March 19, 2024

హిమగిరి తనయే హేమలతే

రచన: డా.తాడేపల్లి పతంజలి

పల్లవి

హిమగిరి తనయే  హేమలతే అంబ

ఈశ్వరి శ్రీ లలితే మామవ

 

అనుపల్లవి

రమా వాణి సంసేవిత సకలే

రాజరాజేశ్వరి రామ సహోదరీ

చరణం

పాశాంకుశేషు దండ కరే అంబ

పరాత్పరే నిజభక్త పరే

ఆశాంబరే హరి కేశ విలాసే

ఆనంద రూపే అమృత ప్రతాపే

పదార్థం

హిమగిరి తనయే                    =        హిమవంతుని పుత్రికవైన తల్లీ!

హేమలతే                                      =        బంగారపు తీగెవంటి ఆకృతికలదానా!

అంబ                                          =        ఓ జననీ!

ఈశ్వరి                               =        సకలమునకు అధినేత్రీ!

శ్రీ లలితే                              =        శ్రీ లలితా!

మామవ(మాం +అవ)              =        నన్నురక్షించు!

రమా                                          =        లక్ష్మి

వాణి                                           =        సరస్వతి మొదలగు దేవతలచేత

సకలే                                 =        కళలతో కూడి

సంసేవిత                                       =        పూజలందుకొనెడి దానా!

రాజరాజేశ్వరి                         =        సర్వాధిష్ఠాన  దేవతా!

రామ సహోదరీ                      =        విష్ణు మూర్తి సోదరియైన నారాయణీ!

కరే                                             =        చేతులయందు

పాశ                                           =        తాడు(బంధము)

అంకుశ                               =        అంకుశము(ఏనుగు కుంభస్థలమునందు

పొడిచెడి  ఆయుధము)

దండ                                           =        ఉపాయము, దుడ్డుకర్ర కల దానా!

అంబ                                          =        సమస్త చరాచర సృష్టికి తల్లివి

పరాత్పరే                                      =        శ్రేష్ఠులకందఱికి శ్రేష్ఠు రాలివి

నిజభక్త పరే                                    =        నమ్ముకొన్న భక్తులను కాపాడు తల్లివి

ఆశాంబరే                                      =        దిక్కులు వస్త్రముగా కల దానివి(సర్వ

వ్యాపిత అని భావం)

హరి కేశ విలాసే            =        హరికేశ అను నామ ముద్ర కలిగిన

ముత్తయ్య భాగవతార్ కీర్తనల్లో  విలాసంగా కదలాడు అక్షర దీప్తివి

ఆనంద రూపే                        =        ఆనందమే రూపముగా కల దానివి

అమృత ప్రతాపే                      =        అందమైన తేజస్సు కల దానివి

అయిన నువ్వు

మామవ(మాం +అవ)              =        నన్నురక్షించు

విశేషాలు

కవి పరిచయం

 

త్యాగరాజు తరువాత అత్యంత ముఖ్యమైన స్వరకర్తల్లో ఒకరు ముత్తయ్య భాగవతార్ . (15-11-1877 నుండి 30-06-1945 )సంస్కృతం, కన్నడ, తెలుగు మరియు తమిళ భాషల్లో ప్రముఖ విద్వాంసులైన ముత్తయ్య భాగవతార్ తమిళనాడులోని హరికేశనెల్లూర్ లో జన్మించారు. ఆయన కలం పేరు “హరికేశా” (జన్మ స్థలమే కలంపేరు).

సంగీత కల్ప ద్రుమ ఆని తమిళంలో ఒక సంగీత శాస్త్రాన్ని రచించారు.ముఖారి రాగం ఆయనకు చాలా ఇష్టమైనది.

చాముండి అమ్మవారి మీద ఆయన  రాసిన  103 కీర్తనలు చాలా ప్రసిద్ధమైనవి. అందులో ఈ హిమగిరి తనయే  కీర్తన ఒకటి.ఈ కీర్తనలో అమ్మవారిని నుతించిన కవి సంబోధనలు సార్థకమైనవి. ఎంతో అంతరార్థాన్ని కలిగినవి. వాటిలో కొన్నింటిని విశ్లేషించటానికి ప్రయత్నిస్తాను.

 

హిమగిరి తనయే

.               తాపాన్ని పోగొడుతుంది కనుక  మంచును హిమమన్నారు. “అమ్మ కూడా మన తాపత్రయాలను పోగొడుతుంది’ అని సూచించటానికి కవి ఇక్కడ హిమగిరి అనే శబ్దాన్ని వాడాడు. (తాపత్రయాలు మూడు 1.ఆధ్యాత్మికము (శరీరానికి కలిగే బాధలు)2.ఆధి భౌతికము(భార్యాపుత్రులు మొదలైన  వారికి కలిగే బాధల వల్ల బాధ పడటం )3. ఆధిదైవికం(లోకంలో కలిగే భూకంపాలు, అతివృష్టి, సమ్మెలు మొదలైన వాటివల్ల కలిగే దుఃఖం))

రామ సహోదరీ

ఇక్కడ రామ శబ్దానికి విష్ణు మూర్తి అని అర్థం చెప్పుకోవాలి. విష్ణు మూర్తి సోదరిగా దేవి పురాణ ప్రసిద్ధ. అందుకే విష్ణువు నారాయణుడయితే ఆమె నారాయణిగా పేరు పొందింది.లలిత సహస్ర నామాల్లో కూడా ఈ రామ సహోదరి వృత్తాంతం మనకు కనబడుతుంది (ఓం పద్మనాభ సహోదర్యై నమః)

ఫాశాంకుశేషు దండ కరే

ప్రతి మానవునికి ఎనిమిది రకాల పాశాలు ఉంటాయని పెద్దలు చెబుతారు. (పాశ చతుష్టయం , పాశ పంచకం  అని కూడా ఉన్నాయి) అవి వరుసగా  1.భార్య(భర్త) 2.పిల్లలు 3. సంపద 4.పశువులు 5.వాహనం 6.భూమి 7. ఇల్లు 8. స్నేహితుడు (స్నేహితురాలు) ఈ పాశాలను కల్పించేది, నశింపచేసేది తానేనని చెప్పటానికి అమ్మ పాశాన్ని ధరిస్తుంది.

ఆంకుశము దుర్మార్గాన్ని శిక్షించగల అమ్మ పరాక్రమానికి చిహ్నం.

నాలుగు ఉపాయములలో ఒ కటి   దండం.; (  ఇది మూడు రకాలు 1.వధించుట, 2.ధనము హరించుట, 3.పీడించుట ) తనను ఆశ్రయించే భక్తులకు వారి వారి కర్మానుసారముగా ప్రాప్తించే  దండ బాధలను  తొలగించే సమర్థురాలను తానని చెప్పటానికి అమ్మ దండాన్ని(=దుడ్డు కర్రని ) ధరిస్తుంది.

అమృత ప్రతాపే

అమృత తేజస్సు అమ్మది. అందుకే ముత్తయ్య భాగవతార్ అమ్మని అమృత ప్రతాపే  అన్నాడు. ఇక్కడ ప్రతాపమనే పదానికి  తేజస్సు అను అర్థమే బాగుంటుంది. అమృత  తేజస్సు  కల్గిన అమ్మను భక్తితో దర్శిస్తే   అమృతత్వం తప్పకుండా సిద్ధిస్తుంది.  మానవుని చివరి గమ్యం  అమృతత్వం. (మృత్యోర్మా అమృతత్వం గమయ) అందుకే , మన తుట్టతుది గమ్యాన్ని నిర్దేశిస్తూ ముత్తయ భాగవతార్ కూడా అమృత ప్రతాపే అని కీర్తన చివర్లో రాసాడు.

ఆనందరూపి యైన అమ్మ నామాన్ని, రూపాన్ని స్మరిస్తుంటే ఆనందం తప్పకుండా కలుగుతుంది. కుండలినీ వర్తినియైన రాజ రాజేశ్వరి  తన విషయంలో అనందించే భక్తులకు అమృతత్వం తప్పకుండా కలుగ చేస్తుందనే విషయాన్ని తన కీర్తన ద్వారా భంగ్యంతరం గా తెలియ చేసిన ముత్తయ్య భాగవతార్ ధన్యుడు. స్వస్తి.                                    ***

3 thoughts on “హిమగిరి తనయే హేమలతే

    1. పాశాంకుశేక్షు దండ – పాశం , అంకుశం , ఇక్షు దండము (చెఱకు గడ )….ఇవి రాజ రాజేశ్వరి అమ్మవారి దగ్గర ఉంటాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *