April 25, 2024

చేపకి సముద్రం-భాషకి మాండలికం

రచన :   వై.   శ్రీరాములు-అనంతపురం

సంస్కృతం నేర్చుకోవడానికి కొన్ని వేల సంవత్సరాల్ని వినియోగించిన మనం, ఆంగ్లం నేర్చుకోవడానికి కొన్ని వందల సంవత్సరాల్ని వినియోగిస్తున్నమనం మాండలిక పదాల్ని గమనించడానికి క్షణాలలో విసుగును ప్రదర్సిస్తున్నాం. మాండలికంలో రచనలు చేస్తే ఎంతమందికి అర్థం అవుతుందనే
వాదనలోనే మనం పయనించినంత కాలం ఆప్రాంత ప్రజల జీవనాన్ని ఆప్రాంత ప్రజల సంస్కృతిని ఆప్ర్రాంత ప్రజలకే దూరం చేసినవారుగా మనం మిగిలిపోతున్నాం.

 

వెంటనే అర్థం కావడానికే ప్రాధాన్యత జరుగుతోంది గాని ఈనాటికీ వెంటనే ఎంతమందికి సంస్కృత భూషితపదాలు, పద్యాలు అర్థమవుతున్నాయి.   ఎందరికి వెంటవెంటనే ఆంగ్లం అర్థమవుతోంది.   ఎందరికి వెంటనే కంటిచూపు తగలగానే ఎలక్ట్రానిక్స్ అర్థమవుతోంది.  ఆంగ్లంలో వున్న శాస్త్రాలన్నీ అర్థమయ్యే శాస్త్రాలుగా మనం చెప్పుకుంటున్నందుకు మన భాషపట్ల మనం శాస్త్రపరంగా ఆలోచించడం లేదన్నది సత్యం. ఆంగ్లం, స్పానిష్,  ఫ్రెంచి,  రూసీ పరభాషలకు ఇస్తున్న ప్రాధాన్యత మాతృభాషకు మూలమైన మాండలిక భాషకు, సాహిత్యానికీ ఇవ్వడానికి మాత్రం మనం వెనుకడుగేస్తున్నాం,  వేస్తూనే వుంటామన్నది పచ్చినిజం.

నాగరికత ముసుగులో విదేశీ ఆర్థికతకి ఇస్తున్న విలువ మన సంస్కృతికి సాంప్రదాయానికి మనం వీసమెత్తు కూడా ఇవ్వడం లేదన్నది స్పష్టం.

మాండలిక పదాల్ని రచనల్లో, శాస్త్రాల్లొకి తీసుకోవడానికి సంశయిస్తున్నంతకాలం వాటినుంచి కొత్త పదాల్ని రూపుదిద్దుకునే పాదాల్ని విస్మరిస్తున్నంతకాలం  మన సాహిత్యం మన అభివృధ్ధి ఎక్కడ వేసిన రాయి అక్కడే పాతేసిన విధంగా తయారవుతుందనడంలో సందేహం అవసరంలేదు.   ఇంకా లోతుగా గుంత తవ్వి సజీవభాషను పాతిపెట్టిపాతర వేసిన విధంగా జరుగుతుందనడంలో ఏమాత్రం సంశయం అక్కర్లేదు.

అమెరికాకి వెళ్లాలంటే, ఇంగ్లండ్ కి వెళ్లాలంటే మన పిల్లలకి నర్సరీనుండే అ, ఆ లకు బదులు

ఎ, బి, సి, డిలు -ఒకటీ రెండూ మూడులకు బదులు వన్, టూ, త్రీలు నేర్పించే  బళ్లలో (స్కూల్స్) వదులుతున్నాం.   అంటే ప్రాథమిక దశనుంచే ప్రథమాక్షరం నుంచే, ఆ భాషలో ప్రావీణ్యం సంపాదించి ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకునే దిశగా మన పిల్లల్ని శ్రధ్ధగా తయారు చేస్తున్నాం.   కాని మన ప్రాంతీయత, సంస్కృతి, సంప్రదాయం భాష విషయాల్లో మాత్రం మనం వీసమెత్తు శ్రధ్ధ్ద కనపరచకపోవటం వ్యక్తిత్వమే లేకపోవడంతో సమానం అన్నవిషయం గమనించకపోవడం ఆత్మహత్యా సదృశ్యం.   కేవలం ఆర్థికతమీదే.   ఆర్థిక అంశాలపైనే మన దృష్టి వుంది గాని సృష్టిలో మనం మన జీవితవిధానంపై ఏమాత్రం స్పష్ఠత లేకపోవడం కాదు, కనపరచకపోవడం దురదృష్టకరం.

ఆంధ్రదేశం నుండి మనపిల్లలు అమెరికా వెళుతున్నారన్న ఆనందం, అక్కడ లక్షలకు లక్షలు

సంపాదిస్తున్నారన్న మహదానందం, వెనుక అక్కడ మనవాడు తయారుచేసే సూత్రము (ఫార్ములా) ఉత్పత్తి(ప్రాడక్టు)ఆంధ్రదేశములో దిగుమతి చెంది మనమందరం ఎంత భారీగా మూల్యం చెల్లిస్తున్నామో మనం గమనించడం లేదు.

మన పిల్లలకు పరిజ్ఞానం తయారుచేసే విధానం ఉత్పత్తి చేసే సామర్థ్యం మనకున్నప్పుడు మన దేశంలో మన రాష్ట్రంలో మన పెట్టుబడులతో మనభూమిలో పండిన పంటలతో కడుపునింపుకుని మనభాషను విడిచిపెట్టి విదేశీ భాషను నేర్చుకుని మన దేశం విడిచి పరదేశం చేరి ఇక్కడ మన రాష్ట్రంలో చదువుకున్న చదువును పెట్టుబడిగా పెట్టి సంపాదిస్తున్నది ఎంతంటే ఒక్క శాతం కూడా లేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఒక సూత్రం (ఫార్ములా)తో ఒక ప్రాడక్టు ఉత్పత్తి కొన్ని సంవత్సరాలు అమ్మకాలు జరిపినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు జరిగినప్పుడు ఆ వస్తువును వినియోగదారులు వినియోగిస్తున్నంత కాలం ఆ సూత్రము ఆ ఉత్పత్తి మీద ఎన్నికోట్లకోట్లు సంపాదిస్తారో ఊహించడానికి కూడా ఊహకందని విషయం.   అంటే ఒక వ్యక్తో లేదా పదిమందో కలసి ఒక(ఫార్ములా)తయారుచేస్తే దాని ఆధారంగా  (ఒక టీ.   వి, ఒక ఫ్రిజ్, ఒక సెల్, ఒక కంప్యూటర్, ఒకలాప్ టాప్) ప్రపంచవ్యాప్తంగా ఎన్ని

సంవత్సరాలు ఆ సూత్రంతో తయారయిన వస్తువు విక్రయించబడుతుందో, అందువల్ల ఎన్నికోట్లు ఆ దేశ వ్యాపారస్తులు ఆ దేశం ఎంత సంపాదిస్తుందో తలచుకుంటే విస్తుపోవడం మూర్ఛపోవడం ఒక్కసారే జరుగుతుంది.

మనం వినియోగిస్తున్న భాష మనకుగాక, మనచదువులు మనకు గాక, మాన బుధ్ధి, విజ్ఞానం, ఆలోచించే విధానం, ఆచరించే విషయపరిజ్ఞానం మనకు తీవ్రమైన నష్టాన్ని, మన ప్రాంతపు వనరులను సంపదలని మనకు గాక విదేశాలకే లాభం చేకూరిస్తున్న విషయం మనం అర్థం చేసుకోలేకపోవడం భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేయడంతో సమానంగాక మనకు మిగిలేదేముంది.

ఆఅలను విస్మరించడం, ఎబిసిడిలను స్మరించడం.   ఒకటిరెండు మూడు పక్కనబెట్టటం, వన్ టూ త్రీ లను అక్కునచేర్చుకోవడం, అమ్మను మొత్తడం, మమ్మీని నెత్తికెత్తుకోవడం, మన కళ్లని మనం నమ్మలేకపోవడం, మరొకరి కాళ్ళకి అడుగులకు మడుగులొత్తడం, అచ్చమైన భాషను విడిచి స్వఛ్ఛతను కోల్పోయి స్వేచ్చని చేతులారా కాలరాసుకోవడం, పచ్చని అరణ్యాల సౌందర్యాన్ని విడిచిపెట్టి పచ్చకాగితాల్ని యేరుకునే జనారణ్యంలోకి ప్రవేశించాలనుకునే మనస్తత్వం వున్నన్నినాళ్ళు మనిషికి అవస్థ, భాషకు దురవస్థ తప్పదు.   ఈవ్యవస్థ రెండుభాగాలుగా వుండకతప్పదు.

ప్రజా బాహుళ్య భాషల్లో మాండలికం ప్రతి ఉత్పత్తిపై తన ముద్రను వేసుకునేంతవరకు వస్తువుల ధరలు తగ్గవు.  రచనల్లో ప్రాంతీయ జనజీవనాన్ని జీవితాన్ని మాండలిక భాషల్లో ప్రతిఫలించనంతవరకు సంపూర్ణ అత్య్త్తుత్తమ సాహిత్యం రావడం జరగదు.

ప్రాంతీయ భాష మాండలిక వినియోగం యొక్క ఉపయోగం ప్రతిఫలం సాహితీసాంస్కృతిక రంగాలకే కాదు, ఆర్థిక సాంఘిక సామాజికరంగాలకు ఎంతో ప్రయోజనకరం.   ఈవిషయంలో ప్రస్తుతం అత్యంత ప్రయోజనం పొందుతున్నది రాజకీయరంగమని మనం గమనిస్తే తెలుస్తుంది.  ప్రాంతీయ పార్టీలు పెట్టిన సందర్భంలో ప్రాంతీయభాషా వినియోగం, వక్తలు ప్రాంతీయభాషల్లో మనల్ని ఉత్తేజం పెంపొందించినట్టు మరే ఇతర జాతీయ, అంతర్జాతీయ భాషలు మనల్ని ఉత్తేజపరచకపోవడం మనం గమనిస్తూనే వున్నాం.   అయితే ప్రాంతీయ తత్వాన్ని జాతీయఅంతర్జాతీయ తత్వనాయకత్వంతో ముడివేసుకుని అనుకరించినప్పుడే పార్టీలు, నాయకులు విఫలమవడం మనం గమనించవచ్చు.   ఈ విషయంలో ఇంతవరకు తమిళనాడు చేస్తున్న ప్రయోగం, భాష, సంస్కృతుల పరంగా చేస్తున్న అధికార వినియోగం ఆదర్శం.

వ్యక్తిత్వమన్నది తాము ప్రవచించే ప్రాంతీయభాషలోనే వుందని గమనించిన నాయకులు మరో జాతీయపార్టీని కాని వారి నాయకుల్ని గాని శాసిస్తూ తమకు అవసరమైన ఆర్థిక పరిపుష్టిని ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నస్థితిని మనం చూస్తున్నామన్నది మనమెరిగిన పచ్చినిజం.

ఒకరికొకరు అధికారాలు, విజయాలు ఇచ్చుకుంటారు, పంచుకుంటారు గాని మరే జాతీయపార్టీకి తమవిజయాన్ని పట్టం కట్టరు.   విడిగా అయిదుగురు నూరుగురు వారిలోవారేగాని, ఎవరైనా ఎదురు పడితే నూట అయిదుగురు అన్న సత్యం తమిళనాడు ప్రాంతీయత, భాష, సంస్కృతి సాధించిన అత్యున్నత అపూర్వవిజయం.

సాహిత్యం అన్న విషయానికొస్తే అది ప్రజలకు సంబంధించిన అంశంగా గాక సాహితీపరులకు

సంబంధించిన అప్రస్తుత విషయంగా ప్రజల మనోభావాల్లో నాటుకొనిపోయింది.   ఒక విషయాన్ని చెప్పిందే చెప్పడం, కొత్తగా చెప్పలేకపోవడం, నూతనపదాల నిర్మాణంతో నిర్మించకపోవటం
జరుగుతోంది, కారణం నాగరికత ముసుగులో పట్టణభాషను వినియోగించడంతోనే సాహిత్యానికి తీరని ద్రోహం జరుగుతోంది, గ్రంథస్థ పదాల్ని అటుఇటు మార్చి అప్పడప్పుడే మార్చి చెప్పడం వలన నీరసంగా, నిర్వీర్యంగా సాహిత్యం తయారయ్యింది.

ఒకపదానికి అయిదు పర్యాయపదాల కంటే ఎక్కువవాడడానికి మనల్ని మనం వెతుక్కునే

స్థితి వస్తుండటంతో వాక్యం నూతనంగా బలంగా ఎలా రూపొందుతుందో అర్థంకాదు.   కాబట్టి చెప్పిందేచెప్పడంతో వినడానికి, చదవడానికి ప్రజలకి మనస్కరించకపోవడం జరుగుతోంది.   ఒకే భావాన్ని సూటిగా స్పష్టంగా చెప్పదలుచుకున్నప్పుడు ఆ భావతీవ్రతకు అవసరమయ్యే భాషాపటిమ కూడా అంతే బలంగా వుంటే తప్ప ఆవాక్యానికి జవసత్వాలు కలగవు.   బాణం ఎంత పదునుగా వున్నా విల్లు బాగా వంగినప్పుడే దూరంగా వున్న లక్ష్యాన్ని బాణం ఛేధించగలదు.   వీక్షణం వుధృతమయినప్పుడు అక్షరం తీక్షణమయినప్పుడు రెండింటి కలయికతో భావం మన గుండెను బలంగా తాకక తప్పదు.   ఆ విషయంలో మాండలికాల్ని ఉపయోగిస్తే వాక్యానికి ఎంత బలం చేకూరుతుందో చెప్పక్కర్లేదు.

చంద్రున్ని ఒక సందర్భంలో వినియోగించుకునేటప్పుడు “నెలవంక” “జాబిలి” “శశి””చందమామ” అని ఆ వెలుగును “వెన్నెల” ” పున్నమి” అని వాక్యనిర్మాణంలో వుపయోగించు కోగలమే గాని ఇతరత్రా వేరేపదాలు పర్యాయపదాలు ఏవైనా వుంటే సంస్కృతం నుంచి ఒకటో రెండో అయిదోపదో దిగుమతి చేసుకుంటామే గాని ఇతరత్రా మన ఊహలకే అందని స్థితిలో వుంటాం.   మన చదువుల్ని రాతల్లో కోతల్లో అంతవరకే వినియోగించుకునే బందీలమై పోతాం.

ఈ విషయంలో విచిత్రమేమంటే నెల్లూరు జిల్లాలో వున్న జాలర్ల మాండలిక భాషలో చంద్రునికి నూటాయాభై పదాలు పర్యాయపదాలు వున్నాయని తెలిసి ఆశ్చర్యం, ఆనందం కలిగింది.   ఇక్కడ ‘చదువుకొన్న’వాడికి ‘చదువుకున్న’వాడికి అక్షరాలా చదువు లేనివాడికి తేడాఎంతుందో తెలుస్తుంది.   మనపాఠశాలలు, మన కళాశాలలు, మన విశ్వవిద్యాలయాలు సాహిత్యాన్ని కాపాడటానికి ఏమాత్రం పనికి రావని తెలుస్తుంది.

ఒక వృత్తిలో ఒక్క పదం నూటాయాభై పదాలుగా లభిస్తున్నప్పుడు వివిధవృత్తులలొ ఆ ఒక్క పదం ఎన్నివేల పదాలుగా ఎన్ని లక్షల పర్యాయపదాలుగా విస్తరించివుంటుందో వూహిస్తే ఆ పదాల్ని మనం  సాహిత్యంలో శాస్త్రాల్లో వినియోగిస్తే ఎంత అద్భుతమైన సాహిత్యాన్ని, శాస్త్రాల్ని సృష్టించవచ్చో

నిర్మించవచ్చో తలచుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది, కళ్ళు మిరుమిట్లకు లోనవుతుంది.   శతకోటికాంతి పుంజాలతో    శరీరం సర్వస్వం వెలుగుమయమవుతుంది.   ఒక సాహిత్యకారునికి, ఒక శాస్త్రజ్ఞునికి ఒక చరిత్రకారునికి ఇంతకంటే ఏం కావాలనిపిస్తుంది.   నిజమైన సాహితీపరునికి, శాస్తజ్ఞునికి ప్రజల్ని, ప్రజాజీవితాల్ని ప్రేమించేవారికి పదసంపద కంటే ధనసంపద ఏపాటిది?

ఒక వాక్యాన్ని నిర్మించే దశలో అయిదు పదాలకన్నా నూటాయాభై పదాలు మనముందు కదలాడుతూంటే ఎంత ఆనందంగా వుంటుందో ఆ అనుభూతిని అందంగా ఆవేశంగా విడుదల చేసేందుకు ఆస్కారముంటుందో ఊహిస్తేనే హృదయం ఉక్కిరిబిక్కిరి అవుతుంది.   .   కెవ్వుకేక.

ఒక కత్తిని పదును(సాన) పెట్టేటప్పుడు బండకేసి రాయికేసి అయిదుసార్లు తీటితే ఆకత్తి ఎంత పదునెక్కుతుందో వాక్యమూ అంతే!అంతేకాదు మాండలిక  పదాలతో తయారయిన భాష, సాహిత్యానికే కాదు,  సాంస్కృతిక,  రంగానికే కాదు భౌతిక, రసాయనిక, సాంకేతిక, వైజ్ఞానిక ఆర్థిక సకల శాస్త్రాలకు అంతే గొప్పగా వుపయోగపడుతుంది.   మాండలికం అన్ని శాస్త్రాలలో అలవొకగా యిమిడిపోతుంది.   అన్ని శాస్త్రాలకి అనువైన భాష మాండలికమే.   ఎందుకంటే మాండలికం ఆకాశమంత విస్తృతం కాబట్టి.

మర్రి చెట్టుకు ఊడలే వేళ్ళుగా, వేళ్ళే ఊడలుగా విస్తరిస్తూ పోయే తత్వమున్నట్టే వ్యావహారిక భాషలో మాండలికం వుపయోగిస్తే సాహిత్యం మహా వృక్షంగా తయారవుతుంది.  మాండలిక పదాల సేకరణతో పాటు వినియోగం అత్యవసరం.  అందుకు ఇప్పటికే ఆలస్యమయిందని గ్రహించి భాషను మహోద్యమ ప్రాతిపదికన మాండలిక భాషను వినియోగంలోకి తీసుకురావాలి.   మారుమూల పల్లెల్లో కొందల్లో కోనల్లో అడవుల అణువణువులో వున్న అన్ని పదాల్ని వెలికితీయాలి. విస్తృతమైన పరిశోధన మాండలిక పదాలపై పరిశోధన జరిపినప్పుడే భాషకు భావనికి ప్రాంతానికి అభివృధ్ధికి ఆర్థికతకి మనం మంచిచేసిన వారమవుతాం.

మాండలికాల్ని భాషాశాస్త్రాల్లో, సాహిత్య రచనల్లొనే కాక భౌతిక, రసాయనిక, వైజ్ఞానిక, వైద్య, సాంకేతిక, ఆర్థిక ఒక్కటేమిటి సకల శాస్త్రాల్లో వినియోగించినప్పుడే మనం మన ప్రాంతాన్ని మనల్ని అభివృధ్ధి పరచుకున్న వారమవుతాము, లేదంటే పరభాషా బానిసలుగా భావస్వాతంత్ర్యం లేని అస్వతంత్రులుగా, పరాధీనులుగా,  విదేశీగడప ముందు  దీనులుగా అన్ని విషయాల్లో పేదలుగా బ్రతకాల్సి వస్తుంది.   ఆర్థిక, సాంస్కృతిక, సాహిత్య అభివృధ్ధిని పొందాలంటే పద్దెనిమిది కోట్లమంది తెలుగుప్రజలు ముప్ఫై ఆరు అరచేతులమధ్య మాండలిక  పదాల అఖండ జ్యోతుల్ని ఆరిపోకుండా కాపాడుకోవాలి.   రైతు పంటని, తల్లి గర్భాన్ని నిరంతరం జాగురకతో, ఎరుకతో శ్రద్ధగా చూసుకున్న విధంగానే మాండలికాన్ని  మనం చూసుకోవాలి.

వై.   శ్రీరాములు-అనంతపురం

99856 88922

 

3 thoughts on “చేపకి సముద్రం-భాషకి మాండలికం

  1. WORLD TELUGU MAHASABHALU AT VIJAYAWADA SOME MEDIA COVERAGE OF DAMODHAR RAO http://PRACHINATELUGU.BLOGSPOT.COM
    for ancient telugu language and lipi ,DNA<research see my blog
    Calculated velocity of light from Maha Bharata,1012AD,Indian Epic,1986
    President of INDIA & C M of AP released Book on 500 years of SriKrishnaDevaraya
    on ROCK IRRIGATION OF VIJAYANAGARA EMPIRE[sept2010]

  2. // మాండలికంలో రచనలు చేస్తే ఎంతమందికి అర్థం అవుతుందనే
    వాదనలోనే మనం పయనించినంత కాలం ఆప్రాంత ప్రజల జీవనాన్ని ఆప్రాంత ప్రజల సంస్కృతిని ఆప్ర్రాంత ప్రజలకే దూరం చేసినవారుగా మనం మిగిలిపోతున్నాం.//…..బాగా చెప్పారండీ.
    // జాలర్ల మాండలిక భాషలో చంద్రునికి నూటాయాభై పదాలు పర్యాయపదాలు వున్నాయని తెలిసి ఆశ్చర్యం, ఆనందం కలిగింది.//..ఆ 150 పదాల్లో కొన్ని ఇక్కడ ప్రచురిస్తే ఇంకా సంతోషంగా ఉండేది.

  3. “మనం వినియోగిస్తున్న భాష మనకుగాక, మనచదువులు మనకు గాక, మాన బుధ్ధి, విజ్ఞానం, ఆలోచించే విధానం, ఆచరించే విషయపరిజ్ఞానం మనకు తీవ్రమైన నష్టాన్ని, మన ప్రాంతపు వనరులను సంపదలని మనకు గాక విదేశాలకే లాభం చేకూరిస్తున్న విషయం మనం అర్థం చేసుకోలేకపోవడం భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేయడంతో సమానంగాక మనకు మిగిలేదేముంది.

    ఆఅలను విస్మరించడం, ఎబిసిడిలను స్మరించడం. ఒకటిరెండు మూడు పక్కనబెట్టటం, వన్ టూ త్రీ లను అక్కునచేర్చుకోవడం, అమ్మను మొత్తడం, మమ్మీని నెత్తికెత్తుకోవడం, మన కళ్లని మనం నమ్మలేకపోవడం, మరొకరి కాళ్ళకి అడుగులకు మడుగులొత్తడం, అచ్చమైన భాషను విడిచి స్వఛ్ఛతను కోల్పోయి స్వేచ్చని చేతులారా కాలరాసుకోవడం, పచ్చని అరణ్యాల సౌందర్యాన్ని విడిచిపెట్టి పచ్చకాగితాల్ని యేరుకునే జనారణ్యంలోకి ప్రవేశించాలనుకునే మనస్తత్వం వున్నన్నినాళ్ళు మనిషికి అవస్థ, భాషకు దురవస్థ తప్పదు. ఈవ్యవస్థ రెండుభాగాలుగా వుండకతప్పదు.”

    మహాద్భుత ప్రకటన..

    “మారుమూల పల్లెల్లో కొందల్లో కోనల్లో అడవుల అణువణువులో వున్న అన్ని పదాల్ని వెలికితీయాలి.”

    దీని వల్ల లక్షలు కోట్లు ఊడిపడవు. నాలుగు రాళ్లు వెనకేసుకోవడానికి కూడా ఈ పని పనికిరాదు. గ్యారంటీ. అందుకే అసలు సిసలు తెలుగుపదాలు పల్లెల్లో, కొండల్లో, కోనల్లో, అడవుల్లోనే మిగిలిపోతున్నాయి.

    చాలా చాలా మంచి రచన..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *