April 20, 2024

ప్రళయమూ, ఆ తరువాతి జీవితమూ

  రచన : తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం

నవజాతి ప్రతి కొన్నివేల సంవత్సరాలకీ ఒకసారి దాదాపు పూర్తిగా నశిస్తుంది. విచిత్రమేంటంటే – ఈ నశించడం ప్రపంచంలో అన్నిచోట్లా ఒకేసారి జఱుగుతుంది. దీనికి ప్రళయం అని పేరు. ఇది రెండురకాలుగా ఉంటుంది. మహాప్రళయమూ, అవాంతర ప్రళయమూ అని ! మహాప్రళయంలో మానవులతో పాటు యావత్‌జీవజాలమూ నిశ్శేషంగా నశించిపోతుంది. అటువంటప్పుడు భగవంతుడు సృష్టి మొత్తం మొదట్నుంచీ ప్రారంభించాల్సి వస్తుంది. అలా కాక చాలా వఱకూ నశించి కొంతభాగం మాత్రం మనగల్గి ఉంటే అది అవాంతర ప్రళయం. ఇలాంటి అవాంతర ప్రళయాలు ప్రతి 5,400 సంవత్సరాలకొకసారి చొప్పున వస్తాయి.

అభివృద్ధి చెందిన సమాజాలు భూమండలాన్నీ, ప్రకృతినీ విచక్షణారహితంగా దోచుకుంటాయి. వాటి మూలస్వరూపాన్నీ, ఆరోగ్యాన్నీ చెడగొడతాయి. ఆ సమాజాల బారినుంచి తప్పించుకుని మళ్ళీ రీఛార్జ్ అవ్వాలంటే ప్రకృతికి కాస్త సమయం (కొన్నివందల సంవత్సరాలు) పట్టుతుంది. అందుకోసమైనా ఈ అత్యధిక మానవ జనాభా సృష్టిని ఆమె ఏదో ఒక దశలో నిలిపివేయక తప్పదు. ప్రళయం రావడానికి ఇంకో కారణం – భగవంతుడికి మానవజాతి ప్రవర్తన నచ్చకపోవడం. ఆయనకి అమాయక ప్రజలు కావాలి. తన మీద ఆధారపడేవాళ్ళు కావాలి. తనని నమ్మి తన పేరు చెప్పుకునేవాళ్ళు కావాలి. తన మాటా, తన ప్రతినిధుల మాటా వినేవాళ్ళు కావాలి. మొత్తమ్మీద తనలాంటి మనుషులు కావాలి. పాదార్థికంగానూ, పరిజ్ఞానపరంగానూ అభివృద్ధి చెందిన సమాజాలకి ఈ లక్షణాలు ఉండవు గనుక ఆయన ఈ పాత మానవసృష్టిని ఉపసంహరించుకోనూ, కొత్త తరాల్ని పుట్టించనూ సంకల్పిస్తాడు. అందుకు ప్రళయం ఒక మహాసాధనం. భూకంపాలూ, రేవుకెఱటాలూ (tsunamis), అంటురోగాలూ గట్రా ఉపసాధనాలు.

ఒక మనిషి జీవితంలో శైశవమూ, బాల్యమూ, కౌమారమూ, యౌవనమూ, ముసలితనమూ, మరణమూ ఎలాగైతే తప్పవో మానవజాతి అంతటికీ సైతం ఏకమొత్తంగా అవి తప్పవు. ఎదుగుదల ఆగిపోవడమే ముసలితనం. అలా చూసినప్పుడు మనం అవాంతర కలియుగం (మహాకలియుగం కాదు) యొక్క చిట్టచివఱి ఆఱుశాతం కాలఖండం (6% fraction of time) దగ్గఱ నిలబడి ఉన్నాం. అంటే మనం  ముసలితనంలోకి చాలాకాలం క్రితమే ప్రవేశించాం. ఎందుకంటే ఇహ ఎన్ని సంవత్సరాలు పోయినా, ఎన్ని కొత్త సాధనాలొచ్చినా అడపా దడపా ఏవో చిన్నాచితకా మార్పులు తప్పితే మనం ఒక జాతిగా ఇంతకంటే ఎదిగేదేమీ లేదు. ఒక మనిషి చనిపోయి మళ్లీ పుట్టినట్లే, ప్రళయం ద్వారా మానవజాతి కూడా చనిపోయి మళ్ళీ పుడుతుంది. మరణం ఏ క్షణాన మీదపడుతుందో మనిషికి ఖచ్చితంగా తెలియనట్లే, ప్రళయం ఏ రోజున కబళించబోతోందో కూడా మానవజాతికి తెలియదు. దేవుడు తెలియనివ్వడు. వాళ్ళు ఆనందంగా ఫుట్‌బాల్ మ్యాచిలు చూసుకుంటూండగానో, సార్వత్రిక ఎన్నికలలో వోటింగ్ చేస్తూండగానో, కంపెనీ డివిడెండ్లని ప్రకటిస్తూండగానో హఠాత్తుగా అది వచ్చేసి మీదపడుతుంది. అయితే ముసలితనం వచ్చినాక బ్రతుక్కి భరోసా లేదు గనుక నాగరికత యొక్క చరమాంకంలోకి చేఱుకున్న మానవజాతిక్కూడా ఏ క్షణంలోనైనా ప్రళయం ముంచుకురావచ్చు.

దేవుడికి మానవజాతి ప్రవర్తన నచ్చకపోవడం ప్రళయానికి గల కారణాల్లో ఒకటి అని ఇందాక చెప్పుకున్నాం గనుక – ప్రళయకాలానికి సుమారు ఒక తరం, లేదా రెండు తరాల ముందునుంచీ భక్తులు రాక దేవాలయాలు – అవి ఎంత సుప్రసిద్ధమైనా సరే –  మూతపడతాయి. పోషణ లేక మతగురువులు మతప్రచారం నుంచి విరమించుకుంటారు. మతాన్ని అవలంబిస్తున్నందుకు ప్రభుత్వాలు భక్తుల్ని మూఢవిశ్వాసాల పేరు చెప్పి శిక్షిస్తూంటాయి. ఎవఱికీ తెలియకుండా రహస్యంగా పూజలు చేసుకునే దుర్గతి పట్టుతుంది భక్తులైనవాళ్ళకి ! నాస్తిక ప్రభుత్వాల అణచివేత నుంచి తప్పించుకోవడం కోసం ఆస్తికులు సైతం నాస్తికుల్లా నటించాల్సి వస్తుంది. ఈ సూచనల్ని సకాలంలో గ్రహించి ప్రళయం కొన్ని సంవత్సరాల లోపల రాబోతోందని తెలుసుకోవచ్చు.

ప్రళయమప్పుడు ఆయన ప్రతి దేశంలోనూ ప్రతిజాతినుంచీ భావి పునఃసృష్టి కోసమని చెప్పి మచ్చుతునకల్లాంటి (తనక్కావాల్సిన) కొందఱు వ్యక్తుల్ని మాత్రమే మిగిల్చి మిహతా అందఱూ చనిపోయేలా చేయడం జఱుగుతుంది. ఎంతమందిని ఎంచుకుంటాడు ? ఎవఱిని ఎంచుకుంటాడు ? అవన్నీ ఆయన ఇష్టం. గతంలో వచ్చిన ప్రళయంలో కొన్ని జాతుల నుంచి కేవలం ఒక స్త్రీపురుష జంటని మాత్రమే బ్రతికించాడు. మఱికొన్నిజాతుల్లో ఒకే ఒక్క మగవాణ్ణీ, అతనికి సహాయంగా కొద్దిమంది ఆడవాళ్ళనీ మాత్రమే బ్రతికించాడు.  ఆయన సాధారణంగా బాగా అభివృద్ధి చెందిన జాతులనే పూర్తి విధ్వంసానికి లోను చేయడం కద్దు.  (వాళ్ళకి అనుగ్రహించిన అవకాశాలు ఇహ అంతటితో చెల్లు. అవి ప్రళయానంతరం మొదలయ్యే కొత్తయుగంలో వేఱే జాతులకి ప్రసాదించబడతాయి) అభివృద్ధి చెందనివారూ, వెనకబడ్డవారూ, పెద్దగా జనాభా లేనివారూ, ప్రళయానికి పూర్వం అనేక ఘోర అవమానాలకు గుఱిచేయబడ్డవారూ అయిన జాతుల నుంచి ఎక్కువమందిని బ్రతికిస్తాడు. ఈ మానవాళి విధ్వంసం పైకి కర్కశంగా అనిపిస్తుంది. కానీ దేవుడి దృష్టిలో చావు చాలా చిన్నవిషయం. రాత్రి నిద్రపోయి పొద్దున్నే లేవడం కంటే చెప్పుకోదగినది కాదు. మన వఱకూ బాధాకరమే అయినా తప్పదు. విశ్వనియంతగా ఆయనకు తన సృష్టి మీద సర్వాధికారాలూ ఉన్నాయి కదా !

ప్రళయం తరువాత కూడా మిగిలేవాళ్ళలో తాము కూడా ఉండాలని కోరుకోనివాళ్ళుండరు. ఇది జీవసహజమైన మరణభయానికే సూచిక తప్ప తదన్యం కాదు. కానీ అలా మిగలాలంటే ఆయన చేత ఎంచుకోబడాలి. అలా ఆయన దృష్టిలో పడి ఎంచుకోబడే అర్హతని కలిగి ఉండాలి. ఆ వ్యక్తి భావిమానవ తరాలకు పూర్వీకుడుగా/ పూర్వీకురాలుగా ఉండదగ్గ విశిష్టమూర్తి అనే నమ్మకం ఆయనకు కలగాలి. అదంత సులభం కాదనుకోండి. ఎందుకంటే ఆ అర్హత ఉన్నవాళ్ళు పదిలక్షలకో, కోటికో ఒక్కఱే ఉంటారు. ఎవఱినైతే ఆయన అలా ఎంచుకుంటాడో వాళ్ళకు చాలా రోజుల ముందే ప్రళయం రాబోతున్నదని హెచ్చఱిస్తూ దాన్నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలో వ్యక్తిగతంగా తెలియజేయడం జఱుగుతుంది. కొన్నిసార్లు అలా నేరుగా వాచ్యంగా తెల్పకపోయినా ఆ సమయానికల్లా వాళ్ళని ఏదో ఒక లీలతో స్థలం మార్చడం కూడా ఉంది.

ప్రళయం వస్తే హతశేషులైన (survivors) మానవజాతి అనాగరికతలోకి జాఱుకుంటుందని కొందఱు అనుకునేది పూర్తిగా నిజం కాదు. ప్రపంచంలో వాస్తవంగా ఉన్నవి అవసరాలే, నాగరికతా, అనాగరికతా కావు. నిజానికి జనం పాత అవసరాల్నే కొత్త సాధనాలతో తీర్చుకుంటారు. అంతే ! కొత్త అవసరాల్ని ఎవఱూ కనిపెట్టజాలరు. ఆకులో తిన్నా కంచంలో తిన్నా తినడం ముఖ్యం. నిజమైన నాగరికత మనోభావాల్లో, ఆలోచనల్లో ఉంటుంది. సాధనాల్లో కాదు. కోరి ప్రళయం రప్పించిన భగవంతుడికి ఆ తరువాత హతశేషుల్ని ఎలా కాపాడుకోవాలో కూడా తెలుసు. ఆయన వాళ్ళని దిక్కులేని అనాథలుగా ఎప్పటికీ వదిలేయడు. ఎందుకంటే తదుపరి సృష్టికి వాళ్ళే ఆయనకున్న ఉపకరణాలు.

ఆయన చేత ఎంచుకోబడి రక్షించబడ్డ వ్యక్తులకీ, వారి వంశీకులకీ ప్రళయానంతరం కొన్ని తరాల వఱకూ ఆయన యొక్క ప్రత్యక్ష సాక్షాత్కారం ఉంటుంది. చాలా తఱచుగా కనబడి మాట్లాడుతూంటాడు. కనపడకపోయినా కనీసం కంఠస్వరమైనా వినిపిస్తుంది. పిలిస్తే పలుకుతాడు. ప్రళయ రక్షితులకి కొన్నింటి నుంచి మినహాయింపులూ, వాటితో పాటు కొన్ని శక్తులూ ప్రసాదించబడతాయి. ఉదాహరణకి – దేవుడు వారికి పంచభూతాల్ని వశం చేస్తాడు. కోరుకున్న వెంటనే నిత్యావసరాలు తీఱే ఏర్పాటు కూడా చేస్తాడు. కారణం, మానవులు నిత్యావసరాల కోసం చేసుకున్న ఏర్పాట్లన్నీ ప్రళయంలో ధ్వంసమైపోయి ఉంటాయి. అన్నవస్త్రాలూ, ఆశ్రయమూ అనే ముఖ్యావసరాలు ఇలా తీఱిపోవడంతో వారు తమ ధ్యానాన్ని పూర్తిగా ఆయన మీదే లగ్నం చేసి భావితరాలకు మూలపురుషులుగా,  ఋషులుగా, ఋషికలుగా అవతరిస్తారు. మళ్లీ మానవజాతిని విస్తారం చేసే నిమిత్తమూ, వారికి తాను బోధించిన సూత్రాల్ని నిలబెట్టే నిమిత్తమూ ఆయన వారికీ, వారి వంశీకులకీ వందలాది సంవత్సరాల ఆయుర్దాయాన్ని అనుగ్రహిస్తాడు. అది సాధారణంగా మూణ్ణాలుగొందలకు తక్కువ కాకుండా ఉంటుంది. ఒక మొక్కని నాటినప్పుడు అది వృక్షంగా ఎదిగే దాకా జాగ్రత్తగా కాపాడుకుంటూ రావడం లాంటిది ఇది.

9 thoughts on “ప్రళయమూ, ఆ తరువాతి జీవితమూ

  1. ఆర్యా ! బ్రహ్మకుమారీల వివరాలూ, వారి ఉపదేశాలూ నాకు పరిచయం లేదు. నా వ్యాసం హిందూ వేదాంత, పురాణేతిహాసాల మీదా, వీరబ్రహ్మేంద్రస్వామివారి కాలజ్ఞానం మీదా ఆధారపడి వ్రాయబడింది.

  2. తాడేపల్లి గారూ,

    మీరు చెప్పేది బ్రహ్మకుమారీలు కూడా చెబుతుంటారు. ఇది ఎక్కడైనా ప్రాచీన గ్రంధాలలో చెప్పబడి ఉన్నదా? వివరించగలరు. ఈపోస్ట్ మీ బ్లాగ్ లో కూడా చూసాను ఈమధ్యన.

  3. నాగమురళిగారికి,

    ముందస్తుగా ఆలస్యంగా సమాధానం వ్రాస్తున్నందుకు క్షమాపణలు.

    మీరు మీ మొదటి గద్యలో ఊహించినది కరెక్టు. రాబోయే అవాంతర ప్రళయానికి ఇంకా సుమారు మూడు శతాబ్దాల వ్యవధానం మిగిలుందని భావించవచ్చు. 2012 లో చారిత్రిక మైలుఱాళ్ళవంటి రాజకీయ సాంఘిక మార్పులే తప్ప ప్రళయాలేమీ లేవు.

    శాశ్వత నరకం అనే భావనని హిందూమతం అంగీకరించదు. ఎందుకంటే కర్మఫలానుభవం కోసం జీవులు మళ్ళీమళ్లీ జన్మిస్తూనే ఉండాలనేది హిందూ వేదాంతసూత్రం. అయితే ప్రళయంలో చనిపోయిన జీవులు, మళ్లీ భూమండలం మీద నివాసయోగ్యమైన పరిస్థితులు నెలకొనేదాకా ఇతర లోకాల్లోనే ఉంటారు. ఒకవేళ ప్రళయం లాంటివి లేకపోయినా సాధారణ పరిస్థితుల్లో సైతం మనలాంటివాళ్ళందఱమూ చైపోయినాక మన కర్మానుభవానికి తగిన పరిస్థితులు ఏర్పడేదాకా ఇతరలోకాల్లో ఉండాల్సిందే. దాన్నే పూర్వీకులు కాలం, కర్మం కలిసిరావడం అన్నారు.

    ఇప్పుడున్న మానవ జనాభాలో ఎక్కువభాగం ఇదివఱకటి జంతువుల ఆత్మలు మానవజన్మ ఎత్తడం వల్ల తయారైనది అని శ్రీపాద శ్రీవల్లభస్వామి చరితామృతం తెలియజేస్తోంది. కలియుగంలో ఉద్ధరణ పొందడం కోసం ఆ పతిత ఆత్మలకు అలా ఒక అవకాశం ఇవ్వబడుతుంది. అయితే పూర్వజన్మ దుష్టవాసనల వల్ల ఎక్కువమంది దాన్ని సద్వినియోగం చేసుకోరు గనుక రాబోయే యుగాల్లో ఆ ఆత్మల్లో ఎక్కువమంది జంతుజన్మలకి తిరిగి వెళతారు. అందుచేత అప్పుడు – అంటే రాబోయే యుగాల్లో భూమండలం మీద జంతువుల సంఖ్య ఎక్కువగానూ, మానవుల సంఖ్య అందులో ఒకటి-రెండు శాతమూ ఉంటాయి. ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉందనేది అందఱికీ విదితమే.

  4. మీరు చెప్పినదాన్నిబట్టి కొంచం లెక్కలు వేసి చూశాను. ఇప్పుడు నడుస్తున్నది కలియుగంలో 5112‍-13వ సంవత్సరం. మీరు చెప్పిన 5400 లోంచి 5112 తీసేస్తే 288. ఇది 5400 లో 5.3 శాతం. మీరన్నారు కదా చివర‌ ఆరుశాతం కాలఖండంలో ఉన్నామని. కాబట్టి ప్రళయానికి ఇంకా 288 సంవత్సరాల వ్యవధానం ఉన్నదనుకోవచ్చా?

    అయితే మీరిదివరకు 2012లో కొంత విపత్తు ఉన్నదని బ్లాగులో వ్రాసిన గుర్తు. దాని గురించి కూడా కొంత వివరించగలరా?

    మీరేమీ అనుకోనంటే ఒక ప్రశ్న. ఇతర మతాల్లో జడ్జిమెంట్ డే అన్న భావన ఉంది. భగవంతుణ్ణి నమ్మి ఆయన రక్షణని పొందనివారంతా చనిపోయిన తర్వాత జడ్జి చెయ్యబడి, శాశ్వతంగా నరకంలో మాడిపోతూ ఉండాలని భయపెడుతుంటారు.

    మీరన్నట్టుగా 288 ‍సంవత్సరాల వరకు ప్రళయం రాదు, ఆ తర్వాత మిగతా జీవులు ‘ఉండరు’ అనుకుంటే, ‘ఈలోగా హాయిగా ఎంజాయ్ చేసుకుందాం, తర్వాత ఎలాగా ‍ఉండంగా’ అనుకోవచ్చు కదా!! లేకపోతే మన హైందవంలో కూడా ‘శాశ్వత నరకం’ అన్న భావన ఏమైనా ఉందా?

  5. బ్లాగుల్ని చూసిన కళ్ళతో నైతే ఇంకా మెఱుగుపడాల్సినదేదో ఉన్నట్లే అనిపిస్తోంది. నా కోసం కాదు, పాఠకుల తరఫున చెబుతున్నా.

  6. అంతా బాగానే ఉంది గానీ ఎన్ని నెలలు పోయినా మాలికలో ఇలా గద్యకీ గద్యకీ మధ్య అగడ్తలూ, అగాధాలూ పోవడం లేదేమి ? కొత్తవాళ్ళకు తొలిచూపులో మధ్యలో ఏదో చాలా మేటర్ మిస్సయినట్లుంటుంది కదా ?

Comments are closed.


Notice: Trying to get property of non-object in /var/www/html/maalika/magazine/wp-content/plugins/jetpack/modules/gravatar-hovercards.php on line 238