June 14, 2024

రాధామాధవ దివ్యదీపావళి

రచన : తన్నీరు శశి

 

మెల్లగా పారుతున్న యమునమ్మ చుట్టూ అలుముకున్న నిశ్శబ్దం…

పున్నమి వెళ్లి కొన్ని రోజులే అయినా చంద్రుని మోము చిన్న పుచ్చుకొని జాలిగా చూస్తున్నాడు…

ఎవరి చైతన్య స్ఫర్శో కావాలని గాలి మారం చేస్తూ ఆకుల చెవిలో గుస గుసలు …

అంతట అలుముకొన్న స్తబ్దత లో… హు…అని మెల్లగా  నిట్టూర్చింది  పొన్నచెట్టు కింద ఆనుకొని  కూచున్నరాధ.

నిట్టూర్పు వేడి సెగకి చుట్టూ  రాధ గుండె రగులుతూ…

“రాడేమి ఈ నల్లనయ్య …ఝాము గడిచిపోతున్నా   అలికిడి లేదేమి…

తన కోసం ఎదురు చూసే  ఈ ప్రాణాన్ని మరిచి పోయాడేమో   ..”మళ్ళా కళ్ళు చుట్టూ వెదికాయి

తనకు కావలిసినది దొరుకుతుందేమోనని…

విరహం విసుగుగా మారింది…”ఏముంది..వానిలో.. నల్లని శరీరం, వెదురు ముక్క, నెమలీక…”

ఈ పాటికే తనకోసం ఎదురు చూడాలా? లేదు..ఇక చూసేదే లేదు..ఈ రోజునుండి తానెవరో..నేను ఎవరో”

కాని  మనసు నిలవక ఎటో పరుగులు తీస్తూ…..

విరహపు వేడికి చేతిలో పూమాలలోని పూలు  రాధ మొహంలా చిన్నపోతూంటే ………

పక్కనున్న పొన్న చెట్టు కొమ్మపై వేసింది……..ఒక్క సారి చల్లటి తెమ్మెర చెట్టు నుండి …

విరహాన్ని నిమురుతూ…..చెట్టుకి కూడా కన్నయ్య గుర్తొచ్చి  పులకింతలు రేగినట్లు…..

 

అంతలోనే కోపం ఎటు పోయిందో … దిగులుగా మారిపోయింది……ఏమైంది వీడికి ఇంకా

రాడేమి…….మనసు బరువుతో ఇసుకతిన్నేపై వాలిపోయింది……సజలాలైన కళ్ళతో

చుక్కల్ని చూస్తూ వాటి ని ప్రతిబింబిస్తూ కన్నీళ్ళలో రంగుల హరివిల్లులు………

చుక్కలు కూడా చిత్రంగా చూస్తున్నాయి…..ఆమె కన్నీళ్లను …..ఎప్పుడైనా నీళ్ళలో

మీనాలని చూసాము కాని…… మీనాలలో నీళ్ళని ఇప్పుడే చూస్తున్నాము  అని…….

 

మొగలిరేకు గంధం మొత్తం వ్యాపించినట్లు …..రాధ బాధ ప్రకృతి  అంతటా వ్యాపించీ

కృష్ణా…..కృష్ణా….కృష్ణా……కృష్ణా……..రావా…..రాధమ్మ కోసం ……..నీ రాధమ్మ  కోసం….

తన మనోరధం ఈడేర్చటానికి ……..తన మనసుని మురిపించటానికి………అని వేడుకుంటున్నట్టుగా ఉంది.. యమున కూడా రాధ బాధ తగిలి వేడెక్కినట్లు చుట్టూ సెగతో నిండిపోతుంది……….కృష్ణా…..రావా….. రాధేయ రావా…

ఎప్పుడు వస్తావు నీవు అని……..అంతటా ఎదురుచూపు…..

చిన్నగా యెక్కడో…ఏమిటది?….గాలికి గంధాలు పూస్తూ  ఇసుక తిన్నలపై మత్తుగా పారాడుతూ

మురళీ గానం…ఎక్కడకు పోయిందో అలక ….లేచి ఆ వైపు పరుగులు తీసింది మనసు…

మనసు వేగాన్ని అందుకోలేక తడబాటు పడుతూంది  తనువు..

చల్లని వాడు…నల్లని వాడు…

కొంటె నవ్వుల చిన్నవాడు…..

అబ్బ…ఏమిటి వేణువులో శ్వాసను ఊదుతున్నాడా? నా ప్రాణాన్నా?

అన్నీ చేసి ఏమి ఎరగనట్లు ఆ నవ్వు చూడు…నేనే వెళ్ళాలి కాబోలు…అలకకి సమయం లేదు..

వెళ్లి వెంటనే కృష్ణుని ముంగిట వాలిపోయింది…

ఏమిటది.. భుజాలపై నుండి పాకుతూ మెల్లిగా తన లోపలి వెళ్లి హృదయాన్ని స్పృశిస్తూ

హాయిగా…….మనసులోని దిగులు…..మబ్బుకి సూర్యుడు మాయమై …..వెన్నెలగా విరిసినట్లు….

విరహం ఎక్కడకి పోయిందో……మురళీగానానికి పూరి విప్పి ఆడుతూంది రాధా హృదయం……

చల్లని చేతుల్లో మురిసి గుండెలపై  ఒదిగిపోయింది……చాలు…చాలు….చాలు…..ఈ క్షణమే తన

జీవితాన శాశ్వతం…… అరె ఎక్కడుంది తానూ….లేదు..లేదు…..రాధ వేరు ,కన్నయ్య వేరు కాదు…

అంతటా వారే ….అన్నీ వారే …….అంతటా వారే………

 

విరహం వారే…..వలపు వారే…….

వెన్నెల వారే……చీకటి వారే……..

చింత వారే……..చేతనా వారే……..

అవని వారే……ఆకాశం వారే…….

ప్రక్రుతి వారే….ప్రణయం వారే……

నృత్యం వారే…..గానం వారే……

జననం వారే….మరణం వారే……

పలుకు వారే…మౌనం వారే ……

రాదే శ్యాముడు….శ్యాముడే రాధ……

.అంతటా వారే…అంతటా వారే….

రాధే శ్యాం…రాధె శ్యాం ….రాదే శ్యాం…రాదే శ్యాం………

…….ప్రకృతి మొత్తం పరిబ్రమిస్తూ……ఒకటే మాట…..

యెప్పటి మాట…..యేడి ఆ నల్లనయ్య …అక్రూరులు వారితో వెళ్ళింది మొదలు ఇటు మొహమైనా

చూపిందేలేదు?అందరిని మరిచిపోయాడు కాబోలు….

నేను చేదయిపోయానేమో .

అష్ట భార్యల ప్రక్కన…యమునా నది దిగులుగా చూస్తుంది రాధ వైపు ..మెల్లిగా ఒదారుస్తున్నట్లుగా….

ఎన్ని పున్నములు ఇగిరిపోయాయి కిట్టయ్య లేక….దిగులుగా ఇసుక పై పడుకుంది ..

చెక్కిలిపై విరహం ముత్యాలుగా జారుతూ మనసుని చల్లబరచాలని చూస్తూంది.

దూరంగా….మినుకు మినుకు మంటూ చుక్కలు చంద్రునికి దూరమయ్యామని దిగులు పడుతూ

దూరంగా ఊరిలో మినుకు మంటూ వెలుగుతూ దీపాల వరసలు….సంబరాలు…

ఏమిటో…కృష్ణయ్య నరకాసురుడిని చంపాడట…పదహారువేల గోపికలను చెర విడిపించి

చేపట్టాడట.ఇంక వారికి కూడా నా బాధ మొదలు…యెంత కటినుడివి కన్నయ్య ..

నేను వేరనే కదా వేరు చేసావు…బాధ పొంగి యమునగా పొరలుతుంది….

 

అరె..ఏమిటిది? కళ్ళు విప్పార్చి ఆకాశం వైపు చూసింది…అమావాశ్య లో  చందమామ..ఎలా?

ఏమిటిది?నిజమా కళ్ళు నులుముకొని చూసింది…చల్లగా నవ్వుతూ కిట్టయ్య దానిలో..

కృష్ణా….నిజమేనా .ఇది నిజమేనా…..వచ్చేసావా…హృదయం ఆనందంగా గంతులు వేస్తుంది…

 

అరే! ఎక్కడివి వేనవేల దీపాలు కృష్ణయ్య నుండి రవ్వలుగా రాలుతూ….చుట్టూ నాట్యం చేస్తూ..

ఎక్కడ చూసినా దీపాలే…ఆకాశమంతటా  వెలుగుతూ దీపాలలో గోపికలే..ఆనంద నృత్యాలే…

బృందావనం….అక్కడే చుట్టూ…తిరుగుతూ ఆకాశమంతా దీపాలే ..గోపికలే….

అరె అది నేను కదా..అవును రాధే…రాధే…

అన్ని దీపాలలో రాధే..కిట్టయ్యే ….దీపాలు కిట్టయ్యలోకి వస్తూ పోతూ …

ఏమిటిది?నేనెక్కడా?అరె క్రిష్ణయ్య…మురళి ఊదుతూ…..నేనెక్కడా?

రాధ మనసు బాధతో మూలిగింది…ఎక్కడ?ఎక్కడ?….

అరె అదిగో ఆయనలోనే రాధ….దీపాలన్నీ ఆయనలోనే కలిసిపోతూ…

రాధే శ్యాం…రాధే శ్యాం….అవును తను వేరు…కన్నయ్య వేరు కాదు…..తనే నేను….నేనే తను….

విడిపోయే మాటేక్కడ?…………దీపాలు తిరుగాడుతూ హారతి పడుతూ….అదే దీపావళి…ఆత్మా పరమాత్మల..

సంగమం….రాధే శ్యాం…రాధే శ్యాం…రాధే శ్యాం……

 

7 thoughts on “రాధామాధవ దివ్యదీపావళి

 1. ఎప్పుడైనా నీళ్ళలో మీనాలని చూసాము కాని…… మీనాలలో నీళ్ళని ఇప్పుడే చూస్తున్నాము అని
  ..very new thought….excellent!

 2. మొగలిరేకు గంధం మొత్తం వ్యాపించినట్లు …..రాధ బాధ ప్రకృతి అంతటా వ్యాపించీ

  కృష్ణా…..కృష్ణా….కృష్ణా……కృష్ణా……..రావా…..రాధమ్మ కోసం ……..నీ రాధమ్మ కోసం….

  తన మనోరధం ఈడేర్చటానికి ……..తన మనసుని మురిపించటానికి………అని వేడుకుంటున్నట్టుగా ఉంది.

  శశి గారు చాలా బావుంది. రాధే శ్యాం రాధే శ్యాం రాధే శ్యాం
  ఎంత అద్భుతంగా ఉందో ఇది..

 3. excellent ……అక్షరం అక్షరం లో ఎంతో ఫీలుంది…మీరు మచి రచయిత శశి గారు….

 4. WoW! 😀
  శశి గారూ.. చాలా చాలా బావుంది రాధామాధవ దివ్యదీపావళి.. కాసేపు మమ్మల్ని కూడా యమునాతీరాన దీపాల కాంతుల్లో విహరింపజేశారు. 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *