June 14, 2024

డాక్టర్ ధన్వంతరి – పేషెంట్ రోగేశ్వర్రావు

రచన: అప్పారావు, ఖాదర్ ఖాన్ (సురేఖాన్)

 

పాత్రలు: డాక్టరు, పేషేంట్

 

ముక్కుతూ మూలుగుతూ రోగేశ్వర్రావు డా. ధన్వంతరి హాస్పిటల్లోకి ప్రవేశిస్తాడు.

ధన్వంతరి : రావయ్యా! రోగేశ్వర్రావు! బాగున్నావా!!

రోగేశ్వర్రావు: హు! బాగుంటే  మీ దగ్గరకెందుకు వస్తానండి! వళ్ళంతా భరించలేని నొప్పులు. ఈ చూపుడూ వేలుతో తలమీద, చేతిమీద, కాలిమీద, పొట్టమీద, నడుం మీద ఎక్కడ నొక్కినా భరించలేణి నొప్పి, ఇంతకన్నా చావే నయమనిపిస్తున్నది.

ధన్వంతరి : నా దగ్గర కొచ్చారుగా అ అవిషయం నాకొదిలేయండి. నే చూసుకుంటాగా! ఏదీ ముందు మీ వేలును చూడనివ్వండీ. (అంటూ వెలును నొక్కి చూస్తాడు)

రోగేశ్వర్రావు: అయ్య నాయనోయ్! చచ్చాన్రోయ్!

ధన్వంతరి : అంత తొందరే! నే వైద్యం మొదలెట్టందే!!

రోగేశ్వర్రావు: అయితే ఇప్పుడు నా వేలికి కూడా నొప్పి పాకిందన్నమాట. నేనేం చేయన్రోయ్!

ధన్వంతరి : నీ మొహం మండా! నన్ను చెప్పనియ్యవయ్యా… నీ ఒంటికి జబ్బెమీ లేదు. జబ్బల్లా ఈ వేలికే.. వేలు బెణికింది. అందువల్లే ఈ వేలుతో ఎక్కడ నొక్కినా నొప్పెడుతున్నది. సరే ఇంతకీ నీ చెవినొప్పెలా వుంది? మాత్రలిచ్చా వేసుకున్నావా?

రోగేశ్వర్రావు: మీరు చెప్పినట్టే మాత్రలు మూడు, మూడు పూట్లా వేసుకున్నాను. ఐనా నొప్పి తగ్గకపోగా మరింత పెరిగింది.

ధన్వంతరి : ఆ మాత్రలతో నొప్పి తగ్గలేదా! ఏదీ చెవి చూడనివ్వు, (చెవిని చూస్తూ) ఇదేమిటి చెవిలో ఏవిటో వున్నాయి. అదే ఇవి నేనిచ్చిన మాత్రలే. చెవిలోకి ఎలా వచ్చాయి?

రోగేశ్వర్రావు: అదేమిటి? చెవిలోకి ఎలా వచ్చాయ్ అని అడుగుతున్నారు? మీరేకదా చెవినొప్పికి మాత్రలు వేసుకోమని ఇచ్చారు. మూడుపూటలా మీరు చెప్పినట్టే చెవిలో వేసుకున్నాను.

ధన్వంతరి : ఆఁ ఏమిటి? నీ మొహం మండా! చెవిలో వేసుకున్నావా?. నోట్లో వేసుకోవాలయ్యా మహానుభావా.

రోగేశ్వర్రావు: పోదురూ. భలేవారే! ఆ మధ్య నోటిపుళ్ళతో మీ దగ్గరికి వస్తే మాత్రలిచ్చి వేసుకోమన్నారు. వేసుకోగానే తగ్గింది. మరిప్పుడు చెవిపోటంటే చెవిలో వేసుకోక నోట్లో ఎలా వేసుకుంటానండి. నేనంత తెలివితక్కువ దద్దమ్మననుకుంటున్నారా!

ధన్వంతరి : నువ్వెక్కడ దొరికావయ్యా మహానుభావా? సరే నొప్పి తగ్గడానికి ఇంజక్షన్ చేస్తాను. (ఇంజక్షను చేయడానికి రెడీ అవుతుంటాడు)

రోగేశ్వర్రావు: డాక్టరుగారు.. మీ దగ్గర ఇంజక్షన్ చేయించుకోడం ఇదే మొదటిసారి. నొప్పిలేకుండా చేస్తారుగా..

ధన్వంతరి : భలేవాడివే! నేను పాతికేళ్ల నుండి ప్రాక్టీసు చేస్తున్నా తెలుసా! (గర్వంగా కాలరెగరేస్తాడు)

రోగేశ్వర్రావు: అయ్యబాబోయ్! ఏవిటి? ఇంజక్షన్ చేయడం పాతికేళ్లనుండి ప్రాక్టీస్ చేస్తున్నారంటే  మీకింకా ఇంజక్షన్ చేయటం బాగా రాదన్నమాట. బాబూ మాత్రలే ఇవ్వండి. డాక్టరుగారూ. పత్యమేమైనా వుందా? వంకాయ, టమాటా తినొచ్చా?

ధన్వంతరి : బ్రహ్మాండంగా తినొచ్చు.

రోగేశ్వర్రావు: తోటకూర, పాలకూర, మెంతికూర.

ధన్వంతరి : తినొచ్చయ్యా!

రోగేశ్వర్రావు: బెండకాయ, దొండకాయ, దోసకాయ.

ధన్వంతరి : (విసుగ్గా) అబ్బా. అన్నీ తినొచ్చు.

రోగేశ్వర్రావు: కోప్పడకండి. బలానికి జీడిపప్పు, బాదంపప్పు.

ధన్వంతరి : చంపుతున్నావ్ కదయ్యా! నా బుర్ర, గన్నేరుపప్పు తప్ప అన్నీ తినొచ్చయ్యా! చూశావా ఎంతమంది పేషెంట్లు నాకోసం ఎదురు చూస్తున్నారో (సీట్లలోని జనాలను చూపిస్తూ)

రోగేశ్వర్రావు: ఊరుకోండి. ఎవరైనా నవ్విపోతారు. వాళ్ళు మీ పేషెంట్లు కాదండి. నేను హాస్పిటల్‌కు వస్తూ  నాకు తోడుగా తెచ్చుకున్న నా ఫ్రెండ్స్. వస్తా.. (బయటకు వెడుతూ తిరిగి వచ్చి) డాక్టరుగారూ..

ధన్వంతరి : అబ్బా! మళ్లీ ఏమొచ్చింది?

రోగేశ్వర్రావు: ఇంతకీ ఈ మాత్రలు టీతో వేసుకోమంటారా? కాఫీతో వేసుకోమంటారా?

ధన్వంతరి : (తల పట్టుకుంటూ) సారాతో తప్ప దేనితోనైనా వేసుకోవయ్యా! నీలాంటి పేషెంట్లుంటే నా పేరును ధనవంతరిగా కాకుండా రోగవంతరిగా మార్చుకోవడం ఖాయం.

రోగేశ్వర్రావు: డాక్టరుగారు పాపం మీకు బాగా తలనొప్పి వచ్చినట్లు అగుపిస్తున్నారు. ఓ మాత్ర వేసుకుని టీయో కాఫీయో త్రాగండి.

ధన్వంతరి : ఆగాగు. ఫీజు ఏది? క్రితం కీళ్ల నొప్పులకు వైద్యానికి ఫీజు కోసం నువ్విచ్చిన చెక్కు బ్యాంకు నుంచి తిరిగొచ్చింది.

రోగేశ్వర్రావు: దాందేముందండి. మీరు వైద్యం చేసిన కీళ్ల నొప్పి కూడా తిరిగొచ్చిందిగా. వస్తా…

 

??????????????????????????

 

3 thoughts on “డాక్టర్ ధన్వంతరి – పేషెంట్ రోగేశ్వర్రావు

  1. appa rao gaaru,’ nenu sankranthi kosam oka comedy skit wraasanandee..daanikee mee yee post lonchi konni jokes vaadukunnaa…hope you will not mind….(chevilo maatralu and వాళ్ళు మీ పేషెంట్లు కాదండి. నేను హాస్పిటల్‌కు వస్తూ నాకు తోడుగా తెచ్చుకున్న నా ఫ్రెండ్స్. diologue)..mee blog lo nenu coment pettalekapotunnaa ..meeru permission ivvalemonandee…

    Thanks

  2. //గన్నేరుపప్పు తప్ప అన్నీ తినొచ్చయ్యా//….హహహహ…ఇదొక్కటని కాదు..కథ మొత్తం సూపరు….సూపరు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *