April 25, 2024

ఆంధ్ర భారత భారతి – 2

( కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతంలోని హృద్య పద్యాలకు వ్యాఖ్యానం – 2 )

– డా. ఆచార్య ఫణీంద్ర

“విమల మతిం బురాణములు వింటి ననేకము; లర్థ ధర్మశా
స్త్రముల తెరం గెరింగితి; నుదాత్త రసాన్విత కావ్య నాటక
క్రమముల  పెక్కు సూచితి – జగత్పరిపూజ్యములైన ఈశ్వరా
గమముల యందు నిల్పితి బ్రకాశముగా హృదయంబు భక్తితోన్!”

ఈ పద్యం  ఆదిపర్వం ప్రథమాశ్వాసంలోని అవతారిక లోనిది. పరమ ధర్మవిదుడు, వర చాళుక్యాన్వయాభరణుడు అయిన రాజరాజనరేంద్రుడు – నిత్యసత్యవచనుడు,సుజనుడు అయిన నన్నపార్యుని చూచి, కృష్ణద్వైపాయనుడు దేవభాషలో రచించిన మహాభారతాన్ని తెనుగున రచించుమని చేసిన ప్రార్థనకు ముందుమాట ఇది.
“విమలమైన బుద్ధితో ఎన్నో పురాణాలను విన్నాను. ధర్మార్థ శాస్త్ర సూక్ష్మాలను తెలుసుకొన్నాను. ఉదాత్త విషయాలతో రసపూరితాలైన పెక్కు కావ్య నాటకాలను చూచాను. లోక పూజ్యాలైన శైవాగమాల పైన భక్తితో మనసు నిలిపాను” అని నన్నయ భట్టారకునితో ఈ పద్యంలో చెప్పి, ” అయినా, మహాభారతంలోని విషయాన్ని వినాలని నాకు పెద్ద అభిలాష ” అని వివరిస్తాడా భూపతి.
రాజరాజ నరేంద్రుడు పురాణాలను, ధర్మార్థ శాస్త్రాలను, కావ్య నాటకాలను పేర్కొన్నాడంటే – అదంతా సంస్కృత వాజ్ఞ్మయం గురించి అన్నమాట. తెలుగులో అంతకు ముందు కావ్యసృజన జరుగలేదు కదా! ముఖ్యంగా సంస్కృత భాషా సాహిత్యంలో ” కావ్యేషు నాటకం రమ్యం” అంటూ ప్రసిద్ధి గాంచిన పెక్కు నాటకాలను ఆయన వీక్షించాడన్న విషయం – ఆయనన్న ” ఉదాత్త రసాన్విత కావ్య నాటక క్రమముల  పెక్కు సూచితి” అన్న మాట ద్వారా స్పష్టమవుతుంది.
నన్నయ ఈ పద్యంలో కావ్య నాటకాలకు రెండు ప్రధాన లక్షాణాలను నిర్దేశించాడు. ఒకటి ఉదాత్తమై యుండుట; రెండు రసాన్వితమై ఉండుట.
— £££ —

1 thought on “ఆంధ్ర భారత భారతి – 2

  1. “డా. ఆచార్య ఫణీంద్ర” ఏమిటండీ? ఆచార్య ఫణీంద్ర అనో, డా. ఫణీంద్ర అనో రాయొచ్చుగా? ఆయన పేరే ఆచార్య ఫణీంద్ర అన్నట్లు ఉంది ఇలా రాస్తే.

Comments are closed.