April 25, 2024

కవిబ్రహ్మ గుఱ్ఱం జాషువా

రచన: కప్పగంతు వెంకట రమణమూర్తి..

నవయుగ కవితా చక్రవర్తి గుఱ్ఱం జాషువా తెలుగు సాహిత్యరంగంలో ఒక విశిష్టమైన స్థానాన్ని ఆక్రమించుకున్న కవి.  తెలుగు పద్యం బలహీనపడుతున్న దశలో పద్యానికి జవజీవాలు అందించినవాడు జాషువా.  పద్యానికి పదునుపెట్టి సామాజిక ప్రయోజనం కోసం కవిత్వం రాశారాయన.  జాషువా కవిత్వం మీద ఇరవయ్యో శతాబ్దపు ఉద్యమాలు, రాజకీయ, సాంఘీక, ఆర్ధిక, సామాజిక స్థితిగతులు ప్రభావం చూపాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు.

 

గుంటూరు జిల్లా వినుకొండలో మిస్సమ్మతోటలో 1895 సెప్టెంబర్ 28న జన్మించిన గుఱ్ఱం జాషువా బాల్యం నుంచి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని గొప్ప కవిగా నిలిచారు. అవమానాలను, చీత్కారాలను భరించి తెలుగు కళామతల్లికి లబ్దిప్రతిష్టలను చేకూర్చి పెట్టారు.  భావకవిత్వం క్షీణదశకు చేరి అభ్యుదయ కవిత్వం పుంజుకుంటున్న రోజుల్లో సాహిత్యరంగంలో ఎగిసిన కెరటంలా వచ్చారు.  జాషువా పదప్రయోగం  విలక్షణమైనది. తెలుగు నుడికారానికి లోకోక్తులు, మధురమైన శబ్దాలతో కూడిన సమాసాలు సంస్కృత శబ్దాలను సందర్భోచితంగా ప్రయోగించితంలో జాషువా దిట్ట.  ఆయన కవిత్వంలో రసస్పర్శ ఉంటుంది.  సాంఘీక ప్రయోజనంలేని కవిత్వం వ్యర్ధమన్నాడాయన.

కులమతాలు గీచుకున్న గీతలజోచ్చు 

  పంజరాన గట్టు వడను నేను

  నిఖిలలోకమెట్లు నిర్ణయించిన నాకు 

  తరుగులేదు విశ్వనరుడ నేను “ అని ఆయన ప్రకటించుకున్నారు.

జాషువా దాదాపు ముప్పది కావ్యాలు, మరికొన్ని ఖండకావ్యాలు రాశాడు.  అనేక నాటకాలనూ రాశాడు.  వీరి రచనల్లో ఫిరదౌసి, స్వప్నకథ,  కాందిశీకుడు, గబ్బిలం, ముంతాజ్ మహలు వంటి కావ్యాలు జాషువాకు  తెచ్చిపెట్టారు.

 

జాషువా పద్యాలు మానవతావాదం, అభ్యుదయం, సామాజికస్పృహ, కారుణ్యం, విశ్వప్రేమను కలిగి ఉంటాయి. జాషువా తన పద్యాలలోని చివరి పంక్తిని విలక్షణంగా మలుస్తాడు. కవిగా తాను చెప్పదలచుకున్నది ఆ చివరి పంక్తిలో అత్యంత శక్తివంతంగా చెబుతాడు.  చాలా సందర్భాలలో చురకలు అంటించేవిగా ఉంటాయి.

 

జాషువాకు కవిగా గుర్తింపు తెచ్చిన మొదటి కావ్యం ‘ఫిరదౌసి’.  భారతదేశంలోని దేవాలయాలను ద్వంసంచేసి ఆలయ సంపదలను బస్తాలతో  ఒంటెలకెతించుకుని స్వదేశం చేరుకున్న గజనీ మహమ్మదు తన ఆస్థానకవి ఫిరదౌసిని వంచించటాన్ని జాషువా తన కావ్యవస్తువుగా తీసుకున్నారు.  ఒకొక్క పద్యానికి  ఒక బంగారు నాణెం ఇస్తానని చెప్పి దానికి బదులుగా వెండి నాణాలను ఇస్తే ఫిరదౌసి తిరస్కరిస్తాడు.  గజని శిరచ్చేదం విధిస్తాడు.  శిక్ష అమలుచేసేలోపే ఫిరదౌసి మరణిస్తాడు.  ఈ కావ్యంలో గజనీని ఉద్దేశిస్తూ ఫిరదౌసి ఇలా అంటాడు.

 

ఒక్కొక్క పద్దియంబునకు నోక్కక్క నెత్తురు బొట్టు మేనిలో

దక్కువగా రచించితి, వృధాశ్రమ యయ్యె గులీనుడైన రా

జిక్కరణిన్ మృషల్వలుకునే? కవితా ఋణమీయకు౦డునే

నిక్క మెఱు౦గనైతి గజనీ సులతాను మహమ్మదగ్రణీ!

 

 

స్వప్నకథ కావ్యంలో వృద్దురాలి కథ వివరిస్తూ మాతృప్రేమని స్పురింపచేశారు.  కాందిశీకుడు కావ్యంలో వివేకానందుడు, రామణర్షి, ముసలి కోమటిసెట్టిల గొప్పదనాన్ని వర్ణించి భరతఖండం నాల్గు ఖండాలకు ధర్మమార్గం చూపిందని భారతదేశ ప్రశస్తి చేశారు.

 

అది శివాజీ వీరు డహితుని కడుపులో గత్తులాడి౦చిన కదన భూమి

  అది ప్రతాపుని వీరకదన సైంధవ హేష ప్రతిశబ్దమీనిన పర్వతంబు” 

 

గబ్బిలం కావ్యంలో దళితులకు భగవంతునికి మధ్యవర్తిగా గబ్బిలాన్ని ఎంచుకోవటం జాషువా చేసిన ఒక వినూత్న చైతన్యస్ఫూర్తి.  గబ్బిలంలోని ప్రతి పద్యం దళితుల బాధాతప్తమాయమైన జీవితాన్ని ఆవిష్కరిస్తుంది.

 

ఆలయంబున నీవు వ్రేలాడు వేళ

శివుని చెవి నీకు గొంత చేరువగనుండు 

మౌని ఖగరాజ్ఞి –  పూజారి లేనివేళ

విన్నవింపుము నాదు జీవిత చరిత్ర

 

కవి గబ్బిలంలో ‘పూజారి లేనివేళ విన్నవించవమ్మా’ అని చెబుతాడు.

 

పామునకు బాలు చీమకు పంచదార 

  మేపుకొనుచున్న కర్మభూమిం జనించి 

  ప్రాక్తనంబైన ధర్మదేవతకు గూడ

  నులికిపడు, జబ్బు గలదు, వీడున్న చోట” అని జాషువా హైందవ సాంప్రదాయాన్ని విమర్శించాడు.  గబ్బిలంలోని ప్రతి ప్రద్యం కవి ఆవేదనను వ్యక్తపరుస్తుంది.

 

ముంతాజుమహలు కావ్యంలో జాషువా కరుణకే ప్రాధాన్యతనిచ్చారు.  ఈ కావ్యంలో ముంతాజ్ “మహీవలయ౦బను సత్రశాలలో నీ సతినై ముగించితి ప్రవాసయాత్ర” అని షాజహాన్ కు ప్రత్యక్షంగా వేదాంత బోధ చేసింది.

 

రాణి విడిచిపోయె రాజునొంటరి జేసి

రాజు విడిచిపోయె  రాజ్యరమను 

రాజ్యరమయు విడచె రాజుల బెక్కండ్ర

తాజి విడువలేదు రాజసంబు

 

అని తాజుమహలు గూర్చి అన్నాడు.

 

సాహితీ క్షేత్రంలో కృషీవలుడు కావాలనే కాంక్షతో తీవ్రంగా తపించి, శ్రమించి కవితా సుక్షేత్రంలో పసిడినే పండించారు.  ప్రాధమికోపాద్యాయునిగా జీవితం ప్రారంభించి, నాటి మూకీ చిత్రాలకు వ్యాఖాతగా ఊరూరా తిరిగి వీరేశలింగం, చిలకమర్తుల ఆశీర్వాదాలు పొంది కావ్య జగత్తులో స్థిరపడ్డారు.  ఉభయ భాషా ప్రవీణులై తెలుగు పండితునిగా, ద్వితీయ ప్రపంచ సంగ్రామ సమయంలో యుద్ధ ప్రచారకునిగా, స్వాతంత్ర్యానంతరం 1956 నుండి 1960 వరకు ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో ఉద్యోగాలు నిర్వర్తించారు. జాషువా వెయ్యికిపైగా సన్మానాలు పొందారు.  కవి కోకిల, కవి విశారద, కవి దిగ్గజ, మధుర శ్రీనాథ, నవయుగ కవి చరక్వర్తి, విశ్వకవి సామ్రాట్ బిరుదులు పొందారు.  గండపెండేరం ధరించి, కనకాభిషేకాలు పొంది గజారోహణం చేసి పగటి దివిటీల పల్లకిలో ఊరేగారు.  గుంటూరు పట్టణం  స్వేచ్చా  పౌరసత్వం ఇచ్చి గౌరవించింది.  క్రీస్తు చరిత్ర కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు బహూకరించింది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనమండలి సభ్యులుగా కూడా నియమితులయ్యారు.  ఆంద్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదు నిచ్చింది.  దేశ ఉన్నత గౌరవం పద్మభూషణ్ లభించింది.  ఇటీవలే తెలుగు అకాడమి గుఱ్ఱం జాషువా పరిశోధనా కేంద్రాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేసింది.  గుఱ్ఱం జాషువా 1971 జూలై 24న గుంటూరులో పరమపదించారు.

రాజు మరణించె ఒక తార రాలిపోయె

కవియు మరణించె  నొక తార గగనమెక్కె

రాజు జీవించె  రాతి  విగ్రహములందు

సుకవి జీవించె  ప్రజల నాలుకల యందు

 

 

*కప్పగంతు వెంకట రమణమూర్తి, బి2 ఎఫ్12, రామరాజా నగర్, సుచిత్రా జంక్షన్ పోస్ట్, సికింద్రాబాదు – 500 067. వీరు వాణిజ్య , న్యాయశాస్త్రాల్లో పట్టా పొందారు.  పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఏం.ఏ. తెలుగు పూర్తి చేశారు.  వివిధ విశ్వవిద్యాలయాల నుంచి మేనేజ్మెంట్, ప్రజాసంబంధాలు, మానవహక్కులు, సైబర్ చట్టాలు, మేధో సంపత్తి హక్కులు, మీడియా చట్టాలపై డిప్లోమాలు పొందారు.  వీరి స్వస్థలం గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని ఉంగుటూరు గ్రామం. ప్రస్తుత నివాసం హైదరాబాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *