June 14, 2024

మనుచరిత్ర కావ్యారంభ పద్యము

రచన : లంకా గిరిధర్

 

ఈ లఘువ్యాసము పండితజనరంజకము కానేరదు. తెలుగు కావ్యపఠన ప్రారంభించి అవగాహన జ్ఞానసముపార్జనలో తొలిమెట్టు మెట్టి  ప్రాచీనకృతులలో మాధుర్యాన్ని చవిచూడడం నేర్వబూనిన విద్యార్థి కలమునుండి  అట్టి జ్ఞానార్థులకోసం వెలువడిన వ్యాసముగానే పరిగణించ వలెనని ప్రార్థన.

అందుకు మనుచరిత్రలోని కావ్యారంభ పద్యమును ఎన్నుకోవడంలో వింతలేదు. మన ప్రాచీన కవులు కావ్యాది పద్యాలను శుభసూచకములుగా ఆగామివస్తుసూచకములుగా వ్రాసేవారు. అంటే కృతినిర్మించిన వారికి కృతిని స్వీకరించిన వారికి శుభము కలిగేవిధంగా శాస్త్రసమ్మతమైన పంథాలో మొదటి పద్యము రచించబడేది.  మున్ముందు పాఠకులు చవిచూడబోయే ముఖ్యమైన రసమేదో తెలియజేసే విధముగానూ ఉండేది. రసవిషయపరిచయంతో పాటు కథలోని గూడార్థాన్ని నిక్షిప్తము చేసుకన్న పద్యాలూ ఉన్నాయి ఇవి కవిప్రతిభకు తార్కాణాలు. ఇవి సాధించిన పిదప పద్యాన్ని మరింత చమత్కారపూరితం చేయగలగడం గొప్పకవులకే సాధ్యం. ఇవన్నీ పెద్దన మనుచరిత్ర కృత్యాది పద్యములో సాధింపబడ్డవి.

మొదటి పద్యము శ్రీకారముతో కూర్పబడినట్లైతే సకల శుభములొసగు నని ఛందోశాస్త్రము చెపుతోంది. అమృతాక్షరాలు, ఘోషాక్షరాలు, విషాక్షరాలు మున్నగునవి గమనించి అవి ఏయేస్థానాలలో నిలుపవచ్చునో  ఎచ్చట నిలుపరాదో కూడా తెలియజేస్తోంది. ఉదాహరణగా శ్రీకారము ఉండనే ఉంది. మఱొకటి తకారము. తకారాన్ని కృత్యాది పద్యములో ఆఱవస్థానంలో నిలిపితే అది శాపనార్థమవుతుంది. ఇలాంటి తప్పటడుగులు ఛందోశాస్త్రమును అవపోసన పట్టిన కవులు వేయరు.

అక్షరాలకే కాకుండా గణాలకి కూడ లక్షణాలు చెప్పబడ్డాయి. శివుని మూడు కన్నుల నుండి పుట్టిన మూడు గురువుల కలయికైన ఆదిగణము మగణమును పద్యాదిలో నిలిపితే అగణితశుభములు నెలకూడునని ఛందోశాస్త్రము చెపుతోంది.  మగణానికి ఉన్న లక్షణాలు ఏమిటంటే

౧.మగణము పురుషగణము

౨.మగణారంభ పద్యము వలన కృతికర్తకు ఆయురారోగ్యైశ్వర్యములు సిధ్ధిస్తాయి.

౩.మగణముతో మగణము కలిసివస్తే కృతిభర్తకు సకలవిజయాలు, సగణముతో కలిసివస్తే కీర్తిప్రతిష్టలు, జగణముతో కలిసివస్తే శత్రువిజయములు కలుగుతాయి.

 

అంటే శార్దూరవిక్రీడితముతో కావ్యాన్ని ప్రారంభిస్తే కవికీ కావ్యకన్యను చేపట్టిన ప్రభువుకీ శుభదాయకమే. పెద్దన మనుచరిత్రను ఆరంభించినది శార్దూలముతోనే.

పద్యము.

శ్రీవక్షోజ కురంగనాభ మెదపైఁ జెన్నొంద విశ్వంభరా

దేవిన్ తత్కమలాసమీపమునఁ ప్రీతిన్ నిల్పినాఁడో యనం

గా వందారు సనందనాది నిజభక్తశ్రేణికిన్ దోఁచురా

జీవాక్షుండు కృతార్థుఁజేయు శుభదృష్టిన్ గృష్ణరాయాధిపున్

 

స్థులంగా భావము.

శ్రీదేవి వాడిన కస్తూరి శ్రీమన్నారాయణుని వక్షస్థలమున లేపితమై అందముగా కనిపిస్తున్నది.ఆ కస్తూరిని చూచి సనందనాది భక్తులు నారాయణుడు గుండెలపై లక్ష్మీదేవితోపాటు భూదేవిని నిలిపికొన్నాడని భ్రమపడినారు. అట్టి భ్రమకలిగించిన భగవంతుడు కృష్ణదేవరాయునికి విజయములు చేకూర్చును.

పద్యము శుభసూచకమని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరము లేదు.

ఆగామివిషయార్థసూచకమేమిటో అని తఱచి చూస్తే తెలియవచ్చేది భ్రమ. ఇదివఱకే విశ్లేషకులు ఈ భ్రాంతిపై పలువిషయాలు తెలియజెప్పారు.కావ్యాది భాగములో వరూధిని ప్రవరుని చూచి మోహించి మాయాగంధర్వుడే ప్రవరుడని భ్రమపడి సంభోగించి స్వరోచిని కన్నది.స్వరోచిలో బ్రాహ్మణతేజస్సు కీ భ్రమయే కారణభూతము.ఇదియే స్వారోచిషుడు మనువై భువినేలడానికి కావలసిన లక్షణములను జనియింపజేసినది.

ఇదియే కాకుండా మఱొక విషయమూ ఉన్నది.ఈ కావ్యము పైకి శృంగార కావ్యమువలె కనిపించిననూ కేవలము శృంగారకావ్యమే అనుకుంటే అది భ్రమయే. స్వరోచి వైరాగ్యప్రవృత్తి,  స్వారోచిషమనువు యొక్క క్షాత్రధర్మపాలనము కూడ చివఱి మూడు అధ్యాయములలో చెప్పబడినవి. పెద్దన శృంగార వైరాగ్యములలో కడపడి ప్రవృత్తికే విజయమును సూచించినాడని విమర్శకుల అభిప్రాయము.

 

పెద్దన ఊహించి ఉండని పరిణామమొకటి కావ్యవ్యవహారిక నామములో తటస్థించింది. అది మనువు యొక్క చరిత్ర అని భ్రమము కలిగించే పేరు కావ్యానికి సార్థకమవడం.

ఇక పద్యాన్ని సూక్షమంగా చూస్తే తెలిసేది చమత్కారము. ఇమిడి ఉన్న భావసాంద్రతని విడగొడితే కనబడేవాటిల్లో మొదటిది రాసలీల. అందునే లక్ష్మీదేవి వక్షములయందున్న కస్తూరి విష్ణువు గుండెలపై లేపితమైనది. రెండవది అమాయకత్వము. మూడవది దానిచే జనించిన భ్రాంతి.

బ్రహ్మమానసపుత్రులైన సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు బ్రహ్మచారులు. శృంగారములో వారికి ఆసక్తి గాని అనురక్తి గానీ లేవు,  తెలియనిదనమే ఉంది. శరీరాంలకారము వారికి విభూతిలేపనమే. పరిమళపు వస్తువంటే గంధము తప్పు వేఱొండు వారికి తెలిసియుండదు. కురంగనాభమును శృంగారాలంకార వస్తువు గుర్తించకపోవడం వారి ప్రవృత్తికి సహజమే.  కురంగము అంటే జింక, కురంగనాభము అంటే జింకబొడ్డునుండి వచ్చినది. అదే ప్రపంచానికి వేలాది సంవత్సరాలుగా తెలిసిన సహజపరిమళపదార్థము. చూడడానికి అది నల్లని బంకమట్టిని పోలి ఉంటుంది. దానిని చూచి వారు భూదేవి యొక్క ఆకారమని భ్రమపడడంలో వింతలేదు. మఱొక విషయము కూడా ఉన్నది. పెద్దన పదాలు ఆచితూచి వాడడంలో నేర్పరి. బ్రహ్మ పద్మనాభుని పుత్రుడు, సనందనాదులు బ్రహ్మమానసపుత్రులు – అంటే, వారు విష్ణుమూర్తికి నిజంగా నిజభక్తులే. ఇటువంటి చమత్కారాన్ని పద్యంలో పొందుపఱచిన పెద్దన గొప్పతనము ఎంత పొగడినా తక్కువే.

 

వెతికిన కొలదీ కావ్యశిల్పవిశేషాలు మనుచరిత్ర పద్యాలలో ఎన్నో వెల్లడి అవుతాయి. అందుకే కృష్ణరాయలు పెద్దనను అతుల పురాణ ఆగమ ఇతిహాసకథార్థస్మృతియుత ఆంధ్రకవితాపితామహు డని పేర్కొన్నది.

1 thought on “మనుచరిత్ర కావ్యారంభ పద్యము

  1. వ్యాసం చాలా బాగుంది. వ్రాసిన వారి వివరాలు ఇస్తే బాగుండేది. వారి రచనలు ప్రత్యేకంగా గాలించి చదువుకునే అవకాశం ఉంటుంది.

    పద్యం ఒక అన్నమాచార్య కీర్తనను జ్ఞప్తికి తెచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *