March 28, 2024

ఓనమాలు

రచన : ఆదూరి సీతారామమూర్తి

 

ముందుగా ఊహించిన సంగతే అయినా శివరామయ్యగారి కావార్త కొండంత ఆనందాన్నే కలుగచేసింది.

ఎంత బడిపంతులు పని చేస్తూ పేద బ్రతుకు బ్రతుకుతున్నా ఆ క్షణం అతని మనోసామ్రాజ్యం అంతటా నిండి, పొంగిపోతున్న సంతోషపు వెల్లువలో ప్రపంచాన్ని జయించిన గర్వం తొణికిసలాడింది.

విద్యను నమ్ముకుని బ్రతుకుతూన్నందుకు సరస్వతీదేవి తనకు అన్యాయం చెయ్యలేదు.

తూర్పు వాకిట్లో పారిజాతం మొక్క దగ్గరగా యీజీఛైర్లో కూర్చున్న శివరామయ్యగారికి ఆ తొలిసంధ్యలో ఎన్నో కొత్త అందాలు గోచరించాయి.

వ్రేళ్ళు నాటుకుని పెరుగుతూన్న భావికాలపు వృక్షానికి కొత్త చిగురులు కనిపించాయి.ఎప్పుడూ ఏ ఆశలూ,ఆవేదనలూ ఎరుగని ఆకాశం అవతార పురుషుల మేని రంగులో నీలంగా నిర్మలంగా ఉంది – రోజూ చూసే సూర్యోదయమే అయినా అందులోని వింతకాంతి, రేపటి ఆశలకిరణంలా ద్యోతకమయిందతనికి. అదే సూర్యోదయంలో కాలచక్ర ప్రగతి కనిపించింది.జ్ఞానం కనిపించింది. తమ జీవితాలకి వెలుగును చూపే భగవానుడు కనిపించాడు. ఎగిరే పక్షుల్లోనూ, వీచే గాలిలోనూ స్వేచ్ఛ కనిపించింది. శివరామయ్య గారి మనస్సు ఆనందంతో పులకరించింది.

ఆ అనుభూతికీ, ఆ ఆనందానికీ కారణం ఆయనగారి రెండో పుత్రరత్నం శ్రీను పదోతరగతి పరీక్ష ప్రథమశ్రేణిలో పాసవడమే! తూర్పు ఆకాశంలో లేతవెలుగులు విరజిమ్మే సమయానికి న్యూస్ పేపరు పట్టుకొచ్చి ఆ సంతోషవార్తను ఆయన చెవిన వేశాడు శ్రీను.

దేవుడి గదిలోంచి గంట వినిపించడంతో లేచి, లోపలికి నడిచారు శివరామయ్యగారు. పారిజాత కుసుమాలతో కృష్ణ విగ్రహాన్ని అలంకరించి, పూజ పూర్తిచేసి వస్తూన్న మహాలక్ష్మమ్మగారు లక్ష్మీదేవిలా కనిపించారాయన కళ్ళకి. ఆమె వదనంలోనూ ఆనందమే!

 

ప్రసాదాన్ని ఆయనకందిస్తూ –

” విన్నారా! ఈ ఏడు పాతికశాతమే పాసయ్యారట! అందులో మనవాడు ఫస్టొచ్చాడంటే గొప్పే” అంది.

” గొప్పకాక? వాడెవరనుకున్నావ్? నిత్యం వందలాది విద్యార్థులకు విద్యాదానం చేసే ఉపాధ్యాయుడి కొడుకు. యింట ఎఱ్ఱయేగానీ లేకపోయినా విద్యచేత గొప్పవారమే మనం” అంటూ వంకీకున్న లాల్చీని తీసి వేసుకుని బయటకు నడిచారాయన.

తనక్కావలసిన వాళ్ళకీ, తన మేలును కాంక్షించేవాళ్ళకీ, తన కష్టసుఖాల్లోనూ ఆలోచనల్లోనూ పాలు పంచుకునే ఆప్తులకీ పుత్రరత్నం పాసైన సంగతి చెప్పి ఒక్కగంటలో తిరిగొచ్చారాయన.

” మీవాడు ఫస్టున రాకపోతే ఇంకెవరొస్తారూ? చదువు, సంస్కారం, విజ్ఞత వున్న వంశంమీది. ఆ కుటుంబంలోంచి వచ్చినవాడు ఆ తెలివితేటల్ని పుణికి పుచ్చుకోకుండా ఎలా ఉంటాడు” అన్నారంతా.

అవును మరి. ఆర్థిక స్థితిగతులూ, కుటుంబసమస్యలూ – తనను – చదువుకోనివ్వలేదుగాని లేకుంటే తను యూనివర్సిటీలో ప్రొఫెసరే అయివుండేవాడు…

పెద్దవాడు కృష్ణమోహన్ మాత్రం? తెలివి తక్కువవాడేం కాదు. కాలేజీలో అడుగు పెట్టిన దగ్గర్నుంచి స్కాలర్‍షిప్‍ల మీద చదివేడు. తిండి, బట్ట ఖర్చు మినహా వాడి చదువుకేం తను ఖర్చు పెట్టలేదు. వాడు కలెక్టరవ్వాలని వాళ్ళమ్మ ఆశపడేది. ఐ.ఎ.ఎస్.కి వెళితే అందులో నిలిచేవాడే. కానీ ఎన్ని తెలివితేటలున్నా దాని వెనుక అదృష్టం కూడా కల్సి రావాలి. నొసట గీతప్రకారం జీవిత గమనం నిర్దేశించబడుతుందని నమ్మేవాళ్ళలో తనొకడు. అనుకోకుండా వచ్చిన బేంకు ఉద్యోగంలో కృష్ణమోహన్ స్థిరపడిపోయాడు. స్వయంకృషి, పట్టుదల ఉన్నవాడు ఏ రంగంలో వున్నా రాణించగలడు. ఆ నమ్మకం తనకుంది. దూరంగా ఒక్కడూ ఉంటున్నాడన్న బాధతప్పితే మరో చింతలేదు వాడిగురించి. నెమ్మదిగా వాణ్ణి ఓ యింటివాణ్ణి చేసేస్తే ఆ బాధా తీరిపోతుంది. ఇద్దరు కొడుకుల మధ్యా ఉన్నది ఒకేఒక ఆడపిల్ల సరస్వతి. ఎలాగో దానికి తగిన వరుడిని వెతుక్కోపోలేడు!

శివరామయ్యగారి తలపులు పరిపరివిధాల పోతున్నాయి.

“వంటయింది. వడ్డించెయ్యమంటారా” అంటూ వచ్చారు మహలక్ష్మమ్మగారు.

ఆలోచనల్ని అంతటితో కట్టిపెట్టి లేచారు శివరామయ్యగారు-

మధ్యగదిలో శ్రీను ఏదో పుస్తకం చదువుతూ కన్పించాడాయనకు. శ్రీను అందరి పిల్లల్లాంటి ఆటధ్యాస పిల్లాడు కాడు. వాడికి చదువుమీద ఎంతశ్రద్ధో! సమయం దొరికితే చాలు ఏదో ఒక పుస్తకం తీసి చదువుతూనే వుంటాడు. అదృష్టం కలిసిరావాలేగాని వాడు వాళ్ళమ్మ ఆశయం మేరకు ఐ.ఎ,ఎస్ పాసై కలెక్టర్ తప్పకుండా అవుతాడు. శివరామయ్యగారి కళ్ళు మెరిశాయి ఆనందంతో.

భోజనం చేసి యథాప్రకారం స్కూలుకు బయల్దేరేరు. ఆ రోజంతా సరస్వతీదేవి ఆవహించినట్లే పిల్లలకు పాఠాలు చెప్పారు. సాయంకాలం యింటికి తిరిగొస్తుంటే పోస్ట్ మేన్ కనిపించి, ” మాష్టారూ మీకో ఉత్తరముంది” అని ఓ కవరందించాడు.

ఆ కవరుపైనున్న దస్తూరి చూడడంతోనే శివరామయ్యగారికి మనసులోంచి సంతోషం పొంగుకొచ్చింది. హైదరాబాద్ నుండి పెద్దకొడుకు కృష్ణమోహన్ రాసినదది.వెంటనే తీసి ఏం రాసేడో చదివేయాలనిపించింది.కానీ ఆతృతను అణుచుకుని కవర్ని లాల్చీ జేబులో పెట్టుకున్నాడు. కృష్ణమోహన్ అందర్లా అక్కడ క్షేమం, యిక్కడ క్షేమం అంటూ నాలుగు పొడిముక్కలు రాసి ఉత్తరం ముగించెయ్యడు. వాడు రాసిన ఉత్తరం చదువుతూంటే వాడితో మాట్లాడుతున్న అనుభవం కలుగుతుంది. అంత చక్కగా ఉత్తరాలు రాస్తాడు. వివరాల్నీ విశేషాల్నీ కళ్ళకు కట్టినట్టు రాస్తాడు. అటువంటి ఉత్తరాల్ని ఆదరాబాదరాగా చదివితే లాభం లేదు.

నడకలో వేగం హెచ్చించి యింటికొచ్చి కాసింత కాఫీతాగి, తాపీగా ఉత్తరం చదవడం మొదలుపెట్టేరు. ఉత్తరమంతా చదివేక, ఆశించిన దానికంటే ఎక్కువ ఆనందం కలిగిందాయనకు. పెళ్ళి ప్రస్తావన ఎప్పుడు తెచ్చినా దాటేస్తూ “ఇప్పుడు నాకేం తొందర” అనేవాడు. యీ ఉత్తరంలో ఆ సంగతి వ్రాయడం ఆశ్చర్యమనిపించింది. ఆ వెంటనే భార్యని పిలిచి ఉత్తరాన్ని పూర్తిగా చదివి వినిపించారు –

“పోన్లెండి. మనవాళ్ళూ, మనూరి పిల్లా. మీ అంగీకారమైతే చూసుకుందికెట్లాగూ వస్తానంటున్నాడు – శుభం – రమ్మని ఓ కార్డు రాసి పడెయ్యండి” అందావిడ.

భార్య మాటలకు సరేనన్నట్లు తలూపి సంతృప్తిగా నిట్టూర్చారు శివరామయ్యగారు.

 

*     *     *

 

శ్రీనివాస్ చాలా హుషారుగా ఉన్నాడు.

ఆరోజు కాలేజీలో చేరే రోజు. ఉన్న ఒక్కగానొక్క ఫేంటూ, టెరికాటన్ చొక్కా ఉతికి ఇస్త్రీ చేయించుకున్నాడు. పదో తరగతి పాస్ సర్టిఫికెటూ, మార్కులలిస్టూ, తదితర సర్టిఫికెట్లూ, పాస్‍పోర్టు సైజు ఫోటోలూ, కాలేజీవారు పంపిన ఇంటిమేషన్ కార్డూ…. కాలేజీ అడ్మిషన్ టైమప్పుడు కావల్సిన అన్ని సర్టిఫికెట్లూ ఒక ఫైల్లో పెట్టుకున్నాడు. అవికాక హైస్కూల్లో తను డిబేటింగ్‍లోనూ, ఎస్సే రైటింగులోనూ పాల్గొని ఫస్టులు తెచ్చుకున్న సర్టిఫికెట్లు కూడా వాటి అడుగున పెట్టాడు. వాటన్నిటిని సంతృప్తిగా చూసుకుంటూ మార్కుల జాబితాను మరొక్కమారు చూసుకున్నాడు. సగటున ఎనభైయ్యారు శాతం మార్కులొచ్చాయి. ఏ ఒక్క సబ్జెక్టులోనూ ఎనభైకి తగ్గలేదు.

అందుకే ఊళ్ళో మొత్తం మూడు జూనియర్ కాలేజీలున్నా మూడింటిలోనూ మంచికాలేజీ అనుకున్న ఒక్క కాలేజీకే ఎప్లయ్ చేసి ఊరుకున్నాడు. ఎంత కాంపిటీషన్ ఉన్నా తనకు మాత్రం సీటు రావటం ఖాయమనుకున్నాడు. తన స్నేహితులు చాలామంది మూడింటికీ ఎప్లయ్ చేసి , ఏ కాలేజీలో సీటొచ్చినా చాలన్నట్లు చూశారు. తను అనుకున్నట్లే తనకు సీటొచ్చింది.

ఈ రెండేళ్ళ కాలేజీ చదువూ తన భవిష్యత్తును నిర్ణయిస్తుందంటారు నాన్నగారు.

ఏమైనాసరే తను యింతకంటే బాగా చదవాలి. నలుగురిలోనూ పేరు తెచ్చుకోవాలి! అనుకున్నాడు.

అతని మనస్సు ఆ క్షణంలో ఆనందడోలికలూగింది.

కాలేజీలో ప్రిలిమినరీ యింటర్వూ పదిగంటలకు కాబట్టి తొమ్మిది గంటలకే యింటిదగ్గర బయల్దేరారు తండ్రీ,కొడుకూ.

శివరామయ్యగారు ఆ పూట స్కూలుకి శెలవు పెట్టేశారు. ఆయన కాలేజీలో అడుగు పెట్టేసరికి కాలేజీ ఆవరణంతా కోలాహలంగా ఉంది.అక్కడో బోర్డుమీద మెరిట్ ప్రకారం సెలెక్టు చేసిన విద్యార్థుల లిస్టు ఉంది. ఆతృతగా దాన్ని పరికించారు శివరామయ్యగారు.అందులో నాలుగో పేరే శ్రీనివాస్‍ది.

సరిగ్గా పదిగంటలయ్యేసరికి యింటిమేషన్ కార్డులన్నీ కలెక్టు చేసి వరుసగా పిలవడం మొదలెట్టారు. శ్రీనివాస్ పేరు పిలవగానే శివరామయ్యగారు కొడుకుని తీసుకుని లోపలికెళ్ళారు. అక్కడ ఒరిజినల్ సర్టిఫికెట్లన్నీ వెరిఫై చేస్తున్నాడో వృద్ధ జంబూకం. అతన్ని చూస్తే అలానే అనిపించింది శివరామయ్యగారికి. అన్నిసర్టిఫికెట్లూ చూశాక,”అప్లికేషన్ ఫారాన్ని ప్రిన్సిపాల్‍గారి సంతకంకోసం పంపిస్తాం. యీలోగా మీరు ఫీజు చెల్లించిరండి” అంటూ ఓ చిన్న స్లిప్‍ను శివరామయ్యగారి చేతికందించాడతను.

“ఫీజు ఎంతకట్టాలో సెలవిస్తే….” అంటూ ఆగిపోయారాయన.

“అందులోనే ఉంటుంది చూడండి” అని తనపనిలో తాను లీనమయ్యాడాయన.

స్లిప్ వంక చూశారు శివరామయ్యగారు. అందులో రెండే అంకెలున్నాయి. మొదటిది రిజిస్ట్రేషన్ నెంబరు. రెండోది చెల్లించాల్సిన ఫీజు.అతని నవనాడులూ ఒక్కసారి కృంగిపోయినట్లయ్యాయి.ఆ అంకె ఆరువందల ఎనభై!

శివరామయ్యగారికి ఒక్కక్షణం అంతా అయోమయమైపోయినట్లు తోచింది.ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది.లేదా తన లెక్కయినా తప్పయి వుండాలనుకున్నారు.

“ఇది జూనియర్ ఇంటర్మీడియట్‍కి కట్టాల్సిన ఫీజేనా?” అడిగేరు అనుమానంగా.

“అవును” అన్నాడతను తలెత్తకుండానే.

“మరి…మీరిచ్చిన ప్రాస్పెక్టస్ ప్రకారం నూటఎనభయ్యే అవుతుంది కదా”

ఈమారు వృద్ధజంబూకం కుందేలుపిల్ల వైపు మృగరాజు చూసినట్లు కోపంగా చూశాడు శివరామయ్యగారి వంక.

“అవును.ఫీజు నూట ఎనభయ్యే. కాలేజి బిల్డింగ్‍ ఫండు ఐదువందలు. డొనేషన్ల విషయం ప్రాస్పెక్టస్‍లో ఉండదు కదా” అన్నాడు అతి సౌమ్యంగా మారిపోతూ.

“మరి డొనేషన్ చెల్లించకపోతే?…” అమాయకంగానే వుందా ప్రశ్న.

“ఈ కాలేజీలో చేరాలంటే అది చెల్లించాల్సిందే” – జవాబు మాత్రం కరుకుగావుంది.

శివరామయ్యగారికి ఏం చెయ్యడానికీ పాలుపోలేదు. గది బయటకొచ్చేసి, ఆవరణలో నీడనివ్వకుండా ఎత్తుగా పెరిగిన అశోక చెట్ల దగ్గర నిలబడ్డారు. పూర్వం తను చదువుకున్న స్కూల్లో ప్రహరీగోడంచునా మామిడి,సపోటా,జామ మొదలైన ఫలవృక్షాలుండేవి. అవి పిల్లలకు పళ్ళనిచ్చేవి. నీడనిచ్చేవి. ఇప్పుడా రోజులు మారిపోయాయి. నాగరికత ప్రబలిపోయింది. కాగితం పూల అందాలే నిజమైన అందాలయ్యేయి. ఈ నీడనివ్వని నిరుపయోగమైన చెట్లలాగే, యీ అందమైన ఎన్నో అంతస్థులున్న కాలేజీలుకూడా విద్యనర్ధించే సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయా అనిపించింది. అదే నిజమైతే విద్యకు డబ్బువిలువ కాక మరేముంటుంది? విద్యను బోధించే ఒక ఉపాధ్యాయుడై వుండి కూడా తనవంటివారు దానిని సమర్థించి సహించవలసిందేనా? శివరామయ్యగారి మనసులో గాంభీర్యం, హృదయంలో నిబ్బరం,ధైర్యం ఒక్కమారు నిండుగా తొణికిసలాడేయి. అంతే! మరుక్షణంలో ఆయన ప్రిన్సిపాల్‍గారి రూంలో ఉన్నారు.

“యస్.కమిన్” అని లోనికాహ్వానించి కూర్చోమని కుర్చీ చూపించారు ప్రిన్సిపాల్ గారు.కుర్చీలో కూర్చుంటూ ఆయనవంక చూశారు శివరామయ్యగారు.

వయసు ఏభై అయిదేళ్ళుండొచ్చు. ఎర్రగా దృఢంగా ఉన్నారు. నెరసిన క్రాపింగూ, నుదుట విభూతీ, తెల్లని పంచె,లాల్చీ,కండువాలో హుందాగా ఉన్నారు.

తన ముందున్న అప్లికేషన్లమీద సంతకాలు చేసి పంపేసి, “చెప్పండి” అంటూ శివరామయ్యగారి వేపు చూశారాయన.

” మా అబ్బాయి శ్రీనివాస్ ని మీ కాలేజీలో చేర్పిద్దామని వచ్చాను – టెంత్‍లో ఎనభైయ్యారు పర్సంట్ మార్కులొచ్చాయి.మీరు ఎన్నిక చేసిన మెరిట్ లిస్టులో నాలుగోవాడు.”

“వెరీగుడ్ చేర్పించండి. ఫీజు కట్టేసేరా?”

“బిల్డింగ్ ఫండ్ ఐదొందల రూపాయలు కంపల్సరీగా కట్టాలంటున్నారు. నేనందుకు ప్రిపేరై రాలేదు. మీరనుమతిస్తే ప్రస్తుతం ఫీజుమాత్రం కట్టగలను” అన్నారు.

ప్రిన్సిపాల్‍గారు ఆశ్చర్యంగా చూశారు. ఆయనకీ కేసు కొత్తగా అనిపించింది.ఫీజు ఎంతంటే అంత, ఎప్పుడంటే అప్పుడు క్యూలో నిలబడి కట్టేవారేగాని యిలా కట్టలేనని చెప్పేవారింతవరకూ తారసపడలేదాయనకు.

“చూడండి సార్. ఈ కాలేజీ స్థాపించి అయిదేళ్ళయింది. ఇంత తక్కువ వ్యవధిలోనే విద్య చేత, క్రమశిక్షణ చేత మంచి కాలేజీ అని పేరు సంపాదించుకుంది. ఒకమంచి విద్యాసంస్థను అభివృద్ధి పరచడానికి సహృదయులైన మీవంటివారి సహకారం లేకపోతే ఎలా?” అని ప్రశ్నించారు.

“నిజమే. విద్యాసంస్థను అభివృద్ధి చేయడానికి అందరూ సహాయ సహకారాలనందజేయాలి. కాని అది నిర్బంధంగా కాకుండా, సహకరించేవారి ఆర్థిక స్థితిగతులను బట్టివుంటే బావుంటుందని నా అభిప్రాయం. కొన్ని కాలేజీల్లో డొనేషన్లు తీసుకుంటారని నేనూ విన్నాను. కానీ మెరిట్ విద్యార్థులనుండి కూడా యింత ఎక్కువమొత్తం వసూలు చేస్తారని ఊహించలేకపోయాను. నా మట్టుకు నాకు కేవలం ఫీజులు చెల్లించి, పుస్తకాలు కొని చదివించడమే గొప్ప. కాకుంటే కాస్త వ్యవధి తీసుకుని శక్తానుసారం విద్యాసంస్థకు తోడ్పడగలను. మీకు తెలుసు, యీ దేశంలో స్కూలు మాస్టారెంత స్థితిపరుడో! నేనొక స్కూలు మాష్టార్ని. నా గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తారనే మిమ్మల్ని కలుసుకున్నాను” అన్నారు శివరామయ్యగారు.

ఒక్కక్షణం ప్రిన్సిపాల్‍గారేం మాట్లాడలేదు. ఆ తర్వాత అన్నారు:

“చూడండి మాష్టారూ. మీకీపాటికి విద్యాసంస్థల నిర్వహణలోని లోటుపాట్ల గురించి తెలిసే ఉండాలి. మాదొకరకంగా ప్రైవేటు సంస్థే. ప్రభుత్వం గుర్తించిందేగాని నిధులివ్వటం లేదు. అంచేత ఫండ్స్ సమకూర్చుకోవడం తప్పనిసరి అవుతోంది. మీ అబ్బాయిలాంటి తెలివైన విద్యార్థి మా కాలేజీలోనే చదవాలి.చదివి గొప్పవాడు కావాలి. మీకూ మాకూ పేరు తేవాలి. అందుకోసమైనా మీరీ ఖర్చు పెట్టక తప్పదు – అయితే యిక్కడ మీరొక్క సంగతి గుర్తించాలి. నిర్బంధంగా ఫండ్ వసూలు చేస్తున్నామని దీన్ని మీరొక వ్యాపార సంస్థగా భావించకూడదు. ఇక్కడ సీటొచ్చిన విద్యార్థి తప్పకుండా ఏ సైంటిస్టో,ఇంజనీరో,డాక్టరో, కలెక్టరో అయి తీరుతాడు. ఆ గౌరవ ప్రతిష్టలు నిలుపుకోడానికే ఎంతోమంది ఫండ్ పేరిట సీటుకోసం, వేలకువేలు గుప్పిస్తామన్నా మేము తెలివైన విద్యార్థులనే తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆలోచించండి – పిల్లల అభివృద్ధి కోసం, చదువుకోసం మనం కొన్ని కష్టనష్టాలను భరించక తప్పదు” అంటూ ఆగేరాయన.

అది ఒక చిన్నపిల్లాడికి చేసిన హితబోధలా ఉందేగాని ఒక కాలేజీ ప్రిన్సిపాల్ ఒక విద్యార్థి తండ్రితో మాట్లాడినట్లు లేదనిపించింది శివరామయ్యగారికి.

ఎన్ని కారణాలున్నా డొనేషన్ రూపంలో తను ఐదువందల రూపాయలు కట్టడం అసంభవం. తలకు మించినపని. కట్టకపోతే పని అయ్యేట్టు లేదు. ఏం చెయ్యాలి? జరిగేదేదో జరుగుతుంది. అంచేత మనసులోని మాటను దాచుకోవాలనుకోలేదు.

“చూడండి సార్ – నా గురించి చెప్పుకోవడం కాదుగానీ రెండేళ్ళక్రితం ఉత్తమ ఉపాధ్యాయ బిరుదాన్ని ప్రభుత్వం నుంచి అందుకున్నవాణ్ణి. చదువు చెప్పటమేగాని దానిద్వారా డబ్బు సంపాదించాలన్న కోరికలేనివాణ్ణి. డబ్బే జీవితానికి ముఖ్యం కాదనుకున్నవాణ్ణి. మధ్యతరగతి కుటుంబీకుణ్ణి. మనమంతా సరస్వతీ పుత్రులమని నమ్మినవాణ్ణి. ఆ దృష్టితో చూసి అయినా మీరు నా అభ్యర్థనను మన్నించాలి. కేవలం డొనేషన్ కట్టలేదన్న కారణంగా ఒక మంచి విద్యాసంస్థ ఒక తెలివైన విద్యార్థిని వెనక్కు పంపేయడం న్యాయంకాదు.విద్యాలయాలు తెలివైన పేద విద్యార్థులకు చేయూతనివ్వాలి. డబ్బుంటేనే చదువు అన్న అపోహను పోగొట్టాలి. మీరు మార్కులకే ప్రాధాన్యతనిస్తారని యిక్కడసీటు ఖాయమని మరోచోట దరఖాస్తు చేయలేదు. నా అసమర్థత కారణంగా విలువైన వాడి సంవత్సరకాలాన్ని వృధా చేయలేను. మీరు మన్నిస్తే ఏ బాధలైనా పడి ఓ రెండొందలు మీ ఫండ్ కి చెల్లిస్తాను. ఓ నెల గడువివ్వండి” – అని సమాధానంకోసం ఆత్రంగా ప్రిన్సిపాల్‍గారి  ముఖంలోకి చూశారు శివరామయ్యగారు.

ఒక్కక్షణం ఏం మాట్లాడలేదు ప్రిన్సిపాల్ గారు. ఆ తర్వాత దించిన తలను ఎత్తకుండానే యిలా అన్నారు:

“మాష్టారూ! ఎంత ప్రిన్సిపాల్ నయినా, ఎన్ని వ్యక్తిగత అభిప్రాయాలున్నా నేనూ ఉద్యోగినే ఇక్కడ. మీ అభిప్రాయాలలో కొన్నిటితో నేనూ ఏకీభవిస్తాను – కానీ కొన్ని కారణాల చేత నేనశక్తుడిని. నా చేతిలో ఉన్నది, నేనొక యాభై రూపాయలు తగ్గించగలను. మీకోసం ప్రత్యేకించి రెండురోజుల గడువివ్వగలను. అంతే నేను చేయగలిగింది. మీ వాడికి మంచి భవిష్యత్తు కలగాలని ఆశీర్వదిస్తున్నాను” అంటూ తనపనిలో తాను లీనమయ్యారు.

నిస్సహాయంగా లేచి బయటకొచ్చేశారు శివరామయ్యగారు.

 

*      *       *

 

ఇల్లు చేరిన శివరామయ్యగారి మనసు మనసులో లేదు – జరక్కూడనిదేదో జరిగినట్లు భావించారు. ఓటమితోనూ, అవమానంతోనూ కుంచించుకుపోయారు.

” మరి యీ యేడాదికి కాలేజీలో చేరేది లేదా నాన్నా” అనడిగాడు శ్రీను కాలేజీ గడప దాటుతుంటే. వాడి రెండు కళ్ళల్లోనూ సుళ్ళు తిరుగుతున్న బాధను చూడలేక పోయాడు. తను ఏం చెప్పగలడు? ఎలా ఓదార్చగలడు వాడిని? మౌనమే అన్నిటికీ సమాధానం. సాయంకాలం వరకూ ఎక్కడెక్కడో తిరిగాడు. ఎవరెవర్నో కలుసుకున్నాడు. మనసు మరింత బరువెక్కిందేగాని తేలికవలేదు. ఆకలవటంలేదని అన్నం కూడా మానేసి మంచంమీద మేను వాల్చాడు. అప్పుడాయన మదిలో పెద్దకొడుకు కృష్ణమోహన్ మెదిలాడు. లేచి, డైరీలో దాచిన కొడుకు రాసిన ఉత్తరాన్ని మరొక్కమారు తీసి చదవడం మొదలుపెట్టేరు –

నాన్నా!

మీకో కొత్త సంగతి తెలియజేయాలనే యీ ఉత్తరం రాస్తున్నాను. ఎన్నాళ్ళగానో మీరూ, అమ్మా నా పెళ్ళిని గురించి ఆలోచించమని రాస్తూ వచ్చారు. పెళ్ళిని గురించి నాకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి కనుకనే యిన్నాళ్ళూ మౌనం వహించాను. నాకు అన్నివిధాలా నచ్చి, నా ఆలోచనలకు సరిపోయే అమ్మాయి తారసపడక మీకు నేనేం జవాబు చెప్పలేదు. ఇప్పుడు తారసపడిందనే అనుకుంటున్నాను. వాళ్ళది మనవూరే – మనవాళ్ళే – చదువు, సంస్కారమూ ఉన్న కుటుంబమే. మీరంగీకరిస్తే ఆ అమ్మాయిని మీకు చూపించడానికి వచ్చేవారం వస్తాను – ఏమైనా మీ నిర్ణయమే తుది నిర్ణయం.

– మీ కృష్ణ.

 

ఉత్తరం చదివిన శివరామయ్యగారి మనసులో ఆనందంతోపాటు ఒకింత గర్వంకూడా చోటు చేసుకుంది. నా పిల్లలు రత్నాలు. పెద్దల మాటలకు విలువిచ్చే సంస్కారులు అనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో మరో ఆలోచన కూడా మెరుపులా మెరిసింది. అవును! వచ్చేది రేపేగా! శ్రీను విషయమై వాడొక పరిష్కారాన్ని ఆలోచించకపోడు అనుకున్నారు – ఆ సమయంలో ఆయన దృష్టి ముందుగదిలో చాపమీద బోర్లా పడుకున్న శ్రీను మీద పడింది. పొంగివస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ వెక్కుతున్నాడు వాడు.

శివరామయ్యగారి మనసు ఒక్కసారి ద్రవించిపోయింది. లేచి కొడుకు దగ్గరకు వెళ్ళి వాడి తల నిమురుతూ, ” ఒరేయ్ శ్రీనూ, ఎన్ని యిబ్బందులెదురైనా నీ చదువు మాత్రం ఆపెయ్యనులేరా. నన్ను నమ్ము” అన్నారు.

శ్రీను తలెత్తి ఆయన ముఖంలోకి వింతగా చూశాడు. వాడి కళ్ళలో ధారాపాతంగా నీళ్ళు!

“అవును. నన్ను నమ్ము!” అంటూ తన కళ్ళలో తిరుగుతున్న నీటిని ఆ పసివాడికి చూపించడం యిష్టంలేక గిరుక్కున వెనుదిరిగి వచ్చేశారాయన. ఆ రాత్రి కలత నిద్రే అయింది.

మర్నాడు ఉదయం ట్రైన్‍లో వచ్చేడు కృష్ణమోహన్. ఇంట్లో మార్పు లేకపోయినా మనుషుల్లో కొత్తగా వచ్చిన గాంభీర్యాన్ని పసిగట్టేడు. చెల్లెల్ని చాటుగా పిలిచి విషయాల్ని సేకరించేడు. ఆర్థికపరిస్థితులు చెల్లెలు ద్వారానే తెలుసుకుంటాడతను. ఎంత యిబ్బందొచ్చినా తండ్రి తనతో డబ్బు ప్రస్తావన తేడని అతనికి బాగా తెలుసు.

అందుకే పరిస్థితిని బాగా అర్థం చేసుకుని మధ్యాహ్న భోజనమయ్యాక తండ్రి గదిలోకివెళ్ళి ఆ విషయాన్ని ప్రస్తావించేడు. అప్పుడే నీకెట్లా తెలిసింది విషయం అన్నట్లు చూశారాయన.

“శ్రీను చదువు విషయమై మీకు సమస్యేం లేదు నాన్న. ఇక్కడ కాకపోతే వాడు నా దగ్గరుండి చదువుతాడు. ఇవాళ కాకపోయినా మరో సంవత్సరం పోయాకైనా మీరంతా నా దగ్గరకొచ్చేసే వారేగా. అనవసరంగా మనసు పాడుచేసుకోకండి” అంటూ ఎంతో తేలిగ్గా ఆ సమస్యను పరిష్కరించేసిన కొడుకువైపు చూస్తూ మాటలు రాని బొమ్మల్లే ఉండిపోయారు శివరామయ్యగారు.

 

*        *        *

 

గుమ్మంలో అడుగు పెడుతూనే పెళ్ళికూతురు తండ్రిగా పరిచయమైన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోలేదు శివరామయ్యగారు – ఆయన ప్రిన్సిపాల్ గారు! కానీ ప్రిన్సిపాల్ గారు మాత్రం ఒక్కక్షణం మాటలురాని పరిస్థితిలో కొయ్యబారిపోయి, తర్వాత తేరుకుని పశ్చాత్తాపపడి వారిని సాదరంగా లోపలికాహ్వానించారు.

పెళ్ళిచూపుల ఏర్పాట్లు ఘనంగానే ఉన్నాయి. చూపులూ, ఫలహారాలూ అయ్యాక మధ్యవర్తిగా ఉన్నాయన మధ్యలోకొచ్చి, ” పెళ్ళికూతురు అన్నదమ్ములూ, పెళ్ళికొడుకూ స్నేహితులు కాబట్టి, పెళ్ళికొడుకూ, పెళ్ళికూతురూ అంతకుముందే చూసుకుని ఇష్టపడ్డారు కాబట్టి వారిద్దర్నీ ఒకటి చేసే ప్రయత్నంలో మిగతా విషయాలు మాష్టారుగారు నిర్మొహమాటంగా మాట్లాడితే బావుంటుందని నా అభిప్రాయం” అన్నాడు.

“ఇందులో యింక మాట్లాడేదేముంది?” అన్నారు శివరామయ్యగారు. – ఆ మాటకు ప్రిన్సిపాల్ గారూ, కృష్ణమోహన్ ఆయన వంక అదోలా చూశారు.

“అది కాదు మాష్టారూ! పిల్లలెలాగూ యిష్టపడ్డారు. కాబట్టి కట్నకానుకల విషయం మీరు తేలిస్తే ముహూర్తాలు పెట్టుకుందాం. అబ్బాయి ఉద్యోగయోగ్యతలను బట్టి పదిహేను వేలవరకూ కట్నం ఎవరైనా యిస్తారు – కానీ నాకంత శక్తిలేదు. పదివేలిచ్చి పెళ్ళి చేయగలను. మీరు అంగీకరిస్తే అది మా అదృష్టమే” అన్నారు ప్రిన్సిపాల్ గారు ఆయన వైపు ఆశగా చూస్తూ.

శివరామయ్యగారు అతని కళ్ళలోకి చూశారు. అభ్యర్థిస్తున్నట్లు ఉన్నాయా కళ్ళు. కొడుకు వైపు చూశారాయన. ” నాకు నచ్చింది. మీ నిర్ణయమే తుదినిర్ణయం” అన్నట్లున్నాయి అతని చూపులు.

” ఇవి జీవితాలు బావగారూ, ఇందులో వ్యాపారసరళిలో డబ్బు ప్రసక్తి రాకూడదు. నేను నా కొడుకుని నా బాధ్యతమేరకు చదివించి పెద్దవాణ్ణి చేశాను. వాడి అదృష్టం కొద్దీ మంచి ఉద్యోగమొచ్చింది. నాకూ ఒక ఆడపిల్ల ఉంది. కానీ కూతురి పెళ్ళి కొడుక్కి తీసుకున్న కట్నంతో చేయాలన్న ఊహ నాకు లేదు. ఎవరి జీవితాలు వారివి! డబ్బు అవసరం ఎంతున్నా వాడి యిష్టాన్ని కాదనలేను – మీ అమ్మాయి వాడు కోరుకున్న జీవిత భాగస్వామి – జీవితాలకి డబ్బు అవసరమే, కాని డబ్బే జీవిత సర్వస్వంకాదు – నా యీ అభిప్రాయంలో ఎప్పుడూ మార్పురాదు. ముహూర్తాలు పెట్టించండి” అంటూ లేచారు.

అందరి ముఖాల్లోనూ ఆనందం తాండవించిందా క్షణంలో.

మర్నాడే ముహూర్తాలు పెట్టించుకొచ్చి శివరామయ్యగార్ని యేకాంతంగా కలిశారు ప్రిన్సిపాల్ గారు – ” నన్ను క్షమించండి మాష్టారూ! అభిప్రాయాలెన్ని ఉన్నా మీలా పాటించడం చేతకాలేదిన్నాళ్ళూ. మనుషులలోని విజ్ఞానాన్ని, మంచితనాన్ని డబ్బుతో కొలవలేమన్నది నిజం. నేనారోజు ఆ స్థానంలో ఉండి అలా జవాబు చెప్పినందుకు సిగ్గుపడుతున్నాను. జీవితమనే చదువులో యీనాడు మీ దగ్గర ఓనమాలు నేర్చుకున్నాను. నా అభిప్రాయాలను నేను గౌరవించే స్థితికెదగాలని నిశ్చయించుకున్నాను. అందుకే నేనా కాలేజీ ఉద్యోగానికి రాజీనామా చేశాను”

నమ్మలేనట్లు అతని ముఖంలోకి ఆశ్చర్యంగా చూశారు శివరామయ్యగారు. ఆయన నయనాలు శాంతిగా, కాంతిగా మెరుస్తున్నాయి!

 

 

5 thoughts on “ఓనమాలు

  1. కథ సినిమాటిగ్గా కాకుండా రియలిస్టిక్ గా నడిచింది…రచనా శైలి, ముగింపు..చాలా బాగున్నాయి.

  2. వ్యక్తులూ, సమాజం కూడా ఇప్పుడు విలువలను నిఖార్సుగా పాటించడం చాలా చాలా కష్టం. కాని ఈ కథ 50, 60, 70ల నాటి తెలుగు మధ్యతరగతి ప్రజల భావౌన్నత్వాన్ని తిరుగులేకుండా ప్రదర్శిస్తోంది. 70ల చివరలోనే మన సమాజం అన్ని రంగాల్లో పతన బాటపట్టింది.

    రౌడీలు, లుచ్చాలు తెలుగు సినీ హీరోలయిపోయినంత గొప్పగా 80ల నుంచే సకలరంగాల్లో కూలిపోయింది మన సమాజం. ఎంత పతనం అంటే ఒకప్పుడు మన పెద్దలు కలలు కన్న విలువలు, విశ్వాసాలు, నైతిక వర్తనలూ ఇక ఎన్నడూ మనం చూడలేనంతగా పతనమయ్యాం.

    మంచివైపు మనుషుల మార్పుకు సంబంధించి చందమామ కథలు మొదట్నుంచీ అందమైన కలలను కనిపింపజేసేవి. కానీ ఆ నీతిని పాటించిన వారు చాలా చాలా తక్కువ. చందమామ కథతో పోలిస్తే కాస్త నాటకీయంగా ఉన్నప్పటికీ మీ కథ దాదాపు చందమామ కథకు దగ్గరగానే ఉంది.

    విశ్వనాథ సత్యనారాయణ గారు తన కాలంలోనే అంతరించిపోతున్న ఫ్యూడల్ సమాజ ధర్మాలు, విలువలను చూసి ‘వేయిపడగలు’ బృహన్నవలలో విలపించారు. కాని ఆయన కళ్లముందే ఆయన జీవించిన, పలవరించిన పాత సమాజం నిలువునా కూలిపోయింది.

    భూస్వామ్య సమాజపు మరణ శాసనాన్ని వేయిపడగలు నవల చిత్రించినంత గొప్పగా తెలుగులో మరే రచనా చూపించలేదు. నెగటివ్ గుణం ఉన్నప్పటికీ పాత సమాజాన్ని వేయిపడగలమీద దర్శింపజేసిన గొప్ప రచన అది.

    “మనుషులలోని విజ్ఞానాన్ని, మంచితనాన్ని డబ్బుతో కొలవలేమన్నది నిజం.” నిజమే… కాని ప్రస్తుతం మనుషులనే టోకున కొనేస్తున్నారు. ఇక విజ్ఞానం, మంచితనం ఎక్కడ మిగులుతుంది?
    మీ కథ బాగుంది. ఎక్కడా పక్కకు పోకుండా ఎంచుకున్న అంశం మీదే నిలబడింది. కాని ఇది చందమామ కథ వంటి అందమైన కల. కలలు ఎప్పుడూ అందంగానే ఉంటాయి కదూ..
    విలువ, మంచితనం అనే ఈ కాలపు విసర్జిత గుణాన్ని మళ్లీ కథ ద్వారా చూపించినందుకు అభినందనలు.

  3. చాలా బాగుంది. మంచి కధ. మనస్సును సమాధాన పర్చుకొని సర్దుకు పోవడం అలవాటైపోయిన జీవితాలకి, కనీసం అప్పుడప్పుడైనా నమ్మిన సిద్ధాంతాలకి నిలబడాలని ఒక సందేశం, హెచ్చెరిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *