April 25, 2024

శ్రీ శక్తీశ్వరస్వామి దేవాలయం, యనమదుర్రు

రచన: పి.ఎస్.లక్ష్మి.

ఆధ్యాత్మికతవెల్లివిరిసే మన దేశంలో ఎన్నో అపురూపమైన దేవాలయాలు, వాటి గురించి ఇంకెన్నో అద్భుతమైన కధనాలు…తెలుసుకున్నకొద్దీ ఆశ్చర్యం..తరచి చూసినకొద్దీ అద్భుతం. ఇలాంటి అద్భుతాల గురించి తెలుసుకుని, వాటిని దర్శించి, గౌరవించాల్సిన కనీస బాధ్యత ఈ దేశ ప్రజలమైన మనది. అయితే మన దురదృష్టమేమిటంటే మన అశ్రధ్ధనండీ, తెలియకపోవటంవల్ల కానీయండీ, తెలుసుకోవాలనే ఆసక్తిలేకపోవటంవల్లకానీయండీ, సమయాభావంవల్ల కానీయండీ, మన సంప్రదాయాలూ, ఆలయాల పట్ల మనకు తగ్గుతున్న ఆసక్తివల్లకానీయండీ, ఏ ఇతర దేశాలకీ లేనటువంటి ఇంత కళా సంపదను మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. ఐతిహాసిక గాధలకీ, మన భారత దేశానికీగల సంబంధ బాంధవ్యాలను మనం విస్మరిస్తున్నాం. తద్వారా మన భావి తరాలకు వాటి విలువ తెలియకుండా చేస్తున్నాం.

మీ చుట్టుపక్కలే ఎన్నో అపురూపమయిన, అతి పురాతనమైన ఆలయాలు అద్భుత శిల్ప సంపదతో, అనేక విశేషాలతో, అలరారేవెన్నో వున్నాయి. వాటిలో పశ్చిమ గోదావరి జిల్లా యనమదుర్రు గ్రామంలో వున్న శ్ర్రీ శక్తీశ్వరస్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం..

పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం పట్టణానికి 5 కి.మీ. ల దూరంలో వుంది యనమదుర్రు గ్రామంలోని ఈ ఆలయం. అయితే ఎందుకనో భీమవరంలోని భీమేశ్వరాలయం, మావుళ్ళమ్మ ఆలయం ప్రసిధ్ధి చెందినట్లుగా ఈ శక్తీశ్వరాలయం ప్రసిధ్ధి చెందలేదు. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు వున్నాయి. వంద ఏళ్ళ క్రితంవరకు ఈ ఆలయం గురించి ఎవరికీ తెలియదు. వంద ఏళ్ళ క్రితం త్రవ్వకాలలో త్రేతాయుగంనాటి ఈ ఆలయం బయటపడింది. అంతేకాదు. ప్రపంచానికి శివ, శక్తుల సమానత్వాన్ని నిరూపించటానికా అన్నట్లు ఒకే పీఠంపై నెలకొన్న శివుడు, పార్వతి, కుమార స్వామి విగ్రహాలు బయల్పడ్డాయి. పార్వతీ దేవి శక్తి. ఆ శక్తితో కూడుకున్న ఈశ్వరుడు శక్తీశ్వరుడు. జగన్మాత అయిన ఆ పార్వతీదేవి నెలల పిల్లాడయిన కుమారస్వామిని ఒడిలో లాలిస్తున్న రూపం ఇక్కడ అమ్మది. బహుశా పార్వతీదేవిని ఈ భంగిమలో ఇంకెక్కడా చూడమేమో.

అలాగే శివుడుకూడా ఏమీ తక్కువతినలేదు. తనూ ఒక ప్రత్యేక భంగిమలో వెలిశాడు. సాధారణంగా దర్శనమిచ్చే లింగ రూపాన్ని వదిలెయ్యటమేకాక సాకార రూపంలోకూడా వైవిధ్యం చూపించాడు పరమేశ్వరుడు. అవునండీ. శీర్షాసనంలో తపో భంగిమలో కనబడతాడు శివుడు ఇక్కడ. మళ్ళీ చదవక్కరలేదు. మీరు చదివింది కరెక్టే. శివుడేమిడీ, శీర్షాసనమేమిటీ అంటారా. మీ కోసమే ఆ విగ్రహాల ఫోటో. ఈ భంగిమలు జాగ్రత్తగా గమనించి, బాగా గుర్తు పెట్టుకుని మరీ వెళ్ళండి ఆ ఆలయానికి. చూడండి..శివుని జటాజూటం భూమికి తగులుతుంటుంది. ఆ పైన ముఖం, కంఠం, ఉదరం, మోకాళ్ళు, పాదాలు. ఈ వ్యాసం చదివిన వాళ్ళంతా ఈ దంపతుల అత్యద్భుతమైన ఈ భంగిమలు చూడటానికే ఈ ఆలయానికి వెళ్ళి వస్తారనే నమ్మకం వుంది. ఇంతకూ ఈ పార్వతీ పరమేశ్వరులు అంతర్జంటుగా ఎలా వున్నవాళ్ళ అలాగే ఇక్కడ వెలియటానికి కారణంగా ఒక కధ కూడా చెప్తారు. ఆ కధేమిటంటే….

మీరు యమధర్మరాజు గురించి వినే వుంటారు. భయమేస్తోందా. పాపం యమధర్మరాజుకికూడా ఒకసారి తను చేసే పని మీద విసుగు వచ్చిందిట. పైగా ప్రజలంతా ఆయన పేరు చెప్తేనే భయపడుతున్నారాయే. అందుకనే మార్గాంతరంకోసం శివుడుకోసం ఈ ప్రాంతంలోనే తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై భవిష్యత్ లో యమధర్మరాజు ఒక రాక్షసుడిని చంపిన తర్వాత తమని ఇక్కడ ప్రతిష్టిస్తాడనీ, తమని దర్శించిన వారికి దీర్ఘ రోగాలు వుంటే సత్వరం నయం అయి, ఆరోగ్యంగా వుంటారనీ, తద్వారా యముడంటే ప్రాణాలు తీసేవాడేకాదు, దీర్ఘకాల రోగాలను నయంచేయగలవాడుకూడా అని ప్రజలచేత కొనియాడబడతాడు అని వరమిచ్చాడు.

పూర్వం ఈ ప్రాంతం పేరు యమునాపురం. ఇక్కడ శంబిరుడనే రాక్షసుడుండేవాడు. రాక్షసుడంటే వాడి అకృత్యాలూ, మునులను హింసించటాలూ వగైరా షరా మామూలే. పాపం ఆ మునులు ఇవ్వన్నీ పడలేక యమధర్మరాజు దగ్గరకెళ్ళి వాణ్ణి చంపెయ్యమని మొరబెట్టుకున్నారు. యముడుకూడా పాపం మునులంతా అడిగారుకదా అని ఆ రాక్షసుడిని చంపటానికి చాలా ప్రయత్నం చేసి, అతని చేతిలో చాలా సార్లు ఓడిపోయాడు. అప్పుడు శివునికోసం తపస్సు చేశాడు. శివుడు ఆ సమయంలో యోగనిష్టలో వుండటంతో ప్రత్యక్షంకాలేదు. పార్వతీదేవి యముని తపస్సుకి మెచ్చి, తనలోని శక్తి అంశను యమునికిచ్చి శంబరుని వధించేటట్లు చేస్తుంది. తన విజయానికి చిహ్నంగా ఆ ప్రాంతానికి యమపురి అని నామకరణం చేశాడు

యమధర్మరాజు. అమ్మవారు తనపై చూపించిన కరుణకు యముడు ఉప్పొంగిపోయి, భవిష్యత్ లో ఈ ప్రాంతంలో రాక్షసులు సంచరించటానికి వీలులేకుండా పార్వతీ పరమేశ్వరులను పుత్ర సమేతంగా అక్కడ వెలియమని కోరాడు. యముని కోరికమేరకు బాలింతరాలైన పార్వతీదేవి తన మూడు నెలల పసిబిడ్డతో,. యోగనిష్టలో వున్న ఈశ్వరుడితో ఇక్కడ సాక్షాత్కరించింది.

దీనికి ఆధారంగా ఈ జిల్లాలో నరసాపురం తాలూకాలోని శంబరీవి అనే ద్వీపాన్ని చెప్తారు. ఈ శంబరుడు శ్రీరామచంద్రుడు పరిపాలించిన త్రేతాయుగంనాటివాడు. అందుకనే ఈ ఆలయం త్రేతాయుగంనాటిదిగా ప్రసిధ్ధికెక్కింది.

ఆలయానికి ఎదురుగా శక్తికుండము అనే మంచినీటి సరస్సు వుంది. స్వామివారి అభిషేకానికి, నైవేద్యానికీ ఈ నీటినే వినియోగిస్తారు. ఒకసారి చెరువుచుట్టూ ప్రాకారం నిర్మించాలని చెరువుని ఎండబెట్టారుట. ఆ సమయంలో స్వామివారి నైవేద్యంకోసం వేరే చెరువు నీటిని వాడగా ఆ నైవేద్యం వుడకలేదుట. అప్పుడు పూజారి ఎండగట్టిన చెరువులో గుంట త్రవ్వగా నీరు వచ్చిందిట. ఆ నీటిని పోసి వండగా ప్రసాదం వెంటనే వుడికిందట. అప్పటినుంచీ స్వామి నైవేద్యానికి వేరే నీరు వాడరు. ఈ శక్తికుండములోని నీరు మామూలు నీరు కాదు. కాశీలోని గంగానదిలోని ఒక పాయ అందర్వాహినిగా వచ్చి ఇక్కడ ప్రవహిస్తున్నదని జియాలజిస్టులు చెప్పారంటారు. అందుకే ఈ సరస్సు గంగానదితో సమానమైనదంటారు.

దక్షిణకాశీగా పిలవబడే ఈ క్షేత్రానికి పాలకుడు కుమారస్వామి. అంటే సర్పం. ఈ ఆలయానికి, చెరువుకు కాపలాగా రెండు నాగుపాములు ఇటీవలి కాలందాకా వుండేవని పూజారి చెప్పారు. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో ఈ నాగుపాములు చెరువులో వలయాకారంగా మూడుసార్లు తిరిగి, స్వామి దర్శనం చేసుకుని తిరిగి చెరువులోకెళ్ళిపోవటం చూసినవారున్నారు. ఇప్పుడు కూడా ఆ ప్రాంగణంలో రెండు నాగు పాము పిల్లలు తిరుగుతుంటాయి. ఇవి ఒక్కొక్కసారి స్వామి విగ్రహాన్ని చుట్టుకుని వుంటాయట. అయితే అవి ఎవరినీ ఏమీ చేయవు.

ఆలయ తూర్పు ద్వారానికి ప్రక్కగా వున్న నందీశ్వరుని మూతి, ఒక కాలు విరిగి వుంటాయి. తురుష్కులు ఈ ఆలయం మీద దాడి చేసినప్పుడు వారి ప్రభువు తన కరవాలం పదును చూసుకోవడానికి అక్కడున్న నంది మూతిని, కాలిని నరకగా అందులోనుండి రత్నాలు బయటపడ్డాయిట. ఒక జంతువు విగ్రహంలోనే ఇన్ని రత్నాలు వుంటే ఆలయంలో విగ్రహంలో ఎన్నున్నయ్యోనని ఆలయంలోకి వెళ్ళబోగా ఆలయం కప్పుకూలి అతనిమీద పడి మరణించాడుట. ఆ శిధిలాలు ఆలయం వెనక వున్నాయి.

పంచారామాలకన్నా పురాతనమైనదని చెప్పబడే ఈ ఆలయంగురించీ, శక్తీశ్వరుని గురించీ, మహాకవి కాళిదాసు తన మహాకావ్యం కుమార సంభవంలో 68 శ్లోకాలలో స్తుతించాడుట. భోజరాజు ఇక్కడికి వచ్చి పూజలు సల్పినట్లూ, మహాకవి కాళిదాసు పలుమార్లు ఇక్కడికి వచ్చి శక్తిని పూజించినట్లు కూడా ఆ గ్రంధంలో స్పష్టంగా వుందిట. శ్రీనాధ మహాకవి వ్రాసిన కాశీఖండం కావ్యంలోకూడా ఈ ఆలయ ప్రశస్తి వున్నదిట.

శంబరుని వధానంతరం యమునికి పార్వతీదేవి ఇచ్చిన వర ప్రభావంతో ఇక్కడ శక్తికుండంలో స్నానం చేసినవారికి అపమృత్యు భయం వుండదనీ, అకాల వ్యాధులు రావనీ, దీర్ఘకాలంగా పీడిస్తున్న రోగాలున్నవాళ్ళు ఈ కుండంలోని నీరు మంచినీటితో కవిపి సేవించటంవల్ల ఆ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం.

చూడటానికి చిన్నదిగా వున్నా, ఇన్ని విశేషాలున్న ఈ ఆలయాన్ని అవకాశం దొరికినప్పుడు తప్పక దర్శించండి.

4 thoughts on “శ్రీ శక్తీశ్వరస్వామి దేవాలయం, యనమదుర్రు

  1. Very interesting and excellent information Lakshmi garu. Thanks for sharing the same. Hope u share similar information in future too.
    Regards

Comments are closed.


Notice: Trying to get property of non-object in /var/www/html/maalika/magazine/wp-content/plugins/jetpack/modules/gravatar-hovercards.php on line 238