April 24, 2024

వాడొచ్చేశాడు!!!


రచన: డా. రజని

వాత్సల్యా అనాధ శరణాలయం పిల్లల సందడితో కోలాహలంగా ఉంది. గేటు ముందు కారుదిగి లోపలకు వెళ్లాం మేము. పిల్లలు ఆటలు ఆపి మావైపు చూస్తూ నిలబడ్డారు. మేము వస్తున్నట్లు ముందే ఫోను చెయ్యడంవల్ల మాకోసమే కనిపెట్టుకుని ఉన్నారు కాబోలు, ఆ శరణాలయం మేనేజ్‌మెంట్‌వారు మమ్మల్ని చూస్తూనే బయటికి వచ్చి, లోపలికి ఆహ్వానించారు.

ఆ రోజు మా అరవింద్ తొలి పుట్టినరోజు. అప్పుడే వాడు పుట్టి సంవత్సరం గడిచిపోయింది. వాడిని చూసుకుని మాలో ఎన్నో ఆశలు, మరెన్నో కోరికలు చెలరేగాయి. వాడి భవిష్యత్తును గురించి ఎన్నెన్నో కలలు కన్నాము. వాడిని ఒక ఆదర్శ పౌరుడిగా పెంచాలనీ, పెద్ద పెద్ద చదువులు చదివించాలనీ, ఇలా ఎన్నో ……

మా కలలన్నీ కల్లలు చేసి వాడు మా పట్టు విడిపించుకుని ఎక్కడెక్కడికో, సుదూర తీరాలకు మాకు అందనంత దూరం తరలిపోయాడు. డాక్టర్లు, “కంజనిటల్ డిఫెక్టు ఉండడం వల్ల ఇలా జరిగింది. పుట్టగానే పూర్తిగా విచ్చుకోవలసిన ఊపిరి తిత్తులు సరిగా విచ్చుకుని ఉండవు. కాకపోతే సాధారణ జ్వరానికే ఇలా శ్వాస ఎగదన్ని ప్రాణం పోవడం ఏమిటి” అన్నారు.

“ఎంత ఎత్తుకి ఎదిగినా వైద్య విజ్ఞానం రోగాన్ని నయం చేస్తుందేమోగాని ప్రాణం పొయ్యలేదు కదా! వాడికి ఈ భూమ్మీది నూకలు చెల్లిపోయాయి! మీ మధ్యనున్న ఋణం తీరిపోయింది, చూస్తూండగా వెళ్లిపోయాడు” అంటూ మమ్మల్ని ఓదార్చి నచ్చజెప్పాలని చూశారు పెద్దవాళ్లు. కాని ఓదార్పు మాటలతో తీరేది కాదు గర్భశోకం !

* * *

వర్ష పుట్టిన ఆరేళ్లు గడిచాక మళ్లీ ఒక బిడ్డ కావాలనిపించింది మాకు. కొడుకు పుట్టేడు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ! ఇంక చాలు అనుకుని పురిట్లోనే, మరి పిల్లలు పుట్టకుండా నేను ఆపరేషన్ చేయించుకోడం కూడా జరిగిపోయింది. ఇద్దరు పిల్లల్నీ మా రెండు కళ్లూ – అనుకున్నాం. వాడికి “అరవింద్” అని పేరుపెట్టి, అల్లారు ముద్దుగా పెంచుకోడం మొదలుపెట్టాం. వర్ష కూడా తమ్ముణ్ణి ఎంతో ప్రేమగా చూసుకునేది.

అరవింద్, అందరు పిల్లల్లా “కేర్, కేర్” మంటూ ఏడ్చింది లేదు. “యా, యా” అంటూ సన్నని ఎలుగుతో అప్పుడప్పుడూ కొద్దిగా ఏడ్చీవాడు. పుట్టు బుద్ధిశాలి – అని పోంగిపోయాం. కాని, ఇప్పుడు తెలిసింది, అది మంచిది కాదనీ, వాడి ఊపిరితిత్తులకు గట్టిగా ఏడ్చే త్రాణ లేకపోయిందనీను! “బాలానాం రోదనం బలం” అని ఊరికే అన్నారా! పిల్లలు ఎడ్చినకోద్దీ వాళ్ళ ఊపిరితిత్తులకు బలం ట!

అంతా ఐపోయింది. ఇప్పుడింక ఏమనుకునీ ఏ లాభం లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏమిటి! మూడు నెలలైనా నిండకముందే చనిపోయాడు అరవింద్, నాకు గర్భశోకం మిగిల్చి. వాడు కావాలని అందరం ఆశించి ఉన్నామేమో, వాడిక లేడు – అన్నది మాకెవ్వరికీ మింగుడుపడని విషయమైపోయింది. ముక్కుపచ్చలారని వర్ష కూడా, “తమ్ముడు ఏడీ” అంటూ మరీ మరీ అడిగి, ఏడ్చేది. మేము పడుతున్న బాధ చాలనట్లు, వర్షను ఓదార్చడమన్న మరో పెద్ద బాధ కూడా దానికి తోడయ్యింది.

“వచ్చేస్తాడమ్మా, వచ్చేస్తాడు, ఏడవకు” అంటూ వాళ్ల నాన్న గద్గద స్వరంతో దాన్ని ఓదార్చాలని ప్రయత్నిస్తూంటే భరించలేక, నేను ఆ పరిసరాల్లో ఉండకుండా వెళ్లిపోయే దాన్ని. రాత్రులు నిద్ర పట్టక ఏవేవో ఆలోచనలు ……

వర్ష కోసమైనా మరో బిడ్డను కనడం బాగుంటుందేమో – అనిపించేది. కాని అదంత తేలిక కాదు. ఎంతో కష్టపడి, ఫామిలీ ప్లానింగ్ ఆపరేషన్‌ని రివర్సు చేయించుకున్నా, మళ్లీ వెంటనే బిడ్డ పుడతాడనీ, అదీ వర్షకు తమ్ముడే పుడతాడనీ గారంటీ ఎక్కడుందిట ! అంతులేని ఆరాటంతో రాత్రులు నిద్రపోకుండానే గడిచిపోయేవి మాకు.

రోజులు చాలా భారంగా గడుస్తున్నాయి. మాలో ఉత్సాహమన్నది నశించిపోయింది. దుఃఖమే ప్రపంచమై కాలం స్థంభించిపోయినట్లు అనిపించేది. కాని …

* * *

కాలమూ, కెరటమూ ఒకరికోసం ఆగేవి కావుకదా ! తొమ్మిది నెలలు ఎలాగో తెలియకుండా గడిచిపోయాయి. అరవింద్ పుట్టి సంవత్సరం అయ్యింది. బ్రతికి బాగుంటే బ్రహ్మాండంగా వాడి పుట్టినరోజు పండుగ జరిపించేవాళ్లం కదా – అన్నభావం మా దుఃఖాన్ని ఇనుమడింపజేసింది.

“ఇప్పుడు మాత్రం మనం వాడి పుట్టినరోజుని ఎందుకు మర్చిపోవాలి” అన్నారు మా వారు. నాకూ నచ్చింది ఆ మాట.

అరవింద్ పుట్టినరోజునాడు మేము ముగ్గురం , అక్కడి పిల్లలకోసం బట్టలు, బొమ్మలు, తినుబండారాలూ తీసుకుని, మా ఇంటికి దగ్గరలోనేఉన్న “వాత్సల్యా అనాధశరణాలయం”కి వెళ్లాం.

శరణాలయం అంతా సందడిగా ఉంది. అక్కడ నడయాడే పిల్లలు మొదలు నెలలపిల్లలుదాకా ఉన్నారు. ఆయాలు పిల్లల పనులు చకచకా చేస్తూ, హడావిడిగా తిరుగుతున్నారు. పిల్లల తొక్కు పలుకులతో ఆ ప్రదేశమంతా కలకలంగా ఉంది. వర్ష క్షణంలో అక్కడున్న పిల్లలతో కలిసిపోయి ఆడడం మొదలుపెట్టింది.

అక్కడున్న ఒక బాబుతో చెపుతోంది వర్ష, ” ఈ వేళ మా తమ్ముడి హాపీ బర్తుడే” అని. మా వారు, మేము తీసుకు వచ్చినవన్నీ ఒక టేబుల్ మీద పోసి, వరసలో వస్తున్న పిల్లలకి, వయసుని బట్టి, వాళ్లకు తగినవాటిని ఒక్కొక్కరికీ వర్షచేత ఇప్పిస్తున్నారు. ఆ పిల్లలు మురిసిపోతూ వాటిని సంతోషంగా అందుకుంటున్నారు. నేను, పసి పిల్లలకోసం కొన్నవి తీసుకుని, నెమ్మదిగా అక్కడనుండి జారుకుని, పసిబిడ్డలున్న సెక్షన్‌కి బయలుదేరా బరువైన మనసుతో.

అక్కడ నెలల వయసు పిల్లలు ఉయ్యాలాతొట్టెల్లో పడుకుని ఆడుకుంటున్నారు. ఒక్కడు మాత్రం కింకపట్టి గట్టిగా ఏడుస్తున్నాడు. దగ్గరలోనే ఒక బేబీకి డయాపర్ మారుస్తున్న ఆయాతో, “చూడమ్మా! పాపం, ఎలా ఏడుస్తున్నాడో! ఆకలో ఏమో” అన్నా.

“ఆకలి కాదమ్మా. వీళ్లందరితో పాటుగా వాడికీ పాలు పట్టా” అంది ఆయా.

బట్ట తడుపుకున్నాడేమోనని తడిమి చూశా, లేదు. ” కడుపునొప్పేమో” అన్నా ఊరుకోలేక.

చేతిలో పని పూర్తవ్వడంతో, నేనున్న దగ్గరకు వచ్చింది ఆయా. పిల్లాడి పొట్ట పట్టి చూసి, ” ఏమీ కాదమ్మా. మీరేమీ భయపడకండి. వీడెప్పుడూ ఇంతే, ఏడుస్తూనే ఉంటాడు. పాలు పడితే చాలదు, ఇంకా ఏమో కావాలన్నట్లు ఏడుస్తాడు. అమ్మవొడి వెచ్చదనం వీడికి అందించాలంటే మాకు ఎలా కుదురుతుందమ్మా! ఇంకా ఎంతోమంది పిల్లలకు సంరక్షణ చెయ్యలికదా! స్నానాలు చేయించాల్సిన పిల్లలు ఉన్నారమ్మా, నేను వెళ్లాలి. వీడికేం ఫరవా లేదు, ఎంత ఏడిస్తే వాడికి అంత బలం. మీరేం బేజారవ్వకండమ్మా” అంటూ వెళ్లిపోయింది ఆమె.

నేను వాళ్లకోసం తెచ్చిన, నొక్కితే కీచు కీచుమనే రబ్బరు బొమ్మలు, తొట్టెల్లో ఉన్న పసివాళ్లందరికీ ఇచ్చి, తిరిగి ఏడుస్తున్న బాబు దగ్గరకు వచ్చా. వాడి బుగ్గలు పుణికి, బుజ్జగింపుగా మాట్లాడుతూ, వాడికీ ఒక బొమ్మ ఇవ్వబోయా. వాడు బొమ్మని కాకుండా, నా వేలు పట్టుకుని, నా ముఖంలోకి చూస్తూ కిలకిలా, ఎంతో మనోహరంగా నవ్వాడు. అరవింద్ జ్ఞాపకాలతో నా కళ్లు చెమర్చాయి. అంతలో మావారు నా కోసం వచ్చారు. నేను బిక్కమొహంతో బేలగా ఆయన వైపు చూసి తలదించుకుని, రెండవచేత్తో కొంగు అందుకుని కళ్లు తుడుచుకున్నా. ఆ బాబు నా వేలు వదలకుండా పట్టుకుని, ఏడుపాపి ఆడుకోసాగాడు. నా మనసంతా ఆర్ద్రతతో నిండిపోయింది. ఆపినా ఆగని కన్నీరు చెంపలవెంట కారిపోయింది.

ఎంతో అనునయంగా నా బుజం మీద చెయ్యేసి, “మనం ఈ బాబుని పెంచుకుందామా” అన్నారు మా ఆయన, నా మనసును చదివినట్లుగా!. నా మనసు ఆనందంతో పులకించిపోయింది. వాడిని లేవదీసి హృదయానికి హత్తుకున్నాను. వెంటనే మావారు శరణాలయం వాళ్లతో మాట్లాడడానికి వెళ్లారు.

మరునాడు వర్షను స్కూలుకి పంపించాక, ఎందుకో మనసు పీకడంతో అరవింద్ ఫొటో ఆల్బం బయటికి తీసి చూడడం మొదలుపెట్టా. తొలిపేజీలో ఉంది వాడి తొలిఫొటో……. నేను ఏడునెలల గర్భవతిగా ఉన్నప్పుడు, నా కడుపులో ఉండగానే వాడికి తీసిన స్కానింగ్ ఫొటో! మగపిల్లాడని తెలియగానే మేము ఎంత సంబరపడ్డామని! ఆడపిల్ల ఉంది అప్పటికే మాకు. రెండవ మాటు మగ బిడ్డ ఐతే, రెండు విధాలుగానూ, రకరకాల అనుభవాలతో అచ్చటా ముచ్చటా తీర్చుకో వచ్చునని ఎంతో ఆనందించాము.

రెండవ పేజీలో ఉన్నది, భూమిమీదకు వచ్చాక, వాడిని పొత్తిళ్లలో చుట్టి తీసిన కలర్డు ఫొటో! ఆ తరువాత మరెన్నో ఫొటోలు ! పడుకోబెట్టి, పట్టుకు కూర్చోబెట్టి, నవ్వుతున్నవి, ఏడుస్తున్నవి, మా అందరి చేతుల్లో ఉన్నవి… ఇలా రకరకాల ఫొటోలు! కాని ఇంకా చాలా పేజీలు ఖాళీగా ఉన్నాయి. అప్పట్లో, వాడి అమూల్యమైన పసితనాన్ని ఫొటోల్లో బంధిస్తూ, అది శాశ్వతమనుకుని మురిసిపోయాము.
భావోద్వేగంతో నన్ను నేను మరిచిపోయి ఆ ఖాళీ పేజీలు తిరగేస్తూ కూర్చున్నా. ఆఫీసుకి బయలుదేరిన మావారు, నాకు చెప్పిపోదామని వచ్చి నా పరిస్థితి చూసి, ” బాధ పడకు, వచ్చేస్తున్నాడుగా బాబు . ఆ పేజీలు కూడా నింపుదువుగానిలే” అన్నారు.

ఆయన నాకు చెప్పి వెళ్ళాక చాలాసేపు అరవింద్ ఫొటోలే చూస్తూ కూర్చుండిపోయా. అరవింద్ మరణంతో ఏర్పడిన వెలితిని పూడ్చడానికి హర్షవర్ధన్ ఈ ఇంటికి వచ్చే రోజు రేపే!

వర్షను స్కూలుకి పంపించాక, మేమిద్దరం శరణాలయానికి వెళ్లాము. అక్కడే, నిరాడంబరంగా, న్యాయశాస్త్ర సమ్మతంగా దత్తత రిజిష్టరయ్యింది. వాళ్లు బిడ్డని తీసుకువచ్చి మాకు అప్పగించారు. ఈ క్షణం నుండి వీడు మాబిడ్డ, వర్షకి తమ్ముడు!

హర్షను ఇంటికి తీసుకురాగానే నేను చేసిన మొదటిపని వాడికి స్నానం చేయించడం. శరణాలయం బట్టలు తీసేసి, నులివెచ్చని నీళ్లతో, బేబీ షాంపూతో వాడికి తలారా స్నానం చేయించా. ఒళ్లు రుద్దుతున్నంతసేపూ వాడు నా గాజులతో ఆడుకుంటూ, కేరింతలు కొదుతూనే ఉన్నాడు.. నీళ్లు పోయించుకోడానికి ఏడుస్తాడేమో అనుకున్నా గాని అదేం లేదు. “పెద్దగోంతుకతో ఏడుస్తాడని అందరూ అన్నది వీడినేనా – అని విస్తుపోయా.

స్నానమయ్యక, వాడి కోసమనే కొన్న కొత్త డ్రెస్ తొడిగా. పాలు పడితే తాగి సుఖంగా నిద్రపోయాడు హర్ష. వాడు పడుకున్నాక, ఆయన ఆరోజు సెలవు పెట్టి ఇంట్లోనే వున్నారేమో, మేమిద్దరం కలిసి భోజనాలు చేశాము. ఆయన భోంచేసి విశ్రాంతిగా సోఫాలో జారబడి పేపర్ చూస్తూంటే, నేను పొద్దున్ననుండీ ఇంట్లో లేకపోడంతో బాకీ పడ్డ పనులు చేసుకుంటున్నాను. స్కూలు బస్సు వచ్చింది కాబోలు, వర్ష వచ్చిన సందడి వినిపించింది. హాల్లో క్రిబ్‌లో నిద్రపోతున్న హర్షను చూసింది కాబోలు ……

“వాడొచ్చేశాడు! అమ్మా, వచ్చేశాడు! నాన్నా!! వాడొచ్చేశాడు! తమ్ముడు వచ్చేశాడు” అంటూ ఉత్సాహంతో కేకలుపెట్టసాగింది వర్ష.

దాని సంతోషం చూస్తూంటే మేము చేసింది చాలా మంచిపని అన్న భావం మా మనసుల్లో ధృవపడింది.

=====================

5 thoughts on “వాడొచ్చేశాడు!!!

  1. memu oka abbaayini penchukunam maku pillalu vaddanukuni vanne ma kodukuna chuskuntunam….e katha chadivaka anipinchindi andaram ila sharanalayallo vallani penchukunte asalu anadale undaru prapanchamlo

  2. కథ చాలా బాగుంది. నిజంగా మనసుని కదిలించింది. అక్కడక్కడా సన్నని నీటిపొర కంటికి అడ్డు తగులుతూనే ఉంది.

Comments are closed.