న. పనోల్లందరు మస్త్ ఖుష్ అయ్యిన్రు. అక్క గుడంగ తమ్మీ నువ్వు మస్త్ పని జేస్తున్నవని మెచ్చుకుంది.మీరు చేస్తున్న దాంట్ల ఇదెంత అన్న. రోజులు మెల్లగ నడుస్తున్నై. పద్మిని ఇంకొక దీవిల పనికి పంపిన్రు. నేను గుడంగ పోతా అన్న. రాజాలూ ఇక్కడోల్లు మంచోల్లు, నిన్ను మంచిగ చూసుకుంటున్రు…కొత్త జాగాల ఎట్లుంటరో…చిన్న చిన్న పనులు చేసుకోరా ..ఆడ కాంగనే మల్ల కలుద్దారి అన్నడు..నిజమే అనిపిచ్చింది..చెట్లకు లీల్లు వడుతున్న. పద్మి లేకుంటె కష్టమే అయితాంది. మన బాసల మాట్లాడనీకి ఎవ్వలు లేరు.ఫోను కారటు కొనుక్కోని గీతక్కకు నెలకొక్కపారి ఫోను చేస్తున్న. పోకలు తెస్తరు…వాటిని చితక్కోట్టి పెడుతున్న. తమలపాకుల తీగల కెంచి ఆకులు తెంపి పెడుతున్న. మేస్తిరి ఇంటికి దుక్నం ఉన్నది..జెర్రంత సేపు దుక్నం ల సామాన్లు జమాయిస్తున్న. చెత్త తీస్కపొయి సముద్రం కాడ పాడేసి వస్తున్న. షాపలు ఎండబెట్టి తీస్తున్న. గిసొంటి పనులకి బాంగ్లా దేషం కెల్లి పోరగాల్లని తెచ్చుకుంటరంట.రెండు వెయిలిస్తున్నరు. కాని తియ్ మంచిదే అనిపిస్తాంది. వాల్లు ఇస్తున్న జీతానికి ఏదోటి చేస్తున్ననని పానం నిమ్మలమయింది.ఇంటికి పైసలు పంపనీకి అయితల్లేదు.  జీతం లెక్క 14 వెయిలు చేతిలున్నై…మల్ల మిత్తికి పైసలు పంపాలె. మేస్తిరికి చెప్పిన ఇంకొక్క 3 నెలలయితె 20 వెయిలయితయ్ పంపొచ్చు. ఖర్సు తక్కువైతదని చెప్పిండు. ఫోను చెయ్యలనిపిస్తది గాని పైసల్ జల్దిన తేర్పితె జెల్దిన ఇంటికి బోవొచ్చు. ఇంటికి ఫోను చేసిన. అమ్మ పానం జెర బాగలేదని అక్క చెప్పింది…బూలచిమి ని పిలువుమన్న. చాన దినాలకి ఆ పోరి గొంతు ఇనంగనే మస్త్ ఏడుపొచ్చింది. యీడ అంత మంచిగనే ఉన్నది. అత్తమ్మను నేను బానే చూసుకుంటున్న, నువ్వు ఫికర్ చెయ్యకుమని చెప్పింది…ఆ పొల్ల మస్త్ ఏడ్చింది. ఎనకసిరికి బుడ్డోడి ముచ్చట్లు చెప్పింది..గీతక్క నేర్పిచ్చిన చిట్టి చిలకమ్మా అని ముద్దు ముద్దుగ చెప్పిండు..నేను ఎవ్వలని అడిగిన..ఏం మాట్లాడలే….నాయిన నాయిన అని చెప్పు అని బూలచిమి చెప్పింది..వాడు నాయిన అన్నడు…నాకు పొయ్యి వాడిని ముద్దాడాలని అనిపిచ్చింది. కొన్ని రోజులు ఆ ముచ్చట్లు తల్చుకుంట టైము తెల్వలే.ఒక దినం నిద్ర లేవంగనే మేస్తిరి చెప్పిండు. మాలే కెంచి మా పెద్ద మేస్తిరి కాడికెంచి ఫోను ఒచ్చిందంట. ఇండీ ల మేస్తిరి ఫోను చేసి నన్ను అర్జెంటుగ ఇంటికి ఫోను చెయ్యుమని చెప్పిండంట. జెల్దిన బొయ్యి గీతక్కకి ఫోను చేసిన. ఎవ్వరు ఎత్తలే. మల్ల మల్ల జేసిన. పంతులు ఎత్తిండు. రాజాలు నువ్వు గుండె గట్టిగ జేసుకో బిడ్డా… అమ్మ రాత్రి తేరిపోయింది..నువ్వు జెల్ది రావాలె అన్నడు…నాకు సముద్రం పొంగి ఒస్తుందా అనిపిస్తుంది…ఇగ పంతులు ఏం మాట్లాడుతున్నడొ తెలుస్తల్లే…ఎట్ల జెయ్యాలే…యీడ మాట్లాదనీకు భీ ఎవ్వలు లేరు…. మా మేస్తిరికి జెప్పిన. రాత్రి షాపల పడవ పోతాంది దాంట్ల పోతవా అన్నడు…అవునన్న. అందరొచ్చి చూసిపోతున్రు. రాత్రికి పడవెక్కిన. ఇగ మీ వోల్ల తానికి పోకు..మీ మేస్తిరికి ఫోన్ జేసి చెప్త ఎయిర్పోర్టల నిన్ను కలువుమంట..నువ్వు ఆడనే ఉండు జెర్రంత టయిము కలిసొస్తది అన్నడు. మా అందరి పాస్పోర్టులు గిట్ల పెద్ద మేస్తిరి కాడ ఉంటయి..నేను పోవాల్నంటె కాగితాలేంటివో కావాల్నంట. నువ్వు పొయినాంక ఆడికొచ్చి ఇస్తరుతియ్ నేను చెప్తా అన్నడు.మనసు ఉర్కుతాంది పడవ మాత్రం యీడనే ఉన్నది. చేతులున్న పైసలు పోనీకి రానీకి అయితయి. ఫ్లైటుకు పోను రాను 12 వెయిలు అయితదంట. కేరల కెంచి సెకిందరబాదు పొవ్వాలే. ఆడికెంచి గజ్వేల్ బస్సెక్కి పోవాలె. యీడనే రెండు దినాలయితాంది. ఎప్పుడు పోతనో తెల్వదు. పైసలు ఎట్లనో..ఆడికి పోంగనె ఎవలనడగాలె..మొదాలు ఎవలతోని మాట్లాడాలె. ఇన్ని దిన్నాలయినాంక పొయ్యి పైసల్ లెవ్వంటె బాగుంటదా…అమ్మనెట్ల తోలియ్యాలె…ఆలోచన జేస్తుంటె పిచ్చి పడతాంది…బూలచిమికి పెండ్లికి కమ్మలు కాల కడియాలు పెట్టిన్రు. అడుగుదునా…పోల్ల అడుగుతె ఇస్తది. దాని అవ్వగారోల్లు ఏమనుకుంటరో…దేషాలు బట్టి 2 ఏండ్లు పోయినోదు పెండ్లాం కమ్మలు అమ్ముకతిన్నడనుకుంటరో ఏమో.

తెల్లారి మాలేకి పొయ్యిన. పడవోల్లు మాలేకి కొంచవోకుంట ఎయిర్పోర్ట్ తాన దింపిన్రు. వాల్లు మేస్తిరిని కలిసి నేను ఈడికి వొచ్చిన అని చెప్తమన్నరు. ఇప్పుడు కండ్లల్ల నీల్లొస్తున్నై…అమ్మ అమ్మా అమ్మా….అమ్మ పోయ్యిందని తెలిసినప్పుడు యీ నీల్లు ఏడికి పొయ్యినయ్…అటు పంతులు చెప్పుడేంది..దమాక్ పైసల లెక్కలు పెట్టవట్టె..మేస్తిరికి నేను చెప్పెడిది అర్థం ఐతదో కాదో, యీ రాత్రి పడవలు పోతున్నయొ లేదొ, పెద్ద మేస్తిరి కలుస్తదో కల్వడొ, టికీటు దొరుకుతదో దొర్కదొ, పైసలు ఎట్లనొ..ఇదే రంది.ఇన్ని గంటలయినాంక యీడికొచ్చి నాలుగు గంటలు కూకున్నంక కండ్లల్లకెంచి రెండు సుక్కల లీల్లు బయలెల్లినయ్. కండ్లు తూడ్సుకుంట అటు సూసిన. పెద్ద మేస్తిరి, బాలాజీ , పద్మి ఉర్కి వస్తున్నరు…పద్మి ఈడికెప్పుడొచ్చిండొ…వాన్ని చూడంగనే గుండె పలిగింది. పద్మీ అమ్మని తోలియ్యబోతున్నరా అని గట్టిగ ఏడ్వవట్టిన. పద్మి నన్ను  దగ్గరికి తీసుకుండు. నాకు దుక్కం ఆగుతల్లె. చిన్న పిలగానిలెక్క లాజిగ ఏడ్వ వట్టిన.వొచ్చిపొయ్యేటోల్లందరు మందలిస్తున్రు..ఏమయ్యింది అని..యేన మమ్మ మరువె అని పెద్ద మేస్తిరి చెప్తుండు..అవునా అని అందరు కదిలి పోతున్రు. మనసు ఇంకింత పచ్చిగయింది. పదిమి డబల్రొట్టె తెచ్చిండు జెర్రంత తినురా అని…ఒద్దు అని అన్ననే గానీ పానం పోతున్నట్టుంది. జెర్రంత తినిపిచ్చి నీల్లు తాపిచ్చిండు. నాకు టికీట్ కొనుమని చెప్పు బాలాజీ అని పైసలు తీసి ఇయ్యబోయిన. రాజాలూ జెర్ర సైసు..మేస్తిరి నీతోని మాట్లాడాలంట అన్నదు పద్మి..మేస్తిరి ఏమో అంటుండు..బాలాజి నన్ను అడిగిండు…రాజా నువ్వు వొచ్చి 2 యేండ్లు అయినాది కదా…అప్పు ఎంత పూడిసిందీ అని మేస్తిరి అడుగుతున్నారు అన్నడు..అప్పు యేం తేరలే అన్నా. మరి ఇప్పుడు ఇంటికి పూడిసి ఏం సేస్తువు, పని శాత కాలేదే నీకు. యీడ కొంజెం కొంజెం పైసలు ఇస్తునారు కదప్పా…కొంజెం కొంజెం అప్పు తీరిసి పూడుసు. ఇప్పుడు పొయ్యి ఏం సేస్తువప్పా! ఆలోచన సెయ్యి అంటుండు.” కానీ అమ్మ! ” అనుకుంట పరేషాన్ సూపు  చూసిన …రాజాలూ రాత్రి ఫోను చేసిన అమ్మను ఇంటికాడ రెండొద్దులుంచి ఇగ వాసనొస్తుందని తీసేసిండ్రంటరా…నువ్వు జూడనీకి అమ్మ లేదురా అన్నడు…నాకు పానం పొయ్యింది. అమ్మా అమ్మా అమ్మా అని ఏద్వవట్టిన. పద్మి సముదాయిస్తున్నడు..యీడి కెంచి పోతె మల్ల రానియ్యరంట..ఆడ పని చేసి అప్పు తేర్పగలనని నమ్మకం ఉంటె పో, పురాగ పని అయినంక పోతె కాంట్రాక్టోల్లు టికీటు ఇస్తరంట..నడిమిట్ల బోతె ఇగ నీ ఇష్టం టికీటు కొనమంటె పొదుమీకి ఉంది కొంట అని చెప్తున్నడు….మేస్తిరి. నాకు సావెందుకొస్తల్లేదో తెలుస్తల్లె. జెర్రయినంక బాలాజీ నీల్లు తాపిండు. అయ్యో బగమంతుడా ఎంత పని చేసినవురా.పద్మీ నన్ను అమ్మ కాడికి తోలియ్యిరా నీకు దండం బెడతా..ఎంత సేపు ఏడుస్తున్ననో తెల్వలే పద్మిగాని ఒడిల అట్లనే తలవెట్టిన. రాజాలు లెవ్వురా ఇంటికి పోదాం అంటుండు. ఏ ఇంటికి ర…అమ్మ పొయినాంక అన్ని పొయినయ్రా..నాకు ఇల్లు ఎక్కడుందిరా అని చెపుదామని ఉంది..కానీ ఆవాజ్ ఒస్తలె..చెక్కరొస్తాంది. పోదాం పా ట్యాక్సి వొచ్చింది అన్నడు మేస్తిరి… ఒద్దు ఒద్దు నేను రాను నేను రాను అమ్మ కాడికి పోతా……పద్మి నన్ను అలగ్గున ఎత్తి, ట్యాక్సీల కూకోబెట్టిండు…ఇంకేం తెలుస్తల్లే…చెక్కరొస్తాంది…పద్మి నా మొకం లకే సూస్తుండు…రాజాలు ఎటున్నవ్రా అని కదుపుతున్నడు…పాపం వీన్ని పరేషాన్ చేస్తున్న. వీని పానం సగం పొయ్యినట్టు ఉంది. యీ రోజు పనిలకి రావొద్దు రాజాని చూసుకో అని చెప్పిన్రంట…గీతక్క మాట్లాడుతుంది మాట్లాడు అన్నడు…నేను ఒద్దని చెయ్యి ఊపిన..గిప్పుడు నాకు మాట్లాడనీకి ఏం లేదు…బూలచిమి ఎట్లుందొ అని అడగాలనిపిచ్చింది..పిచ్చి పొల్ల..నా కన్న అమ్మకు దగ్గరయింది..తల్లి లేని పిల్ల అమ్మనే సొంత అమ్మ లెక్క చూసుకుంది..పాపం ఎంత బాద పడుతుందో ఏమొ. నాలుగు దినాలు పద్మిగాడు కూకున్న తానికి బువ్వ తెచ్చి పెట్టిండు. వాడే ఇంటి కాడివన్ని అరుసుకుంటుండు..పాపం గీతక్క జరుగుతున్నవన్ని జరిగినట్టు చెప్తాంది. గండయ్య మామ, మా మేన మామ దగ్గరుండి అన్ని చూస్తున్నరంట..వాల్ల కాడ ఉన్నకాడికి చేసిన్రంట..పదొద్దులకి ఎట్ల అని అనుకుంటున్రంట.. అమ్మ సుకంగ పోవాలంటే పదొద్దులు మంచిగ చెయ్యాల్నంట.మనసు నలిగి పోతాంది. ఎట్ల పొవ్వలె, ఏడికెంచి చెయ్యాలె, ఆడికి పొయినాంక ఎట్ల, పోంగనె అప్పులెవరిస్తరు ,పని లేకుంట ఎట్ల ఎల్తది, అప్పు తేర్పేది ఎట్ల , మిత్తి కట్టేది ఎట్ల…గుడిసె పోతె యాడుంటము….జొవాబు లేని మాటలు..తల పగిలిపోతాంది…మెదడు అలిసిపోతాంది. పానం పోతదనిపిస్తాంది. అట్లట్ల ఆలోచనలన్ని ఒక తాన నిలిచినయ్.

పద్మీ, అమ్మ పోయినంక ఇప్పుడు నేను పోవుడు అవుసరమా అన్న. పద్మి సిత్రంగ నా కెల్లి చూసిండు. మేస్తిరి చెప్పింది మంచిదేరా…నేను బొయ్యి ఏంచెయొస్తది…నేను పొయ్యే పైసలు పంపిస్తె అమ్మ పదొద్దులు మంచిగ అయితయ్ కదా ” అన్న.

పద్మి నా మొకం వింతగ చూస్తున్నడు.. నమ్మిక లేనట్టు చూస్తున్నడు. పద్మీ, ఇగ నేను పోవుడెందుకు…నేను పోను. ..పదొద్దులకి నా కాడున్న పైసలు పంపేద్దారి అన్న…అట్లనే తియ్..మరి మిత్తికి ఎట్ల అన్నడు పద్మి…చూద్దారి..ఇప్పటికైతె కానీ అన్న.

పైసల్ తీస్కోని పద్మి ఎల్లిపోయిండు..మల్ల నాకు ఆలోచనలు షురువయినయ్…2 వెయిల లెక్క ఎప్పటికి మిత్తి కట్టేది..ఎప్పటికి అప్పు తేర్పేది..ఎప్పటికి ఇంటికి పొయ్యేది…ఇంటికి పోదునా అంటె ఆడికి బోయి చెయ్యనీకేమున్నది..పెండ్లం పని చేస్తుంటె తినాలె. ఏమో, జెర్రంత జెల్దిన నడుము మంచిగయితదేమో..ఇంకొక్క రెండు ఏండ్లల్ల అప్పు తేర్పి పోతనేమో…అనిపిచ్చింది..ఇప్పటికయితె పని అయిందిగద…కండ్లు మూసుకున్న..జెర అలసట తగ్గి నిదరొస్తాంది.అమ్మ చెయ్యి చల్లగ తాకినట్టయ్యింది. ఎటొ మబ్బుల పాట ఇనొస్తాంది….”కొలువు కుదిరీ ఎన్నాల్లయ్యిందో”

26 thoughts on “ఓ పాలబుగ్గల జీతగాడా…..

  1. LETS ERADICATE CHILD LABOUR LETS WORK ORGANIZE TOGETHER GIVE SUGGESTIONS TOO MANY REPLIES BUT I AM PROMPTED SO I AM ALWAYS LIKE THIS EXCUSE ME IF ANYTHING EXCESS CORRECT ME

    1. దామోదర్ గారూ, కృతజ్ఞతలండీ…..మా అబ్బాయి తోటి పిల్లాడు లారీలకి టయర్లు మార్చడానికి కుదిరి…బరువైన లారీ చక్రాల్ని మోస్తూ ఉండేవాడు…(వయసు 6 సంవత్సరాలు)…నేను చదివిస్తా చదువుకుంటావా అని అడిగితే, మా నాన్న ఊరుకోడు..అయినా నాకు చదువుకున్నా చదువు రాదు..పెద్దయ్యాక ఇదే పని చెయ్యాలిగా, ఇప్పటినుంచీ చేస్తే తప్పేంటీ అని జ్ఞానిలా మాట్లాడాడు..ఎంత వాదించినా ఆ చిన్నారిని ఒప్పించలేకపోయానని బాధ అనిపిస్తుంది.(ఇది జరిగి 10 యేళ్ళ పైన అవుతోంది..కానీ ఆ ముఖం ఇంకా నాకు గుర్తుకొస్తూ ఉంటుంది..యీ పాటికి మేస్తిరి అయి ఉంటాడు!!!!!)
      మీరు కరక్టుగానే చెప్పారండీ..పూర్తిగా నిరోధించలేక పోయినా,మన ప్రయత్నం మనం చెయ్యాలిగా…!!!!

  2. ఎన్నెలగారూ చాలా చాలా నచ్చింది….ఆర్థ్రతతో నిండిన కథ…మొదటి ప్రయత్నంలోనే జీతగాళ్ళ జీవితాన్ని పట్టిచ్చారు…బాగుంది….

    1. కెక్యూబ్ గారూ కృతజ్ఞతలు…మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

  3. ఎన్నెలగారూ,
    మీ కధ చదివాక తెలుగు నేర్చుకోవాల్సింది ఎంతవుందో అనిపించింది. మీకు మాండలికంమీద వున్న పట్టు స్పష్టంగా కనిపించింది. శుభాకాంక్షలు.
    psmlakshmi

  4. పొరపాటుని ఇప్పుడు గమనించాను… మీకు వ్యాఖ్యా రాసేసాననుకుంటున్నానింకా…:)) Big thanks to madhura !

    1. అయ్యో అలా యేమీ ఫరవాలేదు తృష్ణ గారూ…చదివితే చాలు.కామెంటు పెట్టక పోయినా ఫర్వాలేదు.. మీకు మధుర చెప్పారా!!!!..థ్యాంక్స్ మధురా

    1. కృతజ్ఞతలు తృష్ణ గారూ ..
      పైన రాజశెఖర్ గారు చెప్పినట్టు ఇంకో రెండు ఆర్టికల్స్ వ్రాసేసి మీతో చదివించేస్తే..అలవోకగా చదివెయ్యగలరు మీరే…మీ బ్లాగ్లో తెలంగాణా మాండలికం లో ఒక చిన్న టపా కూడా ఆశిస్తా….. జెరన్ని దినాలయినాంక …

  5. భాష మీద మీకున్న అభిమానం అర్థం అయ్యింది రాజ శేఖర్ గారూ. మీరు ప్రస్తావించిన వ్యాసాలు చదివాను. తెలుగు మీద ఉన్న మక్కువ మరింత పెంచడానికి యీ వ్యాసాలు ఎంతో దోహద పడతాయి. తప్పకుండా వ్రాయడానికి ప్రయత్నిస్తాను. మరొక్కసారి మీకు కృతజ్ఞతలండీ

  6. ఎన్నెలగారూ,
    ఏదో ఒక మేరకు స్వంత అనుభవం లేకుంటే ఇంత సజీవంగా కథను మీరు రాసి ఉండేవారు కాదని మొదటే అనిపించింది. మాండలికంలో రాయడానికి ఇకపై మీరు తటపటాయించవలసిన పనిలేదు. మీ యాస శైలి చాలా బాగుంది. మీ ఊరి గురించి, మీ చిన్ననాటి ఇప్పటి జ్ఞాపకాల గురించి ఇకపై మీ జీవ భాషలోనే రాయండి. అలా రాసిన ప్రతి రచనకూ సంబందించిన లింకును నాకు పంపించండి.
    rajasekhara.raju@chandamama.com
    krajasekhara@gmail.com

    చదువుకోసం, ఉద్యమాల కోసం, తర్వాత జీవితం కోసం ఇరవయ్యేళ్లు మా సొంత ఊరికి దూరమైపోయాను.. బాధాకరమైన విషయమేమిటంటే, ఇప్పుడు మా కడపజిల్లా రాయచోటి భాషలో నేను రాయలేను. కన్న ఊరికి దూరమైపోతే, స్వంత ప్రజల జీవితాలకు, స్వంతమాటలకు దూరమైతే ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా అనుభవమవుతోంది.

    మాటలో, రాతలో, వ్యక్తీకరణలో పుస్తక భాష పూర్తిగా ఆక్రమించుకున్న జీవితం నాది. ఏ రెండు మూడేళ్లకో ఊరికి పోతే, జీవం ఉట్టిపడే వారి యాసను చూస్తే ఏం కోల్పోయానో గుర్తుకొచ్చి ఏడుపొస్తుంటోంది.

    నోరు తెరిస్తే నాది కాని భాష. రాస్తే నాది కాని పుస్తక భాష.. సారూ, గీరూ అంటూ గౌరవాలందుకుంటున్న నగర నాగరికతలో దశాబ్దాలుగా చిక్కుకుపోయి, ఎప్పుడన్నా మా ఊరివాళ్లు కనబడి ‘అన్నా’ అంటూ పిలిస్తే ప్రాణం లేచి వస్తుంది నాకు. నాగరికతను నిలువునా సవాలు చేసే అమృతమయమైన పిలుపు అది.

    ఈ నెల మాలిక వెబ్ పత్రికలోనే ‘చేపకు సముద్రం భాషకు మాండలికం’ అనే శ్రీరాములు గారు రాసిన వ్యాసం చూడండి. అలాగే రహంతుల్లా గారి “చిన్న భాషల్ని మింగేస్తున్న పెద్ద భాషలు” వ్యాసం కూడా చూడండి. వేయి సంవత్సరాల తర్వాత మన భాష పునాదే ప్రమాదంలో పడిన సూచిక. మొత్తంగా తెలుగు భాషకే దిక్కు లేకుండా పోతోందిప్పుడు..

    జీవితంలో ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో మాత్రమే చదివి చాలా మంచి పని చేశాను. ఎవరెన్ని చేసినా జీవితంలో తెలుగు మర్చిపోలేను. కాని ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ ప్రధానమై కూర్చుంది. ప్రభుత్వ పాఠశాలలనుంచి కూడా తెలుగు మాయమైపోతే ఏం జరుగుతుందో ఊహించడానికి కూడా ఏమీ మిగలదు.

    మీరు మీ భాషలో, మీ యాసలో రాయడాన్ని మర్చిపోకండి. మన ఇంటి భాషకన్నా మించింది ఏదీ లేదు. అలా రాసిన ప్రతి సారీ నాకు లింకు పంపండి. నేను కోల్పోయిన దానికోసం ఆరాటం తప్ప మరే ఉద్దేశం ఇందులో లేదు.
    అభినందనలు.
    వీలయితే చందమామ బ్లాగు కూడా చూడండి.
    blaagu.com/chandamamalu

  7. తృష్ణ గారూ, మాస్టారి తాలూకు కామెంటుని నాకు ఇచ్చేసారు మీరు…దాన్ని జాగర్తగా వారికి అందచేస్తున్నాను.
    మాస్టారూ, ఇది మీ కామెంటండీ…ఇదిగో తీసుకోండి..మెల్లగా ..జాగర్త జాగర్త….!!

    కొత్తావకాయ గారు, కృతజ్ఞతలండీ..మీరు చదవగలిగారని సంతోషంగా ఉంది.సౌమ్యతో చదివించగలరని నమ్మకం కూడా వచ్చింది..నచ్చినందుకు ధన్యవాదాలండీ.మీకు తొందరలోనే మాండలికం మీద పట్టు వచ్చేస్తుంది…
    నా మీదొట్టు.

    మధురా…మీరు చదివారని చాలా ఆనందంగా ఉంది…సగం కథ వ్రాసి ఒక లైను దగ్గర ఆపేసి దాదాపు ఆరు నెలలు ముట్టుకోలేదు..ఆ లయిను చదివినప్పుడల్లా ఎంత ఏడుపొచ్చేదో..ఇంక కథ ముందుకి ఒక్క అక్షరం కూడా జరగలేదు..కొద్ది రోజుల క్రితం ఆ లయిను పూర్తిగా చెరిపేసి కథ పూర్తి అయిందనిపించి మళ్ళీ అతికించా. అందుకేనేమో “మంచు గారు” అన్నట్టు చివర కొంచెం హడావిడిగా ముగించేసినట్టు అనిపించింది. నచ్చినందుకు ధన్యవాదాలండీ.

    రాజ కుమార్ గారూ కృతజ్ఞతలండీ

  8. రాజ శేఖర్ గారూ మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలీడం లేదండీ.నాకు యీ మాండలికంలో రచించడం ఎంత ఇష్టమో చెప్పలేను…కానీ వ్రాసిన ప్రతిసారీ చదివేవాళ్ళు ఉంటారా అసలు అని ఒక చిన్న అనుమానం. మీ వ్యాఖ్య చదివాక అలా అనుకున్నందుకు సిగ్గుపడుతున్నా.యీ మాండలికంలో ఇంకా చాలా వ్రాయాలని పట్టుదల కలిగించింది మీ వ్యాఖ్య..అందుకు మీకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను.

    //”ఈ కథ మీ స్వంత అనుభవమే అయితే పాదాబివందనాలు.. వలస ప్రజల బాధను మీదిగా చేసుకున్న రచన అయితే నిండునమస్కారాలు”//-అమ్మ చనిపోయినప్పుడు పరాయి దేశంలో ఉండి వెళ్ళలేకపోవడం నా అనుభవమైతె, పాలబుగ్గల వయసులోనే కూలీ పనులకొచ్చి వెళితే మళ్ళీ రాలేమని అక్కడే చిక్కుకు పోతున్న యువకులను పరిశీలించడం వల్ల మనసులో వీచిన విషాద వీచికలివి. ఆ విషాదాన్ని చూడకపోయినా అనుభూతిస్తున్నందుకు అందుకోండి నా ప్రతి-పాదాభివందనం.
    //” ప్రాసంగికత విషయంలో కన్యాశుల్కంతో, యజ్ఞంతో పోటీ పడగల గొప్ప కథను తెలుగు సాహిత్యానికి అందించారు”//…అమ్మో ఇంకా తప్పటడుగులేనండీ…

    ఇంత ఓపిగ్గా మరీ మరీ ప్రోత్సహించేలా వ్రాసిన మీ వ్యాఖ్యకి మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలండీ

  9. కృష్ణ ప్రియ గారు, కృతజ్ఞతలండీ…అంత పెద్ద కథని ముక్కలు ముక్కలుగా వ్రాసి ఒక చోట చేర్చడంలో కొంచెం నిర్లక్ష్యం దొర్లింది. ఇంకా జాగర్తగా వ్రాయడానికి ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు.

    మాస్టారు (సుబ్రహ్మణ్యం) గారూ, కృతజ్ఞతలండీ..

    రహంతుల్లా గారూ కృతజ్ఞతలండీ

  10. హుమ్మ్.. ఏం చెప్పాలో తెలీట్లేదండీ.. మాటలు రావట్లేదు.. గుండె పిండేసినట్టయింది. 🙁
    యాస సరిగ్గా రాకపోయినా అంత కష్టంగా అనిపించలేదు చదువుతూ ఉంటే.. చాలా చాలా చాలా… బాగా రాశారు.

  11. మాండలీకం చదివే అలవాటులేని వాళ్ళని కూడా అయస్కాంతంలా ఆకట్టుకునే విషయం ఉంది కథలో. అభినందనలు.

  12. జీవితమూ, భాషా రెండింటికీ జీవం పోసిన గొప్ప కథ. సినిమాల్లో, ఇతర రంగాల్లో మాండలికాన్ని, యాసలను ఫరమ జుగుప్సాకరంగా కామెడీకిరిస్తున్న పిదపబుద్దులకు కనువిప్పు కలిగించేంత సజీవత్వాన్ని ఈ కథ పుణికి పుచ్చుకుంది. పాతికేళ్ల క్రితం అల్లం రాజయ్యగారి కథలు, నవలలు తెలంగాణా భాష నిసర్గ సౌందర్యాన్ని తొలిసారిగా దర్శింపజేయిస్తే మళ్ళీ అంతటి మహదానుభూతిని కల్గిస్తోంది ఈ కథ. కాళీపట్నం రామారావు గారి యజ్ఞం కథలోని హింసాత్మక ముగింపు ఈ కథలో మరో రూపంలో కనిపిస్తోంది. బతుకు కోల్పోయినవాడు కన్నకొడుకును అప్పలబాధనుంచి దూరంచేయడానికి నరికేయడం.. కన్న తల్లి చివరి చూపును చూడలేని కొడుకు ఆమె అంతిమ సంస్కారం కోసం డబ్బులు మాత్రమే పంపించగలగడం.. రెంటికి రెండూ సరిసమానమైన మానవ మహా బాధలివి.

    “అమ్మ చెయ్యి చల్లగ తాకినట్టయ్యింది. ఎటొ మబ్బుల పాట ఇనొస్తాంది….”కొలువు కుదిరీ ఎన్నాల్లయ్యిందో” ఇంటికి దూరమైనవారు, సొంతగడ్డకు దూరమైనవారు.. మాతృసంవేదనలకు దూరమైనవారు ఇలా కాకుండా మరే రకంగా అయినా ఏ భాషలో అయినా చెప్పుకోగలిగారా ఇంతవరకూ…?

    ప్రామాణిక భాషగా తన్ను తాను ముద్రించుకున్న కృతక భాష, ప్రజల నిజమైన సజీవ భాషలను, యాసలను ఎంతగా చంపేస్తోందో చూడాలంటే ఈ కథ సౌందర్యమే ఒక మహా నిదర్శనం… కన్న తల్లి పోతే చూడలేని బతుకులు.. అనుబంధాలను డబ్బులు పంపించడంతో మాత్రమే పరామర్శించవలసివస్తున్న కసాయి జీవితం..

    ఎన్నెల గారూ.. ఈ కథ మీ స్వంత అనుభవమే అయితే పాదాబివందనాలు.. వలస ప్రజల బాధను మీదిగా చేసుకున్న రచన అయితే నిండునమస్కారాలు. ప్రాసంగికత విషయంలో కన్యాశుల్కంతో, యజ్ఞంతో పోటీ పడగల గొప్ప కథను తెలుగు సాహిత్యానికి అందించారు. ఇది చాలండీ మా జన్మలకు….

  13. త్వరగా పెళ్లాడి,సుఖపడమని దీవించాల్సింది పోయి ఇదేమి నీతి మాష్టారూ…:))
    పెళ్ళికాని అబ్బాయిలూ.. మాష్టారి బెదిరింపులకు భయపడి ఇంకాస్త ఆలస్యం చేసుకునేరు… కష్టసుఖాలు లేనిదెక్కడ?
    ఒంటరితనంలో ఉన్నది శూన్యం..
    పక్కన తోడుంటేనే బ్రతుకు సుఖం..
    ఇదియే తృష్ణ మాట..:))

  14. కధ బాగుంది.”ఎప్పటికి అప్పు తేర్పేది..ఎప్పటికి ఇంటికి పొయ్యేది…ఇంటికి పోదునా అంటె ఆడికి బోయి చెయ్యనీకేమున్నది?” వడ్డీ వలలో చిక్కి భారతావనిలో కోట్లాది ప్రజలు నిత్యమూ అనుభవిస్తున్న హృదయవిదారక దృశ్యం కళ్ళకు కట్టినట్లుంది.

  15. చాలా చాలా నచ్చింది! మొదటి ప్రయత్నం లా ఏమీ లేదు. “కొన్ని రోజులు ,బానే,అనిపించింది” – ఈ మూడూ వచ్చినప్పుడు ‘వేరే పదం ఇంకా అప్రాప్రియేట్ ఏమో …’ అనిపించింది. మీకు మాండలికం మీద చాలా పట్టుంది.

    అభినందనలు!

Comments are closed.