April 20, 2024

వర్ణ చిత్రాల మాంత్రికుడు వడ్డాది

రచన : సురేఖ అప్పారావు

 

మనకు ఎందరో చిత్రకారులున్నారు. కానీ వడ్డాది పాపయగారి చిత్రరచనాశైలి వేరు ! ఆయన కుంచె అనే మంత్ర దండంతో చేసే మాయావర్ణ చిత్రవిన్యాసాలు అద్భుతం! శ్రీ వడ్డాది పాపయ్య చిత్రకారుడిగా ఎంతమందికి తెలుసో అలానే ఆయన గురించి తెలియని వాళ్ళూ మన తెలుగు దేశంలోఉన్నారు. 1945లో ప్రారంభించిన బాలన్నయ్య , బాలక్క్యయ్యల “బాల”లో ఆయన ముఖ చిత్రాలతో బాటు లోపలి బొమ్మలూ వేశారు. ఆయన “లటుకు-చిటుకు” శీర్షికకు లటుకు చిటుకుల బొమ్మను వేశారు. “వపా” అన్న రెండు అక్షరాలతో ఆయన చేసిన సంతకం  పిల్లలపత్రిక “చందమామ”, “యువ” మాస పత్రిక, ఈనాటి ప్రఖ్యాత వార పత్రిక “స్వాతి”  పాఠకులకు పరిచయమే.


ఆ “వపా” అన్న రెండక్షరాలను తిరగేసి దానికి “ని”నే అక్షరాన్ని చేర్చి కొన్ని బొమ్మలకు ఆయన “పావని” అని కూడా సంతకం చేసేవారు.
1921లో శ్రీకాకుళంలో జన్మించిన శ్రీ వడ్డాది పాపయ్య చిన్నతనం నుండే బొమ్మలు గీయటం మొదలు పెట్టారు. ఆయన వివిధ విషయాలపై రకరకాల బొమ్మలు గీశారు.

పురాణ స్త్రీలు, పురుషులు , కావ్య కన్యలు, పల్లెపడుచులు, ఆధునిక యువతులు, జానపద నాయకీ నాయకులు, రుతువులు, కాలాలు,ఇలా వివిధ విషయాలపై   మరపురాని వర్ణ చిత్రాలు ఆయన కుంచెనుంచి జాలు వారాయి. ఆయన ఎక్కువగా నీటి వర్ణాలనే తన చిత్రాలకుఉపయోగించారు. ఆయన రంగులను రకరకాలుగా మిశ్రమం చేసి చిత్రాలనువర్ణరంజితం చేశారు. ఆయన వర్ణ చిత్రాలే కాకుండా ఇండియన్ ఇంకుతో తెలుపు నలుపుల్లో “యువ” మాస పత్రికలో కధలకూ చిత్రాలు గీశారు..

” యువ “మాస పత్రికకు ముఖ చిత్రంతో బాటు, కవరుపేజీ లోపల కూడా వపా వివిధ విషయాలపై చిత్రాలు వేసేవారు. వాటిలో ఆయన వేసిన “జలదరంజని”అన్న బొమ్మ ప్రత్యేకంగా అభిమానుల ప్రశంసలను అందుకొంది. వడ్డాది పాపయ్య గారికి రావలిసినంత ఖ్యాతి రాలేదేమోననిపిస్తుంది.దామెర్ల రామారావు, అడవి బాపిరాజు,వరదా వెంకటరత్నం, లాంటి చిత్రకారులతో సరితూగగల ఈయనకు అంతటి గుర్తింపు రా కపోవటం అయన మరో తెలుగువాడిగా పుట్టడమేనేమో అనిపిస్తుంది. 1959 లో “చందమామ”లో ఆర్టిస్టుగా ప్రవేశించి తన అపురూప వర్ణ ముఖ చిత్రాలతో “చందమామ”కు కొత్త అందాలు తెచ్చారు. “చందమామ”ను బొంబాయి వ్యాపారవేత్తలు కొనుగోలు చేశాక ఆ సంస్థ ఇతర చిత్రకారుల బొమ్మలతో
బాటు వపాగారి బొమ్మలును కూడా చేర్చి రెండు సంపుటాలు గా “చందమామ ఆర్ట్ బుక్ “పేరిట విడుదల చేశారు. పెద్ద సైజులో మంచి ఆర్ట్ పేపరు పై విడుదలయిన ఈ పుస్తకాలలో వపాగారి అభిమానులకు ఒకే చోట చందమామ లో ఆయన చిత్రించిన ముఖచిత్రాలు కన్నుల పండుగ చేస్తాయి. వడ్దాది పాపయ్యగారు చిత్రకళారంగంలో
చిరంజీవి.

ఆయన చిత్రకేళీవిలాసాలు చూద్దామా మరి…

 

 

2 thoughts on “వర్ణ చిత్రాల మాంత్రికుడు వడ్డాది

  1. It is very beautiful and nice article.
    Viewing those pictures took me back 40 years in my life down the memory lane.
    The pictures are a feast to the eyes.

    Thanks Surekha Apparao garu

Comments are closed.