April 25, 2024

కంది గింజ

రచన : శ్రీధర్ ఆయల

            “ మిస్టర్  నూర్  భాషా ! నువ్వు  ‘ఖురాను’   మీద  ప్రమాణం  చేసావు. నీ  వృత్తి  వివరాలు  కోర్టు  వారికి ఉన్నది, ఉన్నట్లుగా  తెలియజెప్పు.”

“ హుజూర్ ! నేనొక  శిల్పిని.  పాలరాయి,  సుద్దరాయిల  మీద,  ఇంకా  మీనియేచర్  వస్తువుల  మీద  పేర్లు,  చిత్రాలు  గీస్తాను.”

“  మీనియేచర్  వస్తువులు  అంటే ?”

“  కందిగింజలు,  బియ్యం   గింజలు  వగైరా  హుజూర్ !”

“ కందిగింజల  మీద  వ్యక్తుల  పేర్లు,  చిన్న చిన్న  ఆకృతులు  చెక్కుతావు,  అవునా ?”

“ జీ !  హుజూర్ !”

“ నోట్  దిస్  పాయింట్ !  యువర్  ఆనర్ ! ఈ  ముద్దాయికి  జీవనోపాధి  కందిగింజల  మీద   ఆధారపఢి   ఉంది. అంతేనా  నూర్  భాషా ?”

“  జీ  హుజూర్ !”

“  పేరు  చెక్కిన  కందిగింజని ఎంతకి  అమ్ముతావు ?”

“ ముప్పయి  రూపాయిలకి  అమ్ముతాను  హుజూర్ ! దాన్ని  గాజుపెట్టెలో పెట్టి, పెట్టె  పైన  రంధ్రానికి  చిన్న  లెన్స్  అమర్చి, ఒక్కొక్క  పెట్టెని  వంద  రూపాయిలకి   అమ్ముతాను  హుజూర్ !”

“ఒక్క  కందిగింజని  ముప్పయి  రూపాయిలకి  అమ్మే నువ్వు, రెండు  క్వింటాళ్ల  కందిపప్పుని   నీ  గొడౌనులాంటి  దుకాణంలో ఎందుకు  దాచావు ?”

“ అబద్ధం  హుజూర్ !  నేను  నా దుకాణంలో  రెండు  కిలోల  కందిపప్పు  మాత్రమే   ఉంచాను  హుజూర్ !”

“ ఈ  ముద్దాయి  నూర్  భాషా  అబద్ధం  చెప్తున్నాడు   యువర్  ఆనర్ !  పోలీసుల  రైడులో ఇతని  దుకాణం  లాంటి  గొడౌనులో,  అక్రమంగా  నిల్వ  చేసిన రెండు క్వింటాళ్ల  కందిపప్పుని, ఒక  టాటా  406  మెటాడోర్లో  లోఢ్  చేసి,  ప్రభుత్వ  గిడ్డంగికి   తీసుకొని  రావడం  జరిగింది. ఆ  విషయాన్ని  మెటాడోర్   డ్రయివర్  సాక్ష్యం  ద్వారా  ఇదివరకే   రుజువు  చేయడం  జరిగింది. కందిగింజ  మీద  శిల్పాలు,  పేర్లు  చెక్కడానికి,  అంత  పెద్ద  మొత్తంలో,  కందిపప్పు  నిల్వచేయాల్సిన  అవసరం  లేదు. దీనిని  బట్టి   తేలిందేమిటంటే  ఇతను  ఆహార  పదార్థాలు  అక్రమంగా  నిల్వచేసి,   కృత్తిమంగా  వాటి  ధరలు   పెరగడానికి   దోహదం  చేసాడు. అంతే  కాక  ఆ తరువాత  వాటిని  తనకి  నచ్చిన  ధరలకి  అమ్ముకొని  లాభాలు  ఆర్జిస్తున్నాడని  కూడా  రుజువయింది—”  సర్కారీ  వకీలు  వాదన శృతి  పెంచుకొంది.

నూర్  భాషా  కళ్లముందు,  కేవలం  రెండు కిలోల  కందిపప్పు  పొట్లాన్ని,  పెద్ద  మెటాడోరు  మధ్యలో  పెట్టి,  తనని  పోలీసు  జీపులో ఎక్కించి, ఠాణాకి  తీసుకెళ్లిన  దృశ్యం  కదలాడింది.  కాని  అతనేం  చేయగలడు,  సాక్ష్యాలు  అతనిని  దోషిగా  నిలబెట్టాయి !

“ఈ ముద్దాయికి   ఆరునెలల  కఠిన   కారాగార  శిక్ష,   వెయ్యి  రూపాయిల  జరీమానా  విధించడమైనది. జరీమానా  చెల్లించని   పక్షంలో  ఇంకో  నెల   జైలు  శిక్ష  అదనంగా  అనుభవించ  వలసి  ఉంటుంది.”

జడ్జి  తీర్పు  విన్న  నూర్  భాషాకి,   కళ్లు  బైర్లు  కమ్మాయి.  విట్నెస్  బాక్సులోనే  పడిపోయాడు.

“ నూర్ ! ఈ  చాక్ పీసు  మీద  ఏం  చెక్కుతున్నావు ?”

“ నీ  బొమ్మనే  చెక్కుతున్నాను   ప్యారీ !”

“ నిజంగానా  నూర్ !  చూపించు,” అంటూ  చాక్ పీసుని నూర్  చేతుల్లోంచి  తీసుకొని  చూసి,“ యా, అల్లా ! ఎంత  బాగా  చెక్కావు ? అచ్చు నా  లాగే ఉంది !”  అంటూ  నూర్   రెండు  బుగ్గల  మీద  ముద్దు  పెట్టుకొంది  ప్యారీ.  అప్పుడతని   వయసు   పదకొండేళ్లు,  ప్యారీ  అతని  కన్న  రెండేళ్లు  చిన్న. అలా బాల్యంలోనే  చిగిర్చి, పల్లవించిన  ప్రేమ,  వారిద్దరినీ   ప్రణయ  బంధంలో  బిగించి  భార్యా  భర్తలుగా   చేసింది.

ఆ  మిథునానికి  అది  తొలి  రాత్రి !

చెక్కిలి  మీద  చెయ్యి  ఆన్చి, తల్పం  మీద  పడుకొని   తన్మయత్వంతో  చూస్తున్న  అర  అడుగు  పాలరాతి  బొమ్నని, కాగితం  పొరలలోంచి తీసి,  చూపించాడు  అతను.  ఆమె  దాని  అందానికి  మురిసిపోయింది.  దాన్ని  తనకి  ఎదురుగా  బల్ల  మీద  పెట్టి,  దానివైపే  చూస్తూ,  అలాగే  మంచం  మీద  పడుకొంది. నూర్  ఆమె  వెనుకవైపు  నుంచి  వచ్చి, మంచంపైన  కూర్చొని  ఆమెను  చేతుల్లోకి  తీసుకొన్నాడు. ప్యారీ తన  చేతుల్ని,అతని  మెఢకి   పెనవేసి, అతని  బుగ్గని  ముద్దు పెట్టుకొంది,“యా అల్లా ! ఎంత  బాగా  చెక్కావు !” అంటూ.  నూర్  తనకి  అతి  దగ్గరగా  వచ్చిన ఆమె  అధరాలని చూసాడు. ఆమె పై పెదవి మన్మథ  ధనస్సే అయితే  క్రింద  పెదవి, అంబుల  పొదిలాగ కనిపించింది. ఎన్నాళ్ల  నుంచో  తనని ఊరించి, నిద్ర  పోనీయకుండా.చేస్తున్న  ఆ ఆంబుల  పొదిని   తన  పెదవుల  మధ్య  బిగించాడు.  తీరా  అది  అతని  పెదాల  మధ్యకి  వచ్చేసరికి,  అంబుల  పొదిగా  గాక,  రుచులూరించే  మధుపాత్రగా  మారిపోయింది.

ఇంకేముంది !  తను  ఊహా  సుందరిని  ప్రత్యక్ష్యంగా  సాకారం  చేసుకొని,  అతను  రెచ్చిపోయాడు.  ప్యారీ  కూడా  అతని  ప్రతీచర్యకీ  పులకించిపోతూ,  తనని  అతని  చేతులకి  అప్పగించి,  ప్రాణం  పోసుకొన్న  స్త్రీ  సౌందర్యానికి   ప్రతీక  అయింది. రతి  కేళిలో  అలసి  సొలసి   పోయిన  ప్యారీని  తనివితీరా  చూసుకొన్నాడు  నూర్.  ‘ ఈ  సౌందర్యాధి  దేవత    తన  అదృష్టం  కొద్దీ,  లభించింది.  కాని  ఆమెని  తృప్తి   పరచే  పరిసరాలు,  పరిధానాలు,  ఆభరణాలు,  సౌందర్య  సాధనాలు,  తను  సమకూర్చ  లేడు.  కనీసం  ఒక్క  రోజైనా  ఆమెని  నవాబుల  రాణివాసంలో ఉంచి,  సకల  సౌకర్యాలు  సమకూర్చి,  ఆమెతో  ప్రణయం   ప్రణయం  పండించుకొంటే  ఎంత   బాగుంటుంది !’  అనుకొన్నాడు.

అవచేతన  మేథస్సులో,  గాఢంగా  కోరుకొన్న కోరికే  గాని  నిలిచిపోయిన  పక్షంలో,  అది  తప్పక  నెరవేరుతుందని  అంటారు.

నూర్  భాషా  కోరిక  తీరే  అవకాశం,‘ ఫతేఆలీ ఖాన్’  ద్వారా  సాధ్యమయింది..

ఫతే ఆలీ ఖాన్  ఒక  నవాబు.ఒక  రోజు  నూర్ ని  తన  రాజభవనానికి  తీసుకెళ్లాడు.అతని  భవనంలో, ఒక  అరుదైన  కళాకృతి  అయిన  పాలరాతి  బొమ్మ  ఉంది,  కాని  దానికి  తల  లేదు. తల  తయారు  చేసి,  దానికి  అతికించి,  తనకి  నచ్చే  విధంగా  మలిచినట్లయితే,  అడిగినంత  ఇస్తానని  అన్నాడు. నూర్  ఆ  అవకాశాన్ని  వినియోగించుకొన్నాడు

,  ఆ  పాలరాతి నగ్న సుందరి  విగ్రహానికి,  కాళ్ల  మధ్య, ఒక హంస రెక్కలు విచ్చుకొని వాలినట్లుంది.తన  విప్పారిన రెక్కలతో ఆమె నగ్నత్వాన్ని,మరుగు పరుస్తోంది.(ఆ హంస తన  పొడవైన మెడని చాచి,ముక్కుతో ఆమె అధరాలని అందుకొంటున్నట్లుగా మలచబడి ఉండేదట).ఇప్పుడా తల లేక పోవడంతో, ఆ కళాకృతి బోసిపోయింది..

నూర్  ఆ  నగ్నసుందరికి తన ప్యారీ ముఖాన్నేఅమర్చాడు, అంతే కాదు,’మన్మధుని ధనస్సు లాంటి, తన  ప్యారీ  అధరాలనే  చెక్కి ఆ హంస తన ముక్కుతో, ఎంతో ఆత్రంగా వాటిని అందుకోబోతున్నట్లు చెక్కాడు.అది  ఆ నవాబు  గారికి  ఎంతగానో  నచ్చింది. తను మాట ఇచ్చిన ప్రకారం ఏమడిగినా ఇస్తానన్నాడు.

ప్యారీని  అంతఃపుర  స్త్రీలు, రాజభవనంలోని కొలనుకి తీసుకెళ్లారు. ఆమె శరీరానికి చందన తైలాలు మర్దించి, నలుగు పెట్టి,.మెత్తని  స్పాంజి  బ్రష్ లతో  పామి,పన్నీటితోను సువాసిత జలాలతోను స్నానం చేయించారు.ఆ తరువాత  ఆమె కురులను  అరుదైన షాంపూలతో రుద్ది, వాటిని ఆరబెట్టారు. ఆ అందాల బొమ్మకి చక్కని పరిధానాలు తొడిగారు. అపురూపంగా అలంకరించి. అంతః పురంలోని పడక గదికి తీసుకెళ్లారు. నూర్ ని కూడా అదే  విధంగా అలంకరించి,ఆ గదిలోకి  ప్రవేశ పెట్టారు.నూర్ భాషా విశాలమైన ఆ అంతఃపురంలోని. పడవ లాంటి పర్యంకం మీద, మెత్తటి పరుపుల మధ్య, విశ్రమిస్తున్న తన ప్యారీని  చూసాడు.అతని కమ్మని కల నెరవేరింది.ఆమెని అక్కున చేర్చుకొని, ముద్దులాడాడు. ప్యారీ కూడా ఇనుమడించిన ఉత్సాహంతో  అతనిని  తన అందంతో  మురిపించి స్వర్గలోకాల్ని మరపించింది.

మర్నాడు  లేచేసరికి, నూర్  నదిమధ్యలో, ఒక నాటు పడవ మీద, కాళ్లు చేతులు బంధింపబడి  ఉన్నాడు. అతని  ప్యారీని  ఫతే ఆలీ ఖాన్  అపహరించాడు. ప్రాణాలతో ఉండాలంటే,ప్యారీని మరచి  పొమ్మన్నాడు. ప్యారీ కోసం ప్రాణ  త్యాగం  చేయగలిగినా,తన కొడుకు క్షేమం ఆలోచించి,బయట పడ్డాడు నూర్ భాషా,తను ఇవ్వలేని  సుఖ సంతోషాలని, నిండైన జీవితాన్ని ప్యారీకైనా ఇవ్వగలిగి నందుకు  ఆనందించాడు ఆ నిస్వార్థ  ప్రేమికుడు.

తన కేసుని పైకోర్టుకి తరలించి,వాదించి గెలుస్తానన్న వకీలుని చూసి నూర్ ఆశ్చర్యపోయాడు. నూర్ భాషా ప్రశ్నలకి జవాబివ్వకుండా,ఆ వకీలు కాగితాల మీద అతని సంతకాలు  తీసుకొని  వెళ్లిపోయాడు.

పై కోర్టులో నూర్ లాయర్,క్రింద కోర్టులోని సర్కారీ వకీలు వాదనని దూది  ఏకినట్లు ఏకి పారేసాడు.కందిపప్పు  ధర పెరగడానికి, రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన విధానమే కారణమన్నాడు.కేంద్ర ప్రభుత్వం పేదవాళ్లకి సబ్సిడీ ధర మీద  కందిపప్పుని అందజేయమని, రాష్ట్రప్రభుత్వానికి ఇచ్చిన నిధిని,అధికారులు దుర్వినియోగం చేసారనీ.పప్పుని దిగుమతి  చేసుకోకుండా,లోకల్ మార్కెట్ లోనే ఎక్కువ ధరకి కొని,సబ్సిడీ ధరకి రేషను షాపులో అమ్మారనీ, అందువల్ల లోకల్  మార్కెట్లో కందిపప్పు ధర  పెరిగిందనీ, బల్ల గుద్ది మరీ చెప్పాడు. నూర్  దుకాణం 55 చదరపు గజాల స్థలంలో ఉందనీ,

అంత చిన్న స్థలంలో రెండు క్వింటాళ్ల కందిపప్పుని దాచడం అసాధ్యమని వాదించాడు.మెటాడోర్లో తీసుకెళ్లింది,కేవలం

రెండు కిలోల పప్పుమాత్రమేనని ఆ మెటాడోర్ డ్రైవరు చేతనే సాక్ష్యం ఇప్పించాడు.ఆ లాయరు వాదన న్యాయమూర్తిని

స్పందింప జేసాయి.నూర్ భాషా మీద  కేసుని కొట్టేసి,కందిపప్పుధర పెరిగిన కారణాలు అన్వేషించడానికి ఒక కమీషన్

వేయమని హైకోర్టు రాష్ట్ర  ప్రభుత్వాన్ని ఆదేశించింది.దాంతో నూర్ భాషా విడుదల అయ్యాడు.

జైలుగేటు బయట పడిన నూర్, తన స్వాగతం కోసం,గేటుకి ఎదురుగా ఆగిన పెద్ద కారుని, దాని తలుపు  తెరచుకొని, అందులోంచి దిగిన  తన కొడుకు  ‘జాఫర్ని’ చూసి ఆశ్చర్యపోయాడు.“ అబ్బూ!” అంటూ వచ్చితనని  అల్లుకు  పోయిన కొడుకుని, ఎత్తుకొని, గట్టిగా హృదయానికి  హత్తుకొన్నాడు.

“ బేటా ! ఎలా  వచ్చావు, ఎవరు  తీసుకొచ్చారు,  కారులో ఎవరున్నారు ?” అని  అడిగాడు.

“ అమ్మ !”  అంటూ  కారువైపు  చూపించాడు  జాఫర్ !

కారు  తలుపు  తెరచుకొని,  వచ్చిందొక  స్త్రీ  మూర్తి !  పదేళ్ల  వ్యవధిలో  సౌకుమార్యం  కాస్త  సడలి,  ప్రౌఢత్వం  సంతరించుకొన్న  శరీరాంగాలతో, ఇప్పటికీ  వసివాడని,  సౌందర్యంతో,  మేలిముసుగు  మాటున  దిగింది  ప్యారీ ! నూర్  ఆమె  వంక  ఆశ్చర్యంతో చూసాడు.  “ ప్యారీ ! నువ్వెలా  వచ్చావు ?  ఆ  నవాబు——–?!”

“ నవాబు  నాలుగేళ్ల  క్రితమే మరణించాడు. మొదటి భార్య ముందే చనిపోయింది.నవాబు వల్ల ఆమెకి గాని,  నాకు గాని సంతానం కలగలేదు.ఇప్పుడా,ఆస్థానానికి  నేనే వారసురాలిని !” ప్యారీ కళ్లు గర్వంతో మెరిసాయి.“నవాబు  పోయిన దగ్గరనుంచి నీ కోసం వెతుకుతూనే ఉన్నాను.చివరకి ఈ కందిపప్పు కేసు వల్ల నీ ఆచూకీ బయట పడింది.“

“  అయితే   ఆ  లాయరుని  పెట్టింది  నువ్వేనన్న  మాట !

“అవును నూర్! నీ కేసులో బలం  లేదని, నిన్ను అన్యాయంగా  ఇరికించారని, ఆ లాయరుగారు  పేపరు  చదివిన వెంటనే అన్నారు. ఆరు నెలల నుండి నిర్విరామంగా ప్రయత్నం చేసి, చివరికి  నిన్ను విడిపించ  గలిగారు.”

“ప్యారీ ! నా  కెంతో  సంతోషంగా  ఉంది.  తిరిగి  నిన్ను  చూస్తానని  అనుకోలేదు.”

“ చూడడమే కాదు,నాతో  పాటే  ఉంటున్నావు. ముందు నువ్వు  కారెక్కు,” అంది  ప్యారీ.

నూర్  కారెక్కాడు, కారు  వెనుక  సీటులో  ఆమె  ప్రక్కనే  కూర్చొన్నాడు. జాఫర్   డ్రైవర్  ప్రక్కనే  ముందు  సీట్లో  కూర్చొన్నాడు.ప్యారీ శరీరం వెచ్చగా తగులుతూ ఉంటే,పదేళ్ల  విరహ వేదన వెన్నులోంచి తన్నుకొచ్చినట్లయింది నూర్ కి  ప్యారీ  అతని  స్పందనని  తెలుసుకొని,  అతని ఒళ్లో తల వాల్చుకొని పడుకొంది. మూసి ఉన్నగుప్పెటని,అతని  ముందు  పెట్టి,“ ఇందులో  ఏముందో  చెప్పు”,  అంది.

“  ఏమో,  నాకు  తెలియదు.”

ప్యారీ  గుప్పెటని  విప్పి,  చూపించింది.  తెల్లని  అరచేతులో  పసుపు  పచ్చని  కందిగింజ  ఉంది.

“ ఇదేమిటి   ప్యారీ ?”

“ ఇది నా అదృష్ట  రత్నం  నూర్ ! దీని వల్లనే కదా, మళ్లీ నిన్ను కలుసుకో గలిగాను,.”  అంది.

“అంటే?”

“ అంటే ఏముంది ! నేను నిన్ను  వజీరు  సమీక్షంలో”  స్వయంవరం ద్వారా‘నికా’ చేసుకోబోతున్నాను.నీతో

పాటు,ఈ ‘కందిగింజని’ బోనస్ గా పొంద బోతున్నాను,” అంటూ ప్యారీ ముందు సీట్లో కూర్చొన్నజాఫర్ని చూపిస్తూ.

 

 

**********************

*********************