June 14, 2024

నిత్యజీవితంలో హాస్యసంఘటనలు

 

రచన : మల్లాది వెంకట కృష్ణమూర్తి

 

ఈ సంఘటన నా  చిన్నప్పుడు 1950లో విజయవాడలో గాంధీనగర్‌లోని మా ఇంట్లో జరిగింది. మా నాన్న దక్షిణామూర్తిగారికి కోపం వస్తే అందరిలా తిడతారు. మరీ ఎక్కువ కోపం వస్తే ఆయన ప్రవర్తన విచిత్రంగా ఉండేది.

ఓసారి జమీందార్ సి.వి.రెడ్డిగారు గవర్నర్ పేటలోని వారింటి నించి తమ గుర్రపు బగ్గీలో మా ఇంటికి వచ్చారు. (ఎస్సారార్ ఆండ్ సివీఅర్ కాలేజీని, స్కూల్‌ని స్థాపించిన ధార్మికుడాయన). మా నాన్నగారు, రెడ్డిగారు ముందు గదిలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో మా ఇంటి ముందు ఓ బిచ్చగాడు నిలబడి ‘అమ్మా! బిచ్చం వేయండి’ అని అరిచాడు. వాడు రెండు మూడు సార్లు అరిచినా వంట గదిలో పనిలో ఉన్న మా అమ్మకి అవి వినపడలేదు. మా నాన్నగారు ఆ బిచ్చగాడ్ని వెళ్ళమని చెప్పాడు. ఐనా వాడు వెళ్ళకుండా పదే పదే బిచ్చం వేయమని అరవసాగాడు. మా నాన్నగారికి కోపం వచ్చి వాడ్ని వెళ్లమని గట్టిగా చెప్పాడు. ఐనా వాదు అది పట్టించుకోకుండా అరుస్తూనే ఉన్నాడు. మా నాన్నగారి కోపం తీవ్ర రూపం ధరించింది. వెంటనే అలాంటి సందర్భాలలో ఆయన రియాక్ట్ అయ్యే విధంగా  చేసేవారికి విభ్రాంతి, తర్వాత తలుచుకుంటే నవ్వు వచ్చేలా ప్రవర్తించారు.

వాడి దగ్గరకు వెళ్లి మర్యాదగా చెప్పాడు.

“బాబూ! ఇంతసేపు నీ అరుపులు విని నీ మీద కోప్పడ్డందుకు క్షమించండి. లోపలికి రండి..”

వాడికి అది వింతగా తోచినా బిచ్చం వేస్తారని లోపలికి వచ్చాడు.

“రెడ్డిగారూ, మీరు లేవండి” మా నాన్నగారు ఆ పెద్దమనిషిని కోరారు.

ఆయన ఏమిటో అనుకుని లేవగానే మా నాన్న ఆ బిచ్చగాడ్ని ఆ కుర్చీలో కూర్చోమన్నారు. వాడు బిత్తరపోతూ చూస్తుంటే చెయ్యి పట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టి చెప్పారు.

“మా ఆవిడ లోపల వంటపనిలో  ఉంది. అరవకుండా కూర్చో. ఆవిడ ఎప్పుడు బిచ్చం వేస్తే అప్పుడు వెళ్దువుగాని. ఈయన విజయవాడలోని కోటీశ్వరుడు, జమీందార్ రెడ్డిగారు. ఈయనతో మాట్లాడుతుండబట్టి నేను నీకు బిచ్చం తేలేకపోయాను క్షమించు. నీకు బిచ్చం వేసేదాక మేమిద్దరం నుంచునే మాట్లాడుకుంటాం.”

ఆ బిచ్చగాడు ఠక్కున లేచి బయటకు వెళ్తుంటే,

“అయ్యో! లేస్తారే కూర్చోండి. వెళ్తారే? బిచ్చం ముట్టాక వెళ్ళండి” అని మర్యాద చేసారు.

వాడు మా సందులో ఇంకే ఇంటి దగ్గరా ఆగకుండా వెళ్ళిపోయాడు. అంతే కాదు మళ్లీ మా ఇంటి ముందు నిలబడి ఎన్నడూ అరవలేదు.

 

******************************************************

 

1987 ఆగస్టులో మా నాన్నగారు మల్లాది దక్షిణామూర్తిగారు మరణించారు. నేనూ, మా చెల్లెల్లి భర్త ముట్నూరి గోపాలకృష్ణమూర్తి స్మశానానికి ఏర్పాట్లు చూడడానికి వెళ్ళాం. సమీపంలో కట్టెలవాడితో కట్టెలు కావాలని చెప్పాం. నేను బేరం ఆడితే అతను ఇలా చెప్పాడు.

“ఇప్పటికి ఈ రేటుకి తీసుకోండి. మరోసారి తగ్గిస్తాను.”

వెంటనే మా బావగారు కోపంగా అరిచారు.

“మరోసారి తగ్గింపుకి మళ్లీ మేం రావాలా?

ఇప్పటికీ ఈ జోక్ మా బావగారు చెప్తుంటారు..

5 thoughts on “నిత్యజీవితంలో హాస్యసంఘటనలు

  1. ///మరోసారి తగ్గింపుకి మళ్లీ మేం రావాలా?///
    హాహాహాహా

  2. చాలా బాగుంది.. నాన్నగారి ఆ ట్రీట్ మెంట్ కి ఆ ముష్టివాడిగారి మానసిక పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో? గ్రేట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *