March 28, 2024

‘చందమామ’ విజయగాథ

రచన : కె. రాజశేఖర రాజు.

 


భారతీయ సాహిత్యాకాశంలో కథా కాంతులు మెరిపించిన గొప్ప చరిత్ర చందమామ సొంతం. కోట్లాది మంది పిల్లల, పెద్దల మనో ప్రపంచంపై దశాబ్దాలుగా మహత్ ప్రభావం కలిగిస్తున్న అద్వితీయ చరిత్ర చందమామకే సొంతం. గ్రామఫోనూ, రేడియో తప్ప మరే ఇతర వినోద విజ్ఞాన సాధనమూ లేని కాలంలో చదువగలిగిన ప్రతి వారికి చక్కటి వినోద సాధనంగా పనిచేసిన చరిత్రకు సజీవ సాక్ష్యం చందమామ.

చందమామ ఆవిర్భవించి అప్పుడే ఆరు దశాబ్దాలు గడిచిపోయాయి. ఇలాంటి కథల పత్రిక ప్రపంచంలో మరొకటి లేదని సామాన్యులు, మాన్యులు కూడా ముక్తకంఠంతో దశాబ్దాలుగా ఘోషిస్తున్నారు. చందమామ పత్రిక పఠనంతో తమ జ్ఞాపకాలను అపూర్వంగా పంచుకుంటున్నారు. ఆధునిక తరం అవసరాలకు అనుగుణంగా రూపొందిన పిల్లల పత్రికలు ఎన్ని వచ్చినా; కంప్యూటర్లూ, సెల్‌ఫోన్లూ, ఐప్యాడ్‌లూ వంటి ఆధునిక సాంకేతిక, వినోద ఉపకరణాలు ఎన్ని ఉనికిలోకి వచ్చినా పిల్లలూ, పెద్దలూ, వయో వృద్ధులూ.. ఇలా అన్ని వయస్సుల వారినీ, తరాల వారినీ అలరిస్తూ వస్తున్న ఏకైక కథల పత్రిక అప్పుడూ ఇప్పుడూ కూడా చందమామే.

తెలుగు నేలమీదే కాదు.. భారతీయ భాషలన్నింటిలోనూ అలనాటి తరం, నేటి తరం పాఠకులు ఎవ్వరూ కూడా చందమామతో తమ అనుబంధం మర్చిపోలేదు. చందమామ కథలతో పాటే పెరిగిన పిల్లలు జీవితంలో ఎన్ని దశలనూ అధిగమించినా సరే ఈనాటికీ వారు తమ బాల్యాన్ని మర్చిపోలేదు. తమ బాల్యాన్ని మంత్రనగరి సరిహద్దులలో ఊగించి, శ్వాసించిన చందమామ కథలనూ మర్చిపోలేదు. దేశీయ భాషలకు చెందిన సమస్త పాఠకులూ ఈనాటికీ చందమామ కార్యాలయానికి పంపుతున్న లేఖలూ, అభిప్రాయాలే దీనికి తిరుగులేని సాక్ష్యం.

తొలి సంచిక ప్రారంభమైన 1947 నుంచి చందమామ పత్రికను కొంటూ తమ పిల్లలకు, మనవళ్లు, మనవరాళ్లకూ కూడా చందమామ కథలు చదివి వినిపిస్తూ, తాము మళ్లీ మళ్లీ చదువుతూ చందమామతో తాదాత్మ్యం చెందుతున్న పాఠకులు దేశంలో ఏ భాషలోనూ, ఏ ప్రాంతంలోనూ మరే పత్రికకూ లేరని చెప్పడంలో ఇసుమంత అతిశయోక్తి లేదు.

తెలుగునాడులో, భారతదేశంలో కొన్ని తరాల పిల్లలు, పెద్దల కాల్పనిక ప్రపంచాన్ని చందమామ కథలు ఉద్దీప్తం చేశాయి. నాగిరెడ్డి-చక్రపాణిగార్ల మహాసంకల్పం, కుటుంబరావు గారి అద్వితీయ -గాంధీ గారి-శైలి చందమామ కథలకు తిరుగులేని విజయాన్నందించింది. ఆ కథల అమృత ధారలలో దశాబ్దాలుగా ఓలలాడుతూ వస్తున్న వారు చందమామ కథాశ్రవణాన్ని తమ తదనంతర తరాల వారికి కూడా అందిస్తూ ఒక మహత్తర సంస్కృతిని కొనసాగిస్తూ వస్తున్నారు.

మారుతున్న కాలం, మారుతున్న తరాలు, పిల్లల అభిరుచులకు అనుగుణంగా దశ, దిశలు రెండింటినీ మార్చుకోవాలని ప్రయత్నిస్తున్న చందమామను వెనక్కి పట్టి లాగి మూలం నుంచి పక్కకు పోవద్దని హెచ్చరిస్తూ, ధ్వజమెత్తుతూ, దూషిస్తూ కూడా చందమామ సారాన్ని నిలబెట్టుకోవాలని తపన పడుతున్న పాఠకుల వంటి వారు మరే భారతీయ పత్రికకూ కూడా లేరు.

యాజమాన్యం చేతులు మారినా చందమామ మూల రూపం మారితే సహించబోమంటూ నిరసన తెలుపుతూ, ఉత్తరాలు, ఫోన్లు, ఈమెయిళ్లు, ఎస్ఎమ్ఎస్ ల ద్వారా అలుపెరుగని పోరాటం చేస్తున్న అరుదైన పాఠకులు చందమామకు తప్ప ప్రపంచంలో మరే పత్రికకు కూడా లేరని చెప్పవచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే చందమామ దాని సంస్థాపకుల ‘చందమామ’ కాదు. దాని యజమానుల ‘చందమామ’ కాదు. అది ప్రజల ‘చందమామ’. పాఠకుల ‘చందమామ’. అభిమానుల ‘చందమామ’. ‘చందమామ పిచ్చోళ్లు’ అనిపించుకోవడానికి కూడా సిద్ధపడిపోయిన వీరాభిమానుల చందమామ.

ఆకాశానికీ చందమామకీ ఉన్న అనుబంధం ఎలాంటిదో, చందమామ పాఠకుల బాల్యానికీ, చందమామ పత్రికకు ఉన్న అనుబంధం అలాంటిది. వెన్నెల కోసం ఎదురు చూసినట్లు, పౌర్ణమి కోసం ఎదురు చూసినట్లు చందమామ కథల కోసం వేలాది, లక్షలాది పాఠకులు ఎదురు చూసేవారు.

“చందమామ నా ప్రాణనేస్తం. అమ్మ తన చిన్నప్పుడు చందమామ, తోకచుక్క, పాతాళదుర్గం, చదువుతూ పెరిగింది. నేను అక్క, అన్న, చందమామ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూసేవాళ్లం.” అంటూ నాలుగైదు తరాలుగా పిల్లలు చందమామతో తమ అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు.

 

చందమామ కథల గొప్పతనం

చందమామ పత్రిక ఎందుకింత ఘనతర చరిత్రను సంపాదించుకుంది అంటే ఒక్కముక్కలో చెప్పలేం.

– ప్రపంచ సాహిత్యాన్ని చిన్నారి పాఠకులకు పటిక బెల్లంలా పంచిపెట్టింది చందమామ.

– పంచతంత్ర కథల్ని పంచభక్ష్య పరమాన్నాల్లా వండి వడ్డించింది చందమామ.

-ఊహలకు రెక్కలు తొడిగిన అద్భుత చిత్రాలతో కోట్లాదిమందిని మంత్రముగ్ధులను చేసింది చందమామ.

– నీతిమార్గం ఏమిటో, నైతిక జీవితాన్ని ఎలా గడపాలో మనోరంజకంగా తెలియజేసిన అద్భుత కళావాస్తవాల గని చందమామ .

– పసిపిల్లలకు మంచి చెడులు నేర్పుతూ నీతిముద్దలు పెడుతుంది “చందమామ’.

– జీవితంలో అనేక అనుభవాలు చవి చూచిన పెద్దవాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చదువుకోవాలనిపించే తరహా కథలను అందించింది చందమామ.

– చిన్నపిల్లలతోపాటుగా పెద్దలకూ మానవత్వపు విలువలను, మంచితనాన్నీ, సద్గుణాలనూ గుర్తుచేసే పత్రిక చందమామ.

– విక్రమార్కుడి కథల దగ్గర్నుంచీ, మర్యాద రామన్న కథల వరకు ప్రతి కథలో నీతిని తేనెలో తియ్యదనంలా రంగరించి అందించింది చందమామ.

– పిల్లలు నిద్రలోనూ కలవరించి, పలవరించిన మెగా సీరియల్స్ -తోకచుక్క, మకరదేవత, ముగ్గురు మాంత్రికులు వగైరా… లను అందించింది చందమామ.

– యాభైయ్యారు సంవత్సరాలుగా బేతాళుడిని చెట్టెక్కిస్తూ, దింపుతూ రికార్డు సృష్టించింది చందమామ.

– దయ్యాలనూ, భూతాలనూ పిల్లల ప్రియ నేస్తాలుగా మార్చింది చందమామ.

– మూఢవిశ్వాసాల ఉనికిని గుర్తిస్తూనే హేతువాదాన్ని తరాల పాఠకులకు బోధిస్తూ వచ్చింది చందమామ.

– దయ్యాలు, భూతాలు, భయంకర రాక్షసుల నడుమ మనిషికి, మానవ ప్రయత్నానికే గెలుపు అందించింది చందమామ.

– పన్నెండు భాషల్లో పిల్లలూ, పెద్దలూ పోటీలు పడి, దాచుకుని, దాచుకుని చదువుతున్న ఏకైక కథల పత్రిక చందమామ.

– టెలివిజన్, వీడియో ఆటలు, కార్టూన్ నెట్‌వర్క్‌లూ మొదలైనవి లేని రోజుల్లో, పిల్లలకు వినోదాత్మకమూ, విజ్ఞానదాయకమూ అయిన కాలక్షేపంగా నిలిచింది చందమామ.

– ప్రపంచ సాహిత్యంలోని గొప్ప అంశాలు, విశిష్టమైన రచనలు, మహా పురాణాలు, అద్భుత కావ్యగాథలూ, నాటకాలు అన్నిటినీ కథలుగా మార్చి అందించింది చందమామ.

– 60 ఏళ్ల సంచికలను పూర్తిగా ఆన్‌లైన్‌లో అన్ని భాషల పాఠకులకు ఉచితంగా అందిస్తోంది చందమామ

– అనితరసాధ్యమైన శైలిని, ఒరవడిని సృష్టించుకుని దశాబ్దాలుగా కొనసాగిస్తున్న అరుదైన పత్రిక చందమామ.

చదవడం అన్నది ఉన్నంతవరకు చందమామ వంటి పత్రికల అవసరం ఉండితీరుతుందని పెద్దల ఉవాచ.

 

చందమామను ఇంతవరకూ చూడలేదా..! చదవలేదా.. !!

అయితే ఇప్పుడే చూడండి… ఇప్పుడే  చదవండి… మీ స్వంత భాషలో… 12 భారతీయ భాషల్లో…

భారతీయ సాంస్కృతిక వారసత్వం చందమామ. అది మీదీ, మాదీ, మనందరిదీ…

‘చందమామ కథ’ చదువుదాం రండి.

 

 

5 thoughts on “‘చందమామ’ విజయగాథ

    1. 1947 నుంచి 2006 వరకు 60 ఏళ్ల చందమామ కథలను ఆన్‌లైన్‌లో కింది లింకును తెరిచి చదువుకోవచ్చు. సంవత్సరం, మీ భాష, నెల ఎంపికలను ఎంచుకుని మీక్కావలసిన చందమామలను మీరు కిందిలో చూడవచ్చు. 2010 వరకు చందమామలను ఆన్‌లైన్‌ ఆర్కైవ్స్‌లో ఉంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

      http://chandamama.com/archive/TEL/storyArchive.htm

  1. పాత కాలం ఎప్పటికప్పుడు గొప్పగానే కనిపిస్తుంది. కాని ప్రస్తుతం ఆ “గతం” తో పోలిస్తే తేలిపోతూ ఉంటుంది, చందమామ ఒకప్పుడు మంచి పత్రిక, రెండు మూడు తరాల పిల్లల ఆలోచనా సరళిని ప్రభావితం చేసిన పత్రిక. కొడవటిగంటి కుటుంబరావుగారు సంపాదకత్వం ఉన్నన్నాళ్ళూ పత్రిక బాగా నడిచింది. ఒక్కోరోక్కరే పెద్ద వాళ్ళు, శ్రీ చక్రపాణి, శ్రీ చిత్రా, శ్రీ కొడవటిగంటి కుటుంబరావు, శ్రీ వపా , వెళ్లిపోవటంతో పత్రిక ప్రాభవం తగ్గుముఖం పట్టింది.

    ఇప్పుడు అదే పేరుతొ వస్తున్నా, అలనాటి “మెరుపు” పత్రికలో లేదు. ఇప్పటికీ ముఖ చిత్రం గీయటానికి సవ్యమైన చిత్రకారుని తెచ్చుకోలేక పోయింది.

    అప్పుడెప్పుడో అద్భుతాలు అనుకోవటం బాగానే ఉన్నది కాని, ఇప్పటి రోజున కూడా మంచి బొమ్మలతో చందమామ రావాలని అలనాటి చందమామ ప్రియుల ఆకాంక్ష. ఎప్పటికప్పుడు ఆ పాత బొమ్మలనే కాపీ చెయ్యటం, పాత దారావాహికలనే మళ్ళి మళ్ళి వెయ్యటం చూస్తుంటే, చందమామ ఇంత కంటే ఏమీ చెయ్యలేదా అనిపిస్తున్నది. కొత్త జవ జీవాలు పత్రికలో రావాలి. ఉట్టి మానేజిమెంట్ సిద్ధాంతాలు పత్రికను నడపలేవు. పత్రికను నడిపేది సృజనాత్మకత. అది తెలుసుకోవాలి ఈ నాటి యాజమాన్యం.

  2. ధన్యవాదాలు లలితగారూ,
    “…నమ్మే విలువలని, ఆచరించే విలువలని, ఆశించే విషయాలనీ చెప్పే పెద్ద వారికి మల్లే కల్మషం లేకుండా చెప్పగలగడం, అలా చెప్పడాన్ని ఏళ్ళ తరబడి కొనసాగించడం, ఇటువంటివన్నీ ఒక ఫార్ములాలో ఇమడని విషయాలు. నిరంతర ప్రయాసతోనే సాధ్యమయ్యే విషయాలు.”

    మీ వ్యాఖ్య అక్షరసత్యం. అజరామరమైన 12 జానపద సీరియల్స్‌తో చందమామ చరిత్రను ఉద్దీప్తంచేసిన దాసరి సుబ్రహ్మణ్యం గారు, జీవితం చివరి క్షణాలవరకు చందమామను ఇతర పత్రికలతో పోల్చి చూస్తూ వచ్చారు. ప్రతి పేజీలో బొమ్మ.. స్కేల్‌పెట్టి కొలిచినట్లు పేజీ చివరలోనే కథ ముగియడం.. 12 బాషలలో తొలి పుటనుంచి చివరి పుటవరకు ఒక్క పేజీ కూడా మారకుండా ఒకే రూపంలో దశాబ్దాలు కొనసాగడం..ఒక రచయిత కథ ఒకే నెలలో 12 భాషలలో అచ్చుకావడం.. పత్రికల చరిత్రలో ఇదొక అరుదైన ఘటన అంటూ దాసరి గారు ఒక సందర్భంలో చెప్పారు. చందమామ ఫార్మాట్‌ని ఏ ఇతర పత్రిక కూడా అనుకరించలేకపోవడమే చందమామ విజయం అని దాసరి గారి అభిప్రాయం.. ఈ కోణంలో చందమామను అధిగమించే పత్రిక సమీప భవిష్యత్తులో కూడా లేదని ఆయన 2008లో రాసిన ఓ లేఖలో చెప్పారు.

    1950 నుంచి 80 వరకు చందమామ అందించిన అనితరసాధ్యమైన నాణ్యతను ఇప్పుడు అందించలేకపోయినా పాఠకులు, అభిమానులు తమకే సాధ్యమైన సహన భావంతో చందమామను అభిమానిస్తున్నారు. నిర్వహణలో అనుకోకుండా వస్తున్న లోపాలను సహిస్తూనే, విమర్శిస్తూనే, ఎత్తిచూపుతూనే… చందమామ ఉన్నతిని కోరుకుంటున్నారు. సహస్ర చంద్రదర్శనాలను చూసిన మాన్య వృద్ధులు చందమామను చదువుతూనే సెలవు తీసుకోవాలనే కోరికను భావోద్వేగంతో ప్రకటిస్తున్నారు. తరతరాలుగా భారతీయ కుటుంబాలను చందమామ పరామర్శిస్తూ వెలుగుతుందంటే ఈ అలనాటి వృద్ధులు పంచిపెట్టిన కథామృత రూపంలోని అభిమానమే ఏకైక కారణం.

    చందమామ పట్ల పిల్లలు, పెద్దలు, వృద్ధులు దశాబ్దాలుగా చూపుతూ వస్తున్న ఈ నిర్మల ప్రేమాభిమానమే పత్రికకు ఈనాటికీ జీవం పోస్తోంది. చందమామ నిర్వహణలో వస్తున్న అనివార్య లోపాలను అదే ప్రేమతో సహిస్తోంది.

    లలితగారూ, చందమామతో సంబంధాన్ని మీరు పరాయిదేశంలో ఉంటూ కూడా కొనసాగిస్తున్నారు. రెండేళ్లుగా చందమామకు అనువాద రూపంలో విశిష్ట సేవలందిస్తున్నారు. విదేశంలో ఉంటూ కూడా మీ పిల్లలు తెలుగుకు దూరం కాకుండా తల్లిదండ్రులుగా మీరు శతథా ప్రయత్నిస్తున్నారు. కుటుంబాలకు కుటుంబాలు దీర్ఘకాలంగా కొనసాగిస్తున్న ఈ అఖండ బంధమే చందమామ ఉనికిని ఇంకా కాపాడుతోంది.

    మీలాంటి అభిమానుల సాక్షిగా, భారతీయ కుటుంబాల నిర్మల ప్రేమ సాక్షిగా చందమామ కొనసాగుతుందని, కథా వెన్నెలలు వెదజల్లుతుందని ఆశిస్తున్నాము.

  3. చందమామకు పాఠకుల మనసుల్లో అటువంటి స్థానం ఎందుకు కలిగిందో అన్నది మాటల్లో పెట్టగలిగేది కాదు. పాత చందమామలు తిరగేస్తుంటే మళ్ళీ మళ్ళీ చదువుతుంటే ఆ సారం తిన్నగా మనసుకి అర్థం కావలిసిందే. చందమామలో కథలు ప్రచురింపబడుతున్నాయన్న ఆనందం కంటే నేను అభిమానించే కథల ప్రమాణాలకి తగ్గట్టుగా నేను రాస్తూ ఉండగలగాలంటే నేను ఏం చెయ్యాలి అన్న ప్రశ్నే నన్ను ఎక్కువ వెంటాడుతుంటుంది.
    మీ వ్యాసంలో మీరిచ్చిన పాయింట్లు నాకు కావలిసిన సమాధానానికి ఒక starting point.
    నాణ్యత: భాషలో, బొమ్మల్లో, పిల్లలని ఆలోచింపచేసే తీరులో … ఆత్మీయంగా తన వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకుని తను నిజాయితీగా నమ్మే విలువలని, ఆచరించే విలువలని, ఆశించే విషయాలనీ చెప్పే పెద్ద వారికి మల్లే కల్మషం లేకుండా చెప్పగలగడం, అలా చెప్పడాన్ని ఏళ్ళ తరబడి కొనసాగించడం, ఇటువంటివన్నీ ఒక ఫార్ములాలో ఇమడని విషయాలు. నిరంతర ప్రయాసతోనే సాధ్యమయ్యే విషయాలు. మరీ అమాయకత్వాన్ని కూడ నింపుకోలేదు ఈ కథలు. నిజానికి పంచతంత్రం కథలలాగానే మనుషుల్లోని వైవిధ్యాలనీ, లోకం తీరునీ తెలివిగా తెలియజేయగలగడమే చందమామ కథల గొప్పతనం.
    ఆ నాణ్యతను ఇప్పటికీ డిమాండు చేసే పాఠకులతో పాటు, ఆ జ్ఞాపకాల మూలంగా ఇప్పటికీ పత్రికని ఆదరించే ఆ తరం వారితో పాటు ఆ కథలు చదువుతూ పెరిగి తాము నేర్చుకున్న జీవిత పాఠాలను, తమ తరువాతి తరం వారికి తాము అందించాలనుకున్న ఆలోచనలను అదే నిజాయితీతో రాసే రచయితలూ, వాటికి రూపమివ్వగలిగే చిత్రకారులూ, చందమామ పత్రికను నడుపుతున్నది నిజానికి పాఠకులు, వారి expectations, ఆ పత్రికకి ప్రాణం పోసేది ఆర్టిస్టులతో సహా పత్రికను తీర్చిదిద్దే బృందం అనీ, తామొక గొప్ప వారసత్వాన్ని బాధ్యతాయుతంగా కొనసాగించాలి అని తెలుసుకున్న యాజమన్యమూ కలిసి ఈ పత్రికను చిరకాలం స్థాపకుల సంకల్పం ప్రకారం, మారుతున్న కాలంలో మారని విలువలకి ప్రతీకగా కొనసాగించాలనీ ప్రతి చందమామ అభిమాని ఆశ అనిపిస్తుంది

Leave a Reply to రాజశేఖర రాజు Cancel reply

Your email address will not be published. Required fields are marked *