March 29, 2024

భారతంలో బాలకాండ

రచన: శారదామురళి

 

 

 

 

 

 

 

ప్రియమైన మీనా,

బాగున్నావా? ఇక్కడ నేను బాగానే వున్నాను. కనీసం అలా అనుకుంటున్నాను. ఇంటా బయటా ఊపిరాడనంత పని. శారీరకమైన శ్రమ  కంటే మానసికమైన అలసట ఎక్కువ కృంగ దీస్తుందేమో! కొద్ది రోజులు ఉద్యోగం మానేసి విశ్రాంతి తీసుకో అంటాడు ప్రశాంత్. కానీ నీకు తెలుసుగా, నా పనంటే నాకెంత ఇష్టమో.

 

నిజానికి, ఆస్ట్రేలియా వచ్చింతరువాత ఏం చేయాలో నాకు చాలా రోజులు అర్ధం కాలేదు. చైల్డ్ సైకాలజీలో నా డిప్లొమానీ, ఇంగ్లీషులో ఎమ్మేని ఎలా ఉపయోగించుకోవాలో అసలు తెలియలేదు. అప్పుడు ఎవరో సలహా ఇస్తే టీచర్ ట్రైనింగ్ చేసాను. ఇక్కడ టీచర్లకి కొరతగా వుండటంతో తొందరగానే ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం దొరికింది.

 

అయితే ఒక చిన్న చిక్కుంది. పట్టణాల్లో పోస్టింగ్ దొరికేకంటే ముందు ఇక్కడ కొన్నేళ్ళు మారుమూల పల్లెల్లో పని చేయాలి. నన్నూ అలాగే ఒక పల్లెలో వేసారు. ఆ ఊరు అడిలైడ్ కి దూరంగా ఎడారిలో వుండటం వల్ల ప్రశాంత్ నీ, పవన్ నీ వదిలి వెళ్ళక తప్పలేదు.

 

అబ్బ! అక్కడ బ్రతుకు ఎంత దుర్భరంగా వుంతుందనుకున్నావు? పట్టణాలొదిలి ఉత్తరంగా ఎడారి పల్లెల్లోకి వెళ్తున్న కొద్దీ శ్వేత జాతీయుల సంఖ్య తగ్గి అబొరిజీన్ల సంఖ్య పెరుగుతుంది. నిజానికి ఈ తెగల్లో జనాభ విపరీతంగా తగ్గిపోవటంతో, ఒక్కో పల్లెలో వందా రెండొందలమంది కంటే ఎక్కువ వుండరు. అట్లాంటి ఒక పల్లెలో వేసారు నన్ను.

 

 

బిక్కు బిక్కు మంటూ వెళ్ళాను. నా చర్మం రంగూ వాళ్ళ ఒంటి రంగూ దాదాపు ఒకేలాగుంటటంతో వాళ్ళు నన్ను బాగానే ఆదరించారు. కానీ ఈ అబొరిజీన్ తెగల్లో తాగుడూ వ్యభిచారమూ ఊహించలేని స్థాయిల్లో వుంటాయి. సాయంత్రమైతే చాలు, తలుపులన్నీ బిగించుకుని లోపల గడ గడా వొణుకుతూ కూర్చునేదాన్ని. ఆ పిల్లలకి చదువుకుందామన్న ఆసక్తీ, బ్రతుకు మీద తీపీ, భవిష్యత్తు మీద ఆశా చచ్చిపోయాయా అనిపిస్తుంది కొన్నిసార్లు.

 

ఆడపిల్లలయితే అయిదేళ్ళు దాటని పిల్లలుకూడా మాన భంగానికి గురవుతారు! నెలల తరబడి స్నానం లేకుండా, అట్టలు కట్టిన జుట్టుతో, మురికి ఓడుతూ వాసన వేస్తున్న వాళ్ళను చూడగానే ముందు కొద్ది రోజులు కడుపులో తిప్పినట్టై వాంతొచ్చినంత పనయ్యేది. కానీ కొన్ని రోజులైంతరువాత జాలేయటం మొదలైంది. ఏ జాతి అయితేనేం, పిల్లలు పిల్లలే కదా? వాళ్ళని ఎలాగైనా చేరదీయాలి అనుకున్నాను. మొదట్లో కష్టమైంది. అనుకోకుండా నాకక్కడ ఒక భారతీయురాలైన లేడీ డాక్టరు కనిపించింది. చిన్నదైనా ఆవిడంటే అక్కడ అందరికీ బాగా గురి. ఆమె సాయంతో పిల్లలకి చేరువయ్యాను.

 

 

వారం మొత్తం స్కూలికి ఎగ్గొట్టకుండా వస్తే స్విమ్మింగ్ పూల్ లో ఒక పూట ఆట విడుపు, శుభ్రంగా రోజూ స్నానం చేస్తే మెక్ డోనాల్డ్స్ లో బర్గరూ, ఆట స్థలంలో పోటీలూ వంటి చిన్న చిన్న బహుమతిలిచ్చి వాళ్ళకి కొంచెం మంచి అలవాట్లు నేర్పే ప్రయత్నం చేసాను. అదృష్టవశాత్తూ ఇక్కడ సోషల్ వర్కర్ చాలా మంచిది. నిజంగా ఆ పిల్లల కోసం చాలా తాపత్రయపడేది.

 

ఆర్నెల్ల కింద నేనడిగినట్టు అడిలైడ్ నగరంలో పోస్టింగ్ ఇచ్చారు. నేను వదిలి వచ్చేటప్పుడు పల్లెలో పిల్లలు ఎంత ఏడ్చారనుకున్నావు? ఆ క్షణం నా చదువూ తెలివి తేటలూ అన్నీ సార్ధకమైనట్టనిపించింది.

 

ఇప్పుడు అడిలైడ్ లో ఒక మారు మూల సబర్బ్లో వున్న స్కూల్లో వేసారు నన్ను. ఈ పిల్లలంతా శ్వేత జాతీయులే. అయినా వీళ్ళ పరిస్థితికూడా ఏమంత బాలేదు. చీటికీ మాటికీ విడాకులిచ్చుకుంటూ, నలభై యేళ్ళొచ్చినా తగిన జోడు కోసం వెతుకుతూ వుండే తల్లి తండ్రులు పిల్లలకేం నేర్పిస్తారు? ఆడ పిల్లలైనా, మగ పిల్లలైనా, వ్యాపార సంస్కృతి నించీ, అర్ధం లేని వ్యామోహాలనించీ రక్షణా లేదు, నియంత్రణా లేదు. మనశ్శాంతీ లేదు, చదువుకునే వాతావరణమూ లేదు. పిల్లలకి టీచర్లనీ, అమ్మా-నాన్నలనీ సంఘాన్నీ ఎవరిని చూసినా నిర్లక్ష్యం, అసహనం.

 

కూలిపోతున్న కుటుంబ వ్యవస్థ కింద నలిగిపోతున్న ఈ పసి మొగ్గలని ఎలా కాపాడాలో ఎవరికీ తెలియదు. ఇక్కడ ముప్పై శాతానికి పైగా పిల్లలు డిప్రెషన్ వంటి జబ్బుల బారిన పడుతున్నారంటే నమ్మ గలవా?

 

మన దగ్గర పిల్లలెంత ప్రశాంతంగా పెరుగుతున్నారు! నిశ్చింతగా అమ్మా, నాన్నా, నానమ్మా, అమ్మమ్మా, తాతయ్యల దగ్గర ఆడుతూ పాడుతూ, వెచ్చటి సుర్యకాంతిలో విచ్చుకునే పూలని గుర్తు తెస్తారు.

 

ఇక్కడ పాపం పన్నెండు పదమూడేళ్ళకే బాయ్ ఫ్రెండో, గర్ల్ ఫ్రెండో లేకపోటే కొంపలంటుకున్నట్టు బాధ పడతారు. ఆడపిల్లలకి పదిహేనేళ్ళకి గర్భమో అబార్షనో. ఇక వీళ్ళ బాల్యం ఎక్కడ?

 

అప్పుడప్పుడూ ఇలాటి ఆలోచనలతో నిద్ర పట్టదు నాకు. “ఇంత సున్నిత మనస్కురాలివి ఈ ఉద్యోగమెందుకు చేస్తావ్?” అని కోప్పడతాడు ప్రశాంత్. నిజమే, దీన్నొదిలేసి ఏదైనా ప్రైవేటు స్కూల్లోకి మారితే అక్కడి పిల్లలింత అధ్వాన్నంగా వుండరేమో. అదీ చెప్పలేమనుకో! అయినా మన అవసరం ఎక్కడ ఎక్కువ వుందో అక్కడే కదా మనం పని చేయాలి? ఏమంటావు?

 

సరే, ఏదో మనసులో వున్న బాధంతా చెప్పుకున్నాను. అదంతా వొదిలేయి. మీ ఇంట్లో అంతా ఎలా వున్నారు? చంద్రు ఎలా వున్నాడు? లేఖ ఏ క్లాసు చదువుతోంది? మా పవనుతోటిదే కాబట్టి అయిదో ఆరో చదువుతుండాలి!

 

వుండనా మరి,

సరూ.

 

 

 

*****************

 

 

 

ప్రియమైన సరూ,

 

నీ ఉత్తరం చదివి చాలా సంతోషపడ్డాను. ఆ ఉత్సాహంలో నేను కూడా ఉత్తరమే రాస్తున్నాను. నీ ఉద్యోగం విశేషాలు ఆసక్తిగా వున్నాయి. నీకు సంతృప్తి కలిగించేలా నువ్వు బ్రతకగలుగుతున్నావు. అభినందనలు.

 

ఐతే సరూ, ఒక్క మాట. నువ్వు ఇండియా వదిలి దాదాపు పదేళ్ళయి వుంటుంది. ఈ పదేళ్ళలో ఇక్కడ ఎంత మారిందో నువ్వూహించలేవు. అప్పుడప్పుడూ ఇక్కడికి వచ్చినా అంతగా అబ్జర్వ్ చేయటానికి వీలుండొద్దూ?

 

నువ్వనుకున్నట్టు ఇక్కడ పిల్లలు హాయిగా సీతాకోక చిలుకల్లా ఎగరటం లేదు. పంజరంలో బంధించబడి ఆకాశం వైపు ఆశగా చూసే చిలకల్లా వున్నారు.

 

మొన్నేమయిందో తెలుసా? మా అత్తగారు జాతకాలవీ చూస్తారని నీకు తెలుసుగా. నిన్న సాయంత్రం ఆవిడని కలవటానికి ఎదురింటి కస్తూరి వచ్చింది, తన మూడేళ్ళ కొడుకు రోహిత్ ని తీసుకుని. ఎప్పుడూ గిలకలా తిరుగుతూ ముద్దులు మూటగట్టే రోహిత్ ఎందుకో నిశ్శబ్దంగా కుర్చీలో కూర్చున్నాడు. ఆశ్చర్యపోయాను. వాడి కసలు ఒక్క క్షణం  కుదురుగా వుండటం ఇష్టముండదు. ఆవిడనదే అడిగాను, వాడు ఎందుకలా డల్ గా వున్నాడని. “ఊరికే అవీ ఇవీ లాగితే తంతానని చెప్పానండి. ఆ భయంతో కదలకుండా కూర్చున్నాడు, కదలకుండా. పిల్లలకి కొంచెం డిసిప్లిన్ నేర్పకపోతే ఎలా?” మూడేళ్ల పసి వెధవకి డిసిప్లినా? ఆశ్చర్యపోయాను.

 

ఇంతకీ ఆవిడెందుకొచ్చిందో తెల్సా? వాడి జాతకంలో డాక్టరయ్యే యోగం వుందో లేదో తెలుసుకుందామని. జాతకాల్లో ఇలాటివి కూడా వుంటాయా ఏమిటి? ఇంతలోనే బయటికొచ్చారు మా అత్తగారు. మెల్లిగా వాడి జాతకంలో డాక్టరయ్యే గీత లేదని చెప్పేసారు. కస్తూరి వాణ్ణి అక్కడికక్కడే ఎలా బాదిందనుకున్నావు? వాడు కెవ్వుమన్నాడు. నాకైతే కోపంతో పిచ్చెక్కిపోయింది. ముందు మా అత్తగార్నీ ఆ తర్వాత కస్తూరినీ చితక బాదాలనుకున్నాను.

 

ఎలాగో పిల్లాణ్ణి ఆవిడ చేతిలోంచి తప్పించి, “అత్తయ్యగారు సరిగ్గా చూసారో లేదో! మీరెందుకు బాధ పడతారు? వాడు పెద్ద చదువుతాడు చూడండి,” అని ఆవిడకి సర్ది చెప్పాను. వాడు డాక్టరయి ఫారిన్ వెళ్ళకపోతే ఆవిడ పరువు పోతుందట. ఎక్కడైనా విన్నావా ఇలాటి విడ్డూరం?

 

ఆ మధ్య ఇంకొక రోజేమయిందో తెల్సా? రాత్రి ఎనిమిదింటికి బాల్కనీలో నిలబడి రోడ్డు మీదకు చూస్తున్నాను. చివరింటి కావ్య స్కూల్నించి తిరిగొస్తున్నట్టుంది, ఇంకా యూనిఫాంలోనే వుంది. ఇంత రాత్రైందెందుకో అనుకుంటూ అటే చూస్తున్నానా, వున్నట్టుండి, “సీటి కొట్టి చిడాయించకు” అంటూ వెకిలిగా పాటా, సైకిల్ బెల్లూ వినిపించాయి. కావ్య బెదిరిపోయింది. వేగంగా నడవటం మొదలుపెట్టింది. ఎవడో పోకిరి వెధవ సైకిల్ మీదెక్కి ఆమె పక్కనే నడుపుతూ అలాగే పాడుతున్నాడు, మధ్య మధ్యలో ఈల వేస్తూ. ఒళ్ళు మండిపోయింది నాకు. గబ గబా చెప్పులేసుకుని కిందికెళ్ళి నాలుగంగల్లొ ఆమెని చేరుకున్నాను.

 

“హాలో కావ్యా! ఇంటికేనా? పద నేనూ వస్తా! మి అమ్మతో పని వుంది,” అంటూ ఆమె పక్కనే నడవ సాగాను. ఆ హీరో వైపు తీవ్రంగా ఒక చూపు చూసేసరికి వాడూ జారుకున్నాడు. మెల్లిగా కావ్యని మాటల్లోకి దింపి సంగతేంటని అడిగాను. పాపం, చిన్న పిల్ల ఎంత బెదిరిపోయిందో!

“ఈ పక్కనే సైకిల్ షాపులో వుంటాడాంటీ! ప్రేమిస్తున్నానంటాడు. నేను ఐ.ఐ.టీ లో చదివినా, ఐ.యే.యస్ చదివినా పరవాలేదట కానీ పెళ్ళి మాత్రం తననే చేసుకోవాలిటా. నాకేమో వాణ్ణి చూస్తేనే కంపరం ఎత్తుతుంది,” అంది.

“మరి అమ్మతో చెప్పకపోయావా?” అని అడిగాను.

“అమ్మతో మాట్లాడటానికి టైమేదాంటీ? పొద్దున్నే లేచి ఆరింటికి ఐ.ఐ.టీ కోచింగ్ కెళ్తాను. అక్కణ్ణించే స్కూలు. తర్వాత టెన్నిస్ కొచింగూ, తర్వాత సంగీతం క్లాసూ, ఇదిగో ఈ టైముకి ఇంటికెళ్తాను. వెళ్ళగానే హోం వర్కూ, పరీక్షలూ,” దాని మాటల్లో నిరాశ వినబడి నాకు దిగులేసింది. అంత భారం మొస్తున్న ఆ పసిదానికెలా వుందో!

 

వాళ్ళ ఇల్లు చేరటంతో మాటలాపి ఇంట్లోకెళ్ళాం. ఆవిడ హాల్లోనే కూర్చుని టీవీ చూస్తున్నారు. ఆయనింకా ఇంటికే వొచ్చినట్టులేరు. టీవీ మించి కళ్ళు తిప్పకుండానే, “రండి కూర్చొండి” అన్నారావిడ. ఆవిడ అంతలా చూస్తున్న కార్యక్రమం పేరు, “ఆటొచ్చా పిల్లా?”. చిన్న చిన్న పిల్లలు, అయిదారేళ్ళ కూనలు, బూరె బుగ్గలతో ముద్దొస్తున్నారు. పట్టు లంగా బుల్లి ఓణీ బారెడు జడా, జడ కుచ్చులతో వేదిక ఎక్కిందొక చిన్నారి. నిజానికది “చుక్-చుక్ రైలూ వస్తుంది” అని అమ్మ ఒళ్ళో కూర్చుని పాడే వయసు. కానీ ఆ పాప, “కసి కసిగా చూడకురో ఒరయ్యో, నలిపెయ్యరో, కరిచెయ్యరో,” అంటూ పాటా, నాట్యమూ మొదలు పెట్టింది. ఆరేళ్ళ పాప ఒళ్ళంతా అసభ్యంగా ఊపుతూ, మధ్య మధ్యలో కన్ను గ్గీటుతూ, ఆ నాట్యం చూస్తే నీలాటిదైతే ఏడుపు లంకించుకుంటుంది. అప్పుడప్పుడూ కెమెరా అమ్మా-నాన్నల మీదా ఫోకస్ చేసారు. పోటీ ముగిసి అందరికంటే ఎక్కువ నగలు దిగేసుకుని, అందరికంటే ఎక్కువ అసభ్యంగా డాన్సు చేసిన అమ్మాయికి ప్రైజొచ్చింది. మిగతా పిల్లలూ తల్లులూ గొల్లుమన్నారు. ఏమిటీ హింస పిల్లలమీద?

 

ఆ కార్యక్రమాలని రూపొందించిన వాళ్ళనీ, ఆ యాంకర్లనీ, జడ్జీలనీ, అమ్మా-నాన్నలనీ నరికి పోగులు పెట్టినా పాపం లేదానిపించింది నాకు.

 

“వెళ్ళొస్తానండీ,” అంటూ లేచాను. నేనెందుకొచ్చానో అడగలేదు. పిల్లది అన్నం తిన్నదో లేదో అడగలేదు. ఆ మాతృమూర్తి అలా శిలా విగ్రహంలా మారిన గంధర్వ కన్యలా కూర్చుని తర్వాత వచ్చే “గన్నేరు పప్పులు” సీరియల్ లో మునిగి పోయింది.

 

ఎక్కడుంది సరూ నువ్వనుకుంటున్న ఆ బాల్యం? రాత్రికి రాత్రే డబ్బూ, పేరు ప్రఖ్యాతులూ వచ్చి పడాలన్న మధ్య తరగతి తాత్రయమూ, వాటిని ఎరగా వేసే విష సంస్కృతీ, పరీక్షల తాకిడీ అన్నిటి ధాటికీ తట్టుకోలేక పారిపోయినట్టుంది కదూ?

 

జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలినట్టున్నాయి మన ఉత్తరాలు. చంద్ర నిన్నడిగినట్టు చెప్పమన్నాడు. నువ్వన్నట్టు లేఖ ఆరో తరగతి చదువుతుంది. ఏ చదువూ అబ్బకపోతే దానిచేత హోటలైనా పెట్టిస్తాను కానీ, ఐ.ఐ.టీ కోచింగ్ కి మాత్రం పంపించనని ఒట్టేసుకున్నామూ, నేనూ చంద్రా! హాయిగా తనకి నచ్చిన పాటలు పాడుంటుంది, ఇష్టమైన పుస్తకాలు చదువుకుంటుంది. చూద్దాం ఇలా ఎంతకాలం నడుస్తుందో!

 

ఇండియా ఎప్పుడొస్తావ్? వచ్చినప్పుడు మనం ఇంకా చాలా కబుర్లు చెప్పుకోవాలి, ఇలాటివే!

 

వుండనా,

ప్రేమతో

మీనా.

 

 

7 thoughts on “భారతంలో బాలకాండ

  1. మెల్లిగా వాడి జాతకంలో డాక్టరయ్యే గీత లేదని చెప్పేసారు. కస్తూరి వాణ్ణి అక్కడికక్కడే ఎలా బాదిందనుకున్నావు? వాడు కెవ్వుమన్నాడు.
    —————
    ఇది ఏమో కానీ నేను నిజంగా విన్నది “నీకు 98 మార్కులే వచ్చాయి 100 మార్కుల్లో మిగిలిన ఆ 2 మార్కులూ ఏమయ్యాయి?” అని పిల్లాడిని నిల దీసి అడగటం. అదీ అమెరికాలో. చదువుకునే టప్పుడు మమ్మల్ని ఎవ్వరూ ఇల్లా అడగలేదు థాంక్ గాడ్.
    చెప్పాల్సింది సూటిగా చెప్పారు. పోస్ట్ బాగుంది.

  2. 3ఏళ్ళ పిల్లాణ్ణి తల్లి ఎప్పుడో డాక్టర్ అవ్వడని బాదడం …. కొంచెం అతిశయోక్తిగా వున్నా, కథ బానే వుంది.

    కొండా కోన తిరిగి, చెట్టూ పుట్టా ఎక్కిన నాబాల్యం అని నే గొప్పలు పోతే… లాప్టొప్, విడియో గేంస్ ఆడని అదీ ఓ బాల్యమేనా అని మా కుర్రోడు నవ్వాడు.

  3. భారతంలో ‘బాలకాండ’కు బదులు ‘మారణ కాండ’ అని పెట్టి ఉంటే బాగుండేది. ఈ కథనంలో అన్నిటికంటే ఎక్కువగా కదిలించిన భాగం మీరు ఆ మూలవాసుల పిల్లలను, వారి అభిమానాన్ని అక్కడే వదిలిపెట్టి మళ్లీ నగరానికి రావడం… శుభ్రతగా ఉండటంలో, మంచిగా ఉండటంలో మీరు చెప్పిన మాటలను వారు విన్నారు. పాటించారు. మళ్లీ అక్కడికి వెళ్లే టీచర్లు వారిలో ఆ మార్పును కొనసాగిస్తారో లేదో.. మీరు అక్కడే ఉంటే బాగుండుననిపించింది. అది సాధ్యం కాదని అనిపిస్తున్నప్పటికీ.

    మీ కథనం మొత్తంగా చదివిన తర్వాత నాకు అర్థమైంది ఒకటే. పరువుకోసం పిల్లల చదువులను, వారి సమస్త ఆనందాలను పుటుక్కున తుంచేస్తున్న రాక్షస వారసులు మనలో చాలామందే ఉన్నారు.

    మాకూ పిల్లలుంటే ఇలాగే మూడేళ్ల వయసులోనే వారికి డిసిప్లిన్ నేర్పిస్తూ, వాళ్ల భవిష్య గీతల గురించి జోస్యాలు చెప్పిస్తూ, చావబాదుతూ, వాళ్లను ఎక్కడికో తీసుకెళ్లేవాళ్లమేమో.. ఆ ఛాన్స్ లేనందుకు వాళ్లు ‘బతికిపోయారు’ లెండి.

    “ఆ పాప, “కసి కసిగా చూడకురో ఒరయ్యో, నలిపెయ్యరో, కరిచెయ్యరో,” అంటూ పాటా, నాట్యమూ మొదలు పెట్టింది.” ధన కాంక్ష, కీర్తి కాంక్ష… మన మధ్యతరగతిని ఇంత ఘోర పతనం వైపుకు నెడుతున్నవి ఇవే కదా….

    “మన దగ్గర పిల్లలెంత ప్రశాంతంగా పెరుగుతున్నారు! నిశ్చింతగా అమ్మా, నాన్నా, నానమ్మా, అమ్మమ్మా, తాతయ్యల దగ్గర ఆడుతూ పాడుతూ, వెచ్చటి సుర్యకాంతిలో విచ్చుకునే పూలని గుర్తు తెస్తారు.”
    ఎంత అందమైన కలను కనిపింప జేస్తున్నారండీ మీరు ఈ ఉదయం….

    అభినందనలు…

  4. కదిలించిది మీ కథ. ఇది కట్టుకథ కాదు అని మన దేశం నుంచి వారం వారం ఫోన్ చేసి, అప్పుడప్పుడూ తెలుగు చానల్స్ చూసి తెలుసుకుంటూనే ఉన్నాం. అక్షరాల్లో చూసేసరికి మనసు చివుక్కుమంది. నేనూ ఒట్టేసుకున్నాను. నేను కన్న బాల్యాన్ని స్వేచ్చగా ఎదగనిస్తానని. అభినందనలు.

  5. నాకు తెలిసీ ఈ జనరషన్ లో చలా తక్కువ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని వాళ్ళ ఇష్టమైన చదువు చదివిస్తున్నారు. ఇవి పక్కా ధనాశ చదువులు, విఙ్నానం ఎవడికికావాలి? నా మటుకు పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళో చదివిస్తే చాలేమో. మహా అయితే ఒక ట్యూషన్ పెట్టించాల్సి వస్తుందేమో . అమెరికాలో కూడా పిల్లల్ని ఏ స్కూల్ పడితే ఆ స్కూల్లో పెట్టలేము, ఇంటికిదగ్గర ఏ స్కూల్ ఉంటుందో అందులోనే అందరూ వెళతారు వాళ్ళ స్కూల్ జోన్ ప్రకారం తప్పనిసరిగా లెదంటే ఇల్లు మారాలి. మరి, ఇండియాలో కూడా ఈ రూలు పెడితే సగం గొడవ ఉండదనిపిస్తుంది.

  6. బాల్యం కోల్పోతున్న బాలలని చూస్తే జాలేస్తుంది. ఆంధ్రా లోనే ఇది ఎక్కువగా ఉందనుకుంటాను. మూడేళ్ళ పిల్లలు వీపుకి బాగ్ తగిలించుకొని బస్సులెక్కి స్కూల్ కెళుతుంటే చాలా బాధగా ఉంటుంది. కానీ ఏమి చేయగలం. 5 ఏళ్లదాకా పిల్లలు స్కూల్ కెళ్లకూడదని చట్టం చేస్తే బాగుంటుంది. .

Comments are closed.