April 20, 2024

నిన్నలేని అందం

రచన : డా.శ్రీనివాస చక్రవర్తి

సౌమ్యకి కాళ్ళకింద నేల చీలినట్టయ్యింది.

తటాలున యే గ్రహశకలమో భూమిని ఢీకొంటే ఆ ఘాతానికి భూమి తలక్రిందులై, ధృవాలు తారుమారై, రాత్రి పగలై, పగలు రాత్రై అల్లకల్లోలం అవుతుందంటారు. అది అసంభవం కాదు. అగ్రరాజ్యాలు ఘర్షణ పడితే జరిగే అణుయుద్ధంలో ఆకాశమంతా పొగచూరితే వచ్చే శాశ్వత శీతాకాలంలో జీవలోకమంతా ఘనీభవించి పోతుందంటారు. అదీ సంభవమే. తిండితిప్పలు లేకుండా బ్రతుకు వెళ్ళబుచ్చిన బైరాగులున్నారు. తృటిలో మేధావులైన మూర్ఖులున్నారు. చచ్చి బ్రతికిన వాళ్ళున్నారు. ఇవన్నీ కూడా సంభవమే. కాని, ఇప్పుడు తన కళ్ళతో తాను చూసిన దృశ్యం….

అనురాగ్ యెందుకిలా చేశాడు?

ఆరోజు పెళ్ళయ్యాక తన మొదటి పుట్టినరోజు. ఎప్పుడూ ఎనిమిదికి ముందు లేవంది, ఇవాళ అనూకన్నా ముందే లేచింది. నలుగు అంటేనే అలిగే తను చక్కగా నలుచుకుని స్నానం చేసింది. పోనీ ఇవాళ ఒక్కరోజుకి అని “పోనీ”వొదిలేసి జడ వేసుకుంది, అనూకి ఇష్టమని. ఎప్పట్లా దుపట్టా-సల్వార్ కాకుండా పెళ్ళినాటి ఎఱ్ఱంచు తెల్లచీర కట్టుకుంది. ఆవగింజంత బొట్టు అర్థరూపాయంత అయ్యింది. మొట్టమొదటి సారి అనూ గిఫ్ట్ చేసిన దుద్దులు పెట్టుకుంది. సిలబస్ లో యేదీ వొదలకుండా ఎంట్రన్స్ కి శ్రద్ధగా ప్రిపేరయిన ఇంటర్మీడియట్ స్టూడెంట్లా చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుని, అనూకి ఇష్టమైన స్ట్రాంగ్ అల్లం టీ కప్పు ఉన్న ట్రేతో, అణచుకోలేని ఉద్విగ్నతతో బెడ్రూమ్ లో నిద్రపోతున్న అనూని సమీపించింది.
“అనూ!” తట్టి లేపింది.

ఆ రూపంలో తన ’సుమీ’ ని చూసి మెరిసే అనూ కళ్ళను చూసి మురిసిపోవాలనుకుంది. అనూ పెదవులపై చిరునవ్వుల పువ్వుల్ని తన తలలో మురిపెంగా తురుముకోవాలనుకుంది. చెవి దుద్దుల్ని చూడగానే వద్దన్నా చెవిని పెట్టక ముద్దులు కురిపిస్తాడనుకుందీ. అల్లంటీని కూడా పక్కనపెట్టి వల్లమాలిన అల్లరి చేస్తాడనుకుంది.

కాని ఇవేమీ చేయలేదు అనూ. ఓ సారి నిర్లిప్తంగా సౌమ్య వైపు చూసి, మంచం దిగి బాత్రూమ్ వైపు వెళ్ళిపోయాడు.
సౌమ్యకి కాళ్ళ క్రింద నేల చీలినట్టయ్యింది.

ఆ రోజు ఎన్నో చెయ్యాలని ప్లాను వేసుకుంది. కాని ఇప్పుడు అవేమీ చేసే మూడ్ లేదు. మెల్లగా ఇంటిపనికి ఉపక్రమించింది. పక్కలు సర్దుదామని బెడ్రూమ్లోకి వెళ్ళింది. జరిగింది కళ్ళ యెదుట మళ్ళీ మళ్ళీ కనిపిస్తోంది. అసలది జరిగిందని నమ్మలేకపోతోంది. ఎంత అణచుకున్నా యేడుపు ఆగలేదు. పక్కమీద వాలి వెక్కి వెక్కి యేడ్చింది. యేడ్చి యేడ్చి మెల్లగా నిద్రలోకి జారుకుంది.

అలా యెంతసేపు నిద్రపోయిందో తెలీదు. లేచి చూసేసరికి బాగా మధ్యాహ్నం అయినట్టు వుంది. లేవబోతుంటే, దిండు కింద యేదో తగిలింది. చూస్తే అనూ డైరీ. అనురాగ్ కి డైరీ రాసే అలవాటుంది.
అయితే డైరీ తెరిచి వుండడం చిత్రంగా అనిపించింది. ఒక పక్క కోపంగానే వున్నా చదవాలన్న కోర్కెని అణచుకోలేకపోయింది.

…………………………..

ఏప్రిల్ 24,1996
ఇవాళ మా రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ కి ఓ కొత్త విజిటర్ వచ్చింది.
మా జియోఫిజిక్స్ జగన్నాథానికి కజిన అట. ఎమ్.ఏ. ఇంగ్లీష్ లో చేరుతోందట. ఇవాళ్టినించి క్లాసులు మొదలు. దిగబెట్టడానికి వచ్చాడు. మామూలుగా కాంటీన్లో కనిపించే స్త్రీ పాత్రల్లో లేని ప్రత్యేకత యేదో ఈ అమ్మాయిలో వుంది. చాలాసేపు తననే గమనిస్తూ కూర్చున్నాను.
పున్నమి చందమామ రంగు స్కర్ట్, బ్లౌజ్ వేసుకుంది. అదే రంగు హీల్స్ వేసుకుంది. సన్నగా పొడవుగా నాజూకుగా వుంది. అసలు ఆ తీరు, తెన్ను చూస్తే తెలుగుపిల్లలా లేదు. ఆంధ్రదేశానికి పర్యటనకి వచ్చిన యే బెల్జియన్ రాకుమార్తెలాగానో ఉంది. కొద్దిగా కోలమొహం, తీరైన కనుబొమ్మలమీద మచ్చలేని పాలవన్నె ఫాలభాగం స్వచ్ఛమైన మనసును సూచిస్తోంది. ఆ ముఖంలో చెరగని ప్రసన్నత తన హృదయంలోని సంతృప్తిని వెల్లడిచేస్తోంది. తనకళ్ళలో తొణికిసలాడే విస్మయం అతిసామాన్యమైన విషయాలపట్ల కూడా పసిపిల్లలకుండే ఉత్సుకతని ప్రకటిస్తోంది. మొత్తంమీద చూడగానే ఆకట్టుకునే ముఖం. దానికి కారణం కోటేరేసిన ముక్కు,అద్దాల చెక్కిళ్ళు,కలువల కళ్ళు కాదు. మనసుపెట్టి చూసినపుడు ఆ ముఖంలో తారాడే అరుదైన,అలవిగాని మంచిదనం.

నాలుగు టేబుల్స్ కలిపి చుట్టూ మా బృందం అంతా సమావేశం అయ్యాం. జగ్గు, ఆ కొత్తపిల్ల కూడా మాతోనే కూర్చున్నారు. సెగలు కక్కుతూ ’ ఎస్పి టీ’ వచ్చింది. ఎప్పుడూ లేంది ఇవాళ చక్కెర కొంచెం తక్కువైంది. అంజిగాడు ఓ కప్పుతో చక్కెర తెచ్చి పెట్టాడు. చకచక చక్కెర చేతులు మారుతూ ఆ అమ్మాయి దగ్గరకు వచ్చింది. ఆ అమ్మాయి చెయ్యిచాచి అందుకోబోతుంటే అంతలో మా మోటుమురళి తన జోక్కి తానే గట్టిగా నవ్వుతూ ఎటో చూస్తూ ఆ కప్పు లాక్కున్నాడు. తను వేసుకోగానే తననుంచి మరొకడు తీసుకున్నాడు. అందరిదీ అయ్యాకయినా కప్పుకోసం అడుగుతుందని ఆసక్తిగా చూశాను. అలాంటి ప్రయత్నమేమీ చెయ్యలేదు. చుప్ చాప్ అనకుండా తనకప్పు ఖాళీ చేసింది.
ఎండలో,ధూళిలో జోగుతున్న పల్లెను సైతం ఒక్క చిరుజల్లు నెమ్మది తెమ్మెరలతో, మెత్తని కొత్త పూలెత్తిన నవవసంత సీమగా మార్చగలిగినట్టు ఆ అమ్మాయి రాకతో మా రాజేశ్వరీవిలాస్ నిన్నలేని యేదో కొత్త అందాన్ని సంతరించుకుంది. ఎందుకో ఆ రోజు మా అంజిగాడు కూడా చాలా హాండ్సమ్ గా కనిపించాడు.

తరువాత తెలిసింది. ఆ అమ్మాయి పేరు సౌమ్యట!

* * *

అది చదవగానే తన మనసులో భారం అంతా ఎవరో ఉన్నపళంగా తీసేసినట్టు అనిపించింది. టీ తాగాలనిపించింది. డైరీ పట్టుకుని వంటగదిలోకి వెళ్ళింది.
టీ తాగాక కొంచెం ఉత్సాహం వచ్చింది. డైనింగ్ టేబుల్ వద్ద ఇంకా డైరీ చదువుతూ కూర్చుంది. మరో పేజీ –

మే 19,1997

ఇవాళ మనసేం బాగోలేదు. నాన్నగారి పరిస్థితి విషమిస్తోంది. రెండేళ్ళుగా మంచంమీద రాయిలా పడివుండటం శుద్ధనరకం. ఇవాళ పొద్దున్న నా పేరు పిలవడానికి కూడా పెనుగులాడారు. క్రమంగా మాట కూడా పడిపోవచ్చన్నాడు డాక్టరు. తనకు సుపరిచితమైన పరిసరాల్ని, అయినవాళ్ళని, ఇంపైన దృశ్యాలని, ప్రియమైన ధ్వనులని, జవసత్వాలని, శారీరక పటుత్వాన్ని, అంతెందుకు ఎంత అధముడికైనా వుండే మానవత్వం అనే కనీస ఐశ్వర్యాన్ని కూడా మిగల్చకుండా ఎవరో అంచెలంచెలుగా, అతిక్రూరంగా ఆ మనిషినుండి దోచుకుపోతున్నట్టుగా వుంది. ఆ దొంగ యెవరో నా చేతికి చిక్కితే దారుణంగా హత్య చెయ్యాలనుంది. ” నా కిష్టుడు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు”, అంటూ కలవరించేవారు. పిచ్చినాన్న! ఇప్పుడు ఆ కలవరించే శక్తిని కూడా తీసుకుపోయాడు కిష్టుడు. యుథనేషియా భాగ్యానికి ఇంకా మనదేశపు రోగులు నోచుకోలేదు.

ఈ గోలంతా మరచిపోవడానికే సాయంత్రం దుర్గ గుడికి వెళ్ళాను. గుళ్ళో దేవుళ్ళ మాటెలా వున్నా, గుడి ఆవరణ, పరిసరాలు బావుంటాయి. ముక్కోటి దేవతలు, త్రిమూర్తులు, రాముడు, కృష్ణుడు ఆ బలగం అంతా వున్నారో లేదో తెలీదుగాని ప్రాణులన్నిటిని కనిపెట్టుకుని కడతేర్చే ఓ మాతృమూర్తి, ఓ అమ్మ వుందని మాత్రం యెప్పుడూ అనిపిస్తుంది. ఆ తల్లి యెక్కడుంటుందో తెలీదు, యెలా వుంటుందో తెలీదు. కాని వుందని మటుకు తెలుసు. వెళ్ళి దుర్గమ్మ సమక్షంలో కూర్చున్నాను. మండపంలో పూజారి, నేను, ప్రాంగణంలో ఓ మూల దగ్గుతూ ఓ ముసలి సాధువు మాత్రమే వున్నాం. ఏదో దట్టమైన, శక్తివంతమైన నిశ్శబ్దం ఆ ప్రదేశమంతా వ్యాపించి వుంది.(అలా యెంత సేపు వున్నానో తెలీదు.) మనసులోని అలజడంతా యెవరో చేత్తో తీసేసినట్టు మాయమైపోయింది. చీకటి పడుతోంది. ఇంటికి బయలుదేరాను.

గుడి బయటకి వస్తుండగా కనిపించిందా దృశ్యం. గుడిచుట్టూ ఓ చిన్న సెలయేరు వుంటుంది. దానిమీద ఓ బుల్లి వంతెన. ఆ వంతెన మీద వస్తూ అలవోకగా నీటివైపు చూశాను. అడుగు వెడల్పు వున్న ఓ అందమైన అరవిందం. ఆ దారివెంట యెన్నోసార్లు నడిచాను. ఎప్పుడూ పద్మాలు కనిపించలేదు. “ఈ లోకంలోనే పుట్టినా, ఈ లోకానికి చెందను సుమా”,అన్నట్టుగా నీటిమట్టంనుండి ఇంతెత్తున పైకి లేచి ఠీవిగా నవ్వుతోంది. నిజమే. ఈ వ్యాధులు, చావులు, యుథనేషియాలు,డాక్టర్లు, మెడికల్ ఇన్సూరెన్సులు – ఇవేవీ లేని మరో అద్భుతలోకం నుండి రాలిపడినట్టుందా పువ్వు. అరుణకాంతుల మౌనవిస్ఫోటం ఆ పువ్వు. చావుమీద పోరాటానికి యెగరవేసిన బావుటా. జీవితం మీద ఆశకి ఆకృతి….

వంతెన మీంచి వంగి ఆ పూవునే ఆశ్చర్యంగా చూస్తూ వుండిపోయాను. రేకులు ఇరవై, ముప్ఫై దాకా వుంటాయేమో. రేకులన్నీ రెండు శ్రేణులుగా వున్నాయి. ఒక శ్రేణిలో పళ్ళెంలా అన్ని దిక్కులా విస్తరించి వున్నాయి. రేకుల మధ్య కోణాలన్నీ యెంత సమంగా, నిర్దుష్టంగా వున్నాయంటే ఏ దేవలోకపు సివిలింజనీరో చాలా శ్రమపడి తీర్చిదిద్దినట్టుంది.

ఆ రేకుల్ని చూస్తుంటే యేదో గుర్తొస్తోంది. అదేంటబ్బా… ఆఁ! సౌమ్య వేళ్ళ. అవును, వేళ్ళు గమ్మత్తుగా కదిలిస్తూ మాట్లాడుతుందా అమ్మాయి.

సౌమ్య..భలే అమ్మాయి…

* * *

పేజీలు తిప్పుతున్న తన వేళ్ళవైపు ఆశ్చర్యంగా చూసుకుంది. నిజంగానే ఈ వేళ్ళు కలువరేకుల్లా వున్నాయా?
డైనింగ్ రూమ్లో వుక్క పోస్తోంది. వెళ్ళి తోటలో ఒక పెద్ద మందారం మొక్క నీడలో కుర్చీ వేసుకుని డైరీ చదవడం కొనసాగించింది.

* * *

మార్చి 29,1998

ఇవాళ సభ్యులందరం రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ లో సమావేశమయ్యామ్.ఎప్పుడూ జరిగే సమావేశాలకి, ఇవాళ్టి సమావేశానికి తేడా వుంది. ఎప్పుడూ జరిగే సమావేశం ఇంకా లోకం రుచి తెలియని కుఱ్ఱకారు సమావేశం. అందులో తుళ్ళింత వుంది. కేరింత వుంది. హద్దుల్లేని అల్లరి వుంది. జీవితమంతా ఇలాగే ఏ బాదరబందీ లేకుండా మూడు పెసరట్లు, ఆరు పుల్లట్లలా హాయిగా వుంటుందనే అమాయకపుటాశ వుంది.

కాని ఇవాళ్టి సమావేశం వేరు.

చదువు అనే స్వర్గంలాంటి దశని వొదిలి స్వర్గమో నరకమో తెలీని జీవితమనే అనిశ్చిత దశలోకి అడుగుపెడుతున్నారంతా. అందరి జీవితాలూ సినిమా పరిభాషలో చెప్పాలంటే క్లైమాక్సుకు చేరుతున్నాయి. బ్యాంకు ఉద్యోగాలు, బ్యాంకు లోనులు, యూ.ఎస్.వీసాలు, వ్యవసాయాలు, ఒకరికొకరు సాయాలు, కట్నం లేని పెళ్ళిళ్ళు, మామూలు పెళ్ళిళ్ళు, పేచీలు – ఇలా వుంది వ్యవహారం.

సభ్యులందరూ ఒకరినొకరు ఇంటర్వూ చేసుకున్నారు. అందరి మనసుల్లోనూ ఒకే ప్రశ్న, ” ఇప్పుడేం చెయ్యడం?”.

ప్రమోద్ ఎప్పుడో యూ.ఎస్. లో తువ్వాలు వేసుకున్నాడు. తువ్వాలంటే మామ కూతురన్నమాట. యూ.ఎస్.లో సెటిలైన తన మామకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, ఒక కూతురు కూడా ఉంది. తన కంపెనీలో ప్రమోద్ కి ఉద్యోగం వేయిస్తాడు. పిల్ల మెళ్ళో ప్రమోద్ చేత మూడు ముళ్ళూ వేయిస్తాడు.

అందరం శేఖర్ ని అడిగాం. తను బి.ఇడి చేశాడు. వాళ్ళది ఆముదాల వలస. అదే వూళ్ళొ ఓ ఇంగ్లీష్ మీడియమ్ స్కూల్లో టీచరు ఉద్యోగంలో చేరుతున్నాడు.

“మరి నువ్వు ప్రమోద్ లా యూ.ఎస్. కి వెళ్ళవేమిట్రా?” యెవడో తుంటరి అడిగాడు.

” వాడు నయాగారా ఫాల్స్ కళ్ళారా చూస్తాడు. నేను కళ్ళకు కట్టినట్టు పాఠం చెబుతాను. ఇదే కదరా తేడా.” ప్రమోద్ తో పాటు అందరం నవ్వేం.

ఇక సౌమ్య వంతు వచ్చింది. తనది ఎమ్.ఏ. అయిపోతోంది.
“డిగ్రీ పూర్తయ్యాక యేంజేస్తావేం?” ఎవడో నీరసంగా అడిగాడు.

“నువ్వు కూడా లెక్చరర్ అవుతావా?” ఎవడో కళ్ళింత చేసుకుని అడిగాడు.
“విక్టోరియన్ ఎరా గురించి విడమరచి చెబుతావా?”
“షేక్స్పియర్ సానెట్స్ సమ్ఝాయిస్తావా?”…

మా వాళ్ళ ఉద్దేశంలో సౌమ్య కేవలం ఒక కొండపల్లి బొమ్మ. మరి కొండపల్లి బొమ్మలు డిగ్రీ అయ్యాక పెద్దగా యేమీ చెయ్యవు.

“పెళ్ళి చేసుకుంటాను!”
“ఆ తరువాత?” యెవడో తుంటరి అడిగాడు.
“మా ఆయన్ని అడిగి చెబుతాను.”
అందరూ నవ్వేరు. అది జోకు కాదని అర్థమైనది నాకొక్కడికే అనుకుంటా.

ఇక అందరూ నా మీద పడ్డారు.
“ఏదో చేస్తాలేరా బాబూ. అప్పటి సంగతి అప్పుడు ఆలోచిద్దాం”, ప్రశ్న దాటేయాలని చూశాను.
“వాడికేం రా స్టయిల్ కొడతాడు. అప్పుడే మూడు చోట్లనుండి ఫిజిక్స్ లెక్చరర్ గా ఆఫర్లు వచ్చాయి..యేరా! వైజాగ్ లోనే చేరతావా?”
“నేనింకా యేం అనుకోలేదురా బాబూ, నన్నొదిలేయండి. అసలు నాకు ఉద్యోగం అంటేనే బోర్.”
“ఉద్యోగం చెయ్యకపోతే మరేం చేస్తావేం?”
“ఎస్.టీ.డీ. బూత్ పెడతావా?”
“పోనీ ఇంటర్నెట్ కఫే?”
“సుబ్రంగా పెళ్ళి చేసుకోరాదూ?”
“అవున్రా! క్రాంతి ట్యుటోరియల్స్ ఓనరుకి తెల్లని,సన్నని, గాజుబొమ్మలాంటి కూతురుంది. టెస్ట్ ట్యూబ్ బేబీ అని మా ముద్దుపేరు. నువ్వు సై అంటే….”

అలా రాగింగ్ నిర్విరామంగా కొనసాగుతుండగా అంతలో సౌమ్య –
“ఏయ్! అనూ! ఇవాళ నీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూ చేసుకోవాలి. పదపద!” అంటూ నేను బదులు చెప్పేంతలో చెయ్యి పట్టుకుని బయటికి లాక్కెళ్ళింది. బయటికెళ్ళగానే అడిగింది.
“నిన్ను సేవ్ చేసినందుకు నాకేమిస్తావు?”
” ఓ అదా! అబ్బ, బ్రతికించావు.సరేగాని, ముందు నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి.పద అలా వాక్ కి వెళ్దాం.”

యూనివర్సిటిలో జువాలజీ, బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్లని కలుపుతూ ఓ సన్నని దారి ఉంది. అది జీవశాస్త్రానికి చెందిన ఎన్నో విభాగాలని ఆ శాస్త్రంలాగానే మెలికలు తిరుగుతూ కలుపుతుంది. దారికి ఇరు ప్రక్కల flame of the forest చెట్లు ఉంటాయి. ఆ చెట్లు నారింజరంగు పూరేకులు, పసుపు, ఆకుపచ్చని ఆకులు క్రిందపడి దారంతా రంగవల్లులు తీర్చిదిద్దినట్టుగా ఉంటుంది.

ఎంతో సేపు ఇద్దరం యేం మాట్లాడుకోలేదు.

“ఏదో అడుగుతానన్నావు?” నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ అడిగింది సౌమ్య.
“డిగ్రీ అయ్యాక ఏం చేద్దామనుకుంటున్నావు?”
“ఏయ్! నువ్వూ మొదలెట్టావా వాళ్ళలాగ?”
“లేదు, సీరియస్ గా అడుగుతున్నాను.”
“పల్లెటూళ్ళకి వెళ్ళి అక్కడి పిల్లలకి ఇంగ్లీష్ నేర్పిద్దామనుకుంటున్నాను.”
“పల్లెటూరి పిల్లలకి ఇంగ్లీషా?”
ఎంత ఆపుకుందామనుకున్నా నవ్వాగలేదు.
మీరింకా చాలా యెదగాలి మాస్టారూ, అన్నట్టు ఓ చూపు చూసి ఇలా అడిగింది.
“మన దేశంలో అన్నిటికన్నా ప్రధానమైన సామాజిక సమస్య యేది?”
“నిరక్షరాస్యత.”
“కదా? అక్షరాస్యత వల్ల లాభం యేమిటి?”
“ప్రకృతిని గురించిన స్పృహ. సమాజం పట్ల,సాటి మనిషి పట్ల మరింత అవగాహన. ఓ చెట్టులా బతకడానికి, ఓ మనిషిలా బతకడానికి మధ్య తేడా చదువుతో వస్తుంది.”
“నిజమే,కాని ఆ కారణాలు పల్లెల్లో అంతగా వర్తించవేమో.”
“ఇంకా స్థూలమైన కారణాలు కావాలంటే – ఉద్యోగం,డబ్బు,జీవనోపాధి వగైరా.”
“కరెక్ట్. ఇక పల్లెటూరి పరిస్థితులలో ఎస్.ఎస్.సి. చదవగలిగితే గొప్ప. ఎస్.ఎస్.సి. సర్టిఫికెట్ వుంటే ఎన్నో చిన్నచిన్న ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. మరి ఎస్.ఎస్.సి. సిలబస్లో పల్లెటూళ్ళ వాళ్ళకి అన్నిటికన్నా కష్టంగా అనిపించే సబ్జెక్ట్ ఏంటో తెలుసా?”
“సైన్స్ అయ్యుంటుంది.”
“మొదట్లో నేనూ అలాగే అనుకునేదాన్ని. కాని నువ్వు నమ్మవు…. ఆ సబ్జెక్ట్ ఇంగ్లీష్. తక్కిన సబ్జెక్టులు ప్రాంతీయభాష అయిన తెలుగులో ఉంటాయి. ఒక్క ఇంగ్లీషే వాళ్ళకి సింహస్వప్నంలా వుంటుంది. ఎందుకంటే అది పరాయి భాష. ఇంగ్లీష్ పరిజ్ఞానంతో ఆధునిక ప్రపంచంలోకి, ఆధునిక విజ్ఞానంలోకి వాళ్ళకి ప్రవేశం దొరుకుతుంది. వాళ్ళ ప్రస్తుత జీవనస్థాయిలో మౌలికమైన మార్పు రావాలంటే దానికి ఇంగ్లీష్ పరిజ్ఞానం అనివార్యమవుతోంది. అందుకే పల్లెటూళ్ళలో చదువుకునే పిల్లలకి ఇంగీష్ మీద భయం పోగొట్టి, సులభమైన పద్ధతుల్లో ఇంగ్లీష్ నేర్పించి, ఎస్.ఎస్.సి పరీక్షల్లో నెగ్గేట్టు కృషి చెయ్యాలని ఎప్పట్నుంచో ఆశగా ఉంది.”
నాకు ఒక అరవై సెకన్లు నోటంట మాట రాలేదు.
ఆ అందమైన కళ్ళ వెనుక ఇంత లోతైన ఆలోచనలు ఉన్నాయని నాకూ అంతవరకు తెలీదు.
“మరి ఇదంతా అక్కడ వాళ్ళతో యెందుకు చెప్పలేదు?” కొంచెం ఉద్వేగంగా అడిగాను.
“చెప్పాలనిపించలేదు.”
“చెప్పాలనిపించకపోవడం కాదు. అవతలివాళ్ళని నొప్పించలేకపోవడం.”
“ఏం కాదు.”
“మనని మనం డిఫెండ్ చేసుకోవడం, మన భావాలని మనం ధైర్యంగా చెప్పడం కూడా అవతలివాళ్ళని నొప్పించడమే అనుకునే ఒక విధమైన పిచ్చితనం…. ప్రమాదకరమైన మంచితనం…”
తనేం మాటాడలేదు. నడక ఆపి తన చేతిని నా చేతిలోకి తీసుకుంటూ అన్నాను.
“ఇలాగైతే ఎలా సౌమ్యా? ఈసారి ఎవడైనా అలా తిక్కగా మాటాడితే బిక్కమొహం వెయ్యకూడదు. అక్కసు తీరేట్టు వాడి మాటలతో వాడి మొహం రక్కెయ్యాలి.”
” మరి నాకు గోళ్ళు లేవుగా”, అంది చక్కగా ట్రిమ్ చేసుకున్న తన చేతివేళ్ళని చూబించి నవ్వుతూ.
“అదా! క్షణంలో ఏర్పాటు చేస్తాను.”
క్రిందపడ్డ ఓ flame of the forest పువ్వు యేరి, గోళ్ళ ఆకారంలో ఉండే దాని తొడిమల్ని తెంపి వాటిని సౌమ్యవేళ్ళ మీద నొక్కి మృదుల కృత్రిమ నఖాలుగా మార్చాను.
“అరె! మెత్తని గోళ్ళు”, అంటూ చిన్నపిల్లలా తన వేళ్ళవైపు చూసుకుంటూ మురిసిపోయింది.
కాని ఆ మురిపెం రెండి నిముషాలే. తిరిగి ఆ ’గోళ్ళు’ పీకి నా చేతులో పోస్తూ అంది,
“నాకు యే గోళ్ళూ వద్దు. అంతగా కావాలంటే నీ గోళ్ళు అరువు తీసుకుంటాలే గాని, ముందు నీ సంగతి చెప్పు. ఏం ఉద్యోగం చెయ్యవా? బద్ధకమా?”
“ఉద్యోగం ఇష్టం లేదన్నాను గాని, పని ఇష్టం లేదనలేదు. కేవలం డబ్బు కోసం మనసుకి నచ్చని, మనిషికి నప్పని యేదో పని చెయ్యడం ఇష్టం లేదు. అసలీ ఉద్యోగం జాడ్యం మనుషులకే ఉంటుంది.జంతువులు చూడు. దేని ప్రవృత్తిని బట్టి అది సహజంగా బతుకుతూ పోతుంది. పెద్దయ్యాక యేం చెయ్యాలి అని పులి తల బద్దలు కొట్టుకోదు. ఏ క్షణానికాక్షణం సహజంగా,సజావుగా,దర్జాగా బ్రతుకుతుంటుంది.”
“కాని బ్రతుకు తెరువు కోసం యేదో ఒకటి చెయ్యాలిగా? ఏ క్షణానికాక్షణం అంటే బ్రతకడం ఎలా?”

“నింగిలా, భూమిలా
ఎల్లలే తెలియక
హాయిగా,ఠీవిగా
వేల్పులా బ్రతకాలి.

కాంతిలా వెలగాలి,
గాలిలా మసలాలి.
ఎత్తైన కొండలా,
నిండుగా బ్రతకాలి.
వలపే ఊపిరిగా
తెగువే కవచంగా
ఊహల దారులవెంట
ధీమాగా ఉరకాలి
ధీరుడిలా బ్రతకాలి.”

కళ్ళింత చేసుకుని ముందు కాస్త ఆశ్చర్యంగా చూసింది. తరువాత బొమలు ముడివేసి కాస్త అనుమానంగా చూసింది.” నా మనసులో దాచుకున్న భావాల్ని నీ మాటలెప్పుడు దొంగిలించాయి నేస్తం?” అన్నట్టుంది ఆమె ముఖంలోని భావం. అప్రయత్నంగా కళ్ళు తుడుచుకుంది.
ఎందుకో ఆరోజు ఎంతో కాలంగా పరిచయమైన మనిషిలా అనిపించిందా అమ్మాయి.

* * *

చదువుతున్న సౌమ్య కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి. గతం గుర్తొచ్చింది. ఇంట్లో చెప్పకుండా అనూ, తను ఎలా పెళ్ళి చేసుకున్నది గుర్తొచ్చింది. తన ఇంట్లో వాళ్ళందరూ గుర్తొచ్చారు. వెంటనే అమ్మని చూడాలనిపించింది. అప్పుడు గుర్తొచ్చింది సుజాతకి నెలరోజుల క్రితమే పెళ్ళయ్యిందన్న విషయం. పాపం సుజాత ఎలా వుందో? ఆ వచ్చినవాడు మంచివాడో లేక పుట్టినరోజు నాడు పెళ్ళినాటి చీర కట్టుకుని టీకప్పుతో ఎదుట నిలబడితే మొహం తిప్పుకునే పాషాణ హృదయుడో?

ఆ విరుల సాంగత్యంలో కోపం చాలా మటుకు ఆవిరైపోయింది. ఇంకా చదవసాగింది.
మే10,1998
సాయంకాలం 4:30.

ఈ రోజు సౌమ్య పార్కుకి అరగంట ఆలస్యంగా వచ్చింది.వాడిన మల్లెలా వుంది మొహం. చూడగానే విషయం అర్థమయ్యింది. ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోలేదు.

పర్సుని పశ్చిమానికి, చెప్పుల్ని ఈశాన్య, నైఋతులకి విసిరి మాట్లాడకుండా వెళ్ళి ఓ రాయి మీద చతికిలబడింది. మోకాళ్ళమీద తల ఆన్చి, ముఖం నాకు కనిపించకుండా అటు తిప్పి కూర్చుంది. ఓ నవ్వులేదు, పలకరింపు లేదు. రాగానే యేదో జోక్ చెప్తుంది యెప్పుడూ. అదీ లేదు. ఇక తక్కిన లాంఛనాల మాటే యెత్తక్కర్లేదు. అరగంట అయ్యింది. అస్సలు చలనం లేదు. కొంపదీసి తిరుపతి శ్రీనివాసుడిలా శిలగా మారిపోయిందేమోనని ఆలోచన వచ్చి వొణుకు పుట్టింది. విషయం తేల్చుకుందామని తనకి అటు వెళ్ళి కూర్చున్నాను. లిప్తలో రెప్పలు కాస్తంత తెరిచి, నన్నోమారు చూసి మళ్ళీ రెప్పలు దించేసింది. హమ్మయ్య! శిల కాదు, మా సౌమ్యే. గ్రహణం విడుపుకోసం చీకటి ఆకాశం వైపు గుడ్లప్పగించి చూసే ఖగోళ శాస్త్రవేత్తలా, విచారం అలముకున్న ఆ ముఖాన్నే చూస్తూ ఉండిపోయాను.

సౌమ్య ముఖాన్ని చూస్తూ వుండిపోవడం నాకు కొత్తేమీ కాదు. ఎప్పుడైనా మూడ్ ఆఫ్ అయితే వెళ్ళి కాసేపు తన ముఖం చూస్తాను. అంతా సర్దుకుంటుంది. ఇంట్లో సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేసినా సౌమ్య ముఖమే ఆదుకుంటుంది. అలాగే యూనివర్సిటీలో గైడు పెట్టే చిత్రహింసలకీ అదే నా పెయిన్ బామ్. నా జీవితంలో యెన్నో సమస్యలకి ఏకైక సులభ పరిష్కారం – సౌమ్య ముఖదర్శనం. ఎప్పుడూ లేనిది ఈ రోజు కొంచెం డల్ అయినా మునుపులేని కొత్త అందమేదో తనలో పొటమరిస్తోంది. విచారవదనంలో ఇంత లోతు, గాంభీర్యం, దివ్యమైన రాజసం వున్నాయని ఇవాళే తెలిసింది.మారాంలోనూ మురిపించగలిగే మనోజ్ఞమైన అందం తనది. చిన్నబోయినా బొండు మల్లెలా వన్నెపోని లావణ్యం.

పార్కులో గడియారం కొట్టిన గంటకి ధ్యానభంగం అయ్యింది. టైము 5:30. తనకెలా వుందోగాని, నాకైతే అస్సలు బోరు కొట్టడం లేదు. అందమైన వస్తువును తదేకంగా చూస్తున్నపుడు ఆలోచనలు సద్దుమణిగి మనసు నిశ్చలమవుతుంది. ఆ స్థితిలో యేదో నిర్మలమైన ఆనందం మనసుని నింపివేస్తుంది. అలాంటి మనసుకి తోచకపోవడం వుండదు.

ఎలాగూ ఈ సాయంకాలం ఇక చెయ్యబోయేదేమీ లేదు. చెప్పడానికి కథ లేనప్పుడు వర్ణనలోకి దిగే రచయితలా, కాసేపు నాకు నేనే సౌమ్యవదన వర్ణనా వైభవాన్ని ప్రదర్శించుకున్నాను. వర్ణించే వాణ్ణీ, విమర్శించే వాణ్ణీ నేనే అయ్యాను. మా సంవాదం ఇలా సాగింది.

వర్ణించే వాడు ( అంటే నేను) :- ముద్ద మందారం, విరియని మల్లెమొగ్గ, సంపెంగ? విమర్శించేవాడు ( అదీ నేనే) :- ఉహు, పేలవంగా ఉంది.
వ :- ముకుళిత శతదళ కమలం?
వి :- అతి భారంగా వుంది. మరేదైనా చెప్పు.
వ :- వెతని వెల్లడి కానీకుండా కుంచించుకుపోతూ, మనసు లోతుల్లోంచి యే ఈశ్వరుడికో పిలుపునిస్తున్న తన ఆంతర్యం, గుప్పెటలా ముడుచుకుపోతూ తన కేంద్రంలోనే వున్న లింగాన్ని ఆరాధించే నాగలింగం పువ్వులా వుంది.
వి :- భలే! ఫరవాలేదు. భవిష్యత్తు ఉంది. కాని, కాసేపు పువ్వుల జోలికి వెళ్ళకుండా మరేదైనా చెప్తావా?
వ:- సరే కాసుకో,
తెల్లారేసరికి బండెడు లెక్కలు హోమ్ వర్కు నెత్తిన పడగా, ఎప్పుడూ అడక్కుండానే యెంతటి జటిల హోమ్ వర్కైనా చిటికలో చేసిపెట్టే అమ్మ ఈ రోజు తనను పట్టించుకోకుండా “ఈనాడు సినిమా” కి అతుక్కు పోవడం చూసి ఇక గత్యంతరం లేక తనుకూడా దిగులుగా “ఈనాడు సినిమా” చూస్తూ కూర్చుండిపోయిన ఆరోక్లాసు పిల్లలా వుంది.

దెబ్బకి విమర్శకుడు అంతర్ధానమైపోయాడు.
ఆ ఆరోక్లాసు పిల్లని ఊహించుకుంటూ ఆపుకోలేక బయటికి నవ్వేశాను.
అదివిని చుఱ్ఱుమని ఓ చూపు రువ్వింది సౌమ్య.” ఏం చెయ్యాలో దిక్కు తోచక నేనింత తలమునకలవుతుంటే నీకు చీమ కుట్టినట్టయినా లేదేం? పాషాణ హృదయుడా! ” అని ఆ చూపులోని సమాచారం. ఇక లాభం లేదు. ఈ తపస్సునిక భంగం చెయ్యాలి.

“మారాం చేసే మా రామచిలకా, మాట్లాడవే!” అర్థించి చూశాను.

ఉహు. ఉలుకు పలుకు లేదు. సౌమ్యది గలగలా మాట్లాడే స్వభావం. తన మాటలు వింటుంటే సంతోషంగా వుంటుంది. పోనీ మాటాడకపోయినా ఊరికే తన పక్కన కూర్చున్నా చాలు యెంతో హాయిగా వుంటుంది. బోరు కొట్టకపోవడానికి ఇది రెండో కారణం.

అంతలో ఎక్కణ్ణుంచి వచ్చాయోగాని, అంతవరకు నిశ్చలంగా వున్న ఆ కళ్ళలోంచి రెండు కన్నీటి చుక్కలు క్రిందికి జారాయి. ఇక లాభం లేదు. పరిస్థితి చేజారి పోతోంది. ఏదో విరుగుడు ఆలోచించాలి.

“ఐస్క్రీమ్ తింటావా?” అడిగి చూశాను. జవాబు లేదు. అంటే కావాలన్నమాట. తనకిష్టమైన బటర్ స్కాచ్ తెచ్చాను. గుళ్ళో ప్రసాదంలా ముచ్చటగా మూడు స్పూన్లు తిని కప్ ని దక్షిణంగా విసిరేసింది.

మళ్ళీ మౌనం. మోయలేని నైశ్చల్యం.

ఏడయ్యింది. ఇక ఈ మౌనకాండకి ముక్తాయింపు చెప్పాలి. మెల్లగా దగ్గరికి జరిగి తన చేతుల్ని నా చేతుల్లోకి తీసుకుని అన్నాను.

“చూడు రామచిలకా! పెళ్ళి అనగానే నస పెట్టడం పెద్దవాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. అది మనకి తెలీందికాదు. పాపం వాళ్ళూ మనుషులే కదా. కొంచెం టైము ఇద్దాం. మరీ సాగదీస్తే మనం మాత్రం యేం చెయ్యగలం? మన కర్తవ్యం మనం నెరవేర్చి తరువాత వాళ్ళ దగ్గరికెళ్ళి చేతుల్లో ఇన్ని అక్షింతలు పోసి దీవించమని రిక్వెస్ట్ చేద్దాం. సరేనా?”

అదేం అంత సులభంకాదన్నట్టు తల యెత్తకుండానే అటూ ఇటూ ఊపింది.
“అదేం అంత సులభం కాదంటావా. నువ్వే చూద్దువుగానిగా, అన్నీ యెంత సవ్యంగా జరుగుతాయో.”
ఏంటంత ధీమా, అన్నట్టు నా వైపు ఓసారి విస్తుపోయి చూసింది.
” ఏం లేదు. చాలా సింపుల్. నువ్వు నాకు చెందిన దానివని నా హృదయంలో స్పష్టంగా తెలుస్తోంది. బయటకూడా రేపు అదే నిజమవుతుంది.”
అప్పుడు తన ముఖంలో కనిపించిన సంతోషాన్ని వర్ణించడానికి నాకైతే మాటలు లేవు.
అప్పుడప్పుడే మెరీనా బీచ్ మీంచి పడిలేస్తూ నెమ్మదిగా మావంక వస్తున్న నెలవంక అంతకు ముందే నాగేశ్వర్రావు పంతులు పార్కులో జరిగిపోయిన చంద్రోదయాన్ని చూసి గతుక్కుమన్నాడు.

* * *

అది చదివి అప్రయత్నంగా చేతులతో తన ముఖం తడుముకుంది. ఆ క్షణం తన ముఖం తనకి ఏదో కొత్త, అపురూపమైన వస్తువులా తోచింది.

కోపం ఇంచుమించుగా పూర్తిగా మరచిపోయింది. అనూ ఆఫీస్ నుండి వచ్చే వేళయ్యింది. వెళ్ళి మళ్ళీ తలస్నానం చేసింది. బంగారు పువ్వులున్న సింధూరం రంగు పట్టుచీర కట్టుకుంది. మళ్ళీ టీ చేసుకుని ఆ కప్పుతో వరండాలో అనూ కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. అలా ఓ గంట గడిచి వుంటుంది.

అంతలో ఎవరో గేటు తీసుకుని లోపలికి రావడం కనిపించింది. ఆ మనిషి చేతిలో ఏదో పార్శిల్ వుంది. ఇంత లేటుగా పోస్ట్ మాన్ రాడు. అంటే కొరియర్ వాడే! ఈ కొరియర్ వాళ్ళకి పెళ్ళాం, పిల్లలు వుండరేమో!

దగ్గరికి వచ్చి, పార్సిల్ చేతిలో పెట్టి, ఓ కాగితం చూబించి,”సంతకం పెట్టండి.” అన్నాడు, అవతల కొంపలు భగభగ తగలబడి పోతున్నాయన్నంత హడావుడిగా.

వాణ్ణి పంపించేసి పార్సిల్ విప్పింది. ఫోటో ఆల్బమ్! సుజాత పెళ్ళి ఫొటోలు అయ్యుంటాయి. మొదటిపేజీ తెరిచింది.
పెళ్ళిచీరలో సుజాత, అబ్బ యెంత అందంగా వుందో! అరె, తనలాంటిదే ఎర్రంచు తెల్లపట్టు చీర. అరె! ఒక్క నిమిషం. తనలాంటిది కాదు, తనదే. తనే! అది సుజాత కాదు, తనే! ఎప్పుడు తీసిన ఫొటో ఇది? ఎవరు తీశారు?

ఇంకా పేజీలు తిప్పింది. అన్నీ తన ఫొటోలే. ఎర్రంచు తెల్లపట్టు చీరలో ఒంటరిగా వంటగదిలో డైరీ చదువుతున్న ఫొటో. అరుణ కిరణాలు పారాడుతున్న ఏకాంత మహోన్నత హిమవన్నగంలా ఉంది తను. మొక్కల మధ్య ఉర్చీ వేసుకుని డైరీ చదువుతున్నప్పుడు, వంత మరచిపోతూ పూల చెలియల చెంత ఊరడిల్లుతున్న విరిబాలలా ఉంది. సింధూరం రంగు చీరలో వరండాలో అనూకోసం ఎదురుచూస్తున్నప్పుడు సంజెకాంతిలో నిశ్చలంగా ప్రకాశిస్తున్న నిశాంత నీరవ నదీతీరంలా వుంది. అన్నీ ఆరోజు తీసినవే. ఎన్నెన్నో ఫొటోలు. ఒక్కరోజులో తనమీద ఎవరో హడావుడిగా రాసిన దృశ్యప్రబంధంలా వుందా ఆల్బమ్. ఆ ప్రబంధకవి ఎవడో కనిపిస్తే చొక్కా పట్టుకుని కడిగెయ్యాలి. ఇలాంటి ఆకతాయిలని ఊరికే వదిలేస్తే సంఘానికే ముప్పు.

ఇంతలో ఆల్బమ్ లోంచి ఓ కాగితం పడింది. తెరిచి చూసింది. ఉత్తరం తనకే –
“నా బంగారు సుమీ,
ఈపాటికి కోపం కొంచెం చల్లారింది అనుకుంటాను. ఎన్నాళ్ళగానో నాలో ఓ కోరిక వుంది. కొంచెం దారుణమైన కోరిక.
ఇన్నేళ్ళూ నీ అందంలో ఎన్నోరుచులు చవి చూశాను. నవ్వినప్పుడు బావుంటావు. అలిగినపుడు అదిరిపోతావు.కోపం వచ్చినపుడు ఈకోపం కాసేపు అలాగే వుంటే బావుణ్ణు అనిపించేట్టు వుంటావు. కాని, నీ అందానికి ఒక అరుదైన ముఖం వుంది. విచారంగా వున్నప్పుడు నీ ముఖంలో కనిపించే నైశ్చల్యం, లోతు,దివ్యమైన గాంభీర్యం… అది ఒక్కసారే చూశాను. తరించాను. పెళ్ళయ్యాక మళ్ళీ అలా నిన్నెప్పుడూ చూడలేదు.

ఈ రోజు యెలాగైనా నీలోని ఆ అరుదైన అందాన్ని చూడాలన్న నా ఈ చిన్ని దురాలోచనని క్షమిస్తావు కదూ?

– నీ,

అనూ.”

అంతలో యెక్కణ్ణుంచి వచ్చిందో ఓ దుమారం ఉప్పెనలా తనని క్రమ్మి పొడవైన చేతులతో ఆమెని అమాంతం పైకెత్తి నవ్వుతూ తనని పూర్తిగా స్వాధీనం చేసుకుంది. ఇక అటువంటి విపరీత పరిస్థితులలో యెంతటి జితేంద్రియులకైనా కిమ్మనకుండా ఆ దుమారం చల్లని యెదలో గువ్వలా ఒదిగిపోవడం తప్ప గత్యంతరం లేదని పాపం ఆ అమ్మాయి త్వరలోనే అర్థం చేసుకుంది.

• * *

6 thoughts on “నిన్నలేని అందం

  1. శ్రీనివాస చక్రవర్తిగారూ,
    మీ ఈ కథ చదివితే గాని బోధపడలేదు… శాస్త్రవిజ్ఞానము బ్లాగులో మీరు రాస్తున్న సైన్స్ కథనాలు కథలాగా, నవల్లాగా పాఠకులను ఎందుకంత ఆకర్షిస్తున్నాయో..కథ ఇంత సౌమ్యంగా రాయవచ్చా..! ఇంత సుకుమారంగా వర్ణించవచ్చా..!

    “నవ్వినప్పుడు బావుంటావు. అలిగినపుడు అదిరిపోతావు.కోపం వచ్చినపుడు ఈకోపం కాసేపు అలాగే వుంటే బావుణ్ణు అనిపించేట్టు వుంటావు. కాని, నీ అందానికి ఒక అరుదైన ముఖం వుంది. విచారంగా వున్నప్పుడు నీ ముఖంలో కనిపించే నైశ్చల్యం, లోతు,దివ్యమైన గాంభీర్యం…”

    ఎంత సుందర మనోహర భావ ప్రకటనో.. ‘సుందర తెలుంగు పాటలు పాడీ..’ అన్నారండీ తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి 90 ఏళ్ల క్రితం. సుందర తెలుంగు మాటలాడీ అని కూడా చెప్పుకోవచ్చు మనం. శాస్త్రవిజ్ఞానానికి తెలుగు కెంజాయ సొంపులమరితే ఎలాగుంటుంది? మళ్లీ చెప్పాలా…?

    నమస్సుమాంజలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *