April 20, 2024

మొక్కగా వంగనిది

రచన : సోమంచి వినయభూషణరావు

 

పగలు 9గంటలౌతుంది.

ప్రొద్దున్నే 7గంటలమొదలు అంతవరకు ఇంటిముందు తోటలో తిరుగుతూ మొక్కల సంరక్షణ చూడ్టం చంద్రశేఖరం గారి దినచర్యలోని రెండవ అంశం.

తెల్లవారు ఝామునేలేచి కాలకృత్యాలు ముగించి యేదో ఒక గ్రంథం కాసేపు పఠించి కాసేపు ఆలోచనాసమాధిలో కాలం గడిపి, తూర్పున వెలుగు వెల్లవేసే సమయానికి సంధ్యావందనం’చేసుకుని, దేవతార్చన ముగించి తోటలోకి అడుగుపెడ్తే ఆతర్వాత యింట్లో అడుగుపెట్టి ఇల్లాలు సిద్ధంచేసిన భోజనంచేసి బడికి బయలుదేరటం.

వయసు నాలుగోయామం లోకి అడుగుపెడ్తుండగా మనిషికి మానసిక విశ్రాంతి, ఆధ్యాత్మిక చింతన చాలా అవసరం.  అంచేత ఏభై యేళ్ళు దాటిన ప్రతిమనిషీ ప్రాపంచిక విషయాసక్తిని కొంచెం కొంచెం వదుల్చుకుని కాస్త వేదాంతధోరణిలో పడ్తాడు. అయితే బాధ్యతలని పూర్తిగా విస్మరించే స్థితీకాదు. ఇటుకుటుంబ, సామాజిక విధులనీ నిర్వహిస్తుండాలి. చంద్రశేఖరంగారి స్థితి కూడా అదే. ఉద్యోగధర్మాన్ని, కుటుంబబాధ్యతలనీ విస్మరించకుండా తన వంతు కృషిచేస్తూనే తన మానసికానందం కోసం, ఆధ్యాత్మిక పురోగతికోసం ఈపనులు కూడా నిర్వర్తిస్తున్న యాభయ్ నాలుగేళ్ళ బడిపంతులు ఆయన.

ఇక ఉదయం పదిగంటలకి స్కూలు.బడిపంతులుగా ముప్ఫయ్ మూడేళ్ళ సర్వీసుని ఎవరూ వేలెత్తి చూపని విధంగా నిజాయితీగా నిర్వరిస్తూవస్తున్నారు.ఆయన చెప్పే పాఠాలు అర్థంకానివాడు ఆయన సలహా విని బాగుపడనివాడు లేడంటే అతిశయోక్తి అన్పిస్తుంది. స్వతహాగా  శాంతస్వభావులు. ధ్యానంలో కూర్చున్న శివునిలాగా తన దీక్షే తనది. అయితే ఎప్పుడన్నా శాంతం చెదిరి కోపం వచ్చిందంటే మూడో కన్ను తెరిచిన శివుడే. అయినా చంద్రశేఖరుడు కదా- త్వరగానే చల్లబడిపోతారు. అందుకే అందరికీ ఆయనంటే భయమూ భక్తీను. న్యాయానికి, ధర్మానికి ఖచ్చితంగా నిలబడేస్వభావం. నీతిమంతుడు.

ఇంకా తోటలో తిరుగుతుండగానే,”వంటయ్యింది, వడ్డిస్తున్నాను,రండి భోజనానికి.టైం అయినట్లుంది”, అని ఆయన భార్య పార్వతమ్మ కేకేసింది.”ఇదిగో వస్తున్నా”అంటూ ఇంట్లోకి దారితీసారు. ఎండలో ఆయన పల్చటి  జుట్టు వెండిలా మెరిసింది.

భోజనం చేస్తూ భార్యతో “అవునూ గొపీ ఏడీ?” అని అడిగారు.గోపి వాళ్ల ఏకైక సంతానం.

“ఏమోనండీ!పొద్దుననగా వెళ్ళినవాడు ఇంతవరకూ రాలేదు. స్నేహితుల వ్యవహారం  ఎక్కువైంది. పెరుగుతున్న కొద్దీ తిరుగుళ్ళు ఎక్కువవుతున్నాయి.నేను ఎంతపోరినా వినటం లేదు,” అందావిడ ఆవేదనగా.

ఆయన వెళ్ళిన పావుగంటకు గోపీ యింటికి వచ్చాడు.

పార్వతమ్మ గారు వాడికి అన్నం పెడుతూ,”ఏరా గోపీ,ఏమిటి ఈ తిరుగుళ్ళు. మీనాన్న ఊరుకుంటున్నారని ఎక్కువైపోతున్నాయి. నాన్నకి యింటా బయట ఎంత  పేరు! నువ్వు అది నిలబెట్టేలా కనబడటం లేదు. చెడ్దపేరు

వస్తే ఎంత అప్రదిష్ట. ఆయన నేను తలెత్తుకోగలమా?”అంది.

గోపి మాట్లాడలేదు.

అన్నం తిని స్కూలుకి బయలుదేరాడు.

“అమ్మయ్య,కాస్త ఆలస్యం అయినా స్కూలుకి  పంపగలిగాను.లేకపోతే ఆయన బాధ పడ్తారు,”అని సంతోషించింది తల్లి.అయితే పుస్తకాలు పట్టుకున్న గోపి గమ్యస్థానం స్కూలు కాదు.ఊరిబయట చిలకల తోట.అక్కడ పనీపాటా లేని రికామీ గాళ్లతో కాలక్షేపం.అలాగని రోజూ స్కూలు మానేసే వాడు  కాదు.వాడి దురదృష్టం తనస్కూలులోనే తండ్రిమాస్టర్ అవడంతో తనమీద ఆయన పర్యవేక్షణ,దృష్టి ఎప్పుడూ వుంటాయి.మధ్యమధ్య ఎగగొట్టి నమ్మకం కలిగే సాకులతో నడుపుకొస్తున్నాడు.దొంగకి జాగ్రత్త అవసరమైన ఆయుధం కదా!

 

* *      **                 **

 

సాయంత్రం స్కూలు నుంచి ఇంటికొచ్చిన చంద్రశేఖరం గారు కాళ్ళుకడుక్కుంటూ, గోపీ ఈ రోజు స్కూలులో కనబడలేదు.నువ్వు చెప్పి పంప లేదా?అసలు ఇంటికి వచ్చాడా”, అని అడిగారు. పార్వతమ్మ గారు ఆశ్చర్యపోయింది.”వచ్చాడు.అన్నం తిని పుస్తకాలు పట్తుకుని వెళ్ళాడే!స్కూలికి రాలేదా?ఏమైందో? అంది ఆవిడ.

చంద్రశేఖరంగారికి పొద్దున భార్య అన్నమాటలు జ్ఞాపకం వచ్చాయి. తను సహనంగా ఉండటం వల్ల గోపీ యిలా తయారవుతున్నాడా? కోపగించుకుని తొందరపడితే ఏమౌతుందో? మెల్లిగానే చెప్పాలి. మొండిబారిపోతే యింకేమీ చెయ్యలేడు.తనకింద చదువుకున్న పిల్లల్ని నెమ్మదిగా బోధించి మంచిమార్గంలో పెట్టాడు. మొండివెధవలు తగిలినప్పుడు వాళ్లని రకరకాల పద్ధతుల ద్వారా దారిలోకి తెచ్చాడు.అలాంటిది గోపీని మార్చలేకపోతాడా? అనుకున్నాడాయన. ‘కాస్త ఓపికపట్టాలి’

తోటలో తిరుగుతుండగా జ్ఞాపకం వచ్చింది.ఈ మధ్యనే ఒక కుర్రాడు స్కూల్లో కొత్తగా జేరాట్ట. ఇంకో సెక్షన్ లో ఉండేవాడు . చాలా మొండివాడుగా అవిధేయంగా ప్రవర్తిస్తుంటే స్కూలు నుండి పంపేద్దాం అనుకున్నారుట. అయితే వాళ్ల నాన్నగారు బాగా డబ్బూ పలుకుబడీ వున్నవాడట. అకుర్రాణ్ణి అన్ని స్కూళ్ళలో తిప్పి చివరికి తమస్కూలుకి పంపారుట. ఇక్కడ్నుంచీ పంపేస్తే వాడికి  యింక చదువబ్బక పాడైపోతాడని చివరి ఆలోచనగా చంద్రశేఖరం గారి సెక్షనులో వేసారు ఆయనవల్లే వాడు బాగుపడాలని. ఇదంతా హెడ్ మాస్టర్ తనను ప్రత్యేకించి  పిలిచి చెప్పారు. అలా చెబుతూ‘మీఅబ్బాయి గోపి స్కూలుకి సరిగా రాకపోయినా యింటిదగ్గర మీరు పాఠాలు చెప్పుకుంటారు. పరవాల్లేదు. అయినా యింతకు మునుపు లేదు. ఈమధ్యే వాడు బాగా మారాడు. కాస్త మందలించండి. ఇలా అన్నానని మరోలా అనుకోవద్దు”, అని సమయం చిక్కిందని అవిషయం కూడా అనేసారు. మామూలుగా అయితే అలాగ చెప్పడమే సాహసం హెడ్మాస్టరుకయినా.

గోపీ సంగతి కాస్త ఆదుర్దా కలిగించినా అది తన చేతిలో వున్నదనే ఒక ధీమా. ఇక ఆ కుర్రాడు –వాడి పేరేమిటన్నారు హెడ్ మాస్టరు గారు?-ఆ,రాజారావు, వాడి గురించి అలోచించాలి యింక. ఈరోజు ఎటెండెన్స్ తీసుకుంటూ ఆపేరు దగ్గర ఆగి ముందురోజుల హాజరుపట్టిక చూశారు.వరుసగా హాజరు కన్పించింది.అంటే యిన్నాళ్ళూ వాడి బదులు ఎవరో పలుకుతున్నారన్న మాట. తన మామూలు పద్ధతిలో కాక తలెత్తి క్లాసు పరికిస్తూ పేరు పిలిచారు. ఎవరూ బదులు పలకలేదు-

*                             *                          *      *                                   **

మర్నాడు మళ్ళీ అందరినీ తలెత్తుకుని పరిశీలిస్తూ పిలిచారు.రాజారావు పేరు పిల్చినప్పుడు వెనక బెంచీలోంచి “యాస్సార్” అని పెద్దగా పలికారెవరో. మిగతా పిల్లలు గౌరవంగా నిలబడి పలుకుతారు.ఇప్పుడు ఇలా పలికినవాడు కనబడలేదు లేవకుండా పలికాడు.మళ్ళీ అదే పేరు పిలిచారు.మళ్లీ సమాధానం అలాగే వచ్చింది. వింతగొంతుతో పలికిన ఆ పద్ధతికి కాస్త అల్లరిమనసున్న పిల్లలు కిలకిలలాడారు.

చంద్రశేఖరం గారు కోపం తెచ్చుకోలేదు గానీ బాధపడ్దారు. నెమ్మదిగా ఎటెండెన్స్ నిలబడి పలకడం మర్యాద. రాజారావ్ నిలబడి పలికితే బాగుంటుంది”అని మళ్ళీ పిలిచారు. ఈమారు ఒక తెల్లటి స్ఫురద్రూఫి యైన కుర్రాడు లేచి నిల్చున్నాడు. కాస్త దర్పాన్ని ఠీవిని ప్రదర్శిస్తూ మళ్లీ అదే గొంతుకతో “యస్సార్” అని గట్టిగా పలికి ముందుకుపడ్తున్న రింగులజుట్టుని వెనక్కి సర్దుకుంటూ కూర్చున్నాడు.

చంద్రశేఖరంగారు “ ఓహో నువ్వేనా రాజారావంటే?అన్నారు.

“ మరెవ్వరనుకున్నారు? మనమే”అన్నాడు కుర్రాడు పొగరుగా.

హెడ్ మాస్టారు చెప్పింది గుర్తుకు వచ్చింది- తన బాధ్యత అర్థం అయ్యింది.—

గోపీ మళ్లీ గైరు హాజరు. వాడి సంగతి ప్రత్యేకంగా చూడాలి.ఇప్పుడు రాజారావు ఒక సవాలుగా ఉన్నాడు. దానికి ఒక పరిష్కారం కనిపెట్టాలి.

“ఒరే వాసూ!రాజారావు బదులు నువ్వు పలికావు.ఎన్నాళ్లుగా ఇలా చేస్తున్నావు?ఎందుకు ఇలా చేస్తున్నావు? నిన్నేం కోప్పడను, ఏమీ చెయ్యను నిజం చెప్పు”అన్నారు మృదువుగా.

వాడు ఏడవటం మొదలుపెట్టాడు.”అరె! నేనేం అనలేదుగదరా? ఉన్న విషయం చెప్పు ఏం చెయ్యను నిజంగా,” అన్నారు ఆయన భరోసా యిస్తూ.

వాడు ఏడుపు సంభాళించుకుని,”అలా పలికితే డబ్బులిస్తానన్నాడండి మాస్టారు !నేను బీదవాడిని.డబ్బు ఆశతో వప్పుకున్నా.క్షమించండి,”అని మళ్ళీ ఏడవటం మొదలెట్టాడు.

“సరేలే! తప్పు వప్పుకున్నావుగా. ఇంక ఎప్పుడు అలాగ చేయక. నీ ధైర్యంతో వాడు క్లాసుకి రాకుండావుంటే చదువెక్కడ వస్తుంది.?పాడైపోతాడు గదా? ఇకనుంచీ ఈరకమైన మోసపు పనులు

ఎవరూ చెయ్యకండి,”అని పాఠం మొదలుపెట్టారు, గోపీ క్లాసుకి వచ్చాడు.

అయితే క్లాసులేని సమయములో స్టాఫ్ రూం కిటికీ దగ్గర నిలబడితే గోపీ పుస్తకాలతో వెళ్ళిపోతూ కనిపించాడు.

సాయంత్రం యింటికి వచ్చి కాస్త మనసులో వుత్సాహం లేక నిస్సత్తువగా అన్పించి వరండాలో ‘భారతం’ చదువుతూ కూర్చున్నారు..కొంతసేపటికి గేటు చప్పుడయ్యింది.పుస్తకాలతో గోపి లోపలికి వస్తున్నాడు నెమ్మదిగా.దగ్గరకు రాగానే “ఒరేయ్ గోపీ ఆగు ఒకసారి.ఈరోజు అన్ని క్లాస్ లూ హాజరయ్యావా”? అని అడిగారు.

వాడు “అయ్యాన్నాన్నా!” అన్నాడు తడుముకోకుండా. అంటే,సులువుగా అబద్ధం చెప్పడం అలవాటయ్యిందన్నమాట!

“నువ్వు బడి టైం లోనే బయటకు వెళ్ళటం నేను చూశాను. నీ క్లాస్ కెళ్ళి కనుక్కుంటే వెళ్ళిపోయావని తెలిసింది. అబద్ధం చెప్పటం ఎప్పటినుంచీ?” అన్నారాయన.

“మరే, బాగా తలనొప్పిగా వుంటే అడిగి వచ్చేశాను “అని గుటకలు మింగాడు.‘అడిగి వచ్చాన’న్నదీ అబద్ధమే.——

’మరి వెంటనే యింటికి వచ్చి విశ్రాంతి తీసుకోకుండా యింతసేపు ఎక్కడున్నావ్? “ నెమ్మదిగానే అడిగారు.

“మరే.సతీష్ వాళ్ళ మామయ్య డాక్టర్ దగ్గర కాంపౌండరు. వాడు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి మందు ఇప్పించాడు. మందు వేసుకుని కాసేపు కూర్చుని వెళ్ళమన్నాడాయన. అందుకే ఆలస్యం,”అన్నాడు గోపీ తడుముకోకుండా.

చంద్ర శేఖరం గారికి అర్థమయిపోయింది—ఇక ఎన్ని ప్రశ్నలకి అన్ని అబద్ధపు సమాధానాలు వస్తాయని.

చివరికి అన్నారు,”చూడు గోపీ!నేను మర్యాదగా కాలం వెళ్లబుచ్చుతున్నాను. ఇంకోళ్ళ తప్పులు దిద్ది సలహాలివ్వగల గుర్తింపు గౌరవం అందరిలో నాకు వుంది. నీకారణంగా అదంతా పాడైపోయే పరిస్థితి కలగనివ్వద్దు. ఇప్పటికే నీ మిగిలిన మాస్టర్లు చెప్పలేక చెప్పలేక నీ గురించి చెడ్డగా చెబుతున్నారు. చివరికి హెడ్మాస్టరు గారి దృష్టిలో గూడా పడ్డావు. నీవు సక్రమంగా లేకపోతే టీ.సీ ఇప్పించ యింట్లోనే వుంచేయాల్సొస్తుంది. చదువు ముఖ్యమే: అయితే మంచి ప్రవర్తన అంతకన్న అవసరం. రేపటినుంచి సవ్యంగా నడు.ఏం?’ అన్నారు, కోపంగానీ,ఆవేదన గానీ ప్రకటించకుండా చాలా యథాలాపంగా.

గోపీకి భయం వేసింది. తను అతికి పోతే మొదటికే మోసం అని గ్రహించాడు. ఇక తన జాగ్రత్తలో తను వుండాలి. స్కూలు ఎగ్గొట్టకుండా బుద్ధిగా వున్నట్లు నటించితే ఖాళీ సమయాల్లో స్వేఛ్ఛగా తిరగొచ్చు. పుస్తకాలు, చదువు పేరుతో ఎంత వెధవ పనికైనా ముసుగు కప్పెయ్యొచ్చు. పరీక్షల టైంకి ‘సతీష్ వాళ్ల కాపీ ప్రోగ్రాం’ ఎలాగు వుంది.దాటిపోవచ్చు.మెదటికి మోసం చేసుకోవడం తెలివితక్కువ.—

“అలాగే నాన్న!బుద్ధిగా మసలుకుంటా”అన్నాడు.వాళ్ళమాటల మధ్యలో ముందు గుమ్మంలోకి వచ్చి వింటున్న పార్వతమ్మ గారు అనందపడ్డారు.చంద్రశేఖరం గారు ఆనందపడలేదు కాని భవిష్యత్తు ఏం చెబుతుందో వేచి చూడాలని పుస్తకం  మళ్ళీ   తెరిచారు.——

పుస్తకం తెరిచారే గాని మనసు ఎప్పటిలా నిలబడలేదు. పరిపరివిధాల తిరగడం మొదలెట్టింది. రాజారావు గూర్చి ఆలోచనలెక్కువయ్యాయి. వాడ్ని ఎలాగైనా దార్లోకి తీసుకురావాలి.ఎలాగ అన్నదే పట్టివిడవని ప్రశ్న. చీకటి పడినా అలాగే వుండిపోయారు.పార్వతమ్మ గారు వచ్చి వరండాలో లైటు వేస్తే అప్పుడు ఈలోకంలోకి వచ్చారు. కొన్నాళ్ళ పాటు రాజారావుని బాగా పరిశీలించి చూడాలని నిశ్చయించుకున్నారు.

 

*************************

 

గోపీ దినచర్యలో మార్పు వచ్చింది.తన ప్రణాళికను  క్రమం తప్పకుండా ఆచరణలో పెడ్తున్నాడు.సమయానికి బడికి వెళ్లడం అందరితో బాటు తిరిగిరావడం.పుస్తకాలు పట్టుకుని స్నేహితులతో కలసి చదువు వంకతో సాయంత్రం బయట కాలక్షేపం చేయడం.ఈపద్ధతి వాడికి సదుపాయంగా వుంది.చదువుకోవడం మాత్రం చెయ్యడం లేదు.చెడ్డ స్నేహాలు తిరగళ్ళు నిరాఘాటంగా సాగిస్తున్నాడు.చూచినవాళ్లు మనసులో విమర్శించుకున్నార్ తప్ప చంద్రశేఖరం గారి చెవిన ఈవార్త వేసే ధైర్యం లేక వూరుకున్నారు. రాజారావు పెడసరం బాగా పెరిగిపోతోంది.మరీ వంకరగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు,కావాలని మాస్టర్ల సహనం పరీక్షిస్తున్నట్లు.మిగిలిన మాస్టర్లు వాణ్ణి పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు.మెల్లమెల్లగా ఒక జట్టుని తయారుచేసి అల్లరి చేయిస్తున్నాడు క్లాసుల్లోను బయటాను.అంతకుముందు స్కూలు ఒక మోస్తరు క్రమశిక్షణతో నడుస్తూ వస్తోంది.ఇప్పుడు రాజారావు వచ్చి అది దిగజారే పరిస్థితులు మెల్లగా కనిపిస్తున్నాయి.

ఇది చంద్రశేఖరం గారిని బాగా కలిచి వేసింది.అకుర్రవాణ్ణి తొందరలో దారిలో పెట్టకపోతే వాడూ చెడిపోతాడు,స్కూలూ చెడుతుంది,తన బాధ్యతా నిర్వహించడం అవదు.మెత్తానికి అన్నీ నిష్ఫలం అయిపోతాయి—అనే అలోచనే వేధించడం మొదలైంది.

ఆ మర్నాడు క్లాస్ లో యింకా ఎటెండెన్స్ తీసుకుంటూ క్లాసంతా కలయజూస్తున్న చంద్రశేఖరం గారికి చిట్టచివరి బెంచీలో కూర్చుని నిద్రపోతున్న రాజారావు కనిపించాడు.శేఖరం గారు లేచి నెమ్మదిగా వెళ్ళి వాడిని లేపారు.మిగిలిన పిల్లలంతా నిశ్శబ్దంగా వుత్కంఠగా యీ సంఘటనను కళ్ళప్పగించి చూస్తున్నారు.

నిద్రలేచిన రాజారావు వొళ్ళువిరుచుకుని పెద్దగా అవులించాడు.క్లాసంతా చిన్నగా నవ్వుకున్నారు.చెడుతున్న పిల్లలు ఇకిలించారు.శేఖరం గారి శాంతం,సహనం పటిష్టంగానే వున్నాయి.

“ఏరా! క్లాసులో నిద్రపొతున్నావా? ఏమయ్యింది?” అని అడిగారు శాంతంగానే.

“సెకండ్ షో కి వెళ్ళాను:నిద్ర చాలలేదు అంచేత”అన్నాడు వాడు తేలిగ్గా.

“మరి స్కూలు మానేసి నిద్రపోకపొయావా ఇంట్లోనే?” అన్నారాయన.

“ఎటెండెన్స్ పలికి వెళదామని.రాకపోతే ఏబ్సెంట్ వేస్తున్నారు గదా!”

“ప్రెజంట్ వేస్తాను గాని యింటికి వెళ్ళు .శుభ్రంగా నిద్రపోయి సాయంత్రం మా యింటికి రా నీతో మాట్లాడాలి “,అన్నారాయన.  రాజారావు పుస్తకాలు తీసుకుని బైటికి దర్జాగా నడుస్తూ మిగిలిన తన బ్యాచ్ వాళ్ళవైపు ‘స్టయిల్’గా చూస్తూ వెళ్ళిపోయాడు.

ఎటెండెన్స్ పూర్తి చేసి పాఠం చెప్తూ అసంకల్పితంగా చంద్రశేఖరంగారు రాజారావు గురించే ఆలోచిస్తున్నారు.

 

********** ***************

 

సాయంత్రం యింటికి వచ్చి రాజారావు కోసం ఎదురుచూస్తూ ముందువరండాలొ కూర్చున్నారు.ఇంతకీ వస్తాడా? అన్నది సందేహమే.ఎవర్నీ లక్ష్యపెట్టనివాడు తనమాటని మాత్రం ఎందుకు పట్టించుకుంటాడు?—‘అసలెందుకు రమ్మనాడో తెలుసుకుందాం;నాతో అసలు యీయనికి పని ఏమిటో?” అనుకున్న రాజారావు  కుతూహలం కొద్దీ అయన అంచనా తలక్రిందులు  చేస్తూ వాళ్ల యింటికి వచ్చాడు.

అతడు రాగానే ఎదురుగా వేసి వుంచిన  కుర్చీ చూయించారు మౌనంగానే.ఏమీ సంకోచం లేకుండా వాడు దానిలో దర్జాగా కూర్చున్నాడు.ఆయన అదిపెద్దగా పట్టించుకోలేదు.

“రాజా!నువ్వు బాగా ధనవంతుడి పిల్లాడివి కదూ?”అనిఅడిగారు ఆరంభంగా.

“అవును.మానాన్న స్కూలుకి పంపిస్తున్నాడు గాని అసలు డబ్బు పారేస్తే యింటికే వచ్చి చెప్తారు “అన్నాడు గర్వంగా.

“చూడు నాయనా!డబ్బు లేని ఎంతోమంది బీద విద్యార్థులు చదువుకోలేక బాధ పడ్తున్నారు.తెలివితేటలుండి అవకాశాలు లేక వృథా అయిపోతున్నారు.నీకు అన్ని అవకాశాలూ వున్నాయి.ఎంత అదృష్టం!సద్వినియోగం చేసుకుంటే ఎంతో అభివృద్ధిలోకి వస్తావు.నీకు చదువు విలువ,నీలో వున్న శక్తియుక్తులు తెలియక యిలాగ వున్నావు” ప్రభోదంగా అన్నారు ఆయన.

“నాలో శక్తి ఉందని ఎలా తెలుసు”ప్రశ్నించాడు కుర్రాడు.

“ప్రతివ్యక్తి గుణశీలాలు అతడి మొహం లో లీలగా గోచరిస్తుంటాయి.పట్టిచూస్తే కనిపిస్తాయి.నీలో వున్న అపారశక్తి సామర్థ్యాలు నాకు అలాంటి పరిశీలన వల్ల తెలిశాయి”అన్నారు చంద్రశేఖరం గారు.

“నా మొహం లో కాంతిలేదని ఎవరనగలరు? మీరు కొత్తగా కనిపెట్టినదేం వుంది?” అన్నాడు పెళుసుగా రాజారావు.

“అలాగ కాదు నాయనా.నేనన్నది నీకు పూర్తిగా అర్థంకాలేదు.రోజూ కాసేపు నాదగ్గరకు వచ్చి కూర్చో.క్లాసులకి సక్రమంగా హాజరవుతూ వుండు.జాగ్రత్తగా చదువుకో.కాలం చాలా విలువైనది.పోతే తిరిగిరాదు,”అన్నారాయన.

రాజారావు యింకేమీ మాట్లాడలేదు.ఈ సంభాషణ అంతా `వేస్ట్ ఆఫ్ టైం’ అనిపించినట్టుగా  లేచాడు.`వస్తాను ‘అనైనా చెప్పకుండా వెళ్ళిపోయాడు.

అతడలా వెళ్ళిపోతుంటే చంద్రశేఖరం గారు నిర్వికారంగా అలాగే చూస్తూ ఉండిపోయారు.అయితే లోపల మాత్రం యీ పని త్వరగా పూర్తి చెయ్యాలనే ఆత్రుత కదిలింది.ఇంక ఎక్కువ వేచి చూడటం  మంచిది కాదనిపించింది.

మర్నాడు స్కూలికి జేరి గేటు దాటుతుండగా కాంపౌండ్ వాల్ ప్రక్కని చెట్తునీడలో తన జట్టువాళ్ళతో తను వినాలని  రాజారావు అంటున్న మాటలు చెవినబడ్డాయి చంద్రశేఖరం గారికి.

‘ఫేస్ రీడింగ్ వచ్చురా మన మాస్టర్ కి.నా మొహంలో ఏదో వెలుగు వుందిట.జాగ్రత్తగా చదువుకుంటే అభివౄద్ధ్హిలోకి వస్తానుట.గురుడు ఏవేవో చెప్పాడులే కూర్చోబెట్టుకుని బాగుంది  కదూ?అంటున్నాడు.జట్టువాళ్ళు నవ్వుతున్నారు.

చంద్రశేఖరంగారికి ఈ పలుకులు ములుకుల్లా గుచ్చుకున్నాయి మనసులో.”ఓరి! వీడికి చెప్పిన మంచి మాటలన్నీ జ్వరపీడితుడికి  సహించని మంచి మందులైపోయాయే !అని వాపోయారు.

ఆ రోజు వాళ్ల క్లాసుకెళ్ళే సరికి పిల్లలంతా చాలా నిశ్శబ్దంగా వున్నారు.నిశ్శబ్దంగానే లేచి మళ్ళీ కూర్చున్నారు.కొందరు తనని చూస్తున్నా చాలంఅంది   తను కూర్చున్న కుర్చీ దాటి వెనకున్న బోర్డువైపు చూస్తున్నారు.తను అది గమనించినా పట్టిచుకోకుండా అటెండెన్స్ మొదలెట్టారు.ఆరోజు అందరూ,అల్లరిపిల్లలూ,రాజారావు కూడా విధేయతగా పలికారు.చంద్రశేఖరం గారు అర్థం కాక అలాగే పూర్తి చేసి పుస్తకం మూసి పాఠ్య పుస్తకం తెరిచి ముందు టేబుల్ మీద పెట్టి బ్లాక్ బోర్డ్ తుడిచేందుకు వెనక్కి తిరిగారు.ప్రతి పిరియడ్ కీ పాఠం మొదలుపెట్టేముందు అంథకు ముందు బ్లాక్ బోర్డ్ మీద వ్రాసి ఉన్నది తుడిచేసి శుభ్రం చెయ్యటం ఆయన అలవాటు.

వెనక్కి తిరిగేసరికి క్లాస్ వెనక బల్లాల నుంచి కొత్తగా తయారయిన అల్లరిపిల్లల కిలకిలలు.కారణం స్పష్టంగా అక్కడ ఎదురుగా కనిపిస్తోంది.

బోర్డు మీద ముందు చంద్రుడి బొమ్మ,తర్వాత `శే’అని అక్షరం , దాని తర్వాత గాడిద బొమ్మ వేసి ఇజ్ ఈక్వల్ టు అని గుర్తు, చివర `చంద్రశేఖరం’అని పేరు వున్నాయి. ఈ అనుభవం ఆయనకి చాలా కొత్త.

ఈ ముప్ఫయ్ మూడు సమవ్త్శరాల సర్వీసులో అస్సలు ఎదురుపడని విషయం.అందరికీ ఆయాన అంటే పూర్ణ భక్తి అనిచెప్పలేంగాని కాస్త వంకర నడత వున్నవాళ్ళు వెనుక మాటున ఏం అనుకున్నారో గాని ప్రత్యక్షంగా ఆయన్ని యిలా ఎన్నడూ అవమానించలేదు.ఆ సాహసం ఎవరికీ లేదు.

చంద్రశేఖరంగారికి నిర్మేఘమైన ఆకాశం నుండి హఠాత్తుగా నెత్తిమీద పిడుగు పడినట్లయ్యింది. వళ్ళు వేడెక్కింది. తలతిరిగిపోయింది. ఆ వ్రాతని చెరపకుండా క్లాసుకేసి తిరిగారు.’ఈ పని ఎవరు చేశారు?” అని కాస్త గట్టిగానే అడిగారు.ఆయనికి అది ఎవరి పనో స్పష్టంగా తెలుస్తూనే వుంది:అయినా.

అనాలోచితంగా,యాంత్రికంగా అందరి చూపులూ రాజారావుకేసి తిరిగాయి.తర్వాత ఏం జరుగుతుందో అని ఆదుర్దాగా ఉండిపోయారు.

“సమాధానం చెప్పరేం?ఎవరో చెప్పండి ధైర్యంగా,”అన్నారు.

రాజారావు ఠక్కున లేచి నిలబడ్డాడు.

“నేనే వ్రాసానండి !అంతా కరక్టుగానే  ఉందిగా?ఏమన్నా తప్పుందా?” అన్నాడు వెటకారంగా

“రాజారావ్! ఇలారా!” అన్నారు గంభీరంగా. రాజారావ్ కదల లేదు. అలాగే నుంచుండి పోయాడు.

శివుడికి ధ్యాన భంగమైంది. శేఖరంగారి సహనం సడలి పోయింది. శాంతం పారి పోయింది. తన పరిస్థితి ఎందుకు దిగజారిపోయిందనుకున్నాడో అంతా కళ్ళ ఎదురుగా జరిగి పోయింది. కోపం కుతకుత పొంగి లావా లాగా పొర్లటానికి సిద్ధంగా ఉంది. అప్పటికీ సంయమనం కోల్పోకుండా మళ్ళా అన్నారు, “ఇక్కడికి రమ్మంటున్నాను. రా!”

ఈసారి రాజారావ్ కదిలాడు. పుస్తకాలు చేతిలోనికి తీసుకుని. చిన్న అవమాన శరం విడిచి వెళ్ళిపోదామనే సంసిద్ధత వాడిలో స్పష్టంగా కనిపిస్తోంది. అహంకారంగా, అవిధేయంగా, నిర్లక్ష్యంగా నడిచి వచ్చాడు. క్లాసంతా నిశ్శబ్దం.

దగ్గరకు రాగానే చంద్రశేఖరం గారు, “రాజారావ్ నిన్ను మార్గంలో పెట్టేందుకు ప్రయత్నించాను. మెల్లిగా బోధించాను. నువ్వు వినలేదు. నన్ను హేళన చేశావు. నా మాటలను బురదలో త్రొక్కేశావు. నువ్వు నా పేరును హాస్యం చేసి గీసినందుకు నాకు కోపం లేదు. మంచి మాట అర్థం కాని నీ మూర్ఖత్వమంటే కోపం. ఇలా ఎందుకు చేశావు?” అన్నారు చివరి ప్రయత్నంగా.

“ఊరికే సరదాకి,” అన్నాడు రాజారావ్ వెకిలి నవ్వుతో.

శేఖరంగారి మూడో కన్ను తెరచుకుంది. రాజారావు చెంప ఛెళ్ళుమంది. వాడు అనుకోని పరిణామానికి అవాక్కయి చెంప పట్టుకున్నాడు. చేతిలోని పుస్తకాలు జారిపోయి కింద పడిపోయాయి.

“నువ్వు ధనవంతుడివైయితే అయ్యావు కానీ, సంస్కార హీనంగా ప్రవర్తిస్తూ వచ్చావు. నిన్ను బాగు చేయాలని చెప్పిన మంచి నీకు వెగటయిపోయిందా? నిన్ను ఈరోజు చేయి చేసుకుని శిక్షించే గతి నాకు పట్టించావు. నువ్వు ఎలాగ బాగు పడ్తావు?” మళ్ళీ రాజారావు చెంప ఛెళ్ళు మంది. క్లాసు పిల్లలు ఏరోజూ చూసి ఎరుగని దృశ్యానికి నిశ్చేష్టులై పోయారు.

మళ్ళీ ఇంకో దెబ్బ పడింది. రాజారావు కాచుకోలేక “అబ్బా” అంటూ కింద పడి పోయాడు.

చంద్ర శేఖరం గారి శాంత గంభీరమైన మొహం జేవురించి ఉంది. కళ్ళలో నీళ్ళు నిండి ఉన్నాయి. వెధవా!మూర్ఖుడా! నామంచితనం మీద దెబ్బతీస్తావా?” అని అవేశంతో వూగిపోయారు. విసవిసా క్లాసు బైటికి వెళ్ళిపోయారు.–

సూటిగా హెడ్మాస్టరు రూం కెళ్ళారు. ఒక్కరే కూర్చున్న  ఆయన  చంద్రశేఖరం  గారి అపరిచితమైన రూపాన్ని చూసి గాభరా పడ్డారు.”ఏం మాస్టారు ఏమైంది?ఏమిటిలా?” అనిమాత్రం అన్నారు లేచి నిలబడి.

శేఖరంగారు జరిగిందంతా చెప్పారు.”మీరు నా చేతబెట్టిన బాధ్యతను నిర్వర్తించలేకపోయాను.విశ్వాసంతో చేసిన ప్రయత్నం లో ఓడిపోయాను.నేనింక ఈ బడికి సేవ చేయగల అర్హతని,స్తితిని కోల్పోయాను”అన్నరు.”ఛ!ఛ!అదేం మాట మాస్టారు !ఎవడో కుక్కతోక గాడిని మార్చలేనందుకు  మీరు బాధ పడ్డం ఏమిటి?వాడి తల్లిదండ్రులకి చెప్పి టి,సి ఇచ్చి పంపెద్దాం”,అన్నారు హెడ్ మాస్టారు.

” వాడికి మీరు ఏ శిక్ష వేసినా “నాకు నేను వేసుకునే శిక్ష యిది”” అని వణుకుతున్న చేతితో హెడ్ మాస్టరు గారి బల్ల మీద వున్న తెల్ల కాగితం తీసుకుని రాజీనామా ఉత్తరం రాసి యిచ్చేసారు.దాన్లో నింద తనమీదనే  వేసుకుని `మాస్టరుగ తనకు అర్హత లేనందునే ఈ పని చేస్తున్నాను.దయచేసి విడుదల చెయ్యవలసిందీ అని వ్రాసారు.

హెడ్ మాస్టారు అభిమానంతో ఎంత వారించినా అర్థించినా వినలేదు.కాగితం యిచ్చేసి యింటివైపు దారితీసారు.చంద్రశేఖరం గారు స్కూలు జరుగుతుండగా అలా వెళ్ళి పోవడం ఎన్నడూ చూడని ఆయన సహ ఉపాధ్యాయులు వింతపడ్డారు.తర్వాత హెడ్ మాస్టరు గారి ద్వారా వార్త విని బాధ పడ్డారు.

దెబ్బలు తిని క్రిందపడిన రాజారావు ఆవేశంగా లేచాడు.”వెధవ స్కూలు,వెధవ మాస్టర్లు”అని అక్కసుగా తిట్టి “చస్తే ఈ స్కూలుకి రాను,ఆ మాస్టరు అంతు చూస్తా”,అని కేకలేస్తూ యింటికి వెళ్ళిపోయాడు.  సరాసరి యింటికి వెళ్ళిపోయిన చంద్రశేఖారం గారు పూజ గదిలోకి వెళ్ళి కూర్చుని దైవధ్యానంలో మునిగిపోయారు. భార్యతో ఒక్కమాట మాట్లాడలేదు.

ఎన్నడూ అనుభవం లేని ఈ పరిణామానికి కళవళ పడుతూ వుండిపోయిందావిడ.గోపీ గాభరాగా యింటికి వచ్చి విషయలన్నీ వివరంగా చెప్పాక తెలిసింది.గోపీ తనగదిలోకి వెళ్ళిపోయాడు.

మధ్యాహ్నం కాఫీకి లేవలేదు చంద్రశేఖ్రం గారు.సాయంత్రం స్కూలు హెడ్మాస్టరు,తోటివారు వచ్చారు.వారిని కలుసుకునేందుకు బయట వరండాలోకి వచ్చారు చంద్రశేఖరం గారు.వారి సానుభూతి మాటలని,అభిమానపు అర్థనలని మౌనంగా విన్నారు.రాజీనామని వుపసంహరించు కొమ్మన్న హెడ్ మాస్టర్ గారి అభ్యర్థనని విని ఏం మాటాడలేదు వెంటనే.

“అది నా తిరుగులేని నిర్ణయం!నేను ఓడిపోయను!ఓడిపోయాను”అనేఅన్నారు చివరికి. కొంతసేపు అలాగ కూర్చుని పరామర్సలు చేసి నిస్సహాయంగా,నిరాశగా వెనుదిరిగి వెళ్లిపోయారు అందరూ.

కళ్లనీళ్లు వొత్తుకుంటూ  పార్వతమ్మ గారు ఇంటిపనులలో మునిగిపోయారు.

కొన్నాళ్ళు అలా  నిర్వేదంతో కుమిలి కుమిలి  మంచం పట్టారు చంద్రశేఖరం గారు.

రోజూ ఆయన అంటే  అభిమానం ఉన్న పిల్లలు,స్నేహితులు సహోద్యోగులు వీలున్నప్పుడు,వీలు చూసుకుని పలకరించి విచారంతో వెళ్ళేవారు.

ఆవేశంతో స్కూలుకి `ఛీ’కొట్టి వెళ్ళిన రాజారావు తలిదండ్రులతో తనకి జరిగిన అవమానం గూర్చి, తన ప్రవర్తన వివరాలు దాచేసి వివరంగా చెప్పాడు.వాళ్ళకి వాడి ఇతర స్కూళ్ళ నేపథ్యం తెలుసు కనక “స్కూలు అక్కర్లేదులే,ఇంట్లోనే ఉండి వ్యాపారం నేర్చుకో.లేకపోతే నీ యిష్టం వచ్చినట్లు  గడుపు, ఇంక ఆ స్కూలు వైపు గాని, ఆ మాస్టరు వైపు గాని దృష్టి పెట్టావంటే బాగుండదు”అని మందలించి వూర్కున్నారు.

హెడ్మాస్టరు గారు స్కూలు కమిటీ వాళ్ళతో జరిగిన దుస్సంఘటన వివరించారు.వారందరికీ చంద్రశేఖరం గారంటే ప్రేమ,భక్తి, గౌరవం,అభిమానం.కొందరు సభ్యులు ఆయన పూర్వ విద్యార్థులు కూడా.అందుచేత ఆయన అత్మాభిమానాన్ని గౌరవించి,ఆయన దగ్గరికి వెళ్ళి సానుభూతి పలికి పరామర్శించి ఏం మాట్లాడకుండా `రాజీనామా’ గురించిన నేపథ్యాన్ని ప్రభుత్వానికి వివరిస్తూ,ఆయాన వంటి ఆదర్శవంతుడికి సహాయంగా ఎంతోకొంత జీవనభృతిని కల్పించవల్సిందని సిఫార్సు చేసారు.ప్రభుత్వం సానుభూతితో స్పందించి `స్పెషల్ కేస్ గా కనీస పెన్షన్ని శాంక్షన్ చేసింది. అందరూ సంతోషించారు.

 

***********************

 

మనో వ్యధతో వ్యాధిగ్రస్తులైన చంద్రశేఖరం గారు రెండేళ్ళ పాటు మంచం మీదే వున్నారు,

ఈ పరిస్తితి గోపీని మార్చలేదు,సరికదా వాడికి తండ్రి ఆటంకం వదిలిపోయి స్వేఛ్ఛ వచ్చి తిరుగుళ్ళు,చెడు అలవాట్లు ఎక్కువైపోయాయి.వాడి గురించి పట్టించుకునే  ఆసక్తి శక్తి  లేక చంద్రశేఖరం గారు జీవఛ్ఛవంలా,నిర్లిప్తంగా ఉండిపోయారు.స్కూల్ కేసి మొహం చూపడం లేదని తెలిసి దుఖఃపడ్దారు.

పార్వతమ్మ గారు వాడిని చాటుగా పిలిచి బుద్ధులు చెప్పేది,కోప్పడేది.గట్టిగా గొడవైతే ఆయనకి తెలిసి ఆయన ఆరోగ్యం మరీ క్షీణిస్తుందని జాగ్రత్త పడేది.ఈ బలహీనత అదనుగా తీసుకుని గోపీ మరీ దిగజారిపోయాడు.డబ్బు అవసరాలకి పరిస్థితిని ఆసరాగా తీసుకుని తల్లిని బెదిరించి పట్టుకెళ్ళేవాడు.

చివరికొకనాడు —“వ్యాపారం చేద్దామంటున్నారు మా స్నేహితులు డబ్బు సర్దుబాటు చేయ్.లేకపోతె నాన్ననె అడిగేస్తా”అన్నాడు గోపీ.

విసుగుతో వున్న తల్లి,అడిగితె అడగరా!ఇంతవరకు వచ్చింది;ఇంక ఏం జరగాలో”అంది.వెంటనే గోపీ తండ్రి గదిలోకి వెళ్ళాడు.అనుకోకుండా జరిగిన దీనితో తల్లి వెంట వెళ్ళింది.ఆవిడ వారించేలోగానే నీరసంగా పడి వున్న తండ్రితో తన ఆలోచన చెప్పాడు.

అందుకు చంద్రశేఖరం గారు శాంతంగానే,సరిగా చదువు అంటని వాడివి వ్యాపారం ఏం చేస్తావు?అది మన యింటా వంటా లేదు!మించిపోయింది లేదు.సరిగా చదువుకుని మంచి వుద్యోగం చేసుకో” అన్నారు.

” ఉహూ…డబ్బులిస్తే యివ్వండి లేకపోతే….”అర్థోక్తిలో ఆపాడు గోపి.

“లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతావు.అంతేకదా!నీనుండి అంతకన్నా ఎక్కువ ఆశించేదేం లేదు.నీ యిష్టం” అనేసారు చంద్రశేఖరం గారు ఆవేశంతోను, ఆయాసంతోను.

“సరే నే పోతున్నా,అమ్మా అయితే నేవెళ్ళనా”?తల్లి ఆపుతుందనే ఆశతో గోపి అన్నాడు.

పార్వతమ్మ గారు అసహ్యంతో,ఛీ సిగ్గులేదు,అటువంటి మహానుభావుడి పేరు చెరపడానికి పుట్టిన వేరుపురుగువి.మీనాన్న కాదంటే నేనౌనంటానా?నిన్ను ఆపి యింకా పాపం చెయ్యను.ఉంటానన్నా వుండనీయను.నీదిక్కున్న చోటికిఫో!”అన్నది చివరిగా.పక్కకి తిరిగి దుఖాశ్రువులని  కొంగుతో అద్దుకుంది.

పూర్వం ముగ్గురుండే యింట యిప్పుడిద్దరు శోకదేవతల్లాగ మిగిలిపోయారు.దెబ్బమీద దెబ్బతో మరీ దిగజారిపోయారు శేఖరంగారు. పార్వతమ్మ గారు తనదుఃఖాన్ని మింగుకుని,మనసుని సంబాళించుకుని

భర్త ఆరోగ్యం బాగుపడేందుకు ఆయనకు సపర్యలు చేస్తూ కాలం గడుపుతున్నారు. ఈ దెబ్బనుండి కోలుకోడానికి చంద్రశేఖరం గారికి ఆరేళ్ళు పట్టింది.

 

******

 

కోలుకున్న చంద్రశేఖరం గారు యాంత్రికంగా తనపాత దినచర్య తిరిగి చేబట్టి,స్కూలుకు వెళ్ళే సమయం గూడా ఖాళీగా ఉండటంతో పుస్తకాలు చదవటం,నచ్చినప్పుడు ఆధ్యాత్మిక వ్యాసాలు వ్యాఖ్యలు వ్రాయడం చేస్తూ,ఎక్కువకాలం చాలా ఏళ్ళుగా నిర్లక్ష్యానికి గురియైన తోటకు సంరక్షణ చేయడంలో గడపడం మొదలులెట్టారు.అయితే వయసు మళ్ళి అకాల వృద్ధాప్యం వచ్చినందువల్ల పనులు మెల్లగా చేస్తూ అసంకల్పితంగా తిరుగుతున్నారు.తీరికసమయాల్లో,సాయంకాలాలు వరండా కుర్చీలో కూర్చుని గడిచిపోయిన జీవితపు పుటలను మనసులో తిప్పుకుంటూ,పలకరించేందుకు వచ్చే పాతమిత్రులతో,సలహాలకోసం వచ్చే పూర్వవిద్యా ర్థులతో ప్రసంగాలు,చర్చలతో కాలక్షేపం చేస్తున్నారు.ప్రభుత్వం ఆదరంతో యిస్తున్న ఆ కాస్త జీవన భృతితో రోజులు సామాన్యంగా ఒడిదుడుకులు లేకుండా గడుస్తున్నాయి.మధ్యమధ్య తనుప్రయత్నించి బాగు చేయలేకపోయిన రాజారావు,

ప్రయత్నించక పాడు చేసుకున్న గోపీ జ్ఞాపకం వచ్చి విధివిలాసానికి వేదాంతపు నిట్టూర్పు విడిచేవారు.

కాలగమనం ఆగదు కదా!మరొక పదేళ్ళు గడిచాయి.ఇప్పుడు చంద్రశేఖరం గారు డెబ్భై యేళ్ళ వృద్ధుడు.ఆయన సేవకే బ్రతికున్నట్లు పార్వతమగారు క్రమం తప్పని దినచర్యతో ఆయన సంరక్షణ నిర్వహిస్తూ వున్నది.

తోటలో తిరిగే కార్యక్రమము ఇప్పుడు లేదు.తెలిసినపనివాడు అప్పుడప్పుడు వచ్చి సరిచేసి పోతున్నాడు.నీళ్ళుపొయ్యటం మాత్రం నిత్యం తప్పనిది. పూజాకార్యక్రమం అయ్యాక పగలంతా,చీకటిపడేదాకా,సాయంత్రం పూట ఆయన ఆముందు వరండాలో కాసేపు పుస్తకాలతోను ,దృష్టిబలహీనత వల్ల ఎక్కు వసేపు ఆలోచనలతోను కాలం గడుపుతున్నారు. పూర్వ స్నేహితులొక్కరొక్కరే నిష్క్ర్రమించారు.ఎవరికోసమూ ఎదురుచూసే అవకాశమూ లేదు.ఏరోజో వచ్చే మరణం కోసం తప్పు.అప్పుడప్పుడు పాత విద్యార్థులు వచ్చివెళ్తుంటారు. అంతే.

ఒకరోజు సాయంత్రం వెలుగు సన్నగిల్లుతున్న వేళ గేటు చప్పుడయ్యింది.ఎవరొచ్చారో తెలియలేదు.ఆ వచ్చినవారు ఎలాగూ లోపలికి వస్తారుగా!-పరికిస్తూ కూర్చున్నారు. ఎవరో ఎత్తుగా తెల్లని బట్టల్లో వున్నారు.వరండా సమీపించారు.”మాస్టారూ!” అని మృదువుగా పిలిచారు.గొంతు కొత్తది.అదీగాక ఈ మధ్య కొన్నేళ్ళుగా ఆ పిలుపుతో అతిథులు ఎవరూలేరు.చంద్రశేఖరంగారు పోల్చుకోలేక,”ఎవరు బాబూ?” అన్నారు.సమాధానం రాక,వచ్చిన వ్యక్తిని పరీక్షగా చూసారు.చిన్న గడ్దం, మీసంతో ఒక ఇరవై ముప్ఫై ఏళ్ళమధ్య వయస్కుడొకతను అక్కడ నిలబడి వున్నాడు చేతులు కట్టుకుని. “ఎవరు కావాలి నాయనా?నీవెవరు?” అని అడిగారు.

“మీ కోసమే మాస్టారూ”అన్నాడతను.

“రా!నాయనా! ఆ కుర్చీలో కూర్చో!” అని ఎదురుగా వున్న కుర్చీ  చూపించారు.

అతడు గబగబా మెట్లెక్కి వచ్చి ఆయన కాళ్ల దగ్గర సాష్టాంగపడి కన్నీళ్ళుకారుస్తూ అక్కడే కూర్చున్నాడు నేలమీద. ఎందుకో చంద్రశేఖరంగారికి రాజారావు జ్ఞాపకం వచ్చాడు.అతడికి ఒకరోజు కుర్చీ చూపిస్తే  దర్జాగా దానిమీద కూర్చోడం జ్ఞాపకం వచ్చింది.మాసిపోని జ్ఞాపకాలలో అదొకటి.అతడికీ యీ యువకుడికీ ఎంతబేధం!

“నాయనా ! ఏం పనిమీద వచ్చావు?” అని అడిగి “పార్వతీ! కాస్త యిలా వచ్చి లైటు వేయి!”లోపలికి మెల్లగా పిలిచారు.ఆవిడ వచ్చే లోపలే ఆ యువకుడు లేచి స్విచ్చిని చూసి నొక్కాడు.ఈలోగా అక్కడికి వచ్చిన ఆమెకి చేతులు జోడించి నమస్కారం పెట్టి”శ్రమ అనుకోకపొతే మీరు గూడా ఈ కుర్చీలో కూర్చోండమ్మా!”అన్నాడు.ఆవిడ ఈ అపరిచిత వ్యక్తి చనువుగా చేసిన అభ్యర్థనకి ఆశ్చర్యపోయి నిలబడిపోయింది.

చంద్రశేఖరం గారే ఆవిడతో” కూర్చోవే!అతడు అడుగుతున్నాడు కదా!మన  అబ్బాయి లాంటివాడు”అన్నారు.ఆవిడ కూర్చుంది గోడ కానుకుని. “మాస్టారూ! మీదగ్గర చదువుకుని  బాగుపడి బాగా అభివృద్ధిలోకి వచ్చిన విద్యార్థులు తమ కృతజ్ఞతని చెప్పుకోడానికి వస్తూనే వుంటారు.అదేమీ మీకు వింతకాదు.కాని మీ దగ్గర చదవవలసిన కాలాన్ని  వృథా చేసుకుని,మీకు హృదయవేదన కలుగజేసి,కోపం తెప్పించి,శిక్షను అనుభవించి,జీవితంలో ఒక అర్థాన్ని,పరమార్థాన్ని  అవగాహన చేసుకుని,బాగుపడి తనలోని మార్పుకి మూలకారణం అయిన మిమ్మల్ని కలిసేందుకు మొహం చెల్లక యిన్నాళ్ళ యీ అజ్ఞాతవాసం

తర్వాత తన తప్పిదాలకి, పాపాలకి క్షమించమని వచ్చిన రాజారావును మేస్టారూ, నేను!”అన్నాడు ఆ వచ్చిన యువకుడు.

చంద్రశేఖరం గారి చెవులా మాటలను నమ్మలేకపోయాయి.

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *