May 19, 2024

భక్తులను భద్రంగాకాచే భద్రకాళి అమ్మవారు


 

భద్రకాళి అనగానే వరంగల్, వరంగల్ అనగానే భద్రకాళి ఆలయం గుర్తొస్తుంది.  అసలు ఈ ఆలయం ఎప్పుడు నిర్మింపబడిందో,   ఆ అమ్మలగన్న అమ్మ అక్కడ వెలిసి ఎన్ని శతాబ్దాలయిందో ఎవరూ సరిగ్గా చెప్పలేరు.  అతి పురాతనమైన ఈ దేవిని అనాదిగా అనేకమంది ఋషులు, సిధ్ధులు, దేవతలు అరాధించారుట.  పూర్వం రాజులు యుధ్ధాలకు వెళ్ళేటప్పుడు తమ ఇష్ట దైవాలకు పూజలు చేసి వెళ్తూండేవాళ్ళుట.  అలాగే  చాళుక్య చక్రవర్తి అయిన రెండవ పులకేశి వేంగి దేశంమీద యుధ్ధానికి వెళ్తూ ఈ దేవిని పూజించి వెళ్ళాడుట.  విజయం సాధించిన తర్వాత క్రీ.శ. 625 ప్రాంతంలో అమ్మవారికి ఆలయం నిర్మించాడు.

 

తరువాత కాలంలో కాకతీయ ప్రభువైన రుద్రమదేవుడు తన రాజధానిని ఓరుగల్లుకు మార్చినప్పుడు, ఈ ఆలయాన్ని అభివృధ్ధి చేశాడు.  తదనంతరం  కాకతీయ రాజు గణపతిదేవ చక్రవర్తి సమయంలో ఆయన మంత్రులలో ఒకరైన హరి ఈ ఆలయ సమీపంలో ఒక తటాకాన్ని త్రవ్వించాడు.  అంతేకాదు,  ఆలయ నిర్వహణకిగాను  కొంత భూమిని కూడా ఇచ్చాడు.  కాలగమనంలో కాకతీయ సామ్రాజ్య పతనంతో, ఈ దేవస్ధానం వైభవం కూడా క్షీణించింది.  సుమారు 925 సంవత్సరాలబాటు మహా వైభవంగా వెలుగొందిన ఈ దేవస్ధానం అన్య మతస్తులచే విధ్వంసంగావింపబడింది.  ఆలయ భూములు అన్యాక్రాంతమైనాయి.

 

భారతదేశ స్వాతంత్ర్యానంతరం శ్రీ మగన్ లాల్ సమేజ అనే ఆయన  స్వప్నంలో భద్రకాళి
అమ్మవారు దర్శనమిచ్చి ఆలయాన్ని పునరుధ్ధరించమని ఆదేశించారు.  ఆయన పెద్దలందరి సహకారంతో ఆలయం పునర్నిర్మించగా,  29-7-1950న సంప్రోక్షణ గావింపబడి నాటినుంచీ నిత్య పూజలతో దినదినాభివృధ్ధి అవుతోంది.

 

10 అడుగుల పైనే ఎత్తయిన అమ్మవారి విగ్రహం అష్ట భుజాలతో, వివిధ ఆయుధాలతో అలరారుతూంటుంది.  పూర్వం ఈ విగ్రహం భీకరంగా వుండేదట.    భక్తుల సౌకర్యార్ధం అమ్మవారిని ప్రశాంతంగా వుండేటట్లు తీర్చి దిద్దారు.  ఇప్పుడు ఆ తల్లిని ఎంతసేపు చూసినా తనివి తీరదు.

 

ఈ ఆలయంలో వున్న ఉపాలయాలు ప్రదక్షిణ మార్గంలో … శ్రీ వల్లభ గణపతి, ఆంజనేయస్వామి, శివాలయం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాలు.  ఆలయం ముందు విశాలమైన మండపంలో అమ్మవారి చిన్న విగ్రహంపెట్టి అక్కడ అమ్మవారికి ఒడిబియ్యమిస్తున్నారు వచ్చిన మహిళలంతా.  శ్రావణ మాసంలో ఈ ఒడిబియ్యం ఇచ్చేవారి సంఖ్య చాలా ఎక్కువ.  తెలంగాణా ప్రాంతంలో ఇంటి ఆడబడుచులకు ఒడి బియ్యం పెట్టే ఆచారం వుంది.  అమ్మవారిని తమ ఇంటి ఆడబడుచుగా భావించి ఆవిడకి ఒడిబియ్యంపెట్టి తరిస్తారు ఇక్కడి మహిళలు.

 

మేము అమ్మవారి దర్శనానికి శ్రావణమాసంలో వెళ్ళాము.  ఆ రోజు శుక్రవారం అవటంతో చాలా జనం వున్నారు.  అమ్మవారి వైభవాన్ని తమ ఛానల్స్ ద్వారా ప్రజలకు తెలియజెయ్యటానికి టీ వీ ఛానల్స్ వారు ఆలయాన్నీ, అమ్మవారినీ చిత్రీకరిస్తున్నారు.  ఇదే అవకాశమని నేనుకూడా పర్మిషన్ తీసుకుని అమ్మవారి ఫోటోలు తీశాను.  అలాంటి అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషించాను.  మీరు చూస్తున్న ఫోటోలన్నీ (శాకాంబరి అవతారం తప్ప) నేను తీసినవే.

 

విశాలమైన ఆలయం  ఇంకా విశాలమైన ప్రాంగణంతో, సుందరమైన పరిసరాలతో  చాలా ఆకర్షణీయంగా వుంటుంది.  ఆలయ పరిసరాలు అందంగా తీర్చిదిద్దటంతోబాటు చుట్టూవున్న గుట్టలమీద సమున్నతమైన దేవతా విగ్రహాలు నెలకొల్పి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.  పక్కనే వున్న తటాకం మీదనుంచి వచ్చే చల్లని గాలి సందర్శకుల సేద తీరుస్తూ ఆధ్యాత్మికతతోబాటు ఆహ్లాదాన్నీ అందిస్తూ వుంటుంది.  సాయం సమయంలో ఇక్కడి చెరువుమీదనుంచి వచ్చే చల్లగాలిని ఆస్వాదిస్తూ, సూర్యాస్తమయం తిలకించటం ఒక అద్భుతమైన అనుభవం.   ఇలాంటి అద్భుతమైన ప్రదేశం అవకాశం వున్నవారందరికీ అవశ్య దర్శనీయం.

 

 

 

 

 

1 thought on “భక్తులను భద్రంగాకాచే భద్రకాళి అమ్మవారు

  1. chakkagaa wraasaaru lakshmi gaaru, nenu oke oka saari choosaanu..mee post lo photo maatram down load kaavatledu naaku..chaalaa saarlu try chestunnaa…mallee try chestaa…kanipinchanivi choodaalani mahaa koriggaa untundi kadaa..hahaha…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *