June 14, 2024

కల్పవృక్షంలో కైక – Gospel Of Judas

రచన : భైరవభట్ల కామేశ్వరరావు


కల్పవృక్షంలో కైక సరే, ఆ Gospel of Judas ఏమిటి? దానికీ దీనికీ సంబంధం ఏమిటి? అని తికమక పడుతున్నారా? సంతోషం. అందుకేగా ఆ శీర్షిక పెట్టింది 🙂  ముందుగా రామాయణ కల్పవృక్షంలో కైక పాత్ర గురించి చెప్పుకొని, తర్వాత ఆ Gospel of Judas గోలేమిటో చూద్దాం.

రామాయణ కథని మలుపు తిప్పిన స్త్రీ పాత్రలలో కైకది ఒక కీలకమైన పాత్ర అని అందరికీ తెలిసిన విషయమే. దశరథుని ఆకాంక్ష మేరకు రాముని పట్టాభిషేకం జరిగిపోయుంటే, రామాయణం అక్కడితో ఆగిపోయేది. అది కాకుండా మలుపు తిప్పినది కైక. అయితే, వాల్మీకి రామాయణంలో కైక పాత్ర కీలకమైనదే కాని, చాలా పరిమితమైనది. కేవలం రామపట్టాభిషేక సందర్భంలో, అలుక పూని, వరాలడిగి, పట్టాభిషేకం చెడగొట్టి, రాముడిని అడవులకి పంపించడం వరకే ఆమె పాత్ర మనకి ప్రముఖంగా కనిపిస్తుంది వాల్మీకంలో. ఆ తర్వాత కథని ముందుకి నడిపించేది సీత. రాముని సర్వ ప్రయత్నమూ సీత కోసమే. ముందుగా లంకలోకి ప్రవేశించి, లంకని సర్వనాశనం చేసి, చివరకి రావణునితో పాటు సర్వ రాక్షస సంహారానికీ కారణమైనది సీతే. అందుకే వాల్మీకి మహర్షి రామాయణాన్ని గురించి “సీతాయాశ్చరితం మహత్” అన్నది. అంతటి సీత పాత్రకి సరిజోడుగా, అంతటి ప్రాధాన్యమున్న పాత్రగా కల్పవృక్షంలో కైకని తీర్చిదిద్దారు విశ్వనాథ.  రావణసంహారం చేసి వనవాసం ముగించుకొని సీతారామలక్ష్మణులు అయోధ్యకు తిరిగి వచ్చిన్నప్పుడు కైకేయి సీతని కౌగిట చేర్చుకొని యిలా అంటుంది:

కైకెయి సీత గౌగిటికి గైకొని, “ఓసి యనుంగ! నీవుగా
గైకొని యీ వనీచయ నికామ నివాసభరంబిదెల్లనున్
లోకము నన్ను తిట్టుట తలోదరి! మార్చితి, కైక పంపెనే
గాక దశాననాది వధ కల్గునె యన్న ప్రశంస లోనికిన్”

“కైక రాముడిని అడవులకి పంపేసింది” అనే నిందని, “ఆహా! కైక పంపినందువల్లనే కదా రావణాది రాక్షసుల సంహారం చేసి రాముడు దిగంత కీర్తి సంపాదించాడు” అనే ప్రశంసగా మార్చేసిందట సీత. అంతే కదా! రామాయణానికి మరో పేరు “పౌలస్త్య వధ”. అంటే, రామాయణ కథకి అంతిమ గమ్యం రావణ వధ. దానికి కైక వరాలే కదా కీలకం! విశ్వనాథవారీ కీలకాన్ని గ్రహించి, కైక పాత్రని దానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. మొదట తల్లిని తీవ్రంగా దూషించిన కన్నకొడుకు భరతుడే కల్పవృక్షం చివరలో, “కైకేయీ సముపజ్ఞ మియ్యది జగత్కల్యాణ గాథా ప్రవాహాకారంబయి పొల్చు రామకథ” అని అనుకుంటాడు. అదీ రామాయణ కల్పవృక్షంలో కైక పాత్రకున్న ప్రాధాన్యం. 

దీనికి రాముని చిన్నతనం నుండే చక్కని ప్రాతిపదిక వేసారు విశ్వనాథ. కైక, రాముల మధ్యన ఒక అపురూపమైన అనుబంధాన్ని సృష్టించారు కల్పవృక్షంలో.

కాళ్ళువచ్చినదాదిగా గైక కొఱకు
పరువులెత్తును శ్రీరామభద్రమూర్తి
నిద్ర మేల్కొన్నదిగ రామభద్రు కొఱకు
నంగలార్చుచు జను గేకయాత్మజాత

రాముని పసితనం నుండే ఏర్పడిన అనుబంధమది. రాముడేదైనా అద్భుత కార్యాన్ని చేసినప్పుడు, అది కైకమ్మకి చూపిస్తే కాని అతనికి తృప్తి ఉండదు. అది చూసి కైకేయి ఆనందబాష్పాలతో అతనికి దిష్టి తీస్తుంది. రామునికి ఉపనయనమైనప్పుడు, కైక యిచ్చిన భిక్షేమిటో తెలుసా? ఒక చుఱకత్తి, వజ్రంతో చేసిన వాడి బాణము, అని విశ్వనాథవారి కల్పన. అది చూసి రాముడెంత మురిసిపోయాడని! అంతేనా. రాముని ధనుర్విద్యాభ్యాసంలో కైకేయి ఎంతటి శ్రద్ధ తీసుకొనేదో!

పటుబాహాపటుమూర్తి స్వామి ధనురభ్యాసంబు నిత్యంబు సే
యుటయున్ గైకెయి వచ్చి చూచుటయు, “నోహో తండ్రి, యా బాణమి
ట్టటు నట్టి”ట్లని చిత్రదూరములు లక్ష్యంబుల్ విదారింప జె
ప్పుట చేయించుటయున్ ముదంపడుటయున్ బొల్చున్ వనీవీధికన్

విల్లు ఎలా పట్టుకోవాలో, బాణాన్ని ఎలా సంధించాలో, కైకేయి చెప్పినట్టే చేస్తాడు రాముడు. అలా కైక చెప్పినట్టు లక్ష్యాన్ని ఛేదించి రాముడు నవ్వితే, అతడిని చూసి కైక మురిసిపోతుంది. రామభద్రుడు పెరిగి పెద్దవాడై, రాక్షస సంహారం చేస్తున్నప్పుడల్లా కైకమ్మనీ, ఆమె నేర్పిన విద్యని తలచుకుంటూనే ఉంటాడు! ఖరునితో భీకరమైన యుద్ధం చేస్తున్నప్పుడు, ఖరుడు చూపిస్తున్న ధనుర్విద్యా నైపుణ్యాన్ని చూసి రాముడిలా అంటాడు, “ఓయీ! వానికిన్ వానికిన్ నీవుం గార్ముక దక్షుడౌదు, నగిషీల్నేర్తీవు చేయన్, ధర్నుర్జ్యావల్లీకృత చిత్ర కర్షణ నినీషన్ గైకయీదేవి విద్యావిష్కారము నీ వెఱుంగవు సుమీ!”. అంటే “ఎవెరెవరికో నువ్వు నీ ధనుర్విద్యని చూపించి మెప్పించ వచ్చు కాని, వింటి నారిని చిత్రవిచిత్రంగా లాగడంలో ఎంతో నేర్పు గలిగిన కైక, నాకు నేర్పిన విద్య నీకు తెలియదు సుమా! నా ముందు నీ కుప్పిగెంతులు పనికిరావు” అని అర్థం. అలాగే రావణుడు సౌరాస్త్రం ప్రయోగిస్తే, అందులోంచి వేలకొలదీ చిన్న చిన్న చక్రాలు పుట్టుకు వస్తాయి. వాటిని కైకేయి నేర్పిన విలువిద్య చేతనే వమ్ము చేస్తాడు రామచంద్రుడు. తనకు రథం తెచ్చిన మాతలితో, కైకేయి నేర్పిన గతులలో రథాన్ని తోలమని చెపుతాడు.

ఈ విధంగా, రాముణ్ణి చిన్నతనం నుండీ విలువిద్యా ప్రవీణునిగా తీర్చిదిద్దడంలో కైక పాత్ర విశేషంగా కనిపిస్తుంది కల్పవృక్షంలో. కైక రామునికి తల్లి, గురువు, ఆప్తురాలు.

రామునిపై ఇంతటి వాత్సల్యమున్న కైక మరి అతణ్ణి అడవికి ఎలా పంపింది? నిజానికి, రామునిపై కైకకున్న వాత్సల్యం వాల్మీకి రామాయణంలో కూడా, ఇంత విస్తృతంగా కాకపోయినా, కొంత మనకి కనిపిస్తుంది. రాముని పట్టాభిషేక వార్త మంథర తెచ్చినప్పుడు, కైక ఎంతగానో సంతోషిస్తుంది. అంతటి శుభవార్తని తెచ్చినందుకు ఆమెని ఎంతగానో మెచ్చుకొని, ఆమెకి మంచి హారాన్ని కూడా బహూకరిస్తుంది. తనకి భరతుడిపైన ఎంత ప్రేమో, రాముడిపైన కూడా అంతే ప్రేమ అని, రాముడు కౌశల్య కన్నా తననే ఎక్కువగా ఆదరిస్తాడని కూడా అంటుంది. ఇంతటి అభిమానం మనసులో పెట్టుకొని, ఒక్కసారిగా అలా ఎలా మారిపోయింది కైక? ఆ ప్రశ్నకి వాల్మీకి మనకి సమాధానం చెప్పడు. మంధర మాటల ప్రభావమొక్కటే చూపించి ఊరుకుంటాడు. కాని మనకది అంత నమ్మశక్యంగా కనిపించదు. అందుకే తర్వాతి కవులు రకరకాల ఊహలు చేసారు. కొందరు ఆమెని పూర్తిగా దుష్టురాలిగా మార్చి వేసారు. దైవప్రేరణచేత సరస్వతీదేవి ఆమెని ఆవేశించి అలా వరాలని కోరినట్టుగా కొందరు చిత్రించారు. విశ్వనాథ మరొక వినూత్నమయిన, ఆశ్చర్యకరమైన కల్పన చేసారు! ఒకవైపు తల్లిగా పెంచిన మమకారం, మరొకవైపు గురువుగా నేర్పిన యుద్ధవిద్యకి సార్ధక్యం. ఒకవైపు లోకనింద, మరోవైపు రాముని కోరిక. వీటి మధ్య నలిగిపోతూ, అయినా తన కర్తవ్యాన్ని ఎంతో గుండె నిబ్బరంతో నిర్వహించిన ఒక శక్తివంతమైన పాత్రగా  కైకని తీర్చిదిద్దారు విశ్వనాథ.

మరునాడు పట్టాభిషేకమనగా ముందు రోజు రాముడు యజ్ఞ దీక్షితుడవుతాడు. ఆ రాత్రి ధ్యానంలో ఉండగా అతనికి దేవతలు కనిపిస్తారు. అతణ్ణి నారాయణుడని పిలుస్తారు. నువ్వు నీ అవతారకారణం మరిచిపోయి యిలా రాజ్యాభిషిక్తుడవైతే ఎలా అని మొరపెట్టుకుంటారు. నీకు రాజ్యమేలే కోరికే ఉంటే ముందు నువ్వు వచ్చిన పని పూర్తి చేసి ఆ తర్వాత ఎన్ని వేల సంవత్సరాలైనా రాజ్యం చేసుకో అని ప్రాధేయపడతారు. దానితో రామునికి సమాధి భగ్నమవుతుంది. ఏమి చెయ్యాలో పాలుపోదు. తనకి కూడా అంతరంగంలో ఏదో మూలన యీ పట్టాభిషేకం యిష్టముండదు. దేవతలకి కూడా యిష్టం లేదని తెలుస్తుంది. కాని తండ్రి మాటని త్రోసిపుచ్చి ఎలా తానీ పట్టాభిషేకాన్ని కాదనడం? అలాంటి పరిస్థితిలో తనకి సహాయం చెయ్యగలిగే వారెవరు? మెల్లగా కైక మందిరానికి వెళతాడు రాముడు. వారి మధ్య జరిగే సన్నివేశం, వారి సంభాషణ, గొప్ప నేర్పుతో చిత్రించారు విశ్వనాథ.

అంత రాత్రి రాముడక్కడకి రావడం చూసిన కైక ఆశ్చర్యపోతుంది. కంగారు పడుతుంది. తెల్లవారితే పట్టాభిషేకం పెట్టుకొని యిలా అర్థరాత్రి ఎందుకొచ్చావని అడుగుతుంది. దీక్షా భంగం జరగకుండా వెనక్కి వెళ్ళిపొమ్మంటుంది. అప్పుడు రాముడిలా అంటాడు:

అనిన రాముడు, తల్లి! సమాధి నిలువ
దాయె నే నేమి చేయుదు నమ్మ యనుచు
ఱేపు మొదలుగ బద్ధవారీగజేంద్ర
మట్లు కదలగ వీలులే దనుకొనెదను

“అమ్మా! నన్నేం చెయ్యమంటావు, సమాధి నిలువడం లేదు! ఇక రేపటినుండీ  గొలుసుకి కట్టేయబడిన ఏనుగులాగా కదలక మెదలక ఉండాలన్న చింతే మనసంతా నిండిపోయింది” అని అర్థం. దేవతలు సమాధిలో కనిపించి తనను రాజ్యం చెయ్యవద్దన్నారనీ, తనకీ రాజ్యమ్మీద కోరిక లేదనీ, ఎటూ పాలుపోక యిలా వచ్చాననీ చెపుతాడు. అప్పుడు,

అనినన్ గైకయి, “యిప్పుడిట్లెయగు ఱేపంకస్థయౌ జానకిం
గని, సింహాసనసీమ వేఱొకగతిన్ గన్పించు బొ”మ్మన్న, రా
ముని నేత్రంబుల నొక్క తీవ్రకళయై “మున్నీవు నువ్వెత్తు నే
ర్పిన కోదండకళావిచిత్ర గమనశ్రీ యేమగుం జెప్పవే!”

“ఇప్పుడిలాగే అంటావు. రేపు నీ భార్యని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నువ్వు సింహాసనమ్మీద కూర్చున్నప్పుడు వేరే రకంగా అనిపిస్తుందిలే” అని పరిహాసంగా అంటుంది కైక. ఆ మాటలకి రాముడు ఆమెవైపు తీక్ష్ణంగా చూచి, “నువ్వు నాకు ఎంతో గొప్పగా నేర్పిన నా విలువిద్యకింక సార్థక్యమేమిటి చెప్పమ్మా” అంటాడు. అంతే కాదు, “నా వద్దనున్న వాడిబాణాలతో నా కిరీటమ్మీద బొమ్మలు చెక్కుకోనా? నన్ను రోజూ స్తోత్రం చెయ్యడానికి వచ్చే ప్రజలమీద యుద్ధవ్యూహాలు పన్ననా?” అని నిలదీస్తాడు. అప్పుడు కైక “అయితే ఏమిటంటావు? నీ విలువిద్యకీ యుద్ధనైపుణ్యానికీ సార్థక్యం ఎలా కలుగుతుంది?” అని అడుగుతుంది. రాముడు దానికి సూటిగా జవాబు చెప్పడు. దానికి సమాధానం కైకకి తెలుసుకదా! తీక్ష్ణమైన చూపులతో ఒకటే మాట అంటాడు రాముడు, “నేనిప్పుడు రాజ్యం చెయ్యడమనేది వట్టి మాట”. అంతే! కైకేయి తన భవనంలోకి విసవిసా వెళిపోతుంది.

అదీ వారిద్దరి మధ్యన జరిగే సన్నివేశం! రాముడు కైక దగ్గరకే ఎందుకు వచ్చాడు? రాముని తీక్ష్ణమైన చూపుల్లో కైకకి అర్థమైనది ఏమిటి? రాముని కోరిక కైక ఎలా తీరుస్తుంది? ఇవన్నీ పాఠకుల ఊహకి వదిలిపెట్టేసారు విశ్వనాథ.

ఆ తర్వాత రోజు, మంధర పట్టాభిషేక వార్త విని కోపంతో కైక దగ్గరకి వచ్చి దాని గురించి చెపుతుంది. కైక అప్పుడే నిద్రనుండి లేస్తూ, “ఏమిటి రాముడు పట్టాభిషేకానికి ఒప్పుకున్నాడా! రాముడు పట్టాభిషేకం వద్దన్నట్టుగా పీడ కల వచ్చింది. ఎంత మంచి శుభవార్త చెప్పావు”, అంటూ తన ముత్యాలహారాన్ని మంధరకి బహుమతిగా ఇస్తుంది. అప్పుడు వాల్మీకంలో లాగానే, మంధర దాన్ని విసిరి కొట్టి, రాముడు రాజైతే కైక పడవలసిన కష్టాలని ఏకరువు పెడుతుంది. వాటిని కైక తేలికగా కొట్టి పారేసి, రాముడి గొప్పతనం వర్ణిస్తుంది. అతను పరాక్రమవంతుడని, యోగి అనీ, రాక్షసాంతకుడనీ వివరిస్తుంది. ఇక్కడ, రామావతార రహస్యం తెలిసిన ఒక జ్ఞానిగా కైక పాత్ర మనకి కనిపించి ఆశ్చర్యపరుస్తుంది. ముందురోజు రాత్రి రాముని కన్నుల్లో కైక చూసిన రహస్యమిదేనా అని అనిపిస్తుంది! మంధరకి యిదేమీ పట్టదు. పైగా, యోగి అయితే అడవుల్లో తిరగాలి కాని సింహాసనమెక్కి రాజ్యం చెయ్యాలన్న కోరిక ఎందుకనీ, రాక్షసులు అయోధ్యా పురవీధుల్లో తిరగటం లేదనీ, అంటుంది. ఆ మాటలు కైక మనసులో నాటుకుంటాయి! “It all fell in place!” అన్నట్టుగా, రాముడు తన దగ్గరకి ఎందుకు వచ్చాడో, తాను చెయ్యవలసినది ఏమిటో మొత్తమంతా అవగాహనకి వస్తుంది కైకకి. అప్పుడు కైక మనస్స్థితి ఎలా ఉంటుంది? ఒకవైపు రాముడు తనమీద మోపిన బాధ్యత. మరొకవైపు తానే స్వయంగా రాముణ్ణి అడవులకి పంపించాలన్న బాధ. ఇంకొకవైపు, దీనివల్ల తన మీద పడబోయే లోకనింద. తనకే ఎందుకిలా అయిందన్న కోపం. ఈ అవస్థని చాలా నేర్పుగా, హృద్యంగా, స్పష్టాస్పష్టంగా చిత్రిస్తారు విశ్వనాథ.

ఆ తర్వాత కథ మామూలే. దశరథుని వరాలు అడగడం, దానికి దశరథుడు కైకని తిట్టిపోయడం, రాముడు అడవులకి వెళ్ళడం, దశరథుడు మరణించడం, కౌసల్య మొదలు లోకమంతా కైకని తూలనాడడం, చివరికి భరతుని చేతకూడా కఠినమైన మాటలు అనిపించుకోవడం. అయితే, యీ ప్రతి సన్నివేశంలోనూ మనకి కైక మీద అపారమైన జాలి కలగకమానదు. ఎన్ని మాటలు పడ్డా, నోరు మెదపలేని ఆమె నిస్సహాయత, ఎంత బాధని అనుభవించినా రహస్యాన్ని తన గుండెల్లోనే దాచుకున్న ఆమె స్థిరత్వం మనలని అబ్బురపరుస్తాయి. కల్పవృక్షంలో కైక పాత్రని అంత ఉదాత్తంగా తీర్చిదిద్దారు విశ్వనాథ. దీని వలన సాధించిన ప్రయోజనం ఏమిటంటే – రసావిష్కరణ. కైక పాత్రలోని సంఘర్షణ, సహృదయుని మనసుని కుదిపివెయ్యక మానదు. మరొక ప్రయోజనం – కథకి, ఆ పాత్రకి ఒక రకమైన సౌష్ఠవాన్ని చేకూర్చడం. కైక పాత్రనీలా మలచడంలో పాశ్చాత్య విషాదాంత నాటకాలలోని నాయక/ప్రతినాయక పాత్రల ప్రభావం ఉందేమో అనిపిస్తుంది! అయితే, యిక్కడ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయమొకటి ఉంది. ఈ పాత్ర చిత్రణ వాల్మీకి రామాయణంలో లేనిదే అయినా, వాల్మీకి రామాయణానికి ఏమాత్రమూ విరుద్ధం కానిది. అందుకే యిది వాల్మీకి రామాయణానికి వ్యాఖ్యానం అయింది.

సరే, కల్పవృక్షంలో కైక గురించిన వివరణ పూర్తయింది కాబట్టి, ఇకనీ Gospel of Judas సంగతేమిటో చూద్దాం!

ఏసు క్రీస్తు కథలు పరిచయం ఉన్నవాళ్ళకి యూదస్(ఇంగ్లీషులో Judas) గురించి తెలిసే ఉంటుంది. ఏసుక్రీస్తు ముఖ్య అనుయాయులు (apostles) పన్నెండుమందిలో ఇతనొకడు. బైబిల్ ప్రకారం ఆఖరి విందు (Last Supper) అయ్యాక, జీసస్‌ని రోమను అధికారులకి ఒప్పజెప్పిన ద్రోహి యీ యూదస్. ఒక ముప్ఫై వెండి కాసుల కోసమితడీ పని చేసాడని చెప్తారు. ఇతని పేరు ద్రోహానికి పర్యాయపదంగా కూడా మారిపోయింది చాలా భాషల్లో.

జీసస్ ఎందుకు యూదస్ ద్రోహాన్ని ఆపలేదు? చేతకాకా, లేదా కోరుండే ఆపలేదా? యూదస్ తనకి ద్రోహం చేస్తాడని తెలిసినా జీసస్ అతణ్ణి తన శిష్యునిగా ఎందుకు తీసుకున్నాడు? ఇలా యూదస్ కథ చాలా ప్రశ్నలే లేవనెత్తింది. మనిషికి తను చేసే కర్మ మీద స్వాతంత్ర్యం ఉంటుందా ఉండదా (free will) అన్న చర్చలలో కూడా యూదస్ కథ ఒక అంశమయ్యింది. యూదస్ చేసిన ఆ పనే, జీసస్ శిలువ వేయబడడానికీ, ఆ తర్వాత పునరుజ్జీవనానికీ కారణం అయ్యింది కాబట్టి, అతను నిజంగా శిక్షార్హుడా అన్న ప్రశ్న కూడా వచ్చింది. Hugh J. Schonfield తన The Passover Plot అనే పుస్తకంలో అయితే, యూదస్ చేసిన ద్రోహం జీసస్‌కి తెలిసి, అతని ఒప్పుదలతోనే జరిగిందని అంటాడు!

యూదస్ కథకీ రామాయణంలో కైక కథకీ పోలికలు కనిపించడం లేదూ! అక్కడ యూదస్, ఇక్కడ కైక. అక్కడ జీసస్, ఇక్కడ రాముడు. యూదస్ జీసస్ శిష్యుడైతే, కైక రాముని అల్లారుముద్దుగా పెంచిన తల్లి. యూదస్ వెండి నాణేల కోసం ద్రోహం చేస్తే, కైక తన కుమారుడికి రాజ్యం కట్టపెట్టాలని చేసింది. యూదస్ పాత్రలో లేని వివిధ కోణాలు కైకలో మనకి కనిపిస్తాయి. ఒకవైపు కన్న ప్రేమ, ఇంకోవైపు పెంచిన ప్రేమ, మరో వైపు దశరథుడు తనకిచ్చిన వరాలు, ఇంకో వైపు మంధర దుర్బోధ ఇలా. అక్కడ జరిగింది క్రీస్తు శిలువ వేయబడడం అయితే, ఇక్కడ జరిగింది రాముని అరణ్యవాసం. అయితే రెండూ చివరికి మంచినే చేసాయి. అక్కడ జీసస్ జన్మ సాఫల్యానికి అదే కారణమయింది. ఇక్కడ రాముని అవతార సాఫల్యానికి యిది కారణమయింది. అక్కడ యూదస్ చేసిన పనివల్ల బైబిల్లోని Prophesy నిజమైతే, యిక్కడ కైక కోరిన కోరికలవల్ల దేవతల కార్యం నెరవేరింది. ఇంచుమించు యూదస్ కథ లేవనెత్తిన ప్రశ్నల లాంటివే కైక విషయంలోనూ వచ్చాయి.

అది అలా ఉంచితే, సుమారు ఒక నలభై ఏళ్ళ కిందట బయటపడిన, Gospel of Judas అనే ఒక సువార్తలో (gospel) ఉన్న కథకీ కల్పవృక్షంలో విశ్వనాథవారు చేసిన కల్పనకీ ఆశ్చర్యకరమైన పోలిక కనిపిస్తుంది.

ఏమిటీ  Gospel of Judas? 1970లలో యీజిప్టులో, ఒక పురాతన పత్రం ఒకటి దొరికిందట. అది కాప్టిక్ (Coptic) అనే ఒక ఈజిప్షియన్ భాషలో ఉంది. దాన్ని అనువదిస్తే తెలిసిన విషయం ఏమిటంటే అది Gospel of Judas అని. జీసస్ జీవితం గురించిన వివరాలని గ్రీకు భాషలో సువార్తల (Gospels) రూపంలో జీసస్ అనుయాయులు చెప్పారు. వీటిలో ఒక నాలుగు సువార్తలు మాత్రమే క్రిస్టియన్ల ఆమోదాన్ని పొంది New Testmentలో భాగమయ్యాయి. ఆమోదం పొందని సువార్తలలో, యీ Gospel of Judas ఒకటి. Carbon dating ప్రకారం లెక్కవేస్తే, దొరికిన ప్రతి క్రీ.శ. 280 ప్రాంతానికి చెందినదని తేలింది. ఇది గ్రీకుభాష నుండి అనువదించబడి ఉండాలి కాబట్టి, ఆ గ్రీకు మూలం అంతకన్నా ముందుదే అయ్యుండాలని చరిత్రకారులు ఊహిస్తున్నారు. అయితే ఇది స్వయంగా యూదసే చెప్పినదై ఉండేందుకు అవకాశం తక్కువని అంటున్నారు. ఇందులో ప్రస్తావించిన విషయాలని బట్టి యిది యూదస్ తర్వాత కాలానికి చెందినదనీ, ఎవరో సేథియనులు (ఆదాము కుమారుడైన సేథ్‌ని ఆరాధించేవాళ్ళు) ఇది వ్రాసి ఉంటారనీ చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. 2006లో నేషనల్ జాగ్రఫిక్ సొసైటీ వాళ్ళు దీనికి పూర్తి ఇంగ్లీషు అనువాదాన్ని విడుదల చేసారు.

ఇంతకీ యీ యూదస్ సువార్తలో ఏముంది? ఇందులో ఉన్నది ఏమిటన్న విషయం మీద ఏకాభిప్రాయం లేదు. దీని గురించి అనేక వివాదాలే ఉన్నాయి. ఈ వివాదాలకి కారణం – దొరికిన పత్రం చాలా జీర్ణావస్థలో ముక్కలు ముక్కలుగా ఉండడం ఒకటి, కాప్టిక్ భాష నుంచి అనువదించడంలో ఉన్న భిన్నాభిప్రాయాలు మరొకటి. అయితే, ఇందులో ఉన్న ఒక ముఖ్య విషయం – జీసస్ శిలువ వేయబడడానికి దారి తీసిన పరిస్థితులని యూదస్ దృష్టిలోనుంచి వివరించడం. దీనికి సంబంధించి అత్యంత కీలకమైన, ఆశ్చర్యకరమైన విషయం – యూదస్ ద్రోహ చింతనతో జీసస్‌ని రోమన్ అధికారులకి అప్పజెప్పలేదని, జీససే ఆఖరివిందు జరిగే ముందురాత్రి యూదస్ వద్దకి వచ్చి ఆ పని చెయ్యమని కోరాడని! ఈ సువార్తలో ఒక చోట జీసస్ యూదస్‌తో యిలా అంటాడు,  “You will exceed all of them [the other disciples] for you will sacrifice the man who clothes me.” తన ఆత్మ(spriritual self) భౌతిక శరీరాన్ని వదిలి ముక్తి(liberation) పొందడానికి సహాయపడమని జీసస్ యిక్కడ యూదస్‌ని కోరుతున్నాడని దీనికి వ్యాఖ్యానం చెప్పారు. ఈ రకంగానే మొత్తం సువార్తని వ్యాఖ్యానించి, యూదస్  అనుయాయులందరిలోకీ జీసస్‌కి అత్యంత ప్రీతిపాత్రుడనీ, జీసస్ యూదస్‌కి విశేషమైన జ్ఞానాన్ని అందించడమే కాకుండా, బైబిల్ చెప్పిన శిలువవేతని (crucifiction) నిజం చేసే ప్రయత్నంలో అతణ్ణి ఒక ముఖ్య పాత్రగా ఉపయోగించుకున్నాడనీ తేల్చారు. ఈ వ్యాఖ్యానానికి మద్దత్తుగా ఉన్న మరోక విషయం – Gospel of Johnలో ఆఖరివిందు ముగిసిన తర్వాత, జీసస్ యూదస్‌తో, “నువ్వు చెయ్యబోతున్న పని త్వరగా చెయ్యి”, అని అంటాడు. దీని బట్టి, యూదస్ తనకు చెయ్యబోతున్న ద్రోహం గురించి జీసస్ కి తెలుసని, దానికి జీసస్ తన ఆమోదాన్ని తెలియజెప్పాడనీ అనుకోవచ్చు. అలాంటప్పుడు జీససే స్వయంగా ఆ పని చెయ్యమని చెప్పాడనుకోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. అయితే యీ వ్యాఖ్యానాన్ని అంగీకరించని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సాంప్రదాయిక క్రిస్టియన్లు ఎవరూ దీనిని అంగీకరించ లేదు.

చూసారా కల్పవృక్షంలో విశ్వనాథవారు చేసిన కల్పనకీ, యిక్కడ కనిపించే కథకి ఎంత దగ్గర పోలిక ఉందో! కల్పవృక్షంలో రామునిలాగే జీసస్ స్వయంగా వచ్చి యూదస్ సహాయాన్ని అడుగుతాడు. అది రెండు చోట్లా రహస్యంగానే మిగిలిపోయింది!

అసలీ Gospel of Judas బయటపడక ముందే యూదస్ వృత్తాంతానికి సంబంధించి చాలా కాల్పనిక సాహిత్యం వచ్చింది. Michael Moorcock రాసిన Behold the Man అనే నవలలో, Karl అనే అతను కాలగమనం చేసి జీసస్ కాలానికి వెళతాడు. అతను చూసిన జీసస్, తాను చరిత్రలో చదివిన ఊహించిన జీసస్‌లా ఉండడు. దానితో అసంకల్పితంగా తానే ఆ చారిత్రక జీసస్ పాత్రలోకి ప్రవేశించడం మొదలుపెట్టి పూర్తిగా అలా మారిపోతాడు. చివరికి తనకి ద్రోహం చెయ్యవలసిందిగా యూదస్‌ని అతడే ఆజ్ఞాపిస్తాడు. అలాగే, The Last Temptation of Christ అనే సినిమాలో కూడా, తనని రోమన్ సైనికులకి అప్పగించమని జీసస్ తనకి అత్యంత ఆప్తుడైన యూదస్‌ని కోరుకుంటాడు. యూదస్ దానికి ఒప్పుకోకపోతే, ఇదొక్కటే మానవజాతిని రక్షించే సాధనమని చెప్పి జీసస్ అతడిని ఒప్పిస్తాడు. యూదస్ ఎంతగానో బాధపడుతూ, ఎట్టకేలకు ఒప్పుకుంటాడు. Gospel of Judas బయటపడక ముందే యిలాంటి కాల్పనిక సాహిత్యం రావడం విశేషం! వాటిని నిజం చేస్తోందా అనిపించేట్టుగా యీ సువార్త బయటపడడం మరింత విశేషం. ఆ కాలంలో (మూడవ శతాబ్దిలో) కూడా కొందరు యిప్పటి రచయితల్లాగే ఊహించి యీ సువార్తని తయారుచేసారని కూడా అనుకోవచ్చు. చారిత్రక నిజానిజాల మాట ఎలా ఉన్నా, జీసస్ కోరికపైనే యూదస్ తనని రోమనులకి పట్టిచ్చాడన్న ఆలోచన, అప్పటి కాలంలోనే ఉన్నదని యీ సువార్త నిరూపిస్తోంది.

రామాయణంలోని కైక పాత్రకి బైబిల్లో ఒక పాత్రతో పోలిక కనిపించడమే ఒక విశేషమైతే, గత శతాబ్దిలో వచ్చిన ఒక రామాయణ కావ్యంలో కనిపించే కల్పనకి, ఎప్పుడో మూడవ శతాబ్దానికి చెందిన ఒక క్రిస్టియన్ కథతో పోలిక ఉండడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఇలాంటి పోలికలు కనిపించినప్పుడల్లా, స్థలకాలాలకి అతీతంగా ఏదో ఒక శక్తి మనుషులలో, ముఖ్యంగా సృజన విషయంలో, నిగూఢంగా అంతస్సూత్రంగా సాగుతోందా అని అనిపించక మానదు!

 

23 thoughts on “కల్పవృక్షంలో కైక – Gospel Of Judas

 1. కామేశ్వర రావుగారు, మీ వ్యాసం చాలా బాగున్నది. ధన్యవాదాలు. 🙂 విశ్వనాథ వారి రామాయణంలో విష్ణ్వాంశతో రాముడు జన్మించాడని రాశారు. రాముడు దైవాన్నని ఒప్పుకోలేదు. సామాన్యమైన మానవుణ్ణనే అన్నాడి. తనకి కావలసినది కైక చేసిందని భావించి ఉంటే కైకను పదే పదే ఎందుకు తలచుకుని తలచుకుని కైక సంతోషించి ఉంటుందనీ, తండ్రి గారు మరణించి ఉంటారనీ, ఆవిడ ఇప్పుడు సుఖంగా ఉండి ఉంటుందనీ తిట్టుకున్నాడు(సందర్భానుసారం).. కబందుడి హస్తాలలో ఉన్నప్పుడు, అడవిలో మారీచ వధానంతరం లక్ష్మణుడు ఎదురైనప్పుడు ? ఎందువల్ల?

  1. సనత్ గారు,

   మంచి ప్రశ్నే వేసారు. రాముడికి ఆ ఎఱుక ఉండి ఉంటే అసలు సీతకోసం అంతలా దుఃఖించాల్సిన అవసరమే లేదు కదా! తనకి రాజ్యం చేయడ మేందుకో ఇష్టం లేదని కైకతో చెప్పాడు కాని అడవులకి వెళ్ళాలనుందని చెప్పలేదుగా. మరి కైక తనని అడవులకెందుకు పంపించింది? దీని గురించి రామునికి స్పష్టత లేదు. కాబట్టి దుఃఖావేశంలో అతనలా అనడంలో ఆశ్చర్యం లేదు. అయినా, కల్పవృక్షంలో ఆయా సందర్భాలలో రాముడేమిటన్నాడో జాగ్రత్తగా చదవండి. 🙂

 2. >>ప్రతి మనిషిలోనూ దైవాంశ ఉంటుంది. దాన్ని ఎవరైతే గుర్తించ గలుగుతారో (అంటే >>తనని తాను తెలుసుకోవడం) వారు దైవ సమానులవుతారు.

  ఇది అద్వైతం అనుకోండి. కానీ రాముని చర్యలన్నీ తను ఒక రాజుగా (రాక్షసులను చంపడమనే) ధర్మం కోసం పడే తపన అనుకుంటే అన్వయం సులభమని అనుకుంటున్నాను.

  అలా కాక – రాముడికి తను దైవం అనే ఎఱుక కలిగి తద్వారా దైవంగా మారి ’దైవధర్మం’ లో భాగంగా అడవులకు వెళ్ళాడనుకుంటే – ఆ తర్వాత సీతావియోగం ఏర్పడినప్పుడు సామాన్యమానవుడిలా దుఃఖిస్తాడు. దైవానికి కూడా దుఃఖం కలుగడం కాస్త మింగుడుపడని విషయం. అదీ కాక ధర్మసంస్థాపన లక్ష్యం కాబట్టి అందులో భాగంగా వచ్చే ఒడిదుడుకుల గురించి దైవంగా ఎఱుక కలిగిన మానవుడు దుఃఖపడకుండా ఉండడం (కావ్యంలోనైనా) ఒక ఔచిత్యం కావాలి.

 3. సురేశ్‌గారూ,

  Excellent point. అయితే విశ్వనాథ చిత్రణలో ఒక విశేషముంది. రామునికి తాను దైవమని, అవతారపురుషుడనని కచ్చితమైన జ్ఞానం ఉండదు. వాల్మీకి రామాయణంలోలాగ రాముడు కల్పవృక్షంలో కూడా ధర్మనిష్ఠ గల మామూలు మనిషి మాత్రమే! పట్టాభిషేక సందర్భంలో కూడా తన సమాధి స్థితిలో, తనతో దేవతలు పలికినట్టుగా అనిపిస్తుందే కాని పూర్తి జ్ఞానం కలగదు. ఎందుకో పట్టాభిషేకం జరగడం తనకి మనసులో ఇష్టం ఉండదు. అంతరంగంలోని ఆ భావనే దేవతా స్వరూపంగా ప్రత్యక్షమయిందని “మనస్తత్వ విశ్లేషణ” పరంగా కూడా సమర్థించవచ్చు! కైకకి కూడా రాముడు దైవమని, అవతారపురుషుడని నిశ్చయమైన జ్ఞానం ఉండదు. అది కూడా కేవలం ఆమె మనసులో ఊగిసలాడే భావనే.
  విశ్వనాథ యిలా చిత్రించడానికి కారణం అతను అద్వైతి కావడం. అతను రామాయణాన్ని అద్వైత తత్త్వ పరంగా వ్యాఖ్యానించడం. ప్రతి మనిషిలోనూ దైవాంశ ఉంటుంది. దాన్ని ఎవరైతే గుర్తించ గలుగుతారో (అంటే తనని తాను తెలుసుకోవడం) వారు దైవ సమానులవుతారు. లేని వాళ్ళు మామూలు మనుషులవుతారు. రామునికి ఈ ఎఱుక మిగిలినవాళ్ళకన్నా కొంచెం ఎక్కువ ఉంది. అంతే!

  1. *ప్రతి మనిషిలోనూ దైవాంశ ఉంటుంది. దాన్ని ఎవరైతే గుర్తించ గలుగుతారో (అంటే తనని తాను తెలుసుకోవడం) వారు దైవ సమానులవుతారు.*
   రాముడు “యోగ వాశిష్ఠం” వశిష్టుడి దగ్గర తెలుసుకొన్నాడు. అది అద్వైత సిద్దాంత గ్రంథం. ఎవరైతే దానిని అర్థం చేసుకోగలిగి జీవితాన్ని అన్వయింపచేసుకోగలుగు తారో, వారికి అద్వైతా అబుభూతి కలుగుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే రాముడికి క్లారిటి ఆఫ్ మైండ్ ఉంది. అతని ప్రతి నిర్ణయం యొక్క ఫలితం తెలుసు. ఈ గ్రంథం పోలినది మరొకటి ఉంది. దాని పేరు త్రిపుర రహస్యం. రమణ మహర్షి తన వద్దకు వచ్చిన వారిని దానిని చదవమని ప్రోత్సహించే వారు.

   1. శ్రీరాంగారు,

    యోగవాశిష్ఠం గొప్ప తత్త్వ గ్రంథమే, సందేహం లేదు. అయితే దానికి నేరుగా వాల్మీకి రామాయణంతో ఎలాంటి సంబంధమూ లేదు. రామాయణంలోని రెండు పాత్రల్ని తీసుకొని, లోతైన తత్త్వ విచారణ జరిపిన గ్రంథమది. వాల్మీకి రామాయణంలో దీని ప్రస్తావన లేదు. (కల్పవృక్షంలో చూచాయగా ఉంది.)
    వాల్మీకి రామాయణంలో రాముని పాత్రని గమనిస్తే, అతను పరిపూర్ణ జ్ఞానిగా మాయారహితునిగా కనిపించడు. సాధారణ మానవులకి ఉండే శోకము, మోహము, క్రోధము, కరుణ మొదలైన భావావేశాలన్నీ ఉంటాయి. అయితే వాటిని, తాను గీచుకున్న ధర్మమనే గీతని దాటనివ్వకుండా జాగ్రత్తపడడమే రాముని గొప్పదనం. పరిపూర్ణ అద్వైతానుభూతి కలిగిన వారికి ఇవేవీ ఉండవు కదా! అలా కాదు అతనికి అన్నీ తెలిసినా ఒక లీలగా వాటిని చూపించాడు అంటే, అప్పుడది విశిష్టాద్వైత పరమైన (భక్తిపరమైన) వివరణ అవుతుంది కాని అద్వైత సిద్ధాంత పరంగా పొసగదు.

    1. *సాధారణ మానవులకి ఉండే శోకము, మోహము, క్రోధము, కరుణ మొదలైన భావావేశాలన్నీ ఉంటాయి. పరిపూర్ణ అద్వైతానుభూతి కలిగిన వారికి ఇవేవీ ఉండవు కదా!*

     అని మీరు ఎలా చెప్పగలరు. రమణ మహర్షి గారు కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏడ్చేవారు. దానిని శోకం అని అనవచ్చు కదా! పరిపూర్ణ అద్వైతానుభూతి కలిగిన వారు ఆ సందర్భానుసారం గా, చుట్టుపక్కల పరిస్థిని బట్టి,ప్రకృతిలో జరిగేదానికి వారిలో ప్రతిస్పందన ఉంట్టుంది అంతే. వారికి మీరు పైన చెప్పిన guణాలు లేకుండా ఉండలనే నిబందన ఎదీ లేదు.

 4. 2006లో నేషనల్ జాగ్రఫిక్ సొసైటీ వాళ్ళు విడుదల చేసిన అనువాదం తీవ్రమైన విమర్శలకు గురైనది. ఉదాహరణకు ఎప్రిల్ డెకొనిక్ రాసిన ఈ విమర్శ చూడండి: http://nytimes.com/2007/12/01/opinion/01deconink.html

  స్థలకాలాలకి అతీతంగా ఏదో ఒక శక్తి మనుషులలో, ముఖ్యంగా సృజన విషయంలో, నిగూఢంగా అంతస్సూత్రంగా సాగుతోందా అన్న విషయం నాకు తెలియదు గాని, ముఖ్యంగా పాత కథలను తిరగరాస్తూ, ఆ కథానాయకులను దైవాంశసంభూతులుగానో, దేవుని అవతారంగానో చూపిస్తూ, ఆ నాయకుడిని సర్వజ్ఞానిగా, సర్వశక్తిమంతుడిగా చూపించే పునఃకథనాలు అన్ని సంస్కృతులలోనూ, అన్ని మతసంబంధమైన కథల్లోనూ కనిపిస్తాయి. వాల్మీకి రామాయణంలో రాముడు మామూలు మనిషిలాగా ప్రవర్తిస్తే కంబ రామాయణంలో అన్ని తెలిసిన దైవస్వరూపము. తులసిరామాయణంలో మరీ మితిమీరిన రామభక్తి కనిపిస్తుంది. తెలుగులో శ్రీపాదకృష్ణమూర్తి గారు రాసిన రామాయణంలో తను రాముణ్ణి అడవికి పంపమని ఎందుకు కోరిందో కైకేయికి అర్థంకాదు. బ్రహ్మ కైకేయి నాలికపై ఉండి అలా అడిగిస్తాడు. రాముడు సీతను అడవికి పంపడు. శంభుకుడిని వధించడు. తపస్సు మానేయమని చెప్పి ఒప్పిస్తాడు. కైకేయి అమాయకత్వం కంబరామాయణంలోనూ ఉంది. రాముడే యిలా కైక దగ్గరకి వచ్చి తనకి పట్టాభిషేకం యిష్టం లేదని చెప్పిన ఉదంతం నాకు తెలిసినంతవరకూ విశ్వనాథ వారి సొంతమే అనుకోండి.

  దేవునికి ప్రతి విషయం తెలుసని, మానవుల ప్రతిచర్య దేవుని పథకంలో భాగమేనని చెప్పే పునఃకథనాలు అన్ని సంస్కృతులలోనూ, అన్ని భాషలలోనూ, అన్ని మతసంబంధమైన గాథలలోనూ కనిపించడం సర్వమత, సార్వజనీన లక్షణమేమో.

 5. రవి,

  అవును ప్రతిమా నాటకంలోని ఊహకూడా విశిష్టమైనదే. అయితే యీ మునిశాపం గురించి కూడా విశ్వనాథవారు వేరే ఒక విశేషమైన కల్పన చేసారు. దాని గురించి మరోసారి.
  యతి గురించి – సమ్+ఆధి అని విడగొట్టుకొన వచ్చనుకుంటాను. సమీక్షణ లాగ ఇక్కడ సమ్ అనేది ఉపసర్గ అవుతుంది. అప్పుడు స్వరయతి సరిపోతుంది కదా.

  RGగారు,
  సంపూర్ణరామాయణంలో కైక పాత్ర ఇంచుమించు వాల్మీకి రామాయణంలో లాగనే ఉంటుంది. కాకపోతే చిన్ననాడు రామునిపై ఎక్కువ ప్రేమ చిత్రించినట్టు గుర్తు. కాని రాముడే యిలా కైక దగ్గరకి వచ్చి తనకి పట్టాభిషేకం యిష్టం లేదని చెప్పినట్టు మాత్రం లేదు.

 6. సంపూర్ణ రామాయణం లోనా, బాపు కైక పాత్రని అచ్చం ఇలాగే చూపిస్తారు.

 7. పోలిక బావుంది.

  ప్రతిమా నాటకం గురించి ప్రస్తావిస్తారేమో అనుకున్నాను. అక్కడ ఆమె గురువు కాదు కానీ, ఆమె పాత్ర ఉదాత్తమే కదా. (జుదాస్ పోలిక లేదనుకోండి). అక్కడ “పుత్రశోకాత్ వినశ్యతే” అన్న శాపం దశరథునికి తగలాలంటే రాముని మరణం సంభవించాలని, అలా జరగటం ఆపాలని కైక ఆ పని చేసిందని ఆ కవి తీ(నే)ర్పు.

  gospel of Judas గురించి ముందుగానే వ్యాఖ్యానించిన వాళ్ళలో ఓషో ఒకడు. జీసస్ enlightenment తను శిలువ మీద ఎక్కిన కొద్ది సేపు తర్వాత జరిగిందని చెబుతాడు అతను.. Enlightenment tradition గురించి కాస్త చదివిన వారికి ఓషో చెప్పే విషయం కాస్త అర్థమవచ్చు. అందులో భాగంగానే Judas జీసస్ కు అన్యాయం చేయలేదని, పైగా జీససే జుదాస్ ను ప్రేరేపించాడని ఈయన 1960 ల్లో అనుకుంటాను, కొన్ని ప్రవచనాలు చెప్పాడు. (I am the Gate – ఈ సిరీస్ పేరు)

  చివర్న పిడకలవేట:
  “అనిన రాముడు, తల్లి! సమాధి నిలువ” – ఇందులో యతి అర్థం కాలేదు. వివరించగలరా?

 8. వ్యాసం చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ రెండు పాత్రల మధ్య సారూప్యాలను గురించి ఇంతకు మునుపెవ్వరో ప్రస్తావించడం విని ఉన్నాను కానీ, ఈ వ్యాసం ఆ వివరాలను మరింత స్పష్టంగా విశదపరించింది.

  ఆఖరు వాక్యమెంత నిజం! చదువుతుంటే మనసంతా కొత్త భావనతో నిండిపోయింది.
  రచయితకు కృతజ్ఞతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *