March 28, 2024

అవార్డులిస్తాం! చందా కట్టండి!

రచన: పాణంగిపల్లి విజయ భాస్కర శ్రీరామ మూర్తి.
పార్వతీపురం.

 

ప్రియరంజనీ రావుకు గొప్ప టెంక్షన్ గా ఉంది. అప్పటికే పది మంది పెళ్ళికొడుకుల ముందు కూర్చొని ఓ.కే.అనిపించుకోలేని పెళ్ళి కూతురులా ఉంది అతని మానసిక పరిస్థితి. గొప్ప అలజడిగా ఉంది. ఆందోళనగా ఉంది. అల్ల కల్లోలంగా ఉంది. గాలికి చెదిరిన జుట్టులా నక్స్లైట్లు పేల్చేసిన ప్రభుత్వ కార్యాలయంలా దీపావళి మరునాటి ఉదయపు వీధుల్లా.
ఇలాంటి పరిస్థితి అతనికి చాలా కాలంగా అలవాటయిపోయింది.
ఎక్కడ ఏ కథల పోటీ కనిపించినా దానికి ఓ కథ పంపటం, దానికి గ్యారంటీగా ఫష్టు ప్రైజు వస్తుందనుకోవటం, అది తుస్సుమనటం, ఏ చివర్లోనో సాధారణ ప్రచురణ జాబితాలో చోటు చేసుకోవటం ఎగిరెగిరి సిటీ బస్సులో ఫుట్పాత్ మీద సీటు సంపాదించినట్టు ! దానికే తృప్తి పడటం జరుగుతున్నదే. ! అదేం పాపమో ఇటీవలి కాలంలో సాధారణ ప్రచురణలలో కూడా స్థానం లభించటం కరువైంది.
అయితే ఈ సారి పోటీలో అతని కేదో ప్రైజు తగుల్తుందనేఅనుకొన్నాడు. ఎండిపోతున్న చెరువులో ఓ చేప పిల్లైనా దొరకదా అని కొంగ ఆశ పడినట్లు.
కారణం లేకపోలేదు. ఈ సారి పోటీకి ఎటేస్ట్రెచ్ రాసేయక మూడు నాలుగు సార్లు కథను మార్చి వ్రాసి పెద్ద రచయితలకు చూపెట్టి మరీ ఫెయిర్ చేసాడు. అంత కంటే మరో ముఖ్య విషయం ఉంది. ఆ పత్రిక నిర్వహిస్తున్న కథల పోటీకి న్యాయ నిర్ణేతల పేర్లను కూడా ముందుగా ప్రకటించింది. అందువల్ల ముందుగా ముగ్గురు న్యాయ నిర్ణేతలకీ ఉత్తరాలు వ్రాసాడు కాస్త లౌక్యంగా. మీ రచనలంటే నాకెంతో అభిమానమని, చెవి కోసుకుంటానని, దానికి వాళ్ళు థేంక్స్ చెప్పి లెటర్లు స్వదస్తూరీతో రాసారు.
అందుకే ఈ సారి తప్పనిసరిగా తన గాలానికి ఏదో చేప తగలొచ్చనుకున్నాడు. కాని ఫలితాల గడువు దగ్గర పడుతోన్న కొలదీ టెన్షన్ అధికమై పోయింది.
అసంఖ్యాకంగా కథలు రావటం వల్ల ఫలితాల ప్రకటన ఆలస్యమైందని తెలియ చేయటానికి చింతిస్తున్నాము అని మూడు వారాల ముందు వచ్చే వారమే ఫలితాల ప్రకటన చేస్తున్నట్లు వారు ప్రకటన చేసారు. ఆరోజు టెలిగ్రాం కోసం ఎదురు చూసాడు. ఓ రోజు టెలిగ్రాం రానే వచ్చింది. కానయితే అది అత్తగారికి సీరియస్ గా ఉందని., ఢీలా పడిపోయాడు. పేలని బాంబులా అయ్యాడు. అతనికి ఎందుకో ఆశ చావ లేదు. ఈ సారి అసంఖ్యాకంగా రావటం వలన ఆలస్యమయిందని అన్నాడు. కాబట్టి పత్రిక ద్వారానే ఫలితమిస్తాడేమోనని.
పత్రిక కొన్నాడు. లేటు లేకుండా అనుకున్న టైంకే రావటం వల్ల ! చేతులు వణుకుతున్నాయి. అయిసుముక్క పట్టుకున్నట్టు వేళ్ళు కొంకర్లు పోతున్నాయి.
పేజీలు త్రిప్పాడు. ఎడిటర్ రిమార్కు, న్యాయ నిర్ణేతల వివరణలు ముందు పేజీలలో చదివాడు. కథలు వాసిలోను రాశి లోను బాగున్నాయి. దళిత వాదం , స్త్రీ వాదం మీద మంచి కథలు వచ్చాయి. వర్ధమాన రచయితలు, లబ్ధ ప్రతిష్టులకు దీటుగా క్రొత్త రచయితలు పోటీ పడ్డారు. అందుకే ఈ సారి పోటీలలో అందరూ క్రొత్త వారే ఎన్నిక కావటం విశేషం. అయిదారు వడపోతల తరువాత మా అభిమతాల మేరకు ఈ కథలు నిర్ణయించాం.
క్రింది వివరణ : వివరాలకు పేజీలు తిరగేయండి.
ఆనందంఅర్ణవమయింది.
అంతరంగం సంబర పడింది.
ఇంతకీ తన వర్ధమాన రచయితా? లబ్ధప్రతిష్టుడా? క్రొత్తవాడా? ఔను. తను చాలా మంచి కథలే వ్రాసాడు. కనుక లబ్ధ ప్రతిష్టుడే. ప్రస్తుతం తనకింకా రావసిన పేరు రాలేదు. కాబట్టి వర్ధమాన రచయితకే ఒక ప్రైజు రాలేది కాబట్టి క్రొత్త రచయితే.
ఏడు కొండల వాడా! వేంకట రమణా! నన్ను క్రొత్త రచయితగా దీవించి ఓ ప్రైజు పారేసి సర్ప్రైజు చెయ్యి. మనసులో భజనలు.
పేజీలు తిరగేసాడు. మొహం జేవురించుకు పోయింది. మాడిపోయింది.
వీళ్ళందరికీ ఇదే తొలి రచనట.
క్రొత్త రచయితలారా! ఆత్మ వంచన చేసుకోకండి. న్యాయ నిర్ణేతలారా! అబద్ధమాడకండి. ఎడిటర్ గారూ! నిజం చెప్పండి. నిజంగా నిజంగా మీరు గుండె మీద రెండు చేతులు గట్టిగా పెట్టుకొని చెప్పండి? క్రొత్త రచయితలూ! మీరు ఎడిటర్ గారికి ఏమీ కారా? ఇందులో లాలూచీ లేమీ లేవా?
నో. ఇదంతా మోసం దగా అని గట్టిగా అరిచాడు.
ఏదిసార్! పుస్తకాలవానితో పాటు చుట్టూరా ఉన్న వ్యక్తులు ఖంగారుగా అడిగారు.
అబ్బెబ్బేఏమీ లేదు. అని తడబడుతూ అక్కడనుంచి కదిలాడు. వాళ్ళు పిచ్చాణ్ణి చూసినట్టుగా అతన్ని చూడ్డం. ప్రియరంజనీ రావుకు తల తీసేసినట్లయింది.
పత్రికను ముక్క ముక్కలు చేసి కాలవలో పారేయాలనుకున్నాడు. కాని విదేశీ వస్ర బహిష్కరణలా తన డబ్బును తాను కాలువలో పారేయటం సముచితంగా కనిపించ లేదు.
ఇంటికి వెళ్తే కనీసం శ్రీమతైనా చదువుతుంది. కాగితాలు ఏ పొట్లం కట్టడానికైనా పనికొస్తాయి. ఇంటికెళ్ళాడు. కుర్చీలో కూలబడ్డాడు. ఆకలిగా ఉంది. శ్రీమతి ప్రక్కింటికెళ్ళింది. పిల్లలు మీద కస్సుమన్నాడు. దూరంగా విసిరేసిన పత్రికను తిరిగి తీసుకున్నాడు. పేజీలు తిరగేసాడు.
అతని కళ్ళకి ఓ అద్భుతం కనిపించింది.
అతని మనసుకో పులకింత కలిగించింది ఆ ప్రకటన.
మీరు రచయితలా? ఉపాధ్యాయులా? కళా కారులా? సంఘ సేవకులా? ఐతే పది రోజులలోగా మా సంస్థ ఇచ్చే ఉగాది పురస్కారాలకు ధరకాస్తు చేసుకోండి. వివరాలకు క్రింది చిరునామాకు స్వంత చిరునామా గల రూపాయి స్టాంపు అతికించి కవరు జతపరచి పంపండి అని.
ఎగిరి గంతేసాడు.
దేవుడు దయ తలచాడు.
వెంకన్న వరమిచ్చాడు.
అతనికి జేబులో రడీగా స్టాంపులుంచుకోవటం చేత అప్పటికప్పుడు వివరాలకి స్వంత చిరునామా గల అంటించిన స్టాంపు కవరులో పంపించాడు. వారం రోజులలో పది పేజీల కర పత్రం వచ్చింది. మీలో ప్రజ్ఞ ఉంది. ఐనా ఈ బూర్జువా పత్రికలు మిమ్మల్ని గుర్తించటం లేదు. ఔనా? మీరావేదన పడవద్దు. మీలాంటి మేధావులను ప్రజ్ఞావంతులను ఎంచి, సేకరించి, గౌరవించటానికే ప్రజా రంజని సంస్థ ఏర్పరించాము. మీరు రచయితలే ఐతే ఇంత వరకు మీరు వ్రాసిన కథ లేయే పత్రికలలో వచ్చాయి? తేదీల వివరాలతో జిరాక్స్ కాపీ అవసరం లేదు. మీ హామీ పత్రం చాలు . పంపండి. రెండు ఫొటోలు పంపండి. మీ బయోడేటా వివరంగా పంపండి. అంటూ రెండు వందలే క్రాస్ద్ డీడీ పంపండి. ఈ కర పత్రం అందిన వారం రోజులలో పంపండి. మాకు అసంఖ్యాకంగా వచ్చిన ఎంట్రీల పరిశీలనకు గడువు సరిపోవటం లేదు. అని కరపత్రం చదివిందే చదివాడు.
రెండు వందలు పంపాలా? మనసు విరిగింది. తీరా పంపితే మాత్రం అవార్డ్ వస్తుందని గ్యారంటీ ఏమిటి? చిన్నప్పుడు పేపర్లో ఫజిల్ నింపి పంపితే ఏమయింది? రెండొందలకు వీ.పీ. వచ్చింది. విడిపిస్తే రెణ్ణెల్లు పలికే రేడియో వచ్చింది. ౨౦ సంవత్సరాలు నాన్న తిడుతూనే ఉన్నాడు. ఇది అలా కాదు కదా?
కాదు? దీనిలో ఎందుకో అలాంటి మోసం కనిపించలేదు ఆలోచిస్తే మనసు మారిపోతుంది. ఎందుకైనా మంచిదని తన పత్రికలో వ్రాసిన ఉత్తరాలు, జోకులు, మినీ కవితల దగ్గరనుంచీ జిరాక్స్ కాపీలు నూట ఏభై ఖర్చైనా వెనుకాడక, తీసి పంపాడు. రెండొందలు డీడీ పంపాడు. రిజిష్టర్డ్ పోష్ట్లో పంపాడు. పది రోజులలో ప్రియ రంజనీ రావుకు కొరియర్ లో ప్రజా రంజని సంస్థ నుండి ఉత్తరం వచ్చింది. పిక్క బలంతో తన్నిన ఫుట్బాల్ లాగ ఎగిరి గంతేసాడు. ఉత్తరం చదివాడు, గట్టిగా అరిచాడు పిడుగు పడినట్లు. వంట చేస్తున్నవాళ్ళావిడ సిలండరు పేలిపోయిందో, కుక్కరు ఎగిరి పడిందో నని భయపడి పరుగుపరుగున వచ్చి బయట పడింది.
ఏమే! నాకు అవార్డు వచ్చిందే.
ఏ ఎవార్డండి? ఆమెది వానా కాలం చదువు. అందుకే అలాగంది. నీ ముహం సంతకెళ్ళ. నీలాంటి దెయ్యంను నే కట్టుగో బట్టే. నేను ఎదగ లేకపోయాను.
మీరెదగడమేంటండి? మీరేమైనా ఆడపిల్లా? గెదె పెయ్యా? అంది అమాయకంగా . అది కాదే . నాకు బహుమతి వచ్చిందన్నాడు. ఆమెను గట్టిగా వాటేసుకొన్నాడు. భర్త ఆనందానికి ఆమె కూడా ముగ్ధురాలయి ” ఎంతండి” అంది.
గతుక్కుమన్నాడు. నిజమే? ఎంతిస్తారు? చెప్మా? అని కాగిత పూర్తిగా చదివాడు. దానిలో ఎక్కడా వివరం లేదు.
దానిలో వ్రాసిందల్లా ఉగాదికి రెండు రోజులు బొంబాయి రావాలట. ప్రసిద్ధ హిందీ సినీ నటి కిస్మిస్ చేతుల ద్వారా బహుమతి ఇస్తారని చెప్పారు. భార్య సంతోషించింది.
వెంటనే బేంకుకెళ్ళాడు.
ద్డబ్బు విత్ డ్రా చేసాడు. ష్టేషన్ కెళ్ళాడు టిక్కెట్టు రిజర్వు చేసాడు.
త్వరలో తనకు ప్రజారంజని సంస్థ పురస్కారాన్నిస్తున్న విషయం పత్రికా విలేఖరులకు తెలియ చేసాడు.పాస్పోర్టు ఫొటో ఇచ్చాడు. మర్నాడే అన్ని పత్రికలలో న్యూస్ వచ్చింది. మిత్రులంతా కంగ్రాట్స్ తెలిపారు. ఎంతిస్తారు? అని అడిగారు. ఏమో! పదివేలైనా ఇవ్వచ్చు. అంత పెద్ద సంస్థ అన్నాడు. ఉగాదికి ముందు బొంబాయి చేరుకొన్నాడు. ఎడ్రస్ కనుక్కొని వెళ్ళాడు.. అది జనమా? కాదు, ప్రవాహమా! ఇసుకను లారీతో తిరగేసినట్లు, కొబ్బరి కాయను పోగులు పోసినట్లు రకరకాల ద్వారాలు. ముందు ద్వారంలో దూరగానే సార్! మీ కార్డ్ చూపెట్టండి సార్! అనిఅంది ఒక అమ్మాయి ఇంగ్లీషులో వీణ మీటినట్లు. కార్డ్ చూపెట్టాడు. కంగ్రాట్స్ సార్! అసంఖ్యాక రచయితల్లో మీకు ఈ అవార్డ్ వచ్చిందంటే మీరెంత గొప్పవారో అర్థమౌతుంది. బైదిబై మీరో ఫిప్టీ పే చెయ్యాలి సారా! అంది.
ఎందుకు ? అన్నాడు.
సార్! మీకు గార్లెండ్ వేయాలి కదా సార్! బొకే ఐతే ఇరవయ్యే.
మాట్లాడకుండా ఏభై ఇచ్చాడు.
మరో ద్వారం తిరిగాడు. మళ్ళీ ఓ అమ్మాయి సితార గొంతు పలికించింది. ఓ ఐదొందలు ఇవ్వాలి సార్! అన్నది. ఎందుకు? సందేహంగా అడిగాడు.
ఇంత దూరం వచ్చిశాలువా లేకుండా వెళ్ళొచ్చా? అంది.,కోపంగా చూస్తాడు. అక్ఖర్లే అనాలనుకొన్నాడు. అన్లేక పర్సు తీసి ఐదొందలు ఇచ్చాడు. మరో ద్వారం దగ్గరకు చేరాడు. మరో అమ్మాయి వంశీ వాయించింది. కంగ్రాట్స్ చెప్పింది. ముద్దు పెట్టుకొంది. వెయ్యే పే చేయమంది. దేనికి? వీడియో కవర్ చేస్తాం అన్ని పేపర్లలో, టీవీలలో, వార్తల్లో వచ్చేట్లు ఏర్పాటు చేస్తాం అంది.
ప్రియ రంజనీ రావుకి ఏడుపు వచ్చింది. అక్కడికక్కడ గుండె ఆగిపోతే బాగుణ్ణనిపించింది.
కాని విచిత్రం అప్రయత్నంగా చేతులు పర్స్ ను తీసాయి. డబ్బులిచ్చేసాయి. పర్స్ పల్చబడిపోతోంది. గుండె వేగం హెచ్చుతోంది. మరేద్వారమూ తగల్లేదు. హాలు నిండా కుర్చీలు కుర్చీల్లో జనం.
ఉదయం పది గంటలకు ప్రారంభమయింది అవార్డుల ప్రదానం. అలా పిలుస్తూనే ఉన్నారు. వస్తూనే ఉన్నారు. అందుకుంటూనే ఉన్నారు. మధ్యాహ్నం నాలుగు గంటలకి ఒక అమ్మాయి తనకి దండ వేసింది. ఓ అమ్మాయి శాలువా కప్పింది. కెమేరాలుక్లిక్కుమన్నాయి. కిస్మిస్ వచ్చింది. ఒక చెక్కమొమెంటోసుతారంగా అందించింది అంతే. ఎంతో కష్ట పడి తిరుపతి వెళ్ళితే దేవుణ్ణి చూసామా?లేదా? అన్న భ్రమలో ఉన్నాడే కాని బైటకు నెట్టబడినట్లు ష్టేజి మీదనుంచి నెట్టేసారు. సార్ పది రూపాయిలొస్తాయి అన్నాడో వ్యక్తి.
ఎందుకు? ఇక్కడ టీ, బిస్కట్ తీసుకున్నారు కదా? నేను తీసుకోలేదే! నువ్వే యిచ్చావు! ఔను సార్! రస్పెక్ట్ గా ఇస్తాం. మీరిచ్చేయండి అన్నాడు. అతనితో వాదులాడ్డం ఇష్టం లేక ఇచ్చేసాడు. అతనికి గొప్ప చికాకుగా ఉంది. అసహనంగా ఉంది. ఆక్రోశంగా ఉంది. అవార్డ్ ప్రదానోత్సవ సభ ముగిసింది..
కమిటీ చైర్మెన్ మైకు దగ్గరకు వచ్చి అవార్డ్ గ్రహీతలు దయచేసి ఉండండి మీతో ఐదు నిమిషాలు పనుంది అన్నాడు. డబ్బులిస్తాడెమోనని ప్రియరంజనీరావులో మళ్ళీ ఆశ! బట్ట తలమీద వెంట్రుకలు మొలవ్వా? అని ఆస పడ్డాడు. అందరూ వెళ్ళాక చైర్మెన్ వేదికెక్కాడు. అవార్డ్ గ్రహీతలకు శుభా కాంక్షలు తెలిపాడు. ఆతరవాత తన సంస్థ చేసిన సేవలు వివరించాడు. అవార్డ్ విజేతలారా! మీకో విన్నపం. ఈ సంస్థ గురించి మీ ప్రాంతంలో తెలియ జేయండి. జనాన్ని ప్రోత్సహించండి. పదిమందిని తీసుకు రాగలిగితే మీకు చందా లేకుండా సన్మానం చేస్తాం. వంద మందిని తేగలిగితే ఇక్కడే ఏ కలక్షన్లూ వసూలు చేయం. వెయ్య మందిని తీసుకు రాగలిగితే రాను పోను చార్జీలు మేమే భరిస్తాం. అని అతను చెప్తున్నాడు. ప్రియరంజనీరావు బుర్ర గిర్రుమని ఫేన్ లాగ తిరుగుతోంది. బీపీ రేజైపోతోంది. అక్కడ ఉండ లేక లేచిపోయాడు. ఉంటే మళ్ళీ టీ ఇస్తారో, టిఫినే యిస్తారో, భోజనమే పెడతారో నన్న భయంతో .
ఐతే కుళ్ళిపోయిన బత్తాయిపండులా అయిన అతని మనసులో ఓ తళతళ మన్న మెరుపు ఆలోచన. ప్రియరంజనీ అవార్డ్ పేరునతనూ ఓ సాహిత్య సేవా సంస్థను హైదరాబాదులో ఎందుకు నెల కొల్పరాదు? అని.

7 thoughts on “అవార్డులిస్తాం! చందా కట్టండి!

  1. ప్రియమైన P.V.B.శ్రీరామ మూర్తి గారూ!
    నిరాశాపరులికి ఆశ కల్పిస్తూ, దురాశాపరులికి జ్ఞానోదయం కలిగిస్తూ, సమాజానికి అద్దంపట్టుతున్నట్టుగా వ్రాసిన మీ కథ మాకు చాలా ఆనందం కలిగించింది. మీకు మా ధన్యవాదములు.

  2. గేటు దగ్గర ఛీర్ గర్ల్స్ …వీణ,సితారా,వంశీ ఇంగ్లీషులో వెరైటీగా
    వాయించారు..బాగుంది…హైదరాబాదులో సంస్థ బాగానే
    వుంటుందికాని పొరుగురాష్ట్రవాసులకి చేయడం మంచిదేమో
    ఆలోచించండి…..గుడ్ బాగుంది.

  3. హహ్హహ్హా. భలే రాసారు :D.. చాలా చాలా బాగుంది కథ:)
    ఇంతకీ బులుసు గారికి కన్సెషన్ ఇస్తున్నట్లా లేనట్లా ;);)

  4. హహ్హహ్హా.. చాలా బాగా రాసారు :D:D. బులుసు గారికి కన్సెషన్ ఇస్తున్నట్లా లేనట్లా ఇంతకీ..;)

  5. కథ బాగుంది. అవార్డుల కోసం వెంపర్లాడే వాళ్ళ ఉంటే, ఇస్తాం విరాళాలు ఇమ్మనే వాళ్ళూ ఉంటారు. బాగా రాసారు.

Comments are closed.