April 24, 2024

సంపాదకవర్గం నుండి: ఒక చిన్నమాట!!

రచన : సుజాత

 

దశాబ్దాల తరబడి అలవాటు పడిపోయాం! అడుగు పెట్టిన ప్రతి చోటా అవినీతి స్వాగతం చెప్తుంటే కొన్నాళ్ళకి అదేదో మామూలు విషయంగా మారిపోయి దాన్ని పెంచి పోషిస్తూ, అప్పుడప్పుడూ మనమూ దానికి కొమ్ము కాస్తూ, నిత్య జీవితంలో దాన్ని ఆక్సిజన్ కంటే అవసరంగా మార్చుకున్నాం! అయినా లోపల ముల్లుగా గుచ్చుతున్న అసౌకర్యాన్ని మాత్రం కడుపులో నిప్పులా భరిస్తూ వచ్చాం! అతి తక్కువ స్థాయి ఉద్యోగి నుంచీ మంత్రులూ, దేశపాలకుల వరకూ అవినీతి మంత్రం జపిస్తూ ఉంటే సామాన్యుడి గుండె చప్పుడు ఎవరికీ వినపడలేదని కేకలు పెట్టాం!

అవినీతి గురించి మాట్లాడి, ఉపన్యాసాలు దంచి,ఫేసు బుక్కులూ ట్విట్టర్లూ,బ్లాగులూ బజ్జులూ రాసి కొంత కసి తీర్చుకున్నాం! అదృష్టం..నిజానికి ఇవన్నీ లేకపోతే అవినీతికి వ్యతిరేకంగా ఇంతమంది పోరాడ్డానికి సిద్ధంగా ఉన్నారని ఎలా తెలుస్తుందేం? ఆ ముసలాయన లేచి ముందడుగు వేశాక మేమూ ఉన్నాం పదమని మనమూ ఆయన వెనుక పదడుగులు వేసి ఊరూరా, వాడవాడలా,ఎంతో కొంత బహిరంగ వ్యతిరేకత చూపించామంటే వర్చువల్ ప్రపంచమని మనం ఆడిపోసుకునే ఈ సోషల్ నెట్ వర్కులు ఎంతో దోహదం చేశాయనే చెప్పాలి. ఒకటే ఆలోచనలున్న వారు నలుగురు కలిస్తే అదే ఉద్యమం! అదే పోరాటం! అదే స్నేహం! అదే స్ఫూర్తి!

ఒక వీరుడు మొదలుపెట్టిన ఈ పోరాటం ఇవాళ వీధి వీధికీ వ్యాపించింది. అట్టడుగు స్థాయినుంచీ చైతన్యం పెల్లుబికింది. అందుకే, హజారే దీక్షకు ఇంతటి ఆదరణ! ఇక్కడ ప్రతి మనిషికీ ఎవరో వచ్చి ఏదో చేయాలనే కోరికే! అందుకే ఎవరో వచ్చేదాకా ఎదురు చూశారు. కానీ మోసపోలేదు. వయోవృద్ధుడైన హజారే తర్వాత ఈ పోరాటం లోక్ పాల్ బిల్లు తో ఆగిపోకుండా నిరంతరం ఎలా కొనసాగుతుందనే సందేహం ఇప్పుడు లేదు. కిరణ్ బేడీ లాంటి నిజాయితీపరులు ఈ ఉద్యమాన్ని నడిపించడానికి సామాన్యుడికి తోడుగా ఉన్నారు.

వేలు,లక్షల కోట్ల ప్రజాధనం లూటీ! ఒక మనిషి కడుపు నిండా తిని,పని చేస్తూ సౌకర్యంగా బతకడానికెంత డబ్బు కావాలి? ఎందుకింత దాహం? వాళ్ళే కాక వాళ్ల మనవలూ ముని మనవలూ కూడా రాజభోగాల్లో తేలి సోలేంత సంపద ఈ హయాంలోనే సంపాదించి పాతరేయాలన్న దురాశ? ఎక్కడి నుంచి పుడుతుందీ కోరిక?  పిడికెడు మెతుకులకూ, చారెడు నీడకూ నోచుకోక రోడ్డు పక్కన ఫుట్ పాత్ మీద బతికే అభాగ్యులు ఇలాంటి డబ్బు పోగేస్తున్నపుడు ఒక్కసారైనా గురుతుకు రారా వీళ్ళకి? ఇవన్నీ సామాన్యుడి మనసులో రేగే ప్రశ్నలు! ఎవరూ జవాబు చెప్పని పట్టించుకోని ప్రశ్నలు!

అవినీతిని వ్యతిరేకించడమే కాక సామాన్యుడు “ఈ పరిస్థితికి నా వంతు సహకారం ఏమిటి?ఇందులో నా పాపం వాటా ఎంత?” అనే ప్రశ్న తనకు తనే సంధించుకోవడం కూడా ఆశావహ సూచనే! మొన్న హైటెక్ సిటీ దగ్గర ఒక జాబ్ వెబ్ సైట్ వాళ్ళు “Iam not corrupt” అని ముద్రించి ఉన్న కారు స్టిక్కర్లు ఉచితంగా పంచుతుంటే తీసుకోడానికి కొందరు జంకడం మరి కొంతమందిని ఆలోచింపజేసింది.  కనీసం “నేను కరెప్టా కాదా?” అనే ప్రశ్న వాళ్ళు వేసుకుంటున్నారన్నమాట! ఇంతకంటే శుభ వార్త ఏముంది?

అన్నా హజారే వేసిన అడుగు సామాన్యుడినే కాదు,న్యాయ వ్యవస్థనూ కదిలించినట్టుంది. లోకాయుక్త అటు యడ్యూరప్పను,గాలి సోదరుల్ని ఖంగు తినిపించినా, ఇటు రాజకుమారుల లక్ష కోట్ల ఆస్థికి న్యాయ స్థానం చెక్ పెట్టడానికి దారులు వేసినా,కనిమొళి చేత ఊచలు లెక్కపెట్టించినా…..ఇదే స్ఫూర్తి!

అవినీతి పూర్తిగా అంతమెప్పుడవుతుందనే ప్రశ్న మాత్రం అర్థ రహితం! ఎందుకంటే అవినీతంటే కేవలం లంచాలు, అక్రమ సంపాదన మాత్రమేనా? అక్రమ ప్రవర్తన కూడా అవినీతే! రెడ్ సిగ్నల్ జంప్ చేయడం నుంచి, క్యూలో నిల్చోకుండా నిల్చున్న టికెట్ సంపాదించడం వరకూ, హెల్మెట్ పెట్టుకోకపోవడం నుంచీ,రాంగ్ రూట్లో వెళ్లడం వరకూ, ఐదొందలకి పని మనిషి ఇంటిపనంతా చేయట్లేదని బాధ పడుతూనే, ఏడాదికి రెండు ఇంక్రిమెంట్లన్నా ఉండాలని మరో రకంగా బాధ పడటం______ఇవన్నీ అవినీతి కాదేంటి?

అందువల్ల అవినీతి మన రక్తంలో ఉంది! దీన్ని పూర్తిగా నివారించలేం! కానీ ఒక స్థాయిలో ఎవరో ఒకరు మొదలు పెడితే_______కొన్నాళ్ళకు అది మనలో ఆలోచనల్ని రేకెత్తించవచ్చు! పూర్తిగా కాకపోయినా ఎప్పటికప్పుడు మన ప్రవర్తనలో మార్పుని మనం బేరీజు వేసుకుంటూ ఉంటే..మనలోని అవినీతి భూతాన్ని చంపలేకపోయినా కనీసం కోమాలోకి పంపగలిగితే దాన్ని మరిహ లేవకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు!

ఏమంటారు?

7 thoughts on “సంపాదకవర్గం నుండి: ఒక చిన్నమాట!!

  1. సంపాదకుల వారికి నమస్కారాలతో,
    ఈ రోజే మీ బ్లాగును దర్శించడం జరిగింది.
    ఎంత చక్కగా వ్రాస్తున్నారు.
    అవినీతిని గురించి మాట్లాడేందుకు నిజంగా అర్హత ఉందా అని నేను అవలోకనం చేసుకుంటే,దాదాపు లేనట్టే.
    మన నిజ జీవితంలో ఎన్ని అవకతవకలు చేస్తున్నాము.
    రాజకీయంలో వచ్చే వారు దాని ఒక వ్యాపారం లాగ భావిస్తుంటే మార్పు అనేది దాదాపు శూన్యం.
    మన దేశ నాయకత్వానికి (ప్రధానిగా) అబుల్ కలాం లాంటి వారు వస్తేనే మార్పును మనం చూడొచ్చు.

    మంచి రోజులు రావాలని ఆకాంక్షించడం మినహా ఏదీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని నా భావన.
    ఎం.ఆర్.సుబ్రహ్మణ్యం
    గాయకుడు,చెన్నై

  2. నమస్కారం!

    శుభోధయం. మీ పత్రిక చాలా పొందికగ, సుందరంగ ఉంది, అంశాలు, మరియు, కూర్పు. కాని

    మాటకు ప్రాణము సత్యము
    కోటకు ప్రాణంబు సుభట కోటి ధరిత్రిన్
    బోటికి ప్రాణము మానము
    చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!”

    చీటికే కాదు, పత్రికగు కూడా యిది ముఖ్యం. దయచేసి, మీ పత్రిక వివరాలు, సంపాదకులు, విలాసము, ఈమెయిల్ అడ్రసు, ఎవరైన తమ రచనలు పంపాలంటే ఎవరికి పంపాలి, ఏ ఫారమెట్ (పిడియఫ్, వర్డు, టెకస్టు) లాంటి వివరాలు మొదటి పేజీలో అనగా మాలిక పత్రిక మొదటి పుటలో ఉంచిన చాల చక్కగ ఉంటుంది.

    ధన్యవాదములు,

    రమాకాంతరావు, చాకలకొండ, ఓహాయో, అమెరిక
    M.Sc, MA, M.Com, M.Tech, MBA, MCA, M.Phil, Pg DM, PG Dip IR&PM

  3. మంచి వ్యాసం ఎందుకంటె మంచి టాపిక్ కాబట్టి. మీ శైలి కూడా ఇది పూర్తిగా చదవటంలొ సహాయపడిందనే చెప్పాలి. చిత్రం ఏమంటె అన్నింటిలోనూ ముందుండే, దేన్నీ వదలని విమర్శకులు ఆఖరికి అన్నాహజారేని కూడా వదల్లేదు. సోకాల్డ్ మేధావులనబడే అరుంధతీ రాయ్, అరుణారాయ్ లాంటివాళ్ళూ అనాల్స్నిమాటలన్ని అన్నారు. ఇలాంటి బిల్లులవల్ల అవినీతి సమసిపోదని ఇంక ముందుకెళ్ళి అన్నాహజారేకి మావోయిస్టులకి తేడా లేదని…..వగైరాలు.ఇలాంటప్పుడే అన్పిస్తుంది కొంతమందికి ఈ “మేధావి” స్టేటస్ ని ఊరికినే అంటగట్టామేమోనని…..కేవలం ఒకేఒక్క నవల్తో ఈ స్టేటస్ సంపాదించి ఇక అక్కణ్ణుంచి అన్నిటిపై, అందరిపై ఇలా విమర్శలు చెయ్యడం తగదని ఎవరైనా వీళ్ళకి చెప్పాలి…..మీ వ్యాసానికి అభినందనలు

  4. నిజం. ఇప్పుడు అంతటా ఉన్నది అవినీతే. అది కొన్నిచోట్ల ఏ చర్చలు లేకుండా చట్టం కూడా అయిపోతోంది. రిజిష్టార్ ఆఫీస్ చూడండి…డాక్యుమెంట్ రైటర్ ఎవరికెంతో అతడే చెప్తాడు. నిజానికి ఎంత ఇవ్వాలన్నది మనకి అక్కరలేదు…మనకి పని జరగాలి..అంతే…అడుగుదామన్నా అక్కడ ఎవరూ మాట్లాడరు.. ఆర్ టి ఎ ఆఫీస్ అంతే. ప్రతి వీధిలోను డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ లైసెన్స్ అన్నీఇప్పించే ఆఫీసులు. అసలుఆర్.టి.యె ఆఫీస్ ఉందన్న సంగతే కొందరికి తెలియదేమో…ఏ టెస్టుకూ వెళ్ళక్కరలేకుండానే కాళ్ళు లేకుండానే డ్రైవర్ అయిపోయాడని ఆమధ్య విన్నాము. ఓట్లు కొనుక్కునే రాజకీయవేత్తల వెనక తిరిగే ఛోటా నాయకులు అన్ని రాయితీలు పొందడానికి అర్హులైపోతారు. అన్ని గవర్నమెంట్ సదుపాయాలు వారికే…నాకు రైలు ప్రయాణానికి టిక్కట్ అర్జంట్ గా కావాలి..అడ్డదారులు వెతుక్కోవడానికి నేను వెనకాడను…ఆర్థికంగా ఉన్నతుడా కాదా అని కాదు …నీకవసరం ఉందా..అయితే దొరికావు…ఎక్స్ ప్లోయిట్ చెయ్. ఇది అన్ని స్థాయిల్లోనూ వుంది.. అది ఆటో డ్రైవర్ కావచ్చు, ఇంట్లో పనివాళ్ళుకావచ్చు, దైవ ప్రార్థనలు చేయించే మతావలంబకులు కావచ్చు, చదువు చెప్పాల్సిన విద్యాసంస్థలు కావచ్చు, ప్రోత్సహించే తలిదండ్రులు కావచ్చు, కొండలూ కోనలు భక్షించే రాబందులు కావచ్చు …టామ్, డిక్, హేరీ ఎవరైనా కావచ్చు…. ఒకవేళ ఎవరైనా కడుపుమండో మరో కారణంచేతో ఏదైనా ప్రశ్నించా డనుకోండి…”బయల్దేరాడండి హరిశ్చంద్రుడు” అని నిరుత్సాహ పరిచేవారు తగులుతూ ఉంటారు. పెద్దస్థాయిలో అయితే పలుకుబడితో, ధనబలంతో ప్రశ్నించేవార్ని అణచే గొప్ప వారుంటారు. ప్రస్తుత సమాజంలో జాతి,కుల,మతాలకు అతీతంగా ,ధనిక పేద విచక్షణలేకుండా చలామణి అవుతున్న ఒకే ఒక్క నీతి….అవినీతి… అది పోవాలని చేస్తున్న హజారే ఉద్యమాన్ని అభినందించక తప్పదు. ఆయనను నిజంగా అంగీకరించేవారయితే అంతటితో ఆగకుండా ఈ ఉద్యమవిజయానికి మనమేం చేయగలమని అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి….
    అంటే మనల్ని మనం నీతిమంతులుగా దిద్దుకోవాలి….మన వృత్తుల్నిబట్టి, మన అవసరాలని బట్టి అలాంటి విషవలయంలో ఉంటే క్రమంగా బయటికి రావాలి…రామకృష్ణ పరమహంస చూపిన ఆదర్శం—మనం తప్పు అనుకున్నది చేయకుండా ఉంటే ఎదటి వార్ని తప్పు అన్నది చేయకుండా ప్రతిఘటించగలుగుతాం…
    ఆలోచింపజేసే మీ సంపాదకీయం అభినందనీయం…ఆ స్ఫూర్తితో ఈ రెండు మాటలు.

  5. అవినీతి విషయంలో విమర్శతో పాటు ఆత్మవిమర్శ కూడా అవసరమని బాగా చెప్పారు. మీ సంపాదకీయం ఆలోచనాత్మకం.

    ప్రజల ఆర్తి, ఆగ్రహం అన్నాహజారే లో ఉద్యమంలో ప్రతిఫలించటం వల్లనే దేశవ్యాప్తంగా అంత స్పందన వచ్చింది. ఈ స్ఫూర్తి కొనసాగాలనేదే అందరి ఆకాంక్ష!

  6. నిన్ను నీవు తెలుసుకో.. తర్వాత ప్రపంచం గురించి తెలుసుకో.. అనేది మన తాత్విక అవగాహన. అవినీతి మన రక్తంలో ఉందని మీరన్న ఆ ఏకవాక్యం మన చింతనను మరో కోణంలో ఎత్తి చూపిస్తోంది. ప్రపంచం మీదికి పోయి పడుతున్నప్పుడు -తప్పకుండా పడాలి- మనలోని నీతి ఎంత స్వచ్ఛంగా ఉంటోందో తరచి చూసుకోవాలి. జాతి ఔన్నత్యానికి, దేశం బాగుకు ఇది చాలా చాలా అవసరం.
    “ఐదొందలకి పని మనిషి ఇంటిపనంతా చేయట్లేదని బాధ పడుతూనే, ఏడాదికి రెండు ఇంక్రిమెంట్లన్నా ఉండాలని మరో రకంగా బాధ పడటం” అద్భుతమైన మెరుపువాక్యం ఇది. మనలో నూటికి తొంబైతొమ్మిది మందికి శ్రమ విలువ -డిగ్నిటీ ఆఫ్ లేబర్- ను గుర్తించడం తెలియదు. ఈ కోణంలో మనం ఎవరి ‘అనీతి’ ని వేలెత్తి చూపాలో మరి. అన్నా హజారే స్పూర్తిని నెత్తిన బెట్టుకుందా.. అదేసమయంలో మనలోకి మనం తరిచి చూసుకుందాం.. మీద ‘చిన్నమాట’ కాదు. మన జాతి మొత్తంగా భరించలేనంత పెద్ద మాట… నిజంగా సంపాదకీయం చాలా బాగుంది. అభినందనలు

  7. హైటెక్ సిటీ దగ్గర ఒక జాబ్ వెబ్ సైట్ వాళ్ళు “Iam not corrupted” అని ముద్రించి ఉన్న కారు స్టిక్కర్లు ఉచితంగా పంచుతుంటే తీసుకోడానికి కొందరు జంకడం మరి కొంతమందిని ఆలోచింపజేసింది.
    ………………
    సుజాత గారు మీ ఆవేదన నిజమే .. ఒక వేళ నేను అక్కడ ఉంటే ఆ స్టిక్కర్ నేను కూడా తీసుకునే వాడిని కాదు. ఆ సంస్థ వాళ్ళు ఒక రాజకీయ నాయకుడి తో ఈ ఉద్యమాన్ని ప్రారంభింప చేశారు . ఆయన అధికారం లో ఉండగా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు. అధికారం పోయాక ఎక్కడా ఏ ఉద్యమం కనిపిస్తే అందులో దూరి పోతాడు. అతనికి అధికారం పై ప్రేమ తప్ప మరేమీ ఉండదు. అతని చుట్టూ అతనిలాంటి వారే చేరుతారు. కావాలంటే మీరు ఆ స్టిక్కర్ మీద ఉన్న నెంబర్ చూసి వివరాలు తెలుసుకోండి అతన్ని అధికారం లోకి తేవాలనే యావ తప్ప వీరికి నిజంగా అవినీతి నిర్మూలన జరగాలని ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *