April 25, 2024

చిన్న భాషల్ని మింగేస్తున్న పెద్ద భాషలు

రచన: ……….. నూర్ భాషా రహంతుల్లా

 

 

 

గత పది సంవత్శరాలలో516 భాషలు దాదాపుగా అంతరించిపోయాయట.

చాలా కొద్దిమంది పెద్దవాళ్ళు మాత్రమే ఆ భాషలు మాట్లాడుతున్నారట.

ప్రస్తుతం 7299 భాషలు ప్రపంచంలో వాడుకలో ఉన్నట్లు గుర్తించిన సంస్థలు, వాటిలో సగానికి సగం

రాబోయే తరానికి అందకుండా అంతరించిపోయే దశలో ఉన్నాయని చెబుతున్నాయి.

అంతరించిపొయే దశలో ఒక భాష ఉంది అనటానికి ప్రాతిపదికలు ఏంటంటే-

1. ఆ భాషను పెద్దవాళ్ళు పిల్లలకు నేర్పరు.

2. రోజువారీ వ్యవహారాల్లో వాడరు.

3. ఆ భాష మాట్లాడే జనం సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది.

4. ప్రభుత్వం, దేవాలయం కూడా ఆ భాషను ఉపయోగించవు.

5. ఆ భాషను కాపాడుకోవాలని ప్రజలు సంఘటితంగా ఉద్యమించరు.

6. ఆ భాషపట్ల గౌరవభావం ప్రజల్లో ఉండదు.

7. ఆ భాష అక్షరాలను గాని, సాహిత్యాన్ని గాని ప్రజలు విరివిగా వాడరు.

Ethnologue.comలో  ఈ అంతరించిపోతున్న భాషల చిట్టా ఉంది. ఆఫ్రికాలో 46, అమెరికాలో 170, ఆసియాలో 78, ఐరోపాలో 12, పసిఫిక్ లో 210భాషలు ఈ చిట్టాలో ఉన్నట్టు తెలిపారు.

 

 

 

ఇక ఇండియా విషయానికి వస్తే 17భాషలు అంతరించాయట.అవి:

1.పుచిక్ వార్: అండమాన్ దీవుల్లో 2000 సంవత్శరంలో కేవలం24 మంది షెడ్యూలు తెగల వాళ్ళు మాట్లాడుతున్నారు.ఈ భాషను హిందీ మింగేసింది.

 

2.కామ్యాంగ్: 2003 నాటికి అస్సాంలో 50మంది ఈ భాషను మాట్లాడేవాళ్ళు మిగిలారు.కాస్త ముసలివాళ్ళు మాత్రం తాయ్ లిపిలో ఈ భాష రాసేవాళ్లట.ఇదీ గిరిజన భాషే. అస్సామీ భాష దీన్ని మింగేసింది.

 

3.పరెంగా: 2002 నాటికి ఒరిస్సా, కోరాపుట్ జిల్లాల్లో 767మంది మిగిలారు.ఈ భాషమీద మన తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు గూడా పరిశోధనచేసారు.ఈ భాషమాట్లాడే ‘గడబ’అనే గిరిజన తెగ క్రమేణా ఆదివాసీ ఒరియా భాషలోకి మారిపోయారు.

 

4.రూగా: మేఘాలయలోని ఈ భాష నామరూపాల్లేకుండా అంతరించిపోయింది. మిగిలిన కొద్దిమంది గారో భాషలోకి మళ్లారు.

 

5.అహాం; అస్సాం ప్రాంతంలో పూర్వం 80లక్షల మంది మాట్లాడే ఈ భాషను మాట్లాడే వాళ్ళే లేరు.కే వలం మంత్రతంత్రాలతో ఈ భాషను వాడుతున్నారు.

 

6.అకాబియా:అండమాన్ దీవుల్లోని ఈ భాషలు అంతరించిపోయాయి.అవి7:అకాబి,8.అకాకరి

 

9.అకాజెరు

 

10.అకాకెడి

 

11.అకాకోల్

 

12.అకాకోరా

 

13.అకర్ బాలె

 

14.ఒకోజ్ వోయ్

15. పాలి: బౌద్ధమతసాహిత్యం ఈ భాషలో ఓనాడు వికసించింది.1835 లో బైబిల్ లోని కొత్తనిబంధన కూడా ప్రచురించారీ భాషలో. ఇండియాలో నాశనమైపోయింది.శ్రీలంక,బర్మా,టిబెట లలో ఇంకా కొంతమంది ఈ భాష మాట్లాడేవాళ్ళున్నారంటారు.

 

16. రంగకస్: ఉత్తరాంచల్ ప్రాంతంలో జొహారి అని కూడా పిలిచే ఈ భాషస్తులు ఓ వెయ్యిమంది ఉండొచ్చట. ఈ భాషా పోయింది.

 

17. తురుంగ్: అస్సాం గొలాగట్ జిల్లాలోని ఈ గిరిజన జనం మెల్లగా సింగ్ పొ భాషలోకి మళ్ళారట.

ప్రతి రెండువారాలకు ఒక భాష చచ్చిపోతుందని భాషా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ప్రపంచంలోని 6800భాషలలో 90శాతం భాషలు ఈ శతాబ్దంలోగా చనిపోతాయట.ఎందుకంటే వాటిలో సగంభాషలు మాట్లాడే వారు 2500 మందికంటే తక్కువగా ఉన్నారట. వరల్డ్ వాచ్ సంస్థ హెచ్చరికఇది. యుద్ధాలు, హత్యాకాండలు, ప్రకృతి బీభత్శం, పెద్ద భాషల్ని ఆశ్రయించటం లాంటివన్నీ ఇందుకు కారణాలట. ఒకతరం నుంచి మరొక తరానికి భాషను తరలించటానికి కనీసం లక్షమందైనా ఆ భాషమాట్లాడే వాళ్ళుండాలని లేకపోతే ఆభాష అంతరిస్తుందని యునెస్కో ప్రకటించింది.

 

ఏమతం వాళ్ళు ఎంతమంది పెరిగారు,ఎంతమంది తరిగారు లాంటి లెక్కల్ని తప్పులతడకలతో

హడావుడిగా పార్లమెంటుకు అందజేసి, తరువాత నాలుక కరుచుకున్న కేంద్రగణాంకశాఖ 2001నాటి భాషలవారి  జనాభాలెక్కల్ని ఇంతవరకూ ప్రజలముందు ఉంచలేదు. భాషల అభివృద్ధికి, పంచవర్ష ప్రణాళికల్ని ఆపుచేసి, దశవర్ష ప్రణాళికగా మార్చుకోవల్సిందేనా?భాషల వివరాలు చెప్పటానికి ఆరేళ్ళు సరిపోలేదా? 90లక్షలమంది గుడ్డివాళ్ళు, కోటినలభై లక్షల మంది చెవిటివాళ్ళకు లేని బాధ మీకెందుకంటున్నారు  సెన్సస్ వాళ్ళు.

 

ఇప్పుడు 2001జనాభా లెక్కల్లో 428భాషలు నమోదయితే వాటిలో 415వాడుకలో ఉంటే 13భాషలు నశించిపోయాయట. ఎనిమిదో షెడ్యూలులోకి మరోనాలుగు భాషలు కలిపినందున,షెడ్యూలు భాషల సంఖ్య 22కు పెరిగింది.వాటివివరాలు పట్టికలో చూడండి. ప్రమాదంలో పడిన భాషల్ని రక్షించేందుకై ఒక సంస్థ ఈ సంవత్సరం అక్టోబరు 25-27 తేదీలలో మైసూరులో ఒక సమావేశం నిర్వహిస్తుంది. ‘చిన్న భాషలమీద బహుళభాషల ప్రభావం’ అనేదే చర్చాంశం. ఈ సంస్థ ఆశయాలు నాశనమైపోతున్న  భాషల గురించి హెచ్చరించటం, ఆ భాషల వాడకాన్ని పెంచి, అన్ని విధాల తోడ్పాటునందించటం. www.ogmios.org అనే వెబ్ సైట్ చూడండి.

 

ఒకపిల్లవాడు పన్నేండేళ్ళ వయసులో అద్దాన్ని పట్టుకుని బిద్దం బిద్దం అంటుంటే తల్లిదండ్రులు తెగ సంతోషపడిపోయి పన్నెండేళ్ళ బాలాకుమారుడా ఇంట్లోనే ఏదో చెయ్యి అన్నారట. మొత్తం మీద ఇంతకుముందు తెలుగుమాట్లాడేందుకు నోరూ వాయి పడిపోయిన అనేకపార్టీలకు, సంస్థలకు ఇప్పుడు నోరు పెగులుతుంది. ఇక చూసుకోండి మా వ్యవహారాలన్నీ తెలుగులోనే నడుపుతాము అంటున్నారు. చాలా సంతోషం కలుగుతోంది. ఇప్పుడు ద్రావిడవిశ్వవిద్యాలయం వైస్-చాన్సలర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ కూడా ఈ ప్రతిజ్ఞల పరంపరలో గొంతుకలిపారు. ఇన్నాళ్ళూ ఇంగ్లీషులో ఉత్తర ప్రత్త్యుత్తరాలకు అలవాటుపడిన వాళ్ళకు తెలుగులో వ్యవహారాలు నడపాలంటే కొన్ని కష్టాలు వస్తాయి. వాటితోపోరాడాలి. వాటిని జయించాలి. తెలుగుఫాంట్లు, సాఫ్ట్ వేర్ నిరంతరం అభివృద్ధి పరుస్తూ ఉండాలి. ఇంగ్లీషుకు ధీటుగా వాటిని మెరుగుపరచాలి. తెలుగు మేధావులంతా తలా ఒక చేయి వేస్తే ఇదేమంత కష్టం కాదు. తెలుగు వార్తాపత్రికల వాళ్ళు కాలానుగుణంగా తెలుగును ఎంతో అభివృద్ధిపరచలేదా?

1947 నాటికి కేవలం రాతప్రతుల్లో ఉన్న హెబ్రూ భాషను పునరుద్ధరించుకుని, ఇశ్రాయెల్ జాతీయ భాషగా కాపాడుకుంటున్న 50లక్షలమంది యూదుల్ని చూచి మనం నేర్చుకోవాలి. 1999లో

కేవలం నలుగు విద్యార్థులకు హవాయి భాష ప్రత్యేకంగా నేర్పి పట్టభధ్రుల్ని చేసారు. ఇప్పుడు వెయ్యిమంది ఆ భాషమాట్లాడుతున్నారు. మాతృభాషాభిమానం గల ప్రజలు, ప్రభుత్వం, విద్యాసంస్థలు ఏకమయితే వారి మాతృభాష రాజ్యం ఏలుతుంది.నలుచెరగులా విస్తరిస్తుంది. విస్తారమైన సాహిత్యం ఉధ్భవిస్తుంది. ఇంగ్లీషు, హిందీ భాషల చెరలో నుండి మనపిల్లల్ని విడుదల చేసి, స్వేఛ్ఛ్గగా వారు తేనెలూరె తెలుగులో విజ్ఞానశాస్త్రాలు చదివేలా చెయ్యాలి.

 

లండన్ నగరంలో 150భాషలు మాట్లాడే  80 లక్షలమందిలో 30లక్షలమందికి ఇంగ్లీషు మాతృభాష కాదట. వీళ్లకోసం 999అనే ఎమర్జన్సీ సర్వీసులో అనువాదకుల్ని పోలీసులు నియమించారట. అక్కడకు ఎన్ని కొత్తభాషలు మాట్లాడే వాళ్ళు వలస వచ్చినా, వారికోసం అనువాదకుల్ని నియమిస్తూ,”సమాచారం తెలుసుకోవటం ప్రజల హక్కు”అంటున్నారట అక్కడి పోలీసులు.

కానీ మనదేశంలో కోట్లాదిమంది మాట్లాడే భాషలవాళ్ళకు కూడా వాళ్ల భాషలొ సమాచారం పొందే అవకాశం మన దేశ రాజధాని నగరంలొ ఉందా?

 

హిందీయేతర రాష్ట్రాలలో త్రిభాషా సూత్రం ప్రకారం హిందీని నిర్భందభాషగా నేర్పాలని చూస్తే తమిళనాడు ప్రజలు ఎదురుతిరిగారు. మిగతా రాష్ట్రాలన్నీ అమలు చేస్తున్నాయి. మరి హిందీ రాష్ట్రాలలో హిందీయేతర భాషలు నేర్పటంలేదు. హర్యానాలో మాత్రం తెలుగు రెండో భాషగా కొన్ని పాఠశాలల్ల్లో నేర్పుతున్నారట. దేశసమగ్రత నిలవాలంటే హిందీ రాష్ట్రాలలో,ఉత్తరభారత రాష్ట్రాలన్నిటిలో, ఏదో ఒక దక్షిణాది భాషను పిల్లలకు నేర్పించాలని గతంలో పెద్దలు చేసిన సూచన అమలుకాలేదు. ఎవరి భాషను వాళ్ళు వదిలేసిమరీ ఇంగ్లీషును ఆశ్రయించారు.

 

పూర్వం ప్రపంచమంతా ఒకేభాష, ఒకే పలుకు ఉన్నప్పుడు బాబేలు గోపురం కట్టటానికి నడుంకడితే దేవుడు వారి ఏకైక భాషను వందలాది భాషలుగా చిందరవందర చేశాడట. ఇప్పుడు ప్రజలంతా

మళ్ళీ ఇంగ్లీషు సాలెగూడు(ఇంటర్ నెట్)కట్టారు. దేవుడుకూడా ఈ సాలెగూడులో పడతాడో, మరి ఆయనే చీల్చిన ఇన్నివేల భాషల్ని రక్షించుతాడో కాలమే నిర్ణయించాలి. ఇంగ్లాండులోని పిల్లలకు ఇంగ్లీషు నేర్పటానికి ఇండియన్ టీచర్లను కోరుకుంటున్నారంటే మనదేశం ఈ బాబేలు భాషలో ఎంతముందంజలో ఉందో ఊహించవచ్చు. మనవాళ్ళు బ్రతకనేర్చినవాళ్ళు. సర్దుకుపోయే తత్వం గలవాళ్ళు. విడిపించే దిక్కులేక దెబ్బలకు ఓర్చేవాళ్ళు. సిరిసంపదల కోసం సొంతభాషను సాంతం వదిలెయ్యటానికైనా సిద్ధపడేవాళ్ళు. పొరుగింటిపుల్లకూర రుచి అని నిరూపించిన వాళ్ళు.

 

ఫౌండేషన్ ఫర్ ఎన్ డేంజర్డ్ లాంగ్వేజస్ చైర్మన్ నికోలాస్ ఓస్ట్లలర్ కు “తెలుగు అధికార భాష కావాలంటే…” పుస్తకాన్ని ఇ-మెయిల్ లో పంపాను. 2001 జనాభా లెక్కల ప్రకారం వివిధభాషలు మాట్లాడే వారి సంఖ్యావివరాలు అడిగాను. వారిదగ్గర లేవు. 1997నాటికి ప్రపంచభాషల జనాభా అంచనాలు www.etnologne.comలో ఉన్నాయి. కానీ 2001నాటి భారతదేశ భాషల అధికారిక జనాభా లెక్కలు లేవు.వాటిని సంపాదించేందుకు 10-4-2006న FELలోని డాక్టర్ మహేంద్ర కిషోర్  వర్మకు,CIILలోని డాక్టర్ ఉదయనారాయణ సింగ్ కి నాలేఖను పంపాను. ఆలెక్కలు ఈ సంవత్సరమైనా వస్తే “తెలుగు అధికార భాష కావాలంటే…”పుస్తకంలో వాటిని పొందుపరచి మనభాషల పెరుగుదల తరుగుదల తీరుతెన్నులను విశ్లేషిద్దాం.

 

1974 నాటి జీవో 485 ప్రకారం సుప్రీం కోర్టు, హైకోర్టులలో మాత్రమే ఇంగ్లీషులో వ్యవహారాలు జరగాలని,క్రిందిస్థాయి కోర్టులన్నిటిలోమాతృభాషలో వ్యవహారాలు జరగాలని నిర్దేశించారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఎబికె ప్రసాద్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంఘ్వీని కలిసి ఈ విషయమై విజ్ఞప్తిచేస్తే ఆయన జిల్లాకోర్టులకు ఆదేశాలిచ్చారట. ఇటీవల అయిదు హిందీ రాష్ట్రాలలో హైకోర్టు స్థాయిలో కూడా హిందీలో వ్యవహారాలు నడపటానికి కేంద్రం అనుమతించిదట (వార్త 27-3-2006). ఇలాంటి అనుమతి తెలుగుకి కూడా తెచ్చుకుంటే మన రాష్ట్ర భాషకు,ప్రజలకు గొప్ప మేలు జరుగుతుంది.చార్జి షీట్లు,డిమాండు పత్రాలు కూడా తెలుగులోనే జారీ చేయబోతున్నట్లు  డి.జి.పి.స్వరణ్ జిత్ సేన్ ప్రకటించారు.

 

(ఈనాడు 12-04-2006).మన పోలీసు స్టేషన్లు, కోర్టులు, ఆఫీసుల్లో వ్యవహారాలన్నీ తెలుగులోనే జరుగుతుంటే మనప్రజలకు సుఖం,మన విద్యార్థులకు భాషపై పట్టు దొరుకుతాయి. వాడకం వల్లనే భాష సజీవంగా ఉంటుంది. వాడకంలోలేని భాషతో ప్రజలను బాధపెట్టకూడదు. అలాగే పాలకులు కూడా బడా రాజ్యాల ప్రాపకం కోసం తమ భాషను చంపుకుని, తెలియని భాషను తెచ్చి

ప్రజలమీద రుద్దకూడదు.

 

——————

 

 

 

 

 

 

 

3 thoughts on “చిన్న భాషల్ని మింగేస్తున్న పెద్ద భాషలు

  1. రహమతుల్లా గారూ,
    మీకు ఎంత ఓపికండీ బాబూ…ఇన్ని గణాంకాలు ఎలా సంపాదించారూ!!!
    నాకైతే మీకు డాక్టరేటు ఇచ్చెయ్యాలని ఉంది అర్జెంటుగా….నిజ్జం…
    మీకున్న భాషాభిమానం, భాష తెరమరుగైపోతుందన్న బెంగ, ఏదో ఒకటి చేసి భాషని కాపాడాలనే తాపత్రయం బహు శ్లాఘనీయం.

    నేను బ్లాగు వ్రాయడం మొదలెట్టాక కొందరు స్నేహితులు తెలుగు చదివే అవకాశం వచ్చిందని హర్షం వ్యక్త పరిచారు. నన్ను ప్రతి పదిరోజులకీ ఇంకా ఏమీ వ్రాయలేదేంటీ అని అడుగుతుంటారు..ఇలా భాష మీద అభిమానమున్న వారు ఉన్నంతసేపూ,. మన భాషకి ఢోకా ఉండదని నేను నమ్ముతున్నాను. అంతర్జాలం అందుబాటులో ఉండడం వల్ల కావచ్చు కానీ ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నప్పటి కంటే…విదేశాల్లో ఉన్నవారికి భాష మీద మక్కువ ఎక్కువయిందని నాకు అనిపిస్తోంది.కొందరు తెలుగు వ్రాయడం చదవడం నేర్పిస్తారా.మాకు చదువుకునే రోజుల్లో కుదరలేదు అని అడిగారు ..ఇది చాలనుకుంటా భాష సజీవంగా ఉండడానికి!!!!!!

  2. Rahamatullah Gaaru

    It is very SAD to know this …. There will not be any option to bring these into life unless there are more number of people right …?

    Mana TELUGU kuda after few decades taruvatha ilaane avutundemonandi …!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *