March 28, 2024

అమలాపురం నుంచి అమెరికా దాకా షడ్రుచులు.

రచన : మంధా భానుమతి        

 

అమలాపురంలో..

యస్సెస్సల్సీ పరీక్ష రాశాక సెలవల్లో వెళ్ళినప్పుడు.. చైత్రమాసం: బహుళ పాడ్యమి. ఉగాది పర్వదినం. తెల్లారకట్ల ఐదయింది. అమావాస్య రాత్రి కదా.. చంద్రుడు, వెన్నెల ఏం లేవు.

 

అప్పుడప్పుడే మంచు విడుతోంది. మామిడిపూత ముదిరి చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి. మా పెరట్లో కుడి పక్కన గోడ నానుకుని పెద్ద వేపచెట్టు. దానికి పది అడుగుల దూరంలో మామిడి చెట్టు.

 

పెద్ద మామయ్య నీళ్ళపొయ్యి వెలిగించి, కొబ్బరి డొక్కా, కర్ర పేళ్ళూ వేస్తున్నాడు. పెద్ద రాగి డేగిసా. మూడు వంతులు భాగం నల్లగా ఉంటుంది. అందుకే ఇంటి పక్కనే ఉన్న మునిసిపల్ బళ్ళో చేరిన కొత్తల్లో రాగి ఏ రంగు అంటే నలుపు అని చెప్పా! అందరూ ఒకటే నవ్వులు.. “కావాలంటే వేణ్ణీళ్ళ డేగిసా చూసుకోండి మీ ఇళ్ళకేళ్ళి..” అని రోషంగా అంటే.. ఇంకాస్త నవ్వేసి, నా బుగ్గ గిల్లారు మా నారాయణ మేష్టారు. ఇంకా ఆ బుగ్గ నెప్పెడుతూనే ఉంది..

 

ఇంతకీ డేగిసాలో నీళ్ళు సలసలా మరుగుతుంటే తలంటేసుకుని, ఒక్కొక్కళ్ళం పోటీ పడి రాత్రి రాలిన వేప్పువ్వులు ఏరుతుంటే, చిన్నన్నయ్య గోడ మీంచి వేపచెట్టెక్కి ఫెళఫెళా పది కొమ్మలు విరుచుకొచ్చాడు. ఆ పువ్వులన్నీ కొమ్మల్నుంచి, కాడలు కొంచెం కూడా రాకుండా విడదీసి బాల్చీలో నీళ్ళల్లో వేసి, తెల్లగా మెరిసిపోతుంటే చాటలో పోసి వంటింట్లో అడ్డగోడ మీద పెట్టాం ప్రభా, నేనూ. మా మణి, శేషూ లేత మామిడికాయలు ఏరుకొచ్చి కడిగి పెట్టారు. కొట్టుగదిలో గెల ముగ్గిందేమో చూసి నాలుగరిటిపళ్ళు తెమ్మంది సీతంపిన్ని. కుండలో శేరు నీళ్ళు పోసి, నిమ్మకాయంత చింతపండుండలు రెండు వేసి నానబెట్టింది అమ్మ. ఓ అరగంటయ్యాక చింతపండు పిసికి, చెయ్యి పొడిగా తుడుచుకుని ఐదువేళ్ళూ ఉప్పు జాడీలోకి దింపి చేతికి పట్టినన్ని ఉప్పురాళ్ళు తీసి అందులోకి విదిల్చింది. మళ్ళీ చాలవేమోనని ఇంకో పది రాళ్ళు వేసింది. బెల్లపచ్చోటి రోట్లో వేసి దంచి, పావుశేరు గొట్టంతో అర్ధపావు పొడి చింతపండు నీళ్ళల్లో వేసింది. సన్నగా తరిగిన అరటి పండు ముక్కలు ఒక పావుశేరు, మామిడి ముక్కలు పావుశేరువేసి బాగా కలిపింది. మరి అసలుది వేపపువ్వు.. చేత్తో ఒక పిడికిడు తీసి కలిపింది. చేటలో మూడువంతులు పైగా అలాగే ఉన్నాయి, మేం కష్టపడి కాడలు తీసిన పూలు.

 

“అంత కష్టపడి తెస్తే అన్నేనా వేప్పూలు..” కొంచెం కినుకగా అడిగాను సీతంపిన్నిని.

 

“చేదు ఉండీ ఉండక నాలిక్కి తగలాలి కానీ.. ఆ పువ్వంతా వేస్తే ఇంకేవైనా ఉందా.. నోట్లో పెట్టుకోగలవా? జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తే ఫరవాలేదు కానీ మొత్తం కష్టాలయితే ఎలా..”.

 

“అంటే..”

“నీకిష్టం లేని పనేది చెప్పు..”

 

“ఆర్నెల్లకోసారి ఆవదం తాగి, రోజంతా చారన్నం తినడం. ఆ పైన అస్తమానూ పెరట్లోకి పరుగెట్టడం.”

 

పకపకా నవ్వింది పిన్ని.

 

“చూశావా.. వంటికి మంచిదే కానీ ఏడాదికి రెండు సార్లు కంటే చెయ్యలేం. అలాగే వేప్పువ్వు కూడా.. పేగుల్లో పురుగుల్ని చంపడానికి ఆ పాటి చాలు. షడ్రుచులూ ఏది ఎంతెంత ఉండాలో అంతే ఉండాలి.” అంటూ లావుగా పొట్టిగా ఉన్న పచ్చి మిరపకాయలు రెండు సన్నగా, చూరులా తరిగి కుండలో వేసింది.

“ఇందులో ఏమేమి రుచులు ఎందులో ఉన్నాయో చెప్పు పిన్నీ.”

 

“పులుపుకి చింతపండు,మామిడి ముక్కలు, ఉప్పు, తీపికి బెల్లం, కారంకి పచ్చిమిరప ముక్కలు, చేదు.. తెలుసు కదా.. ఇంక షడ్రుచుల్లో వగరు మిగిలింది..”.

 

“మరి వగరు కేం చేస్తావ్?”

 

“అరటి పువ్వులో కొప్పెన్న దాచా నిన్న. అది సన్నగా ముక్కలు తరిగి వేస్తా. మామిడి కాయ జీడి కూడా చిటికెడు పొడి శాస్త్రానికి వేసుకోవచ్చు.” అరటి పువ్వు రేకులు, పువ్వులు అన్నీ తీసెయ్యగా మిగిలిన చివరి మొగ్గ లాంటిది తెస్తూ అంది. కొప్పెన్న పైన సగం కోసేసి, సన్నసన్న పువ్వులున్న భాగం సన్నగా తరిగి వేసింది.

 

 

అందరూ స్నానాలు, దేముడి దగ్గర పూజలు అయ్యాక, తలో అరటిదొన్నెడు ఉగాది పచ్చడి ఇచ్చింది మా వదిన. వేపువ్వుకూడా మిగిలిన రుచుల్లో నాని అంత చేదనిపించలే.. ఇంకా ఆ రుచి నాలిక్కి తగులుతున్నట్లే ఉంది.

 

 

అయిద్రాబాద్లో..

ఇదే ఉగాది పచ్చడి మా అబ్బాయిలిద్దరూ చిన్నపిల్లలప్పుడు.. రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో ఒక మామ్మగారింట్లో అద్దెకున్నప్పుడు.. పొద్దున్నే తలంట్లకి రమ్మంటే ఒకడేమో పువ్వులు కోస్తానని వేపచెట్టెక్కి, ఇంకోడు మామిడి పిందెలకోసం మామిడి చెట్టెక్కీ కూర్చుంటే, నోరునొప్పెట్టేలా అరుస్తూ అశోక్‍నగరు సత్యనారాయణ కొట్లో కొన్న చింతపండు దగ్గరగా చేసి నొక్కి నిమ్మకాయంత ఉండ చేసి, చిన్న దబరాగిన్నెలో నానబెట్టి పులుసు తీశా.

 

అంతలో ఓనరు మామ్మగారు.. “ఏమండీ మీ పిల్లలు చెట్లెక్కి కొమ్మలు విరిచేస్తున్నారు.. ఇలా అయితే వచ్చే ఒకటో తారీక్కల్లా మీరిల్లు ఖాళీ చెయ్యవలసిందే.” అని వార్నింగిచ్చారు.

అంత వరకూ కొమ్మల్లో ఎక్కడ దాక్కున్నాడో కనిపించని మా పెద్దబ్బాయి, నిండా పువ్వులున్న రెండుకొమ్మలు కోసుకొచ్చి ఒకటి మామ్మగారి చేతిలో పెట్టాడు.. ఈ చెవినుంచి ఆ చెవిదాకా నోరు సాగదీసి నవ్వుతూ. ఆవిడ రుసరుసలాడుతూ రెండు కొమ్మలూ పుచ్చుకుని చక్కా పోయింది. వాడింత మొహం చేసుకుని బుద్ధిగా తలంటుకి బాత్రూంలోకి దూరాడు, నేను స్టౌ మీంచి వేణ్ణీళ్ళు తెచ్చేలోగా. ఒళ్ళంతా చక్కగా నూనె రాయించుకుని, పిండి నలుగు పెట్టించుకుంటాడు కానీ, కుంకుడుకాయ గిన్నె తెచ్చి తలమీదికి తీసుకెళ్తుంటే ఎవరో కొడ్తున్నట్లు గట్టిగా రంకెలు పెట్టేస్తాడు. కళ్ళకి గంతలు కట్టి కష్టపడి తలరుద్ది వచ్చేసరికి నాకు నీరసం పట్టుకుంది.

 

పెద్దాడ్ని బట్టలేసుకోమని చెప్పి కాఫీ కలుపుకుని తాగుతుంటే అప్పుడు వచ్చాడు చిన్నాడు ఎక్కడ్నుంచో నాలుగు మామిడికాయలు పట్టుకుని. వాడు మామ్మగారికి దొరక్కుండా తప్పించుకుంటాడెప్పుడూ. తలంటుకూడా నాన్న చేత పోయించుకున్నాడు.. తను తెచ్చుకున్న షాంపూతో. అది అగ్రజుడికి తెలిసి ఆ తర్వాత.. ఎందుకులెండి! ఆ పై ఏడు నుంచీ అందరం షాంపూలే వాడ్డం మొదలుపెట్టాం.. ప్రతీవారం లేనిపోని గొడవలెందుకని.. జీతాలు కూడా కొద్దిగా పెరిగాయి..

 

సుల్తాన్‍బజార్లో కొనుక్కొచ్చిన వాడిపోయిన వేపకొమ్మల్లోంచి ముడుచుకుపోయిన పువ్వులు లెక్కపెట్టి పది ఏరి, అరటిపండులో సగం చిన్న ముక్కలు చేసి, సగం మామిడికాయ (చిన్నాడు కొట్టుకొచ్చింది కాదు) కోరి, ఒక చదరపు అంగుళం బెల్లమ్ముక్క అమాందస్తాలో దంచి.. చెంచాడు స్వస్తిక్ మార్కు ఉప్పుతో అన్ని కలిపాను. వగరుకి అరటికాయ తొక్కు కొద్దిగా కోరి వేశాను. చూశారా మరి, ఉపాయం ఉంటే ఊళ్ళేలచ్చని మా పిన్ని అంటుండేది.

 

దేవుడలమారు దగ్గర అందరం ఇరుక్కుని కూర్చుని పూజ చేసుకుని, తలా చెంచాడు ఉగాది పచ్చడి తినిపించేసరికి దేవుళ్ళందరూ కనిపించారు. అది తినకపోతే పులిహోర, సేమ్యా పాయసం, ఆలు ఫ్రై దొరకవని బెదిరించాను మరి. ఆ తరువాత సొంత ఇంట్లోకి మారినప్పట్నుంచి, నాలుగిళ్లవతలున్న మా వదినగారు, తెల్లారకుండా చక్కని ఉగాది పచ్చడి చిన్న స్టీలు డబ్బాలో తెచ్చిపెట్టేసేవారు చాలా ఉగాదిలకి. చెప్పద్దూ అది నేను చేసిందానికంటే ఎన్నో రెట్లు బాగా ఉండేది.

 

అమెరికాలో..

అబ్బో! చాలా హడావుడి.. తెలుగు వాళ్ళంతా కలిసి పాటలూ, ఆటలూ! కాకపోతే ఉగాది ఏవారం వచ్చినా సరే శనివారం మాత్రమే పండుగ. పాపం ఇక్కడ ఉగాదికి సెలవివ్వరు కదా!

 

“ఇవేళ ఉగాది కాదు కదా! పండుగ చేసుకుంటాం కానీ పచ్చడి తినక్కర్లేదు ఎంచక్కా.” పెద్దాడు ఆనందంగా సెలవిచ్చాడు పొద్దున్నే.

 

“అదేం కుదరదు.. పండుగ ఎప్పుడు చేసుకుంటే అప్పుడు పచ్చడి కూడా చెయ్యాల్సిందే.. తినాల్సిందే. ఆంటీ బాగా చేస్తారు.” కోడలు వెంటనే రిటార్ట్. అసలు తను ఎప్పుడూ నా ఊ- పచ్చడి తినలేదు. ఎందుకేనా మంచిదని ఓ కాంప్లిమెంట్ పడేస్తుంటుంది.

 

మా ఇద్దరికీ లాగానే వీళ్ళకి కూడా ఒక్కక్షణం పడదు. సరిగ్గా ఆపోజిట్ టేస్ట్‍లు.

ఉగాది అయినా కాకపోయినా శనివారం పొద్దున్నే తలంట్లు తప్పవు. ఎనిమిదేళ్ళ అమోగ్, వాడంతట వాడే షావర్ చేసేసి.. తల్లోంచి నీళ్ళు కార్చుకుంటూ బైటికి వచ్చాడు.

 

“జలుబు చేస్తుంది రా.. సరిగ్గా తుడుచుకో.” నేను మొత్తుకుంటూనే ఉన్నా.

 

“ఇట్స్ ఓకే నాన్నమ్మా! నథింగ్ హాపెన్స్..” డియస్ పట్టుకుని బాక్ యార్డ్ లోకి తుర్రుమన్నాడు.

 

“ఓ…ఓ..” అంటూ బాత్రూంలోంచి శోకాలు.. కంటినిండా టియర్లెస్ షాంపూ పోసేసుకుని నాలుగేళ్ళ అనిక కళ్ళు నులుముతూ ఏడుస్తోంది, వాళ్ళమ్మ వచ్చే లోపు.

 

“షాంపూ కళ్ళల్లో పోసుకుంటే మండదా? నెత్తికి రుద్దుకోవాలి కానీ.. అంటూ మొహం కడిగి, తల రుద్ది బైటికి తీసుకొచ్చా.

 

“టియర్‍లెస్ అంటే ఏంటి నాఅన్మా?”అంది గడుగ్గాయి. అది ఆ షాంపూచేసిన వాళ్ళనే అడగాలి అనుకుంటూ వంటింట్లోకి నడిచాను.

 

గోళీ కాయంత గింజల్లేని చింతపండు, సీరియల్ బౌల్‍లో వేసి మునిగేంత నీళ్ళు పోసి మైక్రోవేవ్‍లో అరనిముషం పెడ్తే మెత్తగా అయింది. దాన్ని చెంచాతో కలిపి ఫిల్టర్ చేసి రసం తీశా.(చేతులు వాడితే.. అమోగ్ గోల చేస్తాడు. వాడు నోట్లో పెట్టుకున్న వేళ్ళు ఫుడ్‍లో పెట్టకూడదని రూలింగ్.. అది నాక్కూడా వర్తిస్తుంది వాడి ప్రకారం.)

 

చిన్నసైజు గుమ్మిడికాయంతున్న మామిడికాయ తీసుకొచ్చాడు మావాడు.. మెక్సికోదిట. సేఫ్‍వేలో దొరికింది అంటూ. సరిగ్గా చెంచాడు సన్నని ముక్కలు తరిగి చింతపండు రసంలో వేశాను.

 

“అంత కష్టపడి తెస్తే అంతేనా?” మా వాడి కినుక.

 

“అసలు పచ్చడే ఔన్సుడు లేదు.. అయినా ఈ కాయకి మామిడి వాసన కూడా లేదు.” నాలిక్కరుచుకున్నాను, ఏమంటాడో అని భయంగా చూస్తూ. ఏకళ నున్నాడో.. ఏం మాట్లాడలేదు. లేపోతే.. అంత కష్టపడి.. అంటూ అరగంట లెక్చర్.

 

పావు స్పూన్ అయొడైజ్‍డ్ ఉప్పు, చెంచాడు బ్రౌన్ షుగర్..(అపార్ధం చేసుకోకండి. బెల్లంపొడిని అలా పిలుస్తారు.. మత్తెక్కించే ఆ బ్రౌన్.. కాదు.), అతి సన్నగా కోసిన పచ్చిమిరపకాయ ముక్కలు నాలుగు.. చింతపండు రసంలో వేశాను. మున్నాలాల్ పచారీ కొట్టునుంచి కొనుక్కొచ్చిన ఎండు వేంపువ్వులు నాలుగు పొడిచేసి కలిపాను. ఇంక వగరు.. ఏం చెయ్యాలి?

 

దగ్గుకి మంచిదంటే మున్నాలాల్ కొట్టునుంచే కరక్కాయలు తీసుకొచ్చా. ఒకటి కొద్దిగా చిదిమి చిటికెడు వేశాను.

 

అమెరికా ఉగాది పచ్చడి తయార్.

 

గారెలు, ఆవడలు, పిల్లలకి ఇష్టమైన సూప్(గుమ్మడికాయ తియ్య పులుసు), సేమ్యా పాయసం ఎట్సెట్రాలు బల్ల మీద అందంగా సర్ది.. భోజనాన్కి కూర్చునే ముందు, తలా అరచెంచాడు ఉగాది పచ్చడి నోట్లో పెట్టుకున్నారు అందరూ.. కోడలికేసి కోరగా చూస్తూ.

 

మావాడు ముక్కు మూసుకుని మింగాడు.. మా చిన్నప్పుడు డాట్రుగారు కార్బొనేట్ మిక్స్చర్ నోట్లో వేసినట్లుగా. కోడలు కనుబొమ్మలు ముడిచి నోటితో నవ్వుతూ.. కళ్ళలో వర్ణించలేని భావాలు పలికిస్తూ చప్పరించింది. అమోగ్‍కి కొంచెం మొహమాటం ఎక్కువ.. అందులో నాన్నమ్మంటే ఇష్టం.. నేనేమైనా అనుకుంటానేమో అన్నట్లు..

 

“ఇట్స్ ఓకే. థిస్ టేస్ట్స్ ఫన్నీ దో..” ఒక్క చుక్క నాలిక మీద వేసుకున్నాడు. “ఐ హావ్ టు యూజ్ బాత్రూం..” చెంచాతో సహా పరుగెత్తాడు.

 

చూడ్డానికి ఏమిటేమిటో తేలుతూ తమాషాగా ఉన్నాయి కాబోలు.. అనిక తీక్షణంగా తన చెంచాని స్టడీ చేసి.. నోట్లో పెట్టుకుంది.

 

“ఐ హేట్ దిస్ స్టఫ్..” అంటూ వంటింట్లో సింక్ దగ్గరికి వెళ్ళి వాక్ అని ఉమ్మేసి, నోరు కడుక్కుని వచ్చింది.

 

ఇంక తప్పుతుందా.. మేమిద్దరం కూడా నాకాల్సి వచ్చింది.

 

అందరం బుద్ధిగా పళ్ళు బ్రష్ చేసుకుని, నోరు సుబ్భరంగా కడుక్కుని, పిండివంటలమీద పడ్డాం.

 

అదండీ షడ్రుచుల కథ.

 

 

*—————*

 

 

 

 

17 thoughts on “అమలాపురం నుంచి అమెరికా దాకా షడ్రుచులు.

  1. శైలి బావు౦ది. ఆ౦గ్ల పదప్రయోగాలు మితిగా ఉ౦టే తెలుగులో సునాయాస౦గా అర్థమయ్యేది…

  2. ఉగాది పచ్చడి బాగుంది. ఆ బ్రౌన్ షుగరేదో ఓగ్లాసుడు వేసేసి అరటిపండు ముక్కలు దండిగాదట్టించి, వేప్పువ్వు వాసన చూపించి కాసిని నూడుల్స్ (చప్పదనం అనే రుచికోసం) తో అలంకరిస్తే అమెరికాలో అయినాసరే ఆబాలగోపాలంఆస్వాదిస్తారేమో. రచన చాలా బాగుంది.

  3. అమలాపురంలో ఉగాది కబుర్లు చదివి పాత రోజులు గుర్తుకు వచ్హాయి.., కళ్ళు చెమ్మగిల్లిన మాట కూడా వాస్తవం. పాత మరియు కొత్త ఉగాది పచ్చళ్ళ వర్ణన చాలా బావుంది. అతీతం లోకి తీసుకువెళ్ళే ఇలాంటి కధలు ఇంకా ఎన్నో రాయాలని కోరుకుంటూ మా కవయత్రి అత్తయ్యకి కృతజ్ఞతలతో ..
    రమ మంథా

  4. చాలా బావుంది భానుమతి గారూ.. ఉగాదిని స్వాగతించినట్టే ,మార్పునీ స్వాగతించాలని చక్కగా చెప్పారు!

  5. Ammo! Ugaadi pachchadi nachchani vaallu koodaa untaaraa anipistundi! Marii kundallo kaakapoinaa maa intlo ippatikii oka pedda ginnedu pachchadi chestundi Amma. Kontamandiki chikkagaa, migilina vaallaki palchagaa rendu rakaaluu undaalsinde. Bahusaa chinnappudu konnellu palletoorilo perigina prabhaavamemo.

    Anni rangaallo saadhaaranangaa saampradaaya paddhatulaki vyatirekangaa prajala abhiruchulu maarutunnattu eppatikappudu manaki kanipistuune undi. Aa parivartanaki Ugaadi pachchadi koodaa balayyindani ee rachana dvaaraa chakkagaa choopinchaaru, Naanamma. 🙂

    1. మీ అమ్మ బాగా చేస్తుంది సతీష్. ఇప్పుడు అమెరికాలో కూడా చెరకు గడల దగ్గర్నుంచీ అన్నీ దొరుకుతున్నాయి కదా చాలా ఊర్లలో. శ్రద్ధగా చాలా మంది చేస్తున్నారు. ఇంక గుళ్ళల్లో అయితే అమలాపురం పచ్చళ్ళని మించి పోయి ఉంటున్నాయి. మన సాంప్రదాయాలు కలకాలం నిలవాలని ఆశిస్తున్నాను.

  6. We traveled (lived) all through Amalapuram to America along with “Ugadi Pachadi” and Bhanu Mantha. We also had the same kind of experience. But the difference between a “Rachayitri” and us is that only She has the flow of language to bring out our “mano bhavaalu”, with tickling humor. We enjoyed the short “Kathanika”.
    Our best wishes to Bhanumathi garu.

  7. Good depiction of Ugadhi pachchadi composition and taste at various places and at different passing times.
    -amballa janardhan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *