April 23, 2024

స్త్రీ విద్యాభిలాషి గురజాడ

రచన : జగద్ధాత్రి

 

“తెలుగు సాహిత్యంలో మీరే మొదటి స్త్రీవాద రచయిత కదా?” అన్న ప్రశ్నకు “కాదు, మూడవ వాడిని, మొదటి వారు వీరేశలింగం గారు, రెండవ వారు గురజాడ వారు” అంటూ తన స్థానం మూడవదని  చెప్పారు చలం గారు ఒక ఇంటర్వ్యులో.  బాల వితంతువుల మోడు వారిన  జీవితాలను  ఉద్ధరించడానికి నడుం కట్టింది వీరేశలింగం గారైతే,  స్త్రీ విద్యకు ప్రాముఖ్యత నిచ్చిన వారు  గురజాడ. ఇక చలం స్త్రీ లైంగిక స్వేచ్చను కూడా సమర్ధించారు. వీరే కాక మరెందరో స్త్రీ స్వేచ్చను గూర్చి నడుం కట్టిన వారున్నారు. ఈ ఏడాది వచ్చే నెల సెప్టెంబర్ ఇరవై ఒకటిన గురజాడ నూట యాభైవ జయంతి జరుపుకోబోతున్న మనం వారి ప్రగతి పథంలో ఎంత వరకు నడిచాము నడుస్తున్నామని ప్రశ్నించుకుంటే ఒక్కసారి గురజాడ వారు ఒక సమగ్రమైన స్త్రీ  మూర్తిని నిర్వచించడానికి తన రచనల్లో ఎలా ప్రయత్నించారన్నది తన రచనా వైదుష్యం లోనూ, భావ  సాంద్రతలోనూ  మనకు అవగత మౌతుంది.

ఆయన ఇంగ్లీష్ లో రాసుకుని పూర్తి చెయ్యలేక పోయిన లేదా రాయలేక మిగిలిపోయిన నవల “సౌదామిని” లో స్త్రీ సమస్యలను ,  స్త్రీ ప్రగతి సోపానాలను ఆయన సంక్షిప్తంగా నయినా ఎంత లోతుగా యోచించి  రాసి పెట్టుకున్నారో అర్ధం అవుతుంది. అదే నవల అయన సంపూర్తి చేసి ఉంటే అది చరిత్ర లో ఒక గొప్ప నవల గా మిగిలి ఉండేది అనడంలో  సందేహమక్కరలేదు.  అందులో అయన కేవలం స్త్రీ గురించే కాక,  కుల వివక్షను గూర్చిన సమస్యలు,  ప్రేమను గూర్చి, మానవత్వం , వివాహాలు, విలువలు  ఇలా ఎన్నో అంశాలను మనం ఆ సంక్షిప్త   చిత్రనలోనే  దర్సిస్తాము. తనకు కావాల్సిన దేమిటో తానే తెలుసుకోవాలంటే స్త్రీకి విద్య  చాల ముఖ్యమైన అవసరం. ఆ విద్య ఆమెకు జీవితపు విలువను తెలియచెప్పాలి. ఒక స్త్రీ విద్యావంతురాలైతే  ఎంత చక్కగా గుట్టుగా లౌక్యంతో తన వైవాహిక జీవితాన్ని సరి దిద్దుకోగలదో   మనకు తెలియ చెప్పే పాత్ర  కమలినిది. అటు ఆమె భర్త కూడా సున్నిత మనస్కుడు , సంస్కార వంతుడు  , సమాజం పట్ల భయ భక్తులు కల వాడవడం వలన ఆమె ఆడిన చిన్న పాటి నాటకంతో బుద్ధి తెచ్చుకున్నాడు. కానీ అందరు పురుషులూ అలాంటి వారు కారే మరి అదే కదా వచ్చిన చిక్కంతా.

 

మతోన్మాదంతో ఊగిపోతో, తన మామగారిని అగ్నిగుండం తొక్కించడానికి సిద్ధపడిన మూఢ భక్తుల ఘాతుక మూర్ఖత్వం నుండి తప్పించడానికి హటాత్తుగా  మెరుపులా వారి మధ్యన దూకి వారి మతోన్మదాన్నే అడ్డుగా పెట్టుకుని అస్త్రంగా వాడుకుని తన మామగారి ప్రాణాన్ని కాపాడుకోగల నేర్పరి నాంచారమ్మ, “దేవుళ్ళారా మీ పేరేమిటి?” కధలో. తన కాపురం పాడు  చెయ్యవద్దని తమ ఇంటి ఎదురు కుర్రాళ్ళకు ఉత్తరం రాసి పంపి తన కాపురం నిలుపుకున్నది మెటిల్డా. అటుపైన తన భర్తతో కలసి విద్యవంతురాలి  జీవితాన్ని చక్కదిద్దుకుంది సమన్వయంతో. ఆ కుర్రాళ్ళ ఆకతాయి తనం వల్లనైనా తన భర్త వైఖరిలో కలిగిన మార్పు  ఆమె జేవితాన్ని చక్కబరుస్తుంది. స్త్రీకి విద్య, వినోదము, గుర్తింపు ఎంత ముఖ్యమో చెప్తుందీ కధ.

 

ఇక “స్టూపింగ్ టు రైజ్ “(సంస్కర్త హృదయం) లోని సరళ ది పేరుకు తగినట్టే సరళమైన నిండిన   వ్యక్తిత్వం. సౌందర్యమూ, జ్ఞానమూ, విచక్షణా కలిగిన సరళది  కేవలం వేశ్య కులమని ఆమెని సంస్కరిస్తానని బయల్దేరి ఆమె విషయ పరిజ్ఞానానికి ఓడిపోయినాడు విశ్వనాధ శాస్త్రి. ఆమె సుందర సౌమ్య సౌందర్యనికే కాక అద్వితీయ వివేచనా శక్తికి తనను తానే మరిచి దాసోహమైన రంగానాధయ్యరు సరళ ముందు ఓడి తిరుగు ముఖం పడతారు. స్థూలంగా నాలుగు కధల్లోని స్త్రీ పాత్ర  చిత్రణ ఇదైతే ఇక గురజాడ బృహత్కావ్యం “కన్యా శుల్కం” లోని రెండవ కూర్పులోని స్త్రీ పాత్ర చిత్రణ . మొదటి కూర్పులో లేని ప్రాముఖ్యత మధుర వాణికి ఇచ్చి  ఆమెతోనే ఆద్యంతమూ కధను నడిపించి మెప్పించిన కావ్య బ్రహ్మ గురజాడ. కన్యా శుల్క  దురాచారానికి నిస్సహాయ ప్రతీకలుగా తమ తండ్రుల దురాశకు బలి అయి  పోయిన రెండు పాత్రలు  మీనాక్షి, బుచ్చెమ్మ. యవ్వనోద్రేకంలో తీరని ఆశలతో జీవితాన్ని గడపలేక రామ్మప్పంతులు మాయకి  లొంగిపోయి నష్ట పోయింది  మీనాక్షి. ఒక వైపు కన్న కూతురు మోడులా  పడి వుంటే తనకింకొక వివాహం కావాలనుకునే ఆ తండ్రిని ఆ స్త్రీ హృదయం ఎలా స్వీకరించి ఉండవచ్చునో అనిపిస్తుంది. అయినా తండ్రిని ఎదిరించనూ లేదు. రామప్ప పంతులు ఆట కట్టించనూ లేక పోయింది మీనాక్షి అమాయకత్వం విద్య హీనత మూలంగా.

 

తన బతుకు లాగే తన ముక్కు పచ్చలారని తన చెల్లి బలైపోతున్నందుకు విచారంతో కుంగిపోయే మరింత అమాయకురాలు బుచ్చెమ్మ. చెల్లెలి బతుకు అన్యాయం చెయ్యవద్దని తండ్రిని బతిమాలుకుంటుందే  కానీ ఎదిరించడం చాతకాదు తనకి. ఏ పాపం ఎరుగని పసి ప్రాయపు చిరు మొగ్గ లాంటిది సుబ్బి. సుబ్బి పాత్ర గురజాడ వారి పూర్ణమ్మ లాంటిది. పుతడి బొమ్మ పూర్ణమ్మ బలై పోయింది కానీ మధుర వాణి దయవలన, లేదా పూనిక వలన సుబ్బి బతుకు బండలు కాలేదు. ఇవి ఏమీ ఎరుగని శైశవ దశ ఆమెది. తాను పసుపు కుంకుమలతో ఉండి తన ఎదుటనే తన పెద్ద కూతురు వాడిన మొడల్లె తిరుగుతుంటే భరించిన వెంకమ్మ ఇక తన భర్త దురాశకి చిన్న కూతురు కూడా బలి పశువు కావడం సహించలేక ఎదిరించలేకా, భయంతో ఏమి చెయ్యాలో దిక్కు తోచక వెళ్లి నూతిలో దూకుతుంది. ఇది ఒక నిస్సహాయ యత్నమే తప్ప ఎదిరింపు కాదు. ధైర్యస్తురాలు కానప్పటికీ కన్న తల్లి మనసు ఆమెను నిలవనియ్యదు . అందుకే తన నిరసనను అలా ప్రకటిస్తుంది. ఆ క్షణంలో ఆమె బతకాలని కోరుకోలేదు. అంతగా   చలించి పోయిందామే

మాతృ హృదయం.

 

ఎవరికీ ఏమీ కాని ఓ స్త్రీ పాత్ర పూటకూళ్ళమ్మ. ఆమె గయ్యాళితనంలోనూ ఓ నిస్సహాయత  అగుపిస్తుంది. గిరీశం వంటి  వారు సమాజంలో ఏ ఆధారమూ లేక ఏదో పూటకూళ్ళు పెట్టుకుని బతుకుతోన్న తనలాంటి అనాధ విధవలను ఎలా వారి స్వార్ధానికి వాడుకుని దగా చేస్తారో అని ఆలోచన కలిగినప్పుడు ఆమె అసహాయ పరిస్థితులే ఆమెను గయ్యాళిగా  మార్చాయన్నది విదితమౌతుంది.

తన సౌందర్యంతో , తెలివి తేటలతో. లౌక్యంతో ఎందరినో వశం చేసుకుని తన దారిన తాను డబ్బు సంపాదించుకోగల  సమర్ధత కలిగి , వేశ్యా వృత్తిలో ఉన్నా , తనకేమీ కాని సాటి ఆడపిల్లను ఒక సాంఘిక దురాచారానికి కన్న తండ్రి పశుత్వానికి బలి కాకుండా కాపాడటానికి చక్రం అడ్డు వేసి నాటకం నడిపిన సూత్రధారిని మధురవాణి.  ఎవరూ కావాలని ఏ కులంలోనూ పుట్టరు. కావాలని వేశ్యావృత్తిని జీవన భుక్తికి ఎంచుకోరు.

వేశ్యా వృత్తిలో ఉన్నంత మాత్రాన కేవలం డబ్బు సంపదనే లక్ష్యం కాక మానవత్వపు విలువలు, జీవన మూల్యం, ఎరిగినది మధురవాణి. యుద్ధంలోనూ ప్రేమలోనూ ఏదైనా సబబే అన్న సూత్రం నిరాఘాటంగా పాటిస్తుంది మధురవాణి.  తనకేమీ సంబంధం లేకపోయినా అమాయకురాలైన ఓ ఆడ పిల్ల బతుకును కాపాడాలని పూనుకున్న మధురవాణి సౌజన్య రావు లాంటి సంస్కారులతో సాటి అయినది. వాస్తవానికి అంత కంటే గొప్ప ఆచరణా శీలి. ఎన్ని అబద్ధాలు ఆడి అయినా ఒక అఘయిత్యాన్ని తప్పించగలిగిన చతురత మధురవాణిది. ఆమెది ఆదర్శ ప్రాయమైన పాత్ర అయినా ఆమె సమగ్ర మూర్తి మత్వం కారణంగానే నాటకాంతం వరకు సజావుగా సాగినా ఆమె కులాంగన కాదు అన్నది ప్రస్తావనకొస్తుంది. సౌజన్యారావు పంతులు కూడా నీవు వేశ్య ఇంట్లో పుట్టాల్సిన దానివి కాదు అంటాడు. అయినా తన పుట్టుకకు, వృత్తికి ఆమె ఎక్కడా బాధ పడినట్టు కనిపించనివ్వదు. దూషణ భూషణ తిరస్కరాలన్నిటినీ చిరునవ్వుతో భరిస్తుంది. తన స్వార్ధం ఏమాత్రమూ లేని ఓ ప్రయోజనం కోసం మానవీయతతో నిలుస్తుంది, గెలుస్తుంది.

 

తన నాలుగు కధల్లోనూ, కన్య శుల్కంలోనూ సమగ్రమైన ఓ ఆధునిక స్త్రీని నిర్వచించడానికి విశ్వప్రయత్నం చేసాడు గురజాడ. “ఆధునిక స్త్రీ చరిత్రను తిరగరాస్తుంది” అన్న గురజాడ అసలు స్త్రీ ఎలా ఉండాలో చెప్పే క్రమంలో ముందు స్త్రీ విద్యావంతురాలైతే తప్ప ఈ కుల,మత , పురుషాధిక్య అరాచకాల కరాళ నృత్యాన్ని అరి కట్టలేదని సుస్పష్టంగా చెపుతాడు గురజాడ. చలం మరింత ముందుకు వెళ్లి “ఆదర్శ స్త్రీ” అంటూ అన్వేషణ చేస్తాడు. విద్య, లైంగిక స్వేచ్చ, ఆర్ధిక స్వేచ్చ నుండి తన వ్యక్తిత్వం నిలబెట్టుకునే నిర్ణయాలను తానే స్వయంగా తీసుకోగలిగే స్వతంత్ర స్త్రీని స్వప్నిస్తాడు. “సౌదామిని” లో గురజాడ రాసుకున్న స్త్రీ కుండవలసిన గుణాలు, ప్రేమ, ఔన్నత్యం, సౌందర్య పోషణ, వ్యాయామం, విద్య, లౌక్యం, ధైర్యం, అన్నీ ఉండాలని ప్రతిపాదించారో అవి చలం రాజేశ్వరి , అరుణ, లాంటి పత్రాలు విశదీకరిస్తాయి. ఆర్ధిక స్వాతంత్ర్యం ఎంత ముఖ్యమో ఆత్మిక స్వాతంత్ర్యం కూడా అంటే ముఖ్యమని అంటాడు చలం గురజాడ అడుగు జాడలో.

 

ఆనాటి అకృత్యాలు సామాజిక సమస్యలు కన్యాశుల్కం, వరకట్నం, అయితే ఈనాటి ఇరవై ఒకటవ శతాబ్దంలో స్త్రీలు ఎదుర్కుంటున్న మరింత భయంకరమైన సమస్యలు, భయానకమైన పైశాచిక పురుషుల ప్రేమలు, కాముకత్వం, స్త్రీలు తమ జాతి పట్ల తామే చేసుకునే ద్రోహాలు, వ్యూహాలు (సీరియల్స్ పుణ్యమా అని), ఎందుకిలా స్త్రీని వికృతంగా శిక్షిస్తున్నారో ,  చిత్రీకరిస్తున్నారో ఇది ఏమి ప్రగతి అనాలో అర్ధం కాని పరిస్థితి నేడు  నెలకొని ఉంది.

మూర్తిమత్వాభివృద్ధి నేర్పించేటప్పుడు “ఎబిలిటి టు హాండిల్ డైవర్స్ రోల్స్ ” అనగా “బహుపాత్ర పోషణ చాయగల సమర్ధత” ఇది ఈనాటి స్త్రేకి చాల ఆవశ్యకమైనది. ఆర్ధిక స్వాతంత్ర్యం అహాన్ని పెంచకూడదు, లైంగిక స్వేచ్చ అర్ధం లేని వ్యభిచారం కాకూడదు,  ధైర్యం మూర్ఖత్వం కాకూడదు. ఇలా ఇన్ని ప్రాపంచిక నైపుణ్యాలతో ట్రెపీజ్ ఆర్టిస్టులా సర్కస్ చేస్తూ సమాజంలో తన వ్యక్తిత్వాన్ని అస్తిత్వాన్ని కాపాడుకోవాలి నేటి మహిళ. ఇది మన యుగకర్తలు వీరేశలింగం, గురజాడ, చలం లాంటి ఎందరో మహానుభావులు ఆశించిన ఆకాంక్షించిన మేధో పథం, అభ్యుదయం. ఆ కాంతి బాటల వైపు సాగుతూ మానవీయ నేతలందరికీ జోతలు ప్రకటిస్తున్నాను.

 

 

 

4 thoughts on “స్త్రీ విద్యాభిలాషి గురజాడ

  1. చాలా విశ్లేషణాత్మకంగా అలోచింపచేసేదిగా ఉంది. జగతి గారికి అభినందనలు

  2. జగద్దాత్రి గారి వివరణ విజ్ఞానదాయకంగా వుంది. మొక్కుబడిగా చెప్పైయడం కాకుండా, విశ్లేషనాత్మకంగా వుండే, మంచి విషయాలను అందించారు. అభినందనలు.

  3. చాలా ఇన్ఫర్మేటివ్‌‌గా సాగింది రచన. గురజాడ గురించి ఇంత విపులంగా ఎప్పుడు చదివే అవకాశం రాలేదు. మీరిక్కడ ఉదహరించిన కొన్ని కథల పేర్లు విన్నాను, కొన్ని చదివాను కానీ స్త్రీవాద దృక్పథంతో మీరిచ్చిన వివరణాత్మక రచన ఆద్యంతము ఆకట్టుకుంది. మీనుంది మరిన్ని రచనల్ని ఆశిస్తూ…..

  4. గౌరవనీయులైన సంపాదకులకి నమస్తే. నా వ్యాసం “స్త్రీ విద్యాభిలాషి గురజాడ” సహృదయంతో ప్రచురించినందుకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను….ప్రేమతో…జగద్ధాత్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *