April 23, 2024

ఏ రాయైతేనేం?

రచన : డా.శ్రీనివాస చక్రవర్తి

 గడియారం పది గంటలు కొట్టింది. పగలు కాదు రాత్రి.  దిక్కుమాలిన టీవీ చూసి చూసి కళ్ళు లాగుతున్నాయి. దిక్కుమాలిన సోఫాలో కూర్చునీ కూర్చునీ కాళ్ళు లాగుతున్నాయి. ఇంత రాత్రయ్యింది. తను ఎప్పుడొస్తుందో తెలీదు. ‘ఇప్పుడే రాదులే పద డాళింగ్!’ అంటూ పీకపట్టుకుని నిద్రాదేవి వత్తిడి చేసింది. ‘ఛస్!ఊరుకో!’అనడానికి కూడా ఓపిక లేదు.

ఇంతలో బాంబుపడ్డట్టు పెద్ద చప్పుడు. తుళ్ళిపడి నిద్రాదేవి పీక వదిలేసింది. కాస్త తేరుకుని కళ్ళు నులుముకున్నాను.

‘ట్రింగ్!’మళ్లీ అదే చప్పుడు. ‘ట్రీంగ్!!!’

‘హలో!’

‘వొరేయ్, విక్రమ్! రాస్కెల్! ఎలా వున్నావు? అవతల్నుంచి గావుకేక. దెబ్బకి 90

శాతం మత్తు వొదిలిపోయింది. రసాభాస అయినందుకు చురచుర చూసి చెప్పులేసుకుని

వెళ్ళిపోయింది నిద్రాదేవి.

“హలో! హూ ఈస్ దిస్!” కాస్త చిరాగ్గా అన్నాను. వాలకం బట్టి కాల్ ఇండియా నుండే

అని గ్రహించాను. ఫోన్లో సూటిగా పాయింటుకి రావటం మన వాళ్లకు అలవాటు.

“ఒరేయ్ ఫూల్! నేన్రా,    శ్రీధర్ని ఇండియానుంచి.  ”

చిరాకంతా ఎగిరిపోయింది. టాటా కూడా చెప్పకుండా విసవిసా నడుచుకుంటూ చీకట్లో అదృశ్యమైపోయింది నిద్రాదేవి.

“ఒరేయ్! రాస్కెల్! శ్రీధర్! నువ్వా? సడెన్ గా ఏంటిలా? ఎలా వున్నావు? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు?  ఇంతకాలం ఏవై పోయావు? సుధ ఎలా వుంది? పిల్లలు గట్రా వున్నారా? వుంటే ఎంత మంది?వాళ్ల పేర్లేంటి?. . . . ”

“ఒరేయ్! ఇది ఐ. ఎస్. డి కాల్ అన్నది మర్చిపోకు. నీకు

జవాబులు చెబుతూ కూర్చుంటే ఓ నెల జీతం ఎగిరిపోతుంది. అంచేత నువ్వే ఐదు

నిమిషాల తర్వాత చెయ్. ఇంట్లో ఐ. ఎస్. డి లేదు కనుక బయటి నుంచి

చేస్తున్నాను. ఓ ఐదు నిమిషాలాగి ఇంటికి చెయ్. నెంబరూ 0 2 2 . . . ”

“0 2 2. . .”

ఇది బొంబాయి నంబరు. మనవాడు మకాం వైజాగ్ నుండి బొంబాయికి మార్చాడన్నమాట.

శ్రీధర్ నా ప్రాణస్నేహితుడు. ఆంధ్రా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు పరిచయం అయ్యాడు. నేను డేస్కాలరుగా ఉండేవాణ్ణి. శ్రీధర్ హాస్టల్లో వుండేవాడు. అయినా ఎప్పుడూ ఒకరినొకరు వొదిలిపెట్టకుండా తిరిగేవాళ్లం.

 

ఏడేళ్ళ క్రితం నేను,    ప్రియ-అదే మా ఆవిడ- అమెరికా వచ్చేసాక మళ్లీ ఇప్పటిదాకా సమాచారం లేదు. ఎన్నోసార్లు వాణ్ణి తలుచుకున్నా వాడి గురించి వాకబు చేసే ప్రయత్నం చెయ్యలేదు. ఎన్నో యేళ్ళ తరువాత మళ్లీ వాడిగొంతు వింటున్నాను. వాడు నేను కలిసి తిరిగినరోజులు గుర్తు తెచ్చుకుంటూ స్మృతి అనే తలుపు తెరిచి గతమనే గదిలోకి అడుగుపెట్టాను.

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .

 

నేను శ్రీధర్ ని మొట్టమొదటి సారి చూసినప్పుడు తుప్పల్లో ఏదో వెదుకుతూ కనిపించాడు. పాపం

సహాయం చేద్దామని వెళ్లి అడిగాను.

“ఏం వెదుకుతున్నారండీ?”

“వెదకడం లేదు. కొలుస్తున్నాను. ”

“పోనీ యేం కొలుస్తున్నారండీ?”

“కాంపస్ చుట్టుకొలత ఎంతో ఈ పావలా కాసుతో కొలుచుకు రమ్మన్నారు సీనియర్లు.

ఈ రాగింగ్ తో పిచ్చెక్కుతుంది. మా ఊరికి పారిపోవాలనుంది. ”

కుర్రాడికి ఇక యేడుపు ఒక్కటే తక్కువ.

“నేను సాయం చెయ్యనా?”

“ప్లీజ్!అంతకన్నానా,    “అంటూ జేబులోంచి మరో పావలా తీసి ఇవ్వబోయాడు. బాధపడతాడని

నవ్వాపుకుని అన్నాను,

“నా సొల్యూషన్ వేరు. నాబండి మీదెక్కి కూర్చోండి. ఇట్నుంచి ఇటే చెక్కేద్దాం. ”

“అమ్మో!మరి సీనియర్లు చితక్కొట్రూ?”

“చూడండి!ఇప్పటికే పాపం మీరు కాంపస్ సగం పైగా కవర్ చేసేసారు. అంటే ఇంచుమించు గంటన్నర పైగా పట్టుంటుంది,  అనుభవం మీద చెబుతున్నాను. మొత్తం పూర్తయ్యేసరికి కనీసం మరో గంటన్నా పడుతుంది. అంటే మీరు తీసుకెళ్లబోయే ఫైనల్ రిజల్స్ కోసం ఆ సీనియర్లు అక్కడే ఆత్రంగా వెయిట్ చేస్తూ ఉంటారనుకున్నారా?”

విషయం అర్థమయ్యి ఓ వెర్రి నవ్వు నవ్వాడు.

“పదండి. దసపల్లా హోటల్ కి వెళ్ళి ఉప్మా,    పెసరట్టు తింటూ సమాచారం మాట్లాడుకుందాం. “అలా మొదలైన మాస్నేహం ఢోకా లేకుండా వృద్ధి చెందింది. క్లాసులోనూ,    గ్లాసులోనూ(అంటే మరేం లేదు,    ఇద్దరికీ టీ అంటే ప్రాణం), బీచ్ లోనూ, మ్యాచ్ లోనూ కవలల్లా కలిసే వుండే వాళ్లం. కొత్తసినిమా వస్తే చాలు క్లాసులు, లాబులు అన్న తరతమబేధం లేకుండా యేది అడ్డొస్తే దాన్ని ఎగ్గొట్టి సినిమా కెళ్ళే వాళ్లం. ఇద్దరం యెంతో సహకారభావంతో పనిచేస్తూ కాలేజీలో అమ్మాయిల లిస్టు ఎల్లవేళల అప్ టు డేట్ గా వుంచే వాళ్లం. ఇలా వాడి సాంగత్యంలో నా జీవితం మూడు టీలు, ఆరు సమోసాలుగా అందంగా సాగింది. కళ్ళు మూసి తెరిచేలోగా ఫైనల్ ఇయర్ కి వచ్చేశాం. కథ మరీ సాఫీగా ఉందని పసిగట్టాడు కాబోలు. బ్రహ్మదేవుడు చిన్న ట్విస్ట్ ఇచ్చాడు.

 

ఒకరీజు సాయంత్రం నేను నా బండి మీద కాలేజి నుంచి ఇంటికి వెళ్తుంటే కాంపస్ బయట బస్టాండ్ లో

ఎవరో “విక్రమ్!” అని  కేకేశారు. చూస్తే మావాడు, శ్రీధర్. పక్కనే ఎవరో కొత్త అమ్మాయుంది. వెళ్ళి

పలకరించాను. అమ్మాయిని కాదు మా వాణ్ణి.

“ఒరేయ్! విక్రమ్”ఈమె. . . ”

“హాయ్!”!ఉదారంగా నవ్వాను.

“మా పెదనాన్న గారమ్మాయి,  ప్రియ. . . ”

“నైస్ టూ మీట్ యు, అయామ్ విక్రమ్.”

“యూనివర్శిటీలో బీ. ఫార్మ్.  చదువుతుంది. ఇవాళ ఆర్టీసీ స్ట్రైక్ అట. వీళ్ళ ఇల్లు మీ ఇంటికి దారే అవుతుంది.  కొంచెం డ్రాప్ చెయ్యవూ?”

ఓసారైనా యెగాదిగా చూడదగ్గ రూపంలా కనిపించి ఓసారి యెగాదిగా చూసాను ఆ అమ్మాయిని. లేత

నిమ్మకాయ రంగు కుర్తావేసుకుంది. దాంతోపాటు లేతనీలిరంగు జీన్స్. కొల్హాపురిచెప్పులు. మరగకాచిన ఆవుపాల వంటి మేనిఛాయ. పేలుతున్నమవుంట్ ఎట్నా లాంటి బొట్టు. ఆ జ్వాలముఖి మీది మసిపొగలలా ముసిరే ముంగురులు. సన్నని తీరైన నాసిక మీద మెరిసే ముక్కుపుడక. కిరణ్ బేడీలా ఒద్దికగా కత్తిరించుకున్న జుట్టు.  మూర్తీభవించిన ఈస్ట్ వెస్ట్ ఫ్యూషన్లా వుంది.  పిల్ల నచ్చింది.

“రండి”అంటూ నిండు మనసుతో నా బండిమీదకు ఆహ్వానించాను.  అలా ఆర్టీసీ స్ట్రైక్ పుణ్యమా అని యేర్పడ్డ మా స్నేహం ఆర్టీసీ స్ట్రైక్ తోనే అంతరించిపోలేదు. సాయంకాలం ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యడమే కాక, ఆపై ఉదయం కాలేజీ దగ్గర డ్రాప్ చెయ్యడమే కాక,  కాలేజీ, ఇల్లే కాక ఇంకా ఎక్కడికి

పడితే అక్కడికి నా బండిమీద డ్రాప్ చేసే బాధ్య్తతను నా నెత్తిన వేసుకున్నాను. ఎక్కడికీ డ్రాప్ చెయ్యాల్సిన అవసరం లేకపోయినా ఊరికే నా బండిమీద తిప్పటం నా విధి అనుకున్నాను. కైలాష్ గిరి, డాల్ఫిన్స్ నోస్ నుండి, ఋషికొండ,  భీమిలిమాత్రమే కాక ఆర్టీసి బస్సులు చొరబడలేని

సుదూరతీరాలకు ఇద్దరం నా టూవీలర్ మీద చొచ్చుకుపోయాం. అలా దూరం, దాహం తెలీకుండా ఎలక్షన్ క్యాంపెయిన్ లాగా వైజాగ్ జిల్లా అంతా నిర్విరామంగా సంచరిస్తూ నా సరికొత్త కవసాకి మీదే నేను ప్రియ ప్రేమలో పడ్డాం.

క్రమంగా ఒకరికొకరం దగ్గరయ్యాం. ఇద్దరి అభిరుచులు ఎంత దగ్గరగా వున్నాయో తెలుసుకుని

ఆశ్చర్యపోయాం. ఇద్దరికీ దేశీయం కన్నా చైనీజ్ ఫుడ్స్ అంటేనే ఇష్టం. ప్రియకి కోక్  అంటే ప్రాణం. పెప్సీ కాదు.  పెప్సీ బచ్చాలు తాగుతారట. నా వుద్దేశం కూడా అదే. ఇద్దరం రికీ మార్టిన్ పాటలంటే నాలుగు చెవులూ కోసుకుంటాం. తనకి ట్రావిలింగ్ అంటే సరదా. ఊర్లంట ఊరేగడం అంటే నాకూ ఇష్టమే. తనకి ‘అయాన్ రాండ్’ నవళ్ళంటే ఇష్టం. ఆ గ్రంథరాజాల్ని నేనూ ఒకటో అరో చదివాను.

 

ప్రియ అమెరికన్ సిటిజన్. అమెరికాలో పుట్టింది. తనకి మూడేళ్ళ వయసులో వాళ్ళు ఇండియా వచ్చేసారు. అందుచేత ప్రియకి ఎలాగైనా తన జన్మభూమి అయిన అమెరికా చూడాలని,  అక్కడే స్థిరపడాలని వుంది. మరీ స్థిరపడాలని నాకు లేకపోయినా ఉన్నత చదువులకోసం, ఉద్యోగానుభవం కోసం తప్పకుండా అమెరికా వెళ్ళి తీరాల్సిందేనని నా నమ్మకం. అక్కడి వర్క్ కల్చరూ, అక్కడి ఫెసిలిటీస్. . . . ఇండియాలో కూడా అవన్నీ మెల్లమెల్లగా  వస్తాయి కాదన్ను,    కానీ, అప్పటికి నేను రిటైరైపోతా నేమోనని నా భయం. ప్రియ ఉద్దేశం కూడా అదే.

 

అందుకే అనిపిస్తుంది. నన్నుతయారు చేసిన వెంటనే, మళ్ళీమర్చిపోకుండా,  అదే థీమ్ మీద

ఓ ఆడపిల్లని కూడా సృష్టించాలన్న సదుద్దేశంతో  బ్రహ్మ ప్రియని సృష్టించాడా అని.

ఇక లాభం లేదు. కథకి వీలైనంతత్వరగా ఒక మంచి ఎండింగ్ ఇవ్వాలి. వివాహయంత్రాంగాన్ని

కదిలించాను. ఇరుపక్క్లల పెద్దవాళ్ళు మాట్లాడుకుని పెద్దగా పేచీ పెట్టకుండా పెళ్ళికి ఒప్పుకున్నారు. అయితే నాకు ఉద్యోగం వచ్చిన తర్వాతే పెళ్ళి అని చిన్న షరతు పెట్టారు. మాకైతే నో ప్రాబ్లమ్.

ఏదో సామెత చెప్పినట్లు(యే సామెతో ఖచ్చితంగా  తెలీదనుకోండి)ఆ ఉద్యోగం

కూడా త్వరలోనే వచ్చింది. చెన్నయ్ టీసీయస్ లో. మాకాబోయే మామగారికి నచ్చేటంత జీతంతో. అమెరికాకి వెళ్ళే అవకాశంతో. ఆవార్త తెలిసిన రోజైతే నాకు,  ప్రియకి పట్టపగ్గాల్లేవు. అంతవరకు దారికి అడ్డుగా ఉన్న ఓ పెద్ద ఉక్కుద్వారం భళ్ళున తెరుచుకున్నట్టయ్యింది. ఆ ద్వారానికి అవతల అంతులేని ఆనందం,  అవధుల్లేని అవకాశం, అమితమైన ఆదాయం-అవన్నీ ఇచ్చే అమెరికా!

 

ఈ శుభసమయంలో పార్టీ చేసుకోవాల్సిందే. బీచ్ కి వెళ్ళాల్సిందే. కెరటాల్ని చూస్తూ

కసాటా తినాల్సిందే.

 

సామాన్య మానవులు బీచ్ కి వెళ్లటానికి, జంటలు బీచ్ కి వెళ్ళటానికి మధ్య ఒకతేడా వుంది.

సామాన్య మానవులైతే బీచ్ లో ఎక్కడో అక్కడ కూర్చుని,    యేదో ఒకటి తిని ఇంటికి పోతారు. జంటలకి అలా వీలుపడదు. బ్యాటింగ్ పొసిషన్ లో వున్న టెండుల్కర్ బాల్ ని యెక్కడ ప్లేస్ చెయ్యాలా అని ఫీల్డంతా కలయ జూసినట్లు,    జంటలు ముందు బీచ్ అంతా క్రిటికల్ గా సర్వే చేస్తారు. సరైన స్పాట్ పట్టుకోవడం లోనే వున్నది సూక్ష్మం అంతా.

 

అలా నేను, ప్రియ సర్వే చేస్తుంటే ఉన్నట్టుండి ప్రియ “అరె అన్నయ్య!” కేకేసింది.

అల్లంత దూరంలో లైటవుస్ లా ఒంటరిగా కూర్చుని వున్నాడు. ఇంకెవడు మా వాడే, శ్రీధర్.

“హలో బాస్! ఏంటిలా?” దగ్గరికెళ్ళి పలకరించాను.

వాడు నోరుమెదపలేదు. రెప్పవేయకుండా సముద్రం వేపు చూస్తున్నాడు. కళ్ళు ఎర్రబారి వున్నాయి. వ్యవహారం కొంచెం సీరియస్సేనని అర్థం అయ్యింది.

వాణ్ణి చీర్ అప్ చెయ్యటానికి కాబోలు,    పాపం  ప్రియ అడిగింది.

“నీక్కూడా కసాటా కావాలా?”

అప్పుడు వాడు చూపుకి మరో ఆడపిల్ల అయితే మిడతలా మసై ఉండేది. ప్రియది గట్టి పిండం కనుక

ఓ మారు నాకొక్కడికే వినిపించేలా హుంకరించి లేచి కసాటా తెచ్చుకోటానికి వెళ్ళబోయింది. ఇక పార్టీ

సాగే సూచనలు కనిపించక తనని ఆ కసాటా తింటూ అలాగే ఇంటికి వెళ్ళపొమ్మని సైగ చేసి శ్రీధర్ వైపు తిరిగాను.

మెల్లగా కథ చెప్పుకుంటూ వచ్చాడు.

“మా కజిన్ ఒకడున్నాడు. నాకు చాలా క్లోజ్. ఉస్మానియాలో మెడిసిన్ హౌస్ సర్జన్ చేస్తున్నాడు. పాపం చాలా మంచివాడు. గత యేడాది ఎంగేజ్ మెంట్ అయ్యింది. అమ్మాయి వీడి క్లాస్ మేటే. వాళ్ళ ప్రేమాయణం ఫస్ట్ యియర్ నుంచే మొదలయ్యిందిట. ఫైనలియర్లో ఇంట్లో చెప్పాడు. ఒకే కులం కాకపోవటంతో మొదట్లో కొంచెం వ్యతిరేకించినా ఇద్దరూ ఇష్టపడుతున్నారని చివరికి ఒప్పుకున్నారు. పెళ్ళి ముహూర్తం ఇంకా రెణ్ణెల్లు ఉందనగా యెవడో ధూర్తుడు ఆ పిల్ల మనసులో ఓ విషబీజాన్ని నాటాడు.

“ఇంకెవడు పిల్ల తండ్రేనా? వీళ్లెప్పుడూ ఇంతే, ఇంతకీ యేవంటాడు. ”

“అబ్బాయికి అమెరికా వెళ్ళే ఉద్దేశం యేవైనా వుందేమో కనుక్కోమ్మా. ఈరోజుల్లో అమెరికా

వెళ్ళకుండా ఎలాగవుతుంది’అని యేదో వాగాట్ట. ఇక ఆ గారాలపట్టి వాళ్ల డాడీ చెప్పింది అక్షరాలా,

ముమ్మాటికీ నిజమని నమ్మి మావాణ్ణి వేపుడు కార్యక్రమం మెదలెట్టింది. ‘అమెరికా వెళ్తావా లేకపోతే

యెండ్రిన్ తాగమన్నావా?”అని కూర్చుంది. ”

“వెంటనే యెండ్రిన్ తెచ్చిచ్చాడా మీవాడు?”

“ఛ ఊరుకో!మంచివాడని చెప్పాను కదా!ఇక మావాడు ‘త్యాగేనైకే. . . ’అంటూ అమెరికాలో

ఎవరో బీరకాయపీచు చుట్టాన్ని పట్టుకుని,    అతని ద్వారా రంగప్రవేశం చేద్దామని పెద్ద పథకం వేశాడు. కాని

డాక్టరుకి వీసా ఇవ్వం పొమ్మన్నారు కన్సలేట్ వాళ్ళు. ”

 

“పాపం పిల్ల డిసపాయింట్ అయ్యిందా?”

“యేడ్చింది మూఢ!”

మావాడికి చిర్రెత్తితే సంస్కృతంలోకి దిగుతాళ్ళేండి.

“పోనీ వచ్చే యేడాది యేదో యెత్తు వేసి అమెరికా వెళ్తాన్నాడు. మెడిసిన్ వదిలేసి దొంగ సర్టిఫికేట్ తో

సాఫ్ఠ్ వేర్ ఉద్యోగంతోనైనా వెళ్తాన్నాడు. కాని పిల్ల విన్లేదు. ”

“మరి తనే యెండ్రిన్ తెప్పించుకుందా?”

“అంత అదృష్టం కూడానా? ముహూర్తానికి సరిగ్గా వారం రోజులముందు యేదో అమెరికా

సాఫ్ట్ వేర్ సంబంధం వస్తే అదే ముహూర్తానికి ఆ రాస్కెల్ని చేసుకుని గతవారమే అమెరికా చెక్కేసింది. ”

“ఇంకేం శని వదిలిపోయిందని మీవాడు ఊళ్ళో పిల్లలకు చాక్ల్ట్లెట్లు పంచాడా?”

“లేదు. వాడొక ఫూల్. ఆ పిల్ల లేకపోతే బతకనని మావాడు తిండి మానేసి, బాగా నీరసించిపోతే

వాణ్ణి హాస్పిటల్లో పెట్టి. . ఒక నెలరోజులు ఇంట్లో అందరికీ నరకం. ఇప్పుడిప్పుడే పరిస్థితి స్థిమితపడుతోంది. ”

“పోన్లేరా,   ఇప్పుడంతా సర్దుకుంటోందిగా. ఇక ఆ సంగతి మర్చిపో. అసలు ఇవాళ నీకో గుడ్ న్యూస్ చెప్పాలి. నాకు ఉద్యోగం వచ్చింది. చెన్నైలో. టీసీయస్ లో. నాకెంత సంతోషంగా వుందో తెల్సా? ఇంకో మూణ్ణెల్లలో మన ఫైనల్ ఎగ్సామ్స్ అవగానే మా పెళ్ళి. వెంటనే చెన్నై చెక్కేస్తాం. టీసీయస్ లో ఓ యేడాది గట్టిగా పంజేసి అక్కణ్ణుంచి అమెరికా చెక్కేస్తాం. అక్కడ ఓ యేడాది టీసీయస్ తోనే వుండి యే ఇంటెల్ కో,    మైక్రో సాఫ్ట్ కో జంప్ చేస్తాం. అక్కడ ఓ నాలుగైదేళ్ళు పనిచేసి గ్రీన్ కార్డ్ రాగానే సొంతంగా కన్సల్టన్సీ పెట్టుకుంటాం. అప్పుడు చూసుకో దామ్ తస్సాదియ్యా ఫ్లారిడా బీచ్ ఒడ్డున ఇల్లు,  బీ ఎమ్ డబల్యూలో తిరుగుళ్ళు. . ఏరా అలా చూస్తున్నావు. నామాటలు నమ్మశక్యంగా లేవా?”

“నీమాటలు కాదురా. అసలు పెళ్ళి అన్న తంతుమీద నమ్మకం పోతుంది. ఆమాటకొస్తే

జీవితం మీదే నమ్మకం పోతోంది. ”

“ఒరేయ్, ఫిలాసఫీ మాట్లాడుతున్నావు. ఒక్క బ్యాడ్ కేసు చూసి ఇలా డీలాపడిపోతే యెలా? మీకజిన్ చేసిన పొరబాటు యేంటంటే సరిగా ప్లాను చేసుకోకపోవడం,  ముందు నుండీ ప్లాన్ వేసుకుంటే అలా లాస్ట్ మినిట్ డిసపాయింట్మెంట్లు వుండవు. ఆ ప్లానులో ముఖ్యపాత్రధారి లైఫ్ పార్ట్‌నర్. ఆ పార్ట్‌నర్ యెంపికమీదే ప్లాను సక్సెస్ ఆధారపడి వుంటుంది. ”

“మరి నీ పార్ట్‌నర్‌ని  నువ్వు సరిగ్గా ఎన్నుకున్నావన్న నమ్మకం వుందా?

“ప్రియ విషయమా? ప్రియకేంరా?. బంగారు బాతు. . ఐ మీన్ బంగారు తల్లి. కొంచెం తిక్కగాని,    మంచిది. మా ఇద్దరి టేస్టులు ఒక్కటే. జీవితంలో ముఖ్యలక్ష్యాలూ ఒక్కటే. ఇంతకన్నా నాకు అన్నివిధాలుగా సూట్ అయ్యే మరో వ్యక్తిని ఊహించుకోలేను. పోనీ నువ్వు చెప్పు, నీకెలాంటి భార్య కావాలో”.

“నేను కోరుకునే అమ్మాయి . . . ’ఎమోషనల్ అయి ఒక క్షణం మాట్లాడలేకపోయాడు.

“నాకు సాంప్రదాయబధ్ధమైన అమ్మాయంటే ఇష్టం. అసలు ఈరోజుల్లో పెళ్ళిళ్ళు చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. దానికి తోడు ఈ తరం ఇంగ్లీషు చదువుల ‘హాయ్,    ’ ‘యాహ్’,    టైపు అమ్మాయిల్ని చూస్తుంటే. . . ”

సరైన పదం దొరకలేదు కాబోలు దానికి ప్రత్యామ్నాయంగా ఇసుకని బలంగా కాల్తో తన్ని చిన్న దుమారంలేపి కంటిన్యూ అయిపోయాడు.

“పెద్దగా అందం,    చదువు,    డబ్బు లేకపోయినా సరే పాతకాలపు విలువలు, నమ్మకాలు గల

అమ్మాయే నాకు కావాలి. భర్త అంటే తనకి గౌరవం వుండాలి. భర్త తెలివితేటల మీద, అనుభవం మీద, నేతృత్వం మీద నమ్మకం వుండాలి.  తన మంచేంటో భర్తకి తెలుసునన్న విశ్వాసం  వుండాలి. వీణ్ణి పెళ్లాడితే నాకేంటి అనే వ్యాపారధోరణి కాక కుటుంబము, ఆమె వేరు కాదన్న భావంతో తనను తాను మనసార సమర్పించుకునే స్త్రీ కావాలి. ఈరోజుల్లో రాజకీయాల్లో తరచు వినిపించే మాట-ఈష్యూ బేస్డ్ సపోర్ట్,    అంటే ‘విషయం అనుకూలంగావుంటే ఒప్పుకుంటాం,    లేదంటే పేచీ పెడతాం’అనే ధోరణి కాకుండ కష్టం లోనూ, సుఖంలోను, కలిమిలోను, లేమిలోను, భర్తతో అన్యోనంగా, అనుకూలంగా, అభిమానంగా వుండే సంస్కారం గల యువతికోసం కలలు కంటాను. . . ”

“కాని అలాంటి అమ్మాయిలు మన జనరేషన్ లో ఉన్నారంటావా?”నా ప్రశ్నని వాడు

వినిపించుకున్నట్టులేదు.

“. . పెళ్ళంటే ఇద్దరు వ్యక్తులు తమ మధ్య కుదుర్చుకునే పెళుసైన బిజినెస్ అగ్రిమెంటు కాదు. గిట్టినంత కాలం వుండి, గిట్టకుంటే పక్కకు నెట్టే చవుక బేరంకాదు. ఒక జంటకి, వారి చుట్టూ ఏర్పడ్ద పరివారానికి, వైవాహిక వ్యవస్థ ఒక పెట్టని కోట లాంటిది. ఆ కోట అందించే చల్లని రక్షణలో దంపతులిద్దరూ చేతులు కలిపి చివరికంటా తమజీవన పోరాటాన్ని సాగిస్తారు. . . ’

వాడిఘోష ఆ సముద్రపుహోరులో కలసి అలా ఎంతసేపు సాగిందో తెలీదు. శ్రీధర్ మాటల్లోని

తీవ్రమైన ఆశయాత్మకత చూసి అబ్బురపోయాను. మామూలుగా ఎంతో తక్కువగా మాట్లాడే ఈ మనిషిలో ఇంత లోతైన భావాలున్నాయా అని ఆశ్ఛర్యపోయాను. ఇలాంటిఆశయాలు గలవాడికి రేపు ఎలాంటి భార్య వస్తుందో?వాణ్ణి సుఖపెడుతుందో,    నిరుత్సాహపరుస్తుందో?అంతవరకు పెళ్ళంటే అంతా తెలుసనే భ్రమలో వున్నాను. వచ్చే నాలుగు దశాబ్దాలు నా జీవితం ఎలా సాగుతుందో పకడ్బందీగా ప్లాను చేసుకున్నాను. కాని శ్రీధర్ చెబుతున్న కోణం నుండి దాంపత్య జీవితాన్ని ఎప్పుడూ చూళ్ళేదు. అసలు చూడాలన్నఆలోచనకూడా రాలేదు.

వీడిమాటల్ని బట్టి చూస్తుంటే ఈ పెళ్ళి అనేది అంత సామాన్యమైన వ్యవహారంలా కనిపించటం లేదు.

దిగితే గాని లోతు తెలీదంటారు. ఈ వ్యవహారం మాటల్తో తేలేది కాదు. మునక వేయాల్సిందే. ఆ

మునక కార్యక్రమం త్వరలోనే జరిగింది. జూన్ నెలలో ప్రియ మెళ్ళో మూడుముళ్ళువేసాను. డబ్బు డబ్బుకి దారి తీసినట్లు,    పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళకు దారితీస్తాయి కాబోలు. మా పెళ్ళిలోనే శ్రీధర్కి ఓ సంబంధం కుదిరింది.

ఆ అమ్మాయి ప్రియకి బంధువు. పేరు సుధ. వాళ్ళది విజయనగరం. శ్రీధర్ కోరుకున్నట్టుగానే మంచి సాంప్రదాయకమైన కుటుంబం. తండ్రి రిటైర్డ్ సంస్కృతం లెక్చరరు. డిసెంబరు దాకా సరైన ముహూర్తాలు లేనందున వెంటనే నిశ్చితార్థం మాత్రం జరుపుకున్నారు.

ఆ ఆర్నెల్లూ శ్రీధర్కి,  సుధకి మధ్య ఘాటైన పోస్టల్ రొమాన్స్ సాగింది. మా వాడు వ్యాసుడిలా ఆ అమ్మాయికి పురాణాలు రాయడం నాకు బాగా గుర్తు. వీడి ఆశయాల గోలంతా ఆ పిల్లకి రాస్తుండేవాడు.  పోస్టల్ వాళ్ళ భారాన్ని తగ్గించడానికా అన్నట్టూ డిసెంబరు నెల మామూలుగా కన్నా

ముందే వచ్చేసింది. విజయనగరంలో పెళ్ళి శాస్త్రయుక్తంగా, ఘనంగా జరిగింది.

ఆ మర్నాడే నేను టీసీయస్ లో జాయిన్ కావల్సిన రోజు. మళ్లీ ఎప్పుడు కలుస్తామో యేమో ఓ పదిరోజులు

ఆగి వెళ్ళొచ్చుగా అన్నాడు శ్రీధర్. కాని కొత్త పెళ్ళిజంట మధ్య నువ్వెందుకురా ఖబాబ్ మే హడ్డీలా అని టీసీయస్ వాళ్ళు వెంటనే వచ్చేయమన్నారు. పెళ్ళి తంతు పూర్తయ్యాక శ్రీధర్, సుధ, ప్రియ,    నేను సుధ వాళ్ళింటి మేడ మీద ఎంతో సేపు కబుర్లు చెప్పుకుంటూ జాగారం చేసేం.

నేను, ప్రియ కొత్తజంట మీద జోకులు వేసుకున్నాం. ‘మావాడు కొంచెం నాజూకు జాగ్రత్త సుధా!’అని నేనంటే,  ‘మరేం ఫరవాలేదక్కా, చెలరేగు అని ప్రియ. అప్పుడు ప్రియ నాతో అంది,    “ఏయ్! శ్రీధర్ మంచి పొయెట్రీ రాస్తాడు తెల్సా? అక్క నాకు కొన్ని పోయెమ్స్ చూబించింది. ’మావాడికి

ఈ టాలెంటు కూడా వుందని నా కెప్పుడూ తెలీదు. సుధ వద్దని మొత్తుకున్నా ప్రియ నాకు ఒకటి వినిపించింది.

అనంతానంద భూమికవో

అపరిమితోధ్ధతికి వేదికవో

నామౌనానికి అలేఖ్య కావ్యానివో

నా ఆత్మకి అద్భుత ఆకృతివో

నీవే నేనై,    నేనే నీవై

ఎడబాయని అమృత ప్రణయమూర్తివో,

ఎవరివో నీవెవరివో!!!!

“నువ్వూ వున్నావ్ ఎందుకు?నామీద ఎప్పుడైనా ఓ అరపోయెమ్ అయినా రాశావా?”  ప్రియ నామీద

జైత్రయాత్రకి వచ్చింది.

“ఓస్! ఇంతేనా? వాడిలా మూడు డ్రమ్ముల టీ తాగకుండా అసువుగా చెప్తాను “అంటూ అందుకున్నాను.

సిగరెట్టున పుట్టిన రింగులపొగవో

గొంతులో రగిలే కోక్ నురగవో

చురుకు చూపుల లేజర్ లైటువో

చుట్టూ తిరిగే శాటిలైటువో

నను ‘ఐస్’చేసే డేవూ ఫ్రిడ్జివో

యూ. యస్. కి వేసిన ప్రేమ బ్రిడ్జివో!

ఎవరివో!నీవెవరివో!

అదివిని తెలుగు సినిమాల్లోలా ఓ దిండు చేతబట్టి ‘యూ’అంటూ ప్రియ నావెంట బడింది. అది చూసి

సుధ పకపకా నవ్వింది. శ్రీధర్ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు.

 

. . . . . . . . . . . . . . . .

 

అవన్నీ తలచుకుంటూ వుంటే ఎంతో సుదూరమైన తీపి గతానికి చెందిన విషయాల్లా తోచాయి. అవన్నీ జరిగింది ఈ జన్మలోనేనా అని సందేహం వస్తుంది. అంతలో టైము గుర్తొచ్చి ఉలిక్కిపడిలేచాను. శ్రీధర్ ఇచ్చిన నంబరుకి డయల్ చేశాను.

“శ్రీధర్!ఎలా వున్నావురా?బొంబాయికి ఎప్పుడు వచ్చావు. సుధ ఎలా వుంది?అమ్మానాన్న బావున్నారా?” ప్రశ్నలవర్షం కురిపించాను.

“అందరూ బావున్నార్రా. డాడీ రిటైరై కాకినాడలోనే సెటిల్ అయిపోయారు. ఎప్పుడూ నీగురించి అడుగుతుంటారు.  ఈమధ్య మన సీనియర్ కోటేశ్వరరావు దగ్గర నీ నంబరు దొరికింది. వాడికి,  నీకు ఎవరో కామన్ ఫ్రెండ్ అమెరికాలో వున్నాట్ట. పోన్లే ఇన్నాళ్లకి మళ్లీ నీగొంతు వింటున్నాను. చాలా ఆనందంగా వుంది. ఇంతకీ అమెరికాలో ఎక్కడుంటున్నావు,    ఇన్నేళ్ళూ ఏంచేసావు?”

“అదా!కొంచెం పెద్ద కథలే. చెప్తా విను. అనుకున్నట్టే టీసీయస్లో చేరిన మరుసటి యేటే అమెరికాకి

వచ్చే అవకాశం వచ్చింది. అమెరికాకి వచ్చిన ఆర్నెల్లకే మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం వచ్చింది. టాటా వాళ్లకి టాటా చెప్పి మైక్రోసాప్ట్ లో చేరిపోయాను. నేను, ప్రియ అట్లాంటా వదిలి సియాటల్ వెళ్ళిపోయాం. ఐదేళ్ళలో ప్రాజెక్టు మేనేజరు స్థాయికి ఎదగ్గలిగాను. ఇంట్లో బోరుకొట్టి చదువుకుంటానని ప్రియ ఆ వూళ్ళోనే ఓ చిన్న కాలేజీలో కంప్యూటర్ సైన్సులో ఎమ్. ఎస్ విజయవంతంగా పూర్తిచేసింది. ఎప్పట్లాగే అత్తెసరు మార్కులు తెచ్చుకుని ఉద్యోగవేట మొదలెట్టింది. రెండేళ్ళు ప్రయత్నించినా ఆ ఊళ్ళో ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. దాంతోనాకు మంచి రోజులు అయిపోయాయి. ఆరోజు నుండే మొగుణ్ణి వేయించుకు తినడం అనే గృహపరిశ్రమ మెదలుపెట్టింది

మా ఆవిడ.

“మరి ప్రియ సంగతి నీకు తెలుసు కదరా. తనది స్ట్రాంగ్ పర్సనాలిటీ!”

‘ఆహా!కాదనడానికి ఎవడికైనా ఎన్ని గుండెలు?కొంతకాలం ఈ మేల్ డామినేటెడ్ సొసైటీని తిట్టిపోసింది. ఇంత గొప్ప ప్రజాస్వామ్యంలో కూడ ఆడదాని బ్రతుక్కి విమోచనం లేదా అని ప్రశ్నించింది. అమెరికన్ రాజ్యాంగం తిరగరాయాలని ఘోషించింది. ఈవిప్లవ భావాలు దేనికి దారితీస్తాయోనని నేను భయపడుతుంటే అంతలో ఎవడో దేవుళ్ళా వచ్చి ప్రియకి ఓ కొత్తదారి చూపించాడు. ’

‘వాడు ఏ నక్సలైటో కాడు గదా   ’

‘కాదు. ఆవూళ్ళో హిందూ టెంపుల్ లోని పూజారి. ఉద్యోగం రాకపోవడానికి కారణం అదేదో గ్రహం మరో గ్రహాన్ని గుర్రుమని చూడడమే అని చెప్పాట్ట. ఈ గ్రహాల్తో మనకెందుకులే గుళ్ళో నానా పూజలూ చెయ్యించింది. ఈ పూజల్తో గుళ్ళో పూజారి బాగా ఫ్రెండ్ అయిపోయాడు. ఆ గుళ్ళోనే శర్మగారని ఒకాయన శని. ఆదివారాలు పిల్లలకి భగవద్గీత క్లాసులు తీసుకునే వారు. పూజారి ఇన్ ఫ్లూయెన్స్ తో శర్మగార్ని తప్పించి ఆ క్లాసులు ప్రియ తీసుకుంది కొంతకాలం. మా ఆవిళ్ళో ఇంత నిద్రాణమైన టాలెంటు ఉందని నాకు అప్పటిదాకా తెలీదు. నీకు తెలుసేమిట్రా?’

“ఊహూ. అసల్తెలీదు.

’ఆ కాలంలోనే సంస్కృతం కూడా నేర్చుకునేది. పాట కూడా నేర్చుకుంటానంటే ఆ ఒక్కటీ వొదిలేయమని గట్టిగా చెప్పాను. రచన కూడా మొదలెట్టింది. ఆమధ్యన ఆకాశం,    గాలి,    మట్టి అనేవో వ్యాసాలు రాస్తే గుళ్ళో పూజారి చాలా మెచ్చుకున్నాట్ట. పంచభూతాల గురించి ఇంతలోతుగా యోగులకి కూడా తెలీదన్నాట్ట. భారతీయ సంస్కృతి అంతా వాటిల్లో చితగొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నాట్ట. ”

“ఏంటి! ఇవన్నీ చేస్తోంది మా ప్రియే! నమ్మలేకపోతున్నాను. పోన్లే ఈ గొడవలో పడి

ఉద్యోగం గురించి మర్చిపోయుంటుంది. ”

” ఇంచుమించు. కాని ఆమధ్య ఓ ధూర్తురాలు, వైజాగ్ లో కాలేజీలో ప్రియ క్లాస్మేట్ అట, గుళ్ళో

కనిపించి,’ఏంటే ప్రియా?ఈ పూజలూ పునస్కారాలు ఎప్పట్నుంచి?నువ్వింకా ఏ మైక్రో సాఫ్ట్ లోనో,    ఇంటెల్ లోనో పొడిచేస్తూ వుంటావని ఇండియాలో అందరూ అనుకుంటుంటే!’అనేసి వెళ్ళిపోయిందట. దాంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది.

మొత్తానికి మా ఆవిడకి ఉద్యోగం రాకపోవడం నా ఉద్యోగం మీదకి వొచ్చింది. ”

’అదేమిటి?నీ ఉద్యోగం ఇచ్చేయమంటుందా ఏంటి?”

“మా కంపెనీ వాళ్ళు వొప్పుకుంటే పువ్వుల్లో పెట్టి ఇద్దును. కాని మా ఆవిడ వేరే రూట్లో వచ్చింది. అమెరికాలోనే దేశానికి మరో మూల ఓ చిన్న ఊళ్ళో ప్రియకి ఓ కజిన్ వున్నాడు. ఆ వ్యక్తికి ఒక సొంత సాఫ్ట్ వేర్ కంపెనీ వుంది. అ కజిన్ తోపాటు మరో ముగ్గురు ఉద్యోగులు వున్నారు ఆ కంపెనీలో. అతన్ని కదిలిస్తే వుత్తినే చేస్తానంటే ఓ ఆర్నెల్లు ఉద్యోగం చేయనిస్తానని ఉదారంగా ఆఫర్ చేశాడు. ఐడియా నాతో చెప్తే ఏడ్చినట్టు వుందన్నాను. దాంతో నిరాహార దీక్ష మొదలెట్టింది. “.

“పోన్లే, అదీ ఒకరకంగా మంచిదే. ఆమధ్యన ఇండియాకి పంపిన ఫోటోల్లో ప్రియ కొంచెం లావెక్కినట్టు కనిపించింది. ”

“కాని ఇక్కడ గమ్మ్త్తత్తేంటంటే నిరాహారం తనక్కాదు. నాకు, ఆ దీక్షేదో ఓ వారం భరించి వొప్పేసుకున్నాను. అర్నెల్లు అనుకున్నది ఏడాది అయ్యింది. ఎంతైనా విరహం భరించలేక నెలకి రెండుసార్లు పక్షిలా 3000మైళ్ళు దాటి మాఆవిణ్ణి చూసి వస్తూండేవాణ్ణి. వచ్చిన జీతంలో సగం ఫ్లైటు ఖర్చులకే అయిపోయేది. పైగా ప్రియ ఆ కజిన్ గాడి కంపెనీలో చేస్తున్నది వొలంటరీ సర్వీసే కదా. దాంతో అక్కడి ఖర్చులు నేనే భరించాల్సి వచ్చేది. ఇలా ఓ ఏడాది చూసి గట్టిగా చెప్పేశాను. తిరిగి సియాటల్ వచ్చేయమని. ”

“రివ్వున వచ్చివాలిందా?”

“స్స-సే-మ్మి-ర్రా రానంది. లేకలేక దొరికిన ఉద్యోగాన్ని బుగ్గిపాలు చేసుకుంటానా? అసలు ఎంచక్కా

మీరే వచ్చేయకూడదూ?అంది. ”

“అదెలారా! నీకుతగ్గ ఉద్యోగం ఇవ్వాలంటే ఆ కజిన్ బాబు కంపెనీ ఎత్తేసుకోడూ”?

“ఆ ప్రమాదంలేదు. దానికీ ఓ థియరీ వేసింది మా ఆవిడ. ఆలాజిక్కేమిటో నీకు అర్థమైతే నాకు చెప్పు. తనకేమోఆ ఉద్యోగం నానాగడ్డీ కరిచాక దొరికింది. తనిప్పుడు అది వదిలేసి తిరిగి వచ్చేస్తే మళ్ళీ ఉద్యోగం దొరక్కపోవచ్చు. మరి నాకో చాలా అనుభవం వుంది. నాకు సర్వ దేశ, కాల సర్వావస్థల్లోనూ ఉద్యోగం దొరుకుతుంది. అదీ థియరీ”.

“కానీ అది చిన్న ఊరంటున్నావు. అక్కడ నీకేం ఉద్యోగం దొరుకుతుంది. ”

“అసలు ఉద్యోగమే వద్దంటుంటే! ఊరికే ఇంట్లో వుంటూ తనకి మోరల్ సపోర్టు ఇమ్మంది. భార్యకోసం ఆ మాత్రం చెయ్యలేరా? అసలు భార్యని సుఖపెట్టడమే భర్త కర్తవ్యమని వేదాలు ఘోషిస్తున్నాయంది. వేదాల్తో మనకి అట్టే టచ్ లేదు గనక ఏం చెయ్యాలో తెలీలేదు. ”

“చొక్కా చేతులు పైకి మడుచుకుని లాగిప్ పెట్టి. . . ”

“ప్చ్! ఇప్పుడు అనుకుని యేం లాభం. అపుడు అంతా అలోచన లేదు సుమా!ఇంతలో  ఆ కజిన్ గాడు కూడా వంత పాడాడు. ‘మీకేంట్సార్! మీకు ఎక్కడైనా జాబు వస్తుంది. వచ్చేయండ్సార్!పాపం ప్రియ మిమ్మల్ని చాలా మిస్సవుతోంది. ఇప్పుడు తనకి సాలరీ కూడా ఇస్తున్నాం కద. మీకేం ప్రాబ్లం వుండదు. ’ అంటూ మొదలెట్టాడు.

’ఎందుకుంటుందీ!ఉచితంగా పని చెయ్యటానికి ఇప్పుడు నువ్వుంటావుగా,    ”

“దాంతో మా ఆవిడ ‘ఇంతమంది ఇన్నిరకాలుగా చెబుతున్నా నీ మొండి పట్టుదల నీదే కదా? నువ్వింత సెల్ఫిష్ అనుకోలేదు విక్రం!’అని వో డైలాగు విసిరింది. ఇక గత్యంతరం లేక మైక్రో సాప్టు జాబు వదిలి,   ఆకజిన్ గాడి కుగ్రామానికి తరలి,    మా శ్రీమతిగారి పంచన చేరాను. ”

“పోన్లేరా,    కొంతకాలం విశ్రాంతిగా వుంటుందిలే”.

“ఛాల్లే!రోజంతా కష్టపది పనిచెయ్యడం అలవాటై ఇలా ఇంట్లో కూర్చుంటే పిచ్చెక్కుతోంది. ఆ కజిన్ గాడు మా ఇద్దరికీ మొగుడై కూర్చున్నాడు. ప్రియని రాచిరంపాన పెడుతున్నాడు. ఉదయం 7గంటలకి ఇల్లు వొదిల్తే రాత్రి తిరిగి వచ్చేసరికి పది, పదకొండు అవుతుంది. ఇంక వంట వార్పు అంతామనమే. ఉదయం9కల్లా ఇంటిపని పూర్తయిపోతుంది.

అప్పట్నుంచి ఇక ఆ దిక్కుమాలిన టీవీ చూస్తాను. మధ్యాహ్నం 12కి లంచ్,    తరువాత ఓ 2గంటలు నిద్ర. లేవగానే టీ. మళ్ళీ దిక్కుమాలిన టీవీ. మూడుగంటలకి మా పక్కనే వున్న ప్రైమరీ స్కూల్ వొదుల్తారు. పిల్లలంతా కోడిపిల్లల్లా బిలబిల మంటూ అరచుకుంటూ, నవ్వుకుంటూ మా యింటి ముందు నుండి వెళ్తుంటే బాల్కనీ నుండి వాళ్ళను చూస్తూ లక్కీ రాస్కల్స్ అని ఓ సారి తిట్టుకుని రాత్రికి వంట మొదలెడతాను. వంట తరువాత మళ్ళీ ది. మా. టీవీ. ప్రియ వచ్చిందాకా,    లేదంటే నిద్రొచ్చిందాక. ఇదీ నాదినచర్య. ”

“ఓరే విక్రమ్!”వొణుకుతున్న స్వరంతో అన్నాడు శ్రీధర్. “నీ దినచర్య వింటుంటే బాధగా వుందిరా. నీ చదువేంటి, క్వాలిఫికేషన్ ఏంటి? ఇలా రోజుల్లా టీవీ చూడ్దం ఏంటి? ఈ ఒంటరి జీవితం. . చాలా సారీ రా!”

“ఫర్వాలేదులేరా. ఇలా ఎంతో కాలం వుండదులే, “అనునయిస్తూ అన్నాను.

“అసలు  ప్రియ తరపున నేను సారీ చెప్పాలి. అసలు తనని పరిచయం చేసింది నేనేగా ” ఫీలవుతున్నట్టుగా అన్నాడు.

“అరె!దానికి నువ్వేం చెయ్యగలవ్? అయినా ఏదో చిన్న పిల్ల. తెలియనితనం. అమాయకత్వం. పాలబుగ్గలు. . “వాడికెలా నచ్చజెప్పాలో అర్థంకాలేదు.

“నీకెంత బోరుకొడుతుందో నేను అర్థం చేసుకోగల్ను,    “మళ్లీ బాధగా అన్నాడు.

“ఫర్వాలేదురా,    అంత అధ్వానంగా యేమీ లేదులే. ” నేస్తాన్ని ఊరడించడానికి ఇక చెప్పక తప్పింది కాదు. “మరీ అంతగా బోర్ కొడితే మా కెల్లీ వుందిగా. . ”

“అరె!మీ సిస్టర్ కూడా అక్కడే వుందేంటి?ఎప్పుడొచ్చింది?”

“కెల్లీ!”ఇంచుమించు అరచినంత పనిచేసాను. కెల్లీని, చెల్లి అని అపార్థం చేసుకోవడం సహించలేకపోయాను,    “క. . . కనిష్కుడు,    కార్తవీర్యార్జునుడు లోలా. . . కెల్లీ. మా పక్కింటి అమెరికన్ పిల్ల. తనుకూడా ఇంట్లో ఒక్కర్తె వుంటుందిలే. పోయిన నెలే తన  పెళ్ళి కాంట్రాక్టు తీరిపోయింది. ”

“పెళ్ళి కాంట్రాక్టా ?అదేమిటి?”

“ఓ అదా”? పెళ్లంటే నూరేళ్ళపంట అన్న థియరీకీ ఈ దేశంలో ఆట్టే చలామణి లేదు. అందుకని కొందరు జంటలు ఇంచక్కా ఇంతకాలం దంపతుల్లా వుందాం అని కంట్రాక్టు రాసుకుంటారు. వైవాహిక జీవితంలో ఎవరెవరు ఎంత దూరంవెళ్లొచ్చో అన్నీ ఆ కంట్రాక్టులో ఉంటాయి. కంట్రాక్టు పూర్తయ్యాక నచ్చితే అసలు పెళ్ళి చేసుకుంటారు. లేదా ఎవరికివారే. . . ”

“అమెరికాలో ఫెసిలిటీస్ అంటే ఇవే కాబోలు”

“మరే! ఇలాంటివి ఇంకా ఎన్నో వున్నాయి. ఈమధ్యనే కంట్రాక్టు పూర్తి కాగానే ఆ మొగుడు పాత్రధారికి గుడ్ బై చెప్పేసింది. కాంట్రాక్టు ప్రకారం కొంత డబ్బు కూడా ముట్టిందట. ఆడబ్బుతో ఓ ఆర్నెల్లు జల్సా చేసి మళ్ళీ ఉద్యోగం చేస్తుందట. కెల్లీకీ తినడమంటే ఇష్టం. ముఖ్యంగా నావంటలంటే ఇష్టం. అలాగే తను ఏమైనా స్పెషల్స్ చేసినా తెచ్చి నాకు పెడుతూంటుంది. బోరు కొడితే ఇద్దరం కలసి పాప్ కార్న్ తింటూ టీవీ చూస్తాం. కార్లో షికారుకెళ్ళి వెచ్చాలు తెచ్చుకుంటాం. యేదో గుడ్డిలో మెల్లలా. . . .  ఈ జీవితం . . . ఇలా. . . నడిచిపోతుందన్నమాట. అదన్నమాట. ”

వద్దనుకున్నా ఓ వేడివేడి నిట్టూర్పు తన్నుకొచ్చింది. ఈ కజిన్ల, కెల్లీల,  పెళ్ళాలసావాసంలో

బండబారిన గుండె ఇంతకాలం తరువాత ప్రాణస్నేహితుడి గొంతువినగానే పులకరించింది. వేడంతా వెళ్లగ్రక్కకుండా ఉండలేకపోయాను.

అప్పుడు గుర్తొచ్చింది. ఎంతసేపూ నాగోలేగాని,    వాడి మంచిచెడ్దా కనుక్కుందామన్న ఆలోచనే

లేదు. అయినా వాడికేంలే అదృష్టవంతుడు. రాముడు,    సీతలాంటి సుధని చేసుకున్నాడు. జీవితం అంటే వాడిది. కాపురం అంటే వాడిది. అదే అన్నా వాడితో.

“అయినా ఒరేయ్!ఎంతసేపూ నాగోలెగాని నీగురించి అడగలేదు చూశావా?ఎలా వున్నావు?సుధ ఎలా వుంది?

ఏంటి సంగతులు? అయినా నీకేంలే. రాముడివి. సీతలాంటి సుధను కట్టుకున్నావు. మీరు ఆదర్శదంపతులు. మీకేంఢోకా ఉండదు. ”

“ఒరేయ్!నువ్వు మరీ ఆకాశానికి ఎత్తేస్తున్నావు”.

“అదేంలేదు. ఉన్నమాట చెప్తున్నాను. అసలు మనతరం దంపతులకి కాపురం ఎలా చెయ్యాలో సాదోహరణంగా జెల్లకొట్టి నేర్పడానికే బ్రహ్మ మీ ఇద్దర్నీ చేసి భూమ్మీద వొదిలేశాడు. మొగుడంటే వీడు, పెళ్ళామంటే ఈ పిల్ల అని మాబోటి వాళ్లకి చెప్పుచ్చుక్కొట్టి చెప్పడానికే ఈ పంజేశాడు బ్రహ్మదేవుడు. ”

“ఒరేయ్! ఇంక చాల్లే ఆపరా. ”

“లేద్రా,    మీరు అసలైన దంపతులు. అసలైన దంపతులు అంటే ఎవరనుకున్నావు?వాళ్ల తీరే వేరు. వాళ్ళు మామూలుగా మాలా వుండరు. అసలైన భర్త రాట అయితే అసలైన భార్య లతలా అతణ్ణి అల్లుకుపోతుందన్నమాట. అసలైన భర్త సాగరగర్భం అయితే, అసలైన భార్య తుళ్ళిపడే కెరటం. . అంటే మరేం లేదు. భర్త మౌనంగా గట్టిగా సపోర్టు ఇస్తుంటే భార్య వ్యవహారం నడిపిస్తుందన్నమాట. అంటే ఇక్కడ మళ్ళీ ఎక్కువతక్కువల ప్రశక్తిలేదు. ఇద్దరూ సమానమే. మంచి ఫ్రెండ్స్ అన్నమాట.

ప్రాణస్నేహితులు,    కుక్కపిల్లలు. . . ”

“ఒరేయ్!పిచ్చిగాని పట్టలేదు కదా?” అవతల అరచినంత పనిచేశాడు శ్రీధర్.

ఈ రంకెలకి బెదిరే స్థితిలో లేదు నా భావావేశం.

” . . . . లోకం అనే లాన్ లో జీవితం అనే బంతితో హాయిగా ఆడుకునే కుక్కపిల్లలాంటి వాళ్ళు

అసలైన దంపతులు. మామూలు దంపతుల్లా వాళ్ళు కాపురం అంటే బెంబేలు పడరు. వాళ్లకి సంసారం అంటే

జస్ట్ ఎ గేమ్. సరదాగా ఓ ఆటలా ఆడేస్తారు. చేయిచేయి కలిపి సునాయాసంగా ఆడేస్తారు. . . . ”

“ఒరేయ్! మందుమీద గాని వుంటే చెప్పు మళ్లీ ఫోన్ చేస్తా!”ఈసారి మర్యాదగానే అన్నాడు.

అయినా ప్రవాహం ఆగలేదు.

“ఆ కోవకి చెందిన భర్తల్రా మీరు. మీకు ఢోకా వుండదు. . . ”

“అయిపోయిందా!!!!”

“. . . మీది ఒకేమాట. ఒకే బాట. భర్తచెప్పకుండానే భార్య అన్నీ చేసి పెడుతూ వుంటుంది. భార్య అడక్కుండానే భర్త అన్నీ సమకూరుస్తూ ఉంటాడు. ఒకరి గోడు ఒకరికి చెప్పుకోకుండానే తెలిసిపోతూ వుంటుంది. ఒకరి ఆలోచనలు ఒకరికి అనకుండానే తెలిసిపోతుంటాయి. మీ ఇద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టినవాళ్ళు. సోల్ మేట్స్ అన్నమాట. మీకు ఢోకా వుండదు. ”

భావావేశం కొంచెం తగ్గుముఖం పట్టినట్టు అనిపించి శ్రీధర్ మళ్ళీ ఆశగా అడిగాడు,    “అయిపోయిందా”అని.

కాని ట్రాన్స్ లోంచి మాట్లాడుతున్నట్టు నా స్వరం గంభీరంగా మారిపోయింది. “మీ అనుబంధం ఈ జన్మది కాదు. ఎన్నో జన్మలుగా వస్తోంది. ఈ విశాల విశ్వంలో బిలియన్ల సంవత్సరాలుగా ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతున్న బైనరీ నక్షత్రాల వంటివారు మీ దంపతులు. ”

“కాని ఆ బైనరీ నక్షత్రాలు ఇప్పుడు ఒకదాన్నుంచి ఒకటి ఏడువందల యాభైమూడు లైట్ ఇయర్ల దూరానికి వచ్చేశాయి. ఒకదాంచుట్టూ ఒకటి తిరగడం మానేశాయి. ”

“ఎన్ని లైట్ ఇయర్లు?”

“ఏడువందల యాభైమూడు. ”

“ఓ!. “ఒక్క క్షణం నాకేం అర్థం కాలేదు. “ఏమిట్రా నువ్వు చెప్పేది?”బాగా మందు పట్టించినట్టున్నాడు రాస్కెల్. అదే అడిగాను. “ఏరా మందు గాని పట్టించావా ఏంటి?కావాలంటే మళ్ళీ ఫోన్ చేస్తాను. ”

“హమ్మయ్య చెట్టు దిగొచ్చావా?నీ తిక్క వొదల గొట్టడానికే అలా అన్నాను. నువ్వు అన్నట్టు నేను

రాముణ్ణీ,    సుధ సీత కాకపోయినా మా కాపురం సంపూర్ణ రామాయణమే అయ్యింది. నేను సుధని చూసి రెండేళ్ళవుతోంది. ”

“వ్వాట్?నువ్వు చెప్పేది నిజమా?”

“సరిగ్గా రెండేళ్ళ క్రితం,    జులై నెల మేం బొంబాయిలో వుండగా ఓ దుర్ముహూర్తాన విజయనగరం నుంచి వుత్తరం వచ్చింది. రాబోయే ఆగస్టులో వరలక్ష్మీ వ్రతానికి ఎలాగైనా అమ్మాయిని పంపమంటూ మా అత్తగారు రాసారు. అమ్మాయికి పెళ్లయ్యాక మొట్టమొదటి వరలక్ష్మి వ్ర్తతం పుట్టింట్లోనే జరుపుకోవాలని వాళ్లకి ఏదో సెంటిమెంటట. ఓనెల్రోజులు వుండేట్టుగా పంపమని,    వినాయక చవితి వరకు వుంచుకుని పంపుతామని రాశారు. అదే వుత్తరంలో మా మామ గారు కూడా రాశారు ఆగస్టులో వచ్చే కృష్ణాష్టమికి ఎలాగైనా అమ్మాయిని పంపమని. ఆవిడ రాసింది ఈయన చదివినట్టులేదు.

ఈ మొగుడూ పెళ్ళాలిద్దరూ వాళ్లకి తెలీకుండానే ఒకే త్రాటి మీద నడిచేయడం చూసి అంత కోపంలోనూ వాళ్లని మనసులోనే మెచ్చుకోకుండా వుండలేకపోయాను. కాని ఒక పూర్తి నెల సుధ లేకుండా  బ్రతికి బట్టకట్టడమా?నాకైతే దిక్కుతోచలేదు. ”

“కొత్తల్లో అలానే వుంటుంది లేరా. అలవాటైతే అదే సద్దుకుంటుంది. ”

 

“సర్లే! నీదంటే రాతిగుండె. ఎలాగోలా అత్తమామల్తో బేరమాడి నెల్రోజులు నుండి పదిరోజులకి దింపేను. షెడ్యూల్లోంచి వినాయక చవితి తీయించేశాను. పెళ్ళయ్యాక మొట్టమొదటి వినాయక చవితి భర్తతో చేసుకోకపోతే కొంపలు అంటుకుంటాయని ప్రతి సెంటిమెంటు అంటించేను. మొత్తానికి చాలా పకడ్బందీగా సుధని పంపేను. కాని యేం చెయ్యను. విధి వక్రించింది. ”

“విధి వక్రించిందా. మీ అత్తగారి బుధ్ధివక్రించిందా?”

“లేదు,    మామామగారి కాలు వక్రించింది”

“అంటే బుధ్ధి కాళ్ళలోకి చేరిందన్నమాట”.

“ఛ!అది గాదు. చెప్తా విను. వరలక్ష్మీవ్రతం వరకు అంతా సాఫీగానే సాగింది. నో ప్రాబ్లమ్. కాని కృష్ణాష్టమితో పెద్ద చిక్కు వచ్చిపడింది. వాళ్ల ఇంట్లో కృష్ణాష్టమి చాలా సందడిగా జరుపుకుంటార్ట. కృష్ణపాదాలు వెయ్యడం దగ్గరినుండి,  ఉట్టి కొట్టడం వరకు అంతా చాలా గ్రాండ్ గా చేస్తార్ట. తరతరాల మా మామ గారి శిష్యులంతా వచ్చి చాలా కోలాహలంగా వుంటుందట. అన్నిట్లోనూ మామగారు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటార్ట. అయితే సుధ ముందే హెచ్చరించిందట.  ‘నాంగాండీ! నాంగాండీ! తతిమావి ఏవైనా చెయ్యండి గానీ ఉట్టిజోలికి మాత్రం పోబోకండి’అని. ”

‘ఇకనేం, ఉట్టికోసం చేతులు చాచి కాళ్ళు విరగ్గొట్టుకునుంటాడు మీ మామ. ”

“సత్యం పలికావు. మరేం చెయ్యడం. మా పుట్టింట్లో పండగల పిచ్చి హెచ్చు. మామగార్కి మేజర్

హిప్ ఫ్రాక్చర్ అయ్యింది. వయసు 75దాటడంతో అతుక్కోవడానికి రెణ్ణెల్లు పట్టింది. ఆ రెణ్ణెల్లూ ఇంట్లో

సాయానికని సుధ అక్కడే వుండిపోయింది. ”

“ఇకనేం వినాయక చవితి ముచ్చట కూడా తీరిపోయినట్టే. పోన్లే మీ అత్తగారికి మనశ్సాంతి. ”

“కాలు నయమైంది కదా అని సుధ తిరుగుప్రయాణానికి సిధ్ధం అవుతుంటే లాస్ట్ మినిట్ లో

మా అత్తగారు పుల్లవేసింది. మరోవారం రోజుల్లో నవరాత్రులు వస్తుంటే అమ్మాయిని పంపడం ఎలా బాబూ అంటూ మొదలెట్టింది. ”

“ఎలాగేవుంది?పిల్లని కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో కుదేస్తే నువ్వు దాదర్ లో దింపుకుంటావు. ”

“నేనూ అదే అన్నాను. కాని మాఅత్తగార్కి నా అయిడియా రుచించలేదు. మొత్తానికి నాకు దసరా సరదాగా సాగలేదు. నవరాత్రులు సుధారహితంగానే గడచిపోయాయి. ఇక రేపోమాపో వస్తుందిలే అని ఆశగా ఎదురుచూస్తూ ఉండిపోయాను. ”

“హ హ్హ!దసరా తరువాత దీపావళి వస్తుందని మరచిపోయావా?”

“ఆ భయం మనసులో లేకపోలేదు. కాని మా అత్తగారు అంతకి తెగిస్తుందనుకోలేదు. ”

“కాని తెగించింది!”

“అవున్రా. నవంబరు రాగానే ఆవిడ దగ్గర్నుండి ఫోను. ‘బాబూ ఇంకా వారం రోజుల్లో దీపావళి ఉందనగా. . . ’అంటూ మొదలెట్టబోతే వొళ్ళుమండి అన్నాను, ‘వద్దండీ! మీ అమ్మాయిని మీ దగ్గరే అట్టేబెట్టుకోండి. దీపావళి, నాగులచవితి, ఇంకా నెలాఖరికి కార్తీకపూర్ణిమ, గురునానక్ జయంతి, ఆపై నెల ఈదుల్ ఫితర్,  రంజాన్,  క్రిస్ మస్ ఇవన్నీ శాస్త్రోక్తంగా జరిపించి ఒకేసారి న్యూ ఇయర్కి పంపిస్తే చచ్చి  మీ కడుపున పుడతాను, ’అని గట్టిగా అంటించాను. ”

“దెబ్బకి భయపడి అమ్మాయిని బండెక్కించిందా?”

“ప్చ్. లేదు. పైగా ఆవిడేవందో తెలుసా?రంజాన్, క్రిస్ మస్ జరుపుకోవడం మా ఆచారంలో లేదు గాని,    సంక్రాంతి వెళ్ళీ వెళ్ళగానే పంపేస్తాను. మన ఆచారాల పట్ల ఇంత గౌరవం గల అల్లుడు దొరకడం మా అదృష్టం బాబూ’అంది

ఆవిడ చాలా ఫీలవుతూ. చేసేదిలేక పోనీ సంక్రాంతయినా నా జీవితంలో సుధాకాంతులు ప్రసరిస్తుందన్న ఆశతో ఒంటరిగా ఆ ఏడాదంతా గడిపేసాను. ”

“పోనీ నువ్వెళ్ళి సుధని చూసి రాలేకపోయావా?”

“ఎలారా?మా పుట్టింటివాళ్ళకి ఉన్నంత పండగప్రేమ మా కంపెనీ వాళ్లకి వుంటే బానే వుణ్ణు. కాని మాది మల్టీ నేషనల్ కంపెనీ. ఎట్టకేలకి సంక్రాంతి వచ్చింది. వెళ్ళింది. ”

“మరి సుధ రాలేదా?”

“లేదు”

“అదేం? నాకు తెలిసి సంక్రాంతిలో గెంతే కార్యక్రమాలేవీ లేవే. ఈసారి యేంజేసాడు మీమామ?”

“చెప్పుకో చూద్దాం?”

ఒక్క క్షణం ఆలోచిస్తే అర్థమయ్యింది.

“భోగీమంట!”

భలే పట్టేశావు. భోగీమంటలో కర్రలు తోస్తూ చెయ్యి కాల్చుకున్నారు మామామగారు. ఇక తరువాత కథ నువ్వు ఊహించుకోగలవు. ఇలా ఒక దాంతరువాత ఒకటి పండుగలు రావడం,  మామామగారు దూకుడు మీద ఏదో పండగ ప్రమాదంలో ఇరుక్కోవడం, అత్తగారు అర్జీ పెట్టుకోవడం, సుధని

అట్టేబెట్టుకోవడం-ఈనాలుగు ఘట్టాలూ చక్రికంగా జరుగుతూ నా వంటరి జీవితాన్ని అంతులేకుండా పొడిగించాయి. అలా మరో యేడాది గడిచింది. ”

“అంటే మళ్ళీ సంక్రాంతి అన్నమాట. ఈసారన్నా మీమామ వొళ్ళు దగ్గర పెట్టుకు కూర్చున్నాడా?”

“కూర్చోక యేంజేస్తారు?వద్దన్నా వినకుండా ఆ డిసెంబరంతా తెల్లారే లేచి సుధని పట్టుకుని పెద్ద కింగ్ లా వాకింగ్ అని బయలుదేరారు. దాంతో చలిజ్వరం వచ్చి కీళ్ళువాచి మంచం పట్టారు. సంక్రాంతి సాహసాలు చెయ్యడానికి మరి ఓపికలేదు. అందుకని తండ్రికి తోడుగా మరో మూణ్ణెల్లుండి వస్తానంది సుధ. దాంతో నాకు చిర్రెత్తుకొచ్చి ఇక అందుకున్నాను, ‘అక్కర్లేదు, మూణ్ణెల్లు కాదు గదా మరో ముప్ఫయ్ ఏళ్ళు అక్కడే వుండిపోయినా నాకేం బెంగలేదు.

శ్రవణకుమారుడి టైపులో అలా తల్లిదండ్రుల సేవలు చేసుకుంటూ నువ్వు తరించి అక్కడే రిటైరై పోదువుగాని. అ తరువాతపెన్షను వచ్చే ఏర్పాటు కూడా వుందేమో కనుక్కోమంటే కనుక్కుంటాను. ఏదో సాంప్రదాయమైన కుటుంబం కదా అని నిన్ను చేసుకున్నాను. కాని మోసపోయాను. దారుణంగా మోసపోయాను. ఏదైనా పండగ రాగానే ఎగబడి కాళ్ళు చేతులు విరగ్గొట్టుకోవడం,    చేతులు కాల్చుకోవడం తప్ప మీనాన్నకి వేరే పన్లేదు. పూజలు, వ్ర్తతాలు అంటూ

కూతుళ్లని పోగేసుకుని పార్టీ చేసుకోవడం తప్ప  మీ అమ్మకి వేరే పన్లేదు. పుట్టింటి చూరు పట్టుకుని కోతిపిల్లలా వేలాడ్డం తప్ప నీకు వేరే పన్లేదు. మన సంసారం యేడ్చినట్లే వుంది. ఇంతవరకు జరిగిన తమాషాలు చాలు. ఇకపై నాతో కాపురం చేసే ఉద్దేశం వుంటే వున్న పళాన బయల్దేరి రా,    లేదంటే నీ దారినీది,    నాదారి నాది,    ’అంటూ అల్టిమేటం ఇచ్చాను. ”

“అయ్యో పాపంరా! మరీ కఠినంగా మాటాడినట్టు వున్నావు. మరేవంది?”

“ఏవీ అన్లేదు. ఏడ్చింది. కన్నీరుమున్నీరుగా ఏడ్చింది. క్రిందపడి దొర్లిందేమో మరి ఫోన్లో కనిపించలేదు. కన్నీరు వరదలై పారి వుంటుంది. ఇల్లు గనుక సరిపోయింది. అదే యస్. టి. డి బూత్ అయ్యుంటే ఆ వరదలో బూత్ కొట్టుకుపోయి నానా గొడవ అయ్యేది. అలా గుక్కపట్టి అయిదు నిముషాలు ఏడ్చి అప్పుడంది,

‘సరే వచ్చేస్తానండి.

మీరు అన్నట్టే వచ్చేస్తాను. కాని ఒక్కసారి ఆలోచించండి. నాకున్నది ఒకేఒక్క నాన్న(అక్కడికి మనందరికీ తలా ఐదుగురేసి వున్నట్టు!)ఒకే అమ్మ. నేను అమ్మనాన్నలకి కొంచెం ఆలస్యంగా పుట్టాను. నేను పుట్టినప్పటికే అక్క,  అన్న హైస్కూలుకి వచ్చేశారు. వైజాగ్ లో మా చిన్నాన్న గారింట్లో ఉండి చదువుకునేవారు. కనుక ముగ్గుర్లోకి ఇంట్లో ఎక్కువకాలం వున్నది నేనే. పైగా అందరికన్నా చిన్నదాన్ని కావడంతో గారాబంగా పెంచారు. చదువు చెప్పించడమే కాక వాళ్ళే స్వయంగా చదువుచెప్పారు. మా నాన్న గారు నాకు సంస్కృతం నేర్పారు. అమ్మపాట నేర్పింది. అందుకే వాళ్ళే నాగురువులు కూడా. నా సర్వస్వం వాళ్ళే. నాలోకం. వాళ్లకేమన్నాఅయితే నేను సహించలేను. మా నాన్నగారు ఇంకా ఎంతకాలం ఉంటారో తెలీదు. తల్లిదండ్రుల బాధ్యత బిడ్దలది కాదా? తండ్రి చావు బతుకుల్లో వున్నాతన కర్మకి తనని వొదిలి వచ్చేయమంటారా?భారతీయ విలువలు,    నమ్మకాలు వున్న సంస్కారవంతులని మేమంతా మిమ్మ్లల్ని గౌరవిస్తాం. ఇదేనా మీరు నేర్చిన సాంప్రదాయం?ఇదేనా మీరు నేర్చుకున్న భారతీయ సంస్కృతి?అంటూ నన్ను నిలదీసింది. ”

“మా ఆవిడ నన్ను వేదాల్తో కొడితే మీ ఆవిడ నిన్ను భారతీయ సంస్కృతి పెట్టి కొట్టిందన్నమాట. భలే!అవునూ అక్క వుందంటున్నావు.

ఆవిడేంచేస్తోంది?ఆవిడ వెళ్ళి సాయం చెయ్యొచ్చుగా?”

“ఆవిడ కొడుకు ఏడో క్లాసులో వున్నాట్ట. అసలే కామన్ ఎగ్సామ్. పిల్లాడి చదువు పాడైపోతుందని

ఆవిడ రానందిట. ”

“మరి అన్న మాటేమిటి? అతను రావడమో,    భార్యని పంపడమో చెయ్యొచ్చుగా?”

“పాపం మా మరిది సంగతి నాకన్నా అధ్వానంగా వుంది. తన అత్తమామలు మారిషస్ లో వుంటారు. అతని మామగారికి సుస్థీ చేసిందని తన భార్య గతమూడేళ్ళుగా మారిషస్ లో వుంటోందిట. ఇతగాడు బెంగులూరులో,  ఆ పిల్ల మారిషస్ లో. . . పాపం ఇతగాడి జీతమంతా ఐ. యస్. డి కాల్స్ కే సరిపోతుందట. ”

“అయ్యో! అన్నిమార్గాలు మూసుకున్నాయన్నమాట. మరేం చేస్తావురా?’

“ఏవుంది చెయ్యడానికి? ఆలుచిప్ప స్వాతిచినుకు కోసం, భీష్ముడు ఫైనల్ డిపార్చర్ కోసం

ఎదురు చూసినట్టు ఎప్పటికైనా మా ఆవిడకి కనువిప్పు కలిగి తిరిగి రాకపోతుందా అని ఎదురుచూస్తూ వుంటాను. ”

“అయ్యో!సారీరా. నాలాంటివాడైతే ఫరవాలేదు. కాని నువ్వు చాలామంచివాడివి. నీకు జరగడం బాధగా వుంది. అయినా సాంప్రదాయం ఇలా హాండ్ ఇస్తుందని ఎవడు కలగన్నాడు. పాపం నువ్వసలే మెతకవాడివి. నీకెప్పుడూ ఎవరో ఒక తోడుండాలి,  దగ్గరుండి అన్నీ చూసుకోవాలి. హాస్టలో లో నేను చూసేవాణ్ణిగా నీ తంటాలు. ఒక్కడివీ ఎలా వుంటున్నావో ఏమో!”

“ఏదో మేనేజ్ చేస్తున్నాలేరా. అంత ఇదిగా ఏంలేదులే”.

“అసలు సుధ ఫోన్ నంబరు ఇవ్వు. బాగా చీవాట్లు పెట్టి వెంటనే బయలుదేరమని చెబుతాను. ”

“వద్దులేరా. లేనిపోని తలనొప్పి. ”

“తలనొప్పి ఏవుందిరా? చెప్పేతీరులో చెబితే తనే అర్థం చేసుకుంటుంది. నంబరు ఇవ్వు నేను మాట్లాడతాను. ”

“వద్దులేరా. ”

“అదేం”

“ఇప్పుడొద్దులే. . నాకిక్కడ బానే వుంది. ”

’ఇంతసేపూ యేడ్చి ఇప్పుడు బావుందంటా వేమిట్రా?”

’అదంతేలే నీకు తెలీదు. ”

“ఒరేయ్!నసుగుడు ఆపి విషయం చెప్పు. ఏదో దాస్తున్నావు. ”

“అదీ. . మరేం లేదురా. ఇప్పుడు స్వయంపాకం కదా. ఆ మధ్య అప్పడాలు వేయిస్తూ నూనె పడి

చేయి కాలింది. మా ఇంటోనరు (మరాఠీవాడు,    మంచివాడు)అది చూసి అప్పట్నుంచి భార్యతో చెప్పి భోజనం పంపడం మొదలెట్టాడు. ఆ భోజనం తన కూతురు తెచ్చి ఇస్తుంటుంది. ఆ అమ్మాయి బి.యస్. సి కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. సరేవాళ్ల ఋణం ఎందుకులే అని ఆ పిల్లకి సాఫ్ట్ వేర్ నేర్పిస్తానని చెప్పాను. రోజూ సాయంత్రం ట్యూషన్ చెబుతున్నాను. చాలా తెలివైన పిల్ల. ఇట్టే పట్టేస్తుంది. చాలా మంచిది కూడా. పేరు షాలిని. ఎత్తు ఐదు,    రెండు. . . ”

“ఏమిట్రోయ్ కొలతలు చెబుతున్నావు. దేహశుధ్ధి జరగ్గలదు జాగ్రత్త. ”

“ఛఛ! అలాంటిదేం లేదు. భలేవాడివే. ఏదో మాట వరసకి అన్నా. చదువు బాగా సాగుతోంది. నేను అనుకున్నపోర్షన్ పూర్తవ్వటానికి మరో మూణ్ణెల్లి పడుతుంది. ఇప్పుడు సుధ వస్తే చదువుకి ఆటంకం అవుతుందని. అంతే. ”

“అంతేనంటావా?”

“పైగా సుధ అక్కడ వాళ్లవాళ్లకి ఎంతో అవసరం. నాదేముంది. ఈట్యూషన్లతో సాయంత్రం యేదో కాలక్షేపం అయిపోతుంది. వంట కూడా చేసుకునే పన్లేదు. షాలిని భలే వండుతుందిలే. మంచిమంచి మరాఠీ వంటలు చేసి తెస్తూ వుంటుంది. . . ”

ట్రీంగ్! కాలింగ్ బెల్!

“ఒరేయ్ శ్రీధర్!ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు. ఇక వుండనామరి. ఇంకేం విశేషాలు లేవుగా మరి. ఈ ట్యూషన్లూ అవీ మానేసి త్వరగా సుధని తెచ్చేసుకో. జాగ్రత్త. అసలే ఊరుకాని ఊరు. సరేనా?”

“నువ్వేం వరీ అవకురా. మరో మూణ్ణెళ్లలో షాలిని పెళ్ళి కూడా ఫిక్స్ అయిపోయింది. తను జస్ట్ ఎ ఫ్రెండ్ అంతే. ”

ఈ సారి కాలింగ్ బెల్ తో పాటు తలుపుబాదుతున్న చప్పుడు.

“శ్రీధర్ ఇక వుంటాను సరేనా?”

“సరే. నువ్వుకూడా త్వరగా మంచి జాబ్ లో చేరి, నువ్వు ప్రియ హాపీగా వుండాలి. సరేనా? ఉంటానైతే. బై”

“ఉంటాను. బై. ”

మిన్నువిరిగి ముక్కలై తలుపు మీద పడుతున్నట్టు చప్పుడు. ఎవరో తలుపుని ఓ పట్టు పడుతున్నారు.

’హూ ఈజ్ ఇట్?” అంటూ విసుగ్గా వెళ్ళి తలుపు తీశాను.

ఒక చేతిలో లసాన్యా గల గిన్నెతో, మరో చేతిలో చీజ్ సాండ్ విచ్ ల పళ్లెంతో, ఒక చంకలో లేస్ చిప్స్ తో,   మరో వైపు1లీటర్ బాటిల్ తో వెల్ల వేసిన వైట్ హౌస్ లాంటి తెల్లని పలువరుసతో డైటింగ్ మానేసిన ధాన్యలక్ష్మిలా నవ్వుతూ ప్రత్యక్షమయ్యింది నా విచిత్ర జీవిత కల్పవల్లి-కెల్లీ.

గుడ్డిలో మెల్ల అన్న సామెత గుర్తొచ్చింది.

సంతోషం,    బాధ ఒకేసారి తన్నుకొచ్చాయి. రెంటినీ ఒకేసారి వ్యక్తం చెయ్యలేక ఓసారి నిట్టూర్చాను.

“కమాన్ ఇన్ “అంటూ అన్యమనస్కంగానే ఆహ్వానించాను. శ్రీధర్ జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటూఆలోచనల్లో పడిపోయాను. మా నేస్తం తను తెచ్చిన సరుకంతా టీవీ ముందు కూర్చుని ఆ తెల్లని పళ్లతో కచకచ కొరుకుతూ చకచక తినేస్తుంది. ఆ పళ్లని చూస్తే గుర్తొచ్చింది. గుడ్డిలో మెల్ల కాదు. ఈ సందర్భంలో సరిపోయే సామెత మరేదో వుంది. అందులో పళ్ళ ప్రసక్తి వస్తుంది. రాయి అని కూడా వుంటుంది. అదేం సామెత అబ్బా?

 

అంతలో “హేయ్ వాచ్ దిస్!”అన్న కెల్లీ కేకకి తుళ్ళిపడి నీరసంగా నవ్వుతూ టీవీ ముందు చతికిల బడ్డాను.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

6 thoughts on “ఏ రాయైతేనేం?

  1. కామెంట్లకి ధన్యవాదాలు. ఇది కొన్నేళ్ల క్రితం రాసిన కథ. ఆ రోజుల్లో పి.జి. వుడ్ హౌస్ నవళ్లు తెగ చదివేవాణ్ణి. కథ నచ్చితే గురువుగారికే క్రెడిట్. నచ్చకపోతే క్రెడిట్ అంతా నాదే!

  2. >>> మీరు అసలైన దంపతులు. అసలైన దంపతులు అంటే ఎవరనుకున్నావు?వాళ్ల తీరే వేరు. వాళ్ళు మామూలుగా మాలా వుండరు. అసలైన భర్త రాట అయితే అసలైన భార్య లతలా అతణ్ణి అల్లుకుపోతుందన్నమాట. అసలైన భర్త సాగరగర్భం అయితే, అసలైన భార్య తుళ్ళిపడే కెరటం. . అంటే మరేం లేదు. భర్త మౌనంగా గట్టిగా సపోర్టు ఇస్తుంటే భార్య వ్యవహారం నడిపిస్తుందన్నమాట. అంటే ఇక్కడ మళ్ళీ ఎక్కువతక్కువల ప్రశక్తిలేదు. ఇద్దరూ సమానమే. మంచి ఫ్రెండ్స్ అన్నమాట.

    ప్రాణస్నేహితులు, కుక్కపిల్లలు. . . ”

    మాష్టారూ మీ దగ్గర పాఠాలు చాలా నేర్చుకోవాలి. ఈ మధ్య కాలంలో ఇంత హాస్య రచన చదవలేదు. అద్భుతం. బ్రిలియంట్. హ్యాట్స్ ఆఫ్.

  3. హహహ. బాగుందండీ..
    మంచిదయింది మీ కథ చదివాను…ఇంక పుట్టింటికెళ్ళే ప్రసక్తే లేదసలు!!!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *