June 14, 2024

అవసరాల రామకృష్ణారావు రచన-జీవితం-వ్యక్తిత్వం


రచన : కె. రాజశేఖర రాజు

 

15 సంవత్సరాల వయసులో చందమామ కథతో మొదలుపెట్టి 80 ఏళ్ల వయసులో చందమామ కథతోనే జీవితం ముగించిన తెలుగు విశిష్ట కథా రచయిత అవసరాల రామకృష్ణారావు గారు. బాల్యంలో అమ్మ చెప్పిన కథనే ఊకొట్టే భాషలోకి మార్చి ఆయన పంపిన ‘పొట్టిపిచిక కథ’ తొలి చందమామ పత్రికలో -1947 జూలై- యధాతథంగా అచ్చయి ఆయన సాహితీ ప్రస్థానానికి తొలి బీజం వేసింది. దాదాపు అరవైనాలుగు సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం మొదట్లో ఆయన తన చందమామ జ్ఞాపకాలు పంపుతూ, పొట్టిపిచిక కథ రూపంలో తన బాల్యంలో తొంగి చూసిన ఆ తొలి కిరణపు రూపురేఖలే నేటి ఈ వృద్ధాప్యంలో కూడా కొనసాగడం మించిన ఆశ్చర్యం, ఆనందం ఇంకేముందని గర్వంగా చెప్పుకున్నారు.

 

“ఓ బడుగు జీవి తను కష్టపడి సాధించుకున్నది అది లేషమే ఔగాక, పోగొట్టుకుంటుంది. ఎంతమందినో కలుసుకుని, ఎవరూ కలిసిరాకపోయినా, పట్టుదల వదలక, చివరికి విజయం సాధిస్తుంది. అదీ ‘పొట్టి పిచిక కథ’ అదే నా విజయసూత్రం అవుతుందని ఆనాడనుకోలేదు! వెయ్యి పైగా రచనలు చేసి, ఈనాటికీ తల వంచక, కలం దించక తెలుగు కథకుడిగా కొనసాగుతున్న నాకు వేగుచుక్క ఆ కథే కదా! పక్షులతో జంతువులతో మనుషుల్ని కలిపి సామాజికాంశాల్ని సరళంగా చెప్పవచ్చునని నేను నేర్చుకున్నది. చందమామ పత్రిక చలవవల్లనే. ‘గణిత విశారద’ అనే నవల రాసింది చందమామ పఠన స్పూర్థి తోనే. సైజుతో పాటు చురుకుతునంలో కూడా నాటి పొట్టి పిచిక లక్షణాలు ఇప్పటికీ నాలో మిగిలి ఉన్నాయని నా మీద నేను వేసుకునే సోకైన జోకు! నా తొలి ప్రేమ ‘చందమామ.’ వాక్రూప వర్ణార్ణవం… ఈ నాటికీ కథాసుధల్ని వెదజల్లుతూ హాయిగా జీవించగలిగే నా మనోధృతికి నాటి ‘చందమామే’ మదురస్మృతి!”

 

చందమామ కథ ఇచ్చిన ఊపుతో తాను రాసిన సుప్రసిద్ధ పిల్లల రచనల్లో ‘కేటూ డూప్లికేటూ,’ ‘మేథమేట్రిక్స్,’ మూడు భాగాలూ, ‘ఆంగ్రేజీ మేడీజీ,’ ‘ఆంగ్రేజీ యమఈజీ’ వంటి అరడజను రచనలు భాగమని కూడా ఆయన ఘనంగా చెప్పుకున్నారు.

 

ఈ కథా పురుషుడి మాన్య ప్రశంసతో చందమామ జన్మ సార్థకమైంది. ‘ప్రపంచం ఎంతగా మారినా సరే.. చందమామ కథ మారకూడదు’ అంటూ ప్రపంచం నలుమూలలనుంచీ చందమామ వీరాభిమానులు ఒకే మాటగా ఉంటూ చందమామ దశను దిశను మార్చే ప్రయత్నం జరపినప్పుడల్లా ఉత్తరాలతో, ఈమెయిల్స్‌తో కొడుతున్న నేటి కాలంలో కూడా, ‘ఏ పత్రికకైనా సరే మార్పులు తప్పవు, కాలానుగుణంగా మార్పును అంగీకరించవలసిందే’ అంటూ స్వల్ప పరిచయంతోటే ఆత్మీయంగా ఫోన్‌లో నుడివిన పలుకులు మర్చిపోవడం ఎలా సాధ్యం? పత్రిక మనుగడకు సంబంధించి, యాజమాన్య దృష్టి కోణంలో మార్పు సహజం అంటూ సమస్యను రెండు వైపుల నుంచీ అర్థం చేసుకుంటూ ఆయన చందమామలో మార్పులను ఆమోదించిన తీరుతో బహుశా చందమామ వీరాభిమానులకు ఎవరికీ మింగుడు పడకపోవచ్చు కూడా.

 

చందమామతో మొదలై ముగిసిన ‘కథ’

 

అవసరాల రామకృష్ణారావు గారు చందమామ కథతో 1947లో తన సాహిత్య రచనా జీవితం మొదలెట్టారు. 65 ఏళ్లపాటు నిర్విరామంగా రచనలు చేస్తూ వచ్చారు. తను పాటించే నీతికి విరుద్ధమనిపించినప్పుడు ప్రచురణకు పంపకుండా ఎన్ని రచనలను ఆయన ఆముద్రితంగా ఉంచేశారో లెక్క తెలీదు కాని జీవిత పర్యంతం వెయ్యి రచనలపైగా చేసినట్లు ఆయనే చెప్పుకున్నారు. ఆయన రాసిన వాటిలో ‘సంపెంగలూ-సన్నజాజులూ’ నవల ఆయనకు మంచి పేరు తెచ్చింది.

 

ఈ జనవరి 27న హైదరాబాదులో దాసరి సుబ్రహ్మణ్యంగారి ప్రధమ వర్థంతి సందర్భంగా ఆయన చందమామేతర సీరియల్స్ ఆవిష్కరణ సందర్భంగా సిటీసెంట్రల్ లైబ్రరీ సమావేశమందిరంలో కలుసుకున్నప్పుడు మా అందరి ముందూ ఒక మెరుపు మెరిసినట్లయింది వందమంది దాకా చందమామ అభిమానులు, వీరాభిమానులు, చందమామ రచయితలు, పాఠకులు ఒక చోట చేరిన ఆ అరుదైన సన్నివేశంలో ఆయన 80 ఏళ్ల వయస్సులో కూడా ఎంత చలాకీగా కనిపించారో..

 

సైజుతో పాటు చురుకుతనంలో కూడా నాటి పొట్టి పిచిక లక్షణాలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయని ఈయన తనమీద తను సోకైన  జోక్ వేసుకుంటారట. అది అక్షరాలా నిజం. ఆయన రూపాన్ని చూసినా, ఫోన్‌లో మాట్లాడినా గలగలగలమనే పిచ్చిక కువకువలనే తలపించే మూర్తిమత్వం.

 

ఆ సమావేశంలో కుదురుగా మాట్లాడటం సాధ్యం కాకపోయినా తర్వాత ‘రచన’ సంపాదకులు శాయిగారు ఆయనతో మాట్లాడించినప్పుడు నాలో ఒక్కటే ఆలోచన. మన కళ్లముందు మిగిలి ఉన్న ఈ తొలి చందమామ అపురూప కథకుడి చందమామ జ్ఞాపకాలు ఎలాగైనా సంపాదిస్తే ఎంతబాగుంటుంది! ఆయన రాయగలరా, రాసి పంపగలరా, వయస్సు సహకరించగలదా..

 

కానీ, ఆయనతో మాట్లాడాక ఆ గలగలల శబ్దం ముందు ఈ సందేహాల ‘గలదా’లన్నీ పక్కకు పోయాయి.

 

ఆయన విశాఖపట్నం వెళ్లాక రెండు రోజుల్లోగా తమ చందమామ జ్ఞాపకాలు, బోనస్‌గా చిట్టి కథ కూడా రాసి శాయిగారికి పంపడం, ఆయన వాటిని స్కాన్ చేసి వెంటనే చందమామకు ఈ మెయిల్ చేయడం నిజంగా అదొక మధురానుభూతి.

 

1947 జూలైలోనే తొలి చందమామ అచ్చయింది కనుక దీన్ని పునస్కరించుకుని 2011 జూలై నెలలో ఈ మాన్యుడి పాత కథ -పొట్టిపిచిక కథ-, ‘చందమామ జ్ఞాపకాలు,’ బోనస్‌గా అందించిన మరో చిన్న కథ -విజయమాల-లను ఒకేసారి ప్రచురిస్తే బాగుంటుందన్న శాయిగారి ప్రతిపాదనను యాజమాన్యం వారికి చెప్పడం. వెంటనే అది ఆమోదించబడటం జరిగిపోయింది. ఒకే రచయితవి మూడు రచనలు ఒకేసారి ప్రచురించిన చరిత్ర ఇటీవలి చందమామ చరిత్రలో లేదు. ఆవిధంగా చందమామ తనను తాను గౌరవించుకున్నట్లే.

 

చందమామ 64వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ ఈ జూలై నెలలో పచ్చిన తన మూడు కథలు చూసుకుని ఆయన ఎంత మురిసిపోయారో! ఈ సందర్భంగా ఆయన గురించి చందమామలు బ్లాగులో ప్రచురించిన కథనాన్ని ఆయన ఎంతగా ఆస్వాదించారంటే అదే ఊపులో జూలైలోనే ఆయన ‘తాత చేతి నీతి కథలు’ శీర్షికతో రెండు కథలు రాసి పంపించారు. ఈ సందర్భంగా ఆయన నాకు పంపిన లేఖ కూడా ఎంత సాహితీ, రాజకీయ భరితమైన విరుపుతో ఉందో చూడండి.

 

రాజశేఖరా! రమ్యాక్షరా!

మీరు చేసిన అభ్యర్థనతో

అంతకు మించి

జూలై చందమామలో నన్ను

Re (cover) చేసిన పద్ధతిలోని

ఆత్మీయతకు ప్రతిస్పందించడంతో,

అన్నిటినీ మించి

బ్లాగులో బాగుబాగు అనిపించే నా పరిచయ ముఖచిత్రానికి మురియడంతో,

ఇందుతో మరి రెండు

నా కొత్త కథలు అందిస్తున్నాను.

వీటిని ప్రచురణకు అంగీకరించడంలో

మీకు గల సాధకబాధకాలు నాకు తెలీవు.

‘సంపాదకుడెవరైనా

చింపాంజీ కన్న నయము సిరిసిరిమువ్వా!’

అన్నాడు శ్రీశ్రీ మరెక్కడేం చూసో.

అదిష్టానం అరిష్టానికి కట్టుబడిన ఆంధ్రా

కాంగ్రెస్ మంత్రుల్లా అనేక పరిమితులు మీకు.

వరసగా రాసిపారేద్దామన్న దురాశతో

‘తాతచేతి నేతికతలు’ గా 1, 2 పంపించాను. మీరు అలా కాక వేరే వేరే రెండూ వేసి ఊరుకున్నా నేనేం అనుకోను. continue చేద్దాం అంటే 15 రోజుల్లో 3,4 పంపిస్తాను. ఒక్కొక్కటి రెండేసి అచ్చుపేజీలు (నా ‘విజయమాల’లా) వచ్చేలా plan చేసి రాశాను.

ఇవి అంది చదవగానే Phone చేస్తూ మీ అభిప్రాయం నిష్పక్షపాతంగా చెప్పండి. నాకేం వచ్చేకాలమా, పోయేకాలమా?

ప్రేమతో

మీ

రామకృష్ణారావు

విశాఖ,

5/7/2011

 

 

‘అహంకారం,’ ‘అవిశ్వాసం’ అనే పేర్లతో పంపిన ఈ రెండు కథలూ సమాజం ఆమోదించిన విలువలకు భంగం జరిగితే రావణుడికైనా సరే పతనం తప్పదనీ, మనిషిపట్ల మనిషికి విశ్వాస చెదిరితే మానవసంబంధాలే పుటుక్కున విరిగిపోతాయనీ విశ్లేషించిన గొప్ప విలువల కథలు. ఒకటి పురాణాల్లోని నీతిని పిల్లలు ఎలా అర్థం చేసుకోవాలో చెబితే, మరొకటి సమకాలీన ప్రపంచంలో మనిషితనం పుటుక్కున తెగిపోతున్న వైనాన్ని హృద్యంగా చెప్పింది.

 

వాటిలో తొలి ప్రచురణగా ‘అవిశ్వాసం’ అనే ఉత్కృష్టమైన విలువల కథను ఈ డిసెంబర్ సంచికలో ప్రచురణకు స్వీకరించడమైంది. జూలై మొదట్లో పంపిన ఈ కథలను నాలుగు నెలల తర్వాతి చందమామలోనే వేయడం కుదిరింది. (ఎందుకంటే అప్పటికే చందమామ నాలుగు నెలల కంటెంటును అడ్వాన్స్‌గా ముగించేసింది.) కథ చూడగానే మనసుకు హత్తుకుపోయింది.

 

తల్లిదండ్రులు లేని పిల్లాడిని దశాబ్దాలపాటు తన వద్ద ఉంచుకుని తన షాపులో పెట్టుకుని ఆప్తబంధువులా చూసుకున్న ఒక యజమాని చివరకు తన ఇంట్లో విలువైన నగ పోయిందనిపించిన్పప్పుడు తన కింద పనిచేసే వాడే తీసుకుని ఉంటాడని అనుమానించి, ‘ఏదో ఒక బలహీన క్షణంలో నువ్వే తీసుకుని ఉంటావు. ఎవరికీ చెప్పనులే. ఆ నగను నువ్వే తీసుకొచ్చి దాని స్థానంలో ఉంచు’ అని అక్కడినుంచి ఇంట్లోకి వెళ్లి  చూస్తే, యజమాని వాడే దుప్పటి మడతల్లోనే ఆ నగ ఉంటుంది.  పొరపాటు గ్రహించి ఆ యజమాని ‘తప్పునీది కాదు నాది’ అన్నప్పుడు అప్పటికే గుండె పగిలి ఇల్లు వదిలి పోతూన్న సేవకుడు అంటాడొకమాట.

 

‘పొరపాటు మీది కాదు. నాది బాబుగారూ.. మీరేమో నన్ను దొంగ అనుకున్నారు. నేనేమో మిమ్మల్ని పెద్ద మనిషి అనుకున్నాను అంతే..

మానవ సంబంధాలన్నీ పరస్పర విశ్వాసం మీదే నడుస్తాయి.  అది చెదిరి మనసు విరిగితే మంచివాళ్లు మరక్కడ ఉండలేరు.”

 

ఆస్తి కూడిన వాడి ఆలోచనలు, ఆస్తి లేని వాడి ఆలోచనలు ఎంత తేడాతో ఉంటాయో, ఎంత దూరదూరంగా ఉంటాయో చెప్పిన అద్భుతమైన కథ ఇది. కింది వాక్యాన్ని మరోసారి చూడండి

 

‘మీరేమో నన్ను దొంగ అనుకున్నారు. నేనేమో మిమ్మల్ని పెద్ద మనిషి అనుకున్నాను…’

 

ఇంతకు మించి ఎవరినీ మారణాయుధంతో పొడవనసరం లేదు. ఇంతకు మించి మరెవ్వరినీ కత్తులతో కుళ్లబొడవనవసరం లేదు.. మనిషి మాటకున్న మహిమాన్విత శక్తిని ఇంతగా వ్యక్తీకరించిన గొప్ప వాక్యాన్ని ఇటీవల కాలంలో నేనయితే చూడలేదు.

 

తొలి చందమామ కథ ‘పొట్టిపిచుక’లో పదహారేళ్ల వయసులో ఆయన ప్రదర్శించిన ఆ విరుపు ఆయనను జీవితాంతం వదలిపెట్టలేదు. బహుశా ఆయన రాసిన చివరి కథల్లో ఒకటై ఉండగల ఈ ‘అవిశ్వాసం’ కథ కూడా విశ్వాసం చెదరడం అనే గొప్ప విలువను మహాకావ్య స్పురణతో చూపించింది.

 

తెలుగు సాహిత్యం ఎంత గొప్ప కథకుడిని పోగొట్టుకుందో బహుశా ఇప్పటికిప్పుడే ఎవరికీ అర్థం కాకపోవచ్చు. ఎంత గొప్ప విరుపుతో కూడిన రచనా శక్తిని మనం పొగొట్టుకున్నామో ఇప్పుడిప్పుడే మనకు బోధపడకపోవచ్చు. చివరకి ఇటీవలే ఆయన స్వాతి పత్రికలో రాసిన సరస రాహిత్యంతో కూడిన సరసమైన కథ భార్యాభర్తల సంబంధాల మధ్య ఘర్షణను, మారుతున్నసంబంధాలను కూడా కొత్త ధోరణితో ముగించి షాక్ తెప్పించింది.

 

‘అనుమతివ్వక పోతే అటాక్ కూడా చేయలేడు వాడు…’ అంటూ భర్తను భార్య కామెంట్ చేయగలగటం.. ఇంత వినూత్నశైలితో ఆయనకు కాక మరెవ్వరికి సాధ్యమవుతుంది.

 

తొలి చందమామకు కథ పంపిన అవసరాల మాష్టారు తమ జీవితం చివరి క్షణాల్లో కూడా చందమామకు ఒక ఆపూర్వ గౌరవాన్ని కట్టపెట్టి మరీ పోయారు. ఆయన చివరి రెండు కథలు కూడా చందమామకే పంపారనుకుంటున్నాను. ఈ జూలై తర్వాత ఆయన ఇతర కొత్త కథలు రాశారా లేదా అనే విషయం ఇంకా తేలవలసిందే. ఒకటి మాత్రం నిజం. తమ తొలి కథను చందమామకు పంపిన అవసరాల గారు, తమ చివరి రచనల్లో కూడా రెండింటిని ఆ పత్రికకే పంపారు.

 

చందమామకు వారు తమ తొలి కథ పంపినప్పుడు ఇప్పుడు చందమామలో పనిచేస్తున్న వాళ్లం ఎవరూ పుట్టలేదు. -చిత్రకారులు శంకర్ గారు తప్ప- కాని వారి చివరి కథలను స్వీకరించగలిగిన మహద్భాగ్యం మాకు దక్కింది. ఇంతకంటే మించిన జన్మ సార్ధకమైన ఘటన మరొకటి ఏముంటుంది?

 

 

పక్క భాషలు నేర్చుకోని పోగాలం మనది

ఆయన తమ చందమామ జ్ఞాపకాలు, కొత్త కథ ‘విజయమాల’ పంపిన తర్వాత -18-02-2011- ఫోన్‌లో మాట్లాడుతూ, తెలుగు భాషపై పిచ్చి అభిమానంతో, తాను ఇతర ప్రాంతీయ భాషలను నేర్చుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. చందమామతో తన సంబంధం మొదటి దశకే పరిమితమని తర్వాత వృత్తి రీత్యా ఇంగ్లీష్ లెక్చరర్‌గా, రీడర్‌గా ఒరిస్సాలో దశాబ్దాలు పనిచేసి రిటైరయ్యానని, ఆ ప్రభుత్వం, ఆ ప్రజల ఉప్పుతిని, ఇప్పటికీ వారి ఫించను తింటూ, వారి భాషను నేర్చుకోకపోవడం కంటే మించిన పోగాలం -పొయ్యేకాలం- మరొకటి లేదని ఆయన నొక్కి చెప్పారు.

 

బహుభాషల నిలయమైన మన దేశంలో అంతర్జాతీయ భాషకు ఇస్తున్న ప్రాధాన్యంలో ఒక శాతం కూడా మన ఇరుగు పొరుగు రాష్ట్రాల భాషలకు ఇవ్వలేకపోతున్నామని ఆయన బాధపడ్డారు.

 

ఒరియా ఎలాగూ నేర్చుకోలేకపోయాను. సంస్కృతాన్నయినా పట్టుకుందాం… అని గతంలోనే ఈయన ప్రయత్నించారట. కాని సంస్కృతం పుస్తకం తెరిచి పట్టుకుంటే దాంట్లోనూ తనను తెలుగుపదమే వెంటాడేదని, దాంతో సంస్కృతాన్ని కూడా పక్కన పెట్టేశానని చెప్పారు. మూడు దశాబ్దాలకు పైగా ఒరిస్సాలో ఉండి కూడా చాకలివారితో పనిబడినప్పుడు, అంగడి అవసరాలకు మాత్రమే చిన్న చిన్న ఒరియా పదాలను ఉపయోగించేవాడిని తప్ప ఆ భాష మూలంలోకి వెళ్లలేకపోయానని నిజంగా ఇది పోగాలమేనని చెప్పారాయన.

 

పోగాలం అనే పదం తెలుగులో వాడితే దాన్ని ఇతర భాషలవారు చస్తే అర్థం చేసుకోలేరని, అనువదించలేరని, నామవాచకానికి బదులు నాలుగైదు పదాలలో వివరిస్తేగాని ఈ పదం ఇతరులకు అర్థంకాదని, ఇది మొత్తం మీద మన అన్య భాషా దారిద్ర్యమేనని ఆయన తేల్చి చెప్పారు. మన పొరుగున ఉన్న భాషను మనం నేర్చుకోలేకపోతున్నామంటే అది పొరుగు భాష పట్ల మనకున్న చిన్నచూపే కారణమని. ప్రయత్నించీ నేర్చుకోలేక పోతున్నామంటూ ఎన్ని కుంటి సాకులు చెప్పినా, పొరుగు భాషపట్ల మనకున్న కించభావమే ప్రధానమని. ఆయన తేల్చేశారు.

 

వృత్తి జీవితమంతా ఇంగ్లీష్ టీచింగే అయినప్పటికీ తెలుగు అంటే విపరీత వ్యామోహంతోనే గత 64 ఏళ్ల కాలంలో వెయ్యిరచనలు తెలుగులోనే చేయగలిగానని, మన రచనలు ఇంగ్లీషుతో  సహా ఇతర భాషలలోకి అనువదించుకోలేక పోవటానికి శక్తి లేకపోవడం కాకుండా మన భాషా దురభిమానమే కారణమవుతోందని ఆయన గట్టి అభిప్రాయం. ఇది పనికిరాదని, ఇలాంటి పిచ్చి అభిమానం మనకే మేలూ చేయదని అంటారు.

 

ఈ సందర్భంగానే తన వయసు కథకులు, రచయితలు కంప్యూటర్ టైపింగ్, అంతర్జాలం వంటి ఆధునిక సాంకేతిక జ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో వెనుకబడిపోయామని, కాగితంపై కలంతో రాసే పద్ధతిపై మక్కువను మాతరం పోగొట్టుకోలేకపోతోందని, ఒకవిధంగా ఇది మా చేతకానితనమేనని ఆయన శషభిషలు లేకుండా ఒప్పేసుకున్నారు. ఆధునిక సమాజం తెస్తున్న మార్పుల్లో కొన్నింటికి మేము దూరంగానే ఉంటున్నామని ఆయన చెప్పిన తీరులో బాధకంటే పాతతరం తమ సౌకర్యాలను కొన్నింటిని వదులుకోలేదన్న స్పృహే వ్యక్తమయిందని నాకనిపించింది.

 

చందమామలో తప్పిన అవకాశం

అప్పట్లోనే కొడవటిగంటి కుటుంబరావు గారు తనకు ఉత్తరం రాస్తూ ‘మీరు ఒరిస్సాలో ఉన్నారు కనుక ఒరియా చందమామను సరిదిద్దే పని చేపట్టవచ్చు’ కదా అని అవసరాల గారిని అడిగారట. జీవితంలో అది ఎంత మహత్తరమైన ప్రతిపాదనో -ఆఫర్- మీకు తెలిసే ఉంటుందని, కాని ఆ ఆఫర్ అందుకోవాలంటే అర్హత ఉండాలని, ఒరియాలో అక్షరమ్ముక్క రాయలేని, చదవలేని నాకు ఎలా అది సాధ్యపడుతుందని ఆయన చెబుతోంటే కంఠంలో జీర.

 

కుటుంబరావు గారు కూడా 30 ఏళ్లు చెన్నయ్‌లో ఉంటూ కూడా తమిళంలో అక్షరం ముక్క మాట్లాడేవారు కారని, చందమామ సీరియల్స్ రచయిత దాసరి సుబ్రహ్మణ్యం గారు 54 ఏళ్లు చెన్నయ్‌లో చందమామ పనిలో ఉండి కూడా తమిళం నేర్చుకోలేకపోయారని నాకు తెలిసిన సమాచారం చెబితే. నిజంగా ఇది మనభాషపై ఉన్న మక్కువ ప్రభావమేనని కానీ ఇలాంటి వైఖరి, స్వంత భాషపట్ల మాత్రమే అభిమానం, మనకు చాలా నష్టకరంగా మారుతుందని, ఏ రకంగా చూసినా మన భాషకే కట్టుబడిపోవడం సరైంది కాదని అన్నారు.

 

1996 నుంచి నేనూ చెన్నయ్‌లో ఉంటున్నప్పటికీ, ఏంగా, పోంగా, వాంగా అనే మార్కెట్ లాంగ్వేజ్ తప్ప తమిళం కుదురుగా మాట్లాడటం, రాయడం, చదవడం తెలియదని నేనూ సిగ్గుపడుతూ చెబితే నవ్వారాయన. మనందరికీ ఒకే పోగాలమేనని ఆయన భావన. ఒక రాష్ట్రంలో ఉంటూ కూడా వారి తిండి తింటూ కూడా వారి భాషను నేర్చుకోలేకపోవడం జాతీయ దౌర్భాగ్యమని ఈయన అభిప్రాయం.

 

చివరగా, చందమామతో తన ముచ్చట్లు చాలా పాతకాలానికి మాత్రమే పరిమితమయ్యాయని వృత్తి జీవితంలో, రచనా వ్యాపకంలో కూడా అంతర్ముఖత్వంతో గడపడం వల్ల తనకు ఎవరితోనూ పెద్దగా పరిచయాలు లేవని చెప్పారాయన. పాతకాలం రచయితలంతా ఇలాంటి అంతర్ముఖత్వంతో కూడిన ప్రపంచంలోనే గడిపేశారని, పదిమంది నోళ్లల్లో నానాలనే లేశమాత్రపు కోరిక కూడా పాతతరానికి లేదని చెబుతూ కొన్ని వివరాలు తనతో పంచుకున్నాను.

 

చివరకు చందమామ జ్ఞాపకాలను చాలా త్వరగా ముగించినట్లుంది, ఇంకొంచెం వివరంగా రాసి ఉంటే బాగుండేదేమో అని అడిగితే ‘ఇంతకు మించి రాస్తే డబ్బా కొట్టుకున్నట్లే, 60 ఏళ్ల క్రితం నాటి విషయాలు ఎన్ని పుటల్లో చెప్పాలి అంటూ, ముగించారు. కందపద్యం అంటే తనకు చాలా ఇష్టం అయినా, నాలుగు పాదాలకు బదులు రెండు పాదాలే రాసి చదువుకుని సంతోషించేవారట.

 

ఆరోగ్యం బాగే కదా అని అడిగితే, రాయడమే ఆరోగ్యం, మనసుకు పనిపెట్టడమే ఆరోగ్యం అన్నారు. ఇప్పటికీ నిరంతరం రాస్తూన్నాను కనుకే ఆరోగ్యం తన కట్టుబాటులో ఉందని చెప్పారు. మీరిలాగే ఓపిగ్గా, ఆరోగ్యంగా ఉంటూ చందమామకు కూడా కథలు పంపుతూ ఉండండి అని అడిగితే, రాస్తుండటమే పెద్ద ఓపిక, అదే పెద్ద ఆరోగ్యం అని నవ్వేశారు. రాయకుంటే అనారోగ్యమేనట. గతంలో రాసిన పుస్తకం పంపుతానని, అంగ్రేజీ యమఈజీ పుస్తకం కూడా త్వరలో రానుందని చెప్పారు.

 

పెద్దల చిర జ్ఞాపకాల్లో ‘అవసరాల’

“ఏదయినా మనస్సుకి నచ్చిన పనయితే పసిపిల్లాడిలాగ పొంగిపోయి పండగ చేసే మనిషి. తన జీవితంలో ‘రచన’ని అద్భుతమైన ఆటవిడుపుని చేసుకున్న మనిషి. ఆయన రచనల్లో సాంద్రత వయస్సుతోపాటు చిక్కనయింది.

ఆయనకి దేవుడూ, దెయ్యాల మీద నమ్మకం లేదు. నేను కేవలం పరమార్ధాన్ని నమ్ముకున్న ఓ వైష్ణువుని కథ “సాయంకాలమైంది” నవల రాశాను. ఇండియా టు డే పత్రికకి సమీక్షని రాశారు అవసరాల. బహుశా అందులోంచి పరమార్థాన్ని మినహాయించి ‘పలుకు’ని పట్టుకోవడం ఆయన కత్తి మీద చేసిన సాము అనుకుంటాను. నవ్వుకున్నాను. పైగా నాకు మిత్రులు. చాలా హృద్యంగా, పెద్దరికంతో రాశారు.”

గొల్లపూడి మారుతీరావు

 

‘ఆయన కథలెలా వ్రాస్తారో అలాగే మాట్లాడతారు. ఉత్తరాలూ అలాగే రాస్తారు. ఒక పూలమొక్క వందలాదిపూలను అవలీలగా పూయగలిగినట్లు ఆయన కథలను రాయగల్గుతారు. అందుకేనేమో ఆయన భాషకు పూల పరిమళం అబ్బింది.’

“తన భార్య శారద గురించి ‘నేను మనుషుల్లో పాత్రల్ని చూస్తే ఆమె దేవుణ్ణి చూస్తుంది’ అన్న అక్షరసత్యాలు ఆయన అసాధారణ పరిశీలనాశక్తికి మరో నిదర్శనం. వయసుతో కాక కాలంతో నడిచే ఆయన ఆధునిక దృక్పథం ఎందరో కుహనా ఆధునికులకు కనువిప్పు.”

వసుంధర

 

“ఇప్పుడు అక్షరాలకు కితకితలు ఎవరు పెడతారు? పదాల్ని విరిచి తురుపుముక్కల్లా గురిపెట్టే తుంటరి ఏడి? కథలల్లినా, కబుర్లతో గిల్లినా, అంగ్రేజీ మేడీజీలు పన్నినా, మేథమేట్రిక్సు చేసినా.. అంతటా ఒకటే పెంకితనం. ఆ గుక్కపెట్టే అల్లరి, గగ్గోలు పెట్టే గడుగ్గాయితనాన్ని తెలుగువారు ఇక చూడలేరు.

ప్రతిరోజూ నియమంగా కొన్ని రచనలు చేయనిదే నిద్రాసుందరిని సైతం చేపట్టననీ, వయసుకీ ఆలోచనకీ సంకల్పానికీ ఆచరణకీ ఏజ్‌బారు లేదనీ గడుసుగా సమాధానమిచ్చే కథకుడాయన.

కథ పుట్టి పాకటం మొదలుపెట్టి, తప్పటడుగులు వేసే కాలంలోనే ఆయన కలం చేతపట్టారు. విశాఖ సాక్షిగా తెలుగు కథను రెండు భుజాలకెత్తుకున్నవారిలో ఒకరు భరాగో (భమిడిపాటి రామగోపాలం) రెండో వ్యక్తి అవసరాల.

ఇట్లు మీ విధేయుణ్ణంటూ భరాగో చెంప చెళ్లుమనిపిస్తుంటే, ఇట్లు మీ అవిధేయుణ్ణనగల సాహసం అవసరాల వారికే సొంతం. ఈ సరళసుందర శైలికి మాటవిరుపు సొగసునద్దింది. మాటవెనుక ఈ విరుపు వెనుక గడుసుదనం వీరికి పాఠకుల్ని సంపాదించిపెట్టింది.

ఆయన దృష్టిలో వైవిధ్యం లేని రచనా, పద్దుల పుస్తకమూ ఒక్కటే. పిల్లలంటే ఇష్టం, మంచి సినిమాలంటే ఇష్టం. పొడవాటి జడ ఇష్టం. జుట్టు  కత్తిరించుకునే ఆడవాళ్లంటే కోపం. ఎక్కడా చేయి చాపని వ్యక్తిత్వం. అందరూ తల బిరుసు అనుకున్నా సరే తల ఎత్తుకునే తిరగాలనుకోవటం ఆయన సహజ లక్షణాలు. కొంటెతనం, కుర్రతనం మూర్తీభవించిన రూపం, మాటా, చేతా, వెనుక వందమంది భరించగలిగే దుఃఖం ఉండేది. దుఃఖాన్ని పాయసంలా మధురంగా సేవించగలిగే చిత్తస్థైర్యం ఆయనకే సొంతం.

నిజంగా నాస్తికుణ్ణని చెప్పుకునేవాడు చనిపోయాక కర్మకాండ ఎన్నిరోజులు జరగాలో చెప్పి మరీ చనిపోయేవాళ్లను మనం చూస్తున్నాం. కానీ ఆయన మరణానంతరం తన శరీరం మొత్తం నలుగురికీ ఉపయోగపడాలని రాసిపెట్టారు.”

డాక్టర్ అద్దంకి శ్రీనివాస్

 

వసుంధర గారు తమ అక్షరజాలం బ్లాగులో చెప్పినట్లుగా, ఈనాడు (అక్టోబర్ 29) దినపత్రికలో ఈ కథాకదన భీష్ముడికి డా. అద్దంకి శ్రీనివాస్ అర్పించిన నివాళి, అవసరాల వారి అసంఖ్యాక అభిమానుల మనోభావాల్ని అద్భుతంగా ప్రదర్శించింది.

 

తెలుగు అక్షరాలతో ‘అవసరాల’ వారి కితకితలు

“తెచ్చిన పూలూ నలభై ఒకటీ, ఇచ్చిన సంఖ్యరా ఇరవదైదురా వినరా సోదరా, తెచ్చిన పూలూ నలభై ఒకటీ, ఇచ్చినవరవై నాలుగు చికిలీ, చీకిలీ గిలిగీ గిలిగీ చికిలీ, చికలిక గిలిగిక, గిలిగిక చికిలిక కిల కిల కిల కిల…..”

ఇది తెలుగు బాష నిసర్గ సుందర రామణీయకతకు పట్టుగొమ్మ లాంటి వాక్య, పద గుంఫనం. ఈ చికలీ, గిలిగీ, చికలిక కిల కిల భాష మాధుర్యాన్ని చూడాలంటే అవసరాల గారు 55 ఏళ్ల క్రితం రాసిన ‘గణిత విశారద’ నవల చదవి తీరాల్సిందే. గణిత సూత్రాలను నవలారూపంలో అదీ పిల్లలకోసం రాసి పెద్దలను కూడా రంజింపజేసిన కమ్మటి కలం ఆయన సొత్తు.

ఆయన వాడిన భాష, పదకేళి కాల్పనిక సాహిత్యంలో ఆయనకొక ప్రత్యేక స్థానాన్ని సంపాదించిపెట్టాయి. ఆయన రచనలు కొన్ని అనువాదానికి సైతం అందని రీతిలో ఉండేవని సాహితీ ప్రియులు అంటున్న మాటలకు పై పదాలతో సయ్యాటే గొప్ప రుజువు. ప్రపంచంలో ఏ చెయ్యి తిరిగిన అనువాదకులైనా సరే పై చికిలిక గిలిగిక పదాలను అనువదించలేరని ఘంటాపథంగా చెప్పవచ్చు.

మనసులో మాట బ్లాగర్ సుజాత గారు పొందుపర్చిన కింది వాక్యాలు సరిగ్గా అయిదేళ్ల క్రితం తన జీవితానికి తానే రాసుకున్న ముగింపును అత్యద్భుతంగా ఇలా కూర్చాయి.

 

నా కథకు ముగింపు నాదే!

ఎన్ని కథలు రాసి ఎంతగా చెబితేనేం, కార్యాచరణ కాకపోయాక అనే వేదన నన్ను బాధిస్తోంది. దాన్నుంచి విముక్తి పొందడానికే ఈ మధ్య ఓ ప్రయత్నం మొదలెట్టాను. ఎంతగా ఆరోగ్యంగా ఉన్నా, దెబ్భై ఐదేళ్ళు తెగ వాడేసిన నా శరీర భాగాలు, ఎప్పుడో అప్పుడు నన్ను గుటుక్కుమనిపించక మానవు. నా శవానికి పిండ ప్రదానాల తంతు కాదని,వైద్య కళాశాలకు దానం చేసే ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను. బతికున్న వాళ్ళనే చంపేసే ఏ వైద్య కళాశాలకు పరిశోధన నిమిత్తం దానం చేస్తారా అనే సందేహం లేకపోలేదు. శవాలను తరలించే ఈ ఉద్యమానికి మృత దేహ దాన సమితి అనే పేరు గల సంస్థగా రూపు దిద్దే సదుద్దేశంతో ఉన్నాను. బ్రాహ్మణుడిగా పుట్టావు. ఇదేం దుర్బుద్ధి. పుట్టగతులు లేకుండా పోతావ్ అనే ఆప్తుల అభిప్రాయానికి నేను తలవంచను. ఏ కులానికి తగిన అపర కర్మ ప్రక్రియలు దానికి ఉండనే ఉంటాయి. చచ్చాకయినా మనిషిగా గుర్తించబడితే అంతే చాలు. ఈ నా కథకు ముగింపు ఇలాగే ఉండాలి.

కర్మ సిద్ధాంతం మీద ఇదే నా చావు దెబ్బ!”

అన్నట్టుగానే ఆయన మరణానంతరం తన దేహాన్ని ఉస్మానియా వైద్య కళాశాలకు ఇచ్చేశారు.

ఆయన మాన్యుడే… సందేహం లేదు. కాని ఆయన చివరి కోరికను సఫలం చేసే విషయంలో ఆయన కుటుంబం తీసుకున్న వైఖరి మరింత ప్రశంసనీయమైంది.

ఈ నిరంతర శ్రామికుడి మొబైల్ నంబర్ 9866221575.

ఇది 28-11-2011 నుంచి మూగపోయింది.

గడచిన తరాల నిరాడంబరత్వానికి, నమ్రతకు ప్రతిరూపంగా కనిపించే చందమామ అలనాటి, నేటి కథకుడా జోహార్లు.

 

 

 

10 thoughts on “అవసరాల రామకృష్ణారావు రచన-జీవితం-వ్యక్తిత్వం

 1. Ma Swagramam Tuni
  Rani Subhadramma Peta

  Mastaru Maku chinna natinudi AAtmeeyulu.
  Enda kalam salavullo Tatagarintiki(Tuni) vellevallam. Kani rojantha Collector gari (Avasarala Jaganndha Rao Pantulu Garu) intlo ne chala sarada ga adukune vallam. Mastaru Garu tolu bommalata Kuda ayane swayam ga Tayaru chesi adinchevaru. Aa chinna tanam lo enta anandamo cheppalenu.Aa Entllo eppudu pillalu saradga kalam gadipe varu.
  Mastaru garni chala kalam kalustu unde vallam

  Varu Eka leru ani telisi chala vicharinchamu.
  Vari pavitra Atma ku Santhi Kalagalani Korukontunnamu

  Sistla Somayajulu(Chanti)

 2. శివరామ ప్రసాద్ గారు మీ సమీక్ష మాలిక పత్రికకు తప్పుకుండా పంపొచ్చు. వచ్చే సంక్రాంతి సంచికలో ప్రచురించగలం.. ధన్యవాదాలు.

 3. శ్రీ శివరామ్ ప్రసాద్ గారూ
  నమస్తే. తప్పకుండా మీరు అవసరాల గారి నవలపై సమీక్ష లేదా పరిచయం రాసి పంపగలరు. మాలిక సంపాదక బృందం అంగీకరిస్తే, సంక్రాంతి సంచికలోనే దాన్ని ప్రచురించవచ్చు కదా..
  అంతకు మించి, దాదాపు ఏడేళ్లకు పైబడి ఆయనతో మీకు పరిచయం ఉంది కాబట్టి, ఆయన గురించిన మీ జ్ఞాపకాలను వీలైనంత త్వరగా మరో వ్యాసంగా కూడా రాయగలరు. ఆయన అభిమానులందరికీ ఇది అవసరం.
  అరుదైన మనీషిని వ్యక్తిగా, రచనాపరంగా కూడా పోగొట్టుకున్నాం.
  ధన్యవాదాలు.
  నా చందమామలు బ్లాగులో ఆయనపై ప్రచురించిన కథనాలు కూడా చూడండి.

  blaagu.com/chandamamalu

  kanthisena.blogspot.com

  రాజు, చందమామ, చెన్నయ్
  mobile: 7305018409
  Email:krajasekhara@gmail.com

  ఎన్నెల గారూ,
  మీ ప్రశంసకు అర్హుడిని కానేమో… మీ ఔదార్యానికి కృతజ్ఞతలు. మీ రచన ఈ దఫా మాలికలో రాలేదు. కారణం?

 4. Rajesekhargaru,
  I have gone through your response to Ms.Padmavati’s views on Avasaralavari, ‘ Sampengalu and Sannajajulu’ novel. Having settled in Vizag from April 2002, I got acquainted with Sri A. Ramakrishna Rao and developed a close personal rapport with him. Our bond became stronger day by day. On 2.5.2005, he visited me and requested me to review his novel ‘Headmistress Hemalata’ as a part of PhD thesis for Sri Potti Sriramullu University. At that time he very kindly presented me and my wife a copy of his novel Sampengalu and sannajajulu’ and said both of us must read it. I am a journalist and writer. If you desire, I will review the novel as a tribute to the memory of Sri Avasarala Ramakrishna Rao, whose demise is a personal loss to all his admirers
  With warm personal regards, M.S.R.Prasad, Visakhapatnam
  Cell:9866664964, L/L:0891-2701364

 5. మీ వ్యాసం అవసరాల మాస్టారు గారి ఆత్మకు శాంతి చేకూరేదిగా ఉంది..వ్యాసమైనా , పరిచయమైనా, కామెంట్ అయినా…మీరు వ్రాసినంత వివరంగా ఎవ్వరూ వ్రాయలేరంటే అతిశయోక్తి కాదు రాజశేఖర్ గారూ!!మీ రచన మాస్టారు గారి మీద ఆప్యాయతతో బాటు చందమామతో మీకున్న గాఢమైన అనుబంధాన్ని, ప్రేమనీ వ్యక్తం చేస్తోంది. మీలాంటి వ్యక్తులని తన సేవకి ఎంచుకున్న చందమామ నిజంగా ధన్యుడు(ధన్యురాలు).

 6. పద్మావతి గారికి,
  ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించాలి. ‘సంపెంగలు సన్నజాజులు’ గురించి హృద్యమైన వ్యాఖ్య పంపారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి అందమైన భాష్యం అంటూ నవలను ప్రశంసించారు. మీమీద పెద్ద భారం పెట్టాలనుంది. ఒక పాఠకురాలిగా, మీ మనసు గది తలుపులను స్పృశించిన అవసరాల గారి ఈ నవలను మీరే ఎందుకు పరిచయం చేయకూడదు. ఇది ఇప్పుడు అందుబాటులో ఉందో లేదో తెలియదు. కనీసం మీ స్పందన సమీక్ష లేదా పరిచయం ద్వారా వస్తే ఆయన అభిమానులకూ, పాఠకులకూ మేలు జరుగుతుందని నా అభిప్రాయం. ఏమాత్రం అవకాశం ఉంటే ఈ పని చేసిపెట్టండి ప్లీజ్.

 7. “బాలజ్యోతి లో మేధమేట్రిక్స్ పజిల్స్ పోరాడుతూ ఎదిగిన బాల్యం నాది. నేర్చుకున్న చదువు, తెచ్చుకున్న ఉద్యోగాలలో ఆయన భాగం ఉంది.”
  రవిగారూ, మీ సహానుభూతికి ధన్యవాదాలు. నిజమైన గురు స్మరణ మీది.

  ఆయనను విడిగా కలిసి ఓ పూట గడపాలని, ఆయన ‘విరుపు’ నేరుగా కూర్చుని ఆస్వాదించాలని నాకూ ఎంతో ఆశగా ఉండేది. కాని ఫోన్ పలకరింపులే తప్ప కలవలేకపోయాను.

  మన కళ్లముందు కాంతిమంతంగా తిరుగుతూ ఉంటున్న వయో వృద్ధులు మనలను అప్పుడే విడిచి పోలేరులే అనే విశ్వాసం మనకు కాస్త ఎక్కువే కాబట్టి ఇలా జరుగుతోందేమో మరి.

  “ఓ బడుగు జీవి తను కష్టపడి సాధించుకున్నది అది వేషమే ఔగాక, పోగొట్టుకుంటుంది.”
  ఈ కథనంలోని పై వాక్యంలో ‘అది వేషమే ఔగాక’ ను ‘అది లేశమే ఔగాక’ అని సవరించి చదువుకోవాలి.

 8. Avasarala vari Sampengalu Sannajajulu ane navala
  chadivi ayana abhimanini ayipoyanu.Chadivina tharuvatha oka goppa pusthakam chavina anubhoothi,anna chellella anubandhaniki andamaina bhashyam chepparu ayana.Naa manasu anandantho nindipoyindi.Suthi methani manasu gadi thalupulani sprusinchindi anduloni prathee pagee.

 9. “కుసుమస్తబకస్యేవ ద్వయీవృత్తిర్మనస్వినః” – ఈ శ్లోకం గుర్తొస్తుంది, ఈయనను తల్చుకుంటే. వ్యక్తిగతంగా నేను ఆయనకు కొంత ఋణపడి ఉన్నాను.బాలజ్యోతి లో మేధమేట్రిక్స్ పజిల్స్ పోరాడుతూ ఎదిగిన బాల్యం నాది. నేర్చుకున్న చదువు, తెచ్చుకున్న ఉద్యోగాలలో ఆయన భాగం ఉంది. ఆయనను విశాఖపట్నం వెళ్ళి కలవాలని చాలాకాలంగా నాకొక బలమైన ఆశ ఉండేది. కుదరకుండా పోయింది.పర్వాలేదు.

  “పక్క భాషలు నేర్చుకోని పోగాలం మనది” – ఈ పోగాలం అయినా దగ్గరకు చేరనీకుండా ఉండడానికి కృషి చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Trying to get property of non-object in /var/www/html/maalika/magazine/wp-content/plugins/jetpack/modules/gravatar-hovercards.php on line 238