March 28, 2024

రేడియో చమత్కారాలు

 

రచన: డా. ఏల్చూరి మురళీధర రావు ,’

న్యూ ఢిల్లీ

 

 

హాసము ఆరోగ్యానికి లక్షణం. “దుఃఖంతో నిండి ఉన్న ప్రపంచంలో నవ్వు అనేదే లేకపోతే విసుగూ అసహ్యమూ పుట్టి మానవజీవితం దుర్భరమైపోతుంది” అని మహాకవి వేదుల సత్యనారాయణశాస్త్రిగారు ఒకచోటన్నారు. అందువల్ల, నిత్యానుభవంలో సైతం ప్రతివాడూ ఏదో విధంగా నవ్వడానికే ప్రయత్నించడం సహజం. చమత్కారం స్ఫురించేటప్పుడు కూడా నవ్వలేనివాడు హృదయం లేనివాడో రోగగ్రస్తుడో అయివుంటాడని పెద్దలంటారు. నవ్వు హృదయనైర్మల్యానికి స్నిగ్ధసంకేతం. మనస్సుకు వికాసాన్ని కలిగించే జీవశక్తి అందులో ఉంటుంది. వికాసశీలమైన చిత్తానికి నవ్వుకంటె విశ్రాంతీ, హాయీ మరొకటి లేదు.

1978లో నేను విజయవాడ ఆలిండియా రేడియోలో ట్రాన్స్మిషన్ ఎగ్సిక్యూటివ్ గా ఉద్యోగంలో చేరాను. రేడియో స్టేషను ఎప్పుడూ యాతాయాతవిద్వత్సమాజం ప్రగల్భహాస్యోక్తులతో,సహోద్యోగుల నిత్యచ్ఛలోక్తులతో, కుశలప్రత్యుక్తులతో, రసవదర్థాలతో నవ్వుల పువ్వులతోటలా పరిమళిస్తుండేది. అందులోనూ పద్యనాటక నటులు, సంగీతవేత్త వి.ఎస్. నారాయణమూర్తిగారు,మెహమూద్ ఖాన్ గారు, నల్లూరి బాబూరావు, కవయిత్రీమణి ఝాన్సీ కె.వి. కుమారి, కళాకృష్ణ, సిద్ధిరాజు అనంత పద్మనాభరావు; వాచికాభినయప్రవీణులైన అనౌన్సర్లలో ఆర్ముళ్ళ బ్రహ్మానందరెడ్డి (ఎ.బి. ఆనంద్) గారు, ఎస్.బి. శ్రీరామమూర్తి గారు నిత్యం హాయిగా కలకల నవ్వుతూ, నవ్విస్తూ ఉంటే ఎటువంటివారికీ కాలం పోకడ తెలిసేది కాదు. ఇక పెద్దలు సి. రామమోహనరావుగారు,నండూరి సుబ్బారావుగారు, ఎ. లింగరాజుశర్మగారు, పేరి కామేశ్వరరావుగారు, ఎం. వాసుదేవమూర్తిగారు (వీరి తండ్రి మంచావజ్ఝల సీతారామశాస్త్రిగారు గొప్ప కవి, తిరుపతి వెంకటకవుల ప్రత్యక్షశిష్యులు, కొప్పరపు కవుల వివాదసందర్భంలో వారు చెప్పిన వ్యంగ్య హాస్య పద్యాలలోని వెక్కిరింతల పదును వింటే గాని తెలియదు), ఇక ఉషశ్రీ గారు, సంస్కృతాంధ్రాంగ్ల విద్వాంసులు,ప్రముఖకవి ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు, వెంపటి రాధాకృష్ణగారు, చక్కటి కథకులు శ్రీ పి.వి. రమణరావు గారు, రంగస్థల ప్రయోక్త ఎం. పాండురంగరావుగారు, కొప్పుల సుబ్బారావుగారు, ప్రముఖ రచయిత ప్రయాగ రామకృష్ణగారు, విదుషీతల్లజ ప్రయాగ వేదవతిగారు (వీరి ద్వారా హరికథాప్రవీణులు, విఖ్యాత కవి, వినుత గాయకులు, రంగస్థల నటులు, ప్రయోక్త, హాస్యకుశలి శ్రీ ప్రయాగ నరసింహశాస్త్రిగారిని కలుసుకొనే అవకాశం, ప్రసంగించే అదృష్టం కలిగాయి), గాయక సార్వభౌములు ఓలేటి వెంకటేశ్వర్లుగారు, అన్నవరపు రామస్వామిగారు, దండమూడి రామమోహనరావుగారు తమ జీవితంలోని సరసప్రసంగాలను నెమరువేసుకొంటుంటే నవ్వుతెరను ఆపుకొనడం సాధ్యం కాకపోయేది. ఆ తర్వాత నిరంతర హాస్యోక్తిపరాయణులు, ప్రవీణులు, ప్రముఖవిద్వాంసులు డా. రేవూరి అనంత పద్మనాభరావుగారిని కలుసుకొన్నాను.  

నేనిక్కడ పేర్కొన్నవి ఏవో అలవోకగా జ్ఞాపకం చేసుకొన్న కొన్ని యాదృచ్ఛిక ఘటితాలు మాత్రమే. ఆ హాస్యకలశరత్నాకరంలో నుంచి ఎన్ని పేర్కొన్నా తక్కువే మరి!

 

ముద్దంటే చేదా?
1973లో అనుకొంటాను, మద్రాసు రేడియో వాళ్ళొకసారి నరాల రామారెడ్డి గారి అష్టావధానం ఏర్పాటు చేశారు. పృచ్ఛకులు – నిషేధాక్షరికి శ్రీశ్రీ గారు, సమస్యకు ఆరుద్ర గారు, ఆశువుకు డా. మాడభూషి నరసింహాచార్య గారు, వర్ణనకు కొంగర జగ్గయ్య గారు, న్యస్తాక్షరికి రావూరి దొరసామిశర్మ గారు, వ్యస్తాక్షరికి సినీరచయిత్రి విజయలక్ష్మి గారు, దత్తపదికి వినుత వ్యాకరణ విద్వాంసురాలు ఆచార్య లలిత గారు మొదలైన ఉద్దండులు. అప్రస్తుతప్రసంగం డి.వి. నరసరాజు గారు. అంతా మహామహా విద్వాంసులకే గంగవెఱ్ఱులెత్తించే దిగ్దంతులు.
రామారెడ్డి గారు మంచి కవి. అంతమందినీ రంజింపజేస్తున్నారు. శ్రీశ్రీ గారు మధ్య మధ్యలో అవధాని గారి కంటె ముందుగా తానే సమాధానాలు చెబుతూ చమత్కారాలు కురిపిస్తుంటే సభంతా హాస్యకళామందిరం అయింది.
అవధాని గారు అంతమందిలో సభను మెప్పిస్తున్నారు కాని – నరసరాజు గారిని ఎదుర్కొనటం మాత్రం ఎవరివల్లా కాలేదు. ఆయనెక్కడున్నా అంతే. చుట్టూ ఉన్నవారికి నవ్వి, నవ్వి కడుపునొప్పి రావలసిందే. పైగా – ఆయన ప్రశ్న అడగటం, వెంటనే జోక్యం చేసుకొని శ్రీశ్రీ గారు సమాధానం చెప్పటం, దానికి ఆరుద్ర గారి కొసమెఱుపులు. అవధానాన్ని హాస్యం ముంచెత్తివేస్తున్నదని అందరూ అనుకొన్నారు.
సభ పెద్దయెత్తున జరిగింది. వందలమంది ప్రేక్షకులు. సభలో కళాసాగర్ అధ్యక్షులు, ప్రఖ్యాత వైద్యులు డా. ముద్దుకృష్ణారెడ్డి గారున్నారు.
మాటల మధ్య నరసరాజు గారడిగారు: “డాక్టరు ముద్దుకృష్ణారెడ్డి గారికీ, డాక్టరు నారాయణరెడ్డి గారికీ తేడా ఏమిటి?” అని.
తడుముకోకుండా రామారెడ్డి గారన్నారు: “నారాయణరెడ్డి గారివి రాతలు; ముద్దుకృష్ణారెడ్డి గారివి కోతలు” అని. అందరూ ఆ ఛలోక్తికి పకపక నవ్వారు. నారాయణరెడ్డి గారు గొప్ప కవి, ముద్దుకృష్ణారెడ్డి గారు గొప్ప శస్త్రవైద్యనిపుణులు అని భావం.
జగ్గయ్య గారు సరదాగా, “డాక్టరును తెలుగులో ‘మందరి’ అనాలి” అని చెప్పారు. “మందరి ముద్దుకృష్ణారెడ్డి గారు అంటే బాగుంటుంది” అన్నారు. ఆరుద్ర గారు కొంటెగానే, “మందు (ఔషధం), అరి = కలవాడు “మందరి” అన్నమాట” అని ఆ మాటను వివరించారు. జనమంతా ఒప్పుకోలుగా దరహాస చంద్రహాసాలు మెరిపించారు.
వెంటనే శ్రీశ్రీ “ఏ మందు?” అని అడిగారు. సభలో మళ్ళీ నవ్వులు విరిశాయి. ప్రక్కనే కూర్చొన్న విజయలక్ష్మి గారు “శ్రీశ్రీ గారే చెప్పాలి” అన్నారు. అంతటా మళ్ళీ ముసిముసి నవ్వులు.
శ్రీశ్రీ గారు ఊరికే ఉంటారా? ఆమెకేసి చూసి, “మందరి ముందరి సుందరి” అని అంటించారు. సభంతా కరతాళధ్వనులతో నిండిపోయింది.
అప్పుడు డి.వి. నరసరాజు గారన్నారు: “డాక్టరు నారాయణరెడ్డి, డాక్టరు ముద్దుకృష్ణారెడ్డి లో “డాక్టరు”, “డాక్టరు”  ఒకటే. “రెడ్డి”, “రెడ్డి” ఒకటే. “నారాయణా”,”కృష్ణా” ఒక్కటే. పోతే, “నారాయణరెడ్డి”లో “ముద్దు” లేదు” అని.
హాస్యానికి అన్న మాటలే అవన్నీ. ఆ కవులు, సభాసదులు అందరికీ నారాయణరెడ్డి గారంటే అభిమానమే. సభలో ఇక నవ్వుల పండగే ఆ రోజు.
అవధానం దిగ్విజయంగా జరిగింది.

 

మందీ – మంచూ
మద్రాసు ఆలిండియా రేడియోలో రసజ్ఞుల సమక్షంలో కవిసమ్మేళనం జరుగుతోంది. శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, కొసరాజు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, చల్లా రాధాకృష్ణశర్మ, సాయికృష్ణ యాచేంద్ర మొదలైన ప్రసిద్ధ్లులతోపాటు ఆ రోజు నేనూ పాల్గొనే  అవకాశం వచ్చింది.
స్టూడియో అంతా ఆహూతులతో కిటకిటలాడుతున్నది. ఎయిర్ కండిషనింగ్ చేసినప్పటికీ గాలి ఆడక ప్రేక్షకులు చేతిలో కాగితాలతోనూ, పుస్తకాలతోనూ అసహనంగా విసురుకొంటున్నారు.ఎవరో లేచి అడిగారు: “ఏవండీ! రేడియోవాళ్ళు ఎ.సి. వేశారా లేదా?” అంటూ.
మహాకవి ఆరుద్ర చమత్కార సంభాషణలకు పెట్టింది పేరు. ఆయన వెంటనే అన్నారు, “మంది ఎక్కువైతే ‘మంచు’ కూడా పల్చనే” అని! క్షణకాలం సభ అంతా నవ్వులతో చల్లబడింది.

 

సంపాదకత్వ శిక్షణ
1978లో, ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నేను ఉద్యోగిగా చేరిన మొదటి రోజు – చేరి ఇంకా గంటకూడా కాలేదు – స్పోకెన్‌వర్డు ప్రొడ్యూసర్‌గా ఉన్న సుప్రసిద్ధులు ఉషశ్రీ గారు వచ్చి నన్ను పలకరించి, ఏ ఉపోద్ఘాతమూ లేకుండానే, “నీకు స్క్రిప్టు ఎడిటింగు వచ్చునా?” అని అడిగారు. ఆయన మా నాన్నగారికి ఆప్తమిత్రులు. నేను సమాధానం చెప్పే లోపునే, ఒక రచయితను పరిచయం చేసి, “పదమూడు నిమిషాల ప్రసంగం. స్క్రిప్టు పెద్దదయింది. నువ్వు సరిచెయ్యి” అని చెప్పి వెళ్ళిపోయారు.
విషయం ‘నన్నయ భారతంలో ఉపమ’. వక్త అమలాపురం నుంచి వచ్చిన తెలుగు లెక్చరరు. రేడియోలో అదే మొదటి ప్రసంగమట. వ్యాసం సుమారు డెబ్భై పేజీల పైనే ఉంది. ఎక్కడెక్కడివో విషయాలను సేకరించి, పొందికగా రాసుకొచ్చారు. నేను శ్రద్ధగా చదవటం మొదలుపెట్టాను. గంటయింది. మధ్య మధ్య సహోద్యోగులు వచ్చి పలకరించటం, అభినందనలు, అభివాదాలు, పరస్పర పరిచయాలతోనే కాలం గడిచిపోతోంది.
అంతలో ఉషశ్రీ గారు వచ్చారు. “పూర్తయిందా?” అని అడిగారు. “సార్ చదువుతున్నారు” అని ఆ ప్రసంగకర్త, పాపం జవాబిచ్చారు. “పావుగంట వ్యాసం చదవటానికి గంటసేపా? పద, స్టూడియోకి!” అంటూ మమ్మల్ని ఉషశ్రీ గారు టాక్ స్టూడియో లోపలికి తీసుకెళ్ళారు.
“ఒకటి, రెండు, మూడు” అంటూ, మొదటి నాలుగు పేజీలు బైటికి లాగి, “ఇవి చదవండి.” అని ఆయన చేతిలో పెట్టారు.
పాపం ఆయన హడిలిపోయాడు. నేను బిక్కుబిక్కుమని చూస్తున్నాను. “ఇది వ్యాసం మొదలేనండీ! ముగింపు చెయ్యాలి కదా” అంటున్నాడు.
“అవసరం లేదు. మాకు ‘అనవసరం’ (ఎనౌన్సరుకు ఉషశ్రీ గారి తెలుగు. ఎనౌన్సరం అన్నట్లు పలికేవారు) అని ఒకడుంటాడు. మీ ప్రసంగం అయిపోయిందని చివర్లో చెబుతాడు. జనానికి తెలుస్తుంది. ఈ నాలుగు పేజీలూ చదివితే చాలు.” అన్నారాయన.
“బాబ్బాబ్బాబ్బాబు! క్షమించండి. ఒక్క పదిహేను నిమిషాలు టైమివ్వండి … ముగింపు కూడా చేరుస్తాను.” అంటూ ఆయన ఉషశ్రీ గారి కాళ్ళమీద పడిపోయాడు.
ఎలాగో కష్టపడి అంతా సరిచేశాక ఆయన చదవటం మొదలుపెట్టారు. రికార్డింగు సరిగ్గా పదమూడు నిమిషాలకి ఆపేశాము.
ఆకాశవాణి “ఎడిటింగు”లో నా ట్రెయినింగు పూర్తయింది!
మానవ వనరుల నిర్వహణ
చమత్కారదృష్టి అంటూ ఉండాలే కాని, జీవితంలో చల్లని హాస్యానికి కొదవుండదు.
ఆ వారమే రేడియోలో ‘నేనూ – నా రచనలు’ అన్న కార్యక్రమాన్ని ముగ్గురు మహిళా రచయిత్రులతో నిర్వహించారు. ఉషశ్రీ గారు దాన్ని ఎలాగో తీరిక చేసుకొని నేనే రికార్డు చెయ్యాలని – నాకు అప్పజెప్పారు. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మగారు, ఆర్. వసుంధరాదేవి గారు, మరొక ప్రసిద్ధ నవలా రచయిత్రి. ఆ చివరామె తన ప్రసంగమే ముందుండాలని పట్టుబట్టింది. “లక్ష్మీకాంతమ్మ పేరే జనం యెరగరు. వసుంధరాదేవి ఇప్పుడంతగా రాయటం లేదు. అంతా నాకోసమే వింటారు. నేనే మొదటుండాలి.” అని ఆమె వారిద్దరి ఎదుటే గట్టిగా వాదించింది. విద్వత్కవయిత్రి లక్ష్మీకాంతమ్మ గారు చిన్నబుచ్చుకొన్నారు. వసుంధరాదేవి గారేమీ మాట్లాడలేదు. నాకు దిక్కు తోచలేదు.
ఉషశ్రీ గారప్పుడు ఆఫీసులో లేరు. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారిని అడిగాను.
శర్మగారు గలగల నవ్వుతూ, “రికార్డింగు ఎవర్ని ఎప్పుడు చేస్తేనేం? ప్రసారం మీకు కావల్సినట్లే వరస మార్చి చేసుకోవచ్చుగా?” అన్నారు.
సమస్య పరిష్కారమయింది. మానవ వనరుల నిర్వహణలో శిక్షణ పూర్తయింది!

 

సోమపానం – వామపక్షం
1981లో విజయవాడ ఆకాశవాణి స్మరణీయమైన కవిసమ్మేళనాన్ని నిర్వహించింది. కార్యక్రమాన్ని హనుమంతరాయ గ్రంథాలయంలో నిర్వహించారు. ఆ తర్వాత అది రేడియోలో ప్రసారమయింది.
కార్యక్రమానికి ఆహూతులైన కవులలో శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారు, పువ్వాడ శేషగిరిరావు గారు, జ్ఞానానందకవి గారు వంటి మహామహులున్నారు. అందులోనూ శ్రీశ్రీ గారు విజయవాడకు వచ్చి ఇరవయ్యేళ్ళు దాటిందట. అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
నాకు శ్రీశ్రీ గారిని గ్రంథాలయానికి తీసుకొనివచ్చే బాధ్యతను అప్పజెప్పారు. ఆయన ‘స్వాతి’ పత్రికాఫీసు మొదటి అంతస్తులో బసచేశారు. నేను ఉదయమే వారికి అంతా వివరించి, సాయంకాలం వచ్చి తీసుకొనివెళ్తానని చెప్పాను. ఆయన సరేనన్నారు.
సాయంకాలం ఎందుకైనా మంచిదని, మూడింటికే అక్కడికి వెళ్ళాను. గదిలో శ్రీశ్రీ గారొక్కరే ఉన్నారు. మధ్యాహ్నం ఎవరో వచ్చి వెళ్ళారని ఆఫీసు బాయ్ చెప్పాడు. శ్రీశ్రీ గారు స్పృహలో లేరు. ఎంతో కష్టం మీద లేపవలసి వచ్చింది. నేనూ, కారు డ్రైవరు కలిసి కూచోబెట్టాము. విశ్వప్రయత్నం చేసి, స్పృహలోకి తెచ్చి, దుస్తులు మార్పించేసరికి నాలుగున్నరయింది. నాకు భయం వేసింది. ఆరింటికి కవితాసభ! చెరొక భుజం పట్టుకొని మెల్లగా నడిపిస్తూ మెట్లు దించి, గేటు దగ్గరికి వచ్చాము.
“కారుందా?” అని అడిగారు.
విశ్వనాథ సత్యనారాయణ గారికీ, మల్లాది రామకృష్ణశాస్త్రి గారికీ ఎవరు ఏ కార్యక్రమానికి పిలిచినా కారు పంపించాలనే నియమం ఉండేది. మల్లాది వారయితే మరీనూ. ఒకసారి టి.నగర్లో వారింటిముందే ఒక సినిమా కంపెనీ వెలిసింది. ఇంటి ముందు – అంటే, రెండిళ్ళ ముందరి గేట్లూ ఒకదానికొకటి ఎదురన్నమాట. మధ్యలో ఒక సన్నని రోడ్డు మాత్రమే. సినిమావాళ్ళు శాస్త్రి గారితో పాట రాయించాలని వారింటికి వచ్చి కలిశారు. “రేపు పొద్దున్న ఆఫీసులో కలుద్దాము. కారు పంపించండి” అన్నారాయన. వాళ్ళు తెల్లపోయారు.
ఉదయాన్నే కారు వచ్చి శాస్త్రిగారి ఇంటిముందు నిలబడింది. శాస్త్రిగారు కారు వెనుక తలుపు తీసి లోపలికి వెళ్ళి, ఆ వైపు తలుపు తీసి కిందికి దిగి ఆఫీసులోకి వెళ్ళారు.
శ్రీశ్రీ గారికి అటువంటి ఆర్భాటాలేవీ లేవు. అయినా ఆ రోజు, “కారుందా?” అని అడిగారు.
నేను కారు తెలుపు తెరిచి పట్టుకొని, శ్రీశ్రీ గారికి కూర్చొనేందుకు సాయం చెయ్యబోయాను. ఆయన వద్దు వద్దని, తలుపు మూసి, కారు డిక్కీని పట్టుకొని నెమ్మదిగా అడుగులు వేస్తూ అవతలి వైపుకు వెళ్ళి, తలుపు తీసి లోపలికెక్కి కూర్చొన్నారు.
నాకేమీ అర్థం కాలేదు.
“I am a leftist – I always get in from the left” అన్నారాయన! నాకు ప్రాణం లేచివచ్చింది.
కారులో కూర్చొన్నాక, “నీకు విమానాలకు చౌకగా రంగువెయ్యటం ఎలాగో తెలుసునా?” అని శ్రీశ్రీ గారడిగారు. “ఏం లేదు, విమానం పైకి వెళ్ళాక చిన్నదైపోతుంది కదా? అప్పుడు వెయ్యాలి రంగు” అన్నారు, కలకల నవ్వుతూ.
సాయంత్రం సభలో వందలమంది వస్తారనుకొంటే – శ్రీశ్రీ గారికోసం వేలమంది విరగబడ్డారు. ఇసుకవేస్తే రాలని జనం.
అప్పుడు వచ్చింది నాకు జ్ఞాపకం. “మీ దగ్గర కవిత ఏదీ?” అని అడిగాను.
“లేదు” అన్నారాయన నవ్వుతూ.
నాకు గుండె ఆగిపోయింది. ఏం చెయ్యటం? వేలమంది జనం. ఆరుద్ర గారప్పటికే సభకు వచ్చేశారు. పువ్వాడ వారున్నారు. ఆకాశవాణి ఉద్యోగులు, తక్కిన కవులు ఉన్నారు.
“నీ దగ్గర కలం, కాగితం ఉన్నాయా?” అన్నారు శ్రీశ్రీ గారు.
ఎవర్నో అడిగి ఒక కలం తీసుకొన్నాను. తెల్ల కాగితం దొరకలేదు. శ్రీశ్రీ గారు సిగరెట్టు పొట్లాం తీసి, దాని చాందినీ వెనుక ఉల్లిపొర కాగితం మీద గబగబ రాయటం మొదలుపెట్టారు. ఇంతలో మిత్రులొకరు కాగితం తెచ్చి యిచ్చారు. ఆయన పూర్తిచేశాక నేను తెల్ల కాగితం మీద దానికి శుద్ధప్రతిని వ్రాసి, చదవటం కోసం శ్రీశ్రీ గారికిచ్చి, అక్షరలక్షలు చేసే శ్రీశ్రీ గారి అక్షరాలున్న ఆ రచనను నాకోసం దాచుకొన్నాను.
ఆ రోజు శ్రీశ్రీ గారి కవితాపఠనం ముందు మహామహా పద్యకవుల రాగాలాపన కూడా వెలవెలపోయింది. అద్భుతంగా చదివారు. అంతర్జాతీయ బాలల సంవత్సరం కాబట్టో, బాలల కోసమే రాశారో. బాల్యాన్ని కోల్పోతున్న పసిపిల్లల మీద గేయం.
విజయవాడ శ్రీశ్రీ గారికి దాసోహం పలికింది. జయజయధ్వానాలు మిన్నుముట్టాయి.
ఆ మధురానుభూతి, ఆ చల్లని హాస్యోక్తులు నా మదిలో నిలిచిపోయాయి.

 

గంగా భాగీరథి
ఒకనాటి రేడియో ప్రసంగంలో ప్రఖ్యాత హాస్య రచయిత, రంగస్థల నటులు పుచ్చా పూర్ణానందం గారు చెప్పారు:
కృష్ణాపత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావు గారు గొప్ప సరస సల్లాప నిపుణులు. హాస్యకుశలి. అది ఆయన హుందాతనానికి తగిన, సంస్కారవంతమైన హాస్యం.
అనారోగ్యం పైకొని నేడో రేపో అన్న పరిస్థితి చివరి క్షణాల్లోకి దిగాక ఆయన్ను చూడటానికి మిత్రుడొకడు వెళ్ళాడట.
వెళ్ళి కూర్చోగానే ఆయన, “మంచినీళ్ళు కావాలా?” అని అడిగారట.
ఆ వచ్చినాయన కావాలన్నట్లు చూశాడట. “నీళ్ళు కావాలంటే నీళ్ళు నములుతావేమిటి?” అంటూ ఆయన భార్యను పిలిచి, నీళ్ళు తెమ్మన్నారట.
నీళ్ళు తాగాక, సరిపోలేదని గ్రహించి ఆయన “ఇంకా కావాలా?” అన్నారట. కావాలనటానికి ఆయన మొహమాటపడుతున్నాడు.
కృష్ణారావు గారు భార్యతో, “ఏమే! ఇంకో అరగంటలోనో గంటలోనో గంగా భాగీరథీ సమానురాలివి కాబోతున్నావు. చెంబు నిండా నీళ్ళు పట్టుకురా” అన్నారట.

 

కారం – గారం
చివరిగా, గృహస్థాశ్రమంలో జరిగిన ఒక స్వీయానుభవమూ చెబుతాను:
ఆకాశవాణి విదేశీ ప్రసారవిభాగంలో శ్రీ ముకుందశర్మ గారి ఆహ్వానాన్ని పురస్కరించుకొని బైరాగి గారి కవిత్వాన్ని గురించి ప్రసంగం రికార్డు చేసి, అఱ్ఱాకలితో ఇంటికి వచ్చి భోజనానికి కూర్చునేసరికి – ఆ రోజు కూరంతా గొడ్డుకారం. కళ్ళనీళ్ళపర్యంతం అయింది. ఆశువుగా అర్ధాంగలక్ష్మిని అడిగాను –
ఉ. పోరికిc గాలుదువ్వితినొ? పూనితినో భవదీయవాక్య ని
స్సారత నెత్తిచూపుటకు? చారుగుణాన్విత వీవు గావులే,
యో రమణీలలామ! యని యొప్పు వచించితినేమి, కూరలోc
గారము కూరినా వకట, కాంతరొ! ప్రల్లద మేమిచేసితిన్?
అని!

దానికి శ్రీమతిగారి ప్రత్యుత్తరం: “కూరలో కారం కూరితే వచ్చేవి కన్నీళ్ళు; కూరలో గారం కూరితే రావల్సినవి ఆనందబాష్పాలు కదా!”

47 thoughts on “రేడియో చమత్కారాలు

  1. అయ్యా అమూల్యమైన ఆకాశవాణి కార్యక్రమాలలో ఆణిముత్యాలని పరిచయం చేస్తున్న మీ మహోన్నత కృషి కి శతసహస్ర వందనములు ఆలాగే గతములో నాటి మేటి ఉగాది కవిసమ్మేలనాలు, మరియు భద్రాచల సీతారామ కళ్యాణ ప్రత్యక్ష వ్యాఖ్యానాలు ఉంటే తెలియచెయ్యమని నా వినమ్ర మనవి.

  2. అయ్యా అమూల్యమైన ఆకాశవాణి కార్యక్రమాలలో ఆణిముత్యాలని పరిచయం చేస్తున్న మీ మహోన్నత కృషి కి శతసహస్ర వందనములు, ఆలాగే గతములో నాటి మేటి ఉగాది కవిసమ్మేలనాలు, మరియు భద్రాచల సీతారామ కళ్యాణ ప్రత్యక్ష వ్యాఖ్యానాలు ఉంటే తెలియచెయ్యమని నా వినమ్ర మనవి.

  3. పెద్దలకు నమస్కారం ..అద్భుతం ..
    అది గణేష్

  4. సాహితీ మూర్తుల సహజ సిద్ధమైన హాస్య సంభాషణలు చాలా చక్కగా వివరించారు.. మళ్ళీ మళ్ళీ తలచుకుని నవ్వుకుంటూ ఉంటే మనస్సు ఆనందపరవశమౌతుంది.. శుభాభినందనలు..

    1. మాన్యశ్రీ హనుమంతరావు గారికి
      నమస్కారం!

      మీ ఆత్మీయస్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు.

      ఇది నిమిత్తంగా మీ బ్లాగులోని రచనావళిని పూర్ణంగా అధ్యయనించే అవకాశం సిద్ధించింది. నాకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకోగలిగాను.

      మీరెంతో చక్కటి కృషిచేస్తున్నారు. మీకివే ఎన్నో అభినందనలు!

  5. మురళీధరరావుగారికి నమస్సులు.

    మీ వ్యాసం అద్భుతంగా ఉంది. విద్యార్థిదశలో ఆకాశవాణి కార్యక్రమాలు విడవకుండా వినేవాణ్ణి. అవన్నీ మళ్ళీ తలపునకు తెచ్చి ఒడలు పులకరింపజేశారు. ధన్యవాదములు.

    1. మాన్యశ్రీ సత్యనారాయణ గారికి
      అభివందనాలు.

      మీ విద్యాసముపార్జనదశలో, బాల్య-యౌవనవయోవస్థాకాలంలో ఆకాశవాణిలోని ఆనాటి మహామహుల కార్యక్రమాలను వింటూ మీరు మనసులో పదిలంగా ప్రోదిచేసికొన్న అభిమానం మీ చేత ఈ విధంగా పలికించింది.

      మీ అభిమానం ఉన్నన్నాళ్ళు వాళ్ళ జ్ఞాపకాలు కూడా కలకాలం పచ్చగా ఉంటాయి.

      మీ మనస్వితకు ధన్యవాదాలు.

      విధేయుడు,
      ఏల్చూరి మురళీధరరావు

  6. >>> వికాసశీలమైన చిత్తానికి నవ్వుకంటె విశ్రాంతీ, హాయీ మరొకటి లేదు.

    చాలా చక్కగా చెప్పారు. మహా కవుల హాస్యోక్తులు , చతుర సంభాషణలు ఆహ్లాదకరం గా ఉన్నాయి. ఇవి మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. కొస మెరుపు , కారం గారం అద్భుతం.

    మీరు మీ అనుభవాలు మరిన్ని ఇక్కడ మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాను.

    1. శ్రీయుత బులుసు సుబ్రహ్మణ్యం గారికి
      నమస్కారములు.

      సౌజన్యపూర్ణములైన మీ ప్రోత్సాహకరవాక్యాలకు ధన్యవాదాలు. నేనెన్నడూ ఈ విధంగా హాస్యవిశేషాలను నెమఱువేసికొనే ప్రక్రియలో రచన చేయాలని ఊహింపలేదు. ఐనా, మీరన్నట్లు తప్పక వ్రాసే ప్రయత్నం చేస్తాను.

      మీ సారస్వతాధ్యయనం ఫలప్రదం కావాలని నా మంగళాశాసనం.

  7. murali
    chala bagundi vyasam.
    na peru kanipistundemonani vetikanu.
    alane vrastuundandi
    mee avida karalu miriyalu baga nurindi
    padmanabharao

    1. మాన్యులు డా. రేవూరి అనంత పద్మనాభరావు గారికి
      నమస్కారములు.

      విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి మీ విద్వత్త లోని విద్యుత్తు పట్టుబడాలని ప్రయత్నిస్తున్న నాకు మీ లేఖ ఎంతో గర్వాన్ని కలుగజేసింది. మీకెన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే.

      ఎంతో పేరుమోసిన మీ పేరును పేరుకు పేర్కొన్నా, పరిమితమైన పరిధి వల్ల మూకీభావం స్వీకరింపవలసి వచ్చింది. ఐనా, హాస్యానికి మాఱుపేరయిన మీ ముందు ఎవరేమి వ్రాసినా, విశ్వనాథ సత్యనారాయణ గారు విశ్వేశ్వర శతకంలో అన్నట్లు – “తేనెల్ ద్రావిన నోటికిన్ జలము లందింపయ్యె” అన్నట్లుగానే ఉంటుంది.

      హాస్యాస్పదం కాకుండా హాసాస్పదంగానే, ఎప్పుడో మీ చల్లని ఉల్లాసపూర్వక ఛలోక్తులనూ అక్షరాలకు అంకితం చేసే అవకాశం వస్తుందని ఆశిస్తుంటాను.

      మీకు సవినమ్ర వందనాలు.

  8. మురళీధరరావుగారికి,
    మీ వ్యాసం మళ్ళీ రేడియో కార్యక్రమాలను వింటున్నట్టి అనుభూతిని కలిగించింది.ఒక్కసారిగాఎంతోమంది కవులను జ్ఞాపకం చేసుకునే అవకాశాన్నిచ్చింది.సమయానుకూలంగా మీరు వాడిన ఉటంకింపులు వ్యాసాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాయి.మద్రాసు యూనివెర్సిటీ ఎంఫిల్ రోజులను మళ్ళీ గుర్తుకుతెచ్చుకునేలా చేసిన మీకు ధన్యవాదాలు.
    రాయదుర్గం విజయలక్ష్మి

    1. విజ్ఞ రాయదుర్గం విజయలక్ష్మిగారికి
      నమఃపూర్వకంగా –

      బౌద్ధవాఙ్మయాన్ని అధ్యయనించి సాధికారికమైన కృషిచేసిన గ్రంథకర్త్రి, విద్యాగుర్వి – మీ వంటి విదుషీమణి నా లఘురచనను చదివి, దయతో స్పందించినందుకు మీకు నా మనఃపూర్వక ధన్యవాదాలు.

      మీకివే సర్వ శుభాకాంక్షలు.

  9. abbabbaa, mee rachana yentha baagundo cheppalenu..maree maree mallee mallee chadavaalanipistondi…sunnita haasyaalanu panchi momupai darahaasaalanu kuripinchaaru..dhanyavaadaalandee…

    1. శ్రీయుత నూత్నమిత్రులు మీకు ప్రణామం.

      మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞుణ్ణి.

      ఇది నిమిత్తంగా మీ చక్కటి బ్లాగును తిలకించే సదవకాశం కలిగింది. ఒంటరియోలో ఉన్నా ఒంటరిని కానని సద్రచనలతో ఎందఱో పాఠకులను సమకూర్చుకొన్న మీ మధుర వాక్యజాతానికి ధన్యవాదాలు.

      మీ తోడి మైత్రికి స్వాగతం!

      1. Sir,
        Thanks a lot andee…intha chakkani gnaapakaalato oka blog ki sree kaaram chutteyyandi mari. ఒంటరియోలో ఉన్నా ఒంటరిని కానని ..chaalaa baagaa cheppaaru…blog valla chaala mandi aatma bandhuvulu dorikaaru. mee rachanalu tarachuu chadavaalani abhilashinche mitruralu
        ennela

  10. ఆర్య మురలిధర ఏల్చూరి మహాశయ
    మీరు పంచిన అనుభావామృతము గ్రోలిన మాలాంటి పిన్నలకు గొప్పని ఆనందమైకము గల్గె. పాతతరం నాటి పెద్దల రసహృదయము సరస సంభాషణ చతురత వారి బహుముఖ ప్రజ్ఞ్య తెలిసితిమి. మీరు మరెన్నో యిటువంటి మంచి అనుభావు పంచి మీ పేరు నాటి నేటి పెద్దల పేర్లు పలు మార్లు నేటి తరానికి జ్ఞ్యప్తికి తేవలసినది నా ప్రార్ధన.

    1. శ్రీయుత వెలిదిమళ్ళ జగన్నాధ్ గారికి,
      నమస్కారములు.

      ముచ్చటైన తెలుగులో వ్రాశారు. మేదురమైన మీ ఆదరానికి అభివాదం.

      ఇప్పటికిది సంక్షేపతయా సమకూడింది. ఈశ్వరానుగ్రహం తోడైతే తప్పక మీరన్న ప్రయత్నం చేస్తాను.

      మీకు నా శుభాకాంక్షలు.

  11. మురళీధర రావు గారూ,
    ఇంత చక్కని వ్యాసాన్ని మాలిక పాఠకులకు అందించినందుకు మీకు సర్వదా కృతజ్ఞులం! ఇందులో మేము చేసిందేమైనా ఉందంటే “మీరు రాసి ఇవ్వవలసిందే” అని పట్టుబట్టడమే:-)!

    మీ వ్యాసం రేడియోతో ఎంతో మంది అనుబంధాలను, జ్ఞాపకాలను నిద్ర లేపింది.

    మరో సారి ధన్యవాదాలు

    1. శ్రీమతి సుజాతగారికి,
      మాలిక పత్త్రిక సంపాదక మండలికి,

      ధన్యవాదాలు నేనే, చిట్టచివఱను చెబుదామని వేచి ఉండగా ఇంతలో మీరే వ్రాశారు. ఇటువంటి వైనోదికప్రక్రియారచనలో ఏ మాత్రం పరిచయమే లేని నా చేత ముమ్మొదటిసారి ఇలా పలికించి, దాన్ని ప్రకాశపఱచి, ఈ కొద్ది పలుకులకే ఇంతమంది ఆదరాన్ని చూఱగొనే అవకాశాన్ని కల్పించి, నాకు మఱపురాని వినూత్నానుభూతిని కలిగించారు.

      రేడియో ఇతివృత్తంపైని రసజ్ఞుల అభిమానమే తప్ప ఈ అభినందన పరంపరకు నా అర్హత వేఱేమీ లేదని నాకు సువిదితం.

      మాలిక భావప్రసారం ప్రచుర ప్రచారానికి నోచుకోవాలని ఆశిస్తూ –

      మీ అందఱికీ సర్వాభ్యుదయ శుభాకాంక్షలు.

  12. మురళీధర రావు గారికి, వందనాలు. మీ అనుభవాలతో కూర్చిన వ్యాసం చాలా బాగున్నది. కృతజ్ఞతలు. ‘నన్నయ భారతంలో ఉపమ’ గురించి ఉపన్యసించిన‌ అమలాపురం నుంచి వచ్చిన తెలుగు లెక్చరరు గారెవరో అభ్యంతరం లేకపోతే పేరు చెప్పగలరా?

    1. శ్రీయుత నాగమురళి గారికి
      నమస్కారములు.

      మూడున్నర దశాబ్దుల క్రితపు జ్ఞాపకాలు. ప్రభావశీలి విద్వాంసులుగా శ్రీ ఉషశ్రీ గురువు గారే మదిలో మెదలుతుంటారు. ఉద్యోగంలో తొలిరోజు విషయం. ఆ ప్రసంగకర్త రూప-నామవిశేషాలేవీ గుర్తులో లేవు.

      నాకు కంప్యూటర్ వ్యాసంగం తక్కువ. ఈ పత్త్రికావ్యాసం నిమిత్తంగా పైని లేఖలను, ఇప్పుడు మీ బ్లాగును చూడటం జరిగింది. చాలా బాగున్నది. మీ భాషాభిమానానికి, బహువిషయాభిరుచికి అభినందనలు.

      అప్రస్తుతం అనుకోకపోతే – శ్రీమద్రామాయణంలో త్రిజటాస్వప్నవృత్తాంతం ప్రక్షిప్తం కాదు. శ్రీ గుంటూరు శేషేంద్రశర్మగారి అనర్ఘరచన “షోడశి – రామాయణ రహస్యములు” పునఃపరిశీలింపగలరని ప్రార్థన.

      1. మురళీధర రావు గారూ, మీ స్పందనకీ, నా బ్లాగు మీరు చూసినందుకూ చాలా సంతోషం కలిగింది. ధన్యవాదాలు. త్రిజటా స్వప్న వృత్తాంతం మొత్తం ప్రక్షిప్తమని నా అభిప్రాయం కాదు. ఆ ఘట్టంలో/సర్గలో ప్రక్షిప్త శ్లోకాలు ఎక్కువ ఉన్నాయి. అందుకనే ఎక్కువ భాగమని అన్నాను. తప్పకుండా మీరు చెప్పిన గ్రంథాన్ని పరిశీలిస్తాను. మరొక్కసారి నమస్కారాలతో…

      1. గౌరవీయులు శ్రీ శేషతల్పశాయి గారికి
        ప్రణామములు.

        ఎంతో ఉదాత్తమైన గ్రంథాన్ని స్మరణకు తెచ్చారు. మహాకవి డా. సి. నారాయణరెడ్డి గారి పర్యవేక్షణలో వచ్చిన ఉత్తమ సిద్ధాంతగ్రంథం అది. మా తండ్రిగారికి ఆప్తమిత్రులైన ఆచార్య బిరుదురాజు రామరాజు గారి పేరు నిలబెట్టిన పుత్త్రికగా నాకెంతో మాననీయ ఆమె. 1977లో మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ విద్యార్థిగా ఉన్నప్పుడు మా గురుదేవులు ఆచార్య గంధం అప్పారావు గారికి పరిశీలనార్థం వచ్చిన వ్రాతప్రతిని చదివే అవకాశం కలిగింది. ఆ తర్వాత డా. రుక్మిణి గారు ముద్రితప్రతినీ ఇచ్చారు.

        నన్నయ్యగారి ఉపమాశైలూషిని అకారాద్యనుక్రమణీసమేతంగా సర్వాంగీణంగా పరిశోధించిన వాచక్నవి ఉత్తమకృతిని గుర్తుకు తెచ్చి మీరు ఈ చర్చావేదికను పవిత్రీకరించినందుకు మీకు నా ధన్యవాదములు.

        శేషతల్పశాయి! ఎంత చక్కని పేరు! మీ తల్లిదండ్రుల సంస్కారమహిమకు అభివాదం.

  13. శ్రీ మురళీధర రావు గారికి,
    నమస్కారములు,

    మీ రేడియో అనుభవాలు ఎంతో ఆహ్లాదాన్ని పంచాయి. ఎందరో ఉద్దండులతో పనిచేసిన మీలాంటి వారి పరిచయం మా అదృష్టం. మీవల్ల తెలుగుతనం ఉట్టిపడే ఇలాంటి పత్రికలూ వున్నాయని తెలుసుకుని ఎంతో ఆనందిస్తున్నాను.

    ధన్యవాదములతో,
    Venkata Rangaiah M

    1. మాన్యులు శ్రీ రంగయ్యగారికి
      ప్రాంజలి పూర్వకంగా –

      మీ సౌహృద్యసురభిళమైన లేఖకు బహుళ ధన్యవాదాలు. మీ ఆదరణకు నోచుకోగలిగినందుకు నాకెంతో సంతోషంగా ఉన్నది.

      ఈ స్పందన లన్నింటిని తిలకాయమానంగా తిలకిస్తుంటే నాకొక దృఢమైన నమ్మకం కలిగింది: ఏమంటే, నిజానికి నా లఘురచనలో ఉన్న స్వల్పగుణానికంటె – ఒకనాటి విజయవాడ రేడియోలో పనిచేసిన చరిత్రారాత్మక చరితార్థుల భవ్య కార్యక్రమాలతో, ఆ శుభనామధేయాలతో ఎంతోమంది జ్ఞాపకాలు అల్లుకొనిపోయి ఉన్నాయనీ, ఆ అతీతకాలయవనిక వెనుక మఱుగునపడిన అప్పటి ఆ తీయదనాన్ని నెమరుకు తెచ్చుకొని ఈ కొద్ది మాటలకే సహృదయంతో స్పందిస్తున్నారనీ నాకు అర్థమవుతున్నది.

      ఆకాశవాణిలో వాణికి నిఃస్వార్థసేవావిధులను నిర్వర్తించిన ఆ ఒక్కొక్కరూ ఒక్కొక్క బృహద్విశ్వవిద్యాలయం. పైని నేను ముక్తాముక్తంగా పేర్కొన్నవారే గాక ఇంకెందఱో స్మరణీయులున్నారు. “నహి సర్వః సర్వం విజానాతి” కదా! కార్యక్రమాలలో పాల్గొనేందుకు వచ్చి తమ సన్నిధిని అనుగ్రహించిన సంగీత సాహిత్య రాజకీయ సాంఘిక కళారంగ నిష్ణాత లెందఱో ఉన్నారు. ఆ అందఱి స్మృతిసంపుటాలనూ సంపుటీకరింపగలిగితే ఎంతో బాగుంటుంది.

      దుర్గమ విద్యారణ్యంలో దారితోచక కొట్టుమిట్టాడుతున్న నావంటి కృశధిషణునిచేత ఈ నాలుగు వాక్యాలను వ్రాయించిన సంపాదిక బెడదకోట సుజాత గారికి, ప్రకాశపఱచిన మాలిక పత్త్రికాధిపతులకు, మనోగతాలను పంచుకొన్న మీ అందఱికి నేను కృతజ్ఞుణ్ణి.

    1. Thank you very much, Sir. Having not been a seasoned browser of Internet, I just had the occasion to discover your impressive Blog.

      Thanks, in deed.

    1. Thank you very much, Sri Ramana Rao garu,

      I believe you are the treasure trove of most of the cherished memories and being a novelist of merit, the right person to add to this inconsequential account.

      1. thanks for your generous comments….but as you know, i was used as a PEX-CO only due to my coming office in time and keeping a track of events..so iwas –whether a trex, pex, asd, deputy director- iwas doing a clerical business or if you are generous , a manager
        you remember all good things of people .
        i remember only bad things about people- how they avoided official work and did groups based on caste, wine, women,region etc

  14. Dear Muralidhara Rao garu,
    Your “vyasam” is superb. Hats off to your memory. Congratulations to your wife for her god retort. It is the best possible thing for anybody to have a spouse with unity of mind and appreciation.
    I some times feel that the great works and ‘chaturoktulu’ of the great scholars of yester years should be brought out as a book for the use of posterity.

    1. Thank you, in deed, for your kind reading and the striking remark regarding the need to collect all impromptu verses of our times, Smt. Santha Devi garu.

      Truly, better than half of my work owes its existence to the better half – and her swift responses are in multitude!

      Thank you again for the kindness with which you had sent in the comment.

  15. yelchurigaru, mee jgnapakalu haayiga unnayi. nenu nostalgic ayipoya.
    vasundharadevi, vutukurigarlathopaatu unna, vaarini pakkaku nettivesthunnatlu maatlaadina(samskaram, swarasyam kontha kuracha ayina) aa rachayithri evaro naku gurthu unnadoch!

    1. Thank you very much for your kind reading and, the memorable response, Nirmala garu.

      Most respected poet that you are, you would surely agree that the idea was to fondly look back on the still enduring pleasantry in the AIR’s spontaneous HRD training, reminisce the masters and better to forget the forgettable!

      Thank you again, for the nostalgia. I recall with pride your own poetic contributions to Radio during those days…

  16. మురళీధరరావు గారూ!
    మీ జ్ఞాపకాల్లోని కమనీయ హాస్య ఘట్టాలను సురభిళ ప్రౌఢ-లలిత పద మాలికలతో అలంకరించి మరీ వివరించారు. మీ ఆకాశవాణి శిక్షణ విశేషాలు సరదాగా ఉన్నాయి.
    ‘మందరి ముందరి సుందరి’ అనే ఈ శ్రీశ్రీ గారి స్పాంటేనిటీ గురించి ఇదే తొలిసారి వినటం!
    ఇక మీ స్వీయానుభవ చమక్కు మరీ బాగుంది. కూరలో ‘కారం’ అరసున్న చేరి ‘గార’మైపోయిందన్నమాట. అంత దీటైన రిటార్టు విన్నతర్వాత మీ కన్నీళ్ళు ఆనందబాష్పాలుగా మారకుండా ఎలా ఉంటాయి!

    1. శ్రీ వేణుగారికి,
      “పరగుణపరమాణూన్ పర్వతీకృత్య నిత్యం” అనిపించే సర్వాంతర్వర్తనీయమైన మీ రసజ్ఞతకు, సౌజన్యానికి ధన్యవాదాలు. నిత్యజీవితంలో హాస్యాన్ని ఇతివృత్తంగా స్వీకరింపమని చెప్పి, ఈ విధంగా – నేనెన్నడూ అనుకోని తీరున ఈ జ్ఞాపకాలను నా చేత వ్రాయించిన మాలికా పత్త్రిక సంపాదకులకు కృతజ్ఞతలు.

  17. శ్రీ శివరామ ప్రసాదు గారికి,
    మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు.
    విజయవాడ ఆకాశవాణిలో ఎనౌన్సరుగా ఉంటూ వేలాదిమంది అభిమానులను సముపార్జించుకొన్న మాన్యులు శ్రీ ఎస్.బి. శ్రీరామమూర్తి (రామం) గారిని సంప్రతిస్తే మీకు అమూల్యమైన సమాచారం లభిస్తుంది.

    1. మాన్యులు శ్రీ గిరిగారికి
      నమస్కారములు.

      క్షేపణం సత్కాలక్షేపణమే అయితే, కథార్థానికి పరమార్థసిద్ధి. కాకపోతే, వ్యర్థపు కాలయాపనం. సాధనే మన కర్తవ్యం. సిద్ధి లోకానుభవదృశ్యం.

      జీవితంలో స్మరణీయాలను స్మరించి, విస్మరణీయాలను విస్మరించి ఆనందాన్ని పొందుదాము.

      ధన్యవాదం.

    2. మాన్యులు శ్రీ గిరిగారికి,
      నమస్కారములు.

      కంప్యూటర్ పరిజ్ఞానం లేనందువల్ల మీ పేరులోని నీలి రంగు మీ బ్లాగుకు దారితీస్తుందని తెలియక నేను చూడలేదు. ఇప్పుడు చూశాను.

      మీ బ్లాగు చాలా బాగున్నది. మీ సాహిత్యానురక్తి అభినందనీయం.

      ప్రాస్తావికంగా మీరెన్నో ప్రశ్నలను అడిగారు. “శ్రీమదుమామహేశు లతిచిత్రవిలాసులు” పద్యం ఎక్కడిది? వంటివి. అది పింగళి సూరన ప్రభావతీప్రద్యుమ్నం లోని తొలిపద్యం. పద్యం చివఱ “కృతిపతిన్ దనరింతురు గాతఁ గీర్తులన్.” అని ఉండాలి. శ్రీమదాదిశంకరుల శివానందలహరి లోని “కలాభ్యాం చూడాలంకృతశశికలాభ్యాం” శ్లోకం ఆధారంగా రచితమైంది.

      శుభం భూయాత్.

  18. మురళీధర రావుగారూ అద్భుతంగా ఉన్నది మీ వ్యాసం. అలనాటి విజయవాడ కేద్రం అద్భుత కార్యక్రమాలు వెంటూ పెరిగిన అదృష్టవంతుడిని నేను. మళ్ళి అటువంటి కార్యక్రమాలు ఎవ్వరూ చెయ్యలేరు.

    మీ దగ్గర అప్పటి రికార్డింగులు ఉంటే ఇంటర్ నెట్లో అందరితో పంచుకోమని అబ్యర్ధన.

    రేడియో మీద ఉన్న అభిమానంతో, ముఖ్యంగా విజయవాడ కేద్రం నటీ నటుల మీద ఉన్న అభిమానంతో రేడియో అభిమాని అని ఒక బ్లాగు మొదలు పెట్టాను. ఆయా నటీనటుల వివరాలు అందరికీ అందింద్దామన్న సదుద్దేశ్యంతో. కాని సమాచారం ఇచ్చేవారే కరువయ్యారు. మీ దగ్గర అలనాటి కళాకారుల సమాచారం ఉంటే దయచేసి చెప్పగలరు.

    రేడియో అభిమాని బ్లాగ్ ఈ కింది లింకు నొక్కి చూడవచ్చు.

    http://radioabhimani.blogspot.com/

Leave a Reply to ramana Cancel reply

Your email address will not be published. Required fields are marked *