April 24, 2024

నయాగరా! కవితా నగారా!

  రచన : డా. రాధేయ

ఒక విషయం గురించిగానీ, ఒక దృశ్యం గురించిగానీ కవితామయంగా కన్నులకు కట్టినట్లు చూపి ఆ దృశ్యీకరణశైలితో ఆలోచన్లని కవిత్వంగా మలిచే దిశగా ప్రయాణించే కవులు కొందరే కన్పిస్తారు మనకు. సామాజిక అనివార్యతనుంచి ఏకవీ తప్పించుకోలేడు. ఇప్పుడు ప్రపంచీకరణతో ప్రపంచమే మన ముంగిట్లో వాలింది. యాంత్రీకరణ మనిషి అవసరాల్ని తీర్చలేని స్థితిలో మనిషి బతుకును మార్కెట్లో నిలబెట్టింది. ఈ మార్కెట్ సంస్కృతిలో మానవ సంబంధాలు లేవు. ప్రేమలు, ఆపేక్షలు లేవు. అన్నీ పొడిపొడి మాటలు… లెక్కలు… బేరీజులే.

మానవ సంబంధాల్లో ఏర్పడిన ఈ అంతులేని విషాదాన్ని, ఇందులోని వాస్తవికతను వ్యక్తీకరిస్తూ దాన్ని అధిగమించే ప్రేమైక జీవన సత్యాల్ని మనిషికి వివరిస్తాడు కవి. ప్రేమ, ఆత్మీయతలతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కల్గిస్తూ సౌందర్యవంతమైన జీవితాన్ని కవిత్వం ద్వారా విశ్లేషిస్తాడు. సరళమైన, లలితమైన పదాలతో, పదబంధాలతో కవిత్వాన్ని చెప్పగల కవులు కొందరుంటారు. ప్రతి వస్తువునీ కవిత్వం చేసి మెప్పించగల ప్రతిభావంతులు మరికొందరుంటారు. అందుకే కవిత్వం ఒక జీవన విధానం. ఒక నిరంతర ఆలోచనా సరళి. ఒక నిత్యావసర శ్వాస. అవగాహన కల్గివున్న కవులు అలసటకైనా ఆటుపోట్లకైనా వెనుకంజ వేయరు.

“కవిత్వమంటే మార్పు, కొత్త స్పందన, మరింత సున్నితమైన అనుభూతి, మరింత నిశితమైన అనుభవ దృష్టి. నిజమైన కవిత్వం జీవితాన్ని ప్రతిబింబిస్తుంది” అంటాడు ఇస్మాయిల్.

కవిత్వాన్ని ఎవ్వరూ విధ్వంసం చెయ్యలేరు. మనిషిలో ఆలోచనా శక్తి ఉన్నంతవరకూ కవిత్వం ఉంటుంది. మానవజీవన సర్వస్వం కవిత్వమే.

అమెరికాలోని ‘నయాగరా’ జలపాత సౌందర్యాన్ని కొంతమంది కవులు, కవయిత్రులు సందర్శించారు. తర్వాత వారి భావావేశాన్ని అక్షరాల్లో బంధించి కవిత్వం రాశారు. ఈ వ్యాసంలో వారి కవిత్వాన్ని ఓసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం.

‘నయాగరా’ని చూసిన అనుభూతి ఎవరికైనా గొప్పదే. ప్రచండమైన జలపాతం ఉరుకులు, పరుగులతో నిర్విరామంగా దూకుతూ చూపరులను ఆశ్చర్యంలోనూ, ఆనందంలోనూ ముంచెత్తుతుంది. ఆ స్థలం వదలివచ్చిన ఆదృశ్యం జ్ఞాపకంగా మెరుస్తూనే వుంటుంది. నిజానికి దానిని అక్షరాల్లో పట్టుకోవడం చాలా కష్టం.

 

ఈ కవయిత్రి నాయాగరా అందాల్ని తన కవిత్వంలో పొదివి పట్టుకుంది. ఓ అద్భుతమైన కోలాహలాన్ని ఉద్వేగంతో చూసింది. ఒక మహా స్వప్నం కళ్ళముందు ప్రత్యక్షమైంది. అక్కడ సూర్యుడూ అంతే ఒక పట్టాన ఆకాశం దిగడు. వృక్షాలన్నీ పొడవుగా విస్తరించాయి. గాలినిండా కేరింతలు కొడుతూ పక్షులెగురుతాయి. ప్రవాహం మృదంగనాదమై వలయాలు వలయాలుగా సాగుతుంది.

 

అదిగో! అర్థచంద్రాకృతిలో ఉదయించిన

మహోధృత జలపాతం

నయాగరా

ఉగ్రవాదంలా

ఉన్మత్త రూపంలా నయాగరా

నీటి నుంచీ నింగి దాకా

ఇంద్రధనుస్సు సారించిన

నిరంతర జీవధార నయాగరా!

రాళ్ళని డీకొని పైకెగిసిన ఆ బిందువులతో

తడిసిన ముఖం అరవిందమైంది

ఒక్కసారిగా ఆ చిత్రాన్ని దాచుకోవాలని

విశాలంగా నేత్రం నిమీలితమైంది

అయస్కాంతమేదో ఆకర్షించినట్టు

ఆ వేగానికి శరీరం ఉద్రిక్తమైంది

తపోగ్నమైన మానసాన్ని

నిశ్శబ్దంగా కళ్ళుతెరిచి

మళ్ళీ మళ్ళీ

తేజోమయ రూపాన్ని

నయాగారని చూశాను

అలుపు లేకుండా

కాలంతో సవాలు చేస్తూ

యుగాలు దాటి నిలిచిన

ఓ విశ్వరహస్యాన్ని విన్నాను

                                                                                                           – జయప్రభ

 

 

 

ఈ కవయిత్రి కూడా నయాగరా జలపాతాన్ని దర్శించింది. తన హృదయం ఆనంద తరంగితమైంది. కవితా తరంగాల మధ్య మైమరచిపోయింది. ఆ పరిసరాలు ఆ దృశ్యాలు తనలోని భావ స్పష్టతకు తార్కాణాలుగా నిలిచాయి. కళ్ళముందు నయాగారాను చూస్తుంటే నీటి తుంపర్లు కూడా అక్షరాలుగా మారుతున్నాయి.

 

నయాగరా! నయాగరా!

నయగారాల నయాగరా!

ఇలా దూకేయడం నీకే తెలుసు సుమా!

పంచసాగరం వద్ద కనిపించేది నీవేనా

తరంగాలతో అంబరాన్ని చూపించే ప్రయత్నం

ఏమిటీ హోరు! ఏమిటీ జోరు!

  మైమరపించే జలవిద్యుత్కాంతులు

         కళ్ళను కట్టిపడేసే మంచు దుమారం

        ఇదేనా అభ్రగంగావతరణం

            నిన్ను చూస్తుంటే

                తుంపర్లుకూడా అక్షరాలుగా మారుతున్నాయి

                                                                            –      డా.పి.సుమతీ నరేంద్ర

 

 

ఈ కవి ఓ రాత్రి నయాగరాతో ముచ్చటించాడు. గదిలో నుండి నడచి, మెట్లపైనుండి నడచి, నయాగరా వీధిలోకి నడచి అప్పుడు చూశాడు. నల్లని వాడు, నల్లని బట్టలు వేసుకున్నవాడు, నల్లని మోటు పెదవులతో ధగధగా మెరిసే ‘జాజ్’ పరవశుడై, తాండవమాడే పరమశివునిలా ఆలపిస్తున్నాడు. మనిషి గుండెలోకి పాట ఈటై దిగుతోంది. అడుగులు ఆగిపోయాయి. ఎదురుగా నయాగారా జలపాతానికి దారి. ఆపాతమధురమైన పాట నుండి జలపాతానికి వెళ్ళాలి.

 

 

నయాగారకు ఆ ఒడ్డు కెనడా

ఈ ఒడ్డు అమెరికా

రెండు దేశాల సంధానకర్త ఒక నీటిపాయ

తీరాలపై వెలసిన ఇరుదేశాల ఆకాశహర్మ్యాలు

మనిషి చేతలు ప్రకృతి ముందు

ఎంత కృతకమో చెబుతున్నాయి

మనిషి అవసరాన్ని అభిరుచిని బలహీనతలను

నగదుగా మార్చుకోవడమే వ్యాపారమైనపుడు

నయాగారాను ఒక వ్యాపారంగా మార్చిన అమెరికా!

నీది ఒక వ్యూహం!

అమెరికాకు వచ్చిన వాడెవడైనా నయాగారాను

చూడకుండా పోగలడా?

ప్రకృతి మనిషిని జయించడం మరచిపోగలడా?

                                                                                                                               – రామా చంద్రమౌళి

 

 

 

ఈ కవి నయాగరా జలధారను చూశాడు. కవితాధార ఉప్పొంగింది. ఖండఖండాంతరాల్లో సహజ జలపాతమని పేరుపొందిన నయాగరా  రుతుస్నాతగా, శ్వేతసుందరిగా, నురుగుల బంగారు జుత్తుతో పరుగు తీస్తుంటుంది. అమెరికా కెనెడా సంపన్న దేశాల మైత్రీ స్రవంతి నయాగారా. అధునాతన పాశ్చాత్య శ్వేతసుందరి. అసలైన సిసలైన మోనాలిసా నయాగరా.

 

రాదేం నయగారా

నిను జూస్తే

నాకేం కవితాధార

ఖండఖండాంతరాల్లో సహజ సౌందర్య

జలపాతానివని ప్రఖ్యాతి పొందావు

శతశతాబ్దాలుగా ప్రపంచంలో వింతైన విశాలమైన

నిర్ఝరీపాతానివని ప్రఖ్యాతి జెందావు

ఏడాది పొడవునా నిట్ట నిటారుగా

కొండకొమ్మల్లోంచి దూకుతుంటావని కీర్తి గడించావు

విద్యుద్దీపాల వెండి వెలుగుల్లో మెరిసిపోతుంటావని కీర్తి గడించావు

కానీ ఏం లాభం

నీ జలాల్ని సుతారంగా స్పృశించి పొంగిపోలేం

నీ నీటిని ఔపోసన పట్టలేం

నీవొక అందరాని, పురాజన్మ చైతన్యంలేని

అధునాతన పాశ్చాత్య శ్వేత సుందరివి

నీ తీవ్రఝరీ తరంగ భావనా విచిత్ర విపంచికీ

నా శాంత గంభీర మనోవీణా తంత్రులకీ

ట్యూన్ కలియటం లేదు

అందుకేనేమో

రాదేం నయాగారా

నిను జూస్తే

నాకేమీ కవితాధార

                                                                                                                            – జి.వి.సుబ్బారావు

 

 

 

ఈ కవి నయాగరాను ప్రపంచ అపురూప అందాల భరిణెగా అభివర్ణిస్త్తున్నాడు. ఈ నయాగరాను సందర్శించినపుడు కలిగించ భావోద్వేగానికి అక్షరరూపమిచ్చాడు. ఆ జలతరంగిణి సంతోషంతో ఉప్పొంగితే ఆనందాశ్రువుల సంద్రమౌతుంది. ఉత్తుంగ తరంగ తురంగమై వడివడిగా పరుగులు పెడుతుంది. అలా సాగిపోతూ పూర్వీకుల పాదముద్రల్ని చూపుతుంది. గుహలలో తలదాచుకున్న ముత్తాతల ఆనవాళ్ళు చూపుతుంది. తీరాల పొడవునా విస్తరించిన మానవ నాగరికతా మహాప్రస్థానాల చిత్రపటాలు ఆవిష్కరిస్తుంది.

 

నయాగరా

నా గారాల తనయా

శీతల సమీర స్ప్రశలతో కేరింతలు గొట్టే

నవనోన్మేష శిశువా

శత సహస్ర కోమల కరాలు చాచి

నను స్వాగతించే చిరుకూనా

ఏడేడు సంద్రాలలో కడిగి ఆరబెట్టిన ఆణిముత్యమా

నా చీకటి గుండియలో

దివ్వెలు వెలిగించే మణిహారమా

నింగీ నేలను తాకిన నా ఇంద్రచాపమా

నీ శీకర తుషార

పరివ్యాప్తితో

ఆపాదమస్తకం తడిసి పునీతుడనైతి

ఉదయభానుడి లేత కిరణాలతో

తలారా స్నానమాచరించి

ముగ్ధ మనోహరంగా

గోచరిస్తావు నువ్వు నయాగరా

జలతారు మేలిముసుగులో

తళుకులీనే నవవధువా

నీవేలు పట్టుక నడిచిన వాడెంత ధన్యుడో గదా

                                                                                                                                               -జీవన్

 

ఇదీ నయాగరా సౌందర్య వర్ణన. కవుల కవయిత్రుల మనోలోక భావనా సౌంద్రయ కవితా వర్ణన. ఒకే దృశ్యాన్ని విభిన్న కోణాల్లో దర్శించి వర్ణించిన తీరు ప్రశంశనీయం. ఒకరికి నయాగరా ఓ అద్భుత కోలాహల మహాస్వప్నమైతే, మరొకరికి ఆ నీటి తుంపర్లు అక్షరాలై అంతరంగాన్ని అభిషేకించింది. అమెరికాకు వెళ్ళిన వాడెవడైనా నయాగరాను చూసితిరాలంటాడు ఒక కవి. ఖండఖండాంతరాల్లో సహజసౌందర్య జలరాశిగా పులకించిపోయాడు మరొక కవి.నయాగరాకు ఏడేడు సముద్రాలలో కడిగి ఆరబెట్టిన ఆణిముత్యంలా భావించాడు ఇంకొక కవి.

 

వీరందరి దృష్టిలో ‘నయాగరా’ అంటేనే ‘కవితానగారా’.

 

3 thoughts on “నయాగరా! కవితా నగారా!

  1. కానీ ఏం లాభం

    నీ జలాల్ని సుతారంగా స్పృశించి పొంగిపోలేం

    నీ నీటిని ఔపోసన పట్టలేం..
    నిజమేనండీ..మా ఇంటిముందున్న చెరువు పారుతూ చిన్న ధారగా సాగేది…దాంట్లో తడుస్తూ ఆడుకున్న మధురమైన అనుభూతి నాకు నయాగరా చూసినప్పుడు కలుగదు. ఎందుకంటే ఇక్కడ నీళ్ళని ముట్టుకోలేము కదా…కేవలం చూసి ఆనందించడమే…!!!!

  2. కవితల వర్ణనన చాలాబావుందందీ

    ఇలా రాసినదీ చదివినదీ తక్కువే నేను

    ప్రకృతి తల్లిని వర్ణించడం ఒక కవులకే

    సాధ్యమనేది మీరందరూ నిరూపించారు

    మీ కవితలతో మీ అందరి పరిచయం..

    నా భాగ్యంగా తలుస్తాను..జయప్రదగారి

    నయాగరా జలపాతాన్ని వర్ణన చాలా బావుంది

    ఇక తక్కిన కవుల విషయానికి వస్తే

    ఒకరికి మించిన వారోకరన్నట్లు బహుబాగా

    నయాగరా జలపాతాల్ని వర్ణించారు అందరికీ

    హృదయపూర్వకముగా అంజలి ఘటిస్తూ..

    సెలవు తీసుకొంటున్నాను

    ప్రేమతో…..ప్రియ

  3. చాలా మంచి పరిచయం…ఒకే అంశంపై వివిధ కవుల దృక్కోణం ఒకే చోట చూడడం బాగుంది….ధన్యవాదాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *