April 18, 2024

మనసులో మాట నొసటన కనిపించెనట

    రచన : లలిత.జి

 

పార్వతీ పరమేశ్వరులు పరవశించి నాట్యం చేస్తున్నారు.

సరస్వతీ దేవి వీణా గానం వింటూ బ్రహ్మదేవుడు పుట్టబోయే ప్రతి శిశువు నుదుటి మీదా వారి భాగ్య రేఖలు రాస్తున్నాడు.

పాలకడలిలో పాముపై పడుకుని తలవంచుకుని తన పాదాలు వత్తుతున్న శ్రీమహాలక్ష్మిని మందహాసంతో చూపు మరల్చుకోలేక చూస్తున్న శ్రీమహావిష్ణువు ఒక్క సారి ఉలిక్కి పడ్డాడు.

“పతికిన్ చెప్పక…” శ్రీదేవి పరుగు అందుకుంటే ఆమె వెనకే హరి, అతని వెనుకే అతని శంఖ చక్రాలతో సహా సకల పరివారమూ వెంబడించగా అందరూ కలిసి అరక్షణంలో భూలోకానికి అల్లంత దూరంలో ఆకాశంలో మబ్బుల పై ఆగారు. ఏమై ఉంటుందా అని అందరూ ఆత్రంగా తొంగి చూశారు.

 

అది ఒక సంపన్నుని స్వగృహం. ముందు గదిలో ముచ్చట్లాడుకుంటున్న దంపతుల ద్వయం, వారి బంధు మిత్ర వర్గం. పెరట్లో ఏకాంత ప్రశాంత వాతావరణంలో ఒక అమ్మాయి, అబ్బాయి. అబ్బాయి పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు తన ముందున్న అందాన్ని. ఆపకుండా చెపుతున్నాడు ఆత్మకథని. అంతా వింటూనే తన వంతు ఎప్పుడు వస్తుందా, తన సందేహాలను ఎలా నివృత్తి చేసుకోవాలా, అడిగితే ఏమనుకుంటాడో, అమ్మా నాన్న ఏమంటారో, అడగకపోతే ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో, అని సతమతమౌతోంది అమ్మాయి. “అమ్మా  శ్రీమహాలక్ష్మీ, శ్రీవారి వక్షస్థలంలో స్థిరంగా ఉంటావు. నాకు కాబోయే శ్రీవారి మనసులో శ్రీమతికెటువంటి స్థానముందో తెలిసేదెలా? కలవారని అమ్మా, కష్టపడే తత్వమని నాన్నా, పేరున్న వారని చుట్టాలూ, అప్పుడే పెళ్ళామయినట్టు వరసలు కలిపేస్తున్న పెళ్ళి కొడుకూ ఈ సంబంధం స్థిరమని నిశ్చయించేశారు. వద్దన్నా నా స్నేహితురాలు నళిని గుర్తుకు వస్తోంది. నాలుగు నిమిషాల్లో నిశ్చయమూ, నాలుగు రోజుల్లో పెళ్ళీ అయిపోయింది. నాలుగు ముక్కలు కూడా నవ్వుతూ మాట్లాడలేని పరిస్థితి ఇప్పుడు తనది. అప్పుడెన్ని నీతులు చెప్పాను తనకి. ఇప్పుడు నేనే పరిస్థితిలో ఉన్నాను? అందుకే తన దాకా వస్తే కాని తెలియదంటారు. అమ్మా మహాలక్ష్మీ ఆడవారి మాటలు అర్థం కావంటారు కానీ, ఈ మగ వారి మనసులో ఏముందో ఎలా తెలిసేది? నీ నోము పట్టించి, నెల తిరక్కుండానే సంబంధం వస్తే నీ చలవే అంది అమ్మ. అందుకే నిన్ను వేడుకుంటున్నాను. ఈ క్షణంలో ఇతనేమనుకుంటున్నాడో నాకు తెలియచేయగలవా?”

 

అలాగే కానీ అనుకుని  శ్రీమహాలక్ష్మి చిరునవ్వుతో ఆ అమ్మాయి వైపు చూసింది. కాబోయే పెళ్ళికూతురికి కరెంటు షాకు తగిలినట్టయ్యింది. కళ్ళెదుట ఉన్న అమ్మాయి కట్టుకోబోయే అమ్మాయి అని తన ఊహలన్నీ కట్లు తెంచుకుని ఆలోచిస్తుంటే తట్టుకోలేకపోయింది ఆ అమ్మాయి. “కోరికలు కోరుకుంటే తీరుతాయి జాగ్రత్త” అన్న చైనా సామెత గుర్తుకు వచ్చి లెంపలేసుకుంది.

 

ఆమె అసహాయత చూసి లక్ష్మీదేవి మహావిష్ణువును ఆశ్రయించింది. మాయా మర్మమూ తెలిసినవాడు గనుక శ్రీ మహావిష్ణువు చిద్విలాసంతో “పసి పిల్లాడు తెలియక మారాము చేస్తే కారం డబ్బా చేతికందిస్తామా? అయినా నీ భక్తురాలు ఈ క్షణంలో అతడేమి అనుకుంటున్నాడో తెలియజేయమంటే అర్థం ఈ క్షణంలో తెలియజేయమని అంతే కానీ ఈ క్షణంలో అతనేమి అనుకుంటున్నాడో అని కాదనుకుంటాను. ఈ క్షణంలో కాదు ఇక ముందేమి ఉద్దేశ్యాలున్నాయో తెలియజేస్తే కదా ఆ అమ్మాయి నిర్ణయం తీసుకోగలిగేది? మహా లక్ష్మీ, మాయ చేసి నీ ముచ్చట తీరుస్తాను చూడు,” అని అభయమిచ్చి పెళ్ళి కొడుకు మనసు లోలోపల ఉన్న మధురమైన భావాలను, జీవితం పట్ల అతనికున్న ఆరోగ్యకరమైన ప్రేమనూ, లోతైన అవగాహననూ  ఆ కన్నె పిల్ల కళ్ళకు అగుపించేలా చేశాడు, ఆమెకు ముందు ఉన్న అమానాలూ, కలిగిన భ్రమలూ తొలిగిపోయేలా చేస్తూ.  సంతోషంతో ఆ తల్లికి మనసారా మనసులోనే ప్రణామాలర్పించుకుని తలొంచుకుని తుర్రున తల్లి చాటుకి పారిపోయింది కొత్తగా సిగ్గు నేర్చుకున్న కాబోయే పెళ్ళి కూతురు. అక్కడికి ఆ కథ సుఖాంతమూ, శుభారంభమూ అయ్యి సంపూర్ణమయ్యింది.

 

కానీ శ్రీ  మహా విష్ణువుకి ఒక చిలిపి సరదా పుట్టింది. తాను రాస్తున్న భాగ్యరేఖలతో పాటు ఆ సృష్టికర్తను శిశువుల నుదుటి మీద మరో ఏర్పాటు కూడా చేయమన్నాడు. వయసొచ్చి మగువని చూసి మనసు పడేసుకుంటే ఆ మగువకు మనువు గురించి అతని మనసు లోతులలోన ఉన్న ఆలోచనలు అద్దంలో  కనిపించినట్టు కనిపించాలని.  అదే విధంగా ఏ అమ్మాయైనా అతనిని చూసి ఆ విధంగా ఆలోచించినా అవే విషయాలు అతనికి అవలీలగా కనిపించాలని.

 

ఇక పాలకడలిలో పానుపు పై పవళించి వినోదం చూడడానికి సతీ సమేతంగా సంసిద్ధుడయ్యాడు. కాదు కాదు, శ్రీమతికి వినోదం చూపించేదుకు సన్నద్ధుడయ్యాడు. కాలచక్రాన్ని తిప్పి పాతిక సంవత్సారాల తర్వాత జరగబోయేది కళ్ళకు కట్టినట్టు చూపించాడు.

 

అది ఒక కాలేజీ ఆవరణ. క్లాసుల మధ్య ఖాళీ సమయంలో కాలేజీ అమ్మాయిలూ, అబ్బాయిలూ  కబుర్లతో కాలక్షేపం చేస్తూ కాఫీ టీలు సేవిస్తున్నారు, కాలేజీ క్యాంటీనులో. ఒక్కో గుంపులో వారు ఒక్కో విషయం మీద, కొంతమంది అన్ని విషయాల మీద చర్చించుకుంటున్నారు. ప్రేమ ముందా, పెళ్ళి ముందా అన్నది ఒక అంశం ఐతే, పెద్దల ఇష్టమా, పెళ్ళిలో చెల్లాల్సింది  పిల్లల ఇష్టమా అని ఇంకొక అంశం. పై చదువులకు పై దేశాలకు వెళ్ళాడానికి పరీక్షలూ, వాటి ప్రిపరేషనూ ఇంకొకరికి చర్చా విషయం. ఇంకా చదవాలా, ఇక ఉద్యోగం చెయ్యాలా అని ఇంకొకరి మీమాంస. సినిమాకి ఫైటు ఎక్కువ అవసరమా లేక పాట ఎక్కువ అవసరమా అన్న సందిగ్ధం మరి కొందరిది. ఇలాంటి చింతలేమీ లేకుండాఅ హాయిగా ప్రకృతి అందాలనో, పడతుల పరువాలనో గమనిస్తూ క్యాంటీను బయట నిలబడి ప్రస్తుతంలోనే ఉండి ప్రత్యక్షానందాలను రుచి చూస్తున్న వారింకొందరు.

 

అక్కడక్కడా ప్రేమాంకురాలు మొలిచే అవకాశమున్న జంటల మధ్యకు మహావిష్ణువు, మహాలక్ష్మీ  దృష్టి సారించారు. “శ్రీధర్ చాకు లాంటి కుర్రాడు. చదువుతున్నట్టే కనిపించడు కాని ర్యాంకులు కొట్టేస్తుంటాడు. సరదాగా మాట్లాడ్తుంటాడు. అప్పుడప్పుడూ సరసమా అనే అనుమానం కూడా వస్తుంటుంది. చనువు తీసుకోవచ్చో లేదో అని సందేహం వస్తుంటుంది. నువ్వు నాకిష్టం. మా ఇంట్లో నీ గురించి చెప్తుంటాను. ఎప్పుడైనా వస్తే మా వాళ్ళకి పరిచయం చేస్తాను అని అడగాలనిపిస్తుంది. అతను ఎలాంటి వాడో ఎలా తెలుస్తుంది?” అనుకుంటూ ఉండగానే అతని నుదురుపై తెలియని కాంతి. అందులో అతని ఆలోచనలు. “ఇంకెన్ని రోజులో ఈ చదువులు. ఆ తర్వాత ఉద్యోగాల వేట. పెళ్ళి చూపులూ, పెద్దల మాటలూ, ఆ తర్వాత పెళ్ళి ముచ్చట్లు. ఈ ఆడ పిల్లలకి ఆ బాధ లేదు. ఎంతసేపూ పెళ్ళి చేసుకోమనే వెంటబడతారు పెద్దవాళ్ళు, కాని పెద్ద ధ్యేయాలతో వాయిదాలు వేసుకోమనరు. హాయిగా ఏ పెద్ద చదువులనో విదేశాలకెళ్ళిపోతేనో…” ఇక ఆపైన కనిపించిన విషయాలు కళ్ళు మూసుకునేలా చేస్తే ఊర్మిళ ఉరుకులు పరుగులతో అక్కడ్నించి తప్పుకుంది.

 

ఇంకోచోట వనితను చూసి మళ్ళీ ఆమె తన వైపు చూస్తే తల తిప్పుకోలేక ఇబ్బందిగా నవ్వుతూ “హలో!” చెప్పాడు అరుణ్. అంతే ఇబ్బందిగా అతనినికి జవాబు చెప్తూ అలాగే ఆగిపోయింది వనిత. అరుణ్ వాళ్ళ అమ్మా నాన్నల పెళ్ళి విషయాలూ, వారి అనుబంధం గురించి ఆలోచిస్తున్నాడు. అది అతని నుదుటిపై సన్నని కాంతిలా, అదో కలలా అస్పష్టంగా అగుపిస్తూనే అతని స్పష్టమైన ఆలోచనలను తెలియచేస్తోంది. అన్యోన్యమైన ఆ అనుబంధంలో ఆనందాలూ, ఆరాటాలూ, ఆత్మాభిమానాలూ, ఆధారపడడాలూ, అన్నీ కలిపి అనుమానం లేకుండా అదో తీయని అనుభూతి కలిగించే ఆలోచనలు. అదృష్టవంతురాలు ఈ అమ్మాయి అనుకుంటున్నారు కదూ. ఆగండాగండి.  మరి ఆ అమ్మాయి ఉద్దేశాలు కూడా అరుణ్ చూడాలి కదా. ఆమెకేమో సిరి సంపదల మీద ఉన్న మమకారం అనుబంధాల మీద  లేదాయె. అరుణ్ త్వరలోనే అమెరికా వెళ్ళ బోతున్నాడు. ఐశ్వర్యవంతుల అబ్బాయి. అతనితో భవిష్యత్తు తన తోటి వారికన్నా తనని ఓ రెండంగుళాలు ఎక్కువ ఎత్తులో ఉంచుతుందన్న ఆశ ఆమెది. అంతే కాదు అతని నుదుట కనిపించిన దాంట్లో తన మీది ప్రేమ అతని బలహీనతగా, తనకు సంబంధించని ఆలోచనలు అనవసరమైన భారంగా ఆమెకు తోచాయి. ఎటూ తేల్చుకోలేక సతమతమవ్వడం వనిత నుదుటి మీద కొద్ది క్షణాల పాటు వింతగా ప్రత్యక్షమైన వెలుగులో స్పష్టంగా కనిపించింది అరుణ్‌కు. అనుకోని అనుభవానికీ, అది కలిగించిన ఆశభంగానికీ తట్టుకోలేక అరుణ్ తలొంచుకుని తప్పుకున్నాడు.

 

శ్రీ మహాలక్ష్మి భారంగా నిట్టూర్చింది. కలవని మనసుల భారం ఆమెను కదిలించింది. ఐనా ఆ విషయం ముందే తెలియడం మంచిది కదా అని సంభాళించుకుంది. ఐతే శ్రీ మహా విష్ణువు ఆమె ఆంతర్యం గ్రహించి దృశ్యాన్ని కాలంలో రెండు సంవత్సరాలూ, దూరంలో కొన్ని వేళ మైళ్ళూ ముందుకు జరిపాడు. అప్పుడేం జరుగుతున్నదంటే ఈ నలుగురూ అమెరికాలోని ఒక విందుకు హాజరై ఉన్నారు. అరుణ్, వనిత మరియు శ్రీధర్, ఊర్మిళ జంటలుగా ఉన్నారు. శ్రీ మహా విష్ణువు చిద్విలాసంగా నవ్వాడు. ప్రశ్నార్థకంగా చూసిన శ్రీ మహాలక్ష్మికి నారాయణుడిలా వివరించాడు, “చూడు లక్ష్మీ, అంతరంగాలు తెలిసినంత మాత్రాన అందరూ వివేకంతో ప్రవర్తించాలని లేదు కదా? ఐనా ఆ విధాత నా మాట విని మనసు లోతులో ఉన్న ఆలోచనలు నుదుటి మీద చూపించినంత మాత్రన తను వ్రాసిన భాగ్యరేఖల ఫలితాన్ని తారు మారు చెయ్యనిస్త్తాడా? మనసుకి నచ్చే అవకాశమున్న ప్రతి అబ్బాయి నుదుటి మీదా విపరీత పోకడుల ప్రతిబింబాలు చూసి ఊర్మిళ తన తల్లి దండ్రుల దృష్టిలో శ్రేష్ఠమైన సంబంధాన్ని వద్దనడానికి సరైన కారణాలు చూపలేకపోయింది. అరుణ్ తనకి నచ్చిన అమ్మాయిల ఆశలకూ తన ఆశయాలకూ పొత్తు కుదరక తను మొదట వలచిన ‘వనితనే’ మనువాడడానికి నిశ్చయించుకున్నాడు. కథ అడ్డం తిరగాల్సినది అడ్డంగా తిరిగి మళ్ళీ మొదటికే వచ్చింది.”

 

“మరి తరుణోపాయం?” అని అడిగింది శ్రీ మహాలక్ష్మి. మొదట్లో శ్రీ మహాలక్ష్మిని ప్రార్థించిన భక్తురాలు మెట్టిన ఇంటికి దృశ్యం మార్చాడు శ్రీ మహా విష్ణువు. విష్ణుమూర్తి ఏదో చెప్పబోయేలోపలే శ్రీమహాలక్ష్మి ఆ భక్తురాలి మొర విని అటు వైపు పరుగు తీసింది. సిరి వెనకే శ్రీహరీనూ. ఇద్దరూ చిరునవ్వుతో ఆ భక్తురాలి ప్రార్థనను అంగీకరించి ఆమె కోరిన వరాన్ని ప్రసాదించారు. నుదుటి వెలుగులను, అంతరంగాలు అద్దంలో కనపడడాలూ ఆగిపోయేలా చేశారు. ఆ భక్తురాలి స్నేహితులే ఐన అరుణ్, వనిత మరియు శ్రీధర్, ఊర్మిళ ల జంటలను సమర్థవంతంగా తమ సమస్యలు పరిష్కరించుకుని సంతోషంగా తమ జీవనం సాగించగలిగేలా ఆశీర్వదించారు.

3 thoughts on “మనసులో మాట నొసటన కనిపించెనట

  1. అది అతని నుదుటిపై సన్నని కాంతిలా, అదో కలలా అస్పష్టంగా అగుపిస్తూనే అతని స్పష్టమైన ఆలోచనలను తెలియచేస్తోంది…..how nice it would be to know like this every time!!!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *