April 24, 2024

కూచిపూడి – నాతొలిఅడుగులు


రచన: తరంగిణి

|| శ్రీ గురుభ్యోన్నమః ||

||శ్రీ పర దేవతాయై నమః||

 

 

 

 

చిన్నప్పుడు దూరదర్శన్ లో చూసిన డాన్సుప్రోగ్రాముల వల్లనో, లేక చదివిన పుస్తకాల వల్లనో సంప్రదాయ శాస్త్రీయ నృత్యమంటే ఒక రకమైన యిష్టం, నేర్చుకోవాలనే ఒకలాంటి తపన ఉండేవి….సంగీత,నాట్యాలమీద నా ఆసక్తి చూసి,పల్లెటూళ్ళో ఉండటం మూలాన మాకు ఏమీ నేర్పించలేక పోతున్నందుకు నాన్న తెగ బాధపడుతుండేవారు…

 

సెలవులకి వెళ్ళినపుడు అక్క దగ్గర సంగీతంలో కాసిన్ని పదనిసలు పలకడం, వీణమీద ఓ చెయ్యి వెయ్యడం వల్ల సంగీతం నేర్చుకోవాలన్న కోరిక కాస్త సద్దుమణిగేది……పైగా మనకి శృతి చాలా తక్కువ ఉండడం,లయజ్ఞానం కాస్త తక్కువవ్వటం, మన గాత్రమాధుర్యం కాస్త ఎఱుకై ఉండటం మూలాన, సంగీతం మనకి అంత బాగా అబ్బదులే అనుకుని సంగీతం నేర్చుకోలేకపోయినందుకు అంతగా అనిపించేది కాదు…కాని, టీవీల్లో నృత్యప్రదర్శనలు చూసి వాళ్ళని అనుకరిస్తూ నాలుగు అడుగులు వెయ్యటం, చిన్న చిన్న రూపకాలుగా కూర్చుకుని బళ్ళో ఆడటం…..ఇలా నాట్యంమీద ఆసక్తి మాత్రం పెరుగుతూనే వచ్చింది……

 

నేను నమ్మి కొలుచుకునే నా తల్లి నృత్యగాన ప్రియ…..ఎప్పుడు నాట్యార్చనతో ఆ దేవిని సంతృప్తి పరుస్తానా అనిపించేది.మా ఊళ్ళో చెన్నకేశవస్వామి తిరునాళ్ళు జరిగేప్పుడు, “పూర్వం దేవదాసీలు నాట్యంచేసి దేవుడికి భోగం నడిపేవాళ్ళ”ని నాన్న చెప్పినప్పుడు ఎప్పటికైనా ఆ స్వామిముందు గజ్జె కట్టి నర్తించాలి అన్న అభిప్రాయం మనసులో బలంగా నాటుకుపోయింది…..నేను చదువుకున్న పుస్తకాలలో పాత్రలు నా ఆసక్తిని ఇంకా పెంచేవి….అలా భట్టుమూర్తి నరసభూపాలీయం,విద్యానాథుడి ప్రతాపరుద్రీయం, భానుమిశ్రుడి రసమంజరి, అభినయ దర్పణం చదువుకుని నాయక నాయికా లక్షణాలు, అభినయ లక్షణాలు, హస్తముద్రలూ,పాదభేదాలు అన్నీ నెమరేసుకుంటూ కూర్చోవటం, ఎప్పుడు గురుముఖఃతా నేర్చుకుని గజ్జె కట్టుకుంటానా అని ఎదురుచూపులు…..ఇలా ఏళ్ళు సాగిపోయాయి….

 

చదువుకుందుకు బైటకొచ్చాక కాస్త అవకాశం దొరికింది….. మంచి గురువులకోసం అన్వేషణ మొదలెట్టా…..సరైన గురులక్షణాలున్నవాళ్ళు ఒక్కళ్ళూ తారసపడలేదు…అరకొరా జ్ఞానంతో, నృత్తానికీ నృత్యానికీ నాట్యానికీ తేడా తెలీకుండా “నాట్యాచార్యుల”మనే పేరు పెట్టుకుని ఆధునిక పోకళ్ళతో పెడతొక్కుళ్ళు తొక్కుతున్న వాళ్ళే అంతా……

 

పైగా అన్నిటికన్నా పెద్ద ప్రశ్న, ఏ సంప్రదాయం నేర్చుకోవాలి? కూచిపూడి, భరతనాట్యం….ఈ రెంటిల్లో ఏది అసలైన భరతానికి దగ్గరగా ఉండేది? ఏది నేర్చుకుంటే మంచిది, నా ఉపాసనా మార్గాలకి ఏది అనుగుణంగా ఉంటుంది అని ఒకలాంటి పరిశోధనే చేశాను…… మొదట్లో కూచిపూడి, భరతనాట్యం చూసి తేడా తెలుసుకోగలిగేనేగాని అసలు సైద్ధాంతిక భేదాలు అర్థమయ్యేవి కాదు… సరేలెమ్మని తెలిసిన డాన్సరొకరుంటే అడిగా… తను,”భరతనాట్యమేముంది, బొమ్మలా ఆడటమే…కూచిపూడిలో ఎక్స్ ప్రెషన్స్ కి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. పైగా బ్యాలెలు ఎక్కువ ఉంటాయి, భరతనాట్యంలో బ్యాలెలు చెయ్యటానికి అవకాశం చాలా తక్కువ.”అన్నారు….నాకూ అదే అనిపించింది…..భరతనాట్యం చాలా స్టిఫ్‍గా ఉంటుంది……సర్లెమ్మని కూచిపూడికి ఫిక్స్ అయిపోయా…….తర్వాత రెండిటికీ నేను తెలుసుకున్న ముఖ్య భేదాలు  చెప్తాను……..అవీ, ముఖ్యంగా నేను కూచిపూడివేపు మొగ్గటానికి కారణాలు…..

 

అవి తెలుసుకోవాలంటే ముందు అభినయం గురించి కొంచెం తెలుసుకోవాలి……

“కంఠేనాలమ్బయేద్గీతం హస్తేనార్థం ప్రదర్శయేత్

            చక్షుభ్యాం దర్శయేద్భావం పాదాభ్యాం తాళమాచరేత్.”

 

అంటే, నర్తించు పాత్ర తన గొంతుతో పాట పాడుతూ, చేతులతో అనగా హస్తముద్రలతో ఆ పాటయొక్క అర్థాన్ని, కళ్ళతో ఆ పాటలోని భావాన్ని, పాదాలతో పాటలోని తాళాన్ని అభినయించాలి….భరతనాట్యంలో చివరి మూడూ ఉంటాయికాని అసలైన మొదటిది, గానం ఉండదు…..అంతా పక్కపాటే…

“యతో హస్తస్తతో దృష్టిర్యతో దృష్టిస్తతో మనః

           యతో మనస్తతో భావో యతో భావోస్తతో రసః.”

ఎక్కడ హస్తం వినియోగించబడుతుందో అక్కడ దృష్టి, ఆ దృష్టి ఉన్నచోటనే మనసు, ఆ మనసు ఉన్నచోటనే భావము ఉన్నట్లైతే రసోత్పత్తి జరుగుతుంది….”రసోవైసః” అన్నది శృతివాక్యం కదా…..భరతనాట్యంలో భావాభినయానికి ప్రాధాన్యత చాలా తక్కువగా ఉంటుంది, ఎక్కువగా ముద్రాభినయమే…..సంచారీ భావాలు పెద్దగా ప్రకటించరు…..

 

ఇక  అసలు అభినయం అంటే,

“అభి పూర్వస్య నీఞ్ ధాతో౭రాఖ్యానార్థస్య నిర్ణయః

          యస్మాత్పదార్థాన్నయతి తస్మాదభినయస్స్మృతః.”

ఇక్కడ ’అభి’ అనే ఉపసర్గకి ’నీఞ్’ ధాతువు చేరడం వల్ల ఆ పదం పుడుతోంది…..అనగా పదముల యొక్క అర్థమును తెలుపుట “అభినయ”మనబడుతుంది…..{అభిముఖేన అర్థోనీయతే అనేనేత్యభినయః,ణిఞ్ ప్రాపణే.దీని చేత అభిముఖముగా అర్థము పొందింపబడును. (హస్తవిన్యాస్యాదులచేత భావార్థమును దెలుపుట) అని అమరం పాఠం..}….

 

ఆ ఆభినయం,

      “ఆఙ్గికోవాచికస్తద్వదాహార్యస్సాత్వికః పరః| చతుర్థాభినయ

       స్తత్రచా౭ఙ్గికో౭ఙ్గైర్నదర్శితః | వాచా విరచితః కావ్యనా

       టకా౭దిషు వాచికః | ఆహార్యో హారకేయూరవేషాది భిరల

       ఙ్కృతిః | సాత్విక స్సాత్వికైర్భావైర్భావజ్ఞైశ్చ నిదర్శితః || “

 

ఆంగికము,వాచికము,ఆహార్యము,సాత్వికము అని నాలుగు విధాలు. ఈ నాలుగూ ఉంటేనే దాన్ని అభినయం అని వందపాళ్ళు చెప్పొచ్చు…..

  • ఆంగికం :- ఇది శరీరావయవ(అంగ,ప్రత్యంగ,ఉపాంగ) సంచలనం వల్ల చేసే అభినయం…. ఇందులో శిరోభేదాలు,దృష్టిభేదాలు,గ్రీవాభేదాలు,హస్తభేదాలు,పాదభేదాలు ఉంటాయి……ఇందులో కూచిపూడికీ, భరతనాట్యానికీ పెద్ద తేడా ఉండదు….. భరతనాట్యంలో ఎక్కువభాగం మండలం(కుంగి ఉండటం) వేసే ఉండాలి..కాని, కూచిపూడిలో అలా కాదు…ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది….కొన్నిసార్లు తప్ప మండలంలో ఉండాల్సిన అవసరం లేదు…..
  • వాచికం  :-  నోటితో చెప్తూ అభినయించేది వాచికం… ఇది కలాపాల్లో ఎక్కువగా ఉంటుంది…..కూచిపూడికీ, భరతనాట్యానికీ ముఖ్యమైన తేడా ఇక్కడ వస్తుంది….భరతనాట్యంలో వాచికాభినయం అసలు ఉండదు, కనీసం పెదాల కదలికకూడా ఉండదు…..కాని కూచిపూడిలో వాచికం తప్పనిసరి, వెనుకపాటకు కూడా పెదవుల కదలిక ఉండాల్సిందే…. కూచిపూడి కలాపాల్లో,యక్షగానాల్లో వాచికం ఎక్కువగా ఉంటుంది…. నటికి మంచి వాచికం తప్పనిసరి, అప్పుడే ప్రేక్షకుల్లో రసస్ఫురణ కలుగుతుంది….
  • ఆహార్యం :- పాత్రకు తగ్గట్టుగా వస్త్రాలని, మైపూతలని, ఆభరణాలని ధరించాలి….కూచిపూడిలో ఈ లక్షణం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది,పాత్రోచితమైన వేషధారణ ఉంటుంది.భరతనాట్యంలో ఎక్కువగా ఒక్క ఆహార్యాన్నే వాడతారు…..పైగా చీరకట్టు రెండిటిలో తేడా ఉంటుంది. కూచిపూడి వారు కాసెపోసి చీర కడతారు.భరతనాట్యంలో మామూలుచీరెచుట్టునే తమిళసంప్రదాయంలో చీలమండలపైకి కడతారు….ధరించే నగల్లోకూడా తేడా ఉంటుంది.కూచిపూడివారికి పొడవాటి జడ తప్పనిసరి……
  • సాత్త్వికం :- సాత్త్వికాది భావములతో అభినయించే పదభావాన్ని సాత్త్వికం అంటారు…..అంటే సత్త్వగుణంవల్ల మనసులో పుట్టే భావాల్ని అభినయించడం….ఇవి ముఖ్యంగా ఎనిమిది రకాలు- స్తంభము,ప్రళయము,రోమాంచము,కంపము,స్వేదము,వైస్వర్యము,వైవర్ణ్యము,అశ్రుపాతము. వీటన్నిటినీ రసోత్పాదనకి తోడ్పాటుగా( సంచారి,వ్యభిచారి భావాలు) వాడుకోటానికి కూచిపూడిలోనే ఎక్కువ వీలుంటుంది….భరతనాట్యంలో ఎక్కువ సంచారీ భావాలకి వీలుండదు….అన్ని సాత్త్వికాభినయాల్నీ చెయ్యటం కూడా కుదరదు……అసలు భరతనాట్యంలో సాత్త్వికాభినయానికి స్థానం తక్కువ…నృత్తభాగమే ఎక్కువ ఉంటుంది, నృత్యానికన్నా….

 

ఇక ఈ కారణాలన్నీ కూర్చుకుని కూచిపూడికే ఫిక్స్ అయ్యాను…..పైగా ప్రపంచంలో ఏ నృత్యరీతైనా అది పుట్టిన ప్రదేశం పేరుతోనే ప్రసిద్ధి పొందుతుంది…అదీ కూచిపూడికి ఉన్న ఒక ప్లస్ పాయింట్…….అలా నిర్ణయించేసుకుని, మంచి గురువుకోసం వెతుకులాట మొదలెట్టాను…..

నా పూర్వజన్మ సుకృతమేమో తెలియదుకాని నా భావాలకు నచ్చిన గురువుగారు దొరికారు….ధనాపేక్ష లేదు, పిల్లలకి ఓర్పుగా తిట్టకుండా నేర్పిస్తారు..తప్పుచేసినా ఈ సారి సరిదిద్దుకోను అవకాశం ఇస్తారు…అన్నిటికన్నా సంప్రదాయాన్ని వదిలి ఒక్క అడుగుకూడా పక్కకి వెయ్యరు.సంగీత సాహిత్యాలు రెంటిలోనూ బాగా ప్రవేశం ఉన్నవారు…కొంత మంది వస్తుంటారు మాస్టారి దగ్గరికి,”మా అమ్మాయికి ఒక పాటకి డాన్సు నేర్పండి,స్కూల్లో ప్రోగ్రాము చేయించాలి.ఎంత కావాలన్నా ఇస్తాం” అని. నిర్మొహమాటంగా లేదని చెప్పేస్తారు…. మినిస్టర్లు కాదు, ఎవరు వచ్చినా అడుగులతో మొదలెట్టి వరసగా నేర్చుకోవలసిందే…..కొంతమంది పెద్దవయసువాళ్ళు కూడా వచ్చి అడుగుతుంటారు, “ఈ వయసులో మొదటి నుంచి నేర్చుకోలేం,ఏవన్నా ఐటమ్స్ చెప్పండి” అని…..”సమస్యేలేదంటారు”……అందువల్ల ఎంతమంది వెనక్కెళ్ళినా పట్టించుకోరు.ఉన్నవాళ్ళు చాలనుకుంటారు….ప్రయోగాత్మకంగా కొత్త కొత్త బ్యాలెలు చేస్తుంటారు…..ఇవన్నీ మా మాస్టారి గురించి నేను మొదట్లో విన్నవి…ఇక ఆ మాస్టారి దగ్గరే నేర్చేసుకోవాలి అనుకుని మంచిరోజు చూసుకుని వెళ్ళాను…..

 

ఏదో ఆషామాషీగా, గుంపులోగోవిందలాగా మొదలెట్టకుండా చక్కగా పూజచేసి, నన్ను పూజలో కూర్చోబెట్టి తర్వాత మొదలెట్టారు..ఇప్పటికీ గుర్తే…ఇన్నాళ్ళ నా కోరిక తీరుతున్నందుకు నా వళ్ళు పులకరించడం,తెలియని ఉద్వేగం…….

మొట్టమొదట నమస్కారశ్లోకాలతో మొదలెట్టారు…

 

ప్రణమ్య శిరసాదేవో పితామహ మహేశ్వరౌ

            నాట్యశాస్త్రం ప్రవక్ష్యామి బ్రహ్మణాయ దుదాహృతం

జగత్పితామహుడు, నాట్యశాస్త్రాన్ని మొదట చెప్పినవాడు అయిన బ్రహ్మకు, నటరాజైన పరమశివునకు శిరసా నమస్కరిస్తున్నాను…ఇది నాట్యశాస్త్రంలో భరతముని పలికిన మొదటి శ్లోకం…నాట్యారంభంలో ఈ శ్లోకం పఠించడం ఆనవాయితీగా వస్తున్నది…..

 

“దేవతానాం శిరస్థస్తు గురూణాం ఆస్యసంస్థితః

          వక్షస్థస్తైవ విప్రాణాం శేషేత్వనియమో భవేత్”

దేవతలకు శిరసుపైన, గురువులకు ముఖానికి ఎదురుగా, విప్రులకు వక్షస్థలానికి ఎదురుగా నమస్కరించాలి.మిగిలినవారికి ఎలాగైనా నమస్కరించవచ్చును…ఇది నమస్కారవిధి….

 

తర్వాత కాలివేళ్ళమీద కూర్చుని భూమిని కన్నులకద్దుకుని ముమ్మారు నమస్కరిస్తూ ఇలా స్తుతించాలి…

 

విష్ణుశక్తి సముత్పన్నే చిత్రవర్ణీ మహీతలే

         అనేకరత్న సంపన్నే భూమిదేవీ నమోస్తుతే”

 

“సముద్రవసనే దేవీ పర్వత స్తనమండలే

          నాట్యం కరిష్య భూదేవీ పాదఘాతం క్షమస్వమే

అని మన పాదఘాతాలతో భూమిని తాడిస్తున్నందుకు క్షమించమని అడిగి, నాట్యారంభానికి అనుమతి తీసుకోవాలి……

 

తర్వాత నాట్యారంభంలో ఎలా నిలబడాలి(కరణం) అన్నది ఒక శ్లోకంలో చెప్తూ మనతో చేయిస్తారు….

 

“కటీకర్ణ సమాయత్ర కోర్పరాంస శిరస్తథా

          సమున్నత మురశ్చైవ సౌష్ఠవం నామతత్భవేత్.”

కరణం పట్టేప్పుడు సౌష్ఠవాంగం ఉండాలి. అంటే, నడుము, చెవి సమరేఖలో ఉండాలి. శిరసు వంపులేకుండా భుజాల మధ్య సమంగా ఉండాలి.అప్పుడు, వక్షస్థలం సమున్నతంగా ఉండి శరీరం సౌష్ఠవంగా ఉంటుంది……

 

“ప్రాయేణ కరణే కార్యో వామో వక్షః స్థితః కరః

         చరణస్యానుగశ్చాపి దక్షిణస్తు భవేత్కరః”

సామాన్య కరణాలన్నింటిలోను ఎడమచేయి వక్షమున మొట్టమొదట ఉంటుంది.పాదముననుసరించి తదనుగుణముగా కుడిచేతిని పట్టవలెను…….

 

ఇక తర్వాత మండలం వేయిస్తారు…అంటే, నడుముమీద చేతులు వెనక్కుతిప్పి పెట్టి,పాదాలు రెండూ అడ్డంగా తిప్పి మోకాళ్ళు వీలైనంత వరకు వంచి కుంగాలి…..ఇది మొట్టమొదటి అడుగు….కుంగటం,లేవటం అలా చాలాసేపు చేయిస్తారు…..తర్వాత ఇంకో రెండు స్టెప్స్ చెప్పి, ఇంటి దగ్గర బాగా ప్రాక్టీసు చేసుకు రమ్మన్నారు….వయసు ఇరవయ్యోపడిలో పడింది కదా అప్పటికే, వళ్ళు కాళ్ళు సరిగ్గా వంగలా….చాలా ఆయాసపడిపోయాను…పక్కనున్న చిన్నపిల్లలు ఏ శ్రమాలేకుండా గంటలతరబడి చేస్తుంటే అమ్మో అనిపించింది…..ఇంటికొచ్చి తెగ ప్రాక్టీసు చేసేశా, తర్వాత రోజు క్లాసులో కాళ్ళు అసలు వంగలా…:)………బాబోయ్,పుస్తకాల్లో చదివి ముద్రలు బట్టీపట్టటం కాదనిపించింది డాన్సంటే, ఇలా చాలా బోలెడు కష్టపడాలన్నమాట……మెల్లగా అదే అలవాటైంది….ఇక వరసగా రోజుకి ఇన్ని అడుగులని నేర్పించేవాళ్ళు, మొత్తం నాలుగునెలలదాకా పట్టిందనుకుంటా అడుగులన్నీ నేర్చుకోవటానికి…..అడుగుల్లో ఒక్కొక్క రకానికి నాలుగైదుండేవి…ఒకటి సరిగ్గా వస్తే మిగతావి వీజీగా వచ్చేసేవి…….

 

తర్వాత తీర్మానాలు…ఇవి గట్టిగా ఐదుంటాయి..రెండు రోజుల్లో నేర్చేసుకున్నా…..ఇక తర్వాత జతులు….అబ్బ! ఎంత ఎక్జైటింగ్‍గా ఉండేదో. ప్రతి జతికీ ముందు ఒక నడక, తర్వాత జతి, తర్వాత మళ్ళా నడక ఉంటాయి.{“తాం తత్తై తైహిద్ద తాంతహ్హి దహిదా, తత్తై ధణతఝణు” అంటూ ముందు నడకవేసి తర్వాత ముక్తాయి….తర్వాత “ధిత్తా ధిమితా కిటతక” అంటూ జతి, తర్వాత మళ్ళా “తత్తై ధణతఝణు”నడక…} ..జతులకి రాగానే అదో ఆనందం,డాన్సంతా వచ్చేసినట్టు, పేద్ద డాన్సరై పోయినట్టు తెగఫీలయ్యేవాళ్ళం….వీటిని చతురశ్ర జాతి జతులంటారు.మొత్తం పదుంటాయి.అవి సరిగ్గా వచ్చేస్తే ఐటమ్స్ చెయ్యటం చాలా తేలిక…..త్రిశ్రజాతి జతులుంటాయి, వీటిని సాధారణంగా ముందు నేర్పరు. ఐటెమ్స్  లో అవసరమైనప్పుడు అప్పుడు నేర్చుకుని చెయ్యటమే…… నా సంవత్సరాంతపు పరీక్షలు, హడావుళ్ళవల్ల జతులయ్యేపాటికి సంవత్సరం పట్టింది……

 

తర్వాత మెల్లగా ఒకటో రెండో ఐటమ్స్ నేర్చుకున్నా…కూచిపూడి సంప్రదాయ గణపతికౌత్వం, ఒక అన్నమాచార్య కీర్తన, జతిస్వరం,తిల్లాన, ఇలా….. మాస్టర్ గారు “ప్రోగ్రాం చేస్తావా” అన్నారు…”అప్పుడే అరంగేట్రం చేసేంత నేర్చుకోలేదుగా మాస్టారూ అన్నాను…..”

 

తర్వాత కొన్నాళ్ళకి సామూహిక నాట్యార్చన ఒకటి ఉంటే దానికి మాస్టారు గజ్జె కట్టుకోమన్నారు….. “గజ్జెపూజ” కావాలని అడిగా….”ఎన్నో ఏళ్ళనుంచి గజ్జెపూజ ఎవ్వరూ చేయించుకోవటంలేదు, నువ్వు కావాలంటే చేసి ఇస్తాను గజ్జెలు” అన్నారు…మహదానందంగా అనిపించింది…..సంప్రదాయబధ్ధంగా పూజచేసి, నా కాలికి తనచేతులతో స్వయంగా గజ్జెకట్టారు మాస్టారు….నా జీవితధ్యేయం ఇన్నాళ్ళకి నెరవేరిందన్న ఆనందంతో మనసుని పట్టుకోలేక పోయాను ఆనిమిషం….

 

అప్పుడు మాస్టారు లయబద్ధంగా తాళం వేస్తుంటే బియ్యపురాశి మధ్యలో నిలబడి చేసిన “సౌందర్యలహరి” శ్లోకాల అభినయం…. మొట్టమొదట “అమ్మ” ముందు గజ్జె కట్టాలన్న చిరకాలకోరికతో నవరాత్రుల రద్దీలో కూడా దుర్గమ్మముందు చేసిన నాలుగు నిమిషాల అభినయం, మా చెన్నకేశవస్వామి తిరునాళ్ళల్లో వళ్ళలసి మైమరచేలా చేసిన నృత్తం, కొన్నాళ్ళకి శృంగేరిశారదాంబకు సమర్పించుకున్న నాట్యకుసుమాలు…ఇవి చాలు జీవితానికనిపించింది….అలా {అప్పుడప్పుడూ నట్లు పడుతున్నా..;)..} నా నాట్యాభ్యాసాన్ని మెల్లగా కొనసాగిస్తున్నా…….

|| మంగళమ్ ||

 

 

 

6 thoughts on “కూచిపూడి – నాతొలిఅడుగులు

  1. బాగుందండి మీ కూచిపూడి – నాతొలి అడుగులు వ్యాసం. నాకు కూడా శాస్త్రీయ నృత్యమంటే మక్కువ. ఈ మధ్యనే సామర్లకోట వెళ్ళి గురువుగారు లోకేష్ గారి దగ్గఱ నాట్యాభ్యాసం ప్రారంభించాను. నా వయసురీత్యా(64) మరియు నాకు ఇంతకుముందు 30 లలో జరిగిన ఏక్టిడెంటు శస్త్రచికిత్సల మూలంగా పూర్తిగా రెండు పాదాల పైనా మోకాళ్లు వంచి కూర్పోలేకపోవటం చేత ఇంకా సరిగ్గా చేయలేకపోతున్నాను.పైగా ఇంటిదగ్గఱ ప్రాక్టీసు చేయలేకపోతున్నాను. నేను ప్రస్తుతం నేర్చుకుంటున్నది భరతనాట్యం. భరతనాట్యంలోని అడుగులకీ కూచిపూడిలోని అడుగులకీ తేడాలు తెలిసి వచ్చినవి.అభినయదర్పణం లోని శ్లోకాలు చదివి ఆనందించాను లింగంగుంట మాతృభూతయ్య గారి అభినయదర్పణం తెలుగు పద్యాలను పరిచయం చేస్తూ పుస్తకం.నెట్ లో వ్యాసాలను వరుసగా ప్రచురిస్తున్నాను. మీ ఈ వ్యాసం మంచి ఉత్సాహాన్ని కలుగజేసింది. ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Trying to get property of non-object in /var/www/html/maalika/magazine/wp-content/plugins/jetpack/modules/gravatar-hovercards.php on line 238