March 29, 2024

రఘునాథ నాయకుని గ్రీష్మర్తు వర్ణన …

రచన  – డా.తాడేపల్లి పతంజలి

 

ఒక కవి చరిత్రను మొట్టమొదట కావ్యంగా వ్రాసిన మహాకవి రఘునాథ నాయకుడు. కృష్ణ దేవరాయలు మళ్ళీ రఘునాథ నాయకునిగా పుట్టాడేమో అనిపిస్తుంది.ఆయన భువన విజయం నడిపిస్తే ఈయన ఇందిరామందిరం స్థాపించాడు.రాయలు, నాయకుడు ఇద్దరూ మహాకవులే. కాకపోతే రాయలు ఇలలోనూ, కవిత్వంలోనూ సమ్రాట్టు. రఘునాథ నాయకుడు కేవలం కవిత్వంలోనే  సమ్రాట్టు.

 

రఘునాథ నాయకుని కావ్యాల్లో ప్రసిద్ధికెక్కిన కావ్యం వాల్మీకి చరిత్ర. మొత్తం మూడాశ్వాసాలు.  122+155+169  వెరసి 446 గద్య పద్యాలు .

 

వాల్మీకి చరిత్ర ద్వితీయాశ్వాసంలో గ్రీష్మర్తు పద్యాలు 15దాకా ఉన్నాయి. అవటానికి  గ్రీష్మర్తుపద్యాలయినప్పటికీ అర్థం చేసుకొంటూ చదివితే మంచి భావాల కోసం తపించే  హృదయాలని చల్లపరుస్తాయి. వాటిలో ఒక పద్యం ఆస్వాదిద్దాం

.

“కాకోల కంఠు తార్తీ

యైక విలోచనమునందునెసగెడు సెగలే

పైకొనియెననగ  లోకం

బాకులపడ దోచె గ్రీష్మమతి భీష్మంబై’

 

ఎండాకాలం భయంకరంగా ఉందని చెప్పాలి. దానికి పోలికగా శివుని మూడో కన్నును  రఘునాథ నాయకుడు ఎంచుకొన్నాడు. శివుని మూడో కంట్లో ఉన్న మంటలు ఎండాకాలంగా మారిందని కవి భావన. ఎండలు మండి పోతున్నాయని మన తెలుగు వాళ్ళం (తెలుగు భాష మాట్లాడే తెలుగు వాళ్ళు మాత్రమే) అప్పుడప్పుడు వాపోతుంటాం. ఆ నుడికారాన్ని కవి తన  భావనలో అందంగా చెప్పాడు.

 

“గ్రీష్మమతి భీష్మంబై ‘అనటం శబ్దాలంకార లోలత్వం వల్ల కాదు. సందర్భానుగుణమైన  భాష రసవత్తరంగా ఉంటుంది. చిన్నపిల్లవాడి దగ్గర ‘నాన్నా! బాగున్నావా! ‘అని మృదువుగా మాట్లాడాలి. యుద్ధంలో కత్తులు దూస్తున్నప్పుడు భాష కఠినంగా   ఉండాలి. “గ్రీష్మమతిగా దోచెన్ “అని మృదువుగా రాస్తే అది పద్దుల లెక్క అవుతుంది. గణాలు  కుదరచ్చేమో కాని  , రస సిద్ధి కాదు.

 

ఈ పద్యంలో ఉన్న ఇంకో అందమైన పదం  ‘కాకోల కంఠు ‘. శివుడనటానికి వేలాదిగా పదాలున్నాయి. ప్రత్యేకంగా ‘కాకోల కంఠు’ పదాన్ని స్వీకరించటంలో రఘునాథ నాయకుని ప్రతిభ ఉంది.కాకిలా నల్లగా ఉండే విషం కాకోలం . కాకిని రామ చిలుకలా ముద్దు చేయం. ఒక పావురాయిలా దానిని తదేకంగా చూడం. కాకిని చూస్తుంటేనే ఒక తిరస్కార అసహ్య  భావన  అప్రయత్నంగా  మానవునికి వస్తుంది. కాకోల విషం కూడా అటువంటిదే.

 

పాల సముద్రం లోనుంచి మొట్టమొదటగా కోలాహలంగా బయటకు వచ్చిన హాలా హలమే కాకోలం. ఇది  శివుడి కంటి మంటకి నూరు రెట్లు ఎక్కువ. కల్పాంతంలో వచ్చే అగ్నికి వెయ్యి రెట్లు ఎక్కువ.లక్ష సూర్యులతో సమానం. ఆ విషం అన్నింటిని నాశనం చేస్తుంటే అందరూ శివున్ని ప్రార్థించారు  . లోకం మేలు కోసం ఆ కాకోలాన్ని శివుడు చేయి చాచి ఒక నేరే డు పండులాగా చేతిలోకి తీసుకొన్నాడు.అంతమందిని గడగడలాడించే విషం శివుని దగ్గర ఇదివరకు  బడిపంతులిని (ఇప్పటి వాళ్ళు కాదు) చూసిన పిల్లల్లా    కిక్కురుమనలేదు. . ఆ కాకోలాన్ని మింగేటప్పుడు శివుని శరీరంమీద పాములు కదల్లేదు. చెమటలు లేవు. కళ్ళు ఎర్రబడలేదు.

 

శివుని ఉదరం సమస్త లోకాలకి నిలయం కనుక ఆ భయంకర విషాన్ని లోపలికి పోనీయకుండా పండ్ల రసంలా గొంతులో నిలిపాడు. అందువల్ల ఆ గొంతుకు ఒక నలుపు ఏర్పడి, అది అలంకారంలా మారింది. శివునికి అప్పట్నించి కాకోల కంఠుడు, నీల కంఠుడు ఇలా పేర్లు వచ్చాయి.

 

‘ప్రళయకాలా భీల ఫాల లోచనానలశతంబు చందంబున ‘(భా. 08వ స్కంధం 216వ.) అనే వాక్యాన్ని రఘునాథ నాయకుడు తప్పనిసరిగా చదివే ఉంటాడు . శివుడి కంటి మంటకి నూరు రెట్లు ఎక్కువ శక్తి విషానికున్నప్పుడు “శివుడి కంటి మంట శక్తి ఎక్కువా? విషం శక్తి  ఎక్కువా?” అనే ప్రశ్న వస్తే  విషం శక్తి  ఎక్కువ  అని సామాన్యంగా మనకు అనిపించే  జవాబు. ఎందుకంటే అది నూరు రెట్లు ఎక్కువ అని భాగవతం చెబుతోంది కదా ! అనిపిస్తుంది. కాని ఆ విషాన్ని కంఠంలో నిలిపి చెక్కు చెదరనివాడు శివుడు అనే అర్థం వచ్చేటట్లు కాకోల కంఠు అనే పదాన్ని  రఘునాథ నాయకుడు ప్రయోగించాడు.

 

ఇప్పుడు విషం శక్తి తగ్గిపోయింది. కంటి మంట శక్తి  అధికమయింది

 

మొత్తం మీద భావమేమిటంటే అన్ని లోకాలను బూడిద చేసే కాకోల విషాన్ని కంఠంలో నిలిపిన శివుడు సామాన్యుడు కాడు. అతని కంటి మంట శక్తి విషాన్ని మించిందని, అవి ఎండలుగా మారాయని రఘునాథ నాయకుని ఊహా నిపుణత్వానికి  జోహార్లు  అనక తప్పదు. స్వస్తి.

 

ఆధార గ్రంథాలు

1. వాల్మీకి చరిత్రము  -అకాడమీ ప్రథమ  ప్రచురణము  (1968)

2. పోతన భాగవతం మూడవ సంపుటం- టిటిడీ ప్రచురణము(2007)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *