March 19, 2024

గురజాడ అంతరంగ నివేదనే – మధురవాణి పాత్ర

రచన :  మన్నె సత్యనారాయణ

 

గతచరిత్రలోని అంధకారాన్ని చీల్చుకుంటూ ఒక సూర్యుడుదయించాడు! మేలుకొలుపులు కోడి కూసింది.‘తూర్పు’బలబల తెలవారింది. అప్పటి విశాఖ మండలం, ఎస్.రాయవరం గ్రామంలో గొడవర్తి కృష్ణయ్య పంతులుగారింట్లో, వారి కుమార్తె కౌశల్యమ్మ ఒక ‘చిన్న మగవానిని’కన్నది. ఆ రోజు 21, సెప్టెంబరు, 1862వతేదీ ఆదివారం అభిజిత్ ముహూర్తం, మఖా నక్షత్రం జన్మకాల కేతు మహర్దశ. అది దుందుభినామ సంవత్సరం, భాద్రపదమాసం. కౌసల్యమ్మ భర్త గురజాడ వెంకట రామదాసు.

 

ఆరోజు ఉదయించిన చిన్ని సూర్యుడే గురజాడ వెంకట అప్పారావు. రాయల సామ్రాజ్యకాలంనాటి తెలుగు సాహిత్య ప్రక్రియ అప్పటికింకా కొనసాగుతున్నది. ప్రక్రియ కొనసాగుతున్నది కాని, ఆనాటి ప్రభందమహాకవులు చాటుకున్నాక, వారితోనే కవితారచనలో ఔచిత్యవివేకాలూ కను మరుగై పోయాయి . నాయకరాజుల కాలం తెలుగుసాహిత్యానికి సంధ్యాకాలం! నీతులూ బూతులూ కలగలిసి పోతున్నాయని కవి చౌడప్ప మొత్తుకున్నాడు. సామాజిక స్పృహను గాలికి వదిలి వ్యక్తిగత విషయ వాంచాపరత్వాన్ని సాహిత్యంలోనికి చొప్పించారు. నాయకరాజ యుగం క్షీణయుగానికి

దారిచూపింది.

 

గురజాడ అప్పారావు పుట్టి బట్టకట్టిననాటికి, జనజీవన సంస్కారంలో ఇది ఒక పెడ. మరో పెడ సామాజిక వ్య్వవస్థ దౌర్బల్యాలతో, రుగ్మతలతో బలహీనపడి శిధిలమవుతున్నది. మతం సాంప్రదాయాల పేరుతో, నీతి ధర్మాల పేరుతో స్త్రీలయొక్క మౌలిక జీవితహక్కులే పరిహరించబడ్డాయి. పురుషుని యొక్క అదనపుభోగం కోసం, కొందరు స్త్రీలు ‘భోగంకులం’గా

నిర్ణయించబడ్డారు. అంటే విశృంఖల అవినీతిని , సమాజపరంగా చట్టబద్దం చేసారన్నమాట!

 

బాల్యవివాహాలు, వితంతువివాహ నిషేధం, కన్యాశుల్కము వంటి సాంఘిక దురాచారాలు

స్త్రీ జీవితాన్ని అభాగ్యం చేసివేసాయి. డబ్బుకాశపడి, కన్నబిడ్డలనే ప్రేమకూడా లేకుండా కన్యాశులము తీసుకుని చిన్న ఆడపిల్లని కూడా వయసుమీరిన వాళ్ల కిచ్చిచేసేవారు. వయసు మీరి వీరు చనిపోతే, వయసులో ఉన్న ఈ బాల్యవితంతువులకు  పునర్వివాహం నిషేదించారు. దీనినే ‘రక్తమాంసాల విక్రయం’అన్నారు వీరేశలింగం పంతులు. వీటికి తోడు మూఢనమ్మకాలు, అవిద్య, కర్మ సిద్ధాంతం పేరుతో నిష్క్రియాపరత్వం ఎక్కువయ్యాయి.

 

ఆ కాలంలోని కొందరు మేధావులూ,సంస్కర్తలూ ఈ అవ్యవస్థమీద తిరుగుబాటు చేసారు. ఈ పోరాటంలో వీరు సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమాన్ని సామాజిక సంస్కరణోద్యమంతో అనుసంధానపరచి అవిశ్రాంతంగా పోరాడారు. ఆ కాలంలోని కొందరు మేధావులూ, సంస్కర్తలూ ఈ అవ్యవస్థమీద తిరుగుబాటు చేసారు. ఈ పోరాటంలో వీరు సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమాన్ని సామాజిక సంస్కరణోద్యమంతో అనుసంధానపరచి అవిశ్రాంతంగా పోరాడారు.

 

కన్యాశుల్కం వివాహ పద్దతిలో జరిగిన పెళ్ళిళ్ళలపై విశాఖమండలంలో విజయనగర సంస్థానాధీశుడు ఆనందగజపతి మహారాజు 1880 ప్రాంతంలో ఒక సర్వే జరిపించారు. కన్యాశుల్కపద్దతి వివాహం ధర్మశాస్త్ర బద్దమో కాదో చెప్పమని ఆనందగజపతి కాశీలోని పండితులను కోరారు. నాగేశ్వరశర్మ, గంగాధరశాస్త్రి, భవానీదత్త  దీక్షితుడు, కైలాస చంద్రభట్టాచార్య, శీతలాప్రసాద్ పండిత్, రామమిశ్రా శాస్త్రి, సుధాకర ద్వివేది, శివకుమార్ మిశ్రా మొదలైన పధ్నాలుగుమంది కాశీపండితులు ఈ విషయంపై చర్చ జరిపి ఆయనకు నిరూపిత పత్రాన్ని సమర్పించారు.

 

“కన్యాశుల్కం గ్రహణే దోష నిర్ణయం:కాశీస్థ పండితైర్ని రూపిత:’ అని ఒక పత్రాన్ని వారు సమర్పించారు.  వారు తేల్చి చెప్పినదేమంటే,”……… అందువలన శాస్త్రం నిర్ణయించిన దానికంటే అధికధనం స్వీకరిస్తే కన్యావిక్రయ దోషం తప్పదు కాబట్టి అది అధర్మమే అవుతుంది’అని. సాహిత్యమూ,  సమాజమూ ఇటువంటి దిగజారిన స్థితిలో వున్న సమయంలో, అప్పారావు గారు కన్యాశుల్కము నాటకమూ. ఇతర రచనల ద్వారా సాహిత్యాన్నీ, సమాజాన్నీ కూడా నూతనమార్గములో నడిపించడానికి ప్రయత్నం చేసారు.

‘కన్యాశుల్కము’ నాటకంలో పాత్రలన్నీ వేటికవే ముఖ్యమైనవి. అయితే, మధురవాణి పాత్ర ఆధునిక తెలుగుసాహిత్యానికి లభించిన ఆణిముత్యం లాంటిది! 1892లో ప్రదర్శించిన కన్యాశుల్కము నాటకాన్ని,1897లో ప్రచురించారు.ఇది మొదటి కూర్పు. దీనిలో మధురవాణి పాత్రకంత ప్రాధాన్యం లేదు. కాని,1909లో అప్పారావుగారు తిరగవ్రాసి ప్రచురించిన ‘కన్యాశుల్కము’రెండవకూర్పులోని మధురవాణి తెలివైనది, వ్యవహారశీలి, మానవతాదృక్పథం కలది. “అనన్యసామాన్యమైన అతిసజీవ అధ్భుతపాత్రను అప్పారావుగారు ఆంధ్రసాహిత్యంలో ఆచంద్రార్కం నిలపగలిగారు”అని మధురవాణి గురించి ఆరుద్రగారన్నారు. తాను గడుపుతున్న వేశ్యావృత్తిలోని హైన్యతను గుర్తించి తన్నుతాను సంస్కరించుకోవడమే కాకుండా చివరకు స్తితప్రజ్ఞురాలైన వ్యక్తిగా మనకు తోస్తుంది. ఏ వ్యక్తిత్వాల పరిశీలనా, ఏ జీవితానుభవాల సారమూ గురజాడ చేత ఈ పాత్రను సృష్టింపజేసాయో తెలుసుకోవడం అవసరం.

 

అప్పారావు గారి కాలంలో మేధావులూ, విద్యావంతులు,  వేశ్యానిర్మూలనోద్యమాన్ని నడిపేవారు. దీనినే ‘యాంటీ నాచ్’ఉద్యమం’అనేవారు. కానీ, వీరు ఒకవైపు వేశ్యలను అసహ్యించుకుంటూనే వుండేవారు. అందుకే వారి వాదనలను గిరీశంలాంటి  పాత్రలద్వారా పరిహసించారాయన. వేశ్యావృత్తిని నిర్మూలించాలనే ముందు, వేశ్యలను మానవతాదృష్టితో గౌరవించడం నేర్చుకొమ్మన్నారాయన.

 

కన్యాశుల్కము నాటకంలో ” వేశ్యలు విద్యలు నేర్చి ఇతర వృత్తుల వల్ల సత్కాలక్షేపం చేయరాదా? ” అని సౌజన్యారావు పంతులంటే,”అట్లా చేస్తే తమవంటివారు వాళ్ళనువివాహమాడతారా?” అని వెంటనే మధురవాణి ప్రశ్నిస్తుంది.”వేశ్యలము దేవాలములో భగవంతుని చూడడానికి పోవచ్చును గదా! సత్పురుషులైన మీవంటివారి దర్శనమునకు మాత్రం నిరోధమా?” అని అడుగుతుంది.” … శ్రీకృష్ణుడు సానిదానితో కూడా స్నేహం కడతాడా?… శ్రీకృష్ణుడు యాంటీనాచ్ కాడా అండీ?” అని మధురవాణి వేసిన ప్రశ్నలా ‘యాంటీనాచ్’సౌజన్యారావు పంతులు యొక్క అంతరంగాన్ని కుదిపివేసాయి! వాటికి సమాధానం నిరుత్తరమే!

 

గురుజాడ రాసిన “స్టూపింగ్ టురైజ్”అనే ఆంగ్లకథలో కూడా ఉన్నతభావోద్రేకీ, సంఘ సంస్కరణోత్సాహీ, ఆయన రంగనాథయ్యరు అనే ప్రొఫెసరు సరళ అనే వేశ్యయువతిని సంస్కరిద్దామనుకుంటాడు. ఆమె ఇంటికెళతాడు. అతని ఉద్భోదకామే,”….నాజీవితం మీద నాకే అసహ్యంగా వుండి.ఛి,ఛీ! నన్నీ మురికికూపంనుండి బయటకు తీసుకుపోరూ!నన్ను కనికరించి ప్రభోధించండి. మీతో ప్రపంచపు చివరికైనా పయనించి వస్తాను.రక్షించండి”అని వేడుకుంటుంది. తనతో ప్రపంచపు చివరికైనా పయనించి వస్తే, చేయందించి, తానామెను నడిపించుకుని వెళ్ళగలడా? సమాధానం ప్రొఫెసరుకు లేదు.

అందుకు పరిశుద్ధ లక్ష్యంలేని సంస్కరణవాదులను పరిహసించారు అప్పారావుగారు. 1906లో ‘కొండుభట్టీయం’ అనే అసంపూర్ణనాటకం వ్రాశారు. ఆనాటకంలో మంజువాణి వేశ్యపాత్ర. ఆమె తప్పనిసరై వేశ్యగా వుంటుంది. కాని ఆమెకా వృత్తి మీద ఏహ్యభావం వుంటుంది.ఎలాగోలా దాన్నుంచి బైటపడాలనుకుంటుంది. ఈమెలో పెంకితనం వుంది. మానుషం, మానవత్వమూ వున్నాయి కాని ఈమెలో వ్యవహారజ్ఞానం లేదు, మేధస్సు తక్కువ.

 

‘స్టూపింగ్ టు రైజ్’అనే కథలోని సరళలో ఉత్తమసంస్కారం వుంది. కాని ఈమెలో వ్యవహారత, మేధాపరిణితీ లేవు. మంచితనం, మానవత్వం, వ్యవహారత కలిగిన పాత్ర కన్యాశుల్కము రెండవకూర్పులోని మధురవాణి! వరుసగా – మొదటి కూర్పులోని మధురవాణి, కొండుభట్టీయంలోని మంజువాణి, ఆంగ్లకథలోని సరళ,రెండవకూర్పులో పుట్టిన మధురవాణి మహోన్నతపాత్ర అప్పారావుగారిలోని ఆలోచనాక్రమంలోని భావపరిణితిని తెలియజేస్తాయి. కన్యాశుల్కము రెండు కూర్పులలోని మధురవాణిపాత్రల చిత్రణల మధ్యకాలంలో అప్పారావుగారికి కలిగిన అనుభవాలు, జీవితపరిజ్ఞానమూ ఆయన రచనలమీద ప్రభావము చూపాయి.

 

ఆనందగజపతికి రామస్వామి అనే ఇష్టసఖి వుండేది. ఈ విషయం అప్పారావుగారికిష్టం

వుండేదికాదు.”… ఉత్తముడైన ఆనందరాజు ఈ పనెందుకు చేసారు?..”అని తన డైరీలొ వ్రాసుకున్నారాయన. రామస్వామిపై మొదట్లో ఆయనకు సదభిప్రాయ ముండేదికాదు. రామస్వామి చాలా పెంకిగా వుండేది. సాత్వికుడైన మహారాజు సహనానికే పరీక్షగా నిలిచిందామె. రామస్వామి కెన్నో విధాల నచ్చచెప్పారు అప్పారావుగారు .ఒకసారి రామస్వామికి జబ్బు చేసింది. ఆనందగజపతి చెన్నపట్నం నుండి డాక్టర్ని రప్పించారు. ఆమె ఆరోగ్యం కాస్త మెరుగైంది. ఇంతలో ఒకరోజున

డాక్టరుతో సహాయనిరాకరణ ప్రారంభించింది.మందులు వేసుకోనంది. ఆనందగజపతి వచ్చి స్వయంగా తన చేతులతో మందులిస్తేనే వేసుకుంటానంది. మామూలుగా ఆయన్ని కలవాల్సి వచ్చినప్పుడు, ఆవిడే కోటకు వెళుతూ వుంటుంది. ఆయనెప్పుడూ ఆవిడింటికి రాడు. ఇది సాధ్యమా? మహారాజు ఈ సామాన్యగృహానికి, ఈ వేశ్యఇంటికి వస్తారా? అని సంస్థాన ఉన్నతోద్యోగులు  భయపడ్డారు. ఆమె ‘డిమాండు’ను మహారాజుతో చెప్పాడానికి కూడా వారు సాహసించలేదు.

 

ఈసంగతి రెండురోజుల తర్వాత ఆనందగజపతికి తెలిసింది. ఆయన అప్పారావుగారిని తీసుకుని రామస్వామి ఇంటికెళ్ళారు. స్వయంగా ఆయనే అక్కడికి రావడం అక్కడి వారందరికీ ఆశ్చర్యమే! వైద్యుని దగ్గర్నుండి మందులుతీసుకుని ఆనందగజపతి ఆమె నోటికి మందులందించారు. అక్కడున్న వారంతా బయటకు వెళ్ళిపోయారు. అప్పారావుగారిని మాత్రం అక్కడే వుండమని కోరిందామె. సజల నయనాలతో ఆమె రెండుచేతులూ జోడించి ఆనందగజపతికి నమస్కరించి అన్నది, “అయ్యా, నేను కావాలని వేశ్యాకులంలో పుట్టానా? కోరుకుని పుట్టే అవకాశమే వుంటే నేనీ కులంలో పుడతానా? అందరు స్త్రీలవలెనే నేనుకూడా పెళ్ళిచేసుకుని  మగనాలిగా భర్తతోకాపురం చేసుకుంటూ సంతోషంగా బ్రతకాలనుంది. కాని అది సాధ్యం కాదని నాకు తెలుసు. నేను కోరుకుంది గౌరవప్రదమైన జీవితాన్నే కాని, ఈసమాజం నాకు దాన్ని అందకుండా చేసింది. అందుకే, నాలోని ఉక్రోషం బయటపడి, ఒక్కోసారలా పెడసరంగా మాట్లాడుతుంటాను…. మీతో నాకు సాంగత్యమయ్యాక, మరోపురుషుడ్ని ఎరుగను. ఈ సమాజం ఒప్పుకోకపోయినా, మీరు మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోయినా,మిమ్మల్నే నా భర్తగా భావిస్తున్నాను. అనారోగ్యసమయంలో భర్త భార్య దగ్గరుంటారు. కానీ, నాదగ్గరెవరుంటారు! అందుకే మీరు రావాలని కోరాను. నాయందు దయతలచో, ప్రేమతోనో మీరొచ్చారు. ఇప్పుడు నా ప్రక్కనే వున్నారు. ఈ ఒక్క  క్షణంచాలు నా బ్రతుకు పండిదనుకుంటాను”అని తన అంతరంగంలోని వేదనను చెప్పింది.

 

నవ్యాంధ్ర సాహితీ వైతాళికుడైన  అప్పారావుగారి మనసును ఆ  సంఘటన కరుణతో నింపింది!భావోద్దీపనతో ప్రభావితం చేసింది. రామస్వామిని మొదట్లో ఏవగించుకుని తప్పుచేసానని అప్పారావు కనిపించింది. ఆమె జీవితప రిస్థితులు వేరు. ఆ పరిస్థితుల ప్రతిస్పందనే ఆమె ప్రవర్తన అని ఆయనకర్థమైంది. జాలికి మించిన మేలు గుణంలేదంటారు! ఆమెకేదో నేర్పబోయి, తానెంతో నేర్చుకున్నారు అప్పారావుగారు”….నిజానికి గత అయిదారు సంవత్సరాలలో నాకు కొత్తకొత్త అనుభవాలు కలిగి జీవితపరిజ్ఞానం అధికమయ్యింది. జీవితానుభవాలు, వైవిధ్యం, అనుభూతులూ నాకొక నూతన దృష్టిని కలిగించాయి.”అని ఆయన డైరీలో వ్రాసుకున్నారు.

 

స్త్రీ అంతరంగంలోని మౌనవిప్లవాన్ని జీవభాషలో పైకి చెప్పింది, సమాజపు ఆలోచనను జాగృతం చేసిన మొదటి వ్యక్తి గురజాడ! వైవిధ్యభరితమైన మానవ జీవితాన్ని”గంభీరమైనదిగానే భావించి”, దాని వివిధాంగాలనూ సమభావంతోనే పరిశీలించి, అత్యున్నతమైన నైపుణ్యంతో జీవితాన్ని తన రచనల్లో చిత్రించారాయన! మానవత్వాన్ని విస్మరించి ఏతత్వాన్నీ ఆయన అంగీకరించలేదు. జీవితానుభవాలకు సంబంధం లేని ఏ సాహిత్యాన్నీ అయన గౌరవించలేదు. మన భావాలన్నీ కూడా, మన అంతర బాహ్య అనుభవాల నుంచి ఉత్పన్నమవుతూ వుంటాయన్నారాయన!

 

గురజాడ అప్పారావు రచయితమాత్రమే కాదు. తాత్వికుడు కూడా! ఆయన దర్శించిన

వాస్తవ జీవితతత్వాన్ని కన్యాశుల్కము నాటకం  ద్వారా, ముఖ్యంగా మధురవాణిపాత్ర ద్వారా,నివేదించారు!

“బ్రతికి చచ్చియు, ప్రజలకెవ్వడు

బ్రీతి కూర్చునొ, వాడె ధన్యుడు ”

 

ఇవి అప్పారావుగారి మాటలే. ఆయనమాటలు ఆయనకు వర్తిస్తాయి!

 

 

****************************************************************

 

 

2 thoughts on “గురజాడ అంతరంగ నివేదనే – మధురవాణి పాత్ర

  1. //నీతులూ బూతులూ కలగలిసి పోతున్నాయని కవి చౌడప్ప మొత్తుకున్నాడు.//
    బూతులతో శతకాన్ని రాసిన కవి చౌడప్ప, బూతు ఇంచుక లేకున్న దొరకు నవ్వు పుట్టదనీ వాటిని పొగిడినవాడే తప్ప మొత్తుకున్నవాడు కాదు. చక్కని వ్యాసాన్ని ఇటువంటి వ్యాఖ్యలతో పలుచన చేయకుండా విషయంలోకి దూకి గాఢంగా రాసుకుంటే మేలు కాదూ!

  2. “నవ్యాంధ్ర సాహితీ వైతాళికుడైన అప్పారావుగారి మనసును ఆ సంఘటన కరుణతో నింపింది!భావోద్దీపనతో ప్రభావితం చేసింది. రామస్వామిని మొదట్లో ఏవగించుకుని తప్పుచేసానని అప్పారావు కనిపించింది. ఆమె జీవితప రిస్థితులు వేరు. ఆ పరిస్థితుల ప్రతిస్పందనే ఆమె ప్రవర్తన అని ఆయనకర్థమైంది”
    ఇది ఆసక్తికరంగా ఉంది. వీరేశలింగం గారు, గురజాడ గారు ఇద్దరూ మనమెంతో గర్వించతగిన మహాపురుషులు. వారి జీవితమూ, రచనలూ తెలుసుకుని అర్థం చేసుకోవలసినదీ, నేర్చుకోవలసి అవసరం ఎంతైనా ఉంది. ఐతే వీరిద్దరి మధ్యా విభేదాలున్నట్లు అక్కడా అక్కడా చదివినప్పుడు ముందు బాధ వేసింది. తర్వాత ఇద్దరి గురించీ తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువైంది. నేను వీరి గురించి ఇంతవరకూ ఎక్కువగా తెలుస్కున్నది, చదివినది అంతర్జాలంలోనే. ఈ మధ్యే నా కుతూహలమూ, ఆసక్తీ ఎక్కువైనాయి కనుక.
    ఇంతకీ నేను చెప్పదల్చుకున్నది ఇది:
    పైన జరిగినది అని చెప్తున్న విషయాన్ని బట్టి బహుశా గురజాడ గారు తన ఆలోచనలలో, ఆ అనుభవం ద్వారా కలిగిన పరిణతికి ముందు ఉన్న ఆలోచనా ధోరణిని నిరసించారేమో, ఎవరినో వ్యక్తిగతంగా నిరసించారని ఎందుకనుకోవాలి? లేదా ఆ పరిణతి కలిగిన తర్వాతి తనలో ఇంతకు ముందు ఉన్న ఏవగింపులోని తప్పును తెలుసుకుని ఇటువంటి పరిణతి రావాలి మిగిలిన వారిలో కూడా అని ఉద్దేశించారేమో. ఇప్పుడు కాస్త స్పష్టత ఏర్పడుతోంది అందరూ సంఘ సంస్కరణకే పూనుకున్నా వారి ప్రత్యేక అనుభవాలు ప్రతి ఒక్కరిని కొద్ది తేడాలతో ప్రభావితం చేసి ఉండవచ్చు. సానుకూలంగా, సావకాశంగా ఆ తేడాలు చర్చించుకునే వాతావరణమూ, అవకాశమూ లేకనో లేక ప్రముఖ వ్యక్తులైనా వారి అభిప్రాయాల మీద నమ్మకంతో వారికున్న పట్టుదలల వలనో ఈ తేడాలు విభేదాల స్థాయికి చేరి ఉండ వచ్చు. లేదా తర్వాత తర్వాత విశ్లేషించే వారు ఈ తేడాలని తమ కోణంలోనుంచి అర్థం చేసుకుని విభేదాలుగా ఊహించి ఉండవచ్చు.
    ఏది ఏమైనా ఇటువంటి ప్రముఖులను కొన్ని మాటలలతో అతిశయోక్తులతో ‘అర్థం’ చేసేసుకోవడం కాకుండా వారి జీవితాలను జాగ్రత్తగా పరిశీలించడం అలవాటు చేసుకోవలసిన అవసరం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *