June 14, 2024

రామో విగ్రహవాన్ ధర్మః

రచన : యఱ్ఱగుంట సుబ్బారావు

శ్రవ్యకం : డా.కౌటిల్య

 

||శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః||

ఉపక్రమము

ధర్మం సర్వమానవులకూ సుఖాన్నే కలిగిస్తుంది. ఎవని ధర్మాచరణము అతనియందెట్టి అలజడిని కలిగింపక, పశ్చాత్తాపానికి గుఱిచేయక మనస్సును శాంతంగా ఉంచుతుందో, అప్పుడది అతనికి ఆత్మతుష్టిని కలిగించినట్లవుతుంది. అలాంటి తుష్టి కలిగి ఉండటమే సుఖముఆ సుఖము -“సర్వభూతములు నా వంటివే” – అనే తలపువల్ల వస్తుంది. అట్టి తలపే ధర్మము. ఆ ధర్మాచరణము సర్వులకూ సుఖదాయకమవుతుంది.

కాని ప్రతిజీవికి తనయందు అనురాగముంటుంది. తన కోర్కెలని ఫలింపజేసుకొనుటవలన తనకు సుఖముండు ననుకొనును. అందువలన తన సుఖమునకై ఇతరుల సుఖములను హరింపదలచును.అట్టి తలంపు అధర్మము. ఆ అధర్మాచరణముతో ఆర్జించిన సుఖము పరిణామములో మానసికాందోళనను, పశ్చాత్తాపమును కలిగించును. సంగ్రహముగా, పరులకు సుఖమును ప్రాప్తింపచేయవలెనను స్వార్థరహిత భావము ధర్మము, స్వార్థపరత్వము అధర్మము.

రాజపత్నులమధ్య మాత్సర్యములున్నను, వారిలో రాజ్యసంపాదనమునకై తీవ్రవాంఛలున్నను, అవి రాముని ధార్మికనిష్ఠ వలన అంకురదశలోనే అణగిపోయినవి. రాజకుటుంబంమందుగాని, కోసలదేశమందుగాని ఎట్టి అంతర్గత అలజడులు లేవు. అశాంతియు లేదు. ఒక్క రాముని స్వార్థత్యాగము వలన సర్వులకు శాంతి లభించినది. సిరి సంపదలతో,సమాజోత్సవములతో కళకళలాడు లంకారాజ్యము, రాక్షసజాతి రావణుని స్వసుఖపరత్వమను అధర్మా చరణమువలన సర్వనాశనమును పొందినది. రాజకుటుంబమునెట్లు ధర్మమునందు నిలిపినది, తద్ద్వారా కోసలదేశమెట్లు ధర్మారామముగా పరిణామము చెందినది రాముని ధర్మాచరణమును పరిశీలించినచో బోధపడును.

ధర్మము రాముని వ్యక్తిత్వమందతటను అభివ్యాప్తమై ఉన్నది. ఇతరులతోడి రాముని ప్రతి అనుబంధము ధర్మబద్ధమై ఉన్నది. కొడుకుగా, సోదరుడుగా, భర్తగా, క్షత్రియుడుగా, మిత్రుడుగా, శత్రువుగా రాముని ఆచరణ ధర్మబద్ధమై ఉన్నది….ఆ రాముని ఒక్కొక్క ధర్మాచరణని విపులంగా పరిశీలిద్దాం……….

 

 

రాముని పుత్రధర్మము

రామాయణము ఒక ఉత్తమ ధార్మికగ్రంథము. రామాయణ కథానాయకుడైన రాముడు రూపుదాల్చిన ధర్మము-(“రామో విగ్రహవాన్ ధర్మః”, అర – ౩౭-౧౩). సమాజమందు వివిధ సంబంధముల వలన వివిధ రూపములనున్న ధర్మమును రాముడు ఆచరణముద్వారా ప్రదర్శించినాడు. తండ్రికి తనయుడుగా, తమ్ములకు అన్నగా, భార్యకు భర్తగా, స్నేహితులకు స్నేహితుడుగా, ప్రజలకు ప్రభువుగా, శత్రువులకు శత్రువుగా – ఆయా ధర్మములను ఆచరించుటయే గాక వానిని ఉన్నత శిఖరాలకు కొనిపోయినాడు.

రాముడు కేవలం ధర్మమూర్తియేగాక దయాద్యనేక గుణములకు నిలయమైనవాడు. అక్రౌర్యము,కృతజ్ఞత, ఉపకారబుద్ధి, దయాదాతృత్వములు మొదలగు సద్గుణములు ఆయనను వచ్చి చేరినవి. రామునియందున్న ఈ దయాధర్మములకు విరోధముగాని, సంఘర్షణముగాని కలుగక సమన్వయమును పొందినవి. ధర్మనిర్వహణదీక్ష దృఢముగాలేనిచో దయా ధర్మములకు సంఘర్షణము కలిగి మానసికక్షోభకు దారి తీయును”ప్రిన్స్ హేమ్లెట్” విషయమున అది అట్లు పరిణమించినది. తన తండ్రిని చంపిన పినతండ్రిని చంపి, పగతీర్చెదనని భూతరూపమున వచ్చిన తండ్రికి మాటయిచ్చి ప్రిన్స్ హేమ్లెట్ ప్రమాణము చేయును. కాని దాని నిర్వహణమునకు దయాద్యనేకభావములు, సంశయములు ఆటంకములైనవి. ఆ ఆటంకముల నధిగమించి తన విద్యుక్తధర్మాచరణమతనికి దుర్ఘటమైనది. చివరకు తన ప్రాణముపోవు సందర్భములో దానిని నిర్వహించినాడు. తన ధర్మనిర్వహణలో స్థిరచిత్తత లేకపోవుటవలననే తగిన సమయములో చేయలేకపోయినాడు. విషాదమునకు భాజనమైనాడు.

కాని, రాముడు మార్దవమును, స్థిరబుద్ధిని కలిగియున్నవాడు -(“మృదుశ్చ స్థిరచిత్తశ్చ” – ఆయో ౨-౩౨).తన ధర్మనిర్వహణమునకు దయాదిభావములు అడ్డుకొనినను, తన దృఢధర్మదీక్షతో వానిని తనకనుకూలముగా మలచుకొనినాడు. తండ్రి ఆనతి మేరకు తాను వనవాసము చేయవలసియున్నది. నిర్దోషియు,నిరపరాధియునైన తాను వనవాసము చేయుట తల్లికిగాని, సోదరులకుగాని, మంత్రి పురోహితాదులకు గాని, మిత్రులకుగాని, ప్రజలకుగాని సమ్మతము కాదు. నిష్కారణముగా తాను అడవులలో ఇడుములు పడుట వారికి దుఃఖకారణమైనది.రామునకు రాజ్యము పోయినందుకుగాని, వనవాసము చేయవలసి వచ్చినందుకుగాని విచారము లేదుకాని తన కష్టానికి దుఃఖించుచున్న కౌసల్యాదుల దుఃఖమునకు శోకించినాడు-( వ్యసనేషు మనుష్యాణాం భృశం భవతి దుఃఖితః”- అయో – ౨-౪౦)కైకేయి వలన తండ్రి సమక్షమున వనవాసానతిని స్వీకరించినపుడు రామునిలో ఎట్టి వ్యథ కనిపించలేదు-(“తదప్రియం……వచనం మరణోపమమ్, శృత్వా న సంవివ్యథే రామః”- అయో ౧౯-౧)- సామాన్యులకు అట్టి అప్రియవచనము మరణవిషయమువలే అప్రియమైనది. కాని రాముడా అప్రియ విషయమునకు వ్యథ చెందలేదు. అయితే ఈ హఠాత్ విపరిణామము కౌసల్యాదులనెట్లు కుదిపివేయునో అను విషయమును విచారించుట ప్రారంభించుటతో రామునిలో దుఃఖోదయమైనది. శోకమూర్తియైన లక్ష్మణుని, దీనవదనులైన ప్రజలను చూడగా  వృద్ధినందిన దయావేశము కౌసల్యాదేవి యెదుట బహిర్గతమైనది. అప్పటివరకు నిలిపియుంచిన దుఃఖము తల్లి దుఃఖమును చూచి దుర్నివార్యమై ప్రకటితమైనది.తల్లితో కలిసి తానును దుఃఖించినాడు.

ఇట్లు పరుల దుఃఖమునకు కరగిపోవు పరమకారుణికత్వము,ఎట్టిస్థితిలోనైనను చెక్కుచెదరని దృఢధర్మదీక్ష, రామునిని ఆశ్రయించి ఉన్నవిరామునియందున్న దయాధర్మములకు సంఘర్షణము లేదు. అందువలన ఆయనకు మానసికక్షోభ లేదుకాని కౌసల్యాదులవలన తన ధర్మ నిర్వహణమునకు బాహిరమైన ప్రతిఘటనమున్నది. వారు తమదైన ధర్మ దృష్టితో రాముని ధార్మికత్వమును ఎదుర్కొనినారు.

మున్ముందుగా ఈ ప్రతిఘటనము తల్లియైన కౌసల్యవలన కల్గినది. కౌసల్యాదేవి పేరునకు పట్టపుదేవియైనను భర్త్రనురాగమునకు, ఆదరణమునకు నోచుకొనలేదు. అనేక వ్రతోపవాస నియమాదులనాచరించి కనిన రాముడనిన ఆమెకు ప్రాణమురాముడు తన సద్గుణరాశితో తండ్రి , ప్రభువు అయిన దశరథునకు అత్యంత ప్రీతి పాత్రుడయినాడు జ్యేష్ఠుడు, గుణశ్రేష్ఠుడయిన రామునకు యౌవరాజ్యాభిషేకమునకు తండ్రి నిశ్చయించినాడు. ఎప్పటినుండియో తన మనస్సులోనున్న ఈ కోరిక సఫలమగుటకు కౌసల్య ఎంతగనో సంతోషించినది. సపత్నీతిరస్కారము, భర్తృ నిరాదరణమును భరించుచున్న ఆమెకు ఈ పరిణామము తన జీవితమందు శుభోదయముగా తలంచినది. ఇట్టి స్థితిలోనున్న ఈమెకు రాముని పట్టభంగము, వనగమనము భరింపనశక్యమైన దుఃఖహేతువయినది. రాముడు తనవద్ద లేనిచో తనకు కలుగనున్న దుర్దశను తలచుకొని విలవిలలాడినది. ఎట్లైనను రాముని, వనగమన నిశ్చయము నుండి మరల్ప ప్రయత్నించినది. పుత్రునకు తండ్రిమాట ఎట్లు అనుల్లంఘనీయమో తల్లిమాటకూడ అట్లే దాటరాదని చెప్పుచూ, పూర్వులను ఉదహరించినదితండ్రి వనమునకేగుమనిన “తల్లినైన నేను వలదని వారించుచున్నానునా మాట పాటింపు” మనినది –

“యథైవ రాజా పూజ్యస్తే గౌరవేణ తథాహ్యహమ్|

త్వాం నాహమనుజానామి న గంతవ్యమితో వనమ్||” -( అయో౨౧-౨౪)

తల్లియైన తనమాటను కాదనినచో తనను వనమునకు ఆయనతో తీసుకుని పొమ్మన్నది. అట్లు కానిచో లక్ష్మణుడు చెప్పినట్లు బలాత్కారముగా రాజ్యమును కైవశము చేసికొనుటకు తన సమ్మతిని సూచించినది. రాముని పరోక్షమున పరిణమించనున్న తన దుఃస్థితిని చూపి రామునకు తనయందు దయను కల్గించి, తన ప్రేమపాశముతో బంధించి, తనకనుకూలమైన ధార్మికవచనములతో ఇఱుకునపెట్టి రాముని వనగమన నిశ్చయమును నిరోధింప యత్నించినది.

 

రామునకు తండ్రియన ప్రత్యక్షదైవము. ఆయనమాట రామునకు అనుల్లంఘనీయము. తండ్రిమాట ధర్మమా, అధర్మమా అను విచారణగాని, చేయవచ్చునా లేదా అను సంశయముగాని, ఎట్టి స్థితిలో ఆమాట చెప్పుచున్నాడన్న వివేచనగాని, ఆ చెప్పెడు విషయము చెప్పుచున్న తండ్రికి ఇష్టమా,అయిష్టమా అను ఆలోచనగాని, తండ్రి వియోగము తనకు దుఃఖకరమా, సుఖకరమా అను విచికిత్సగాని రామునకు లేవు. అందువలననే పట్టాభిషేకమును, పట్టభంగమును సమబుద్ధితో స్వీకరించినాడు.”రాజ్యాధికారమును త్యజించుచు, వనగమనమునకు సుముఖుడైన రామునిలో, సమదర్శియైన స్థితప్రజ్ఞునకువలె యెట్టి మనోవికారము లేదు.”-

” న వనం గంతుకామస్య త్యజతశ్చ వసుంధరామ్

సర్వలోకాతిగస్యేవ లక్ష్యతే చిత్తవిక్రియా”- (అయో౧౯-౩౩)

 

తండ్రి సమక్షమున కైకేయి ద్వారా ప్రకటితమైన తండ్రియాజ్ఞను నిర్వహించుటకు ఆ క్షణమందే త్రికరణశుద్ధిగా నిశ్చయించుకొనినాడు. ఆ నిశ్చయమును నిర్వహింతునని సత్యముమీద ప్రమాణము చేసి కైకేయీ దశరథులతో పలికినాడుఈ విధముగా తండ్రిమాటపై తన వనగమనమును త్రికరణశుద్ధిగా నిశ్చయించుకొనినను, దానిని సత్యము మీద ప్రమాణము చేసి ప్రకటించినను, తల్లి శుభాశంసనము,ఆశీర్వాదము, అనుమతి లేకుండా దానిని నిర్వహించరాదు. తల్లి ఏమో తన అనుమతి ఇచ్చుటకు సుముఖముగా లేదుతన సమ్మతిని నిలిపి ఉంచుటకు ఆమె చూపిన హేతువులన్నింటికి, హేత్వంతరములను చూపి అందుకు ఆమెను అంగీకరింపజేసి, ఆమె సమ్మతిని, ఆశీస్సులను పొందవలసియున్నది. ముందుగా రాముని పరోక్షమందు తన దుఃస్థితిని ఊహించుకుని భయపడుచున్న తల్లికి భరతుని దిక్కుగా చూపినాడు. భరతుడు పరమసాధువు, సజ్జనుడు. ఆయన ఆమెను పరమ పూజ్యురాలుగా భావించి పూజించునని, ఆయన యేలుబడిలో ఆమెకెట్టి ఇక్కట్టుగాని, భయముగాని ఉండబోదని కౌసల్యకు ధైర్యమును, విశ్వాసమును కల్గించినాడు. ప్రధానముగా రాముని ఇఱుకున పెట్టదగినది తనమాటకు తండ్రిమాటతో సమప్రాధాన్యమును కోరిన కౌసల్య కోరికఇక్కడ ఎవరిమాటను పాటింపవలయును? ఈ సమస్యను రాముడు సులభముగనే పరిష్కరించుకొనినాడు,ఆ పరిష్కారము వేఱొక కోణమునుండి దర్శించినాడుకౌసల్య రామునకు తల్లియగుటకుముందు దశరథునకు భార్యతల్లిగా రాముని శాసించుటకు ముందు భార్యగా తనధర్మమును గుర్తెరుగవలసియున్నదిభర్త్రనుసరణమే భార్యకు పరమధర్మమని, భర్త,ప్రభువు అయిన దశరథుని మాటకు విరోధించి పలుకరాదని, తన వియోగమునకు కుమిలిపోవుచున్న భర్తను ఊరడించవలసియున్నదని కౌసల్యకు ఆమె స్వధర్మమును స్మరింపజేసినాడు. ఇక భర్త బ్రతికియుండగా స్త్రీ పుత్రుననుసరింపరాదని, భర్తలేని స్త్రీ మాత్రమే అటుల చేయవచ్చునని సనాతన స్త్రీధర్మమును చెప్పి ఆమెను నిరుత్తరను చేసినాడుఇక చేయునదిలేక రాముని వనగమనమునకు తన సమ్మతిని తెలిపి,ఆశీర్వదించి, మంగళాశాసనము చేసినది.

 

రామునకు సంప్రాప్తమైన ఈ అర్థవి పరిణామము లక్ష్మణుని శోకక్రోధములతో పెనవేసినదిఏ అపరాధము చేయకయే రాముడు రాజ్యమును పోగొట్టుకుని, వనవాసము చేయవలసివచ్చుట లక్ష్మణునకు భరింపరాని శోకమునకు హేతువైనది. దీనికి బాధ్యులైన కైకేయీ దశరథులపై క్రోధద్వేషములు పెల్లుబికినవి. ఆ ద్వేషదృష్టితో చూచుచున్న లక్ష్మణునకు మొదట ప్రకటించిన రామాభిషేకముకూడ కాపట్యముతో కూడినదనియే తోచినది. ముందు రామాభిషేకమును ప్రకటించుట, పిమ్మట దానికి వరము హేతువుగా భంగము కలిగించుట – అనునవి కైకేయీ దశరథులు ముందుగా రచించుకొనిన పథకము ప్రకారము జరిపించినవే అని వారిపై దోషారోపణము చేసినాడు. అట్టివారు పెద్దలే అయినను వారిని శాసించుట ధర్మమే అనుటకు ఒక శాస్త్ర వచనమును ఉదహరించినాడు-

” గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః

ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనమ్” – “(అయో౨౧-౧౩)

అదియునుగాక  క్షాత్రధర్మమును పాటించువాడు, మఱల బాల్యము పొందినవానివలె విచక్షణాజ్ఞానములేనట్టి రాజుయొక్క ఈ మాటను కొడుకైన వాడెవడు పాటించును –

“తదిదం వచనం రాజ్ఞః పునర్బాల్యముపేయుషః

పుత్రః కో హృదయే కుర్యాత్ రాజవృత్తమనుస్మరన్” – ( అయో౨౧-౭)

అని బలాత్కారముగనైనను, రాజ్యమును దక్కించుకొనుట క్షాత్ర ధర్మమని చెప్పి అట్లు రాజ్యమును రాబట్టుకొనుటకు రాముని ప్రేరణ చేసినాడు

 

రాముడు ధర్మప్రధానుడు గాని అర్థప్రధానుడు కాదు. దీనినే రాముడు కైకేయితో, “నాహమర్థ పరో దేవి……విద్ధిమామ్…కేవలం ధర్మమాస్థితమ్” (అయో.౧౯-౨౦)అని చెప్పినాడు. అదియును గాక రాముడు స్వల్పకాలికమైన జీవితమందు అధర్మమార్గమున లభించు రాజ్యమును తుఛ్ఛముగా తలచినాడు – “అదీర్ఘకాలే న తు దేవి!జీవితే వృణే౭వరామద్య మహీమధర్మతః”(అయో.౨౧-౬౨) మఱియు “ద్వేష్యో భవత్యర్థపరో హి లోకే”-(అయో.౨౧-౫౭),”కేవలార్థపరుడు లోకమున ద్వేషింపబడును” అని రాముని అభిప్రాయము. అందువలన రాముడు రాజ్యరూపమైన ఈ అర్థముల రాకపోకడలను నిర్లిప్తతతో, సమదృష్టితో దర్శించినాడు. కావుననే కైకేయీ దశరథులపై క్రోధముగాని, ద్వేషముగాని లేదు. ఒకవేళ తనకు అర్థము సంప్రాప్తమయినను అది తనవారి సుఖమునకే అని తలచువాడు.మొదట తనకు రాజ్యాభిషేకము చేయుదునని తండ్రి చెప్పినపుడు రాముడు లక్ష్మణునితో – ” యథేచ్ఛముగా రాజ్యసుఖములననుభవింపుము. మీ కొఱకే నేను రాజ్యము కోరునది” అని చెప్పినాడు. మనుష్యుని జీవితకాలము స్వల్పము, అర్థము స్వాభావికముగా చంచలమైనది. దీనిని గుర్తించి మానవుడు అధర్మరూప ధనమునకాశింపరాదు. ఇది రాముని నిశ్చయము. ఇక రాజ్యమును పొందుటకు లక్ష్మణుడు చూపిన క్షాత్రధర్మము పాపభూయిష్ఠమైనది. దానిని క్రూరులు, క్షుద్రులు, ధనలుబ్ధులు మాత్రమే అనుసరింతురు. అట్టిమార్గము తన కనుసరణీయము కాదని, తనదైన ధర్మమార్గమును అనుసరింపుమని లక్ష్మణునకు సమాధానము చెప్పి శాంతపరిచినాడు.

“తదేనాం విసృజానార్యాం క్షత్రధర్మాశ్రితాం మతిమ్

ధర్మమాశ్రయమాతైక్ష్ణ్యం మద్బుద్ధిరనుగమ్యతామ్”- (అయో౨౧-౪౩)

 

రాముడనిన ప్రజలకు ప్రాణము. ఆ ప్రాణము తమ్ము వీడిపోవుటకు సహింపని ప్రజలు వనవాసమునకేగుచున్న రాముననుసరించిరి. రాజు, రాణులు తదితరులైన రాజపురుషులు రామునిని కొంతదూరము అనుసరించి వెనుతిరిగినను ప్రజలు మాత్రము తిరిగి పోలేదు. తల్లిని, తమ్ముని సమాధానపఱచి తన వనవాసమునకు వారిని అంగీకరింపజేసినను, ప్రజలను నివారింపలేకపోయినాడు. అట్లే ప్రజలు కూడా రామునిని నివారింపలేక తామే రాముననుసరించిరి. వీరందరు సరయూనదీ తీరము చేరుసరికి నాటికి ప్రొద్దు క్రుంకినది. ఆ రాత్రికి అందరు అచ్చట విశ్రమించినారు. మఱునాడు ప్రజలు మేల్కొనకముందే నిద్రలేచిన రాముడు సీతాలక్ష్మణులతో సుమంత్రునితో కలిసి రథమునెక్కి పట్టణదిశగా పోవునట్లు పోయి మఱలి సరయూనదిని దాటివెళ్ళినాడు. మేల్కొనిన ప్రజలు తమ నిద్రను నిందించుకొనుచు రథమార్గమునుబట్టి భ్రాంతులై పట్టణమునకే తిరిగిపోయిరి. ఇక్కడ ఒక ప్రశ్న పుట్టునుప్రజలు రాముని ప్రాణసమానముగా భావించి, అనుసరించి వచ్చుచుండగా వారినట్లు భ్రాంతులను చేసి, మోసగించి వెళ్ళవచ్చునా? అనునది. ఈ విషయమును పరిశీలించునపుడు జాగరూకత వహించవలసియున్నది. ప్రజలకు రాముడెట్లు ప్రాణసమానుడో, రామునకు ప్రజలట్లు ప్రాణాధికప్రియులు. వారికై తానెన్ని కష్టములనైనను సైరించును, ఎన్ని త్యాగములైన చేయునుకాని తన కొఱకు వారు కష్టపడకూడదనునది రాముని నిశ్చయము.”రాజకుమారులు పౌరులను వారికి కల్గిన దుఃఖములనుండి విముక్తులని చేయవలసియున్నదిఅంతేగాని తమ దుఃఖములకు వారు దుఃఖించరాదు.”

“పౌరా హ్యాత్మకృతాద్దుఃఖాత్ విప్రమోచ్యా నృపాత్మజైః

న తు ఖల్వాత్మనా యోజ్యా దుంఖేన పురవాసినః”.(అయో౪౬-౨౩)

తాను రథమునెక్కి వనవాసమునకు తరలగా, వృద్ధులైన పురవాసులు కాలినడకన రాముననుసరింపజాలక వ్యథచెందుచుండ, వారిని చూడజాలక రాముడు రథముదిగి తానును కాలినడకన వనమునకు సాగినాడు.(“పదాతీంస్తాన్….న శశాక ఘృణాచక్షుః పరిమోక్తుం రథేన సః”, “పద్భ్యామేవ జగామాథ ససీతస్సహలక్ష్మణః” -(అయో౪౫-౧౯-౧౮)అట్టి కృపాపరుడైన రాముడు, గృహదారసుతాదులను వదిలి, అన్నపానములు మాని, వృక్ష మూలములనాశ్రయించి, అలసి నిదురించు వారి దైన్యస్థితిని చూచి కరగిపోయి వారు తన్ననుసరించుటకు సమ్మతించలేదు. అదియునుగాక ప్రజలతో కలసి వనవాసము చేసిన అది జనవాసమే అగును. లోగడ దశరథుడు ప్రజనంతా వనమునకు తరలింతునన్నపుడు దానికి రాముడు సమ్మతించలేదు. అటుల చేసిన అది వనవాసము కాకపోవునని చెప్పినాడు. మఱియు లోకాచారము విచారించినను రాముడు చేసినపని సబబుగనే కనిపించును. బిడ్డలను తీసికొనిపోరాని, పోలేని చోటులకు పోవునపుడు తల్లిదండ్రులు వారిని ఏమార్చి పోవుట మోసమగునా? రాముడు వనమునకు ప్రజలను అనుమతించినచో తనకు వ్రతభంగమగునువారిని అంగీకరింపజేసి పోవుట దుర్ఘటమైన విషయముకావున తనకు వ్రతభంగము కలుగకుండుటకును, ప్రజలు పట్టణమున సుఖముగా నుండుటకును రాముడు అటుల చేయవలసి వచ్చినది.

 

కౌసల్యాదులను ఒప్పించి, ప్రజలనుండి తప్పించుకుని,  భరద్వాజ ఋషి సూచనమేరకు, చిత్రకూట పర్వత ప్రాంతమందు సీతాలక్ష్మణులతో నివసించుచున్నను, రాముని వనవాసమునుండి మఱల్చుటకు చేయు ప్రయత్నములు ముగియలేదు. పట్టాభిషేకమునకు తిరస్కరించిన భరతుడు, కోసల రాజ్యమునకు రామునినే రాజుగా చేయుటకు సకల జనపరివారముతో, అభిషేక ద్రవ్యములతో, చతురంగబలములతో , చిత్రకూటము చేరినాడు. తండ్రి మరణమునకు దుఃఖించి, తిలోదకాదులిచ్చి, స్వస్థుడైన రామునిని భరతుడు పట్టణమునకు తిరిగివచ్చి రాజ్యపాలన చేయవలసిందిగా కోరినాడు. తండ్రికిచ్చిన మాటకు కట్టుబడియున్న రాముడు రాజ్యాభిషేకమును తిరస్కరించినాడు. స్త్రీ వ్యామోహములో ధర్మము తప్పి నరకగామి కానున్న తండ్రిని, స్వార్థపరురాలై అధర్మమునకు పాల్పడి లోకనిందను పొందిన తన తల్లియైన కైకేయిని, జ్యేష్ఠునకు చెందిన రాజ్యమును, చిన్నవాడైన తాను స్వీకరించి అధర్మవర్తనుడుగా లోక పరీవాదాస్పదుడు కానున్న తనను – నరకమునుండి, లోకాపవాదమునుండి కాపాడవలసిందని రామునిని భరతుడు కన్నీటితో వేడుకొన్నాడు. కొడుకులందు, భార్యలందు యథేచ్ఛముగా ప్రవర్తించుటకు తండ్రికి అధికారమున్నదనియు, వరములిత్తునని బాసచేసి దానిని నెరవేర్చుటవలన తండ్రికి పాపము కలుగదనియు, తనకప్పువడియున్న వరములను భర్తనుండి రాబట్టుకొనుటలో కైకమ్మ దోసమేమియు లేదనియు, శుల్కరూపమున కైకేయి సంతానమునకు దత్తమయిన రాజ్యమును భరతుడు స్వీకరించుటలో అధర్మము లేదనియు, తత్కారణముగా వారి ముగ్గురకు నరకప్రాప్తియుండదనియు రాముడు భరతుని నిరుత్తరుని చేసినాడు. ప్రాయోపవేశమునకు నిశ్చయించుకున్న భరతుని రాముడా ప్రయత్నమునుండి విరమింపజేసినాడు. తన ప్రయత్నములన్నియు విఫలము కాగా, తనవెంట వచ్చిన ప్రజలను రాముని ప్రార్థింప ప్రేరేపించాడు. రాముని ధార్మికనిష్ఠకు ముగ్ధులైన ప్రజలు ఆయనను మరల్చుటకు సుముఖముగా లేకపోవుటయేగాక రాముని నిశ్చయము ధర్మబద్ధమయినదని చెప్పిరి.

 

భరతుని అవస్థకు జాలిపడి జాబాలి అను రాజపురోహితుడు కొన్ని నాస్తికవాక్యములతో రాముని నెదుర్కొనినాడు. ఈ లోకమున తండ్రికొడుకులగుట కేవలం యాదృచ్ఛికమనియు, చనిపోయిన తండ్రికి బ్రతికియున్న కొడుకుపెట్టు తర్పణములు  ఆయనకు చేరవనియు, అట్లే మరణించిన తండ్రికిచ్చిన మాట చెల్లించనవసరము లేదనియు, తత్కారణముగా తండ్రికి నరకము ప్రాప్తించుటకు పరలోకములే లేవనియు, అందువలన భరతుడిత్తుననుచున్న రాజ్యమును స్వీకరించి రాజభోగముల ననుభవింపవలసినదిగా రాముని కోరినాడు. లోకములన్నియు సత్యమునందు ప్రతిష్ఠితములై యున్నవనియు, లోకమునందు వర్ధిల్లుటకు ధర్మము సత్యము నాశ్రయించి యుండుననియు, తాను పుత్రరూపధర్మమును నిర్వహింతునని సత్యముమీద ప్రమాణము చేసితిననియు, అట్టి తనమాటను కైకమ్మ విశ్వసించినదనియు, మాట తప్పినచో అట్టివానిని పామును చూచినట్టుగా చూచి భయపడుదురనియు, తల్లి దండ్రులకిచ్చిన మాటను వమ్ముచేసి తమ్ముడిచ్చిన రాజ్యమునెట్లు స్వీకరింతునని రాముడు జాబాలికి బదులు చెప్పినాడు. రాముని మరల్చుటకు వశిష్ఠుడు చేసిన ప్రయత్నముకూడ ఫలించలేదు. వసిష్ఠునకు చెప్పవలసిన సమాధానము భరతునితో చేసిన సంవాదములో అంతర్గతమైయుండుటవలన రాముడేమియు వసిష్ఠునకు బదులు చెప్పలేదు.

 

రాముడు తన పుత్త్రరూప ధర్మమును సత్యధర్మములను ఆలంబనము చేసికొని నిర్వహించినాడు. ఈ నిర్వహణమునకెదురైన ఆటంకములు, వానిని రాముడు నివారించుకొనిన విధము ఇప్పటివరకు పరిశీలింపబడినది. ఇక రాముని ఈ ధర్మనిర్వహణము సఫలమైనదా లేదా అను విషయమును పరిశీలించవలసియున్నది. చిత్రకూటమున రామాశ్రమమందు రామభరత సమాగమము, సంవాదము చూచుటకు, వినుటకు భరతునితో వచ్చిన పట్టణవాసులే కాకుండా, అరణ్యవాసులైన మునులు వచ్చిరి సిద్ధులు, సిద్ధర్షులు అంతర్హితులై అచట నుండిరి. లోకము నందు ధనముకొఱకు, రాజ్యము కొఱకు వాదులాడుకొనినవారు, పోరాడుకొనినవారు కలరుగాని, నిస్వార్థముగా సంపద్రాజ్యములను త్యజించుటకు అహమహమికతో ముందుకు వచ్చువారు అరుదు. రాజ్యంలో ఉంటూ, రాజ భోగములనుభవించుచున్న రాజకుమారులగు రామభరతులు రాజ్యమును తృణప్రాయముగ త్యజించు వారి శీలౌన్నత్యము అచటి మహర్షులకు,  సిద్ధర్షులకు ఆశ్చర్యజనకమైనది. అంతర్హితులైన సిద్ధర్షులు భరతునితో-“నాయనా! రాముడు  తండ్రికిచ్చినమాటను పాటించి వనవాసము చేయవలసియున్నది. రాముడు పుత్త్రధర్మనిష్ఠుడై ఉన్నందున దశరథుడు కైకేయీ ఋణవిముక్తుడై స్వర్గమును పొందినాడు.”(“అనృణత్వాచ్చ కైకేయ్యాః స్వర్గం దశరథో గతః”-(అయో౧౧౨-౬) అని చెప్పిరి.

రావణవధ జరిగిన మీదట బ్రహ్మాదిదేవతలు పరమేశ్వరునితోకూడ రామునకు ప్రత్యక్షమగుదురు. పరమేశ్వరుని కరుణవలన రాముడు తండ్రిని దర్శించును”నాయనా! పుత్రుడవుగా నీవు నిర్వహించిన ధర్మము సఫలమైనది. నీవు నన్ను సత్యప్రజ్ఞునిగా చేసిన కారణమున నాకు స్వర్గము లభించినది. పుత్రునివలన తరించిన కాశ్యపునివలె నేనును తరించితిని”

“తారితో౭హం త్వయా పుత్త్ర! సుపుత్రేణ మహాత్మనా

అష్టావక్రేణ ధర్మాత్మా తారితో బ్రాహ్మణో యథా” – ( యుద్ధ౧౨౨-౧౭)

అని రాముని పుత్త్రధర్మ నిర్వహణ సాఫల్యమును ప్రత్యక్షముగా రాముని కెఱిగించినాడు. దీనినిబట్టి రాముడు దృఢదీక్షతో నిర్వహించిన ధర్మనిష్ఠ సత్యమైనదని సప్రమాణకముగా ఋజువయినది

 

|| ఓం శాంతిశ్శాంతిః ||

1 thought on “రామో విగ్రహవాన్ ధర్మః

  1. ఇంత చక్కట్టి విశ్లేషణాత్మకమైన, ప్రయోజనకరమైన వ్యాసమును అందజేసినందుకు శ్రీ సుబ్బారావుగారికి, కౌటిల్యగారికి మరియు మాలిక పత్రికకు హృదయపూర్వక ధన్యవాదములు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *